సాక్షి, న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లు ఈ ఏడాది(2023)లో ఆమోదం పొందిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ఐదో ఆర్థిక వ్యవస్థగా మారడం, జీ-20 విజయవంతంపై ప్రజలు ప్రజలు లేఖలు రాసి సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. ఈ ఏడాది(2023) దేశం ఎన్నో ఘనతలు సాధించిందని మోదీ తెలిపారు. ఆయన దేశ ప్రజలకు కొత్త ఏడాది(2024) శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆయన ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భారత్ దేశం సాధించిన పలు ఘనతలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రస్తుతం భారత్‌లోని ప్రతి ప్రాంతం ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని, దేశ ప్రజల్లో వికసిత్, ఆత్మ నిర్బర్ భారత్ స్ఫూర్తి రగిలించిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. 2024లో సైతం ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
దీపావళి సందర్భంగా దేశీయ ఉత్పత్తుల ద్వారా మనమేంటో నిరూపించామని, శాస్త్రవేత్తల కృషితో చంద్రయాన్-3 విజయవంతం అందరికీ గర్వకారణమని తెలిపారు. ‘నాటు...నాటు’ పాటకు ఆస్కార్ దక్కడంతో దేశం మొత్తం ఉర్రూతలూగిందని, ఎలిఫెంట్ విస్పరర్సకు అవార్డు దక్కడంతో భారతీయుల ప్రతిభ వెలుగుచూసిందని ఆనందం వ్యక్తం చేశారు. భారత సృజనాత్మకతను ప్రపంచవ్యాప్తంగా చాటామని మోదీ అన్నారు.
ఇది చదవండి: NEW YEAR 2024: న్యూ ఇయర్ దశకం
ఈ ఏడాది క్రీడల్లో మన అథ్లెట్లు ప్రతిభ చూపారని గుర్తు చేశారు. ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్‌లో 111 పతకాలతో సత్తా చాటామని పేర్కొన్నారు. అలాగే వన్డే ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు అందరి మనసులు దోచిందని అభిప్రాయపడ్డారు. అండర్-19 టీ20 ప్రపంచ కప్‌లో మహిళల జట్ట విజయం ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ఈ ఏడాది క్రీడాకారుల ఘనతలు దేశం గర్వించేలా చేశాయని తెలిపారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌కు భారత క్రీడాకారులు సన్నద్ధం అవుతున్నారని చెప్పారు.
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ విజయవంతంగా నిర్వహించామని, ‘మేరీ మాటీ-మేరా దేశ్’వంటి కార్యక్రమాలను విజయవంతం చేశామని మోదీ పేర్కొన్నారు. కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా కోట్లాది ప్రజలు భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. దేశంలో 70 వేలకు పైగా అమృత్ సరోవర్ల నిర్మాణం జరిగిందని, ఆవిష్కరణలు జరగని దేశంలో అభివృద్ధి నిలిచిపోతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. భారత్ ఇన్నోవేషన్ హబ్‌గా మారిందని, 2015లో 81వ ర్యాంకులో ఉండగా ప్రస్తుతం 40వ ర్యాంకుకు చేరామని మోదీ అన్నారు. ఈ ఏడాది భారత్ నుంచి దరఖాస్తు చేసే పేటెంట్ల సంఖ్య పెరిగిందని దేశ ప్రజల శక్తిసామర్థ్యాలు అందరికీ ప్రేరణగా నిలుస్తాయని ప్రధాని మోదీ తెలిపారు.
చదవండి: New Year 2024: భారత్‌లో ఐదుసార్లు నూతన సంవత్సర వేడుకలు
Comments
Please login to add a commentAdd a comment