
ఒక మహారాజు ప్రపంచంలో ఎవరూ కట్టించని అద్భుతమైన భవనాన్ని నిర్మింప జేయాలను కున్నాడు. లెక్కలేనంత ధనాన్ని ఖర్చు చేసి, దేశం నలుమూలల నుంచి గొప్ప గొప్ప శిల్పులను పిలిపించి కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో పనిచేయించి గొప్ప భవనాన్ని నిర్మింపజేశాడు. ఆ భవనం విశాలమైన గదులు, ధగ ధగ మెరుస్తున్న కాంతులతో, బంగారు తాపడాల గోడలతో, మంచి శిల్ప నైపుణ్యంతో దేవేంద్ర వైభవాన్ని తలపిస్తూ ఉంది. ఒక రోజు రాజు గృహ ప్రవేశ కార్యక్రమానికిఘనంగా ఏర్పాటు చేసి, దేశం లోని రాజ ప్రముఖులను, విద్వాంసులను, వ్యాపారవేత్తలను, వాస్తు శాస్త్రజ్ఞులను ఆహ్వానించాడు. గృహ ప్రవేశం అయ్యాక, రాజు సభ ఏర్పాటు చేసి, వారితో... ‘ఈ గొప్ప భవనాన్ని ఎంతో ఖర్చు చేసి కట్టించాను. ప్రపంచంలో ఇంత సర్వాంగ సుందరమైన భవనం ఇంకోటి ఉండకూడదు. అందుకని, మీలో ఎందరో ప్రతిభా వంతులు ఉన్నారు. మీరు ఈ భవనాన్ని సమగ్రంగా పరిశీలించి, ఇందులో లోపాలు, దోషాలు ఏమైనా ఉంటే చెప్పండి. సవరణలు చేయిస్తాను. ఇప్పుడే తెలపండి’ అన్నాడు.
రాజు మాటలు విని అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్య పోయారు. ఇంత అందమైన కట్టడంలో లోపాలా? అనుకున్నారు. అయినా, రాజు మాట కాదనలేక, వారిలో శిల్పులు, వాస్తు శాస్త్రజ్ఞులు భవనమంతా చూసి ఏ లోపం లేదని నిర్ధరించారు. రాజు చాలా సంతోషించాడు. అంతలో, సభాసదులలో నుంచి ఒక సాధువు లేచి నిల్చున్నాడు. ‘రాజా! ఈ భవనంలో రెండు దోషాలున్నాయి’ అన్నాడు. రాజు వినయంగా అవేమిటో తెలపమన్నాడు. అప్పుడా సాధువు, ‘ఈ భవనాన్ని కట్టించినవారు ఎప్పటికైనా చనిపోతారు. ఇది ఒక దోషం. ఈ భవనం కాలగర్భంలో ఎప్పటికైనా కలిసిపోతుంది. ఇది ఇంకో దోషం’ అన్నాడు. అప్పుడు రాజుకు వివేకం ఉదయించింది. ‘ఈ లోకంలో ప్రతిదీ నశించి పోయేదే. నశ్వరమైన భౌతిక సంపదల కోసం, తక్షణఆనందం కోసం ఇంత ఖర్చు చేసి ఇన్ని సంవత్సరాల సమయం వృథా చేశాను కదా. శాశ్వతమైనది దైవం ఒక్కడే! ఆ దైవం ముందు ఇవన్నీ నశ్వరాలే’ అని తెలుసుకున్నాడు. రాజుతో పాటు అందరం తెలుసుకోవలసింది ఇదే! దైవ అనుగ్రహానికే మనిషి పాటుపడాల్సింది.
– డా. చెంగల్వ రామలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment