సమాజంలో అశాంతి, అల్లకల్లోల భావాలు ప్రజ్వరిల్లుతున్నవేళ ధర్మపథాన్ని చూపేందుకు, జాతి యావత్తునూ ఏకతాటిపై తెచ్చేందుకు ఓ వెలుగు రేఖ ఉద్భవించింది. అష్టాక్షరీ మంత్రాన్ని గాలి గోపురమెత్తి చాటింది. అజ్ఞాన తిమిరాన్ని సంహరించి జ్ఞానమార్గాన్ని చూపింది. ఆ కాంతి కిరణమే ‘భగవద్రామానుజాచార్యులు’. నేటియుగంలో చెప్పుకుంటున్న సహజీవన, సమభావన, సమతావాదాలను ఆనాడే ప్రతిపాదించారు. మూర్తీభవించిన సమతా, మానవతావాదిగా కీర్తిగాంచారు.
తరతరాలకి ఆదర్శం...
విశిష్టాద్వైత సిద్ధాంత నిరూపణతోపాటు సర్వమానవాళిని చైతన్యపరిచేందుకు సహజ– సమభావాలతో ధార్మిక బోధనలు చేస్తూ ఆదర్శమూర్తిగా నిలిచారు. జ్ఞానమార్గంతోపాటు భక్తిమార్గంపై విస్తృత ప్రచారం చేశారు. ధర్మానుష్ఠానంతో జ్ఞానం, సామాజిక న్యాయదృష్టితో చేసే కర్మద్వారా జీవితం సార్థకమవుతుందని ఉద్బోధించారు. వీరి తరువాత దేశంలో బయలు దేరిన అనేక ఉద్యమాలపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రామానుజులవారి ప్రభావం ఉండటం వీరి భావోన్నతికి తార్కాణంగా నిలుస్తోంది.
సిసలైన శ్రీ భాష్యకారుడు...
వేదాంతంలో ఎంతో క్లిష్టమైనటువంటి బ్రహ్మసూత్రాలకు రామానుజులు రాసిన శ్రీభాష్యం అత్యంత ప్రసిద్ధిపొందింది. అలాగే వేదాంతసారం, వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, శరణాగత గద్యం మొదలైన గ్రంథాలు రచించి విశిష్టాద్వైతాన్ని, వేదాంత సాహిత్యాన్ని దేశమంతటా ప్రచారం చేయడానికి పూనుకున్నారు. సాఫల్యం సాధించారు.
ఏడుకొండలవాడి పాద సేవ...
జ్ఞానం, కర్మ అనే రెండు మార్గాలను తనలోఇమడ్చుకునిసాగే భక్తిమార్గాన్నిఎంచుకున్నారు రామానుజులు. ఇది తదనంతరకాలంలో గొప్ప చారిత్రక పరిణామాలకు కారణమైంది. కేవలం పాండిత్యం, జ్ఞానం ఉన్నవారికే దైవం సాక్షాత్కరిస్తుందనే భావనను తొలగించేందుకు అడుగులు వేశారు రామానుజులు.
అవశ్యం... ఆచరణీయం
అణుమాత్రమైనా మినహాయింపు లేకుండా త్రికరణ శుద్ధిగా తనను తాను భగవంతునికి అర్పించుకోవాలి. అటువంటి వారికి భగవంతుడు ప్రసన్నుడై సాయుజ్యాన్ని ప్రసాదిస్తాడన్న రామానుజులు వారి మాటలు అవశ్యం ఆచరణీయం. ఆ మహానుభావుడు జన్మించి 1002 సంవత్సరాలు గడిచినా ఆయన ఏర్పాటు చేసిన రహదారిపై ధర్మరథం ఈనాటికీ పరుగులు పెడుతూనే ఉంది.
– అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని,వేదపండితులు
మూర్తీభవించిన మానవతా వాది భగవద్రామానుజులు
Published Sun, May 19 2019 1:36 AM | Last Updated on Sun, May 19 2019 1:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment