రాజకీయాల్లోకి సమర్థులు రావాలి | Philosophy, ideas and a glimpse of Bal Narendra: Takeaways from PM's Teachers' Day event | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లోకి సమర్థులు రావాలి

Published Sat, Sep 5 2015 1:32 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

రాజకీయాల్లోకి సమర్థులు రావాలి - Sakshi

రాజకీయాల్లోకి సమర్థులు రావాలి

పాలిటిక్స్ అంటే ప్రజలు భయపడే పరిస్థితి మారాలి
     ♦ విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి
     ♦ పిల్లలపై కెరీర్ లక్ష్యాలను బలవంతంగా రుద్దకూడదు
     ♦ ఇకపై విద్యార్థులకు క్యారెక్టర్ సర్టిఫికెట్ బదులుగా ఆప్టిట్యూడ్ సర్టిఫికెట్
     ♦ 2022 నాటికి అందరికీ నిరంతరాయంగా విద్యుత్
     ♦ 'టీచర్స్ డే' కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: 'రాజకీయాలంటే ప్రజలు భయపడుతున్నారు. రాజకీయాలకు అంత చెడ్డపేరు వచ్చింది. రాజకీయాల్లో చేరేవారెవరూ మంచివారు కాదనే అభిప్రాయం ఏర్పడింది. దాంతో మంచివారెవరూ ఈ రంగంలోకి రావడంలేదు. ఈ ధోరణి దేశానికి చేటు చేస్తుంది. ఆ పరిస్థితి మారాలి. రాజకీయాల పట్ల దురభిప్రాయం పోవాలి. అన్ని వర్గాల్లోని మంచి వ్యక్తిత్వం ఉన్న, సమర్థులైనవారు రాజకీయాల్లోకి రావాలి' అని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు ముఖ్యమైన అంతర్భాగమని, తెలివైన, మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం అవసరమని అన్నారు. అలాంటివారు ఎంతమంది రాజకీయాల్లోకి వస్తే.. దేశానికి అంత మంచి జరుగుతుందని పేర్కొన్నారు. నాయకత్వ లక్షణాలను, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలంటూ విద్యార్థులకు సూచించారు.

దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజలు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నందువల్లనే ఆ ఉద్యమం అంత శక్తిమంతమైందన్నారు. శనివారం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని పలు పాఠశాలల నుంచి వచ్చిన 800 మంది విద్యార్థులు, 60 మంది ఉపాధ్యాయులతో మానెక్ షా ఆడిటోరియంలో ఆయన ముఖాముఖి నిర్వహించారు. గంటన్నర పైగా వారితో సరదాగా గడిపి, తన వస్త్రధారణ, విద్యార్థి జీవితం తదితరాలపై వారడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. 9 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని పదవి చేపట్టాక విద్యార్థులతో మమేకం కావడం మోదీకి ఇది రెండో సారి. లక్ష్యఛేదనలో విఫలమైతే ఆందోళన చెంది, వెనకడుగు వేయవద్దని ఈ సందర్భంగా మోదీ విద్యార్థులకు సూచించారు.

అలాగే, పిల్లల కెరీర్‌కు సంబంధించి తమ సొంత లక్ష్యాలను పిల్లలపై రుద్దొద్దంటూ తల్లిదండ్రులకు హితవు చెప్పారు. ‘పాఠశాలను వదిలివెళ్లే సమయంలో పిల్లలకు నడవడిక సర్టిఫికెట్లు ఇస్తుంటారు. వాటికి బదులు, వారి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఆప్టిట్యూడ్ సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిందిగా మానవ వనరుల అభివృద్ధి శాఖకు ఆదేశించాను’ అన్నారు. ఆ సర్టిఫికెట్లలో విద్యార్థుల క్రమశిక్షణ, స్నేహపాత్రత మొదలైన వివరాలుంటాయన్నారు. వాటిని 3 నెలలకు ఒకసారి స్నేహితులు, ఉపాధ్యాయులు, తల్లితండ్రుల నుంచే సేకరించేలా త్వరలో సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ఈ వివరాల ద్వారా విద్యార్థి తన వాస్తవ సామర్ధ్యాన్ని తెలుసుకునే, అవసరమైతే తన నడవడికను మార్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. టీచర్స్ డే సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్మారక నాణాన్ని మోదీ విడుదల చేశారు. కళల్లో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు 'కళా ఉత్సవ్' వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.  
 చెంబు ఇస్త్రీ.. చాక్‌పీస్ పాలిష్..: 'అందరూ అనుకుంటున్నట్లు నా దుస్తులను రూపొందించేందుకు ప్రత్యేక ఫ్యాషన్ డిజైనర్ ఎవరూ లేరు. నాకు ప్రత్యేక డ్రెస్ డిజైనర్ ఉన్నారన్నది అపోహ మాత్రమే. సింపుల్‌గా డ్రెస్ చేసుకోవడం నాకిష్టం' అని మోదీ పేర్కొన్నారు. 'మీ కుర్తా చాలా ఫేమస్ కదా!' అన్న విద్యార్థుల వ్యాఖ్యపై.. ‘గుజరాత్ వాతావరణం కాస్త వేడిగా ఉంటుంది. అందువల్ల కుర్తా, పైజామా ధరించడం అలవాటు చేసుకున్నా. మా కుటుంబానిది చాలా సాధారణ ఆర్థిక నేపథ్యం. నా బట్టలు నేనే ఉతుక్కునేవాడిని. పూర్తి చేతుల చొక్కా ఉతకడానికి ఎక్కువ సమయం పడ్తుంది కాబట్టి కుర్తా చేతుల్ని భుజాల వరకు కత్తిరించి, హాఫ్ స్లీవ్స్ కుర్తాగా మార్చుకున్నా. నాకు నీట్‌గా ఉండటం ఇష్టం. నా దుస్తులను బయట ఇస్త్రీ చేయించుకునేందుకు డబ్బులు ఉండేవి కాదు. అందువల్ల చెంబులో నిప్పులను వేసి, దాంతో ఇస్త్రీ చేసుకునేవాడిని. బూట్లను తెల్లగా చేసుకునేందుకు స్కూల్ నుంచి చాక్‌పీస్‌లు తెచ్చుకునేవాడిని' అని నవ్వుతూ అన్నారు.

 
 విద్యార్థులే ఉపాధ్యాయుడి గుర్తింపు.. 'విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర. తల్లి బిడ్డకు ప్రాణం పోస్తుంది. కానీ ఆ బిడ్డకు జీవాన్ని ఇచ్చేది గురువే. పిల్లలు తమ టీచర్ చెప్పేది జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. విద్యార్థులే ఉపాధ్యాయుడి గుర్తింపు. ఓ డాక్టర్ ఒక ప్రాణం కాపాడితే, ఆ మర్నాడే  పేపర్లలో వస్తుంది. కానీ 100 మంది డాక్టర్లను తయారుచేసే గురువుకు ఏ గుర్తింపూ రాదు. గొప్ప డాక్టర్లు, శాస్త్రవేత్తల వెనుక ఓ గొప్ప ఉపాధ్యాయుడి కృషి ఉంటుంది. టీచర్ల కృషిని గుర్తించి, గౌరవించుకునేందుకే టీచర్స్ డే జరుపుకుంటున్నాం. మాజీ రాష్ట్రపతి కలాం తనను ఒక ఉపాధ్యాయుడిగానే సమాజం గుర్తుంచుకోవాలని కోరుకునేవారు'
 
 'ఎవరెస్టు' పూర్ణ ప్రశ్నతో ప్రారంభం
 నిజామాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా తాడ్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల 10వ తరగతి విదార్థిని, ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన మాలవత్ పూర్ణ వీడియో కాన్ఫరెన్సులో ప్రధానిని అడిగిన ప్రశ్నతో విద్యార్థులతో ఇష్టాగోష్టి ప్రారంభమైంది. నిజామాబాద్ కలెక్టరేట్ నుంచి పూర్ణ గోష్టిలో పాల్గొంది. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరన్న పూర్ణ ప్రశ్నకు.. 'కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. మా ఊరి లైబ్రరీలో వివేకానంద జీవితం, బోధనలు చదువుకున్నాను. అవి నాపై ప్రభావం చూపాయి. టీచర్లతో సన్నిహితంగా ఉండేవాడిని. మా అమ్మ నన్ను బాగా చూసుకునేవారు. అయినా, ఏ ఒక్క వ్యక్తో మన జీవితాల్ని మార్చేస్తారనుకోవడం సరికాదు. నేర్చుకునే తత్వం ఉండాలి. రైలు ప్రయాణంలోనూ కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటాం' అని జవాబిచ్చారు. అంతకుముందు పూర్ణతో.. 'ఎవరెస్టు పర్వతం దిగివచ్చాక నీతో మిత్రులు ఎలా ఉన్నారు?  నీవు చాలా గొప్ప పనిచేశావని, గొప్పదానివయ్యావని దూరంగా వెళ్లలేదు కదా? గొప్పవ్యక్తి కావడంలో గొప్ప కష్టం ఉంది' అంటూ చమత్కరించడంతో నవ్వులు పూశాయి.
 
 విద్యార్థులతో మోదీ ముఖాముఖిలోని ముఖ్యాంశాలు..
    వేరువేరు రంగాల్లోని ఉద్ధండులు విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు కనీసం వారానికి గంట కేటాయించాలి. లేదా ఏడాదికి 100 గంటలు వారికి కేటాయించేలా చూసుకోవాలి. దాంతో బోధనారంగం సృజనాత్మకమవుతుంది. (రాజకీయ నేతలు మాత్రం ఆ పని చేయొద్దు.  ఏదో చెప్పాలనుకుని మరేదో బోధిస్తారంటూ చమత్కరించారు)
     మీకిష్టమైన ఆట ఏదని ఓ విద్యార్థి అడగ్గా..ఆర్థిక వనరులు అంతగా లేని కుటుంబం కావడంతో చిన్నప్పుడు ప్రత్యేకంగా క్రీడలపై దృష్టి పెట్టలేకపోయాను. చెట్లెక్కడం బాగా వచ్చు. బట్టలు ఉతుక్కోవడానికి వెళ్లినప్పుడు చెరువులో ఈత కొట్టేవాడిని. అయినా, మా రాజకీయ నేతలు బాగా ఆడే ఆట ఏదో మీకు తెలుసుగా.
   తమ భవిష్యత్తును, జీవిత లక్ష్యాలను నిర్ధారించుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉండాలి. తాము సాధించలేని కెరీర్ లక్ష్యాలను తల్లిదండ్రులు తమ పిల్లలపై రుద్దవద్దు. దానివల్ల డిగ్రీలు, ఉద్యోగాలకే విద్యార్థుల లక్ష్యం పరిమితమవుతుంది.
  అంతర్జాతీయ యోగా దినోత్సవం భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన గుర్తింపును కాపాడుకోవాలి. యోగాతో  వ్యక్తి ఉత్తేజితుడవుతాడు. సంవత్సరం మొత్తం మీద జూన్ 21వ తేదీన పగటి సమయం అత్యధికంగా ఉంటుంది, సూర్యరశ్మి ఎక్కువసేపు ప్రసరిస్తుంది. అందుకే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆ రోజు జరుపుకోవాలని నిర్ణయించాం.
   దేశం 75 ఏళ్ల స్వాతంత్య్రవేడుకలు జరుపుకోనున్న 2022 నాటికి అందరికీ 24 గంటల పాటు నిరంతరాయ విద్యుత్ అందించడం నా స్వప్నం, దాన్నే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రభుత్వ పథకాల అమలుకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అవసరం. ప్రస్తుతం దేశంలో 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. రానున్న 1000 రోజుల్లో ఆ గ్రామాల్లో విద్యుదీకరణ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చాను. ప్రస్తుతం దేశంలో 3 లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్ధ్యం ఉంది. 2015-16 నాటికి 1,137 బిలియన్ యూనిట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాం.
  చాలామంది కవిత్వం రాస్తుంటారు. కవితలు కొందరి కలం నుంచి జాలువారితే, మరి కొందరి కన్నీటి నుంచి వస్తాయి. నా అనుభవాలు, పరిశీలనలనే కాగితంపై పెట్టా. పరిశీలన స్వభావం, ఎక్కువ సమయం ప్రకృతితో కలిసి ఉండడం కవిత్వం రాయడానికి ఉపకరించింది(కవి ఎలా అయ్యారన్న ప్రశ్నకు..)
    వేదిక ఎక్కి ప్రసంగాలు చేసేప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తే ప్రజలు నవ్వితే నవ్వుతారు. ఆందోళన చెందవద్దు. ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. నోట్ చేసుకునే అలవాటు మంచిది కాదు.  కాగితం పట్టుకుని చదివితే కంగారుపడిపోతాం. అవసరమైన విషయాలపై సమగ్రసమాచారాన్ని ముందే చదివి అవగాహన చేసుకోవాలి. విద్యార్ధులు పబ్లిక్ స్పీకింగ్ కోర్సులను అధ్యయనం చేయాలి. యూట్యూబ్‌లో ప్రసిద్ధ వ్యక్తుల ప్రసంగాలను చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement