
ఓ రాజుకు ఒక గురువు తారసపడ్డాడు. రాజ్యం సుఖసంతోషాలతో ఉండాలంటే ఏమి చేయాలని ఆ గురువును అడిగాడు రాజు. ప్రతి గ్రామంలోనూ సత్సంగం జరుపుకోడానికి, ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకోవడానికి తగిన భవన సముదాయాలు కట్టించమన్నాడు గురువు
.అలాగేనన్నాడు రాజు. అయితే రాజు మనసులో ఓ అనుమానం మొదలయ్యింది. ‘నిజంగా అలాంటి ఏర్పాట్లు చేస్తే ప్రజల్లో నైతికత, భక్తి భావం నెలకొని ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారా?’ అని! ‘సరే, ప్రయత్నించి చూద్దాం, సాధ్యాసాధ్యాలు పరిశీలిద్దాం’ అని మందీమార్బలంతో బయలుదేరాడు.
తమ రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న చిన్న గ్రామానికి వెళ్ళాడు. అక్కడ గుడి దగ్గర ప్రవచనకర్త ప్రవచనాలు చెబుతూ ఉన్నాడు. జనం దండిగా కూర్చుని ప్రవచనాలను ఆసక్తిగా వింటూ ఉన్నారు. కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు రాజు అక్కడే ఉండి ‘‘నాలుగు మంచి మాటలు వినడానికి మీరు చూపిస్తున్న ఆసక్తి ఎంతో సంతోషకరం.
ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న మీకందరికీ నా కానుకగా ఒక్కో వెండినాణెం ఇవ్వదలిచాను. వచ్చి తీసుకోండి’’ అని చెప్పాడు. ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆశ్చర్యపోయాడు రాజు. విషయం ఏమిటని ప్రవచనకర్తను అడిగాడు. ‘‘ఇక్కడి వారికి చేయి చాపడం ఇష్టం ఉండదు. ఉచితంగా ఇస్తే ఏదీ తీసుకోరు’’ అని చెప్పాడు ప్రవచనకర్త. ఎందువల్ల వారు ఇలా చేస్తున్నారని అడిగాడు రాజు.
‘‘ఏళ్లకొద్దీ ఈ గ్రామంలో సత్సంగం జరుగుతోంది. బతికినంత కాలం పద్ధతిగా బతకాలని అనుకుంటారు. తాము కష్టపడి సంపాదించిన దానితో తృప్తిగా జీవనం సాగిస్తారు’’ అని బదులిచ్చాడు ప్రవచనకర్త. రాజు చిన్నగా అక్కడినుంచి బయలుదేరి నదికి ఆవల ఉన్న మరో గ్రామానికి వెళ్ళాడు. అక్కడ రచ్చబండ దగ్గర చాలామంది కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాజు వచ్చింది తెలుసుకుని అందరూ గుమికూడారు.
‘‘మీ ఊర్లో సత్సంగం జరుగుతోందా?’’ అని అడిగాడు రాజు. అలాంటి పదమే వినలేదని బదులిచ్చారు. మీకందరికీ వెండి నాణేలు పంచాలని ఉందని చెప్పాడు రాజు. అంతే... జనం పరుగులు తీస్తూ వచ్చి, ఎగబడి తీసుకున్నారు. రాజులో ఆలోచనలు మొదలయ్యాయి.
‘మొదటి గ్రామంలో ఇచ్చేవాడున్నా తీసుకోలేదు వారు. ఆధ్యాత్మిక భోధనల వల్ల గ్రామస్తులు ఉన్నదానితో తృప్తిగా ఉన్నారు. వారి మనస్సుల్లో ఆధ్యాత్మిక బీజాలు నాటబడ్డాయి. రెండవ గ్రామంలో... ఎవరైనా ఇస్తే తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ గ్రామస్తులు తీసుకోవడం పట్ల ఆసక్తి చూపిస్తున్నారంటే వారిలో ‘ఇంకా... ఇంకా’ కావాలన్న కోరిక బలంగా ఉంది. ఎందుకంటే ఆ గ్రామస్తుల మనస్సుల్లో ఆధ్యాత్మిక బీజాలు నాటబడ లేదు’ అని గుర్తించాడు రాజు.
‘ఆధ్యాత్మిక బోధనలు చేయించి మంచి చెడ్డలు తెలియజేయాల్సిన బాధ్యత నాది’ అని అనుకుంటూ అక్కడినుంచి కదిలాడు రాజు. త్వరత్వరగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భవన సముదాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించాడు.
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు
(చదవండి: దైనందిన జీవితంలో దైవం అంటే..?)
Comments
Please login to add a commentAdd a comment