
గ్రూప్–1 ఆఫీసర్‌గా అరవింద్ ఎంపిక
నాలుగు సార్లు సివిల్స్ మెయిన్స్ వరకు వెళ్లినా నిరాశ
పంచాయతీ సెక్రటరీగా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూనే పరీక్షలకు సిద్ధం
ప్రస్తుత వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతల నిర్వహణ
లక్ష్య సాధనలో అపజయాలు ఎదురైనా కుంగిపోలేదు. సివిల్స్‌లో నిరాశ ఎదురైనా ఆగిపోలేదు. ఆత్మ విశ్వాసంతో తన గమ్యాన్ని, ప్రయాణాన్ని మార్చుకుని గ్రూప్–1 ఆఫీసర్‌గా అరవింద్ ఎంపికయ్యారు. పంచాయతీ సెక్రటరీగా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసినా ఆ ఉద్యోగాలతో సంతృప్తి లేదు. జీవన సమరంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రస్తుత వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
లక్ష్మీపురం(గుంటూరు): కర్నూలుకు చెందిన కడారుకొండ ఓంకార్ సీనియర్ న్యాయవాది. ఆయన భార్య రేవతి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. వారికి ఇద్దరు మగ పిల్లలు. పెద్ద కుమారుడు కె.సాయి తేజ డాక్టర్. రెండో కుమారుడు కె. అరవింద్ ప్రస్తుతం గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా పని చేస్తున్నారు. భార్య సామా శ్వేత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉన్నారు. వీరికి రణ్‌విత్ అనే కుమారుడు ఉన్నాడు.
సివిల్స్‌లో అపజయం
అరవింద్ 2015లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు ఈగల్ ఐజీగా ఉన్న ఆకే రవికృష్ణ కర్నూల్ ఎస్పీగా ఉండేవారు. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని తరచూ కలిసేవారు. సివిల్ సర్వీసెస్‌కు కావాల్సిన మెళకువలు తెలుసుకుంటూ ఉండేవారు. ఆ సమయంలో క్యాంపస్ సెలక్షన్స్‌లో టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దాంతో సంతృప్తి చెందలేదు. సివిల్ సర్వీసెస్ అధికారి కావాలన్న అరవింద్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే హైదరాబాద్‌లోని ఆర్‌సీ రెడ్డి సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకున్నారు. 2016లో మెయిన్స్ వరకు వెళ్లి వెనుదిరిగారు. మరలా శిక్షణ కొనసాగతున్న సమయంలో 2016–17 హైదరాబాద్‌లో యాక్సెంచర్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా ఉద్యోగ అవకాశం దక్కింది.
సివిల్స్ శిక్షణ పొందుతూనే కుటుంబానికి భారం కాకూడదని ఏడాదిన్నరపాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేశారు. ఆ సమయంలో హైదరాబాద్‌కు చెందిన సామా శ్వేత అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నారు. ఆమెతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2020 అక్టోబర్ 29న ఇద్దరు వివాహం చేసుకున్నారు. మరలా 2017లో గ్రూప్–1 పరీక్షలకు హాజరై మెయిన్స్ వరకు వెళ్లి అరవింద్ వెనుదిరిగారు. మరలా 2018, 2019, 2020లో సివిల్స్ మెయిన్స్ వరకు వెళ్లి చివరి దశలో నెగ్గలేక పోయారు. అయితే, భార్య, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 2020లో పూర్తిగా గ్రూప్–1కు శిక్షణ పొందడం ప్రారంభించారు.
ఆ సమయంలో 2019–2022 వరకు కర్నూల్ నగరంలో పంచాయితీ కార్యదర్శిగా ప్రభుత్వ ఉద్యోగం చేశారు. 2018లో గ్రూప్– 1 మరలా రాశారు. 2022 జులైలో వచ్చిన ఫలితాల్లో గ్రూప్– 1 ఆఫీసర్‌గా అత్యధిక ఉత్తీర్ణతతో సాధించారు. 2022 సెప్టెంబర్ నుంచి 2023 అక్టోబర్ వరకు అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో డీఎస్పీగా శిక్షణ పొందారు. 2023 నవంబర్ నుంచి 2024 జూన్ వరకు వెస్ట్ గోదావరి భీమవరంలో ట్రైనీ డీఎస్పీగా పని చేశారు. 2024–2025 జనవరి వరకు వైజాగ్ గ్రే హౌండ్స్‌లో బాధ్యతలు నిర్వహించారు. 2025 జనవరి 20న లా అండ్ ఆర్డర్ విభాగంలో గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.
సివిల్ సర్వెంట్ కావాలని కలలు
చిన్నతనం నుంచి ఐపీఎస్ కావాలన్న లక్ష్యం ఉండేది. సివిల్స్‌లో అపజయం ఎదురైనా నిరాశ చెందలేదు. తల్లిదండ్రులు, సోదరుడు ఎంతో ప్రోత్సహించారు. వివాహం అయిన తరువాత నా భార్య శ్వేత కూడా ప్రోత్సహించేది. ఎన్నసార్లు పడినా, లేచి నిలబడగలగం అనే మనో ధైర్యం ఉండాలి. ఎలాగైనా సాధించి తీరాలన్న దృఢసంకల్పం ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొగలం. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి
– అరవింద్
Comments
Please login to add a commentAdd a comment