రాముడు విధించిన శిక్ష : శిక్ష తప్పదు! | Devotional story: A dog story in Ramayana time | Sakshi
Sakshi News home page

రాముడు విధించిన శిక్ష : శిక్ష తప్పదు!

Published Mon, Mar 17 2025 4:51 PM | Last Updated on Mon, Mar 17 2025 5:11 PM

Devotional story: A dog story in Ramayana time

ఇది రామాయణ ఇతిహాసానికి చెందిన సంఘటన. ఒక రోజు శ్రీరామచంద్రుడు సభలో కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఓ శునకం సభకు వచ్చింది. దాని తలకు గాయమై రక్తం కారుతోంది. సభలో ఉన్నవారందరూ దాని వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు. రాముడు కూడా దానిని చూశాడు. ‘నువ్విక్కడికి ఏ పని మీద వచ్చావు... ఏం జరిగింది. జరిగిందేదైనా సరే ధైర్యంగా చెప్పుకో.  భయ పడకు’ అన్నాడు రాముడు.

అప్పుడా శునకం...‘అయ్యా, నేను వీధిలో వెళ్తున్నాను. మార్గ మధ్యంలో వేదశాస్త్రాలు చదువుకున్న ఒక పెద్దాయన ఎదురొచ్చాడు. ఆయన ఏ కారణమూ లేకుండా తన దగ్గరున్న కర్రతో నా తల మీద దెబ్బ వేశాడు. అందువల్ల రక్తం కారుతోంది. ఈ వ్యవహారంలో తగిన తీర్పు ఇవ్వండి’ అంది శునకం. రాముడు వెంటనే తన భటులను పంపించి నిందితుణ్ణి రప్పించాడు. అతడు ‘నేను వీధిలో వస్తుండగా ఈ కుక్క నాకు అడ్డొచ్చింది. అందువల్ల దానిని కొట్టాను. శాస్త్రాలు చదవుకున్నా... నేను హద్దు మీరాను. నాకు మీరు ఏ శిక్ష వేసినా సరే’ అన్నాడు. 

రాముడు శునకాన్నే అడిగాడు ఏ శిక్ష విధించాలని. అందుకు ఆ శునకం ‘ఆయనను ఏదైనా గుడికి ధర్మకర్తగా నియమించండి. అదే ఆయనకు సరైన శిక్ష’ అన్నది. అది విన్న రాముడు చిరునవ్వు నవ్వాడు. కానీ అక్కడున్న వారికి ఆశ్చర్యమేసింది. ‘అదెలాగూ... తప్పు చేసిన వారికి శిక్ష విధించడమే సముచితం. కానీ అది మానేసి అతనికి ధర్మకర్త హోదా కల్పించమని కోరడమేమిటీ’ అని వారు ఆ శునకాన్నే అడిగారు. దానికి శునకం... ‘నేను క్రితం జన్మలో ఓ ఆలయానికి ధర్మకర్తగా ఉండేదానిని. ఎంతో అప్రమత్తంగానే నా విధులను నిర్వహిస్తూ వచ్చాను. అయినా మానవ సహజమైన కక్కుర్తితో ఆలయ సంపదను తప్పుగా అనుభవించాను. ఫలితంగా మరుజన్మలో కుక్కగా జన్మించి అవస్థలు పడుతున్నాను. ఇవే అవస్థలు ఈ పెద్దమనిషి కూడా పడాలి’ అని పలికింది. హిందువుల్లో తప్పు చేసినవారు ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలోనైనా శిక్ష అనుభవించాల్సిందే అనే నమ్మకం ఉంది. ప్రజల్లో నైతికత, ధర్మం వర్థిల్లడానికి ఇటువంటి నమ్మకాలు  దోహదం చేస్తాయి. సమాజానికి ఈ తరహా నీతి బోధనలు చేయడమే పురాణ కథల లక్ష్యం.   

 – యామిజాల జగదీశ్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement