
శాంతిసామరస్యాలతోనే ఏ సమస్యలైనా పరిష్కారం అవుతాయంటారు. శాంతియుత జీవనశైలి మనిషిని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళుతుందని చెబుతారు. ఈ భావనకు ఆలంబనగా నిలిచేలా దేశంలో తొలి విశ్వశాంతి కేంద్రాన్ని(The first world peace center) హర్యానాలోని గురుగ్రామ్‌లో నిర్మించారు. ఈరోజు(మార్చి 2, ఆదివారం) ఈ కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఆధ్యాత్మిక వేత్త శ్రీ శ్రీ రవిశంకర్, యోగా గురువు స్వామి రామ్ దేవ్ తదితరులు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో హర్యానా ముఖ్యమంత్రి నయీబ్ సైనీ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా కూడా పాల్గొననున్నారు.
అహింసా విశ్వ భారతి వ్యవస్థాపకులు ఆచార్య లోకేష్ ముని స్థాపించిన విశ్వ శాంతి కేంద్రం ప్రపంచంలో శాంతిని ప్రోత్సహించడానికి, జాతీయ, అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించడానికి చొరవ చూపనుంది. దీనిని హర్యానా(Haryana)లోని గురుగ్రామ్‌లో సెక్టార్-39లో నిర్మింపజేశారు. ఈ కేంద్రం భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని చాటిచెప్పడమే కాకుండా, ప్రపంచ శాంతి సందేశాన్ని కూడా ముందుకు తీసుకువెళుతుంది.
ఈ కేంద్రంలో ఐక్యరాజ్యసమితి (యూఎన్‌ఓ)సహకారంతో జైన జీవనశైలి, ఆధ్యాత్మికతపై పరిశోధన,శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రాజస్థాన్‌లోని పచ్చపదర నివాసి ఆచార్య లోకేష్ ముని ప్రపంచవ్యాప్తంగా శాంతి, అహింస సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విశ్వశాంతి కేంద్రం ప్రారంభోత్సవం మార్చి 2న ఉదయం 10 గంటలకు జరగనుంది.
ఇది కూడా చదవండి: గుజరాత్ చేరుకున్న ప్రధాని మోదీ.. నేడు ’వంతారా’ సందర్శన