
కర్నూలు: చంకలో చిన్న పిల్లలు..చేతిలో నీటి బుడగల గన్స్.. ఒకవైపు పిల్లలను ఆడిస్తూ, ఓదారుస్తున్నారు. ఇదే సమయంలో చిరు వ్యాపారం చేస్తూ ఆత్మాభిమానం చాటుతున్నారు. రోజూ నగరంలో ఎంతో మంది అన్ని అవయవాలు బాగున్నా రోడ్లలో బిచ్చమెత్తుకుంటున్న దృశ్యాలు కోకొల్లలు.
ఎలాగోలా బతికేస్తున్నామని కాకుండా, ఎంతోకొంత కష్టపడి సంపాదించిన సొమ్ముతో గంజినీళ్లు తాగినా ఆత్మసంతృప్తి ఉంటుందనేందుకు వీళ్లే ఉదాహరణ. రాజస్థాన్‌వాసులు కిలోమీటర్ల దూరం ప్రయాణించి నగరంలోని రద్దీ ప్రాంతాల్లో వాటర్ బబుల్ గన్స్ విక్రయిస్తున్నారు. పెద్ద దుకాణాల్లో జీఎస్టీలు చెల్లించి, నిర్ణయించిన ధరకు కొనుగోలు చేస్తున్న వాళ్లలో సగం మందైనా ఇలాంటి వాళ్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.