
నాగార్జునసాగర్ జలాశయం తీరంలో ఏర్పాటు
అన్ని మతాల భక్తుల పూజలు
సర్వ మతాల భక్తుల కోర్కెలు తీర్చే క్షేత్రంగా వెలుగొందుతోంది సాగర్ మాత ఆలయం. ఈ ఆలయం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం తీరంలో ఉంది. సాగర్‌మాత మహోత్సవాలను ఏటా మార్చి 7, 8, 9 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా పలు రాష్ట్రాల నుంచి భక్తులు హాజరవుతారు. విదేశీయులు సైతం ఈ ఉత్సవాలకు హాజరుకావడం విశేషం. ఉత్సవాల సమయంలోనే కాకుండా.. ప్రతి ఆదివారం భక్తులు ఆలయానికి వస్తుంటారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాగర్‌మాత (Sagar Matha) ఆలయానికి రాష్ట్రంలోనే విశిష్టత ఉంది. భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా మందిర నిర్మాణం, గోపురంపై విగ్రహ సంపద రూపుదిద్దుకున్నాయి. భారతీయ చిత్రకళా నైపుణ్యం వీటిలో కనిపిస్తుంది. సాగర్ ఒడ్డున వెలిసిన మేరీమాత.. సాగర్‌మాత పేరుతో క్రైస్తవులతో పాటు హిందువులు, ముస్లింలు తదితర అన్ని మతాల నీరాజనాలను అందుకుంటోంది.
భారతీయ సంప్రదాయ రీతుల్లో నిర్మాణం
ఈ ఆలయం దేశంలోనే భారతీయ సంప్రదాయ రీతులలో నిర్మించిన తొలి క్రైస్తవ మందిరంగా చెబుతారు. ధూప, దీప, నైవేద్యాలు, తలనీలాలు సమర్పించటం వంటి మొక్కులు చెల్లించుకునే కార్యక్రమాలన్నీ పూర్తిగా హిందూ పద్ధతిలో జరిగే క్రైస్తవ ఆలయం కావడం విశేషం. కోర్కెలు తీరిన భక్తులు జీవాలను బలి ఇస్తారు. సాగర తీరంలో వంటలు చేసుకొని ఆరగించి వెళ్తారు.
సాగర్‌లో పయనించే నావికుడు.. రాత్రి వేళల్లో నక్షత్రాల సహాయంతో ఓడను నడిపి గమ్యస్థానం చేరినట్లు.. పాపపంకిలమైన లోకమనే సముద్రంలో మానవునికి మంచి అనే దారి చూపేందుకు మరియమాత నక్షత్రంగా ప్రకాశిస్తుందని.. భక్తులు చెబుతారు. ఆ నమ్మకంతోనే దీనికి సాగర్‌మాత మందిరం అని పేరు పెట్టారు.
చదవండి: ఈ చిన్నారి పేరు దేశమంతా మారుమోగిపోతోంది!
ఈ మందిరానికి 1977 అక్టోబర్ 10వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో అప్పటి గుంటూరు మండల పీఠాధిపతి కాగితపు మరియదాసు ప్రారంభోత్సవం చేశారు. దీని నిర్మాణానికి మరియదాసుతో పాటు ముమ్మడి ఇగ్నేషియన్, తాను గుండ్ల బాలశౌరి విశేష కృషి చేశారు.
ఆకట్టుకుంటున్న జపమాల స్థలాలు
2011 మార్చి 6న కృష్ణానదీ (Krishna River) తీరంలో నిర్మించిన జపమాల క్షేత్రాన్ని గుంటూరు పీఠాధిపతులు గాలిబాలి ప్రారంభోత్సవం చేశారు. ఏసుక్రీస్తు జననం నుంచి మరణం వరకు ఆయన జీవిత చరిత్ర గురించి ఏర్పాటు చేసిన 20 జపమాల స్థలాలు, ధ్యానమందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 2024లో సాగర్‌మాత ఆలయంపై, ఆలయంలోని 14 స్థలాల విగ్రహాలపై దేవదూతల విగ్రహాలను విచారణ గురువులు హృదయ్‌కుమార్ ఏర్పాటు చేశారు. ఇక్కడ సాగర్‌మాతకు కొబ్బరికాయ కొట్టి అగర్‌బత్తీల హారతి, తలనీలాలు సమర్పించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. పుణ్యస్నానాలు చేసి ప్రార్థనలు జరుపుతారు.
Comments
Please login to add a commentAdd a comment