గాజా:ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడుల్లో పాలస్తీనా పౌరులు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 26 మంది శరణార్థులు మృతి చెందారు. ఈమేరకు పాలస్తీనా వైద్యాధికారులు వెల్లడించారు. మంగళవారం(డిసెంబర్ 10) అర్ధరాత్రి ఇజ్రాయెల్ సరిహద్దులోని బీట్ లాహియాలో దాడులు జరిగాయి.
శరణార్థులు ఆశ్రయం పొందుతున్న శిబిరంపై దాడి జరగడంతో 19 మంది మరణించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఉండటం గమనార్హం. మరోవైపు సెంట్రల్ గాజాలోని ఓ శరణార్థి శిబిరంపైనా దాడి జరిగింది. ఈ దాడిలో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు గాజా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అయితే, ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో సుమారు 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఇప్పటివరకు జరిపిన దాడుల్లో 40 వేల మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment