2024లో నిరాశ్రయులుగా లక్షలాది బాలలు
యునిసెఫ్ నివేదికలో ఆందోళనకర అంశాలు
పిల్లల పాలిట చరిత్రలో ఎన్నడూ లేనంతటి దారుణ సంవత్సరంగా నిలిచింది 2024. యుద్ధాలు, ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బాలలు భారీ సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఏకంగా 47.3 కోట్ల మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆరుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది కల్లోల ప్రాంతాల్లో నివసిస్తున్నారు.
ఒకప్పుడు పేదరికం, కరువు, వంటివాటితో అల్లాడే పిల్లలు ఇప్పుడు ఘర్షణల్లో సమిధలవుతున్నారు. చదువు మాట అటుంచి వారికి పోషకాహారమే గగనమైపోయింది! గాజా, సూడాన్, ఉక్రెయిన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలతో బాలలు విపరీతంగా సతమతమవుతున్నట్టు ఐరాస బాలల సంస్థ యునిసెఫ్ తాజాగా పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 15 నెలల్లో కనీసం 17,492 మంది బాలలు మరణించినట్లు తెలిపింది...!
మునుపెన్నడూ లేనంతంగా ఎక్కువ మంది పిల్లలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. బలవంతంగా నిరాశ్రయులవుతున్నారు. ఘర్షణలో మరణిస్తున్న, గాయపడుతున్న పిల్లల సంఖ్య పెరిగింది. పాఠశాలలపై బాంబుల వర్షం కురుస్తోంది. ఇళ్లు ధ్వంసమయ్యాయి. కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి.
భద్రత మాట పక్కకు పెడితే.. ప్రాథమిక అవసరాలు తీర్చుకునే అవకాశమూ ఉండటం లేదు. వాళ్లు ఆడుకోవడం, నేర్చుకోవడం ఎప్పుడో మరిచారు. ఈ యుద్ధాలు పిల్లల హక్కులను హరిస్తున్నాయి. ఇక, ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్లు, పోషకాహారం విలాసంగా మారాయి. ‘‘ప్రపంచంలో అనియంత్రిత యుద్ధాలకు ఒక తరం పిల్లలు బలవుతున్నారు. యుద్ధ ప్రాంతాల్లోని పిల్లలు మనుగడ కోసం పోరాటమే చేస్తున్నారు. దానికి తమ బాల్యాన్ని పణంగా పెడుతున్నారు. సర్వహక్కులు కోల్పోతున్నారు. ఇది దారుణం’’ అని యునిసెఫ్ డైరెక్ట్ కేథరిన్ రస్సెల్ వాపోయారు.
గణాంకాలు చెబుతున్న విషాదాలు..
యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో పిల్లలు 30 శాతం ఉన్నారు. వారిలో 47.3 కోట్ల మంది యుద్ధ ప్రభావింత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రతి ఆరుగురిలో ఒకరు సంఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్నారని అంతర్జాతీయ ఏజెన్సీ తెలిపింది. 1990లలో సుమారు 10 శాతం మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో ఉండగా ఇప్పుడది ఏకంగా రెట్టింపుకు, అంటే 19 శాతానికి పెరిగింది. ఈ యుద్ధాల కారణంగా 2023 చివరి నాటికి 4.7 కోట్ల మంది పిల్లలు నిర్వాసితులయ్యారు. 2024లో హై తీ, లెబనాన్, మయన్మార్, పాల స్తీనా, సూడాన్ నుంచి అత్యధికంగా శరణార్థులుగా వెళ్లారు. ప్రపంచ శరణార్థుల జనాభాలో సుమారు 40 శాతం బాలలే. ఆయా దేశాల్లో నిర్వాసితులయినవారిలో బాలలు 49 శాతమున్నారు. 2023 నుంచి ఇప్పటిదాకా 22,557 మంది పిల్లలపై రికార్డు స్థాయిలో 32,990కు పైగా తీవ్రమైన హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. ముఖ్యంగా బాలికల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంఘర్షణ ప్రాంతాల్లో అత్యాచారాలు, లైంగిక హింస పెచ్చరిల్లాయి.
ప్రమాదకర స్థాయిలో
యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో విద్యకు తీవ్ర అంతరాయం కలిగింది. సంఘర్షణ ప్రభావిత దేశాలలో 52 మిలియన్లకు పైగా పిల్లలు పాఠశాలకు దూరంగా ఉన్నారు. విద్యా మౌలిక సదుపాయాల విధ్వంసం, పాఠశాలల సమీపంలో అభద్రతా భావం వల్ల ఈ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ పిల్లల్లో పోషకాహార లోపం కూడా ప్రమాదకర స్థాయికి పెరిగింది. యుద్ధం పిల్లల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధాలు జరుగుతున్న దేశాల్లోని పిల్లల్లో 40శాతం మంది టీకాలు అందడం లేదు. వారి మానసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. హింస, విధ్వంసం, కుటుంబ సభ్యులను కోల్పోవడం వల్ల పిల్లల్లో నిరాశ పెరిగింది. పిల్లల్లో ఆగ్రహావేశాలు పెరిగాయి. విచారం, భయం వంటి వాటితో బాధపడుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment