
శ్రీరాముని యువ రాజ్యాభిషేకం (Sri Rama Pattabhishekam) నిర్ణయమైన తర్వాత, రఘు వంశీకుల ఆచార్యులు వశిష్టుడు (Vasishta) ఈ విషయం తెలియజేయటానికి రాముని మందిరానికి వెళతాడు. శ్రీరాముడు తన గురువు స్వయంగా వచ్చారని తెలిసి, ఎదురు వెళ్లి చేతులు జోడించి, ఆహ్వానించి, భక్తితో ప్రణామం చేశాడు. జానకి బంగారు పాత్రలో స్వచ్ఛ జలం తీసుకురాగా... రాముడు వశిష్టుని రత్న సింహాసనంపై ఆసీనుని చేసి, గురు పాదాలను శ్రద్ధా భక్తులతో కడిగాడు. సీతతో సహా ఆ పవిత్ర జలాన్ని శిరసున ధరించి, ‘మీ పాద తీర్థం శిరసున ధరించటం వలన ధన్యులమయ్యాము’ అంటాడు.
అప్పుడు వశిష్టుడు, ‘రామా! నీ పాద తీర్థం శిరసున దాల్చి పార్వతీ పతి శంకరుడు ధన్యుడయ్యాడు. బ్రహ్మ నీ పాద తీర్థం సేవించే పాపాలను తొలగించుకున్నాడు. ఈ రోజు కేవలం గురువుతో ఒక శిష్యుడు ఎలా వ్యవహరించాలో తెలపటా నికే నువ్వు ఈ విధంగా చేశావు. నువ్వు, సాక్షాత్తూ లక్ష్మీ దేవితో కలిసి భూమిపై అవతరించిన విష్ణువు వని, రావణ సంహారానికే రాముడుగా వచ్చావని నాకు తెలుసు. నీవు మాయా మానుష రూపంతో అన్ని కార్యాలూ చేస్తున్నావు. అందుకు నీవు శిష్యుడవు, నేను గురువుననే సంబంధానికి అనుకూలంగా నేనూ వ్యవ హరిస్తాను’ అంటాడు.
శ్రీరాముడు స్వయంగా అంతర్యామి. గురువులకు గురువు. ఆయనకు గురు సేవ ఎందుకు? అంటే, లోకో పకారానికే! లోక కల్యాణానికే! గురువు పట్ల ఎలాంటి వినయ విధేయతలుకలిగి ఉండాలో, ఎంత శ్రద్దా భక్తులతో సేవించాలో తెలపటానికే శ్రీరాముడు ఆ విధంగా వ్యవహరించాడు. త్రేతా యుగంలోనే కాదు, ద్వాపర యుగంలోనే కాదు, ఏ కాలంలోనైనా గురువుల పట్ల శ్రద్ధా భక్తులు, వినయ విధేయతలు కలిగి ఉంటే అటువంటి శిష్యులకు అసాధ్యమైనది ఏదీ ఉండదని గురు చరిత్రలు, గురు శిష్య సంబంధ పురాణ కథలు వ్యక్తం చేస్తున్నాయి.
– డా.చెంగల్వ రామలక్ష్మి