ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలను భాగస్వామ్యం చేయడం ప్రజాస్వామ్య విధానం. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన భారతదేశంలో ఈ విధానం ఈనాటిది కాదు. అదే çపరంపరను అనుసరిస్తూ మొదలైన ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం విజయవంతం కావడంలోని రహస్యం అదే. రేడియో ద్వారా ప్రజలతో సంభాషిస్తూ, దేశాభివృద్ధిలో వారందరినీ భాగస్వాముల్ని చేస్తూ, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో 2014 అక్టోబర్ 3న ప్రధానమంత్రి ఈ కార్యక్రమం ప్రారంభించారు. రాజకీయాలకు అతీతంగా దేశంలోని సామాన్యుల అసామాన్య గాథలను ఇందులో ప్రస్తావిస్తుండటం దేశ పౌరులపై లోతైన ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. ప్రధానమంత్రిగా కాకుండా... స్నేహితుడిగా, సంరక్షకుడిగా, సన్నిహితుడిగా... వివిధ సందర్భాల్లో, వివిధ పాత్రల్లో ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ‘మన్ కీ బాత్’ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి నెలా చివరి ఆదివారం వచ్చే ఈ కార్యక్రమం ఈ రోజు వందో ఎపిసోడ్ పూర్తి చేసుకోనుండటం చరిత్రాత్మకం!
ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. అందుకే... ప్రజల భాగస్వామ్యంతో జరిగే ఏ పనికైనా ప్రజాస్వామ్యంలో అదే స్థాయిలో గౌరవ మర్యాదలు, ఆదరణ లభిస్తాయి. తమ సంక్షేమం, మంచి చెడ్డల గురించి ఆలోచించి, సమయానుగుణంగా మార్గదర్శనం చేసే వ్యక్తిని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటారు.
భారతదేశంలో ఈ సంప్రదాయం ఈనాటిది కాదు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలను భాగ స్వామ్యం చేసిన సందర్భాలెన్నో ఉన్నాయి. చోళుల కాలంలో తమిళనాడులోని ఉత్తర మెరూర్‌లో గ్రామసభ, మన పక్కనున్న కర్ణాటకలోని బీదర్ జిల్లాల్లో బసవేశ్వరుడి ‘అనుభవ మండపం’ వంటివి పురాతన కాలం నుంచే దేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థకు అద్దం పడతాయి. అందుకే ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన భారతదేశంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ జరిగే కార్య క్రమాలు విజయవంతం అయ్యాయి. సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్న 21వ శతాబ్దంలోనూ ఇదే ప్రజాస్వామ్య పద్ధతిని అవలంబిస్తూ... రేడియో ద్వారా నిరంతరం ప్రజలతో సంభాషించడం, తద్వారా వారందరినీ భాగ స్వామ్యం చేస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో 2014 అక్టోబర్ 3న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ను ప్రారంభించారు. ప్రతినెలా చివరి ఆదివారం గ్రామాల్లో, విద్యాసంస్థల్లో, వీధుల్లో, ప్రభుత్వ ఆఫీసుల్లో, పార్టీ కార్యాలయాల్లో... ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకొస్తున్న ‘మన్ కీ బాత్’ వందో ఎపిసోడ్ పూర్తి చేసుకోనుండటం చరిత్రాత్మకమే.
మీ మాట.. నా నోట!
దేశ ప్రజల శక్తిసామర్థ్యాలు, సాహసం, శౌర్యం, ఆత్మవిశ్వాసం, స్ఫూర్తి దాయక గాథల గురించి చర్చిస్తూనే... ప్రజాసమస్యలు, సవాళ్లను ప్రస్తావిస్తూ వారిని చైతన్య పరచడం, ఆ సమస్యలపై వారిని పోరాటానికి సిద్ధం చేయడం... దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ పనిని ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి స్వయంగా నిరంతరాయంగా చేస్తుండటమే ప్రజల్లో ఈ కార్యక్రమం పట్ల ఆదరణకు కారణం.
‘మన్ కీ బాత్’ అనేది మీది, నాది, మనందరి మనసులోని మాట. ప్రధాని వాక్కు ద్వారా దేశం మొత్తానికి తెలియజెప్పబడుతున్న ‘మన మాట’. ‘గొంతు నాదే కానీ భావన మీ అందరిదీ’ అని ప్రధాని కూడా తరచుగా చెబుతుంటారు. అందుకే ప్రధాని మాటలు, దేశంలోని 90 శాతం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటాయి. మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న అద్భుతమైన కార్యక్రమా లను, అక్కడి సామాన్యుల అసామాన్యమైన ఆలోచనను గుర్తుచేస్తూ... దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపడం; కరోనా రూపంలో ‘తాత్కాలిక గ్రహణం’ పట్టిన సమయంలో ‘జాగ్రత్తగా ఉండండి, మేమున్నాం’ అనే భరోసా ఇవ్వడం...వంటి ఎన్నో సానుకూలమైన మార్పులకు వేదిక ఈ ‘మన్ కీ బాత్’.
ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మాట్లాడిన మాటల గురించి.. తర్వాతి రోజు పేపర్లలో, టీవీ ఛానళ్లలో చర్చ జరగడం ద్వారా ఎందరో సాధారణ వ్యక్తుల అసాధారణ ప్రతిభ ప్రపంచానికి పరిచయమైంది. ప్రధానమంత్రికి కోట్ల సంఖ్యలో ఉత్తరాలు వస్తాయి. వాటిలోని అంశాలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ, ప్రజలు తమ అభిప్రాయాలను దేశ ప్రజలతో పంచుకునేలా ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులు రాసిన లేఖలను కూడా వీలున్నప్పుడు చదువుతూ, నేరుగా వారితో మాట్లాడిన సందర్భాలెన్నో ఉన్నాయి. ఓ ప్రధానమంత్రిగా కాకుండా... స్నేహితుడిగా, సంరక్షకుడిగా, సన్నిహితుడిగా... వివిధ సందర్భాల్లో వివిధ పాత్రల్లో ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ‘మన్ కీ బాత్’ కార్యక్రమం కొనసాగుతోంది. అందుకే ప్రజలు ప్రధానిని గుండెల్లో పెట్టుకున్నారు.
ప్రధానినైనా.. మీలో ఒకడినే!
ఓ రకంగా చెప్పాలంటే ‘మన్ కీ బాత్’... భారతదేశపు నెలవారీ సమీక్షగా భావించవచ్చు. ఇందులో ప్రజలు, వారి సమస్యలు, పరిష్కారాలు, సమా జాభివృద్ధి కోసం అక్కడక్కడ వ్యక్తులు చేస్తున్న మహోతన్నమైన పనులు పేర్కొంటూనే... కేంద్రప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలు, సంక్షేమ కార్య క్రమాలను వివరిస్తూ వీటి ద్వారా లబ్ధి పొందేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తున్నారు. స్వచ్ఛ భారత్, సెల్ఫీ విత్ డాక్టర్ (కరోనా సమయంలో), జల సంరక్షణ, అవినీతి రహిత, మత్తుపదార్థాల ప్రభావం లేని భారత్ నిర్మాణంతో పాటుగా కుంభమేళా, ఇంక్రెడిబుల్ ఇండియా, ఫిట్ ఇండియా, బేటీ బచావో – బేటీ పఢావో, యోగా, ఖాదీకి ప్రోత్సాహం వంటి ఎన్నో విషయాలను చర్చిస్తున్నారు. గత ఎనిమిదేళ్లలో ఖాదీ రంగం ఉత్పత్తి 191 శాతం, కొనుగోళ్లు 332 శాతం పెరగడం, స్వచ్ఛందంగా ఎల్పీజీ సబ్సిడీని వదులుకోవడం, కరోనా సమయంలో నిబంధనలను పాటించడం వంటివి... ప్రధాని మోదీ మాటలను ప్రజలు విశ్వసించి భాగస్వాములు అవుతున్నారని చెప్పేందుకు నిదర్శనం.
అందుకే చాలా కేంద్ర ప్రభుత్వ విభాగాలు తమ మంత్రిత్వ శాఖలో జరుగుతున్న పురోగతిని, కొత్త పథకాలను మోదీ నోటి ద్వారా నేరుగా యావద్దేశానికి అందించాలని ప్రయత్నిస్తుంటాయి. యాడ్ ఏజెన్సీలను పెట్టుకుని ప్రచారం చేసినదానికంటే... ‘మన్ కీ బాత్’ ద్వారా ప్రజలకు నేరుగా పథకాల గురించి చేరుతుండటమే ఇందుకు కారణం. భారతదేశంలోని ప్రజల కోసం వివిధ భాషల్లో, మాండలికాల్లో ప్రసారం కావడంతో పాటు ఇంగ్లిష్ సహా 11 అంతర్జాతీయ భాషల్లోనూ ఇది ప్రసారం అవుతోంది. విదేశాల్లో ఉంటున్న భారతీయులకు కూడా... దేశంలో ఈ నెలరోజుల్లో ఏం జరిగింది? భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే అంశాలపై స్పష్టత లభిస్తోంది. భారతదేశంలో సామాజిక పరమైన విప్లవం తీసుకురావడంలో ఈ కార్యక్రమం విజయవంతం అయిందనే చెప్పాలి.
‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీ రాజ్’ సంస్థ చేసిన ఓ స్టడీ ప్రకారం... సమాజంలోని ప్రతి వర్గంపై, ప్రతి రంగంపై ఇది స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో, యువత, స్వయం సహాయక బృందాలపై ఈ ప్రభావం కనబడుతోంది. తద్వారా గ్రామీణాభివృద్ధి పథకాల సద్వినియోగం, అమృత్ సరోవర్ మిషన్ వంటి వాటిలో ప్రజల భాగస్వామ్యం పెరిగింది. రాజకీయాలకు అతీతంగా, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత ఉన్నతస్థితికి తీసుకెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ద్వారా జరుగుతున్న ప్రయత్నంలో ఉత్సాహంగా పాల్గొంటున్న ప్రజలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి పథంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. ఇదే ప్రజాస్వామ్యం గొప్పదనం.
-జి.కిషన్ రెడ్డి, వ్యాసకర్త కేంద్ర సాంస్కృతిక, పర్యాటక,
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి
‘మన్ కీ బాత్’ రాజకీయాలకు తావులేనిది..
భారతదేశ సుసంపన్న వారసత్వం, యోగా, ధ్యానం వైపు నేను బాల్యంలోనే ఆకర్షితుడనయ్యాను. అలా నా 18 ఏళ్ల వయసులో సత్య– జ్ఞానాన్వేషణలో హిమాలయాలకు వెళ్లాను. సుదీర్ఘ కాలం సంచారిగా కొనసాగిన సమయంలో జీవితంలోని విభిన్న కోణాలను దర్శించే అవకాశం లభించింది. ఇందులో భాగంగా చాలా కాలం సాధుసంతుల సత్సంగంలో గడపగలగడం నా అదృష్టం. ఎందరో మహనీయులు, యోగులు సమాజ సంస్కరణకే తమ జీవితాలను అంకితం చేయడం చూశాను. వారి బోధనలతో సమాజం స్వీయశక్తిని ఎలా గుర్తించగలదో గ్రహించాను.
సాధుసంతుల కరుణా తత్పరత
నా ఆరాధ్య గురుదేవునితోపాటు గొప్ప యోగులందరి నుంచీ నేను కూడా ఇదంతా నేర్చుకున్నాను. ఈ నేపథ్యంలో మన ప్రధాని నరేంద్ర మోదీని చూసినప్పుడు, ఆయన నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమ ప్రసంగం వింటూ, ఆయా అంశాలపై స్పందించే వేళ మన సాధుసంతులు ప్రబోధించే ‘కరుణా తత్పరత’ను ఆయన కూడా అనుసరిస్తున్నట్లు తోస్తుంది.
ఈ కార్యక్రమం మొదలైన రోజున నేను యాదృచ్ఛికంగా విన్నప్పటికీ, అదొక అలవాటుగా మారింది. ఎందుకంటే– ‘మన్ కీ బాత్’ ప్రధానంగా రాజకీయాలకు తావులేనిది.. అంతేగాక దేశం, సమాజం, సంస్కృతి, యోగా, సమాజంలోని శ్రమజీవుల విజయాలను మాత్రమే అది ప్రస్తావిస్తుంది. నేను ఈ ప్రసంగం వినడం ప్రారంభించినపుడు– అసలు ‘మన్ కీ బాత్’ వల్ల ప్రయో జనం ఏమిటనే ఆసక్తి నాలో ఉదయించింది. అయితే, ఈ రేడియో కార్యక్రమం ప్రధాని మోదీ శ్రీకారం చుట్టిన ఒక వినూత్న ప్రయోగమనే వాస్త వాన్ని నేను గుర్తించాను. అయినప్పటికీ– ఈ కొత్తదనం, ఆసక్తి, రాజ కీయరహిత స్వభావం ఈ వేదికపై కొనసాగడం సాధ్యమేనా అని కించిత్ సందేహం కూడా కలిగింది. కానీ, అశేష ప్రజా దరణతో ఈ కార్యక్రమం నేడు 100వ భాగం పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆ భయాలన్నీ నిరాధారమని నిరూపిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నా సందేహాలను పటాపంచలు చేశారని చెప్పడానికి నేనెంత మాత్రం సంకోచించను.
మనసుతో మనసు సంభాషణ
ప్రధానమంత్రి చొరవతో ప్రపంచం అంత ర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం యోగాభ్యాసానికి విశ్వగురువైన భారతదేశానికి గర్వకారణం. ఈ సందర్భంగా 2022 సెప్టెంబరు నెలలో ‘మ¯Œ కీ బాత్’ కార్యక్రమం అంశం నాకు గుర్తుకొస్తోంది. ఆనాటి ప్రసంగంలో భాగంగా సూరత్ నగరానికి చెందిన బాలిక ‘అన్వి’ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడుతూ వచ్చిన ఆ చిన్నారికి ‘ఓపెన్ హార్ట్ సర్జరీ’ చేశారు. ఆ తర్వాత ఆత్మ స్థై్థర్యంతో, యోగాభ్యాసంతో ఆ బాలిక సంపూర్ణ ఆరోగ్యం సంతరించుకుంది. యోగాభ్యాసంలో అనేక పతకాలు కూడా సాధించడాన్ని ప్రధాని ఉదాహరించారు.
అటవీ విధ్వంసాన్ని నిలువ రిస్తూ, నక్సలైట్లను ఎదుర్కొన్న జార్ఖండ్ వీరవనిత ‘జమునా తుడు’ కథను ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ద్వారా పంచుకున్నారు. బిహార్‌లోని ముజ ఫర్‌పూర్‌లో ‘రైతు పిన్ని’గా ప్రసిద్ధురాలైన రాజ కుమారి దేవి కథను కూడా ఆయన ప్రస్తావించారు. గుజరాత్ వాస్తవ్యురాలైన దివ్యాంగురాలు ముక్తాబెన్ పంకజ్‌కుమార్ డాగ్లీ కథను కూడా ప్రజ లతో పంచుకున్నారు. పట్టుదారం వడకడంలో గిరిజన మహిళలకు శిక్షణ ఇస్తున్న ఒడిషా మహిళ కున్ని దేవూరి గురించి కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకున్నాం. అదేవిధంగా మారు మూల ప్రాంతాల్లో గర్భిణులకు ప్రసవ సమయంలో అండగా నిలిచే పద్మశ్రీ సూలగిత్తి నరసమ్మ గురించి కూడా పౌరులు తెలుసు కున్నారు. సిద్దగంగ మఠానికి చెందిన డాక్టర్ శ్రీ శ్రీ శివకుమార్ స్వామీజీ రచనల గురించి తెలుసుకునే అవకాశం కూడా లభించింది. ఈ తరహాలో ‘మన్ కీ బాత్’ ద్వారా ఎన్నో స్ఫూర్తిదాయక గాథలు మనకు చేరాయి.
సామాన్యులతో విస్తృత స్థాయిలో మమేక మవుతూ ప్రధాని ఆత్మీయ అనుబంధం ఏర్పరచు కున్నారు. కాబట్టే ఆయన నిర్వహించే ప్రతి కార్య క్రమంలోనూ మీ కుటుంబ పెద్ద లేదా సంరక్షకుడు స్వయంగా మీతో మాట్లాడుతున్నట్లు మీరు భావిస్తారు. మనసుతో మనసు సంభాషణే ‘మ¯Œ కీ బాత్’ అన్నది నా నిశ్చితాభిప్రాయం.
-శ్రీ ఎం. వ్యాసకర్త ఆధ్యాత్మిక గురువు, ‘పద్మభూషణ్’ పురస్కార గ్రహీత
Comments
Please login to add a commentAdd a comment