
గోల్డ్ బాండ్లు కొన్నవారికి 193 శాతం లాభం
8 ఏళ్ల క్రితం పెట్టుబడి గ్రాముకు రూ.2,943
ఇప్పుడు చేతికొచ్చేది రూ.8,600 పైమాటే
2016–17 సిరీస్–4 బాండ్ల ఉపసంహరణ ధర రూ.8,624గా ఖరారు చేసిన ఆర్బీఐ
కేంద్ర ప్రభుత్వంపై ఊహించని ఆర్థిక భారం
పెట్టుబడి దాదాపు రూ.3 వేలు. చేతికి వస్తున్నది మాత్రం రూ.8,600 పైమాటే. మీరు చదువుతున్నది అక్షరాలా నిజం. సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్‌జీబీ) 2016–17 సిరీస్–4 కొనుగోలు చేసిన పెట్టుబడిదారులకు ఇప్పుడు ‘బంగారం’పంట పండింది. ఈ నెల 17నాటికి ఎనిమిదేళ్ల గడువు ముగిసే సావరిన్ గోల్డ్ బాండ్లకు ఒక్కో గ్రాముకు రిడెమ్షన్ (ఉపసంహరణ) ధర రూ.8,624గా నిర్ణయించినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. ఒక్కో గ్రాముకు రూ.2,943 చొప్పున ఎస్‌జీబీ సిరీస్–4ను 2017 మార్చి 17న జారీ చేశారు. అంటే ఇన్వెస్టర్లు 193 శాతం లాభం అందుకుంటున్నారన్న మాట. దీనికి వడ్డీ అదనం. – సాక్షి, స్పెషల్ డెస్క్
మొత్తం 146 టన్నులు..
సావరిన్ గోల్డ్ బాండ్ పథకం 2015 నవంబర్‌లో ప్రారంభం అయ్యింది. ఈ పథకంలో భాగంగా మొత్తం 67 విడతలుగా 146.96 టన్నుల గోల్డ్ బాండ్స్ జారీ అయ్యాయి. వీటి విలువ రూ.72,274 కోట్లు. 2023–24లో ఇన్వెస్టర్లు రూ.27,031 కోట్ల విలువైన 44.34 టన్నుల గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేశారు.
2017–2020 మధ్య జారీ అయిన ఎస్‌జీబీలకు ముందస్తు ఉపసంహరణను 2024 జూలై నుంచి ఆర్‌బీఐ ప్రకటించింది. ప్రభుత్వం 2024 జూలై నుంచి∙ఆరు విడతల ఎస్‌జీబీ మొత్తాలను తిరిగి చెల్లించింది. 61 విడతలు మిగిలి ఉన్నాయి. తుది చెల్లింపు 2032 ఫిబ్రవరిలో జరగనుంది.
సిరీస్‌ల వారీగా ఇలా..
గ్రాముకు రూ.3,119 ధరతో 2016 ఆగస్ట్ 5న జారీ చేసిన ఎస్‌జీబీ 2016–17 సిరీస్–1 గత ఏడాది 2024 ఆగస్ట్ తొలి వారంలో రూ.6,938 చొప్పున రిడీమ్ అయ్యాయి. గ్రాముకు రూ.3,150 చొప్పున 2016 సెప్టెంబర్ 30న జారీ అయిన 2016–17 సిరీస్–2 గత ఏడాది సెప్టెంబర్ 30న రూ.7,517 ధరతో ఉపసంహరించారు.
రూ.3,007 ధరతో 2016 నవంబర్ 17న జారీ అయిన 2016–17 మూడవ సిరీస్ రూ.7,788 చొప్పున 2024 నవంబర్ 16న రిడీమ్ అయ్యాయి. ఇక గ్రాముకు రూ.2,943 ధరతో జారీ చేసిన నాలుగో విడత సావరిన్ గోల్డ్ బాండ్స్ ఒక్కో గ్రాముకు రూ.8,624 చొప్పున రిడెమ్షన్ కానుంది.
భారంగా మారిన బాండ్లు
ఎస్‌జీబీ పథకం కథ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. భారత్‌లో పెరుగుతున్న బంగారం దిగుమతులను తగ్గించాలన్న లక్ష్యంతో పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఆశించిన ప్రయోజనం అటుంచితే పెరుగుతున్న బంగారం ధరలతో ఖజానాపై ఊహించని ఆర్థిక భారం పడింది. దీంతో ప్రభుత్వం చివరకు ఈ పథకాన్ని రద్దు చేయాల్సి వచ్చింది.
గోల్డ్ బాండ్స్‌లో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ.85,000 కోట్లను తాకనుందని 2024 జూలై మధ్యంతర బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. ఈ విలువ 2019–20తో పోలిస్తే దాదాపు తొమ్మిది రెట్లు అదనం.
2016–17 సిరీస్–1 ఉపసంహరణతో ఇన్వెస్టర్లు 122 శాతం ప్రీమియం అందుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర తొలిసారిగా 3,000 డాలర్లు దాటిన సంగతి తెలిసిందే. బంగారం పరుగుతో ప్రభుత్వంపై ‘పసిడి బాండ్ల’భారం తీవ్రమైంది.
రిడెమ్షన్ ధర నిర్ణయం ఇలా..
999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియన్ బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ ప్రకటించిన ధరల ప్రకారం.. రిడెమ్షన్ తేదీ నుంచి గడిచిన మూడు పని దినాల్లో సగటు బంగారం ధరను ఎస్‌జీబీ తుది ఉపసంహరణ ధరగా నిర్ణయిస్తారు.
ఇదీ పథకం..
» కనీస పెట్టుబడి 1 గ్రాము.
» ఈ బాండ్లు దేశంలో బంగారం ధరతో ముడిపడి ఉంటాయి.
» వీటికి 8 సంవత్సరాల కాలపరిమితిని పెట్టారు.
» 5 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా ఉపసంహరించుకునే అవకాశం ఉంది.
» ఇన్వెస్టర్లకు తమ పెట్టుబడిపై సంవత్సరానికి
» 2.5% వడ్డీ కూడా అదనంగా పొందవచ్చు.
» వడ్డీపై పన్ను విధించబడుతుంది. కానీ మూలధన లాభాల పన్ను లేదు.
ఏమిటీ ఎస్‌జీబీలు..?
ఇవి భారత ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జారీ చేసిన ప్రభుత్వ సెక్యూరిటీలు. నిజమైన (భౌతిక) బంగారానికి ఇవి ప్రత్యామ్నాయ రూపం. పెట్టుబడిదారులు భౌతికంగా బంగారం కలిగి ఉండాల్సిన అవసరం లేకుండా దానిపై పెట్టుబడి పెట్టడానికి ఈ బాండ్లు వీలు కల్పించాయి.
పెట్టుబడిదారులు ఇష్యూ ధరను నగదు రూపంలో చెల్లించాలి. బాండ్ల గడువు ముగిసిన తర్వాత పెట్టుబడిదారులకు నగదు రూపంలోనే తిరిగి చెల్లిస్తారు.బంగారం దిగుమతులను నిరుత్సాహపరచడం ద్వారా విదేశీ మారకం నిల్వలను కాపాడుకోవచ్చన్న భావనతో కేంద్రం ఈ బాండ్ల జారీని ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment