
నేడు (ఏప్రిల్ 10) జైన మత స్థాపకుడు భగవాన్ మహావీర్ జయంతి. శ్రీమంత క్షత్రియ కుటుంబంలో క్రీ.పూ. 599లో బీహార్‌లోని కుండగ్రామంలో మహావీర్ జన్మించారు. ఆయన తండ్రి రాజు సిద్ధార్థ, తల్లి రాణి త్రిశల. చిన్న వయస్సు నుండే వర్థమాన్‌లో ఆధ్యాత్మిక ఆలోచనలు, జీవుల పట్ల కరుణ తొణికిసలాడేది. తన 30 ఏళ్ల వయసులో వర్థమాన్ గృహస్థ జీవితాన్ని త్యజించి, సన్యాస జీవనం స్వీకరించారు. 12 ఏళ్ల కఠిన తపస్సు, ధ్యానం తర్వాత ఆయనకు శుద్ధ జ్ఞానం ప్రాప్తించించదని చెబుతారు.
భగవాన్ మహావీర్.. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే పంచవ్రతాలను బోధించారు. ఆయన బోధనలు జీవులన్నింటనీ సమానంగా గౌరవించడం, శాంతియుత జీవనాన్ని గడపడం లాంటి సూత్రాలపై ఆధారపడ్డాయి. మహావీర్ తన జీవితమంతా పలు ప్రాంతాలలో పర్యటించి జైనమత సిద్ధాంతాలను ప్రచారం చేశారు. క్రీ.పూ. 527లో 72 ఏళ్ల వయసులో, బీహార్‌లోని పావాపురిలో భగవాన్ మహావీర్ నిర్వాణం పొందారు. మహావీర్ బోధనలు ఈ రోజుకు కూడా అందరినీ శాంతి, అహింసల దిశగా ప్రేరేపిస్తున్నాయి.
భగవాన్ మహావీర్ 10 బోధనలు
1. అహింస: ఏ జీవికీ హాని చేయకుండా జీవించడం అత్యంత ఉన్నతమైన ధర్మం.
2. సత్యం: ఎల్లప్పుడూ నిజం మాట్లాడటం, నీతి నిజాయితీతో జీవనం సాగించడం.
3. అస్తేయం: ఇతరుల వస్తువులను దొంగిలించకుండా, వారి అనుమతి లేనిదే తీసుకోకుండా ఉండటం.
4. బ్రహ్మచర్యం: శారీరక, మానసిక కోరికలను నియంత్రించి, స్వచ్ఛమైన జీవనం గడపడం.
5. అపరిగ్రహం: అవసరానికి మించిన సంపద, ఆస్తులపై ఆసక్తి వదిలి సాధారణ జీవనం గడపడం.
6. కరుణ: అన్ని జీవుల విషయంలో దయ, సానుభూతి చూపడం.
7. క్షమ: ఇతరుల తప్పులను క్షమించడం, కోపాన్ని అధిగమించడం.
8. సమత్వం: సుఖంలోనూ, దుఃఖంలోనూ సమ భావనతో ఉండటం.
9. ఆత్మ శుద్ధి: మనసు, మాట, చేతలతో మనలోని పవిత్రతను కాపాడుకోవడం.
10. ధ్యానం: ఆత్మ సాక్షాత్కారం కోసం ధ్యానం అవలంబించడం. పవిత్ర ఆలోచనలను పెంపొందించుకోవడం.
ఇది కూడా చదవండి: వేడెక్కిన ‘పటేల్’ రాజకీయాలు.. ‘ఉక్కు మనిషి’పై హక్కు ఎవరిది?