
చాటింగ్ ద్వారా తుపాకుల అమ్మకాలు
భారత్‌లో జోరుగా అక్రమ ఆయుధాల దందా
గత ఏడాది 8 వేలకుపైగా అక్రమ ఆయుధాల ప్రకటనలు
450 వాట్సాప్ గ్రూపుల్లో చాటింగ్
డిజిటల్ విట్నెస్ ల్యాబ్ పరిశోధనలో వెల్లడి
సాక్షి, అమరావతి: భారత్‌లో వాట్సాప్ గ్రూపుల ద్వారా తుపాకుల అమ్మకాలు జరుగుతున్నట్టు ప్రముఖ సోషల్ మీడియా టూల్స్ పరిశోధక సంస్థ డిజిటల్ విట్నెస్ ల్యాబ్ వెల్లడించింది. అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఈ సంస్థ పరిశోధనలో విస్మయకర విషయాలు వెలుగుచూశాయి. దేశంలోని భద్రతా చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ వాట్సాప్ గ్రూపుల్లోనే తుపాకుల విక్రయాలకు సంబంధించిన ప్రకటనలు పోస్టు చేస్తున్నారని తెలిపింది.
గతంలో అక్రమ తుపాకులు కొనుగోలు చేయాలంటే ఉత్తరప్రదేశ్, బిహార్, ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఆ రాష్ట్రాల్లో అక్రమ ఆయుధాల విక్రేతలను లేదా వారి ఏజెంట్లను రహస్యంగా కలిసి ఆయుధాలు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే... కేవలం వాట్సాప్ ద్వారానే తాము కోరుకున్న అక్రమ తుపాకులు కొనుగోలు చేస్తున్నారు. ఈ–కామర్స్ సంస్థల ద్వారా ఆ ఆయుధాలు డోర్ డెలివరీ అవుతున్నాయని డిజిటల్ విట్నెస్ ల్యాబ్ వెల్లడించింది.
పరిశోధనలో వెల్లడైన అంశాలివీ...
⇒ ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు కేంద్రంగా దేశవ్యాప్తంగా అక్రమ తుపాకుల వ్యాపారం జోరుగాసాగుతోంది. అక్రమ ఆయుధాల వ్యాపారులు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసి మరీ తుపాకులు అమ్ముతున్నారు. తమవద్ద ఉన్న తుపాకులు, వాటి ధరలు, ఇతర వివరాలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారు.
⇒ 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి మధ్య మన దేశంలో వాట్సాప్ చాటింగ్ ద్వారా అక్రమ తుపాకుల విక్రయాలకు సంబంధించిన 8 వేలకుపైగా ప్రకటనలు జారీ చేశారు.
⇒ ఏకంగా 234 వాట్సాప్ గ్రూపుల్లో అక్రమ తుపాకుల విక్రయాల వివరాలను పోస్టు చేశారు. ఆ వాట్సాప్ గ్రూపులన్నీ బహిరంగంగానే అందరికీ అందుబాటులో ఉండటం గమనార్హం. ఒక్కో వాట్సాప్ గ్రూపులో వందలాది మంది సభ్యులు ఉన్నారు.
⇒ మన దేశంలో 40 కోట్ల మందికి పైగా వాట్సాప్ యూజర్లు ఉన్నారు. దాంతో వ్యాపార, పారిశ్రామిక సంస్థలు వాట్సాప్‌ను తమ వ్యాపార విస్తరణకు వేదికగా చేసుకుంటున్నాయి. అక్రమ ఆయుధాల వ్యాపారులు కూడా అదే రీతిలో వాట్సాప్ ద్వారానే తమ కార్యకలాపాలు సాగిస్తుండటం గమనార్హం.
నిషేధం ఉన్నా పట్టించుకోని ‘మెటా’'
సోషల్ మీడియా వేదికల ద్వారా ఆయుధాల వ్యాపారం భారత్‌లో నిషిద్ధం. కానీ.. ఈ విషయాన్ని మెటా సంస్థ పెద్దగా పట్టించుకోవడం లేదని నిపుణులు చెబుతున్నారు. మెటా సంస్థే నిర్వహిస్తున్న ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అక్రమ ఆయుధాల అమ్మకాల ప్రకటనలు జారీ చేసిన ఓ ముఠాను 2023లో ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా మెటా సంస్థ సరైన నియంత్రణ చర్యలు చేపట్టలేదు. 2022–2024లో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో అక్రమ ఆయుధాల విక్రయాల ప్రకటనలను మెటా సంస్థ ఆమోదించడం అప్పట్లోనే తీవ్ర అలజడి సృష్టించింది. ప్రస్తుతం భారత్‌లోనూ మెటా సంస్థ నిర్వహిస్తున్న వాట్సాప్ ద్వారా పలు ముఠాలు అక్రమ ఆయుధాల ప్రకటనలు జారీ చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
బిజినెస్ ఖాతాల ద్వారానే..
అక్రమ ఆయుధాల ప్రకటనలు జారీ చేస్తున్న ముఠాల వాట్సాప్ ప్రొఫైల్స్‌ను డిజిటల్ విట్నెస్ ల్యాబ్ విశ్లేషించింది. ఆ ముఠాలన్నీ బిజినెస్ ఖాతాల ద్వారానే తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కస్టమర్ ఆపరేషన్స్ నిర్వహించేందుకు ఆ ఖాతాలన్నీ అదనపు ఫీచర్లు కలిగి ఉన్నాయని కూడా గుర్తించింది. కోడ్ భాషలో అక్రమ ఆయుధాలను విక్రయిస్తున్నారని పేర్కొంది.
2022లో 1.04 లక్షల అక్రమ ఆయుధాల జప్తు
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం 2022లో దేశంలో 1.04 లక్షల అక్రమ ఆయుధాలను పోలీసులు జప్తు చేశారు. పోలీసుల దృష్టికి రాని అక్రమ ఆయుధాలు అంతకుమించి ఉంటాయని పరిశీలకులు చెబుతున్నారు. అంటే దేశంలో అక్రమ ఆయుధాల వ్యాపారం ఎంతగా విస్తరించిందన్నది ఈ ఉదంతం వెల్లడిస్తోంది. మరోవైపు వాట్సాప్ ద్వారా తుపాకుల విక్రయాలకు ప్రకటనలు జారీ చేస్తుండటం అక్రమ ఆయుధాల ముఠాల బరితెగింపునకు నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment