Philosophy
-
మానవ తాత్వికతకు దర్పణం
బాలగోపాల్ 2009 అక్టోబర్ 8న మరణించి ఇప్పటికి పదిహేనేళ్లు గడుస్తున్నా ఆయన ప్రాసంగికత కాలగమనాన్ని తట్టుకొని స్థిరంగా నిలబడే ఉన్నది. మనిషి ఉనికి, తాత్విక అర్థం, స్థూలంగా మానవ జీవితపు అంతరార్థం ఆయన వివరించినంత లోతుగా తెలుగునాట మరొకరు విశదీ కరించలేదన్నది అతిశయోక్తి కాదు. అంతరాలు నిండిన, అసమానతలతో కూడుకున్న సమాజం మనుషులకు వైకల్యంతో కూడిన ప్రాపంచిక దృక్పథాన్ని మాత్రమే అందించగలదనీ... సమానత్వ ప్రాతిపదికన, మనుషులను మనుషులుగా చూడగలిగే మానవీయ దృక్కోణాన్ని సంకల్పపూర్వకంగా అలవర్చుకోవా ల్సిందనీ బాలగోపాల్ నొక్కి వక్కాణించాడు. వైయక్తిక సంకల్పమే కాదు, సామాజిక ఆచరణ కూడా అంతే అవసరం అన్నాడు. ఈ సమానత్వ ప్రాపంచిక దృక్కోణాన్ని, మానవ ఆచరణను... సామాజిక నీతి నియమాలు, నిబంధనలు ఎంతగా ప్రభావితం చేస్తాయో కూడా తన రచనల ద్వారా వివరించాడు. ఒక్క మానవ తాత్వికతను మాత్రమే కాదు, దాని సామాజిక చలన సూత్రాలను, సామాజిక ఉద్యమాలలో దాని మూలాలను విశ్లేషించి విడదీయరాని సంబంధాన్ని నెలకొల్పిన ఉద్యమకారుడు కూడా ఆయనే. తన జీవితాన్ని ఈ సామాజిక తాత్విక దృక్పథానికి ఒక తిరుగులేని ప్రయోగశాలగా మార్చిన అరుదైన వ్యక్తి. సంక్లిష్టమైన భారత సామాజిక జీవితంలో అస మానతలు భిన్న పాయలుగా మన జీవితంలో పెన వేసుకు పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ అసమానతలను రూపు మాపటానికి చైతన్యపూరితంగా మనం చేయవలసిన కృషిని తను జీవించి ఉన్నంతకాలం మనకు తన జీవిత ఆచరణ ద్వారా మార్గదర్శనం చేశాడు. 2024 ఆగస్ట్ 1న సుప్రీంకోర్టు వెలువరించిన ఎస్సీ వర్గీకరణ తీర్పులో సైతం ఆయన వాదనలను ఉటంకించటం దీనికి ఒకానొక ఉదాహరణ మాత్రమే. దళితులలో దళితులు అన్న పదం వాడగలిగిన ఏకైక వ్యక్తి ఆయన. వివక్ష ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్న తన సూక్ష్మ పరిశీలన ద్వారా దానిని పసి గట్టి ఆ వివక్ష తాత్విక మూలాల్ని సమాజానికి విశద పరిచిన వ్యక్తి బాలగోపాల్. వివక్ష అసలు అర్థం అసమానతేననీ, అది అసమానతను అనుభవిస్తున్న వర్గాల్లో సైతం ఆచరణలో ఉండగలదనీ, అక్కడ కూడా మనం సమానత్వ ప్రాతిపదికనే ఆ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుందనీ ఎలుగెత్తినవాడు ఆయన.పాలస్తీనాపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దారుణ మారణకాండను చూసినప్పుడు ఇంత అమానవీయమైన హింసకాండకు కారణాలను ఆయన మనకు ఒక కొత్త కోణంలో, మానవీయ కోణంలో ఆవిష్కరించేవాడు అని మనం గుర్తు తెచ్చుకోకుండా ఉండలేము. తొలి రోజుల్లో వర్గ సిద్ధాంతపు ఆలోచనా ధోరణికి కొంత ప్రభావితమైనా మానవత్వపు విస్తృత పరిధి ఒక సిద్ధాంత చట్రంలో ఇమిడేది కాదనీ, మానవత్వానికి నిర్వచనం మానవత్వంతో మాత్రమే ఇవ్వగలమనీ తన కార్యాచరణ ద్వారా గ్రహించిన ఆయన చివరికంటా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మాన వతను మానవీయ దృక్కోణంలోనే విస్తరించాడు. ప్రభుత్వం చేసే హింస మాత్రమే కాదు, దానికి తిరుగుబాటుగా వచ్చే ప్రతిహింస సైతం మానవ త్వానికి జవాబు దారీగా ఉండాలనీ, అలా కాని పక్షంలో అలాంటి ఉద్యమాలన్నీ రాజ్యానికి మరో అను కరణ మాత్రమే కాగలవనీ వివరించాడు బాలగోపాల్. అధికారం కేవలం రాజ్యం వద్దనో, ప్రభుత్వం వద్దనో మాత్రమే కాదు... సామాజిక ధోరణులలో, సంస్కృతులలో సైతం ఆధిపత్యాలు ఉండగలవనీ... ప్రజా జీవితంలో సైతం అసమానతలతో కూడిన సమాజాన్ని కొనసాగించడానికి అవసరమైన అధిప త్యాలు ఉండగలవనీ వాటికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయటం హక్కుల ఉద్యమపు బాధ్యత అని తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశమంతా కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేసిన వ్యక్తి బాలగోపాల్. ఆయన ఈరోజు లేకపోవచ్చు కానీ ఆయన తాత్విక దృక్పథం ఆయన రచనల ద్వారా అందుబాటులోనే ఉన్నది. తెలుగు సమాజం ఎదుర్కొంటున్న అనేక సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ సమస్యలకు ఆయన రచనలలో పరిష్కారాలు లభించ గలవు. అధికారాన్ని సందేహించనివారు హక్కుల కార్యకర్తలు కాజాలరు అన్న మాట ఆయనలోని నిండైన మానవత్వాన్ని ఆవిష్కరిస్తుంది. మానవీయ సమాజం కోసం, ప్రజాస్వామిక విలువల కోసం కృషి చేయడమే ఆయన జీవితాచరణ ద్వారా నిర్దేశించిన ఏకైక కర్తవ్యం.– టి.హరికృష్ణ, మానవ హక్కుల వేదిక (నేడు హైదరాబాద్‌లో బాలగోపాల్ 15వ సంస్మరణ సదస్సు) -
Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
వ్యాపార విభజనతో గోద్రెజ్ కంపెనీ వార్తల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ‘గోద్రెజ్ అండ్ బోయ్స్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆ కంపెనీ ఫ్యూచర్ మేనేజింగ్ డైరెక్టర్ క్యాండెట్ నైరికా హోల్కర్‌పై ప్రత్యేక దృష్టి పడింది. ‘గోద్రెజ్’లో న్యూ జనరేషన్ ప్రతినిధిగా భావిస్తున్న నైరికా హోల్కర్ లీడర్షిప్ ఫిలాసఫీ గురించి....గోద్రెజ్ కుటుంబంలో నాల్గవ తరానికి చెందిన నైరికా హోల్కర్కు నేర్చుకోవాలనే తపన. ఆఫీసులోని సీనియర్ల నుంచి ఇంట్లో చిన్న పిల్లల వరకు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎలాంటి ఇబ్బందీ పడదు. ‘వినడం వల్ల కలిగే ఉపయోగాలు, కమ్యూనికేషన్స్ స్కిల్స్ నా కూతురి నుంచి నేర్చుకున్నాను’ అని వినమ్రంగా చెబుతుంది నైరిక. ఐడియా రాగానే ఆ క్షణానికి అది గొప్పగానే ఉంటుంది. అందుకే తొందరపడకుండా తనకు వచ్చిన ఐడియా గురించి అన్నీ కోణాలలో విశ్లేషించి ఒక నిర్ధారణకు వస్తుంది. ‘నా అభి్రపాయమే కరెక్ట్’ అని కాకుండా ఇతరుల కోణంలో కూడా ఆలోచించడం అలవాటు చేసుకుంది.‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లో లా చదివిన నైరిక కొలరాడో కాలేజీలో (యూఎస్)లో ఫిలాసఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ చదువుకుంది. లీగల్ ఫర్మ్ ‘ఏజెడ్‌బీ అండ్ పార్ట్నర్స్’తో కెరీర్ప్రారంభించిన నైరిక మన దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ కంపెనీలకు సలహాలు ఇవ్వడంలో ప్రత్యేక ప్రతిభ సాధించింది. గోద్రెజ్ అండ్ బోయ్స్ (జీ అండ్ బి)లోకి అడుగు పెట్టి డిజిటల్ స్ట్రాటజీ నుంచి కంపెనీ లీగల్ వ్యవహారాలను పర్యవేక్షించడం వరకు ఎన్నో విధులు నిర్వహించింది. ఆమె నేతృత్వంలో కంపెనీ ఎన్నో ఇంక్యుబేటెడ్ స్టారప్లతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. మహిళా సాధికారతకుప్రాధాన్యత ఇచ్చే నైరిక ‘పవర్’ అనే మాటకు ఇచ్చే నిర్వచనం...‘అర్థవంతమైన మార్గంలో ప్రభావం చూపే సామర్థ్యం’ ‘నాయకత్వ లక్షణాలకు చిన్నా పెద్ద అనే తేడా ఉండదు. చిన్న స్థాయిలో పనిచేసే మహిళలలో కూడా అద్భుతమైన నాయకత్వ సామర్థ్యం ఉండవచ్చు. అలాంటి వారిని గుర్తించి నాయకత్వ బాధ్యతలు అప్పగించడం నాప్రాధాన్యతలలో ఒకటి’ అంటుంది నైరిక.కోవిడ్ కల్లోల కాలం నుంచి ఎంతోమంది లీడర్స్లాగే నైరిక కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంది.‘మాలాంటి కంపెనీ రాత్రికి రాత్రే డిజిటల్లోకి వచ్చి రిమోట్ వర్కింగ్‌లోకి మారుతుందని చాలామంది ఊహించలేదు’ అంటున్న నైరిక సిబ్బంది వృత్తి నైపుణ్యాలను మరింతగా మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది. ‘స్ప్రింట్’ ΄ోగ్రాం ద్వారా కొత్త ఐడియాలను ్ర΄ోత్సహించడం నుంచి ప్రయోగాలు చేయడం వరకు ఎన్నో చేసింది. ‘నైరిక ఎవరు చెప్పినా వినడానికి ఇష్టపడుతుంది. ఒకప్రాజెక్ట్లో భాగంగా సమర్ధులైన ఉద్యోగులను ఒకచోట చేర్చే నైపుణ్యం ఆమెలో ఉంది. న్యూ జనరేషన్ స్టైల్ ఆమె పనితీరులో కనిపిస్తుంది’ అంటారు గోద్రెజ్లోని సీనియర్ ఉద్యోగులు.‘గోద్రెజ్ అండ్ బోయ్స్’ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ జంషెడ్ గోద్రేజ్ సోదరి స్మితా గోద్రెజ్ కూతురే నైరికా హోల్కర్. ఇండోర్ రాజ కుటుంబానికి చెందిన యశ్వంత్‌రావు హోల్కర్‌ను ఆమె పెళ్లి చేసుకుంది. దశాబ్ద కాలానికి పైగా ఇంజనీరింగ్–ఫోకస్డ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలో కీలక బాధ్యతలు తీసుకొని రాణించడం అంత తేలికేమీకాదు. ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. ఆ సవాళ్లను తన సామర్థ్యంతో అధిగమించి గోద్రెజ్ మహాసామ్రాజ్యంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది నైరికా హోల్కర్. గ్లోబల్ లీగల్ స్ట్రాటజీ నుంచి స్త్రీ సాధికారతకు పెద్ద పీట వేయడం వరకు కంపెనీలో తనదైన ముద్ర వేసింది. 2030 నాటికి...కోవిడ్ తరువాత కొత్త ప్రాధాన్యత రంగాలను... ఉత్పత్తులు, సేవలను మెరుగు పరిచే అవకాశాలను గుర్తించాం. కార్బన్ తీవ్రతను తగ్గించాలనుకుంటున్నాం. ఎనర్జీప్రాడక్టివిటీని రెట్టింపు చేయాలనుకుంటున్నాం. పర్యావరణ హిత ఉత్పత్తుల నుంచి 32 శాతం ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. రాబోయే కాలంలో కంపెనీ ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేది మా లక్ష్యం.– నైరికా హోల్కర్ -
చారిత్రక మూలాల్లో జ్ఞాన కాంతులు
ఏ దేశానికైనా, ఏ జాతికైనా చారిత్రక తాత్విక జ్ఞానం అవసరం. నిజానికి తొలి నుంచీ ఉన్నది భౌతికవాదమే. భారతదేశంలోని భౌతికవాద చింతన అన్ని కీలక పరిణామాల్లో ప్రధాన శక్తిగా నిలిచింది. మానవుడు భౌతిక ప్రపంచం నుండి ప్రభవించడం వల్ల అతని ఆలోచనలు, భావాలు, ఊహలు భౌతిక వాస్తవికత వైపే మొదట్లో పయనించాయి. నిప్పును, నీరును, గాలిని, భూమిని; వాటి భౌతిక రూపాలను తెలుసుకోవడమే మానవుని అభివృద్ధి సోపానం. అయితే అనేక సందర్భాలలో ప్రజలు వెలుగు నుండి చీకట్లోకి, జ్ఞానం నుండి అజ్ఞానంలోకి, వాస్తవం నుండి భ్రమలలోకి తిరోగమిస్తూ ఉంటారు. అప్పుడే అభ్యుదయవాదులు వారిలో జ్ఞానతృష్ణను కలిగించాలి. భారతదేశ తాత్విక మూలాలపై ఈనాడు లోతైన చర్చ జరుగుతోంది. నిజానికి భారతీయ తత్వశాస్త్రాన్ని సృష్టించినవారు మూలవాసులు. వీరు మెసపటో మియా, సింధూ నాగరికతల కాలం నాటివారు. వీరి మౌఖిక జ్ఞాన సంపదకు ప్రత్యామ్నాయంగానే వైదిక సాహిత్యం వచ్చింది. వైదిక సాహిత్యం కూడా మొదట్లో మౌఖిక రూపంలోనే ఉంది. తర్వాత లిఖిత రూపం ధరించింది. భారతీయ తత్వశాస్త్రం ప్రధానంగా భౌతికవాద తత్వశాస్త్రం. భారతదేశంలో తత్వశాస్త్రమంటే ఆధ్యాత్మిక వాదంగా ప్రచారం చేశారు. తత్వశాస్త్రమనగానే అది ఆత్మ గురించో, పరలోకం గురించో చెప్పేదనే భావన ఏర్పడింది. నిజానికి భౌతిక అంశాల నుండి రూపొందినదే తత్వశాస్త్రం. భారతదేశంలో అతి ప్రాచీన జాతులు తాత్వికాంశాల మీద సుదీర్ఘమైన చర్చ చేశాయి. శరీరానికీ, చైతన్యానికీ ఉన్న సంబంధాన్నీ; మానవునికీ, ప్రకృతికీ ఉన్న సంబంధాన్నీ, విశ్వ పరిణామాన్నీ, మానవ పరిణామాన్నీ వీరు అర్థం చేసు కోవడానికి ప్రయత్నించారు. ప్రకృతి; సమాజం పట్ల ఉదయించిన అనేక ప్రశ్నలకు భౌతిక దృక్పథంతో సమాధానం వెదికారు. మానవుడు భౌతిక ప్రపంచం నుండి ప్రభవించడం వల్ల అతని ఆలోచనలు, భావాలు, ఊహలు భౌతిక వాస్తవికత వైపే మొదట్లో పయనించాయి. నిప్పును, నీరును, గాలిని, భూమిని; వాటి భౌతిక రూపాలను తెలుసుకోవడమే మానవుని అభివృద్ధి సోపానం. నిప్పు మానవ సామాజిక పరిణామంలో కీలక పాత్ర వహించింది. నిప్పును ఆరాధించిన జాతుల కంటే, నిప్పును భౌతిక శక్తిగా గుర్తించిన జాతులు శక్తిమంతంగా ముందుకు నడిచాయి. నిప్పు మానవ జీవితాన్ని ఒక భౌతిక శక్తిగా ప్రభావితం చేసింది. నిప్పును ఆరాధించే జాతులకూ, నిప్పును అధీనం చేసుకొన్న జాతులకూ సమరం జరిగింది. తన చుట్టూ వున్న భౌతిక ప్రపంచాన్ని సమన్వయించుకోవడంలో విఫలమై నవారు భావవాదులుగా రూపొందారు. వీరు భౌతిక సామాజిక వాస్తవికతకు భిన్నమైన భావవాదంతో భౌతికవాదులకు ఎదురు నిలుస్తూ వచ్చారు. అంతేగాక వానరుడి నుండి నరుడిగా పరిణామం చెందిన ప్రతి కీలక దశలోనూ మానవుని భౌతిక దృక్పథమే అతనికి నిర్ణయాత్మక మెట్టుగా ఉపకరించింది. లక్షలాది సంవత్సరాలకు పూర్వం ఉష్ణమండలంలో ఎక్కడో ఒక చోట నరవానరుడిగా ఉన్న మానవుడు మానవుడిగా రూపొందిన పరిణామంలో చేతుల్ని ఉపయోగించుకున్న తీరును ఎంగెల్స్ వర్ణించాడు. రోమ శరీరులైన మన పూర్వీకులు మొదట ఒక నియమంగానూ, తరువాత అవసరంగానూ నిలబడ టానికి కారణం ఆనాటికి చేతులకు వివిధ రకాలైన ఇతర పనులు ఏర్పడి ఉంటాయని అనుకోవాలి. వానరాలు ఆహారాన్ని స్వీకరించడానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి చేతులను ఉపయోగిస్తాయి. కొన్ని రకాల క్రింది తరగతి స్తన్య జంతువులలో కూడా ముందు పంజాలను ఉపయోగించడం మనం చూస్తాం. చాలా రకాల కోతులు తాము చెట్ల మీద నివసించడానికై గూళ్ళను నిర్మించడానికి చేతులను ఉప యోగిస్తాయి. చింపాంజీలు తమ చేతులతో చెట్ల కొమ్మల మధ్య కప్పులు చేసుకొని ఎండ వానల నుండి కాపాడుకుంటాయి. శత్రువుల నుండి ఆత్మ రక్షణకై ఇవి చేతులతో కర్రలను, కొమ్మలను పట్టుకొని కొట్టడానికి పూనుకొంటాయి. బోనుల్లో ఉంచిన కోతులు మానవులను చూచి నేర్చుకున్న అనేక చిన్న చిన్న పనులను తమ చేతులతో చేయగలవు. కానీ మానవునికెంతో సన్నిహితమైన దశకు చేరుకున్న వానరుని చేతినీ, అనేక లక్షల సంవత్సరాల కర్మల వల్ల అభివృద్ధి నొందిన మానవుడి చేతిని చూస్తే ఎంతో భేదం కనబడుతుంది. కండ రాల సంఖ్య ఒక్కటే, నిర్మాణం కూడా ఒక్కటే. అయినా ఎంతటి నికృష్టస్థితిలోని ఆటవికుడైన మానవుని హస్తం కూడా ఎంతో అభివృద్ధి చెందిన వానర హస్తం చేయలేని వందలాది పనులను అలవోకగా చేస్తుంది. వానర హస్తం ఏ చిన్న రాతి పనిముట్టును ఎంత బండగా నైన చేసి ఎరుగదు. భారతదేశంలోని భౌతికవాద చింతన అన్ని కీలక పరిణామాల్లో ప్రధాన శక్తిగా నిలిచింది. మానవ జాతి ప్రతి అడుగులో తన అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని నిలుపుకొంటూ ముందుకు నడిచింది. ఈ భౌతిక దృక్పథంతో కూడిన మానవ ప్రయాణానికి భావవాదం ఒక పెద్ద అవరోధంగా నిలిచింది. మానవ ప్రగతిలో అసమానతలు సృష్టించింది. చరిత్ర పరిణామ క్రమంలో మానవ సమాజాన్ని సమన్వయించడాన్ని మార్క్స్ గతి తార్కిక చారిత్రక భౌతికవాద దృక్పథం అన్నాడు. ఈ క్రమంలో భారత సమాజాన్ని పరిశీలిస్తే చార్వాకులు భారత ఉత్తరఖండంలో భౌతిక సిద్ధాంత కర్తలుగా మన ముందు నిలుస్తారు. వారికి ఎదురు నిలిచిన వైదికులు భావ వాదానికి కొమ్ము కాసిన ప్రతినిధులు అయ్యారు. వేద వాఙ్మయానికి ప్రత్యామ్నాయంగా భారతీయ భౌతికవాదంగా చార్వాకవాదం ముందుకొచ్చింది. భారతీయ భౌతికవాదాన్ని సాంఖ్యదర్శనం ముందుకు తీసుకువెళ్ళింది. ఈ సాంఖ్య శాస్త్రానికి మూల పురుషులు కపిలుడు, అసురీ, పంచశిఖుడు, ఈశ్వర కృష్ణుడు. ఈశ్వర కృష్ణుని 26 మంది గురుతరాల నుండి ఈ సాంఖ్యం బోధింపబడినట్లు చెప్పబడింది. ఒక్కొక్క గురువు నుండి మరొక గురువు తరానికి 30 సంవత్సరాల అంతరం ఉందని అనుకుంటే, 780 సంవ త్సరాల అంతరం కపిలుడికీ, ఈశ్వర కృష్ణుడికీ ఉంది. దీనిని బట్టి కపిలుడు క్రీ.పూ.7, 8 శతాబ్దాల వాడై ఉండవచ్చునని చరిత్రకారుల అంచానా. బుద్ధుడి మీద కూడా సాంఖ్య ప్రభావం ఉందనేది స్పష్టం. బుద్ధుడు క్రీ.పూ. 6వ శతాబ్దం వాడనుకుంటే సాంఖ్య సిద్ధాంతం అప్పటికే ప్రాచుర్యం పొంది ఉంది. దీనినిబట్టి కూడా కపిలుని సాంఖ్య శాస్త్రం క్రీ.పూ. 8 శతాబ్దిదని అనుకోవచ్చు. ఇకపోతే సమాజ నిర్మాణానికి సంబంధించిన మూలాలను అధ్య యనం చేయకుండా, సమాజ వ్యవస్థను ఉన్నదున్నట్లుగా అంగీకరించడం యధాతథవాదం. అది మార్పును అంగీకరించని వాదం. మార్పునకు భావజాలం ఒక చోదకశక్తి. దళితుల చరిత్ర నిర్మాణంలో హేతువాదమే కీలకం అవుతుంది. బి.ఆర్. అంబేడ్కర్ హేతువాద దృక్పథంతోనే సామాజిక చరిత్ర నిర్మాణంలోని చిక్కుముడులను విప్పారు. కానీ లిఖిత పరమైన ఆధారాలు లేవని వీరి చరిత్రను మనువాదులు నిరాకరిస్తారు. భారతదేశంలో మనువాదం ఉత్పత్తికి భిన్నమైనది. జీవిక కోసం సృష్టించిన ఆ«ధ్యాత్మిక కల్పన వాదం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి చివరికి దేశ చరిత్రను గజిబిజి చేసింది. అనేక వైరుద్ధ్యాలు, ప్రక్షిప్తాలతో కూడిన సాహిత్యంలో తాత్విక అంశాలు, చారిత్రక అంశాలు మృగ్యమైనాయి. ప్రజలు ఎల్లప్పుడు రాజకీయాల్లో వంచనకు, ఆత్మ వంచనకు తెలివి తక్కువగా బలి అవుతూనే ఉన్నారు. అన్ని నైతిక, మత, రాజ కీయ, సాంఘిక పదజాలాల ప్రకటనల వెనుక ఏదో ఒక వర్గపు ప్రయోజనాలు దాగివున్నాయనే విషయాన్ని గ్రహించేంత వరకు వారలా బలి అవుతూనే ఉంటారు. ప్రతి పురాతన సంస్థ అది ఎంత అనాగరికమైనదిగా, కుళ్ళిపోయినదిగా కనబడినప్పటికీ పాలక వర్గాలకు చెందిన కొన్ని శక్తులచే అది నిలబెట్టబడుతోంది. ఈ విషయాన్ని గ్రహించనంతవరకూ సంస్కరణ వాదులు, అభివృద్ధి కాముకులు పాత వ్యవస్థను సమర్థించే వారి చేత మోసగించబడుతూనే వుంటారు. ఆ వర్గాల ప్రతిఘటనను పటాపంచలు చేయడానికి ఒకే ఒక మార్గం వుంది. అదేమిటంటే మన చుట్టూ ఉన్న సమాజంలోనే పాతను తుడిచి వేసి కొత్తను సృష్టించే సామర్థ్యం కలిగివున్న శక్తులను విజ్ఞానవంతులను చేసి సంఘటిత పర్చడం. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695 -
కుటుంబం దివాళా.. ఓ కుర్రాడి అష్టకష్టాలు! ప్రముఖ సీఈవో ‘ఫిలాసఫీ’ కథ
అప్పటివరకూ విలాసవంతంగా గడిపిన కుటుంబం అనుకోని కారణాలతో దివాళా తీస్తే ఆ ఇంట్లోని కుర్రాడు కుటుంబం కోసం డెలివరీ బాయ్‌గా, డీటీపీ ఆపరేటర్‌గా ఇలా చిన్నాచితకా పనులు చేస్తూ అష్టకష్టాలు పడ్డాడు. ఏదో సినిమా కథలా ఉంది కదూ.. కానీ ఇది రియల్ స్టోరీనే.. ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్ (CRED) సీఈవో ‘ఫిలాసఫీ’ కథ ఇది.. క్రెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ షా (Kunal Shah) తన కుటుంబం దివాళా తీసినప్పుడు డెలివరీ ఏజెంట్‌గా, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేయవలసి వచ్చింది. తనకు తెలిసిన ఈ చేదు గతాన్ని ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిఖ్‌చందానీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తలు ఢిల్లీలోని ఒక కాఫీ షాప్‌లో ఇటీవల కలుసుకున్నప్పుడు కునాల్ షా చిన్నతనంలో పడిన కష్టాలను సంజీవ్ బిఖ్‌చందానీ తెలుసుకున్నారు. ఆసక్తికర ‘ఫిలాసఫీ’! సంజీవ్ బిఖ్‌చందానీ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో ఇలా షేర్ చేశారు.. “ఢిల్లీలోని ఒక కాఫీ షాప్‌లో కునాల్ షాతో కలిసి కూర్చున్నాను. ఐఐటీ, ఐఐఎం ఫౌండర్ల ప్రపంచంలో అతను ముంబైలోని విల్సన్ కాలేజీ నుంచి ఫిలాసఫీ గ్రాడ్యుయేట్. అతను ఫిలాసఫీనే ఎందుకు చదివాడు.. 12వ తరగతిలో వచ్చిన మార్కులు అతనికి ఆ సబ్జెక్ట్‌లో మాత్రమే అడ్మిషన్ ఇచ్చాయా లేదా ఫిలాసఫీపై నిజంగా ఆసక్తి ఉందా అని అడిగాను. కానీ ఇవేం కాదని, కుటుంబం దివాళా తీయడంతో డెలివరీ బాయ్‌గా, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేయాల్సి వచ్చిందని అతను చెప్పాడు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకే తరగతులు ఉండే ఏకైక సబ్జెక్ట్ ఫిలాసఫీ కావడమే కారణం అన్నాడు. సెల్యూట్.” Sitting with Kunal Shah at a coffee shop in Delhi. In a world of IIT IIM Founders he stands out as a philosophy graduate from Wilson College in Mumbai. I asked him why he studied philosophy - is it that his marks in Class 12 only gave him admission in that subject or was it out… — Sanjeev Bikhchandani (@sbikh) February 2, 2024 తన కుటుంబం క్లిష్ట ఆర్థిక పరిస్థితి గురించి కునాల్ షా ఇదివరకే తెలియజేశారు. కుటుంబం కోసం తాను చిన్న వయసు నుంచే పనిచేయడం, సంపాదించడం ప్రారంభించాల్సి వచ్చిందని చెప్పారు. 16 సంవత్సరాల వయసు నుంచే తాను చిన్నాచితకా పనులు చేస్తూ సంపాదించడం మొదలు పెట్టానని, సీడీలను పైరసీ చేయడం, సైబర్ కేఫ్ నడపడం వంటి పనులు సైతం చేసినట్లు కునాల్ షా వెల్లడించారు. తన కంపెనీ ఫిన్‌టెక్ లాభదాయకంగా మారే వరకు తాను నెలకు కేవలం రూ.15,000 జీతం తీసుకుంటానని కూడా చెప్పారు. -
సూపర్ ఫిలాసఫీ చెప్పిన హీరో నాని..!
-
మంచి మాట.. నేను ఎవరు?
ప్రతి ఒక్కరూ నేను నేను అంటుంటారు. అసలు ఈ నేను ఎవరు? నేనులు ఎన్ని ఉన్నాయి. ఈ నేను లు అన్నీ ఒకటేనా? ఇల్లు నాది అన్నాం.. నేను ఇల్లా..? కాదు గదా..! నా వాహనం, నా భూమి, నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య అన్నాం.. మరి ఇవన్నీ నేను కాదు గదా..! అలాగే నా శరీరం అన్నప్పుడు శరీరం నేనెలా అవుతాను..? నా మనస్సు అన్నప్పుడు నేను మనస్సునెలా అవుతాను.. శరీరం కన్నా, మనస్సు కన్నా నేను వేరుగా ఉండి ఉండాలి గదా..! ఎవరా నేను..? నిజానికి అన్ని నేనులు కలిసి నేనైన నేనే నేను. అదే ఆత్మ... అంటే నేను ఆత్మను అని తెలుసుకోవాలి. ఈ హోదాలు వారి వత్తిని చూపిస్తాయి. అది అంతవరకే ఉండాలి. ‘అహంభావము’ ‘అహంకారం’ అని రెండు రకాల పదాలు సాధారణంగా వాడుతూ వుంటాము. ఈ రెండూ ఒకే అర్థం కలిగినవి కావు. నేను కాని దాన్ని నేననుకోవడం అహంకారం.. ఇది నాది అనుకుంటే హక్కు ఉనట్టు, నాకు మటుకే సొంతం అనుకుంటే స్వార్ధం ఉన్నట్టు, నేను చేయగలను అనుకుంటే ఆత్మ విశ్వాసం, నేనే చేస్తున్నాను నేను మటుకే చేయగలను అనుకుంటే అహంకారం, ఈ నేను అనేది దైవం చేతనే నడిచేది నడిపించేది కూడా ఆ శక్తే, అయితే ఆలోచనాశక్తి ని బుద్దిని మానవునికే అప్పగించింది దైవం. ఎందుకంటే ఆ ఆలోచన విధానమే నీ స్థాయిని ఇహపర లోకాలలో నిర్ణయిస్తుంది.. నీ ఆలోచనా విధానంలో సత్యం న్యాయం ధర్మం ఉంటే నీ బుద్ధికి తగట్టు ఆ దైవం నీకు తోడు గా నడుస్తుంది, అదే బుద్ధి అహంకారంతో నిండిపోయి నేను రాక్షసుడిగా జీవిస్తానా, లేక మానవుని గానా లేక దేవుని గా జీవిస్తానా అనేది ఈ నేను అనే నేను నిర్ణయించుకోవాలి. రాక్షసుడు, దేవుడు అనే వారు ఎక్కడో లేరు మన జీవన విధానం లోనే ఉన్నారు. మానవుడు తన స్థాయి తగ్గించుకుని జీవిస్తే అదే రాక్షసుడు. మానవుడు తన కంటే ఉన్నతమైన లక్ష్యాలతో జీవిస్తే అతనే భగవంతుడు. చివరికి మానవుడు మన జీవన విధానంలోనే ఉన్న దేవుని వదిలి ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు ఈ జీవితం ఎన్నో జన్మల పుణ్యం జీవితం అంటే జీవించడానికే. జీవించడమే గొప్ప సాధన. సరిగ్గా జీవిస్తే మానవత్వం వెల్లివిరుస్తుంది. గొప్పగా జీవిస్తే దివ్యత్వం కనిపిస్తుంది. జీవించడంలో ఉండే మాధుర్యాన్ని ముందుగా తెలుసుకోవాలి. జీవన సౌందర్యంలో ఉండే తాత్వికతను గుర్తించాలి. ఆటుపోట్లతో, హెచ్చు తగ్గులతో, సుఖ దుఃఖాలతో ఎలాంటి జీవితం వచ్చినా తలవంచుకుని అనుభవించాలి. నేల విడిచి సాము చేసినట్లు జీవితాన్ని గాలికి వదిలెయ్యకూడదు. జీవితంతో చక్కటి ప్రయాణం చేస్తే సాధన శిఖరాలకు చేరినట్లే. ‘ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లు పదిమంది జీవితాల్లో కాంతిని నింపాలి. అంతకంటే మనిషికి సార్థకత లేదు’ ఈ సత్యం తెలుసుకున్న మానవుడు చివరికి ఇలాంటి పనులకే పూనుకొంటాడు.. పూనుకోవాలి. ఆధ్యాత్మిక జీవితం అనేటప్పటికి సాధనలమయం అనే భావన ఉంది. పుట్టుక నుంచి మరణం వరకు మంచి పనులే సాధన. ఏం చేస్తున్నామో ఎరుకతో చేస్తే అంతా అద్భుతమైన సాధన. లేకపోతే బతుకే అయోమయం. జంతువు, పురుగు, పక్షి, పాము, చెట్టు... అన్నీ స్వార్థం లేక జీవిస్తున్నాయి. మరి మనమెందుకిలా? నేను అనేది లేకుండా హాయిగా జీవించలేకపోతున్నాం..? బుద్ధి కలిగి ఉండటం మనిషికి వరం, శాపం కూడా. చిన్న ‘నేను’ నుంచి పెద్ద ‘నేను’ వరకు సాగే అతిపెద్ద జీవనమే అత్యంత అద్భుతమైన సాధన. చిన్న నేను అర్జునుడు. పెద్ద నేను శ్రీ కష్ణుడు. అతి పెద్ద జీవనం కురుక్షేత్ర యుద్ధం. ఇది అర్థమైతే అదే అత్యంత అద్భుతమైన సాధన. శ్రీరాముడు మనిషిగా జీవించి తన కర్తవ్యం నిర్వహించి, దేవుడిగా పేరు తెచ్చుకున్నాడు. జీవితం అవకాశం ఇస్తుంది. దాన్ని సద్వినియోగ పరుచుకోవాలి. కారణజన్ముడికైనా, సాదారణ జన్ముడికైనా బాధలు, కష్టాలు ఒకటే. విధిరాత మారదు. జీవితాన్ని భయపెట్టేవాడికి జీవితమే భయపడుతుంది. మనలో ఉండే అద్భుతమైన, అసాధారణమైన, అసామాన్యమైన గుణగణాలు చూసి లోకం మోకరిల్లుతుంది. అసలు ఈ శరీరం నాదని, మనస్సు నాదని, బుద్ధి నాదని, ఎలా తెలుసుకుంటున్నాం? ఆత్మవల్లనే తెలుసుకుంటున్నాం. నాది అనే వస్తువుకు, నాకు మధ్య సంబంధం ఏమిటి? హక్కుదారుకు, వస్తువుకు మధ్య ఉండే సంబంధం. ఇది నా ఇల్లు అంటే నేను ఇల్లు కాదు. ఇంటి హక్కుదారును. నావి అంటే అవన్నీ నేను కాదు. వాటి హక్కుదారును మాత్రమే. మరి హక్కుదారైన నేనెవరిని..? ఈ నేను కాస్త నాది, నాకు అనే స్వార్థంతో ఉంది. హోదాలతో కూడిన పేర్లన్నీ అహంకారంతో కూడుకున్నవే. – భువనగిరి కిషన్ యోగి -
వ్యర్థంలోని అర్థం
అవసరానికి వస్తువును ఉపయోగించుకోవడం, అవసరం తీరాక దాన్ని పారేయడం పరిపాటి. జరగాల్సిందే జరుగుతున్నప్పుడు మరీ చర్చలెందుకు? పని జరగడానికీ, జరిగించడానికీ యోచన కావాలి. యోచించే అవసరాన్ని, జరుగుతున్న తప్పిదాల్ని చెప్పేదే ఈ కథ. వెంకటస్వామి వ్యవసాయాన్ని భూమిని నమ్ముకుని బతికిన మనిషి. కష్టాలైతే పడ్డాడు గాని బతుకు సాగిపోయింది. కుటుంబాన్ని ఈడ్చుకొచ్చాడు. వయసు ముదిరింది. పనిచెయ్యడానికి శరీరం సహకరించడం లేదు. అయినా కుటుంబాన్నిసాకుతున్నాడు. రోజులు గడిచేకొద్దీ పనిచెయ్యలేక, పొలానికి పోలేక ఇంటిపట్టునే వుండిపోతున్నాడు. గత కొద్ది నెలలుగా తండ్రి పనీపాట చెయ్యకుండా, ఇంటిపట్టునే వుండిపోవడం, తండ్రివల్ల కుటుంబానికి ఏ ఉపయోగం లేకపోవడం కొడుకు వీరబాబు సహించలేకపోయాడు. ఇక లాభం లేదనుకుని మంచి శ్రేష్టమైన కర్రతో శవపేటికను తయారు చేయించాడు. ఒకరోజు తండ్రిని పిలిచి ఆ పేటికలో దిగమన్నాడు. తండ్రి పేటికలో దిగిన తర్వాత పేటిక మూతవేసి, దానిని చాల ఎత్తయిన ప్రదేశానికి తీసుకొని పోయి, ఆ ప్రదేశపు చివర అంచున ఉంచాడు. దానిని ఆ ఎత్తయిన ప్రదేశం నుంచి లోయలోకి తోసెయ్యడానికి సిద్దపడుతున్న సమయంలో పేటిక లోపలనుంచి టక్ టక్ మని శబ్దం వినిపించింది. ఆ శబ్దం విన్న కొడుకు పేటిక పైకప్పు తెరచి చూశాడు. తండ్రి కొడుకు వైపు చూస్తూ ‘‘నాయనా! ఈ పేటికతో సహా నన్ను లోయలోకి తోసెయ్యాలని అనుకుంటున్నావు కదా.... నీకు నచ్చినట్టే చెయ్యి... అయితే నాదొక చిన్నమాట వింటావా?’’ అన్నాడు. ఏంటో చెప్పమని విసుక్కున్నాడు కొడుకు. ‘‘నేనెలాగూ పనికిరాని వస్తువనుకుంటున్నావు. నావల్ల ఏ ఉపయోగం లేదనుకుంటున్నావు. మంచిదే. కాని నువ్వు పేటికను మంచిశ్రేష్టమైన కర్రతో చేయించావు. దాన్నెందుకు పాడుచేస్తావు? అది విలువైన వస్తువు కదా! దాన్ని దాచి వుంచితే రేపటి రోజున నీ కొడుకులు ఉపయోగించడానికి పనికొస్తుందికదా!’’ అని అన్నాడు. కొడుక్కి ఆ మాటలు అర్థమై, కళ్లవెంబడి గిర్రున నీళ్లు తిరిగాయి. వెంటనే తండ్రిని భుజాల మీద ఎక్కించుకుని ఇంటికి తీసుకుని వెళ్లి, ఆయన జీవించినంత కాలం చక్కగా చూసుకున్నాడు. – డా. విశ్వేశ్వరవర్మ భూపతిరాజు -
మూర్తీభవించిన మానవతా వాది భగవద్రామానుజులు
సమాజంలో అశాంతి, అల్లకల్లోల భావాలు ప్రజ్వరిల్లుతున్నవేళ ధర్మపథాన్ని చూపేందుకు, జాతి యావత్తునూ ఏకతాటిపై తెచ్చేందుకు ఓ వెలుగు రేఖ ఉద్భవించింది. అష్టాక్షరీ మంత్రాన్ని గాలి గోపురమెత్తి చాటింది. అజ్ఞాన తిమిరాన్ని సంహరించి జ్ఞానమార్గాన్ని చూపింది. ఆ కాంతి కిరణమే ‘భగవద్రామానుజాచార్యులు’. నేటియుగంలో చెప్పుకుంటున్న సహజీవన, సమభావన, సమతావాదాలను ఆనాడే ప్రతిపాదించారు. మూర్తీభవించిన సమతా, మానవతావాదిగా కీర్తిగాంచారు. తరతరాలకి ఆదర్శం... విశిష్టాద్వైత సిద్ధాంత నిరూపణతోపాటు సర్వమానవాళిని చైతన్యపరిచేందుకు సహజ– సమభావాలతో ధార్మిక బోధనలు చేస్తూ ఆదర్శమూర్తిగా నిలిచారు. జ్ఞానమార్గంతోపాటు భక్తిమార్గంపై విస్తృత ప్రచారం చేశారు. ధర్మానుష్ఠానంతో జ్ఞానం, సామాజిక న్యాయదృష్టితో చేసే కర్మద్వారా జీవితం సార్థకమవుతుందని ఉద్బోధించారు. వీరి తరువాత దేశంలో బయలు దేరిన అనేక ఉద్యమాలపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రామానుజులవారి ప్రభావం ఉండటం వీరి భావోన్నతికి తార్కాణంగా నిలుస్తోంది. సిసలైన శ్రీ భాష్యకారుడు... వేదాంతంలో ఎంతో క్లిష్టమైనటువంటి బ్రహ్మసూత్రాలకు రామానుజులు రాసిన శ్రీభాష్యం అత్యంత ప్రసిద్ధిపొందింది. అలాగే వేదాంతసారం, వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, శరణాగత గద్యం మొదలైన గ్రంథాలు రచించి విశిష్టాద్వైతాన్ని, వేదాంత సాహిత్యాన్ని దేశమంతటా ప్రచారం చేయడానికి పూనుకున్నారు. సాఫల్యం సాధించారు. ఏడుకొండలవాడి పాద సేవ... జ్ఞానం, కర్మ అనే రెండు మార్గాలను తనలోఇమడ్చుకునిసాగే భక్తిమార్గాన్నిఎంచుకున్నారు రామానుజులు. ఇది తదనంతరకాలంలో గొప్ప చారిత్రక పరిణామాలకు కారణమైంది. కేవలం పాండిత్యం, జ్ఞానం ఉన్నవారికే దైవం సాక్షాత్కరిస్తుందనే భావనను తొలగించేందుకు అడుగులు వేశారు రామానుజులు. అవశ్యం... ఆచరణీయం అణుమాత్రమైనా మినహాయింపు లేకుండా త్రికరణ శుద్ధిగా తనను తాను భగవంతునికి అర్పించుకోవాలి. అటువంటి వారికి భగవంతుడు ప్రసన్నుడై సాయుజ్యాన్ని ప్రసాదిస్తాడన్న రామానుజులు వారి మాటలు అవశ్యం ఆచరణీయం. ఆ మహానుభావుడు జన్మించి 1002 సంవత్సరాలు గడిచినా ఆయన ఏర్పాటు చేసిన రహదారిపై ధర్మరథం ఈనాటికీ పరుగులు పెడుతూనే ఉంది. – అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని,వేదపండితులు -
పిల్లల పెంపకం పరీక్షే!
చాలా మంది అనుకుంటుంటారు మన పిల్లలు మన బాధ్యత అని. కానీ కేవలం బాధ్యత కాదు అంటున్నారు షారుక్. మరేంటి? అంటే... మన సామర్థ్యానికి కొలమానం అట. పేరెంటింగ్ (పిల్లల పెంపకం) గురించి షారుక్ తన ట్వీటర్ అకౌంట్లో రాసుకొస్తూ – ‘‘మన పిల్లలు మన రెస్పాన్సిబులిటీ (బాధ్యత) కాదు. మన సామర్థ్యానికి కొలమానం. కొంత మంది ఎప్పుడూ ‘మా పిల్లలు అల్లరి చేస్తూ బాగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు’ అని ఫిర్యాదు చేస్తుంటారు. కానీ నేనేమంటానంటే.. దాన్ని అలా చూడకుండా ఆ ఇష్యూస్‌ని మన సామర్థ్యానికి పరీక్ష లాగా భావించాలి. ఆ అల్లరి ఎందుకు చేస్తున్నారు? తిరిగి అల్లరి చేయకుండా మనం ఏం చేయాలి? అనేది మన కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. అంతే కానీ పిల్లలని నిందించడం సరి కాదు. మనకి ఉన్న ఎనర్జీ కంటే మనం ఇంకా ఎక్కువ చేయగలం అని చెప్పడానికి అదో టెస్ట్. మన పిల్లలు మన సామర్థ్యం అవ్వాలి కానీ మన బాధ్యత మాత్రమే కాదు’’ అని పేరెంటింగ్ టిప్స్ ఇచ్చారు. -
ముండకోపనిషత్తు ప్రాణస్వరూపం పరమాత్మే!
భారతీయ వేదాంతానికి మణిదీపాల వంటి మంత్రాలు తృతీయ ముండకంలో ఉన్నాయి. ఒక చెట్టు మీద స్నేహంతో కలసి వుండే రెండు పక్షులు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆ పిప్పలి చెట్టు పళ్లు తింటోంది. మరొక పక్షి ఏమీ తిన కుండా చూస్తూ కూర్చుంది. మొత్తం వేదాంతం రెండు పక్షుల రూపంలో సూక్ష్మంగా చెప్పబడింది. ఒక పక్షి జీవాత్మ. అది ఐహిక దృష్టితో దైవచింతన లేని మోహంతో దుఃఖిస్తోంది. దాని పక్కనే అదే చెట్టు మీద ఉన్న రెండోపక్షి పరమాత్మ. మహిమాన్వితమైన పరమాత్మను చూస్తూ జీవాత్మ దుః ఖాన్ని పోగొట్టుకుంటోంది. పరమాత్మను దర్శించిన విద్వాంసుడు పాపపుణ్యాలకు అతీతుడై అతణ్ణి చేరుకుంటున్నాడు. అన్ని ప్రాణులలోని ప్రాణస్వరూపం పరమాత్మే. దీనిని తెలుసుకున్నవాడు పండితుడై మౌనంగా ఉంటున్నాడు. నిరంతరం ఆత్మతత్త్వంలో క్రీడిస్తూ, ఆనందిస్తూ క్రియాశీలియై బ్రహ్మవేత్తలతో శ్రేష్ఠుడు అవుతున్నాడు. శౌనకా! సత్యం, తపస్సు, సమ్యక్ జ్ఞానం, బ్రహ్మచర్యంతో ఆత్మను తెలుసుకోవచ్చు. దోషరహితులైన యోగులు శుభ్రమూ, జ్యోతిర్మయమూ అయిన పరమాత్మను శరీరంలోనే చూడగలుగుతారు. సత్యమే జయిస్తుంది. అసత్యం గెలవదు. సత్యంతోనే దేవయానమార్గం ఏర్పడుతోంది. ఋషులు, కోరికలను జయించిన సత్పురుషులు ఈ మార్గం ద్వారానే పరమపథానికి చేరుకుంటున్నారు. ఆ పరబ్రహ్మం దివ్యకాంతితో ఊహకు అందని రూపంతో సూక్ష్మాతి సూక్ష్మంగా, దూరాతిదూరంగా ఉంటుంది. హృదయగుహలో దాగిన ఆ పరబ్రహ్మాన్ని యోగులు తమలోనే చూడగలరు. దానిని కళ్లతో చూడలేరు. వాక్కుతో వర్ణించలేరు. ఇంద్రియాలతో, తపస్సుతో, యజ్ఞయాగాది కర్మలతో గ్రహించలేరు. జ్ఞానంతో పరిశుద్ధుడై ధ్యానించేవాడు నిరాకారమైన పరబ్రహ్మను చూడగలుగుతాడు. అదే ఆత్మ సాక్షాత్కారం. పంచప్రాణాలతో ఉన్న శరీరంలో అణురూపంలో ఉన్న ఆత్మను మనసుతో తెలుసుకోవచ్చు. మానవుల మనస్సును ఇంద్రియాలు గట్టిగా చుట్టుకొని ఉన్నాయి. నిగ్రహంలో ఇంద్రియాలనుండి మనస్సును వేరు చేస్తే స్వచ్ఛమైన మనస్సులోని ఆత్మ సాక్షాత్కరిస్తుంది. పరిశుద్ధ మనస్కుడైన ఆత్మజ్ఞాని ఏ లోకాలను కోరుకుంటే ఆ లోకాలను పొందుతాడు. కోరికలన్నీ నెరవేరతాయి. కనుక ఆధ్యాత్మిక సంపద కోరుకునేవారు ఆత్మజ్ఞానం కలిగిన మహాత్ములను ఆశ్రయించి, అర్చించాలి. ద్వితీయ ఖండం శౌనకా! ఆత్మజ్ఞాని మాత్రమే దివ్యమూ, కాంతిమంతమూ, విశ్వద్యాప్తమూ అయిన పరంధామాన్ని తెలుసుకుంటాడు. అటువంటి బ్రహ్మజ్ఞుడైన గురువును ఏ కోరికా లేకుండా ఉపాసించినవారు జనన మరణ చక్రం నుండి బయటపడతారు. ఇంద్రాయసుఖాలకోసం ఆరాటపడేవారు ఆ కోరికలు తీరేవారికి మళ్లీమళ్లీ పుడతారు. ఆత్మజ్ఞానంతో కోరికలను ఆత్మలో లీనం చేసినవారి కోరికలు నశించిపోతాయి. నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహుదా శ్రుతేన ఊకదంపుడు ఉపన్యాసాలతో, మేధాశక్తితో, శాస్త్రాధ్యయనంతో ఆత్మజ్ఞానం కలగదు. ఎవరు ఆత్మసాక్షాత్కారాన్ని సంపూర్ణంగా కోరుకుంటారో వారికి ఆత్మదర్శనం అవుతుంది. తన స్వరూపాన్ని ఆత్మ స్వయంగా వివరిస్తుంది. దృఢసంకల్పం లేకుండా అజాగ్రత్తగా, మిడిమిడి జ్ఞానంతో తపస్సు చేసే వారికి ఆత్మజ్ఞానం కలగదు. మనోబలం, శ్రద్ధ, ఆత్మజిజ్ఞాస సంపూర్ణంగా సాధన చేసే వాని ఆత్మ మాత్రమే పరబ్రహ్మలో లీన మౌతుంది. ఆత్మదర్శనాన్ని పొందిన ఋషులు జ్ఞానతప్తులై రాగద్వేషాలు లేనివారు, ప్రశాంత చిత్తులు, పరమాత్మ స్వరూపులు అవుతారు. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను అన్ని చోట్లా దర్శించగల ధీరులు, ప్రాజ్ఞులై అన్నిటిలో ప్రవేశించగలుగుతారు. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్న్యాసయోగార్యతయః శుద్ధ సత్త్వాః తే బ్రహ్మ లోకేషు పరాంతకాలే పరామృతాఃపరిముచ్చంతి ధీరాః సన్న్యాసులు ఎక్కడ కనపడినా నమస్కరించాలి. వెంటనే ఈ మంత్రాన్ని చదవటం సంప్రదాయం. భారతీయ వేదాంతానికి, ముండకోపనిషత్తుకు ఇది ప్రాణం లాంటిది. వేదాంత విజ్ఞానాన్ని స్పష్టంగా తెలుసుకున్నవారు యతులై, శుద్ధసత్త్వులై సన్న్యాసయోగాన్ని పొందుతారు. బ్రహ్మలోకానికి చేరి మోక్షాన్ని పొందుతారు. అప్పుడు వారి పదిహేను కళలు వాటి స్థానాలకు చేరుకుంటాయి. ఇంద్రియాలు పంచభూతాలలో కలిసిపోతాయి. కర్మలు, జీవాత్మ పరబ్రహ్మలో లీనమైపోతాయి. బ్రహ్మజ్ఞానం వల్ల శోకం, పాపాలు నశిస్తాయి. హృదయంలోని ముడులు విడిపోతాయి. విముక్తుడైనవాడు అమృతత్త్వాన్ని పొందుతాడు. శౌనకా! శ్రద్ధగా కర్మలు చేసేవారు, వేదాధ్యయనం చేసేవారు, శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులు, ‘ఏకర్షి’ అయిన అగ్నికి ఆహుతులు ఇచ్చేవారు, యధావిధిగా ‘శిరోవ్రతాన్ని’ ఆచరించేవారు మాత్రమే ఈ బ్రహ్మవిద్య వినడానికి అర్హులు. అటువంటివారికే ఉపదేశించాలి. ఇది సత్యం. దీనిని పూర్వం అంగిరసుడు తన శిష్యులకు నియమబద్ధంగా చెప్పాడు. వ్రతాచరణ లేనివాడు ఈ ముండకోపనిషత్తును వినకూడదు. నమః పరమ ఋషిభ్యోన్నమః పరమ ఋషిభ్యః - డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ వేరువేరు పేర్లు గల నగరాలు సముద్రంలో కలిసి పేర్లను, ఆకారాలను కోల్పోతున్నట్లు విద్వాంసుడు తాను నామరూపాలనుండి విముక్తుడై పరాత్పరుడైన పరబ్రహ్మాన్ని చేరుకుంటున్నాడు. పరబ్రహ్మ తత్వం తెలిసినవాడు పరబ్రహ్మ అవుతాడు. అతని వంశంలో బ్రహ్మజ్ఞానం కలిగిన వారే పుడతారు. -
ఫేస్బుక్ నుంచి నిజం వరకూ...
మెన్‌టోన్ ఈ మధ్య ఫేస్బుక్లో ఎక్కువగా బుక్కయిపోతున్నది మగాళ్లేనని ఓ సర్వే. జుకర్‌బర్గ్ ఏ ముహూర్తాన ఫేస్బుక్ కనిపెట్టాడోగానీ... దానికీ మనదేశానికీ గట్టి బంధమే ఏర్పడింది. మనదేశ జనాభాలో దాదాపు పదిశాతం మంది ఫేస్బుక్ అని పేరున్నా మనవాళ్లు... ముఖ్యంగా అమ్మాయిలు నిజమైన ముఖాలు చూపించడం లేదు. అందుకే, అబ్బాయిలు బుక్కయిపోతున్నామని తెగ బాధపడిపోతున్నారు. అలా ఎలా చేస్తారండీ అంటే... తప్పేముందీ అంటారు. పోనీ మీకు భయమన్నా లేదా అంటే మరో ఫిలాసఫీ. ‘భయానికి అంత విలువ ఎలా వచ్చిందో తెలుసా..? ఈరోజుల్లో ఎదుటివాళ్లకు మనం ఎంత సాయం చేసినా గుర్తుంచుకోరు. అదే, వాళ్లను కోలుకోలేని దెబ్బతీసి భయపెట్టామనుకోండి. జీవితంలో ఎప్పటికీ మరిచిపోరు’ అని బల్లగుద్దిమరీ చెబుతారు. నిజమేనేమో. సాయం అల్పాయుష్కురాలు. కానీ, భయం... దీర్ఘాయుష్మంతుడు. ఏం చేస్తాం... మగాళ్లు భయపెడతారు కదా. భార్యాబాధితులు మాత్రం ఇందుకు కచ్చితంగా మినహాయింపే. సారీ, లేడీస్. ఒక్క అమ్మవారిలో... అదీ ఉగ్రరూపంలో ఉంటే తప్ప ఎవ్వరిలోనూ భయం చూడలేమనేది ఆధ్యాత్మికవేత్తల ఉవాచ. భయం గురించి ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... నిజం నిప్పులాంటిది మరి. అవునవును, నిజం నిప్పు కాబట్టే... అందరూ దాన్ని పట్టుకోలేరు. కాలుతుందని తెలిసి కూడా దాన్నే పట్టుకుని వేలాడ్డానికి మూర్ఖులా మరి. అందుకే, ఎక్కువమంది మంచుముక్కలాంటి అబద్ధాన్ని ఆశ్రయిస్తుంటారు. సో, ఫ్రెండ్స్... ఫేస్బుక్లో అమ్మాయిలు ఒరిజినల్ ముఖాలతో కనిపించడం లేదని బాధపడకండి. ఎవరి పాపాన వాళ్లే పోతారు. మీరు మాత్రం పోకండి. ధైర్యంగా ఉండండి. నిజం తెలుసుకోండి. -
రాజకీయాల్లోకి సమర్థులు రావాలి
పాలిటిక్స్ అంటే ప్రజలు భయపడే పరిస్థితి మారాలి ♦ విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి ♦ పిల్లలపై కెరీర్ లక్ష్యాలను బలవంతంగా రుద్దకూడదు ♦ ఇకపై విద్యార్థులకు క్యారెక్టర్ సర్టిఫికెట్ బదులుగా ఆప్టిట్యూడ్ సర్టిఫికెట్ ♦ 2022 నాటికి అందరికీ నిరంతరాయంగా విద్యుత్ ♦ 'టీచర్స్ డే' కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: 'రాజకీయాలంటే ప్రజలు భయపడుతున్నారు. రాజకీయాలకు అంత చెడ్డపేరు వచ్చింది. రాజకీయాల్లో చేరేవారెవరూ మంచివారు కాదనే అభిప్రాయం ఏర్పడింది. దాంతో మంచివారెవరూ ఈ రంగంలోకి రావడంలేదు. ఈ ధోరణి దేశానికి చేటు చేస్తుంది. ఆ పరిస్థితి మారాలి. రాజకీయాల పట్ల దురభిప్రాయం పోవాలి. అన్ని వర్గాల్లోని మంచి వ్యక్తిత్వం ఉన్న, సమర్థులైనవారు రాజకీయాల్లోకి రావాలి' అని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు ముఖ్యమైన అంతర్భాగమని, తెలివైన, మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం అవసరమని అన్నారు. అలాంటివారు ఎంతమంది రాజకీయాల్లోకి వస్తే.. దేశానికి అంత మంచి జరుగుతుందని పేర్కొన్నారు. నాయకత్వ లక్షణాలను, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలంటూ విద్యార్థులకు సూచించారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజలు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నందువల్లనే ఆ ఉద్యమం అంత శక్తిమంతమైందన్నారు. శనివారం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని పలు పాఠశాలల నుంచి వచ్చిన 800 మంది విద్యార్థులు, 60 మంది ఉపాధ్యాయులతో మానెక్ షా ఆడిటోరియంలో ఆయన ముఖాముఖి నిర్వహించారు. గంటన్నర పైగా వారితో సరదాగా గడిపి, తన వస్త్రధారణ, విద్యార్థి జీవితం తదితరాలపై వారడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. 9 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని పదవి చేపట్టాక విద్యార్థులతో మమేకం కావడం మోదీకి ఇది రెండో సారి. లక్ష్యఛేదనలో విఫలమైతే ఆందోళన చెంది, వెనకడుగు వేయవద్దని ఈ సందర్భంగా మోదీ విద్యార్థులకు సూచించారు. అలాగే, పిల్లల కెరీర్‌కు సంబంధించి తమ సొంత లక్ష్యాలను పిల్లలపై రుద్దొద్దంటూ తల్లిదండ్రులకు హితవు చెప్పారు. ‘పాఠశాలను వదిలివెళ్లే సమయంలో పిల్లలకు నడవడిక సర్టిఫికెట్లు ఇస్తుంటారు. వాటికి బదులు, వారి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఆప్టిట్యూడ్ సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిందిగా మానవ వనరుల అభివృద్ధి శాఖకు ఆదేశించాను’ అన్నారు. ఆ సర్టిఫికెట్లలో విద్యార్థుల క్రమశిక్షణ, స్నేహపాత్రత మొదలైన వివరాలుంటాయన్నారు. వాటిని 3 నెలలకు ఒకసారి స్నేహితులు, ఉపాధ్యాయులు, తల్లితండ్రుల నుంచే సేకరించేలా త్వరలో సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ వివరాల ద్వారా విద్యార్థి తన వాస్తవ సామర్ధ్యాన్ని తెలుసుకునే, అవసరమైతే తన నడవడికను మార్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. టీచర్స్ డే సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్మారక నాణాన్ని మోదీ విడుదల చేశారు. కళల్లో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు 'కళా ఉత్సవ్' వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. చెంబు ఇస్త్రీ.. చాక్‌పీస్ పాలిష్..: 'అందరూ అనుకుంటున్నట్లు నా దుస్తులను రూపొందించేందుకు ప్రత్యేక ఫ్యాషన్ డిజైనర్ ఎవరూ లేరు. నాకు ప్రత్యేక డ్రెస్ డిజైనర్ ఉన్నారన్నది అపోహ మాత్రమే. సింపుల్‌గా డ్రెస్ చేసుకోవడం నాకిష్టం' అని మోదీ పేర్కొన్నారు. 'మీ కుర్తా చాలా ఫేమస్ కదా!' అన్న విద్యార్థుల వ్యాఖ్యపై.. ‘గుజరాత్ వాతావరణం కాస్త వేడిగా ఉంటుంది. అందువల్ల కుర్తా, పైజామా ధరించడం అలవాటు చేసుకున్నా. మా కుటుంబానిది చాలా సాధారణ ఆర్థిక నేపథ్యం. నా బట్టలు నేనే ఉతుక్కునేవాడిని. పూర్తి చేతుల చొక్కా ఉతకడానికి ఎక్కువ సమయం పడ్తుంది కాబట్టి కుర్తా చేతుల్ని భుజాల వరకు కత్తిరించి, హాఫ్ స్లీవ్స్ కుర్తాగా మార్చుకున్నా. నాకు నీట్‌గా ఉండటం ఇష్టం. నా దుస్తులను బయట ఇస్త్రీ చేయించుకునేందుకు డబ్బులు ఉండేవి కాదు. అందువల్ల చెంబులో నిప్పులను వేసి, దాంతో ఇస్త్రీ చేసుకునేవాడిని. బూట్లను తెల్లగా చేసుకునేందుకు స్కూల్ నుంచి చాక్‌పీస్‌లు తెచ్చుకునేవాడిని' అని నవ్వుతూ అన్నారు. విద్యార్థులే ఉపాధ్యాయుడి గుర్తింపు.. 'విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర. తల్లి బిడ్డకు ప్రాణం పోస్తుంది. కానీ ఆ బిడ్డకు జీవాన్ని ఇచ్చేది గురువే. పిల్లలు తమ టీచర్ చెప్పేది జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. విద్యార్థులే ఉపాధ్యాయుడి గుర్తింపు. ఓ డాక్టర్ ఒక ప్రాణం కాపాడితే, ఆ మర్నాడే పేపర్లలో వస్తుంది. కానీ 100 మంది డాక్టర్లను తయారుచేసే గురువుకు ఏ గుర్తింపూ రాదు. గొప్ప డాక్టర్లు, శాస్త్రవేత్తల వెనుక ఓ గొప్ప ఉపాధ్యాయుడి కృషి ఉంటుంది. టీచర్ల కృషిని గుర్తించి, గౌరవించుకునేందుకే టీచర్స్ డే జరుపుకుంటున్నాం. మాజీ రాష్ట్రపతి కలాం తనను ఒక ఉపాధ్యాయుడిగానే సమాజం గుర్తుంచుకోవాలని కోరుకునేవారు' 'ఎవరెస్టు' పూర్ణ ప్రశ్నతో ప్రారంభం నిజామాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా తాడ్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల 10వ తరగతి విదార్థిని, ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన మాలవత్ పూర్ణ వీడియో కాన్ఫరెన్సులో ప్రధానిని అడిగిన ప్రశ్నతో విద్యార్థులతో ఇష్టాగోష్టి ప్రారంభమైంది. నిజామాబాద్ కలెక్టరేట్ నుంచి పూర్ణ గోష్టిలో పాల్గొంది. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరన్న పూర్ణ ప్రశ్నకు.. 'కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. మా ఊరి లైబ్రరీలో వివేకానంద జీవితం, బోధనలు చదువుకున్నాను. అవి నాపై ప్రభావం చూపాయి. టీచర్లతో సన్నిహితంగా ఉండేవాడిని. మా అమ్మ నన్ను బాగా చూసుకునేవారు. అయినా, ఏ ఒక్క వ్యక్తో మన జీవితాల్ని మార్చేస్తారనుకోవడం సరికాదు. నేర్చుకునే తత్వం ఉండాలి. రైలు ప్రయాణంలోనూ కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటాం' అని జవాబిచ్చారు. అంతకుముందు పూర్ణతో.. 'ఎవరెస్టు పర్వతం దిగివచ్చాక నీతో మిత్రులు ఎలా ఉన్నారు? నీవు చాలా గొప్ప పనిచేశావని, గొప్పదానివయ్యావని దూరంగా వెళ్లలేదు కదా? గొప్పవ్యక్తి కావడంలో గొప్ప కష్టం ఉంది' అంటూ చమత్కరించడంతో నవ్వులు పూశాయి. విద్యార్థులతో మోదీ ముఖాముఖిలోని ముఖ్యాంశాలు.. ► వేరువేరు రంగాల్లోని ఉద్ధండులు విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు కనీసం వారానికి గంట కేటాయించాలి. లేదా ఏడాదికి 100 గంటలు వారికి కేటాయించేలా చూసుకోవాలి. దాంతో బోధనారంగం సృజనాత్మకమవుతుంది. (రాజకీయ నేతలు మాత్రం ఆ పని చేయొద్దు. ఏదో చెప్పాలనుకుని మరేదో బోధిస్తారంటూ చమత్కరించారు) ► మీకిష్టమైన ఆట ఏదని ఓ విద్యార్థి అడగ్గా..ఆర్థిక వనరులు అంతగా లేని కుటుంబం కావడంతో చిన్నప్పుడు ప్రత్యేకంగా క్రీడలపై దృష్టి పెట్టలేకపోయాను. చెట్లెక్కడం బాగా వచ్చు. బట్టలు ఉతుక్కోవడానికి వెళ్లినప్పుడు చెరువులో ఈత కొట్టేవాడిని. అయినా, మా రాజకీయ నేతలు బాగా ఆడే ఆట ఏదో మీకు తెలుసుగా. ► తమ భవిష్యత్తును, జీవిత లక్ష్యాలను నిర్ధారించుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉండాలి. తాము సాధించలేని కెరీర్ లక్ష్యాలను తల్లిదండ్రులు తమ పిల్లలపై రుద్దవద్దు. దానివల్ల డిగ్రీలు, ఉద్యోగాలకే విద్యార్థుల లక్ష్యం పరిమితమవుతుంది. ► అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గుర్తింపును కాపాడుకోవాలి. యోగాతో వ్యక్తి ఉత్తేజితుడవుతాడు. సంవత్సరం మొత్తం మీద జూన్ 21వ తేదీన పగటి సమయం అత్యధికంగా ఉంటుంది, సూర్యరశ్మి ఎక్కువసేపు ప్రసరిస్తుంది. అందుకే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆ రోజు జరుపుకోవాలని నిర్ణయించాం. ► దేశం 75 ఏళ్ల స్వాతంత్య్రవేడుకలు జరుపుకోనున్న 2022 నాటికి అందరికీ 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్ అందించడం నా స్వప్నం, దాన్నే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వ పథకాల అమలుకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అవసరం. ప్రస్తుతం దేశంలో 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. రానున్న 1000 రోజుల్లో ఆ గ్రామాల్లో విద్యుదీకరణ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చాను. ప్రస్తుతం దేశంలో 3 లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్ధ్యం ఉంది. 2015-16 నాటికి 1,137 బిలియన్ యూనిట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాం. ► చాలామంది కవిత్వం రాస్తుంటారు. కవితలు కొందరి కలం నుంచి జాలువారితే, మరి కొందరి కన్నీటి నుంచి వస్తాయి. నా అనుభవాలు, పరిశీలనలనే కాగితంపై పెట్టా. పరిశీలన స్వభావం, ఎక్కువ సమయం ప్రకృతితో కలిసి ఉండడం కవిత్వం రాయడానికి ఉపకరించింది(కవి ఎలా అయ్యారన్న ప్రశ్నకు..) ► వేదిక ఎక్కి ప్రసంగాలు చేసేప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తే ప్రజలు నవ్వితే నవ్వుతారు. ఆందోళన చెందవద్దు. ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. నోట్ చేసుకునే అలవాటు మంచిది కాదు. కాగితం పట్టుకుని చదివితే కంగారుపడిపోతాం. అవసరమైన విషయాలపై సమగ్రసమాచారాన్ని ముందే చదివి అవగాహన చేసుకోవాలి. విద్యార్ధులు పబ్లిక్ స్పీకింగ్ కోర్సులను అధ్యయనం చేయాలి. యూట్యూబ్‌లో ప్రసిద్ధ వ్యక్తుల ప్రసంగాలను చూడాలి. -
అప్పుడు నా శరీరం మెల్లిగా పైకి లేచినట్లనిపిస్తుంది!
ఆధ్యాత్మికం... ఆ బాట చాలా బాగుంటుంది... ధ్యానం... ధ్యాసతో చేస్తే దేవుడు కనిపిస్తాడు... పుస్తక పఠనం... కొన్ని సందేహాలకు నివృత్తి... సమాధి స్థితి... ఆ సాధన ఎలా చేయాలి? ఇలాంటి విషయాల గురించి జగపతిబాబు మాట్లాడితే ఎవరికైనా వింతగా ఉంటుంది.. అసలు జగపతిబాబు అంటే ఏంటి? మంచి విలాస పురుషుడు... చక్కగా పార్టీలు చేసుకుంటాడు... సెంటిమెంట్స్ ఉండవు... దైవభక్తి సున్నా... పుస్తకాలంటే పడదు... ఇలా చాలా చాలా అనుకుంటారు. కానీ... జగపతిబాబులో తెలియని మరో కోణం ఉంది. ఓ సందర్భంలో జగపతిబాబుతో మాట్లాడినప్పుడు ఆ కోణం బయటికొచ్చింది.. ఎవరూ ఊహించని ఆ కోణాన్ని ‘సాక్షి’ ఆవిష్కరించింది. మీరు పార్టీ యానిమల్ అనీ, జీవితం అంటే కేవలం ‘ఎంజాయ్మెంట్’ అనే భావనలో ఉంటారనీ బయట మీకు ఇమేజ్ ఉంది. కానీ, మీలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉందని తెలిసింది. నిజమేనా? (నవ్వుతూ)... చెబితే ఆశ్చర్యపోతారు. ఆధ్యాత్మికం అంటే నాకు చాలా ఆసక్తి. పూర్తిగా నిమగ్నమైతే దాని తాలూకు అనుభూతిని ఆస్వాదించవచ్చు. జీవితాన్ని ఆస్వాదించడం అంటే పార్టీలు చేసినప్పుడే కాదు.. ఆధ్యాత్మిక బాటలో వెళ్లినప్పుడు కూడా ఆనందం పొందవచ్చు. నేను కొంతమంది దగ్గర ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చిస్తుంటాను. వాళ్లల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకరు. ఆధ్యాత్మిక లోతుల్లోకి వెళ్లిన మహానుభావుడాయన. రజనీతో నేను ‘కథానాయకుడు’, ‘లింగ’ చిత్రాల్లో కలిసి నటించాను. ఆ షూటింగ్ సమయాల్లో మేమిద్దరం ఆధ్యాత్మికత గురించి బాగా చర్చించుకునేవాళ్లం. నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉంది. తత్వశాస్త్రానికి సంబంధించినవీ, ఆధ్యాత్మికతకు సంబంధించినవన్నీ చదువుతుంటాను. ఒకరోజు రజనీగారి దగ్గర ‘మీరెన్నో పుస్తకాలు చదువుతుంటారు కదా.. నాకేదైనా మంచి పుస్తకం సూచించండి’ అనడిగా. అప్పుడాయన ‘లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్’ అనే పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకం ముందు పేజీలో శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంతకం కూడా పెట్టి ఇచ్చారు. నాకేదైనా కొత్త పుస్తకం దొరికితే చదవకుండా ఉండలేను. ఆ పుస్తకాన్ని అప్పటికప్పుడు చదవడం మొదలుపెట్టా. నాలుగు వందల పై చిలుకు పేజీలుంటాయి. రెండు రోజుల్లో ఆ పుస్తకం పూర్తి చేసేశా. ఓ కొత్త ప్రపంచంలోకి విహరించేలా చేసింది. ఇంకా మీరు బాగా ఇష్టపడి చదివిన పుస్తకాల గురించి చెప్పండి? హీరోయిన్ అనుష్క యోగా ఎక్స్పర్ట్ అనే విషయం తెలిసిందే. తను కూడా మంచి మంచి పుస్తకాలు చదువుతుంటుంది. ‘లింగ’ షూటింగ్ సమయంలో మేం ఫిలాసఫీ, స్పిరిచ్యువాల్టీ గురించి మాట్లాడుకుంటున్న సమయంలో పుస్తకాల గురించి కూడా చర్చించుకున్నాం. అప్పుడు తను నాకు ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి’ అనే పుస్తకం ఇచ్చింది. అది కూడా ఏకబిగిన చదివేశా. ఇంగ్లిష్‌లోనే కాదు.. తెలుగులో కూడా ‘ఒక యోగి ఆత్మకథ’ పేరుతో ఆ పుస్తకం దొరుకుతుంది. మీరు ధ్యానం చేస్తారా? ఒకవేళ చేస్తే పరిసర ప్రాంతాలను మర్చిపోయి మరీ ధ్యానం చేయగలుగుతారా? ధ్యానం చేస్తాను. ప్రతిసారీ అనను కానీ, చాలాసార్లు డెప్త్‌లోకి వెళ్లిన సందర్భాలున్నాయి. అద్భుతంగా ధ్యానం చేయగలను. ఎంత అంటే.. ఒక్కోసారి ధ్యానంలో నిమగ్నమైనప్పుడు ‘చిన్నగా నా శరీరం కొంచెం పైకి లేచినట్లుగా’ అనిపిస్తుంది. అఫ్కోర్స్ శరీరం లేవదు కానీ, ఎంతో ఏకాగ్రతగా ధ్యానం చేసినప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుంది. ధ్యానానికి సంబంధించిన ఆశ్రమాలకు వెళుతుంటారా? చాలా ఆశ్రమాలకు వెళ్లాను. విపాసనా, కల్కి భగవాన్, కర్తాళ్, హిమాలయాల వరకూ వెళ్లాను. ఆశ్రమాలకు వెళ్లినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం అనేది ప్రతి ఒక్కరికీ అవసరమా? చాలా అవసరం. మానసిక శాంతి పొందాలంటే ధ్యానం చేయాల్సిందే. ధ్యానం ప్రభావం ఎంత ఉంటుందో చేసినవాళ్లకి తెలుస్తుంది. దానివల్ల పొందే ఆనందం ఎలా ఉంటుందో చేస్తే తెలుస్తుంది. రజనీకాంత్‌గారు ఒక మీటింగ్‌లో ఏమన్నారంటే... ధ్యానం అంటే ఏమీ లేదు. ‘కూర్చోండి.. కళ్లు మూసుకోండి. ఏ ఆలోచన వస్తే అది రానివ్వండి. బలవంతంగా ఆలోచించడం మానాలనో, వేరే ఆలోచించాలనో అనుకోకండి. అలా ధ్యానం చేయగా చేయగా.. అసలు ఆలోచనలే రాకుండా మైండ్ అంతా బ్లాంక్‌గా అయిపోతుంది. ధ్యానంలో అదే ఉచ్చ స్థితి. మీరు ఆ ఉచ్చ స్థితికి ఎప్పుడు చేరుకున్నారు.. ఎప్పుడెప్పుడు ధ్యానం చేస్తుంటారు? సరిగ్గా గుర్తు లేదు కానీ, ఎప్పుడో చేరుకున్నాను. గంట నుంచి గంటన్నర ధ్యానం చేసినప్పుడు ప్రపంచాన్ని మర్చిపోతాను. ఎక్కువగా ధ్యాన కేంద్రాలకు వెళ్లినప్పుడు చేస్తుంటాను. వాతావరణం బాగున్నప్పుడు, ఆ సమయంలో నేను ఖాళీగా ఉన్నప్పుడు కాసేపు ధ్యానం చేస్తా. కొంతమంది ఎదుట దీపం పెట్టుకునో లేక ఏదైనా దేవుణ్ణి మనసులో అనుకొనో ధ్యానం చేస్తారు.. అలానే చేయాలా? అలా ఏం లేదు. కొంతమంది ‘ఓం మంగళం’ అనుకుంటారు. ఇవేవీ అనుకోకుండా కూడా ధ్యానం చేయొచ్చు. మీరెప్పుడైనా ధ్యానం చేస్తున్నప్పుడు ఏదైనా దైవం కళ్ల ముందు మెదిలినట్లు అనిపించిందా? ఒకసారి అనిపించింది. షిర్డీ సాయిబాబా కనిపించారు. మా ఆవిడ బాబా భక్తురాలు. ఒక చిన్న వీధి, పక్కనే ఓ చిన్న గల్లీ, అక్కడ ఓ రాయి, దాని మీద సాయిబాబా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నట్లుగా కనిపించింది. నేను కూర్చుని ధ్యానం చేస్తున్న చోటు నుంచి ఓ నాలుగైదడుగుల దూరంలో ఈ దృశ్యం కనిపించింది. బాబాగారు నావైపు ఆనందంగా చూడటంలేదు. దీనంగా చూశారు. అప్పుడు నేనా ధ్యానంలోనే ‘ఎందుకు అలా చూస్తున్నావ్?’.. అంటున్నా. అప్పుడాయన ‘హు..’ అంటూ ఓ నవ్వు నవ్వి మాయమయ్యారు. దానికర్థం తెలియదు. ‘పిచ్చోడా.. పోరా.. నువ్వు బాగుపడితే బాగుంటుంది అన్నారా?’ అనుకున్నాను. మా ఇంట్లో బాబా భక్తులున్నారు కానీ.. నేనంత భక్తుణ్ణి కాదు. అందుకుని ఎందుకు కనిపించారా? అని ఆలోచించాను. ఇది ఎప్పుడు జరిగింది? రెండేళ్ల క్రితం జరిగింది. బాబాగారి నవ్వు ఇంకా గుర్తుంది. ఆ నవ్వు నాకు పాజిటివ్‌గా అనిపించింది. మీకు తత్వశాస్త్రం (ఫిలాసఫీ) అంటే ఇష్టమేనా? చాలా. అందులో ఉన్న లాజిక్ ఇష్టం. వయసొచ్చిన తర్వాత కాదు.. చిన్నప్పట్నుంచీ ఇష్టం. నా ఆలోచనలు కొన్ని కొన్ని ఫిలసాఫికల్గానే ఉంటాయి. ఉదాహరణకు.. అనుబంధాలను తీసుకుందాం. దూరంగా ఉన్నంతవరకే అవి జీవితాంతం కొనసాగుతాయని బలంగా నమ్ముతాను. నేను ఉమ్మడి కుటుంబాన్ని పెద్దగా ఇష్టపడను. ఎందుకంటే, ఇంట్లో ఎక్కువమంది ఉంటే అన్ని తలకాయలూ ఆలోచించడం మొదలుపెడతాయి. అప్పుడు ఎవరికి వాళ్లు తాము అనుకున్నది జరగాలని పంతం పడతారు. ఈ క్రమంలో మనస్పర్థలు నెలకొని, విడిపోయే వరకూ వెళ్లిపోతారు. అదే దూరంగా ఉంటే.. ఇవన్నీ జరగవు కదా. కానీ.. ఉమ్మడి కుటుంబంలో ఓ భద్రతా భావం ఉంటుంది కదా? దూరంగా ఉన్నా ఆ భావం ఉంటుంది. దూరంగా ఉన్నంత మాత్రాన వాళ్లు వేరు మనం వేరు అని కాదు. మనసులో పగ పెట్టుకుని పక్కన ఉండేకన్నా.. దూరంగా ఉండి ప్రేమగా మెలగటం ఉత్తమం. ‘మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ మోర్ ట్రబుల్ అన్నది నా అభిప్రాయం. అందుకే ‘దూరంగా ఉండి దగ్గరగా ఉండటం బెటర్’ అంటున్నా. - డి.జి. భవాని ఈ మార్పు వచ్చింది అని ప్రత్యేకంగా చెప్పలేను కానీ.. ఏ మంచి పుస్తకమైనా మనల్ని ప్రభావితుల్ని చేస్తుంది. కొన్ని సందేహాలకు సమాధానం లభిస్తుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. నేను పైన పేర్కొన్న రెండూ పాజిటివ్ బుక్సే. ఇవి కాకుండా ఇంకా చాలా పుస్తకాలు చదివా. కొన్ని పుస్తకాల్లో మహానుభావులు సమాధి స్థితిలోకి వెళ్లిన వైనం చదివి, ఆశ్చర్యపోయాను. ఆ స్థితికి చేరుకోవడానికి ఎలా సాధన చేయాలో నేను చదివిన పుస్తకాల్లో లేదు. ఆ సాధనను అధ్యయనం చేయాలనే తపన ఉంది. -
వెనకేసిన రాళ్లు కాదోయ్... ఆర్జించిన మొనగాడెవ్వడు?
మా శ్రీవారు అభ్యుదయ కవిత్వం అంటూ ఏదో రాస్తారు. మొన్న ఆయనకు తీవ్రంగా జబ్బు చేసి ఆసుపత్రిలో ఉంచాల్సి వచ్చింది. సెలైన్ బాటిల్ పెట్టినప్పుడు బెడ్‌పై పడుకుని కూడా ఏదో రాశారాయన. ‘‘స్టాండుకు అమర్చిన సెలైన్ బాటిల్ - వేలాడుతున్న తెల్లటి గబ్బిలంలా తల్లకిందులుగా ఉంది. నా నరాల్లోకి ఎక్కించిన పైపు చివరి సూది ఓ మొబైల్ చార్జర్‌లా ఖాయిలా పడ్డ నా ‘సెల్స్’ను రీ-చార్జ్ చేస్తోంది’’ అంటూ ఏదో రాశారాయన.ఆయన రాసిన కవిత్వం చదివితే నాకు కడుపులో దేవుతుంది లేదా వికారంగా ఉండి, వామిటింగ్ అయినా అవుతుంది. ఇదే మాట మొహమాటం లేకుండా ఆయనతో చెబితే... ‘‘కదిలేదీ, కదిలించేదీ పెనునిద్దర వదిలించేది అంటూ మహాకవి కవిత్వాన్ని నిర్వచించారు. ఈ లెక్కన నాది తప్పకుండా కవిత్వమే కదా’’ అంటూ తనకు తాను కితాబిచ్చుకున్నారు. ‘‘ఈ రాతలకు బదులు ఏ దస్తావేజులో, ఎవరికైనా కరపత్రాలు రాసిపెట్టడమో చేస్తే కనీసం నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు కదా’’ అన్నాన్నేను. వెంటనే... ‘‘వెనకేసిన రాళ్లు కాదోయ్... వాటిని ఆర్జించిన మొనగాడెవ్వడు’’ అన్న సంకుచిత మనస్తత్వం మీ లేడీస్‌ది. కానీ మా మగాళ్లు అలా కాదు. ‘ప్రవహించిన ఒక్క సెలైన్ చుక్క... లక్ష కణాలకు కదలిక’ అంటూ ఆసుపత్రి పడక మీద నుంచి కవి ఒక కొత్త ప్రపంచాన్ని సరికొత్త కోణం నుంచి చూస్తాడు’’ అంటూ లెక్చరిచ్చారు. డిశ్చార్జీ రోజున బిల్లు చేతికి ఇచ్చాక దాని వైపు పిచ్చి చూపులు చూడటం మొదలెట్టారు. ఇదే అదనుగా కాస్త చురక అంటిద్దామని అనుకున్నా. ‘‘బిల్లు మీద ఉన్న కంప్యూటర్ అంకెల సిరా చుక్క... మీలోని లక్ష కణాలకు లేకుండా చేసింది కదా కదలిక!’’ అన్నాన్నేను ఆయన ధోరణిలోనే. కనీసం ఈ దెబ్బతోనైనా ఆయన కవిత్వం పిచ్చి వదిలి కాస్త ఈ లోకం పోకడ తెలియాలనీ నా కోరిక. డిశ్చార్జీ అయి ఇంటికి వచ్చాక కొన్నాళ్లకు మళ్లీ బల్ల వెనక్కు చేరి ఏదో రాస్తూ కనిపించారాయన. ‘నా ఖర్మరా భగవంతుడా! మళ్లీ ఏదో కెలకడం మొదలుపెట్టారు కదా’ అంటూ ఒకవేళ కవిత్వమైతే ‘ఏమిటా పని?’ అని నిలదీయాలని నిశ్చయించుకున్నా. ‘వాళ్లెవరో అభ్యు‘దయా’ ఆర్గనైజేషన్ వాళ్లట. తమ ‘దయా’గుణంపై మంచి భాషలో ఉత్తమమైన కరపత్రం రాసి ఇస్తే డబ్బులిస్తారట. అదే రాస్తున్నాను చూడు. నీమీదొట్టు. ఇకపై కవిత్వం జోలికిపోనం’టూ మాట ఇచ్చారు. ‘‘ఓ వందో, వెయ్యో కరపత్రాలు రాసి అలా వచ్చిన డబ్బులతో నాకు మంచి ఆర్నమెంట్ ఏదైనా చేయిస్తారా?’’ అని అడిగా గోముగా. ‘‘తప్పకుండా... మొన్నటి ఆసుపత్రి బిల్లు కోసం తాకట్టు పెట్టిన నీ నగ విడిపించాక... నీకు మళ్లీ ఆర్నమెంట్ చేయించడం కోసమే ఇక విరివిగా కరపత్రాలల్లుతా! ఎందుకంటే కవిత్వం అల్లడం అంటే మనం చిక్కుకోడానికి స్వయంగా మనమే సాలెగూడు అల్లుకోవడం లాంటిది. మన ఆరోగ్యాన్ని ఆసుపత్రి తాకట్టు నుంచి విడిపించాలంటే మనం నగలు కొని పెట్టుకుని... వాటిని తాకట్టు పెట్టాల్సిందే కదా. ఇకపై నా ఫిలాసఫీ చెబుతా విను. గడించకుంటే గతించినట్టే’’ అన్నారాయన. ఆ మాటతో నా మనసు తేలిక పడింది. - వై! -
పెళ్లి తప్పనిసరా?
మనసులో మాట విమర్శ ‘‘నీ గురించి ఫలాన విమర్శ చదివి నాకు బాధ అనిపించింది. నీకేమీ అనిపించలేదా?’’ అని కొందరు అడుగుతుంటారు. ‘‘నాకేమీ బాధ లేదు. నువ్వు బాధ పడితే నేనేమీ చేయలేను’’ అంటాను. నా సమాధానం విని ఆశ్చర్యపోతారు. మనిషి మనస్తత్వం గురించి ఎన్నో పుస్తకాలు చదివాను. మానవమనస్తత్వంలో ప్రతి కోణం గురించి నాకు తెలుసు. మనిషికి తిండిలాగే విమర్శ కూడా కావాలి. నిన్న విమర్శించిన వారే... ఇవ్వాళ ప్రశంసిస్తారు. కాబట్టి విమర్శను గురించి తీవ్రంగా ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోను. వినోదం ఒంటరిగా ఉండడం కంటే స్నేహితులతో ఉండడానికి ఇష్టపడతాను. స్నేహితులు ఉన్నచోట వినోదానికి కొదవా? నవ్వడం ద్వారా కొత్త శక్తి చేరినట్లు అనిపిస్తుంది. విహారం గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రపంచమంతా తిరుగుతూనే ఉన్నాను. నేను ఎక్కడ ఉంటే అదే నా ఇల్లు అనుకుంటాను. నేను ఏ దేశంలోనైనా ఎక్కడైనా బతకగలను. ఒక కొత్త ప్రదేశాన్ని చూసినప్పుడు నాలో కలిగే అనుభూతి మాటలకు అందనిది. ఒక చోటుకు వెళ్లిన తరువాత ‘‘నెక్స్ట్ ఎక్కడికీ?’’ అని ఆలోచిస్తూనే ఉంటాను. వివాహం వివాహం అనేది తప్పనిసరి కాదని అభిప్రాయపడుతున్నాను. పెళ్లి ప్రాముఖ్యం గురించి ఎంతో గొప్పగా చెప్పి, పెళ్లి తరువాత రకరకాల కష్టాలతో కన్నీళ్లు కార్చే వారు ఎంతోమంది నాకు తెలుసు. ఏ జంటనైనా చూస్తే... పెళ్లి చేసుకోవాలనే ఆలోచన బలంగా కలగాలి. దురదృష్టవశాత్తు అలాంటి జంట ఒక్కటి కూడా నాకు కనిపించలేదు! పెళ్లి అవసరం లేదని అనడం లేదు, అత్యవసరం కాదు అని మాత్రం అంటున్నాను. - నర్గీస్ ఫక్రీ, హీరోయిన్ -
వేదాంతంలోకి దిగిపోయిన శ్రుతి!
మహేష్ బాబుతో 'ఆగడు' సినిమాలో 'జంక్షన్లో' అంటూ ఓ ఐటెం సాంగ్ చేసిన శ్రుతి హాసన్.. ఎందుకోగానీ ఉన్నట్టుండి వేదాంతంలోకి దిగిపోయింది. ప్రపంచం గురించి, విలువల గురించి చెప్పడం మొదలుపెట్టింది. ''నా చుట్టూ ఉన్న ప్రపంచం ఎంతో మారిపోతున్నట్లు అనిపిస్తోంది. దీన్నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నాకు విలువల గురించి నేర్పిన వాళ్లందరికీ చాలా కృతజ్ఞతతో ఉంటాను'' అని ట్వీట్ చేసింది. అంతకుముందు కూడా అందం ఉంటే చాలదు.. తెలివితేటలు కూడా ఉండాలంటూ చెప్పుకొచ్చింది. కథానాయికగానే కాదు, సినిమాకు సంబంధించి ఏ చిన్న పాత్రలో కనిపించినా అది ప్రేక్షకులు గుర్తుండిపోయేలా ఉండాలి. చేసే పని పట్ల భక్తి, శ్రద్ధలుంటేనే జీవితంలో పైకొస్తాం అని చెప్పింది. కథానాయికలకు అందంతోపాటు తెలివితేటలు కూడా ఉండాలని, అవి లేనప్పుడు ఎంత అందం ఉన్నా వ్యర్ధమేనని తెలిపింది. ప్రస్తుతం విశాల్ హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పూజ’ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. ఈ నెల 24న స్విట్జర్లాండ్ వెళ్తోంది. అది కూడా పూజ సినిమాలో ఓ పాట కోసమేనట. I feel like the whole world around me is changing -i learn so much - and I'm thankful to those who taught me something of value — shruti haasan (@shrutihaasan) September 22, 2014 -
పంచ్ ఫిలాసఫర్!
బ్రూస్లీ కి బాగా పేరొచ్చాక... ‘రా, చూస్కుందాం’ అని కాల్‌తో నేలని తన్నేవారు ఎక్కువయ్యారు. నేలని కాలితో తన్నడం అంటే సవాల్ విసరడం. బ్రూస్లీ ని ఓడించడం గొప్ప కదా.. అందుకు! బ్రూస్ లీ నవ్వేవాడు. సవాల్ చేసింది పిల్లలైతే కాసేపు వారిని ఆడించేవాడు. సవాల్ చేసింది పెద్దలైతే కాసేపు వారిని రఫ్ఫాడించేవాడు. బ్రూస్ లీ బలమంతా అతడి చేతుల్లో, కాళ్లలో ఉందనుకుంటాం కదా... కానీ నిజంగా బలమైనవి అతడి చిరునవ్వు, చిరుత కళ్లు. ఇంకా బలమైనది అతడి ఫిలాసఫీ! ఓటమి అనేది పడిపోయానని అనుకోవడంలో ఉంది తప్ప... పడిపోవడంలో లేదని అంటాడు బ్రూస్ లీ. చిన్న జీవితంలో పెద్ద ఫిలాసఫీని చూసిన ఈ యుద్ధవిద్యా ప్రవీణుడి వర్ధంతి ఇవాళ. ఆ సందర్భంగా... సాక్షి ఫ్యామిలీ... నివాళి. సినిమా ఆగిపోయింది! రేమాండ్ చో హతాశుడయ్యాడు. ‘గేమ్ ఆఫ్ డెత్’ నిర్మాత అతడు. అయితే అతడు హతాశుడయ్యింది ‘గేమ్ ఆఫ్ డెత్’ ఆగిపోయినందుకు కాదు. మరి?! స్క్రిప్టులో చేయవలసిన మార్పుల గురించి ఆ మధ్యాహ్నమే బ్రూస్ లీ, రేమాండ్ చో దాదాపు రెండు గంటల సేపు మాట్లాడుకున్నారు. అసలు అందుకోసమే అమెరికా టూర్ నుంచి హాంగ్‌కాంగ్ చేరుకున్నాడు బ్రూస్ లీ. బ్రూస్ లీ రాసిన కథకు, బ్రూస్ లీ చేస్తున్న డెరైక్షన్‌లో, బ్రూస్ లీ నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఆఫ్ డెత్’. తీసినంత వరకు సంతృప్తికరంగా వచ్చింది. మరికొన్ని సీన్లు ఉన్నాయి. వాటిల్లో మార్పులు చేర్పుల గురించి నోట్స్ రాసుకున్నాక ఇద్దరూ కలిసి కారులో బెట్టీ టింగ్ పే ఉంటున్న అపార్ట్మెంట్కి బయల్దేరారు. బెట్టీ ఆ సినిమాలో బ్రూస్ లీ భార్యగా నటిస్తున్న తైవాన్ నటి. ముగ్గురూ కలిసి మళ్లీ ఒకసారి స్క్రిప్ట్టును సరిచూసుకున్నారు. ఆ తర్వాత, అక్కడికి దగ్గర్లోనే డిన్నర్ మీటింగ్ ఉంటే అక్కడి వెళ్లాడు రేమాండ్. అక్కడికి లీ కూడా వెళ్లాల్సి ఉంది. కానీ వెళ్లలేదు. బ్రూస్ లీ ఎంతసేపటికీ రాకపోవడంతో రేమాండ్ అపార్ట్మెంట్కి తిరిగొచ్చాడు. అప్పటికే బ్రూస్ లీ నిద్రపోతూ కనిపించాడు! వేళ కాని వేళ ఇదేమిటి? రేమాండ్ తట్టి లేపాడు. బెట్టీ తట్టి లేపింది. ఎంత లేపినా బ్రూస్ లీ లేవలేదు. అనుమానం వచ్చి అంబులెన్స్‌ని పిలిపించారు. క్వీన్ ఎలిజబెత్ ఆసుపత్రికి చేరుకుంటుండగా... అప్పటికే బ్రూస్ లీ మరణించి ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు! రేమాండ్ చో హతాశుడయ్యాడు. గేమ్ ఆఫ్ డెత్ ఆగిపోయినందుకు కాదు. డెత్ బ్రూస్ లీ తో గేమ్ ఆడినందుకు! మళ్లీ స్క్రిప్టు మారింది. కాదు కాదు, విధి మార్పించింది. మాఫీయా నుంచి తప్పించుకోడానికి బ్రూస్ లీ తను చనిపోయినట్లుగా నాటకం ఆడినట్లు మార్పు చేశారు. బ్రూస్ లీ అంత్యక్రియలు జరుగుతున్నపుడు క్లోజప్‌లో తీసిన నిజమైన దృశ్యాలను సినిమాలో వాడుకున్నారు. అయితే ఆ సినిమా ఇప్పటికీ పూర్తి కాలేదు. రేమాండ్ చో వయసు ప్రస్తుతం 85 ఏళ్లు. బతికుంటే బ్రూస్ లీ వయసు 74 ఏళ్లు. ఇద్దరూ కలిసి ఇప్పటికి ఎన్ని సినిమాలో తీసేవారు, మనం ఎన్ని సినిమాలు చూసేవాళ్లమో. అదృష్టం ఎవరికీ లేకపోయింది. రేమాండ్కీ, మనకు. ************* బ్రూస్ లీ చనిపోయి నలభై ఏళ్లు దాటిపోయాయి. అసలు ఆయన ఎలా చనిపోయాడన్న విషయమై నేటికీ హాంకాంగ్‌లో, అమెరికాలో ఆయన అభిమానులు గతాన్ని తవ్వుతూనే ఉన్నారు. విషప్రయోగం జరిగి ఉంటుందని ఒక అనుమానం. తలనొప్పి మాత్రలు వేసుకోవడం వల్ల అవి వికటించి చనిపోయాయాడని ఒక వాదన. ఈ వాదనకు బలం చేకూర్చే సంఘటన ఒకటి, బ్రూస్ లీ చనిపోడానికి రెండు నెలల ముందు జరిగింది. ఆరోజు మే 10. హాంగ్‌కాంగ్‌లోని గోల్డెన్ హార్వెస్ట్ స్టూడియోస్‌లో ‘ఎంటర్ ది డ్రాగన్’ చిత్రానికి డబ్బింగ్ చెబుతూ, ఫిట్స్ వచ్చి బ్రూస్ లీ కుప్పకూలి పోయాడు. వెంటనే అక్కడికి దగ్గర్లోని బాప్టిస్ట్ హాస్పిటల్‌కు అతడిని తరలించారు. డాక్టర్లు ‘సెరెబ్రెల్ ఎడెమా’ అన్నారు. మెదడు వాయడం వల్ల బ్రూస్ లీ కుప్పకూలిపోయాడని నిర్థరించారు. సరిగ్గా ఇవే లక్షణాలు బ్రూస్ లీ మరణించిన రోజు జూలై 20న ఆయనలో కనిపించాయి. అయితే ఆ లక్షణాలు పైకి కనిపించలేదు. లోపల్లోపలే అంతా జరిగిపోయింది. బ్రూస్ లీ మరణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన సినీ అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. మార్షల్ ఆర్ట్స్‌లో ఆయన శిష్యులు, గురువులు ‘బ్రూస్లీ ఇకలేడు’ అనే వార్త విని తట్టుకోలేకపోయారు. ఇప్పటికీ టీవీలలో పదే పదే ప్రసారమవుతుండే బ్రూస్ లీ చిట్టచివరి సినిమా ‘ఎంటర్ ది డ్రాగన్’ ను మనం ఎన్నోసార్లు చేసి ఉంటాం. కానీ బ్రూస్ లీ చూసుకోలేకపోయారు. ఆ సినిమా రిలీజ్ అవడానికి ముందే ఆయన మృత్యువాత పడ్డారు. ది బిగ్ బాస్ , ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ (ది చైనీస్ కనెక్షన్), వే ఆఫ్ డ్రాగన్ (రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్), ఎంటర్ ది డ్రాగన్ చిత్రాలు బ్రూస్ లీని చిరస్మరణీయుడి చేశాయి. అప్పటివరకు ప్రపంచానికి ఆసియా సినిమాల మీద ఉన్న చిన్నచూపును దూరం చేశాయి. అంతే కాదు, కేవలం బ్రూస్ లీ కారణంగా హాలీవుడ్... ఆసియా చిత్రాలను గౌరవించడం నేర్చుకుంది. అలాగే అనుకరించడం కూడా! బ్రూస్ లీ తన సినిమాల్లో చైనా సంప్రదాయాలను ఎక్కువగా చూపించేవాడు. అందుకనే చైనీయులు కూడా బ్రూస్ లీ సినిమాలను బాగా ఇష్టపడేవారు. బ్రూస్ లీని ఆరాధించేవారు. కుంగ్‌ఫూతో శత్రువును బ్రూస్ లీ మట్టికరిపిస్తుంటే చూడాలి... చైనా ప్రేక్షకులను పట్టలేం. కుంగ్‌ఫూ వారి సంప్రదాయ క్రీడ మరి. ‘ది బిగ్ బాస్’ కంటే ముందు బ్రూస్ లీ తన తొలిచిత్రం ‘మార్లోవ్’లో నటించాడు. అంతకంటే ముందు చిన్నారి బ్రూస్ లీగా అనేక చిత్రాలలో నటించాడు. అసలైతే బ్రూస్ లీ వెండి తెరమీద కనిపించిన మొట్టమొదటి సినిమా ‘గోల్డెన్ గేట్ గర్ల్’. అప్పటికి బ్రూస్ లీ వయసు మూడు నెలలు! ఆ సినిమాలో నటిస్తున్న ఒక అమెరిన్ బేబీకి ఒంట్లో బాగోలేకపోతే ఆ స్థానంలో బ్రూస్లీని కూర్చోబెట్టారు. ************ బ్రూస్ లీ సినిమాలు ఎంతగా ప్రజాదరణ పొందాయో, చేతులే ఆయుధమైన యుద్ధవిద్యల్లో (ముఖ్యంగా కరాటే విద్యలో) బ్రూస్ లీ అంతగా పేరు తెచ్చుకున్నారు. అతడిలో డ్రాగన్ అంశ ఏదో ఉండేది. డ్రాగన్‌లా చురుగ్గా కదిలేవాడు. డ్రాగన్‌లా చురుగ్గా చూసేవాడు. దేహం క రడుగట్టి ఉండేది. దృఢంగా ఉండడం కోసం అతడు గంటల తరబడి కసరత్తు చేసేవాడు. ఇక బ్రూస్ లీ కనిపెట్టిన ‘వన్ ఇంచ్ పంచ్’ టెక్నిక్ గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రత్యర్థికి అంగుళం దూరంలో మాత్రమే చేతిని ఉంచి బలంగా కొట్టడం ప్రపంచంలో ఇంతవరకు ఏ యోధుడు కూడా చెయ్యలేని పని. బ్రూస్ లీ వల్ల మాత్రమే అయిన పని! సాధారణంగా గట్టి దెబ్బ తగలాలంటే చేతిని దూరం నుంచి లాగి కొట్టాలి. అలాంటిది బ్రూస్ లీ అంగుళం దూరం నుంచే అంత దెబ్బను కొట్టేవాడు. మందంగా ఉండే చెక్క సైతం వన్ ఇంచ్ పంచ్‌తో రెండు ముక్కలయ్యేది. అంత ఫోర్సు బ్రూస్ లీలో ఎక్కడిది? బహుశా డ్రాగన్ అంశ ఏదో ఉండివుండాలి. *********** 1940 నవంబర్ 27న చైనీస్ క్యాలెండర్ ప్రకారం డ్రాగన్ సంవత్సరంలో, డ్రాగన్ ఘడియల్లో జన్మించాడు బ్రూస్ లీ. జన్మస్థలం మాత్రం చైనా కాదు. కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో. అక్కడి జాక్సన్ స్ట్రీట్ హాస్పిటల్లో ‘కేర్’మన్నాడు. తండ్రి లీ హోయ్ ఛెన్ ఆ సమయంలో అక్కడ లేడు. (పాటలంటూ అమెరికాలో టూర్లు తిరుగుతున్నాడు). తల్లి గ్రేస్ హో ఉన్నా, మెలకువలో లేదు. దాంతో రికార్డులో రాయడం కోసం నర్సే ఆ పసికందుకు ‘బ్రూస్ లీ ’ అనే అమెరికన్ పేరు పెట్టింది. అలా పుట్టుకతోనే బ్రూస్ లీ అమెరికన్ అయ్యాడు. అయితే బ్రూస్ లీని కుటుంబ సభ్యులెవ్వరూ ఎప్పుడూ బ్రూస్ లీ అని పిలవలేదు! ఆ చిన్నారికి వారు పెట్టుకున్న పేరు ‘లిటిల్ ఫీనిక్స్’. అదే పేరుతో పిలిచేవారు. అప్పుడప్పుడూ ఇంకో ముద్దు పేరు ‘సాయ్ ఫోన్’ అంటూ దగ్గరకు తీసుకునేవారు. నిజానికి లిటిల్ ఫీనిక్స్ అనేది ఆడపిల్ల పేరు. కావాలనే అలా పెట్టారు. దుష్టశక్తులకు మగపిల్లలంటే ఇష్టం ఉండదని, అందుచేత వారిని త్వరగా తీసుకుపోతాయని బ్రూస్ లీ తల్లిదండ్రులకు ఓ నమ్మకం. అందుకే ఆ దృష్ట శక్తులను తప్పుదారి పట్టించడం కోసం బ్రూస్ లీకి ఆడపిల్ల పేరు పెట్టారు. బ్రూస్ లీ తండ్రి లీ హోయ్ గాయకుడు. బ్రూస్ లీ పుట్టకముందు హాంగ్‌కాంగ్‌లోని ఒక అపేరాలో పనిచేసేవారు. ఉపాధికోసం అమెరికా వచ్చినప్పుడు బ్రూస్ లీ పుట్టాడు. (ఐదుగురు పిల్లల్లో అతడు నాల్గవవాడు). తిరిగి అదే ఏడాది లీ హోయ్ తన కుటుంబంతో సహా హాంగ్‌కాంగ్ చేరుకున్నాడు. అప్పటికి హాంగ్‌కాంగ్ జపాన్ అధీనంలో ఉంది. లీ హోయ్కి పెద్ద పెద్ద వాళ్లతో, సినిమా ప్రముఖులతో పరిచయాలు ఉండేవి. అలా బ్రూస్ లీకి ఆరేళ్ల వయసుకే 20 సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అదొక్కటే కాదు బ్రూస్ లీ చక్కగా డాన్స్ చేసేవాడు. టీనేజ్‌కి వచ్చే సరికి కవితలూ రాయడం మొదలుపెట్టాడు. అప్పుడే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కూడా. బ్రూస్ లీ హైస్కూల్ చదువుకి వచ్చేనాటికి ఆ కుటుంబం మళ్లీ అమెరికా చేరుకుంది. అక్కడే వాషింగ్టన్‌లోని ఎడిసన్‌లో తన స్కూలు చదువు పూర్తి చేశాడు బ్రూస్ లీ. తర్వాత వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రం చదివాడు. ఆ తర్వాత హాంగ్‌కాంగ్‌లో తను మార్షల్స్ ఆర్ట్ నేర్చుకున్న అనుభవంతో ఇక్కడ కొంతమంది విద్యార్థులను తయారు చేశాడు. ఆ సమయంలో పరిచయమైన లిండా ఎమెరినీ 1954లో వివాహమాడారు. అప్పటికే సియాటిల్‌లో ఒక మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ఉంది. అక్కడి నుంచి బ్రూస్ లీ, లిండా కాలిఫోర్నియా వెళ్లారు. అక్కడ బ్రూస్ లీ ఓక్లాండ్లో, లాస్ ఏంజెలిస్‌లో రెండు స్కూళ్లను ప్రారంభించారు. అవీ మార్షల్ ఆర్ట్స్‌కి సంబంధించినవే. లాభాపేక్షతో కాకుండా కేవలం నేర్పించడానికే స్కూళ్లు నడుపుతున్న బ్రూస్ లీ... మెల్లమెల్లగా మళ్లీ సినిమాల వైపు మళ్లారు. అంతకన్నా ముందు అతడికి టీవీలో నటించే అవకాశాలు వచ్చాయి. 1966 నుండి 1967 వరకు 26 ఎపిసోడ్లుగా టీవీలో ప్రసారమైన ‘ది గ్రీన్ హార్నెట్’ సిరీస్‌తో బ్రూస్ లీ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అలా1969లో తొలిసారిగా అతడికి ‘మార్లోవ్’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. తర్వాత మిగతా సినిమాలు. తర్వాత అర్ధంతర మరణం. ముప్పై మూడేళ్ల వయసులో తను చనిపోయే నాటికి బ్రూస్లీ నూరేళ్ల జీవితానికి సరిపడా తన ముద్రను అన్ని రంగాలపై వదిలి వెళ్లారు. సినిమాలు, యుద్ధకళలు, సాహిత్యం... ఇలా. అందుకే అతడిని ప్రపంచంలోని చాలాదేశాలు, ముఖ్యంగా ఆసియా దేశాలు 20వ శతాబ్దంలోనే ప్రఖ్యాతిగాంచిన యుద్ధ ప్రవీణుడిగా, సాంస్కృతిక చిహ్నంగా భావిస్తాయి. బ్రూస్ లీ కుమారుడు బ్రాండన్‌లీ, కుమార్తె షానన్ లీ కొంతవరకు మాత్రమే ఆయన వారసత్వాన్ని కొనసాగించగలిగారు. అది కూడా సినిమాల్లో. బ్రూస్ లీ ప్రధానంగా కరాటే యోధుడు అయినప్పటికీ ఆయన జీవితం చాలావరకు పోరాటాలతో కాకుండా ఫిలసాఫికల్‌గా గడిచింది. పోరాటాలలో సైతం బ్రూస్ లీ తాత్వికతను ప్రద ర్శించడం విశేషం. ‘‘జీవితం మనకొక ‘పంచ్’ ఇచ్చినప్పుడు దాంతో మనం తాత్వికంగా దెబ్బలాడాలి తప్ప మనకొచ్చిన మార్షల్ ఆర్ట్స్ అన్నీ దాని ముందు ప్రదర్శించకూడదు. ఫైటింగ్ ఒక ఫిలాసఫీ! వేళ్లకు, పిడికిళ్లకు ఆలోచనాశక్తిని ఇచ్చే ఫిలాసఫీ!! మన దగ్గర ఉన్నదంతా బయట పెట్టుకోవడం వల్ల మన దగ్గర లేనిదేమిటో బయటికి తెలిసిపోతుంది. అది ప్రమాదం’’ అంటాడు బ్రూస్లీ. తన చిన్న జీవితంలో బ్రూస్ లీ కనిపెట్టిన అతి గొప్ప సంగతి ఇది. లీ ఫిలాసఫీ జీవితం జీవితం నిన్ను అనేక తెలివితక్కువ ప్రశ్నలతో విసిగించాలని చూస్తుంది. నువ్వు తెలివైన వాడివైతే ఆ ప్రశ్నలనుంచి ఎంతోకొంత నేర్చుకుంటావ్. తెలివైన సమాధానం నుంచి తెలివితక్కువవాడు నేర్చుకునే దానికన్నా, తెలివైనవాడు తెలివితక్కువ ప్రశ్నల నుంచి నేర్చుకునేదే ఎక్కువ. పోరాటం శత్రువుతో పోరాడవలసిందే. వాడు మన మొహం పగలగొడతాడు. మనం వాడిని చితగ్గొడతాం. వాడు మన ఎముకల్ని సున్నం చేస్తాడు. మనం వాడి వెన్నుపూసల్ని ధ్వంసం చేస్తాం. చివరికి ఎవరో ఒకరే మిగులుతారు. వాడో, మనమో. అయితే ఇదంతా తేలిగ్గా జరగాలి. ఒళ్లు అలవకుండా జరగాలి. కష్టపడకుండా చేసిన పనే... కచ్చితంగా జరిగిన పని! పదివేల కిక్కుల్ని ప్రాక్టీస్ చేసి వచ్చినవాడికి నేను భయపడను. ఒకే ఒక కిక్కును పదివేల సార్లు ప్రాక్టీస్ చేసి వచ్చినవాడితో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. జీవితాంతం ఎవరో ఒకరితో, ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉండాలా? నేర్చుకోవలసిందీ, మనలోకి మనం చూసుకోవలసిందీ చాలా ఉంది. టైమ్ సరిపోతుందా? జీవితాన్ని ప్రేమించేవాడు టైమ్ వేస్ట్ చేసుకోడు. అసలు టైమ్ చూసుకోడు. అదొక టైమ్ వేస్ట్ పని. పోరాడవలసిందే. కానీ గెలుపు ఓటముల కోసం పోరాడకూడదంటాను. కాలం ఉన్నంత కాలం మనమూ ఉండిపోడానికి పోరాడాలి! తావోయిజం ‘‘మన ఆలోచనే మనం’ అంటుంది తావోయిజం. ఎప్పుడూ ఇంకొకరి ఆలోచల ప్రకారం నడుస్తుంటే మనకు బదులుగా వారు మిగిలిపోతారు లోకంలో. అప్పుడు మనం పుట్టి, పెరిగి, పోయి... ఏం లాభం? అందుకే మన పంచ్ డిఫరెంట్‌గా ఉండాలి. నా ఇష్ట ప్రకారం జీవించడానికి నువ్వీ లోకంలోకి రాలేదు. నీ ఇష్ట ప్రకారం నడుచుకోడానికి నేనీ లోకంలోకి రాలేదు. ఎవరి జీవితం వారిది. అయితే ఈ రెండు జీవితాలను సమన్వయం చేయడానికి - మనం పుట్టక ముందే - సమాజం స్థిర ఆదర్శాలను ఏర్పాటు చేసి ఉంచింది. ఫిక్స్డ్ పాటర్న్! కానీ జీవిత సత్యాలన్నీ ఆ ఆదర్శాల బయటే ఉన్నాయే! ఎలా బయట పడడం? పడాలి. నియమాలకు విధేయులమై ఉంటూనే, వాటికి లోబడకుండా ఉండాలి. గై-క్వాం-డూ! నాకు అనిపిస్తుంటుంది... ఈ మూస విద్యల్లో, ప్రాచీన పద్ధతుల్లో ఏదో ప్రాణాంతక లోపం ఉందని! కొత్తదేదైనా కనిపెట్టాలి. అది అసాధారణంగా ఉండాలి. ‘అతి సాధారణత’ దాని ప్రత్యేకత అయివుండాలి. తక్కువ ఎనర్జీతో, తక్కువ సమయంలో మన లోపలి వ్యక్తీకరణలన్నిటినీ బయటపెట్టగలిగేదై ఉండాలి. మార్చుకోడానికీ, వదిలేయడానికీ అనువైనదిగా ఉండాలి. అలా నాకోసం నేను డెవలప్ చేసుకున్నదే ‘గైక్వాండూ’! నీటిలా... షేప్‌లెస్‌గా ఉండాలి మనిషి. నీటికి సొంత ఆకృతి ఉండదు. గ్లాసులో పోస్తే గ్లాసులా ఉంటుంది. సీసాలో పోస్తే సీసాలా ఉంటుంది. టీపాట్‌లో టీపాట్లా ఉంటుంది. కానీ నీరు ప్రవహిస్తుంది. ముంచెత్తుతుంది. మనిషి కూడా అలానే ఉండాలి. ఇదే గై క్వాం డూ ఫిలాసఫీ. పోరాడే క్షణాలేవీ మనవి కావని గుర్తుంచుకోండి. తేల్చిపారేయాలి తొలి క్షణంలో. రెండో క్షణంలో మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు. బ్రూస్ లీ బయోగ్రఫీ (27 నవంబర్ 1940 - 20 జూలై 1973) పూర్తి పేరు: బ్రూస్ జున్ ఫాన్ లీ ఎత్తు: 5 అడుగుల ఏడున్నర అంగుళాలు జన్మస్థలం: శాన్ఫ్రాన్సిస్కో (అమెరికా) పెరిగింది: హాంకాంగ్ తండ్రి: లీ హోయ్ చుయన్ తల్లి: హో చదువు: యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్లో తత్వశాస్త్రం ప్రభావితం చేసిన తత్వాలు: తావోయిజం, బౌద్ధం, జిడ్డు కృష్ణమూర్తి తత్వం. భార్య: లిండా లీ కాడ్వెల్ సంతానం: బ్రాండన్ లీ (నటుడు), షానన్ లీ (నటి) ప్రత్యేకతలు: మార్షల్ ఆర్టిస్ట్, ఫిలాసఫర్, ఇన్స్ట్రక్టర్, యాక్టర్, ఫిల్మ్ డెరైక్టర్, స్క్రీన్ రైటర్, గైక్వాండో (మార్షల్ ఆర్ట్) సృష్టికర్త. హిట్ మూవీస్: ది బిగ్ బాస్, ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ, ఎంటర్ ది డ్రాగన్, వే ఆఫ్ ది డ్రాగన్ (రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్), ది గేమ్ ఆఫ్ డెత్. రాసిన పుస్తకాలు: చైనీస్ కుంగ్-ఫూ: ది ఫిలసాఫికల్ ఆర్ట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్, తావో ఆఫ్ గైక్వాండో, వింగ్ చున్ కుంగ్-ఫూ ఫిలాసఫీ: ఏ జ్ఞానమైనా చివరికి ఆత్మజ్ఞానానికి దారితీస్తుంది. -
పనిమనిషి ‘మన మనిషి’ కాలేదా?
అనారోగ్యంతో పనిమనిషి సెలవు పెడితే ఇంటెడు పని ఎలా చేసుకోవాలా అని టెన్షన్ పడతాం... చేయలేక అవస్థపడతాం. అందుకే ఓ చిన్న సలహా. అడపా దడపా ఆమెకు చీర లు, వస్తువులు కొనిపెట్టే బదులు, ఆ డబ్బుకు మరికొంత జతచేసి ఓ హెల్త్ పాలసీ చేయించండి. అది ఆమెకే కాదు, మనకూ ఉపయోగమే. రేపెప్పుడైనా ఆమె మనింట్లో పనిచేస్తూనో, మన ఇంటికొస్తూనో ఏదైనా ప్రమాదం బారిన పడితే... అప్పటికప్పుడు మనం డబ్బు సర్దలేకపోవచ్చు. అలాంటప్పుడు ఆ పాలసీ ఎంతో ఉపయోగపడుతుంది. ‘‘ఏవండీ... కొత్త పనిమనిషిని చూడాలి’’... ఆఫీసుకు వెళ్లడానికి రెడీ అవుతోన్న భర్తతో అంది సునంద. ‘‘అదేంటి... ఉంది కదా?’’... అయోమయంగా అన్నాడు భర్త. ‘‘ఉంది కాదు... ఉండేది. రేపట్నుంచి రాదు.’’ ‘‘మళ్లీ మాన్పించేశావా? ఇలా వచ్చినవాళ్లందరినీ వెళ్లగొడితే ఇంకెవరు చేస్తారు మనింట్లో’’... విసుగ్గా అన్నాడు. ‘‘ఎందుకు చేయరు? డబ్బులిస్తున్నాం కదా! అయినా నన్నంటారేంటి? వాళ్లు సరిగ్గా ఉంటే నేనెందుకు మాన్పిస్తాను?’’... విరుచుకుపడింది సునంద. ఇంకేం చెప్పినా వినదని అర్థమై మౌనంగా వెళ్లిపోయాడు భర్త. సునందకి రోషంతో పాటు దుఃఖం కూడా పొడుచుకు వచ్చింది. పనిమనిషి మానేసిన ప్రతిసారీ భర్త తననే ఎందుకు తిడతాడో, వాళ్లు పని మానేయడానికి తనెలా కారణమవుతుందో అర్థం కాదామెకి. ఆమెకే కాదు... ‘వాళ్లు పని చేస్తున్నారు, మనం డబ్బులిస్తున్నాం’ అన్న ఆలోచనతో ఉండే ఏ యజమానురాలికీ ఇది అర్థం కాదు. పనిమనిషిని పనిచేసే మనిషిగానే చూస్తాం తప్ప మన మనిషిగా ఎప్పుడూ అనుకోం. నెలకోసారి జీతం ఇస్తున్నాం కదా అని రోజుకోసారి తిట్టేస్తాం. పండగలకి చీరలు కొనిపెట్టి, పేద్ద ఫేవర్ చేసినట్టు ఫీలవుతాం. మన అవసరం తీరితే చాలు, ఆమె గురించి మనకు అనవసరం అన్నట్టుంటాం. అందుకే కొందరికి పనివాళ్లతో ఎలాంటి బంధం ఏర్పడదు. మనకు అన్ని బంధాలూ ముఖ్యమే. భర్తతో అనుబంధాన్ని పదిలంగా కాపాడుకుంటాం. పిల్లలతో బలమైన అనుబంధాన్ని పెనవేసుకుంటాం. స్నేహితులతో చక్కని అనుబంధాన్ని ఏర్పరచుకుంటాం. చివరకు బాస్‌తో కూడా మంచి అనుబంధం ఉండాలనుకుంటాం. కానీ ఎప్పుడైనా మన పనివాళ్లతో అనుబంధం ఏర్పరచుకోవాలని అనుకున్నామా? ఉద్యోగాలు చేసుకునేవారికి వారానికి ఒకరోజు సెలవు ఉంటుంది. కార్పొరేట్ ఉద్యోగులకైతే రెండురోజులు. అవి కాక పండుగలు, పబ్లిక్ హాలీడేస్ అంటూ ప్రత్యేక సెలవులు బోలెడు. కానీ పనిమనిషికి మాత్రం ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వడానికి ఇష్టపడం. ఎందుకంటే ఆమె రాకపోతే మనకి రోజు గడవదు. ఓపిక లేదని సెలవు అడిగినా ఒప్పుకోం. మన పని చేసి పెట్టి, మనకు విశ్రాంతినిచ్చే ఆమె విశ్రాంతి సంగతి? ఏం... పనివాళ్లకు అనారోగ్యాలు రావా? మనకైతే అనారోగ్యం, పనిమనిషిదైతే వంకా? మనకైతే బ్రేక్, వాళ్లయితే తప్పించుకోవడమూనా? పైగా ఎన్ని రోజులు రాలేదో లెక్కపెట్టి మరీ జీతం కట్ చేస్తాం. ఏ యాక్సిడెంటో అయ్యి రాలేకపోయినా నిర్దయగా వేతనం కట్చేసేస్తాం. మనమిచ్చే ఆ కాస్త డబ్బు మీద ఆధారపడి సాగే జీవితాలు వాళ్లవి. ఒక పూట తింటే రెండోపూట తిండి కోసం తడుముకునే పరిస్థితులు వాళ్లవి. అయినా అవన్నీ మనకు పట్టవు. వాళ్లు పని చేయలేదు, మన జీతమివ్వం. అంతే మన ఫిలాసఫీ! ఇక పండుగలొస్తే... ఆమె మన ఇల్లంతా శుభ్రం చేయాలి. అలంకరించాలి. పిండి వంటలవీ కూడా చేయాలి. మొత్తంగా మన పండుగ ఆమె చేతుల మీదుగా ఆనందంగా ముగిసిపోవాలి. ఎంతసేపూ మన ఇంటి పనే సరిపోతే... మరి ఆమెఎప్పుడు పండుగ చేసుకుంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? తనూ మనిషే. తనకూ సరదాలుంటాయి; తనూ ఒకింటి ఇల్లాలే, తనకీ కొన్ని బాధ్యతలుంటాయి. వాటిని నెరవేర్చుకునే అవకాశం మనం ఆమెకి ఇస్తున్నామా? పోనీ మన కోసం కష్టపడుతోందని, ఆమె ఇంట్లో పండుగకు అవసరమైనవన్నీ మనమే సమకూర్చుతామా అంటే అదీ లేదు. ఒక్క చీర పెట్టి చేయి దులిపేసుకుంటాం. కాసిన్ని పిండివంటలతో నోరు తీపిచేసి వదిలేస్తాం. ఇది... పనిమనిషికి పండగేంటిలే అన్న అల్ప భావమా లేక మన అవసరం తీరాకే మిగిలినవన్నీ అనే స్వార్థమా! లేకపోతే జీతమిస్తున్నాం కాబట్టి మనమేం చెప్పినా చేయాలన్న భావనా! పనిమనిషి అంటే... ‘మనీ తీసుకుని పని చేసే షి’ అన్నాడో మహానుభావుడు. మనం కూడా అదే భావనతో ఉంటున్నామేమో అని ఒక్కోసారి అనిపిస్తుంది. ఆమె ఒకరోజు రాకపోతే ఇల్లు ఎలా ఉంటుందో మనకు తెలుసు. సింకులో ఎంగిలి గిన్నెలు, ఇంటి నిండా చెల్లాచెదురుగా పడి ఉన్న సామాన్లు, గోడలకు వేళ్లాడుతూ వెక్కిరించే బూజులు, నన్ను ఖాళీ చేయండి అంటూ ముక్కు పుటాలను అదరగొట్టి మరీ పిలిచే డస్ట్‌బిన్... వీటినుంచి తప్పించుకోవడం ఎంత కష్టమో తెలియంది కాదు. మనల్ని ఆ కష్టం నుంచి తప్పించే మన మనిషి పనిమనిషి. మనతో ఉండి, మనకోసం అంత కష్టపడే మనిషిని బాగా చూసుకోవడం మనం ధర్మం. ఆమె విలువను ఇప్పటికైనా గుర్తిద్దాం. అలాగని యజమానురాళ్లే ఇబ్బంది పెడతారు, పనివాళ్లంతా మంచివాళ్లే అని చెప్పడం లేదు. వాళ్లలోనూ రకరకాల మనస్తత్వాలు ఉన్నవాళ్లుంటారు. డుమ్మాలు కొట్టి మన మంచితనానికి పరీక్షలు పెట్టేవాళ్లు, ఎడ్డెం అంటే తెడ్డెమని విసిగించేవాళ్లు ఉంటారు. కానీ కొన్ని కావాలంటే కొన్ని భరించక తప్పదు. భర్తలో లోపాలుంటే భరించడం లేదా? పిల్లలు విసిగిస్తుంటే సహించడం లేదా? తల్లిదండ్రులతోటి స్పర్థలు వచ్చినా సర్దుకుపోవడం లేదా? మరి పని మనిషి దగ్గర కాస్త సర్దుకుపోవడానికెందుకంత ఇగో! అయినా ఆ సర్దుబాటు ఆమె కోసమే కాదు... మనకోసం కూడా. మనం ఆమెతో అడ్జస్ట్ అయితే వాదోపవాదాలకు తావుండదు. మనకు బీపీ పెరగదు, మనశ్శాంతి చెడిపోదు, ఆమె మానేస్తుందన్న భయం ఉండదు, మరొకరిని వెతుక్కునే టెన్షనూ ఉండదు. అందుకే వీలైతే ఆమెను డీల్ చేయడం నేర్చుకోండి. లేదంటే అడ్జస్ట్ అయినా అయిపోండి. అంతేకానీ, రోజూ తగవుపడి, సతాయించి, మనమీదే ఆధారపడి బతుకుతోన్న చిన్నవాళ్ల మీద పెత్తనం చెలాయించకండి. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసి లైఫ్‌ని కాంప్లికేట్ చేసుకోకండి. అనుబంధాలను పెంచుకుంటే ఆనందం పెరుగుతుంది. అందుకే పనివాళ్లతో కూడా మంచి బంధాన్ని ఏర్పరచుకోండి. వాళ్లను మీరు బాగా చూసుకోండి... అప్పుడు వాళ్లూ మిమ్మల్ని బాగా చూసుకుంటారు! ఆఫ్ట్రాల్... లైఫ్ ఈజ్ అబౌట్ గివ్ అండ్ టేక్! - సమీర నేలపూడి