‘ద్వైపాక్షికం’లో కొత్త అధ్యాయం | Editorial Page Column Special Story In Sakshi | Sakshi
Sakshi News home page

‘ద్వైపాక్షికం’లో కొత్త అధ్యాయం

Published Sat, Jun 24 2023 2:45 AM | Last Updated on Sat, Jun 24 2023 2:46 AM

Editorial Page Column Special Story In Sakshi

భారత్‌–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా యాత్ర  విజయవంతమైంది. భారత్‌–అమెరికా సంబంధాలకు ఆకాశమే హద్దని మోదీ... ఇంత పటిష్టంగా, ఇంత సన్నిహితంగా, ఇంత క్రియాశీలంగా సంబంధాలు ఏర్పడటం ద్వైపాక్షిక సంబంధాల చరిత్రలో ఇదే తొలిసారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యాఖ్యా నించటంలో అతిశయోక్తులు లేవు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవటమే కాదు... అందుకనుసరించాల్సిన మార్గాన్ని కూడా ఆ లక్ష్యంతో సరిగా అనుసంధానించుకోవటం సమర్థ దౌత్య నైపుణ్యానికి చిహ్నం అంటారు. అమెరికాతో మన దేశానికి కుదిరిన భిన్న ఒప్పందాలను పరికిస్తే మన దౌత్య నైపుణ్యం ఆశించిన రీతిలోనే సాగిందని చెప్పవచ్చు. అయితే ఇందుకు అంతర్జాతీయ స్థితిగతులు కూడా దోహదపడ్డాయి.

ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల్లో అత్యాధునిక సాంకేతిక సహకారం మొదలుకొని వాతావరణ మార్పులకు సంబంధించిన సహకారం వరకు ఎన్నో ఉన్నాయి. చంద్రుడి పైకి వెళ్లే మూన్‌ మిషన్‌లో మనకూ భాగస్వామ్యం ఇవ్వటానికి అంగీకరించటంతో మొదలెట్టి ఫైటర్‌ జెట్‌ ఇంజన్ల ఉత్పత్తి, సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడులు, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనటానికి అవస రమైన సాయం అందివ్వటం వరకూ అనేకం ఈ ఒప్పందాల్లో ఉన్నాయి. అక్కడుండే భారతీయులకు తమ హెచ్‌ 1బి వీసాలను అమెరికాలోనే నవీకరించుకునే వెసులుబాటు కల్పించటం వేలాదిమందికి తోడ్పడుతుంది. భారత్‌–అమెరికా సంబంధాలు తాజా ద్వైపాక్షిక ఒప్పందాలతో సరికొత్త దశకు చేరు కున్నాయి.

దేశాల మధ్య సాన్నిహిత్యం కేవలం అమ్మకందారు–కొనుగోలుదారు సంబంధాల వల్ల ఏర్పడదు. భిన్న రంగాల్లో పరస్పరం ఎదిగేందుకు చిత్తశుద్ధితో ఆ దేశాలు ప్రయత్నించినప్పుడే ఆ సాన్నిహిత్యం సాధ్యపడుతుంది. అమెరికాకు చెందిన ప్రముఖ మెమొరీ చిప్‌ తయారీ సంస్థ మైక్రాన్‌ గుజరాత్‌లో అక్కడి ప్రభుత్వ భాగస్వామ్యంలో 270 కోట్ల డాలర్ల వ్యయంతో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ స్థాపించడానికి అంగీకరించటం, తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌కు అమర్చే ఫైటర్‌ జెట్‌ ఇంజన్లను భారత్‌లోనే తయారుచేయటానికి అంగీకరించటం, ఇరు దేశాల రక్షణ విభాగాలూ సైనిక సాంకేతికతలో సహకరించుకునే ఇండస్‌ఎక్స్‌ ఒప్పందం ఎన్నదగ్గ నిర్ణయాలు. ఇక క్వాంటమ్‌ టెక్నాలజీ, కృత్రిమ మేధ, అత్యాధునిక సైనిక డ్రోన్‌లు తదితరాలపై ఒప్పందాలు సరేసరి. 

ఆసియా ఖండంపై అమెరికా నూతన దృక్పథానికి ఈ ఒప్పందాలు నిదర్శనం. కేవలం చైనాను దృష్టిలో పెట్టుకోవటం వల్లే చాలా అంశాల్లో అమెరికా దిగొచ్చిందన్న విశ్లేషణల్లో కొంతమేర వాస్తవం ఉండొచ్చు. ఈ ఒప్పందాలు సాకారమైతే ఆసియాలో చైనా పలుకుబడికి గండికొడతాయని చెప్పటం అతిశయోక్తి అవుతుందిగానీ, దాని ఏకచ్ఛత్రాధిపత్యాన్ని ఏదోమేరకు నిలువరించటం సాధ్య పడొచ్చు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో శాంతిసుస్థిరతలే తన ధ్యేయమని అమెరికా చెబుతోంది. సమతౌల్య ఆసియా తన లక్ష్యమంటున్నది. అయితే ఆ దేశానికి భవిష్యత్తులో తైవాన్‌ విషయంలోనో, మరే ఇతర అంశంలోనో చైనాతో ఘర్షణ వాతావరణం ఏర్పడితే అది మనకు కూడా సమస్యలు
సృష్టిస్తుంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం.

ప్రచ్ఛన్న యుద్ధకాలంలో మనం ఆనాటి సోవియెట్‌ యూనియన్‌ వైపు మొగ్గటం అమెరికాకు కంటగింపుగా ఉండేది. అందువల్లే ఏ విషయంలోనూ సహకరించేది కాదు. భారత్‌లో 90వ దశకంలో సంస్కరణల అమలు ప్రారంభించాక ఇంత పెద్ద మార్కెట్‌ వున్న దేశాన్ని వదులుకోవటం అసాధ్యమని అమెరికా గుర్తించింది. మన దేశం సైతం మారిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ దేశంతో క్రమేపీ చెలిమిని పెంచుకుంటూ వస్తోంది. అటు చైనాతో సైతం ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు అమెరికా ప్రయత్నిస్తోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను బైడెన్‌ నియంతతో పోల్చినా ఆ దేశానికి విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ను పంపటం గమనించదగ్గ పరిణామం.

మోదీ అమెరికా పర్యటనకు ముందే బ్లింకెన్‌  బీజింగ్‌ సందర్శించారు. ఇటు మన దేశం కూడా సరిహద్దుల్లో తగాదాలకు దిగుతున్న చైనాతో మూడేళ్లుగా ఓపిగ్గా చర్చిస్తోంది. చైనా కూడా జరుగుతున్నదేమిటో గమనిస్తూనే ఉంటుంది. పరిణ తితో ఆలోచించటం మొదలుపెడితే ఎంత జటిల సమస్య అయినా పరిష్కారమవుతుంది. 
ఈ పర్యటనలో భారత్‌లో పౌర హక్కుల ఉల్లంఘన తదితర అంశాలను ప్రముఖంగా ప్రస్తావించాలనీ, మోదీని ఇరకాటంలో పెట్టాలనీ కొన్ని వర్గాలు ప్రయత్నించాయి. అధికార డెమొ క్రటిక్‌ పార్టీ సెనెటర్లు కూడా ఈ విషయంలో బైడెన్‌కు లేఖ రాశారు.

ఇరు దేశాల అధినేతలూ ఉమ్మడిగా పాల్గొన్న మీడియా సమావేశంలో సైతం ఈ దిశగా ప్రశ్న సంధించారు. దానికి మోదీ ‘భారత్‌ను ప్రజాస్వామిక దేశమని మీరు అంగీకరిస్తే వివక్ష చూపుతున్నారన్న ప్రశ్నకు అర్థమే లేద’ని బదులిచ్చారు. బైడెన్‌ సైతం ప్రజాస్వామిక విలువలపై తాము చర్చించామంటూ జవాబిచ్చారు. ఈ విషయంలో ఇరు దేశాలూ ఇంకా పరిపూర్ణత సాధించాల్సివుందని తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి పెట్టా ల్సిన వర్తమానంలో బైడెన్‌ ఇలాంటి అంశాల విషయంలో బహిరంగంగా ప్రస్తావించాలనుకోవటం అత్యాశే అవుతుంది. 2015 మొదట్లో అప్పటి అధ్యక్షుడు ఒబామా మన దేశంలో పర్యటించినప్పుడు సైతం ఆయనకు ఇలాంటి ప్రశ్న ఎదురైంది. అది మోదీ సమక్షంలో కాదు కాబట్టి, ‘మతవిశ్వాసాల పరంగా చీలనంతకాలమూ మీరు విజయం సాధిస్తార’ని లౌక్యంగా జవాబిచ్చారు. మొత్తానికి మోదీ మూడురోజుల అమెరికా  పర్యటన అంచనాలకు మించిన రీతిలో విజయవంతమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement