ఇంటి దీపమని ముద్దాడితే మూతి కాలినట్టు గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న జనహననాన్ని సమర్థిస్తున్న అమెరికాకూ, దాని పాశ్చాత్య మిత్రులకూ ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతున్నట్టుంది. కాల్పుల విరమణకు సిద్ధపడి సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి తోడ్పడాలని, పౌరులకు ఎలాంటి హానీ కలగకుండా చూడాలని ఆ దేశాలు తాజాగా ఇజ్రాయెల్‌ను కోరుతున్నాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోకి చొరబడి హమాస్ విచక్షణారహితంగా 1,200 మందిని కాల్చిచంపి 240 మందిని అపహరించుకుపోయినప్పుడు ఆ దేశాలన్నీ ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలను ముక్తకంఠంతో సమర్థించాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హుటాహుటీన ఇజ్రాయెల్ వెళ్లి ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు సంఘీభావం ప్రకటించారు. ఆయనకు అండదండలందిస్తామని హామీ ఇచ్చారు. హమాస్‌పై యుద్ధం పేరుతో గాజాలో ఇజ్రాయెల్ సైన్యం పౌరుల ప్రాణాలు తీస్తున్నప్పుడూ... జనా వాసాలను బాంబులతో నేలమట్టం చేస్తున్నప్పుడూ అమెరికా, బ్రిటన్, జర్మనీ తదితర దేశాలునోరు మెదపలేదు. ఉత్తర గాజాపై బాంబుల మోత మోగించబోతున్నామని, దాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హుకుం జారీచేసినప్పుడు 20 లక్షలమంది పౌరులు ప్రాణభయంతో అప్పటికే కిక్కిరిసి వున్న దక్షిణ ప్రాంతానికి వలసపోయారు.
సహాయ శిబిరాలన్నీ కిక్కిరిసిపోగా ఎండకు ఎండి వానకు తడిసి అర్ధాకలితో జీవనం సాగిస్తున్నారు. అంత దారుణ పరిస్థితుల్లోనూ పాశ్చాత్య ప్రపంచం మౌనాన్నే ఆశ్రయించింది. పైగా ఈ దశలో పోరు విరమిస్తే అది హమాస్‌ను మరింత బలోపేతం చేస్తుందని అమెరికా వ్యాఖ్యానించింది. రెండు నెలలు గడిచి, 20,000 మందికి పైగా పౌరులు హతమయ్యాక ఇప్పుడు ఆ దేశం నోట ‘కాల్పుల విరమణ’ ప్రతిపాదన వినిపిస్తోంది. కారణమేమిటో తెలుస్తూనే వుంది. హమాస్ స్థావరాలను గుర్తించి కేవలం వాటిపైన మాత్రమే దాడులు చేయాలన్న సలహానూ, సాధ్యమైనంత త్వరగా పాలస్తీనా ఆవిర్భావానికి సహకరించాలన్న సూచననూ నెతన్యాహూ బుట్టదాఖలా చేశారు.
దాంతోపాటు శనివారం హమాస్ చెరనుంచి తప్పించుకునో, వాళ్ల అనుమతితోనో బయటకు వచ్చిన ముగ్గురు ఇజ్రాయెల్ పౌరులను సైన్యం వెనకా ముందూ చూడకుండా కాల్చిచంపిన ఉదంతం ఈ దాడుల ఉద్దేశాన్ని ప్రశ్నార్థకం చేసింది. ఇజ్రాయెల్ సైన్యం సైతం అది ఘోరతప్పిదమని అంగీకరించింది. ఆ తర్వాతే యుద్ధం ‘గతి తప్పిందని’ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ నిర్ధారణకొచ్చారు. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ఆయనతో స్వరం కలిపాయి.
ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ యుద్ధంవల్ల అమాయక పౌరుల ప్రాణాలు పోతున్నాయని అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలూ ఏడాదిన్నరగా అంతర్జాతీయ వేదికలపైనా, బయటా ఆరోపిస్తు న్నాయి. కానీ గాజా విషయంలో మాత్రం వేరే ప్రమాణాలు పాటించాయి. కాల్పుల విరమణ ప్రక టించాలని ఇజ్రాయెల్‌ను కోరే తీర్మానాన్ని భద్రతామండలిలో అమెరికా మూడుసార్లు వీటోచేసింది. బైడెన్ తన ‘అత్యవసర అధికారాలను’ వినియోగించి ఆ దేశానికి ఆయుధాలు కూడా సర ఫరా చేశారు. చేసేవన్నీ చేశాక ఇప్పుడు సాధారణ పౌరుల ప్రాణాలకు హాని కలగకూడదని, కేవలం హమాస్ స్థావరాలనే లక్ష్యంగా చేసుకోవాలని సుద్దులు చెప్పటంలోని ఆంతర్యమేమిటి? ఇజ్రాయెల్ చర్యల పర్యవసానంగా చోటుచేసుకుంటున్న ఉత్పాతాల గురించి ‘న్యూయార్క్ టైమ్స్’ వంటి పత్రి కల్లో వస్తున్న కథనాలు దిగ్భ్రాంతికరంగా వుంటున్నాయి.
నసర్ అల్ అస్తాద్ అనే వ్యక్తి మినహా ఆ కుటుంబం, వారి బంధువర్గం మొత్తం 100 మంది ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారని, మొత్తం ఆ వంశమే తుడిచిపెట్టుకుపోయిందని ఆ కథనం సారాంశం. ఈ రెండున్నర నెలల్లో ఐక్యరాజ్యసమితి సహాయ బృందాలకు సంబంధించిన కార్యకర్తలు 135 మంది దాడుల్లో చనిపోయారు. సమితి 78 యేళ్ల చరిత్రలో ఏ ఘర్షణలోనూ ఇంతమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు లేవు. ఈనెల 10న జరిగిన వైమానిక దాడిలో తమ కార్యకర్త, అతని భార్య, నలుగురు పిల్లలు, అతని బంధువర్గంలోని అనేకులు మరణించారని అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ ప్రకటించింది. అయిదేళ్ల క్రితం సూడాన్, అల్జీరియా, యూఏఈ తదితర దేశాల్లోని వివిధ నిర్మాణ సంస్థల్లో హమాస్ 50 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టిందనటానికి స్పష్టమైన ఆధారాలు లభించినా నెతన్యాహూ ప్రభుత్వం మౌనంగా వుండిపోయింది.
ఆయుధాల కొనుగోలుకూ, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఈ డబ్బంతా వినియోగిస్తుంటే కళ్లుమూసుకున్న ప్రభుత్వం హమాస్ అక్టోబర్ దాడి తర్వాత హమాస్‌తో ఏమాత్రం సంబంధంలేని ప్రజానీకంపై విరుచుకుపడుతున్న తీరు తీవ్ర అభ్యంతరకరం. నెతన్యాహూ ధోరణికి ఆయన కేబినెట్‌లో వున్న తీవ్ర మితవాద పక్ష నేతలే కారణమని అమెరికా చేస్తున్న వాదన పాక్షిక సత్యమే. న్యాయస్థానాలు తన జోలికి రాకుండా అడ్డుకోవటానికి చట్టం తీసు కొచ్చి ఇజ్రాయెల్ పౌర సమాజం అసంతృప్తిని మూటగట్టుకున్న నెతన్యాహూ, హమాస్ దాడి తర్వాత మరింత అప్రదిష్టపాలయ్యారు.
ఈ దాడులు ఆగాక నెతన్యాహూ నిర్వాకంపై ఎటూ ఆరా వుంటుంది, ఆయన రాజీనామా కోసం జనం ఉద్యమిస్తారు. కాస్త ముందో, వెనకో పార్లమెంటు ఎన్నికలు కూడా తప్పకపోవచ్చు. ఇది తెలిసే నెతన్యాహూ దాడుల విరమణకు ససేమిరా అంటు న్నారు. పాలస్తీనా ఏర్పాటుకు నిరాకరిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు హమాస్ చేసిన నష్టం కంటే తానే గాజాకు ఎక్కువ నష్టం చేశానని చెప్పటమే ఆయన ఉద్దేశం. ఈ జనహననాన్ని సాగనీయొద్దు. మొదట్లో ఇజ్రాయెల్‌కు మద్దతు పలికిన పాశ్చాత్య ప్రపంచమే ఈ బాధ్యత తీసుకుని పాపప్రక్షాళన చేసుకోవాలి. లేనట్టయితే మానవాళి క్షమించదు.
Comments
Please login to add a commentAdd a comment