ఉక్రెయిన్, పశ్చిమాసియాపై ఏం చేస్తారు?
‘2.0’విదేశీ విధానంపై సర్వత్రా ఉత్కంఠ
దూకుడుకు, ఆశ్చర్యకర నిర్ణయాలకు పెట్టింది పేరైన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠమెక్కనున్నారు. ఈ పరిణామం అమెరికా మిత్ర దేశాల్లో భయాందోళనలకు, శత్రు రాజ్యాల్లో హర్షాతిరేకాలకు కారణమవుతోంది. అన్ని విషయాల్లోనూ ‘అమెరికా ఫస్ట్’అన్నదే మూల సిద్ధాంతంగా సాగుతానని తేల్చి చెప్పిన ఆయన అదే ప్రాతిపదికన విదేశాంగ విధానాన్ని పునర్నర్మీస్తారా? అదే జరిగితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం. గాజాపై ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఆసక్తికరం.
ఉక్రెయిన్ యుద్ధం నాటో పుట్టి ముంచేనా?
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఒక్క రోజులో ముగించగలనని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదేపదే చెప్పారు. అదెలా అని మీడియా పదేపదే ప్రశ్నిస్తే ఒక ఒప్పందాన్ని పరిశీలించాల్సి ఉందంటూ సరిపెట్టారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను కొనసాగించాలని, రష్యాతో ఆ దేశం శాంతి చర్చలు జరిపేలా చూస్తూనే షరతులు విధించాలని ట్రంప్ మాజీ జాతీయ భద్రతాధిపతులు ఇటీవల సూచించారు.
నాటోలో ఉక్రెయిన్ ప్రవేశాన్ని వీలైనంత ఆలస్యం చేయడం ద్వారా రష్యాను తృప్తి పరచాలని చెప్పుకొచ్చారు. కానీ ట్రంప్ మాత్రం యుద్ధానికి ముగింపు పలకడం, అమెరికా వనరుల వృథాను అరికట్టడమే తన ప్రాథమ్యమని స్పష్టంగా చెబుతున్నారు. ఆ లెక్కన రెండేళ్లకు పైగా ఉక్రెయిన్‌కు బైడెన్ సర్కారు అందిస్తూ వచ్చిన భారీ ఆర్థిక, ఆయుధ సాయాలకు భారీగా కోత పడవచ్చని భావిస్తున్నారు. అంతేగాక యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించేలా రష్యా, ఉక్రెయిన్ రెండింటిపైనా ట్రంప్ ఒత్తిడి పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.
స్వదేశంలో ఇమేజీ కోసం కనీసం తక్షణ కాల్పుల విరమణకైనా ఒప్పంచేందుకు ఆయన శాయశక్తులా ప్రయతి్నంచవచ్చు. అందుకోసం అవసరమైతే ఉక్రెయిన్‌కు ఎప్పటికీ నాటో సభ్యత్వం ఇవ్వొద్దన్న రష్యా డిమాండ్‌కు ట్రంప్ అంగీకరించినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇది నాటోలోని యూరప్ సభ్య దేశాలకు రుచించని పరిణామమే. కానీ నాటో కూటమి పట్ల ట్రంప్ తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా వాటి అభ్యంతరాలను ఆయన పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఇది అంతిమంగా నాటో భవితవ్యంపైనే తీవ్ర ప్రభావం చూపవచ్చు. నాటో కూటమి రక్షణ వ్యయం తీరుతెన్నుల్లో భారీ మార్పులకు కూడా ట్రంప్ శ్రీకారం చుట్టవచ్చని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
కొరుకుడు పడని పశ్చిమాసియా
గాజా యుద్ధం, ఇరాన్‌తో ఇజ్రాయెల్ ఘర్షణ, దానిపై హమాస్‌తో పాటు హెజ్»ొల్లా దాడులతో అగి్నగుండంగా మారిన పశ్చిమాసియాలో కూడా శాంతి స్థాపిస్తానని ట్రంప్ వాగ్దానం చేశారు. తాను అధికారంలో ఉంటే ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిగేదే కాదని చెప్పుకున్నారు. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు, ఆ దేశంతో అణు ఒప్పందం రద్దు వంటి చర్యలకు ఆయన దిగవచ్చంటున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. కానీ ఇరాన్‌పై ప్రతీకారం, హమాస్, హెజ్»ొల్లా తదితర ఉగ్ర సంస్థల నిర్మూలన విషయంలో నెతన్యాహు మొండిగా ఉన్నారు.
దీన్ని వ్యతిరేకించినందుకు రక్షణ మంత్రినే ఇంటికి పంపించారు. కనుక ట్రంప్ ప్రయత్నాలకు నెతన్యాహు ఏ మేరకు సహకరిస్తారన్నది సందేహమే. నిజానికి ట్రంప్ విధానాలే పశ్చిమాసియాలో అస్థిరతకు దారి తీశాయన్నది ఆయన విమర్శకుల వాదన. వాటివల్ల పాలస్తీనియన్లకు తీవ్ర అన్యాయం జరిగిందని వారంటారు. ఇజ్రాయెల్‌తో పాటు పలు అరబ్, ముస్లిం దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగు పరిచేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు పాలస్తీనాను పూర్తిగా ఏకాకిని చేశాయి. ఇన్ని సంక్లిష్టతల నడుమ గాజా కల్లోలానికి ట్రంప్ చెప్పినట్టుగా తెర దించగలరా అన్నది వేచి చూడాల్సిన విషయమే.
చైనా వ్యూహంలోనూ మార్పులు!
అమెరికా విదేశాంగ విధానంలో చైనా పట్ల వైఖరి అత్యంత వ్యూహాత్మకమైనది. ఇది ప్రపంచ భద్రత, వాణిజ్యంపైనే ప్రభావం చూపుతుంది. ట్రంప్ అధికారంలో ఉండగా చైనాను ‘వ్యూహాత్మక పోటీదారు’గా పేర్కొన్నారు. పలు చైనా దిగుమతులపై సుంకాలు విధించారు. దాంతో చైనా కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు విధించింది. ఈ వివాదాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతుండగానే కోవిడ్ వచ్చి పడింది. దాన్ని ‘చైనీస్ వైరస్’గా ట్రంప్ ముద్ర వేయడంతో ద్వైపాక్షిక సంబంధాలు దిగజారాయి. అనంతరం బైడెన్ సర్కారు కూడా చైనాపై ట్రంప్ సుంకాలను కొనసాగించింది.
అమెరికాలో నిరుద్యోగం తదిరాలకు చైనా దిగుమతులను కూడా కారణంగా ట్రంప్ ప్రచారం పొడవునా ఆక్షేపించన నేపథ్యంలో వాటిపై సుంకాలను మరింత పెంచవచ్చు. అలాగే చైనా కట్టడే లక్ష్యంగా సైనికంగా, వ్యూహాత్మకంగా అమెరికా అనుసరిస్తున్న ఆసియా విధానంలోనూ మార్పుచేర్పులకు ట్రంప్ తెర తీసే అవకాశముంది. చైనా కట్టడికి దాని పొరుగు దేశాలతో బలమైన భద్రతా భాగస్వామ్యాన్ని కొనసాగించాలన్న బైడెన్ ప్రభుత్వ విధానానికి ఆయన తెర దించినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే భారత్‌కు ఇబ్బందికర పరిణామమే. తైవాన్‌పై చైనా దాష్టీకాన్ని అడ్డుకునేందుకు సైనిక బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదని కూడా ట్రంప్ పదేపదే చెప్పారు. కనుక తైవాన్‌కు అమెరికా సైనిక సాయాన్ని కూడా నిలిపేయవచ్చు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment