
జ్మోతిర్మయం
మానవుడు ప్రధానంగా స్వప్రయోజనా దృష్టి గల జీవి. అది అతన్ని జీవితాంతం వెన్నంటే ఉంటుంది. దీనికి తోడు ఇతర ప్రాణులకు లేని బుద్ధి బలం కూడా మనిషికి ఉంది. మనిషి లోని సహజ లక్షణమైన ఈ స్వార్థ గుణాన్ని గురించి ఉపనిషత్తులు కూడా వివరించాయి. యాజ్ఞ వల్క్య మహర్షి తన భార్య మైత్రేయితో... ‘భార్య భర్తను ప్రేమిస్తున్న దంటే అది తన ఆనందం కోసమే. భర్త భార్యను ప్రేమిస్తున్నాడన్నా అతని ఆనందం కోసమే. ఇంకా పుత్రుల మీద, దేశం మీద, మానవులకున్న ప్రేమ వారి ఆనందం కోసం కాదు తన ఆనందం కోసమే’ అని చెపుతాడు.
తన స్వార్థం కోసం ఉపయోగ పడేంతవరకు మానవుడు సమాజంతో సంబంధం పెట్టుకుంటాడు. మనిషిలో సహజంగా ఉండే ఈ స్వార్థాన్ని నియంత్రణ లేకుండా వదిలిపెడితే భూమిపై సుఖ శాంతులు పూర్తిగా కరువైపోతాయి. తన స్వార్థ ప్రయోజనాలకు బలహీనులను పట్టి పీడిస్తాడు. పెద్ద చేప చిన్న చేపను మింగినట్లు ప్రవర్తిస్తాడు. కొన్నాళ్ళకు తనూ తన కంటె బలవంతుని చేతిలో బలవుతాడు. లోక నాశనానికి దారి తీసే ఈ స్వార్థ గుణాన్ని అణిచి వేసి, మనిషి మనసులో గొప్ప మార్పు దైవ చింతన తీసుకు రాగలదు. మానవులకు శాంతి మయ జీవితాన్ని ఇవ్వటానికి భగవంతుడు వివిధ రూపాలలో అవత రిస్తుంటాడు.
ఇహ లోకంలో ప్రశాంత జీవితం గడపటానికి, పరంలో శాశ్వతా నందాన్ని పొందటానికి తగిన ఉపదేశాన్ని మానవాళికి అందజేసిన గ్రంథ రాజం భగవద్గీత. రోజుకొక శ్లోకం చదివినా, నేర్చుకున్నా ఆలోచనలు భగవంతునిపై నిలుస్తాయంటారు పెద్దలు. ‘భక్తుడు ఏ దేవతా రూపాన్ని శ్రద్ధగా పూజిస్తాడో అతనికి ఆ రూపంపై శ్రద్ధ నిలిచేటట్లు చేస్తాను’ అంటాడు భగవంతుడు. అలా పూజించినందుకు తగిన ఫలాన్ని అందజేస్తాడు. భగవంతుని చింతనలో మనసు పునీతమై, మనిషి నిస్వార్థ జీవిగా మారి, విశాల దృక్పథాన్ని అలవరచుకుంటాడు.
– డా. చెంగల్వ రామలక్ష్మి