పెళ్లి తప్పనిసరా?
మనసులో మాట
విమర్శ
‘‘నీ గురించి ఫలాన విమర్శ చదివి నాకు బాధ అనిపించింది. నీకేమీ అనిపించలేదా?’’ అని కొందరు అడుగుతుంటారు.
‘‘నాకేమీ బాధ లేదు. నువ్వు బాధ పడితే నేనేమీ చేయలేను’’ అంటాను. నా సమాధానం విని ఆశ్చర్యపోతారు.
మనిషి మనస్తత్వం గురించి ఎన్నో పుస్తకాలు చదివాను. మానవమనస్తత్వంలో ప్రతి కోణం గురించి నాకు తెలుసు. మనిషికి తిండిలాగే విమర్శ కూడా కావాలి. నిన్న విమర్శించిన వారే... ఇవ్వాళ ప్రశంసిస్తారు. కాబట్టి విమర్శను గురించి తీవ్రంగా ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోను.
వినోదం
ఒంటరిగా ఉండడం కంటే స్నేహితులతో ఉండడానికి ఇష్టపడతాను. స్నేహితులు ఉన్నచోట వినోదానికి కొదవా? నవ్వడం ద్వారా కొత్త శక్తి చేరినట్లు అనిపిస్తుంది.
విహారం
గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రపంచమంతా తిరుగుతూనే ఉన్నాను. నేను ఎక్కడ ఉంటే అదే నా ఇల్లు అనుకుంటాను. నేను ఏ దేశంలోనైనా ఎక్కడైనా బతకగలను. ఒక కొత్త ప్రదేశాన్ని చూసినప్పుడు నాలో కలిగే అనుభూతి మాటలకు అందనిది. ఒక చోటుకు వెళ్లిన తరువాత ‘‘నెక్స్ట్ ఎక్కడికీ?’’ అని ఆలోచిస్తూనే ఉంటాను.
వివాహం
వివాహం అనేది తప్పనిసరి కాదని అభిప్రాయపడుతున్నాను. పెళ్లి ప్రాముఖ్యం గురించి ఎంతో గొప్పగా చెప్పి, పెళ్లి తరువాత రకరకాల కష్టాలతో కన్నీళ్లు కార్చే వారు ఎంతోమంది నాకు తెలుసు. ఏ జంటనైనా చూస్తే... పెళ్లి చేసుకోవాలనే ఆలోచన బలంగా కలగాలి. దురదృష్టవశాత్తు అలాంటి జంట ఒక్కటి కూడా నాకు కనిపించలేదు! పెళ్లి అవసరం లేదని అనడం లేదు, అత్యవసరం కాదు అని మాత్రం అంటున్నాను.
- నర్గీస్ ఫక్రీ, హీరోయిన్