short storie
-
పద్ధతిగా బతకడం అంటే ఇది..!
ఓ రాజుకు ఒక గురువు తారసపడ్డాడు. రాజ్యం సుఖసంతోషాలతో ఉండాలంటే ఏమి చేయాలని ఆ గురువును అడిగాడు రాజు. ప్రతి గ్రామంలోనూ సత్సంగం జరుపుకోడానికి, ఆధ్యాత్మిక విషయాలు చర్చించుకోవడానికి తగిన భవన సముదాయాలు కట్టించమన్నాడు గురువు.అలాగేనన్నాడు రాజు. అయితే రాజు మనసులో ఓ అనుమానం మొదలయ్యింది. ‘నిజంగా అలాంటి ఏర్పాట్లు చేస్తే ప్రజల్లో నైతికత, భక్తి భావం నెలకొని ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారా?’ అని! ‘సరే, ప్రయత్నించి చూద్దాం, సాధ్యాసాధ్యాలు పరిశీలిద్దాం’ అని మందీమార్బలంతో బయలుదేరాడు.తమ రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న చిన్న గ్రామానికి వెళ్ళాడు. అక్కడ గుడి దగ్గర ప్రవచనకర్త ప్రవచనాలు చెబుతూ ఉన్నాడు. జనం దండిగా కూర్చుని ప్రవచనాలను ఆసక్తిగా వింటూ ఉన్నారు. కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు రాజు అక్కడే ఉండి ‘‘నాలుగు మంచి మాటలు వినడానికి మీరు చూపిస్తున్న ఆసక్తి ఎంతో సంతోషకరం. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న మీకందరికీ నా కానుకగా ఒక్కో వెండినాణెం ఇవ్వదలిచాను. వచ్చి తీసుకోండి’’ అని చెప్పాడు. ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆశ్చర్యపోయాడు రాజు. విషయం ఏమిటని ప్రవచనకర్తను అడిగాడు. ‘‘ఇక్కడి వారికి చేయి చాపడం ఇష్టం ఉండదు. ఉచితంగా ఇస్తే ఏదీ తీసుకోరు’’ అని చెప్పాడు ప్రవచనకర్త. ఎందువల్ల వారు ఇలా చేస్తున్నారని అడిగాడు రాజు.‘‘ఏళ్లకొద్దీ ఈ గ్రామంలో సత్సంగం జరుగుతోంది. బతికినంత కాలం పద్ధతిగా బతకాలని అనుకుంటారు. తాము కష్టపడి సంపాదించిన దానితో తృప్తిగా జీవనం సాగిస్తారు’’ అని బదులిచ్చాడు ప్రవచనకర్త. రాజు చిన్నగా అక్కడినుంచి బయలుదేరి నదికి ఆవల ఉన్న మరో గ్రామానికి వెళ్ళాడు. అక్కడ రచ్చబండ దగ్గర చాలామంది కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాజు వచ్చింది తెలుసుకుని అందరూ గుమికూడారు.‘‘మీ ఊర్లో సత్సంగం జరుగుతోందా?’’ అని అడిగాడు రాజు. అలాంటి పదమే వినలేదని బదులిచ్చారు. మీకందరికీ వెండి నాణేలు పంచాలని ఉందని చెప్పాడు రాజు. అంతే... జనం పరుగులు తీస్తూ వచ్చి, ఎగబడి తీసుకున్నారు. రాజులో ఆలోచనలు మొదలయ్యాయి.‘మొదటి గ్రామంలో ఇచ్చేవాడున్నా తీసుకోలేదు వారు. ఆధ్యాత్మిక భోధనల వల్ల గ్రామస్తులు ఉన్నదానితో తృప్తిగా ఉన్నారు. వారి మనస్సుల్లో ఆధ్యాత్మిక బీజాలు నాటబడ్డాయి. రెండవ గ్రామంలో... ఎవరైనా ఇస్తే తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ గ్రామస్తులు తీసుకోవడం పట్ల ఆసక్తి చూపిస్తున్నారంటే వారిలో ‘ఇంకా... ఇంకా’ కావాలన్న కోరిక బలంగా ఉంది. ఎందుకంటే ఆ గ్రామస్తుల మనస్సుల్లో ఆధ్యాత్మిక బీజాలు నాటబడ లేదు’ అని గుర్తించాడు రాజు.‘ఆధ్యాత్మిక బోధనలు చేయించి మంచి చెడ్డలు తెలియజేయాల్సిన బాధ్యత నాది’ అని అనుకుంటూ అక్కడినుంచి కదిలాడు రాజు. త్వరత్వరగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భవన సముదాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించాడు.– ఆర్.సి.కృష్ణస్వామి రాజు (చదవండి: దైనందిన జీవితంలో దైవం అంటే..?) -
హృదయ పరివర్తనం
కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత ధర్మరాజు హస్తినకు రాజయ్యాడు. ధర్మబద్ధంగా పాలన చేస్తూ ప్రజల మన్ననలు అందుకోసాగాడు. కొన్నాళ్లకు ధర్మరాజు తీర్థయాత్ర చేయాలనుకున్నాడు. సోదరులను, సామంత రాజులకు తన మనోభీష్టాన్ని తెలిపాడు. వారిలో కొందరు ధర్మరాజుతో కలిసి యాత్ర చేయాలని నిశ్చయించుకున్నారు. అదే సమయంలో ధర్మజుడు శ్రీకృష్ణపరమాత్మ దగ్గరకు వెళ్లి.. ‘కృష్ణా! నేను, మరికొంతమంది తీర్థయాత్రలకు వెళ్తున్నాము. నువ్వు కూడా మాతో వస్తే అంతకన్నా భాగ్యం మరొకటి ఉండదు’ అన్నాడు. యాత్రలు చేసే సమయం తనకు లేదన్నాడు కృష్ణుడు. ధర్మరాజు పట్టు వీడలేదు. అప్పుడు కృష్ణుడు.. ధర్మజుడికి ఒక సొరకాయను ఇచ్చి.. ‘ధర్మరాజా! పనుల ఒత్తిడి వల్ల నీతో పాటు యాత్రలకు రాలేకపోతున్నాను. నా ప్రతినిధిగా ఈ సొరకాయను నీ వెంబడి తీసుకుని వెళ్లు’ అని చెప్పాడు. కృష్ణుడి ఆదేశం ప్రకారం ధర్మరాజు.. సొరకాయను నెత్తిన పెట్టుకుని యాత్రలకు వెళ్లాడు. మూడు నెలల తర్వాత యాత్రలన్నీ పూర్తి చేసుకుని తిరిగి హస్తినకు చేరుకున్నాడు. మర్నాడు అన్నసమారాధన చేయాలని భావించాడు. శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లి.. ‘కృష్ణా! మా యాత్ర విజయవంతంగా పూర్తయింది. నీవు ఇచ్చిన సొరకాయను నేను మునిగిన అన్ని తీర్థాల్లో ముంచాను. రేపు అన్నసమారాధన ఉంది. నీవు తప్పకుండా రావాల’ని కోరాడు. అప్పుడు కృష్ణుడు... ‘ధర్మరాజా! అన్నసమారాధనలో ఈ సొరకాయను వండి, అందరికీ ప్రసాదంగా పంచండి’ అన్నాడు. అలాగే చేశాడు ధర్మరాజు. సొరకాయతో వండిన పదార్థాన్ని తిన్నవారంతా చేదు భరించలేక వాంతులు చేసుకున్నారు. ‘రాజా! చేదుగా ఉన్న సొరకాయతో ఎందుకు వంట చేయించారు’ అని ప్రశ్నించారు. కలత చెందిన ధర్మరాజు సమారాధనకు వచ్చిన కృష్ణుడితో... ‘స్వామీ! మీరిచ్చిన సొరకాయ చేదుగా ఉన్నది’ అన్నాడు. కృష్ణుడు నవ్వి.. ‘ధర్మరాజా! ఆ సొరకాయ చేదుగా ఉందని నాకు ముందే తెలుసు. నీతోపాటు ఎన్నో తీర్థాల్లో మునక వేసింది కదా..! దాని చేదుదనం పోయిందేమో అనుకున్నాను. ఇంకా అలాగే ఉన్నట్లుందే?’ అన్నాడు. ధర్మరాజుకు విషయం అర్థమై.. కృష్ణుడికి దండప్రణామాలు చేశాడు. వేలమంది నిత్యం తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు. జపతపాలు చేస్తున్నారు. కానీ, మనసులో గూడు కట్టుకుని ఉన్న అసురగుణాలు, పాపసంస్కారాల గురించి చింతించడం లేదు. హృదయ పరివర్తనం లేని యాత్రలు ఎన్ని చేసినా, తీర్థాల్లో ఎన్నిసార్లు మునిగినా ఫలితం ఉండదు. -
రంతిదేవుడి దానగుణం
రంతిదేవుడు మహాదాతలలో ఒకరిగా కీర్తిపొందిన మహారాజు. విష్ణుభక్తుడైన రంతిదేవుడు దానధర్మాలు సాగించేవాడు. దురదృష్టవశాత్తు రాజ్యంలో దారుణమైన కరువు తాండవించడంతో రంతిదేవుడు తన సమస్త సంపదలనూ దాన ధర్మాల్లో పోగొట్టుకున్నాడు. తనకంటూ ఏమీ లేని దుస్థితిలో చిక్కుకున్నా అతడు తన దానక్రతువును ఏమాత్రం విడనాడలేదు. సంపదలన్నీ హరించుకుపోయిన తర్వాత రంతిదేవుడు తన భార్యా బిడ్డలతో అడవుల పాలయ్యాడు. అడవుల్లో ఉంటున్న రంతిదేవుడు, అతడి కుటుంబ సభ్యులు ఒకసారి వరుసగా నలభై ఎనిమిదిరోజుల పాటు తిండితిప్పలు దొరక్క ఆకలితో అలమటించాల్సి వచ్చింది. అన్ని రోజుల పస్తుల తర్వాత రంతిదేవుడికి ఆహారం, మంచినీరు లభించాయి. కుటుంబ సభ్యులతో కలసి తినడానికి ఉపక్రమించాడు. సరిగా అదే సమయానికి ఒక పేద బ్రాహ్మణుడు అక్కడకు వచ్చాడు. బ్రాహ్మణుడు తనతో పాటు బక్కచిక్కిన తన కుక్కనూ తీసుకొచ్చాడు. రోజుల తరబడి తిండిలేక తాను, తన కుక్క ఆకలితో అలమటిస్తున్నామని చెప్పి, తినడానికి ఏమైనా ఉంటే ఇప్పించమని కోరాడు. రంతిదేవుడు కాదనకుండా తనకు లభించిన ఆహారంలో కొంత ఆ బ్రాహ్మణుడికి, కుక్కకు పెట్టాడు. బ్రాహ్మణుడు భోంచేసి వెళ్లాక రంతిదేవుడు తన భార్యాబిడ్డలతో కలసి భోజనానికి కూర్చున్న సమయానికి ఒక శూద్రుడు వచ్చి ఆకలితో ఉన్నానంటూ ఆహారం అడిగాడు. అతడికి మిగిలిన ఆహారాన్ని ఇచ్చేశాడు. ఇక రంతిదేవుడి కుటుంబానికి మిగిలినవల్లా మంచినీళ్లే. కనీసం మంచినీళ్లయినా తాగి కడుపు నింపుకుందామని అనుకునేలోగానే ఒక దళితుడు వచ్చి ఎదురుగా నిలిచాడు. దప్పికతో గొంతు ఎండిపోతోంది. దాహం తీర్చమని అడిగాడు. కాదనకుండా మంచినీటిని అతడికి ఇచ్చేశాడు. రంతిదేవుడి త్యాగనిరతికి సంతసించిన త్రిమూర్తులు అతడి ఎదుట ప్రత్యక్షమయ్యారు. ‘రంతిదేవా! బ్రాహ్మణ, శూద్ర, దళిత రూపాల్లో నీ వద్దకు వచ్చినది మేమే. నీ దానగుణాన్ని పరీక్షించడానికే అలా వచ్చాం. మా పరీక్షలో నువ్వు నెగ్గావు. ఇక నీ రాజ్యంలో కరవు తొలగిపోతుంది. నీ ప్రజలంతా సుఖశాంతులతో అలరారుతారు’ అని వరాలు కురిపించి అదృశ్యమయ్యారు. -
వాస్తవం అబద్ధం... నమ్మకమే నిజం!
‘‘ఒరేయ్... మనం నమ్మకాలను మాత్రమే నమ్మాలిరా. వాస్తవాలను అస్సలు నమ్మకూడదు’’ అన్నాడు మా రాంబాబుగాడు. ‘‘అదేంట్రా నువ్వు విచిత్రంగా మాట్లాడతావు? కళ్లెదురుగా వాస్తవాలు కనిపిస్తున్నా నమ్మకూడదంటే ఎలా’’ అడిగాను నేను. ‘‘చిన్నప్పుడు నువ్వు స్కూలు పుస్తకాల మధ్యన నెమలీక పెట్టి... వాటికి బిస్కెట్టులను ఆహారంగా వేశావా లేదా?’’ అడిగాడు. ‘‘వేశాను’’ అన్నాను. ‘‘అవి రోజు రోజుకూ పెరుగుతున్నాయని నమ్మావా లేదా?’’ ‘‘నమ్మాను. కానీ...’’ అంటో ఏదో సర్దుకొని మాట్లాడబోయాను. ‘‘నేను చెప్పడం పూర్తి కానివ్వు... అప్పుడు నమ్మావు కదా. అలాగే ఆ టైమ్‌లో రెండు అగ్గిపెట్టెల్లోని లోపల డొప్పలు తీసుకొని వాటికి మధ్య దారం కట్టావా, లేదా? ఆ డొప్పలను ఫోన్‌లాగా ఉపయోగించి మాట్లాడావా, లేదా? అది వినిపిస్తుందని నమ్మావా. ఒకవేళ నమ్మలేదనుకో. ఎదుటివాడు కాస్త గొంతు పెంచి వాడు డెరైక్ట్‌గా వినిపించినప్పుడు అది దారం ద్వారానే వినిపిస్తుందని నమ్మావు కదా, ఎప్పటికప్పుడు కొత్త అబద్ధం మన ముందుకు వస్తూ ఉంటుంది. దాన్నే నమ్ముతూ ఉంటాం’’ అడిగాడు. ‘‘నమ్మితే?... అదంతా చిన్నతనం. అప్పుడు నమ్మాను.’’ అంటూ బదులిచ్చా. ‘‘ఇప్పుడు నువ్వు పెద్దవాడివి అయ్యావా?’’ అడిగాడు. ‘‘అవును... అది వాస్తవం’’ అన్నాను నేను. ‘‘పిచ్చివాడా... కాస్త పెద్దయాక అంతకు ముందు ఉన్న స్థితి చిన్నతనం అవుతుంది. పెరిగే వయసుతో పోలిస్తే... రాబోతున్న కాలంలో ఎదిగే ఈడుతో పోలిస్తే ఎప్పటికప్పుడు చిన్నతనం ఉండనే ఉంటుంది. అలా వయసు, కాలం, క్యాలెండర్ ఉన్నంత కాలం అంతకంటే పెద్ద వయసు వారితో పోలిస్తే చిన్నవారే అవుతారు. ఎప్పటికీ పెద్దవారు కాలేరు ’’ అన్నాడు వాడు. ‘‘అదేమిట్రా... ఇప్పుడు నాకు నాలుగు పదులు నిండాయి. నేనింకా బుజ్జి కూచాయినే అంటే ఎవరైనా నమ్ముతారా? నేనింకా బుజ్జిపాపాయినే అని నేను నమ్మినా సరే... అంత మాత్రాన నా నమ్మకం నిజమవుతుందా?’’ అడిగా. ‘‘నా నమ్మకం కాదురా. అదే నిజం. మీ అమ్మ నిన్ను ఏమని పిలుస్తుంది? ‘ఒరే... చిన్నోడా’ అంటుంది కదా’’ అని గుర్తుచేశాడు. ‘‘అవును... మా పెద్దన్నయ్యను పెద్దోడా అంటుంది కాబట్టే నన్ను చిన్నోడా అంటుంది’’ సమర్థించుకున్నట్లుగా బదులిచ్చా. ‘‘కానీ నువ్వు పుట్టే వరకూ వాడూ చిన్నోడే రా. ఆ తర్వాత పెద్దాడయ్యాడు. అలా పెద్దయ్యాక విలువ పోగొట్టుకుంటాడు. అదీ వాస్తవం. కానీ విలువ పోగొట్టుకుంటాడనేది ఎవరూ నమ్మకపోవడం వాస్తవం’’ అన్నాడు వాడు.‘‘ఏమిటీ... పెద్దయితే విలువ పోగొట్టుకుంటాడా? వ్యాల్యూ తగ్గుతుందా? నువ్వు చెబుతున్నదంతా వింటున్నానని ఏది పడితే అది వాగకు. నేను నమ్మను’’ ‘‘నువ్వు నమ్మేదే వాస్తవం అనుకుంటావని చెప్పడానికి ఇదో ఉదాహరణ. నీకు నమ్మకం కుదరడానికి ఒక విషయం చెబుతాను విను. తాజా ఉదాహరణతో చెబుతున్నా కాబట్టి ఇకనైనా తెలుసుకో. ఇప్పుడూ... బ్యాంకు నుంచి కొత్త రెండు వేల నోటూ, పాత వంద రూపాయల కాగితం ఒకే టైమ్‌లో తీసుకున్నావు కదా. సైజులో వంద నోటే పెద్దది. రెండు వేల రూపాయల కాగితం చిన్నది. దేనికి విలువిస్తున్నావు. వాస్తవంలో వందనోటే పెద్దదైనా... దాని తర్వాత పుట్టిన రెండువేలకే ఎక్కువ విలువిస్తున్నావు కదా. అలాగే... చిన్నదనానికే వ్యాల్యూ ఎక్కువ. నువ్వు పెద్దాడివయ్యావంటే నమ్మకు’’అన్నాడు వాడు. ‘‘నువ్వు ఇంత నమ్మకంగా చెబుతున్నా... నాకెందుకో నమ్మాలనిపించడం లేదురా’’ అన్నాను నేను. ‘‘అయితే ఇంకో ఉదాహరణ... నా దగ్గర వాస్తవానికి ఒక్క పైసా లేదు. నీ దగ్గర కూడా ఇప్పుడు చేతిలో నగదు అనేదే లేదు. కానీ నీకు బ్యాంకులో డబ్బులున్నాయనుకో. వాస్తవానికి ఇప్పుడు మనిద్దరి పరిస్థితి ఒక్కటే. అయినా కానీ నా కంటే నువ్వు ఆస్తిపరుడివని నీ నమ్మకం. అలా నమ్మకం మాత్రమే నిజం. కానీ అది మాత్రం వాస్తవం కాదు. అందుకే నమ్మే వారికి తమ నమ్మకాలు ఎప్పుడూ నిజాలనిపిస్తాయి. నమ్మని వారికి ఎదుటివారివి మాత్రమే మూఢనమ్మకాలు అనిపిస్తాయి. తమ నమ్మకాలకు మాత్రం సెంటిమెంట్ అనే ముద్దు పేరు ఉంటుందిరా’’ అన్నాడు వాడు. ‘‘అవును రా. నిజమే. నాకూ సెంటిమెంట్స్ ఉంటాయి రా. తప్పని తెలిసినా నేనూ సెంటిమెంట్స్‌ను నమ్ముతాను రా’’ ‘‘ఇప్పుడు తెలిసిందా. నమ్మేదే నిజమనీ... వాస్తవమైనా నమ్మనంతవరకూ అదే అవాస్తమేననీ’’ అన్నాడు వాడు ఘాటుగా. - యాసీన్