రాయచూరులో భారీ వర్షం
రాయచూరు సిటీ, న్యూస్లైన్ : రాయచూరు నగరంలో వారం రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి దాదాపు 3 గంటల సేపు కురిసిన భారీ వర్షానికి రహదారులు, వీధులు జలమయం అయ్యాయి. ఏ వీధిలో చూసినా మోకాలు లోతున నీరు ప్రవహించాయి.
మురికి కాలువల్లోని చెత్తా చెదారం రోడ్లపై చేరింది. దీంతో ప్రజలు పలు ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బంగికుంట, మడ్డిపేట, షియాతలాబ్, అరబ్మౌల, చంద్రకాంత్ టాకీస్, బసవన బావి చౌక్, మున్నూరు వాడి పాఠశాల, ఆస్మియా కాంపౌండ్ వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు ప్రవాహాన్ని తలపించింది. మహావీర్ చౌక్లో నీరు అధికంగా ప్రవహించడంతో అరగంట సేపు ద్విచక్ర వాహనాల రాకపోకలు స్తంభించి పోయాయి. రోడ్లపై వ ర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు.
జలమయమైన పలు ప్రాంతాలను గురువారం ఉదయం ఉపాధ్యక్షురాలు పద్మ సందర్శించారు. నగరంలోని బంగికుంట, మహాబలేశ్వర చౌక్, బెస్తవారి పేట, హరిహర రోడ్ తదితర ప్రాంతాల్లో మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించడంలో నగరసభ పారిశుద్ధ్య సిబ్బంది జాప్యం చేయడంపై మండిపడ్డారు. ఆమె వె ంట నగరసభ సభ్యులు జయణ్ణ, శివమూర్తి, శశిరాజు, నరసప్ప, మహబూబ్, మల్లేశప్ప ఉన్నారు.