వ్యక్తి ఒక్కడుగా చేయవలసిన త్యాగం ఉంటుంది. ఒక్కడుగా పదిమందికి చేయవలసిన ఉపకారం ఉంటుంది. పదిమందీ కలిసి వ్యవస్థకు చేయవలసిన ఉపకారం ఉంటుంది. తను ఉంటున్న ఇంటిలోని బావిలో మంచినీటి ఊట ఉంది. చుట్టుపక్కల ఎవరి బావిలోనూ లేదు. తాను పట్టుకోవడంతోపాటూ ఇరుగుపొరుగుకూ మంచినీటిని పట్టుకోవడానికి అనుమతించగలగాలి. ఒక ధనవంతుడున్నాడు.
ఊరిలో మంచి నీటి ఎద్దడి ఉంది. పదిమందికి పనికొచ్చేలో అందరికీ అందుబాటులో ఒక బావి, ఒక చెరువు తన తాహతుకు తగ్గట్టు తవ్వించగలగాలి. ఒక గుడి కట్టించగలగాలి. గుడి తానొక్కడే కట్టించినది కావచ్చు. కానీ దేవుడి బట్టలు ఉతకడానికి ఒక వ్యక్తి కావాలి. పల్లకి పట్టుకోవడానికి పదిమంది కావాలి. మంగళవాయిద్యాలు మోగించడానికి ఓ నలుగురు కావాలి. వేదం వచ్చినాయన వేదం చదువుతాడు. నాట్యం వచ్చినామె నాట్యం చేస్తుంది. పాటపాడగలిగినవాడు మంచి కీర్తనలు పాడతాడు.
గుడిని శుభ్రపరిచేవాళ్ళు శుభ్రపరచాలి. కాగడా పట్టుకోగలిగిన వాడు అది పట్టుకుంటాడు. ఎవరికి ఏది చేయగలిగిన శక్తి ఉంటే గుడి ద్వారా సమాజానికి చేస్తారు. పదిమంది కలిసి ద్రవ్యం కానుకగా ఇస్తారు. భగవంతుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని అరమరికలు లేకుండా అందరికీ పెట్టి పంపిస్తారు. అందరూ కలిసి అందరికీ ఉపయోగపడడం అంటే ఇదే. ఇది నేర్పడానికే మనకు దేవాలయ వ్యవస్థ వచ్చింది. అందరూ కలిసి విడివిడిగా ఒక వ్యవస్థ ద్వారా అందరికీ సేవ చేస్తున్నారు.
నువ్వు పట్టుకుపోయేదేమీ లేదు. ఇక్కడ నువ్వు ఏది చేసావో అది పుణ్యంగా మారుతోంది. నిజానికి నువ్వే అభ్యున్నతిని పొందుతున్నట్టు. నాకు సంగీతం వచ్చు. నేనెంతో కష్టపడి నేర్చుకున్నా. ప్రతిఫలం లేకుండా నేనిది అందరికీ ఎందుకు నేర్పాలి... అని నేను ఆలోచించాననుకోండి. విద్య ఏమయిపోతుంది ? చిన్నగుంటలో నిలిచిన నీళ్ళు కొద్దిరోజులకు ఆవిరయిపోయి ఎండిపోయినట్లు అది ఎవరికీ పనికి రాదు. కానీ నిస్వార్థంగా సంతోషంగా నలుగురికీ పంచిపెట్టేదేదో అది పుణ్యంగా మారిపోతుంది. పదిమందికి అన్నం పెట్టవచ్చు. పేదవారికోసం ఓ కళ్యాణ మంటపం కట్టి ఉచితంగానో తక్కువ డబ్బుకో దానిని ఇవ్వవచ్చు. ఇక్కడ ఉండి శరీరం వదిలిన తరువాత నీ శరీరం ఇక్కడే ఉండిపోతుంది. కానీ ఒకరికి పెట్టిందేదో అది పుణ్యంగా మారి నీతో వస్తుంది.
నువ్వు అనుభవించక, ఒకరికి పెట్టక, నువ్వు సాధించేముంది? ‘‘లక్షాధికారైన లవణమన్నమెగాని మెరుగు బంగారంబు మింగబోడు...’’ ఎంత డబ్బుంటే మాత్రం ఆకలేసినప్పుడు బంగారంతో పొట్టనింపుకోలేవు గదా... అందరిలాగే ఉప్పు, పప్పుతోనే నింపుకోవాలి. అందుకే స్వార్థం మానుకొని నలుగురిని గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి.
మీరు సంపాదించిన దానిలో శాస్త్రం అంగీకరించిన మేర అంత దాచుకోండి. ఎంత అనుభవించాలో అంత అనుభవించండి. ఉండీ దరిద్రంగా బతకమని ఏ శాస్త్రమూ చెప్పలేదు. జీవుడికి పునర్జన్మ ఉందని జ్ఞాపకం పెట్టుకొని పదిమందిని ఆదుకోండి. లేకపోతే జన్మకు అర్థం లేదు. వేమనగారు చెబుతున్నది కూడా అదే... ‘‘ధనము కూడబెట్టి దానంబు చేయక/తాను దినక లెస్స దాచుకొనగ/ తేనెటీగ గూర్చి తెరువరికియ్యదా/ విశ్వదాభిరామ వినుర వేమ.... ’’
దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వర రావు పంతులుగారు అమృతాంజన్ వ్యాపారం పెట్టి... చాలా సంపాదించారు. అంతా తానే ఉంచేసుకోలేదు. కుటుంబం కోసమే దాచిపోలేదు. ఎన్నెన్ని దానధర్మాలు చేసారో, స్వాతంత్య్ర సంగ్రామం కోసం ఎంతెంత ఖర్చు చేసారో, ఎంతెంత మంది పేదవారికి ఉపాధి కల్పించారో తెలిస్తే ఆశ్చర్యపోతాం.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment