సంపాదకీయం
సాధారణంగా ఉపాధ్యాయ దినోత్సవం రోజున చాలా పాఠశాలల్లో ‘పిల్లల పిరీయడ్’ ఉంటుంది. పిల్లలే టీచర్ల అవతారమెత్తి తరగతుల్లో ‘పెత్తనం’ చేస్తారు. రోజూ తమతో వారు ఎలా వేగుతున్నారో అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారు. కానీ, ఈసారి ఆ బాధ్యతను ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్నారు. న్యూఢిల్లీ మానెక్ షా ఆడిటోరియంలో వేయిమంది విద్యార్థులను... దేశవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్‌ను వీక్షిస్తున్న మరిన్ని వేలమందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వాళ్లడిగిన ప్రశ్నలకు, సందేహాలకు వారి మాటల్లోనే జవాబులిచ్చారు. ఈ క్రమంలో తానూ చిన్నపిల్లాడిగా మారారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను వారితో పంచుకున్నారు. చతురోక్తులతో వారిని అలరించారు. తనలో ఒక మంచి బోధకుడు, ఉపాధ్యాయుడు ఉన్నారని రుజువుచేశారు.
ఈ కార్యక్రమమంతా పూర్తయ్యాక అసలిది ఇంత వివాదాస్పదం ఎందుకయిందని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే, ఇందుకు నిందించవలసింది ముందుగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖనే! ఆ శాఖనుంచి వివిధ విద్యాసంస్థలకు వెళ్లిన ఉత్తర్వులు, వాటి ఆధారంగా కొన్ని విద్యా సంస్థలు చేసిన హడావుడి అనవసర వివాదానికి అంకురార్పణ చేశాయి. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌కు పాఠశాలలన్నీ తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, ఆ కార్యక్రమం పూర్తయ్యాక అందులో ఎన్ని పాఠశాలలు పాల్గొన్నాయో, ఎందరు విద్యార్థులు వీక్షించారో తాము సమీక్షిస్తామని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో ఉన్నది. ఈ ఉత్తర్వులు అందుకున్నాక కొన్ని పాఠశాలలు ‘విద్యార్థులందరికీ హాజరు తప్పనిసరి. గైర్హాజరైనవారిపై కఠిన చర్యలుంటాయి’ అంటూ సర్క్యులర్‌లు జారీచేశాయి. కొందరు గడుసు ప్రిన్సిపాళ్లు సోమవారంనుంచి జరగబోయే పరీక్షల్లో ‘మోడీ ప్రశ్నలు’, వాటికి మార్కులు ఉంటాయని హెచ్చరించారు. ఇంతా జరిగాక ఇక వివాదం రేకెత్తకుండా ఎందుకుంటుంది? నరేంద్ర మోడీ సహజంగానే వాక్పటిమ ఉన్నవారు. వినేవారిని మంత్రముగ్ధుల్ని చేయగల సత్తా ఆయనకుంది. ఆ సంగతి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అందరికీ తెలిసింది. పైగా, మధ్యతరగతి వర్గంలో మోడీపై ఇప్పుడు ప్రత్యేక అభిమానం ఉన్నది. ఆయన ప్రసంగించబోయేది పిల్లలనుద్దేశించే గనుక దాన్ని తమ పిల్లలంతా వినాలని వారు సహజంగానే కోరుకుంటారు. అటువంటప్పుడు హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ బెదిరింపు లాంటి ఉత్తర్వులు పంపాల్సిన అవసరమేముంటుంది?
నరేంద్ర మోడీ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. ఆయనకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) నేపథ్యం ఉన్నది. అందులో పనిచేసిన అనుభవంవల్ల ఎవరిని ఎలా ఆకట్టుకోవాలో, అందుకు ఎలా మాట్లాడాలో తెలిసివున్న వ్యక్తి. ఆయన ప్రసంగాలు ఆశువుగా మాట్లాడినట్టు ఉంటాయి తప్ప అందుకోసం ప్రత్యేకించి తర్ఫీదై వచ్చినట్టు ఉండవు. అందువల్లే పిల్లలతో ఆయన ఇట్టే కలిసిపోయారు. నైతిక విలువలు, జాతి నిర్మాణం వంటి గంభీరమైన అంశాలు చెప్పడంతోపాటు వారి స్థాయికి వెళ్లి ఎన్నో విషయాలపై వారిలో ఆలోచన రేకెత్తించారు. బాలికా విద్య గురించి అయినా, విద్యుత్ పొదుపు గురించి అయినా, పర్యావరణం గురించి అయినా ఆయన పిల్లలకు అర్ధమయ్యే భాషలో మాట్లాడారు. ఎప్పుడూ పుస్తకాలకూ, టీవీలకూ, కంప్యూటర్లకూ అతుక్కుపోవద్దని...ఆరుబయటకెళ్లి ఆడుకొని చెమట చిందించాలని సూచించారు. దీపాలు తీసి పున్నమి రాత్రులను ఆస్వాదించమన్నారు. పిల్లలు అడిగిన ప్రశ్నల్లో ఎక్కువ భాగం వారి టీచర్లో, తల్లిదండ్రులో ఎంపికచేసినవి అయివుంటాయని వేరే చెప్పనవసరం లేదు. కానీ, చివర్లో ‘నాలో మీకేం నచ్చింద’ని మోడీ వేసిన ప్రశ్నకు వారిచ్చిన జవాబు మాత్రం అచ్చంగా వారి సొంతం. తమకు మోడీ చిన్ననాటి అల్లరే నచ్చిందని వారంతా ముక్తకంఠంతో బదులిచ్చారు. పిల్లలు కాదు... పిడుగులనేది అందుకే!
మోడీ తన సంభాషణలో ఉపాధ్యాయుల గురించి కూడా మాట్లాడారు. బోధనలో సాంకేతిక సౌకర్యాలు వినియోగించుకోమని వారికి సలహా ఇచ్చారు. దేశంలో విద్యారంగం ప్రాముఖ్యత పెరుగుతుంటే ఉపాధ్యాయుల కొరత వేధిస్తున్నదని చెప్పారు. ఆయనన్నది నిజమే. విద్యారంగం ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నది. మోడీ కార్యక్రమాన్ని కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు రేడియోల ద్వారా మాత్రమే వినడం ఇందుకు రుజువు. విద్యాహక్కు చట్టం వచ్చి నాలుగేళ్లు దాటుతున్నా ఈ రంగం మెరుగుపడలేదు. నిరుడు గుజరాత్, యూపీ, బీహార్‌లలో అడ్‌హాక్ టీచర్ల నియామకంపై దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ ప్రభుత్వాల తీరును సుప్రీంకోర్టు దుయ్యబట్టింది. తగిన అర్హతలున్నాయనుకుంటే నేరుగా ఉపాధ్యాయులుగానే తీసుకోవచ్చును కదా...‘శిక్షా సహాయక్’ల పేరుతో నియమించి అరకొర వేతనాలు ఎందుకిస్తున్నారని నిలదీసింది. అర్ధాకలితో, భవిష్యత్తుపై బెంగతో పనిచేసే టీచర్లనుంచి మెరుగైన విద్యాబోధన ఆశించడం ఎలా సాధ్యమో ప్రభుత్వాలు ఆలోచించాలి. వచ్చే జీతం చాలక ఉపాధ్యాయుల్లో కొందరు రియల్‌ఎస్టేట్, చిట్‌ఫండ్ వ్యాపారాలవంటివి చేస్తున్నారని ఆమధ్య ఒక నివేదిక తెలిపింది. ఎన్నో పాఠశాలలు తగిన భవనాలు లేక, ఉన్నా అవి శిథిలావస్థకు చేరుకుని చెట్లకింద కాలక్షేపం చేస్తున్నాయి. ఇక నల్లబల్ల, బెంచీలు వంటివి లేని పాఠశాలలు ఎన్నో! ఎందుకనిపించిందోగానీ... బాలల దినోత్సవం (నవంబర్ 14) నాడు కాకుండా ఉపాధ్యాయ దినోత్సవం రోజున పిల్లలతో మాట్లాడాలని నరేంద్ర మోడీ నిర్ణయించుకున్నారు. బాగుంది. అయితే, ఈ విద్యారంగం సమస్యలన్నిటిపైనా ప్రత్యేక దృష్టి పెట్టి సాధ్యమైనంత త్వరలో వాటిని పరిష్కరించగలిగితే ఆ పిల్లల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు.