‘పర్యావరణ పరిరక్షణ విషయంలో నిర్లిప్తంగా ఉండటం ద్వారా మానవాళి నరకానికి ద్వారాలు తెరుస్తోంది సుమా...’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరించిన మర్నాడే 2015 ప్యారిస్ వాతావరణ శిఖరాగ్ర సదస్సుకు పూచీపడిన లక్ష్యాలను నీరుగారుస్తూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నిర్ణయాలు తీసుకున్నారు. సహజంగానే పర్యావరణ ఉద్యమకారులను ఈ ప్రకటన దిగ్భ్రాంతిపరిచింది.
గతంలో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక గత ప్రభుత్వ నిర్ణయాలను తాము ఆమోదించబోమని ప్యారిస్ ఒడంబడిక నుంచి వైదొలగారు. తిరిగి జో బైడెన్ వచ్చాకే అమెరికా పాత విధానానికి మళ్లింది. సునాక్ అంత మాట అనకపోయినా ఆయన తాజా చర్యలు మాత్రం అలానే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కార్ల విక్రయాన్ని 2030 నుంచి నిలిపేస్తామని ప్యారిస్ శిఖరాగ్ర సదస్సులో బ్రిటన్ వాగ్దానం చేయగా, దీన్ని ఆయన మరో అయిదేళ్లు పొడిగించారు.
అలాగే 2035 నాటికి కొత్త గ్యాస్ బాయిలర్ల ఏర్పాటును ఆపేస్తామన్న వాగ్దానాన్ని కూడా పక్కన బెట్టారు. 2050 నాటికల్లా కర్బన ఉద్గారాలను సంపూర్ణంగా తొలగించటమే లక్ష్యమని చెబుతూనే ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలను వాయిదా వేయటం సంపన్న రాజ్యాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. హరిత లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకుంటే ఉపాధి దెబ్బతింటుందని, జనాగ్రహం వెల్లువెత్తుతుందని ఆయన చెబుతున్న మాటలు కేవలం సాకు మాత్రమే.
కర్బన ఉద్గారాలకు కారణమయ్యే పరిశ్రమలు మూతబడినా, హరిత ఇంధనంతో పనిచేసే పరిశ్రమల్లో ఉపాధి లభిస్తుంది. భిన్నరూపాల్లో సబ్సిడీలు, ఆర్థిక సాయం అందిస్తే ప్రజలకు అంత కష్టం అనిపించదు. అందుకు భిన్నంగా ఆ లక్ష్యాల నుంచే తప్పుకోవటం అన్యాయం. వచ్చే ఎన్నికల్లో మధ్యతరగతి మద్దతు కోసం వారికి నొప్పి కలిగించే నిర్ణయాలు తీసుకోరాదని సునాక్ భావిస్తున్నారు. ఇందుకు పర్యావరణం బలయ్యే ప్రమాదం ఉన్నా ఆయనకు పట్టడం లేదు.
అసలు సంపన్న రాజ్యాల తీరుతెన్నులను ఐక్యరాజ్యసమితి సదస్సే పట్టిచూపింది. ఆ సదస్సుకు 34 దేశాల ప్రతినిధులు హాజరుకావాల్సివుండగా ప్రధాన కాలుష్యకారక దేశాలైన అమెరికా, చైనా లతో సహా ఎవరూ రాలేదు. నిజానికి బ్రిటన్ ప్రధాని హోదాలో పాల్గొనే అవకాశం తొలిసారి వచ్చినందున రిషి సునాక్ తప్పక హాజరవుతారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన గైర్హాజరు కావటమే కాదు... పర్యావరణానికి ముప్పు తెచ్చే నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సదస్సులో పాల్గొనే ప్రతినిధులు లక్ష్యసాధన దిశగా తీసుకున్న చర్యలేమిటో, వైఫల్యాలుంటే కారణాలేమిటో చెప్పాలని సమితి అన్ని దేశాలనూ కోరింది.
సరైన చర్యలు తీసుకుంటున్న దేశాలు ఇతర దేశాలకు స్ఫూర్తిదాయ కంగా నిలుస్తాయన్నది ఐక్యరాజ్యసమితి ఉద్దేశం. కానీ హోంవర్క్ చేయని పిల్లలు ఆ మర్నాడు బడి ఎగ్గొట్టినట్టు పర్యావరణ హిత నిర్ణయాల అమలులో అలసత్వం ప్రదర్శిస్తున్న దేశాలన్నీ ఈ సదస్సుకు గైర్హాజరయ్యాయి. చిత్తశుద్ధి ఉంటే స్వచ్ఛమైన గాలి, నిరపాయకరమైన ఇంధనం అందు బాటులోకి రావటం పెద్ద కష్టం కాదని...ఈ రంగాల్లో ఉపాధి కల్పన అవకాశాలు కూడా పెరుగు తాయని గుటెరస్ చెబుతున్న మాట అరణ్యరోదనే అయింది.
2030 నాటికి బొగ్గు వినియోగం నుంచి ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) దేశాలు పూర్తిగా వైదొలగితే, మరో పదేళ్లకు ఇతర దేశాలు దాన్ని సాధించగలుగుతాయని పారిస్ సదస్సు నిర్దేశించింది. కానీ సంపన్న రాజ్యాలు సభ్యులుగా ఉన్న ఓఈసీడీలో ఏ ఒక్క దేశమూ ఆ దిశగా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. సరి గదా కెనడా, అమెరికా, బ్రిటన్ తదితర సంపన్న దేశాలు మూతబడిన పాత ఫ్యాక్టరీలను సైతం తెరుస్తూ బొగ్గు వినియోగాన్ని మరింత పెంచాయి. ఈ ఏడాది జూన్–ఆగస్టు మధ్య ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్నిచోట్లా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పారిశ్రామికీకరణకు ముందున్న వాతావరణంతో పోలిస్తే కనీసం 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరగటం ఎంతో దూరంలో లేదని పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్పిన మాట అక్షరసత్యమని ఈ పరిణామం వెల్లడిస్తోంది. గుటెరస్ చేస్తున్న హెచ్చరిక మరింత గుబులు పుట్టిస్తుంది. మరో 2.8 డిగ్రీల సెల్సి యస్ ఉష్ణోగ్రత పెరిగే క్రమంలో ఉన్నామని ఆయన ప్రకటించారు. ప్యారిస్ ఒడంబడిక కుదిరిన సమ యంలో ప్రపంచ దేశాలన్నీ 2020నాటికే ఇంతకు మూడింతల క్రియాశీల కార్యాచరణకు పూనుకోవా లని సదస్సు నిర్దేశించింది.
అలాగైతే తప్ప లక్ష్యసాధనను చేరుకోలేమని చెప్పింది. కానీ మరో నాలుగేళ్లకే సంపన్న రాజ్యాల నిర్వాకం బయటపడింది. 2019లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో దాదాపు 60 దేశాలు తాము పూచీపడిన లక్ష్యాలకు మించి కర్బన ఉద్గారాలను తగ్గించు కున్నామని ప్రకటించగా...అందులో అత్యధిక దేశాలు చిన్నవే, తక్కువస్థాయి కాలుష్య కారక దేశాలే. మరి సంపన్న దేశాలు ఏం చేసినట్టు? ఇచ్చిన వాగ్దానాలను గాలికొదిలేసి, పర్యావరణానికి తూట్లు పొడిచాయి.
ఈ విషయంలో కాస్తయినా సిగ్గుపడటం మానేశాయి. వాతావరణ సదస్సుకు ముందురోజే జరిగిన సమితి సర్వసభ్య సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భూగోళాన్ని వడగాడ్పులు చుట్టుముట్టడం, అడవులు తగలబడటం, కరువుకాటకాలు, వరదలు వగైరాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. శిలాజ ఇంధనాల వాడకం ఆపకపోతే ఈ ముప్పు మరింత పెరుగుతుందని హెచ్చరించారు. కానీ గత అయిదేళ్లలో సాధించిందేమిటో చెప్పాలి గనక ఆ మర్నాడు జరిగిన సదస్సుకు మాత్రం గైర్హాజరయ్యారు. ఇలాంటి ధోరణులు సరి కాదు. ఇప్పటికైనా సంపన్న రాజ్యాల తీరు మారాలి. భూగోళం ఉనికికి ముప్పు తెచ్చే చర్యలకు స్వస్తి పలకాలి.
ఇది కూడా చదవండి: నారీలోకానికి నీరాజనం!
Comments
Please login to add a commentAdd a comment