Sudan
-
సూడాన్‌లో కూలిన సైనిక విమానం
కైరో: సూడాన్ దేశ రాజధాని ఖార్టూమ్ సమీప పట్టణంలో సైనిక విమానం కుప్పకూలిన ఘటనలో 46 మంది సజీవ దహనమయ్యారు. మరో 10 మంది గాయాలపాలయ్యారు. విమానం జనావాసాలపై కూలడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని స్థానిక యంత్రాంగం ప్రకటించింది. ఓమ్డర్మ్యాన్ సిటీకి ఉత్తరాన ఉన్న వాడీ సయిద్నా వైమానిక స్థావరం నుంచి మంగళవారం రాత్రి టేకాఫ్ అయిన ఆంటోనోవ్ రకం సైనిక విమానం కొద్దిసేపటికే కర్రారీ జిల్లాలోని జనావాసాలపై కూలింది. విమానంలో ప్రయాణిస్తున్న ఆర్మీ సీనియర్ కమాండర్ బహర్ అహ్మద్, సైనిక అధికారులతోపాటు జనావాసంలోని సాధారణ ప్రజలూ ప్రాణాలు కోల్పోయారని ఖార్టూమ్ మీడియా కార్యాలయం తెలిపింది. ఘటనకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో కూలిపోయిందని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. -
మార్కెట్‌పై దాడి.. 54 మంది హతం
కైరో: సూడాన్‌లో మిలటరీతో హోరాహోరీ పోరు సాగిస్తున్న పారామిలటరీ బలగాలు మరోసారి రక్తపాతం సృష్టించాయి. ఇటీవలే దార్పుర్లోని ఎల్ ఫషెర్లోని ఆస్పత్రిపై దాడి చేసి 70 మంది అమాయకుల్ని బలి తీసుకున్న వీరు శనివారం మార్కెట్‌పై దాడి చేసి 54 మందికి పైగా చంపేశారు. ఒంబుర్మన్ నగరంలోని సబ్రెయిన్ మార్కెట్లో ఈ దారుణం జరిగింది. ఘటనలో మరో 158 మంది గాయపడినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారంది. ఘటనపై పారా మిలటరీ బలగాలు స్పందించలేదు. మిలటరీ, పారామిలటరీ బలగా లు ఆధిపత్యం కోసం 2023 ఏప్రిల్ నుంచి ముఖాముఖి పోరు సాగిస్తున్నాయి. అయితే, ఇటీవలి కాలంలో జరిగిన పలు ఘటనల్లో రాజధాని ఖార్టూమ్‌తోపాటు పొరుగునే ఉన్న ఒంబుర్మన్, తూర్పు, సెంట్రల్ ప్రావిన్స్‌ల్లోని పలు ప్రాంతాల్లో మిలటరీ పైచేయి సాధించింది. దేశంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఉన్న గెజిరా ప్రావిన్స్ రాజధాని వాద్ మెదానీని కూడా సైన్యం తిరిగి స్వాధీనం పర్చుకుంది. -
వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. ఈ ఐదు ప్రధాన కారణాలు!
ప్రపంచవ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు ప్రయాణీకులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో విమానం ఎక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా ఒకేరోజులో(జనవరి 29)న అమెరికా, సూడాన్‌లో జరిగిన విమాన ప్రమాదాల కారణంగా ఏకంగా 84 మంది ప్రాణాలు కోల్పోవడం బాధితుల కుటుంబ సభ్యులను ఆవేదనకు గురిచేస్తోంది. ఈ ప్రమాదాలకు పైలట్స్, విమానంలో సాంకేతిక లోపాలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రమాదాలకు మాత్రం ఐదు కారణాలే ముఖ్యంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.తాజాగా సౌత్ సూడాన్‌లో ఘోర విమాన భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20మంది ప్రయాణికులు మరణించారు. ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు ధృవీకరించారు. యూనిటీ రాష్ట్రంలో గ్రేటర్ పయనీర్ ఆపరేటింగ్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విధుల్లో భాగంగా ఉద్యోగుల్ని తీసుకుని రాజధాని జుబాకు బయలుదేరింది. అయితే, రన్‌వే నుండి 500 మీటర్ల దూరంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం కూలిపోయింది. ప్రయాణీకుల్లో 16 మంది సౌత్ సూడాన్, ఇద్దరు చైనా, ఒక భారతీయుడు ఉన్నట్లు తేలింది.ఇక, భారత కాలమానం ప్రకారం.. గురువారం తెల్లవారుజామున అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో ప్రయాణికుల విమానం, సైనిక హెలికాప్టర్ ఢీ కొన్న ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 64 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అక్కడి అగ్నిమాపక శాఖ చీఫ్ వెల్లడించారు. ఇప్పటి వరకు 28 మృతదేహాలను నదిలోంచి బయటకి తీసినట్లు తెలిపారు. అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, 2025 ఏడాది ప్రారంభంలోనే ఇలా ఒకే రోజున విమాన ప్రమాదాల కారణంగా ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగడంతో ప్రయాణీకులు వణికిపోతున్నారు.ఇదిలా ఉండగా.. 2000-2024 మధ్య 26 బోయింగ్ విమాన ప్రమాదాలు జరగ్గా అందుల్లో దాదాపు 10వేల మంది మరణించారు. ఒక్క 2024 ఏడాదిలో 15 విమాన ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 318 మంది ప్రాణాలు కోల్పోయారు. విమాన ప్రమాదాల్లో 50 శాతం ప్రమాదాలకు ప్రధాన కారణంగా పైలట్లే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి పైలట్లు అనుభవిస్తున్న అలసటే కారణమని అంటున్నారు. ఇక, 20 శాతం ప్రమాదాలకు విమాన సాంకేతిక లోపాలే కారణమని అంటున్నారు. 2018 తర్వాత 2024లోనే విమాన ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి.ఐదు కారణాలు ఇవే..పైలట్ల లోపాలు.. 50 శాతంసాంకేతిక లోపాలు.. 20 శాతంపిడుగులు, తుఫాన్లు, బ్యాడ్ వెదర్.. 15 శాతంటెర్రరిజం, మిస్సైల్ దాడులు.. 5 శాతం ఇతర ప్రమాదాలు.. 10 శాతందీనికి సంబంధించిన పలు కారణాలు విశ్లేషణతో ఈ వీడియోలో.. -
సౌత్ సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం
-
సూడాన్‌లో ఆసుపత్రిపై డ్రోన్ దాడి.. 30 మంది మృతి
ఆఫ్రికాలోని సూడాన్‌లో ఘోరం జరిగింది. డార్ఫర్ ప్రాంతంలోని ఎల్-ఫాషర్లో ఆస్పత్రిపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో సుమారు 30 మంది మృతి చెందారు. పలువురు గాయపడినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. అత్యవసర సేవలు అందిస్తున్న కేంద్రం ధ్వంసమైంది. 2023 ఏప్రిల్ నుంచి సూడాన్‌పై పట్టు కోసం సైన్యం, పారా మిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాలు పోరు కొనసాగిస్తున్నాయి. అయితే ఏ గ్రూప్ ఈ చర్యకు పాల్పడిందో తెలియాల్సి ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.సూడాన్‌లో పారామిలిటరీ ఫోర్స్, సైన్యం మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో అమాయకులు బలవుతున్నారు. 2023 ఏప్రిల్ 15వ తేదీ నుంచి మొదలైన ఈ అంతర్యుద్ధంతో వేల సంఖ్యలో మృతి చెందినట్లు పలు నివేదికలు చెబుతున్నారు. ఆ సంక్షోభాన్ని ఆపేందుకు అంతర్జాతీయంగా పలు దేశాలు ప్రయత్నాలు ఫలించడం లేదు. సూడాన్ ప్రపంచంలోనే పిల్లలో పోషకాహార లోపం రేటు అత్యధికంగా ఉన్న దేశమని యూనిసెఫ్ గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: హమాస్ చెర నుంచి మరో నలుగురు బందీల విడుదలకాగా, పిల్లల పాలిట చరిత్రలో ఎన్నడూ లేనంతటి దారుణ సంవత్సరంగా గత ఏడాది (2024) నిలిచింది. యుద్ధాలు, ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బాలలు భారీ సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఏకంగా 47.3 కోట్ల మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆరుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది కల్లోల ప్రాంతాల్లో నివసిస్తున్నారు.ఒకప్పుడు పేదరికం, కరువు, వంటివాటితో అల్లాడే పిల్లలు ఇప్పుడు ఘర్షణల్లో సమిధలవుతున్నారు. చదువు మాట అటుంచి వారికి పోషకాహారమే గగనమైపోయింది! గాజా, సూడాన్, ఉక్రెయిన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలతో బాలలు విపరీతంగా సతమతమవుతున్నట్టు ఐరాస బాలల సంస్థ యునిసెఫ్ పేర్కొంది. -
సూడాన్ శిశువుకు పునర్జన్మ
సాక్షి, హైదరాబాద్/ నాంపల్లి: సూడాన్ దేశానికి చెందిన ఓ శిశువుకు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న శిశువుకు సుమారు నెల రోజులపాటు నిలోఫర్‌లో పూర్తి ఉచితంగా వైద్యం అందించారు. సూడాన్ దేశానికి చెందిన దంపతులు ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనేందుకు ఏడాది క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. ఓ కార్పొరేట్ హాస్పిటల్లో సయీదా అబ్దుల్ వాహెద్ అనే మహిళ ఐవీఎఫ్ చేయించుకుని నెలరోజుల క్రితం మగ పిల్లాడికి జన్మనిచ్చి0ది. శిశువుకు పుట్టుకతోనే బ్లడ్ ఇన్ఫెక్షన్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నట్టుగా గుర్తించారు. శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆరు రోజులపాటు కార్పొరేట్ ఆసుపత్రి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో సూడాన్ దంపతుల వద్ద డబ్బులు పూర్తిగా అయిపోవడంతో శిశువును నిలోఫర్‌కు రిఫర్ చేశారు. ఆ శిశువును అడ్మిట్ చేసుకున్న నిలోఫర్ డాక్టర్లు నెల రోజులపాటు పూర్తి ఉచితంగా చికిత్స అందించారు. శిశువు తల్లిదండ్రులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. శిశువు పూర్తిగా కోలుకోవడంతో, మంగళవారం డిశ్చార్జ్ చేశామని చికిత్స చేసిన నిమోనాటాలజిస్ట్ డాక్టర్ స్వప్న తెలిపారు. తన బిడ్డను బతికించిన డాక్టర్లకు ఆ తల్లి (43 ఏళ్లు) కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు ఇప్పటికే ఐదుసార్లు అబార్షన్ అయిందని, ఎన్నో ఏళ్లుగా పిల్లల కోసం తపించామని ఆమె తెలిపారు. చావుబతుకుల్లో ఉన్న తన బిడ్డకు నిలోఫర్ వైద్యులు పునర్జన్మను ప్రసాదించారన్నారు. విషమ పరిస్థితిలో ఉన్న శిశువుకు ట్రీట్మెంట్ అందించిన డాక్టర్ల బృందాన్ని, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అభినందించారు. -
ఈ ఏడాది.. పిల్లల పాలిట పెనుశాపమే!
పిల్లల పాలిట చరిత్రలో ఎన్నడూ లేనంతటి దారుణ సంవత్సరంగా నిలిచింది 2024. యుద్ధాలు, ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బాలలు భారీ సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఏకంగా 47.3 కోట్ల మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆరుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది కల్లోల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఒకప్పుడు పేదరికం, కరువు, వంటివాటితో అల్లాడే పిల్లలు ఇప్పుడు ఘర్షణల్లో సమిధలవుతున్నారు. చదువు మాట అటుంచి వారికి పోషకాహారమే గగనమైపోయింది! గాజా, సూడాన్, ఉక్రెయిన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలతో బాలలు విపరీతంగా సతమతమవుతున్నట్టు ఐరాస బాలల సంస్థ యునిసెఫ్ తాజాగా పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 15 నెలల్లో కనీసం 17,492 మంది బాలలు మరణించినట్లు తెలిపింది...! మునుపెన్నడూ లేనంతంగా ఎక్కువ మంది పిల్లలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. బలవంతంగా నిరాశ్రయులవుతున్నారు. ఘర్షణలో మరణిస్తున్న, గాయపడుతున్న పిల్లల సంఖ్య పెరిగింది. పాఠశాలలపై బాంబుల వర్షం కురుస్తోంది. ఇళ్లు ధ్వంసమయ్యాయి. కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. భద్రత మాట పక్కకు పెడితే.. ప్రాథమిక అవసరాలు తీర్చుకునే అవకాశమూ ఉండటం లేదు. వాళ్లు ఆడుకోవడం, నేర్చుకోవడం ఎప్పుడో మరిచారు. ఈ యుద్ధాలు పిల్లల హక్కులను హరిస్తున్నాయి. ఇక, ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్లు, పోషకాహారం విలాసంగా మారాయి. ‘‘ప్రపంచంలో అనియంత్రిత యుద్ధాలకు ఒక తరం పిల్లలు బలవుతున్నారు. యుద్ధ ప్రాంతాల్లోని పిల్లలు మనుగడ కోసం పోరాటమే చేస్తున్నారు. దానికి తమ బాల్యాన్ని పణంగా పెడుతున్నారు. సర్వహక్కులు కోల్పోతున్నారు. ఇది దారుణం’’ అని యునిసెఫ్ డైరెక్ట్ కేథరిన్ రస్సెల్ వాపోయారు. గణాంకాలు చెబుతున్న విషాదాలు.. యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో పిల్లలు 30 శాతం ఉన్నారు. వారిలో 47.3 కోట్ల మంది యుద్ధ ప్రభావింత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రతి ఆరుగురిలో ఒకరు సంఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్నారని అంతర్జాతీయ ఏజెన్సీ తెలిపింది. 1990లలో సుమారు 10 శాతం మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో ఉండగా ఇప్పుడది ఏకంగా రెట్టింపుకు, అంటే 19 శాతానికి పెరిగింది. ఈ యుద్ధాల కారణంగా 2023 చివరి నాటికి 4.7 కోట్ల మంది పిల్లలు నిర్వాసితులయ్యారు. 2024లో హై తీ, లెబనాన్, మయన్మార్, పాల స్తీనా, సూడాన్ నుంచి అత్యధికంగా శరణార్థులుగా వెళ్లారు. ప్రపంచ శరణార్థుల జనాభాలో సుమారు 40 శాతం బాలలే. ఆయా దేశాల్లో నిర్వాసితులయినవారిలో బాలలు 49 శాతమున్నారు. 2023 నుంచి ఇప్పటిదాకా 22,557 మంది పిల్లలపై రికార్డు స్థాయిలో 32,990కు పైగా తీవ్రమైన హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. ముఖ్యంగా బాలికల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంఘర్షణ ప్రాంతాల్లో అత్యాచారాలు, లైంగిక హింస పెచ్చరిల్లాయి. ప్రమాదకర స్థాయిలో యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో విద్యకు తీవ్ర అంతరాయం కలిగింది. సంఘర్షణ ప్రభావిత దేశాలలో 52 మిలియన్లకు పైగా పిల్లలు పాఠశాలకు దూరంగా ఉన్నారు. విద్యా మౌలిక సదుపాయాల విధ్వంసం, పాఠశాలల సమీపంలో అభద్రతా భావం వల్ల ఈ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ పిల్లల్లో పోషకాహార లోపం కూడా ప్రమాదకర స్థాయికి పెరిగింది. యుద్ధం పిల్లల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధాలు జరుగుతున్న దేశాల్లోని పిల్లల్లో 40శాతం మంది టీకాలు అందడం లేదు. వారి మానసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. హింస, విధ్వంసం, కుటుంబ సభ్యులను కోల్పోవడం వల్ల పిల్లల్లో నిరాశ పెరిగింది. పిల్లల్లో ఆగ్రహావేశాలు పెరిగాయి. విచారం, భయం వంటి వాటితో బాధపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డ్యామ్ తెగి 60 మంది మృతి, వంద మందికి పైగా గల్లంతు!
ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈస్ట్రన్ రెడ్ సీ ప్రాంతంలో ఒక డ్యామ్ తెగిపోవడంతో పలువురు మృతిచెందారని, లెక్కలేనంతమంది గల్లంతయ్యారని సూడాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో 60 మంది మృతిచెందారని, 100 మంది గల్లంతయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఎడతెగని భారీ వర్షాలకు అర్బత్ డ్యామ్ తెగిపోయిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనలో ఎంతమంది మృతిచెందారనేది ఇంకా తెలియలేదు. పోలీసు బలగాలు ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. స్థానిక అధికారి ఒకరు సుడానీస్ వార్తా వెబ్సైట్ అల్-తాగిర్తో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో 60 మంది మృతిచెందివుండవచ్చని, లెక్కలేంతమంది గల్లంతైవుంటారని అన్నారు. ఈ ప్రమాదం కారణంగా జరిగిన నష్టం తీవ్రవమైనదని నీటిపారుదలశాఖ అధికారి అమర్ ఇసా తాహిర్ మీడియాకు తెలిపారు.సూడానీస్ వార్తా సంస్థ మెదామిక్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో 100 మందికి పైగా జనం గల్లంతయ్యారు. సమీప గ్రామప్రజలు కొండలపైకి చేరుకుని తలదాచుకున్నారని తెలుస్తోంది. ఈ డ్యామ్ పోర్ట్ సూడాన్ నగరానికి ఉత్తరాన 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం శనివారం రాత్రి ఈ డ్యామ్ కూలిపోయింది. సూడాన్‌లో ప్రతి ఏటా వరదలు సంభవిస్తుంటాయి. గత మూడేళ్లుగా ఈ ప్రాంతంలో సంభవిస్తున్న వరదలకు వందలాది మంది మృతి చెందగా, పెద్ద ఎత్తున పంటనష్టం ఏర్పడింది.🇸🇩 SE COLAPSA PRESA DE JOR ARBAAT EN SUDÁNAl menos 60 personas perdieorn la vida ahogadas, luego de registrarse el colpaso de la presa de #JorArbaat, ubicada al este de #Sudán, que terminó por inundar al menos 5 pueblos con 5,000 habitantes cada una.Según reportan, la presa… pic.twitter.com/TH5eS6ePps— 𝗧𝗵𝗲 𝗠e𝘅𝗶𝗰𝗼 𝗣𝗼𝘀𝘁 (@MexicoPost) August 27, 2024 -
సూడాన్‌లో 85 మంది ఊచకోత
ఖార్టూమ్: సూడాన్‌లో పారా మిలటరీ మూకలు గురువారం సిన్నార్ రాష్ట్రంలోని జల్క్ని గ్రామంపై దాడిచేసి బాలికలను కిడ్నాప్ చేసేందుకు యత్నించగా గ్రామస్థులు ప్రతిఘటించారు. దీంతో మూకలు గ్రామాన్ని ఐదు రోజులపాటు ముట్టడించి 85 మందిని చంపేశారని మీడియా తెలిపింది. సిన్నార్ కోసం సైన్యం, మూకల మధ్య సాగుతున్న పోరుతో ఇన్నేళ్లలో 7.25 లక్షల మంది ప్రజలు వలస వెళ్లారు. -
సూడాన్‌లో భారీ వర్షాలు.. 32మంది మృతి
ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా పలుచోట్ల వరదల సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో 32 మంది మృతిచెందారని, 107 మంది గాయపడ్డారని సూడాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది.దేశంలో కురుస్తున్న వర్షాలు, ముంచెత్తుతున్న వరదలు ఏడు రాష్ట్రాలను ప్రభావితం చేశాయి. 5,575 ఇళ్ళు దెబ్బతిన్నాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. జిన్హువా వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం భారీ వర్షాలు, వరదల కారణంగా డయేరియా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఇదిలావుండగా కస్సాలా నగరం గుండా ప్రవహించే గాష్ నది నీటి మట్టం పెరుగుతోంది.దీంతో పౌరులు అప్రమత్తంగా ఉండాలని, నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. సూడాన్‌లో సాధారణంగా జూన్, అక్టోబర్ మధ్య వరదలు సంభవిస్తుంటాయి. గత మూడేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు వందలాది మంది మృతి చెందగా, లెక్కలేనన్ని వ్యవసాయ భూములు ధ్వంసమయ్యాయి. -
India vs China: టగ్ ఆఫ్ వార్‌లో భారత బలగాల గెలుపు
ఖార్టూమ్: చైనా బలగాలపై భారత్ సైనికులు పైచేయి సాధించారు. ఇది యుద్ధంలో కాదు..! ఐక్యరాజ్యసమితి పీస్ కీపింగ్ మిషన్‌లో భాగంగా సుడాన్లో నిర్వహించిన ‘టగ్ ఆఫ్ వార్’ పోటీలో చైనాను భారత బలగాలు ఓడించాయి. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.#WATCH | Indian troops won a Tug of War that took place between them and Chinese troops during deployment in Sudan, Africa under a UN Peacekeeping mission: Army officials (Viral video confirmed by Indian Army officials) pic.twitter.com/EpnGKURPa3— ANI (@ANI) May 28, 2024 టాగ్ ఆఫ్ వార్ పోటీలో భారత్, చైనా బలగాలు పోటీ పడ్డాయి. ఈ పోటీలో భారత్ బలగాలు టీం వర్క్, అద్భుతమైన పట్టుదలతో కూడిన సామర్థాన్ని ప్రదర్శించి చైనా బలగాలను ఓడించారు. స్నేహ పూర్వకంగా జరిగిన ఈ పోటీ.. అక్కడ ఉన్న మిగతా సైనికుల్లో ఉత్సాహాన్ని నింపింది.యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ ద సూడాన్(UNMIS) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిబంధనలతో 24 మార్చి, 2005 ఏర్పాటైంది. ఈ క్రమంలోనే సూడాన్ ప్రభుత్వం, సూడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్ మధ్య 9 జనవరి, 2005లో శాంతి ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి సూడాన్ శాంతి ఒప్పందానికి సంబంధించి పలు కార్యక్రమాలు చేపడుతోంది. మానవతా సాయం, మానవ హక్కుల పరిరక్షణ, ఆఫ్రికా యూనియన్ మిషన్‌కు మద్దతు పలకటం వంటి కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగా నిర్వహించినదే భారత్-చైనా మధ్య నిర్వహించిన టగ్ ఆఫ్ వార్ స్నేహపూర్వక పోటీ అని అధికారులు తెలిపారు. -
సూడాన్‌లో హింస.. 52 మంది మృతి!
ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్‌లో హింసాయుత ఘటనలు చోటుచేసుకున్నాయి. అబేయిలో కొందరు ముష్కరులు, గ్రామస్తుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో 52 మంది మృతిచెందగా, 64 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐక్యరాజ్యసమితి ప్రాంతీయ అధికారి కూడా ఉన్నారు. కొందరు ముష్కరులు సామాన్యులపై దాడికి పాల్పడ్డారని అబేయి సమాచార శాఖ మంత్రి బుల్లిస్ కోచ్ తెలిపారు. అయితే దాడికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. భూవివాదాల నేపధ్యంలోనే ఈ దాడి జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ హింసకు పాల్పడినవారు న్యూర్ తెగకు చెందినవారని, వారు భారీగా ఆయుధాలు కలిగి ఉన్నారని కోచ్ తెలిపారు. గత ఏడాది వరదల కారణంగా ఈ సాయుధ యువకులు వార్రాప్ రాష్ట్రానికి వలస వెళ్లారని సమాచారం. సూడాన్‌లో జాతి హింస రోజురోజుకూ పెరిగిపోతోంది. అబేయిలోని ఐక్యరాజ్యసమితి మధ్యంతర భద్రతా దళం (యూఎన్ఐఎస్ఎఫ్ఏ) శాంతి పరిరక్షకుని మృతికి దారితీసిన హింసను ఖండించింది. అబేయిలోని పలుప్రాంతాల్లో అంతర్ మత ఘర్షణలు జరిగాయని యూఎన్ఐఎస్ఎఫ్ఏ ధృవీకరించింది. కాగా సూడాన్, దక్షిణ సూడాన్లు రెండూ అబేయిపై ఆధిపత్యాన్ని కోరుకుంటున్నాయి. 2011లో సూడాన్ నుండి దక్షిణ సూడాన్ స్వతంత్రం పొందిన తర్వాత కూడా ఈ సమస్యను పరిష్కరించలేదు. ఆఫ్రికన్ యూనియన్ ప్యానెల్ అబేయిపై ప్రజాభిప్రాయ సేకరణను ప్రతిపాదించింది. అయితే ఎవరు ఓటు వేయాలనే దానిపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అబేయి ప్రాంతం దక్షిణ సూడాన్ ఆధీనంలో ఉంది. మార్చిలో దక్షిణ సూడాన్ తన దళాలను అబేయిలో మోహరించినప్పటి నుండి అంతర్గత సరిహద్దు ఘర్షణలు మరింతగా పెరిగాయి. -
సూడాన్‌లో డ్రోన్ దాడి..43 మంది మృతి
కైరో: సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని ఓ మార్కెట్‌పై ఆదివారం జరిగిన డ్రోన్ దాడిలో 43 మంది చనిపోయారు. మరో 55 మంది గాయాలపాలయ్యారని మానవీయ సాయం అందిస్తున్న సంస్థలు వెల్లడించాయి. దేశంలో మిలటరీ చీఫ్ జనరల్ అబ్దెల్ ఫతాహ్ బుర్హాన్, పారా మిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ నేత జనరల్ మహ్మద్ హమ్దాన్ దగాలో మధ్య ఏప్రిల్ నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గ్రేటర్ ఖార్టూమ్ ప్రాంతంలో నివాసాల్లో పారా మిలటరీ బలగాలు తిష్టవేసి పోరాట సాగిస్తున్నారు. వారిని లక్ష్యంగా చేసుకుని మిలటరీ వైమానిక దాడులకు దిగుతోంది. రెండు వర్గాల మధ్య పోరులో సామాన్యులు సమిధలుగా మారుతున్నారు. ఈ పోరులో 4 వేల మందికి పైగా మరణించినట్లు ఐరాస చెబుతోంది. -
ఎలాన్ మస్క్‌కు భారీ ఝలక్!
ఎక్స్. కామ్ అధినేత ఎలాన్ మస్క్‌కు హ్యాకర్లు ఝలక్ ఇచ్చారు. తమ దేశంలోనూ స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించాలని వార్నింగ్ ఇస్తూ సూడాన్‌కు చెందిన యాకర్లు ఎక్స్. కామ్‌ను హ్యాక్ చేశారు. ఆపై సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ పనిచేయకుండా బ్లాక్ చేశారు. సుడాన్‌లోని ఓ రహస్య హ్యాకర్స్ బృందం ప్రపంచంలోని 12కు పైగా దేశాల్లో ఎక్స్. కామ్ పని చేయకుండా 2 గంటల పాటు నిలిపివేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మైక్రో బ్లాగింగ్ సైట్లో తలెత్తిన అంతరాయంతో యూజర్లు ఇబ్బంది పడినట్లు బ్రిటిష్ మీడియా సంస్థ బీబీసీ నివేదించింది. ‘ఎలాన్ మస్క్‌కు మేమిచ్చే మెసేజ్ ఇదే. సూడాన్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించాలంటూ హ్యాకర్స్ గ్రూప్ టెలిగ్రాం ఛానల్లో ఓ మెసేజ్‌ను పోస్ట్ చేసింది.ఎక్స్. కామ్‌ను తమ అదుపులోకి తీసుకోవడంతో యూకే, యూఎస్‌కు చెందిన 20,000 మంది తమకు ఫిర్యాదు చేసినట్లు డౌన్ డిటిటెక్టర్ తెలిపింది. ఎక్స్.కామ్ హ్యాకింగ్‌కు కారణం అయితే, జరిగిన అంతరాయాన్ని ఎక్స్.కామ్ యాజమాన్యం స్పందించలేదు. ఈ సందర్భంగా హ్యాకింగ్ గ్రూప్ సభ్యుడు హోఫా మాట్లాడుతూ.. సూడాన్‌లో కొనసాగుతున్న సివిల్ వార్‌పై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో డిస్ట్రిబ్యూటెడ్ డెనిషన్ ఆఫ్ సర్వీస్ (డీడీఓఎస్) హ్యాకింగ్ దాడి జరిగింది. కానీ ఇంటర్నెట్ పనితీరు కారణంగా మా నినాదాన్ని గట్టిగా వినిపించ లేకపోతున్నాం. తరచుగా ఇంటర్నెట్ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపాడు. కాబట్టే తమకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలం అవసరమని పేర్కొన్నాడు. ప్రిగోజిన్‌కు వ్యతిరేకంగా హ్యాకింగ్ గ్రూప్‌కు రష్యా సైబర్ మిలటరీ యూనిట్‌కు మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే రష్యాతో తమకు ఉన్న అనుబంధాన్ని ఆ సంస్థ ఖండించింది. పుతిన్ ప్రభుత్వంపై తిరుగుబాటుదారుడు, వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ పారామిలటరీని అంతం చేయడానికి రష్యా ప్రభుత్వానికి మద్దతుగా ఈ హ్యాకింగ్ గ్రూప్ జూన్‌లో ఓ మెసేజ్‌ను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ హ్యాకింగ్ గ్రూప్ గతంలో ఫ్రాన్స్, నైజీరియా, ఇజ్రాయెల్, అమెరికాలో అలజడి సృష్టించింది. -
నాలుగు నెలలు.. కరువు కోరల్లోకి 60 లక్షల మంది!
నాలుగు నెలలుగా యుద్ధ వాతావరణం. ఐదువేల మందికిపైగా మృతి. ప్రాణ భయంతో వలసలు పోయిన లక్షల మంది. కరువుకు కూతవేటు దూరంలో మరో అరవై లక్షల మంది. అంతర్యుద్ధంతో సూడాన్ ఎంతగా నాశనం అయ్యిందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనాలు. సూడాన్‌లో పారామిలిటరీ ఫోర్స్, సైన్యం మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో అమాయకులు బలవుతున్నారు. ఆర్మీ జనరల్ అబ్దెల్ ఫట్టాహ్ అల్ బుర్హాన్, పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్సెస్ కమాండర్ మొహమ్మద్ హందన్ దాగ్లో మధ్య విలీన చర్చలు విఫలం కావడంతో.. పరస్సర దాడులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మొదలైన ఈ అంతర్యుద్ధంతో ఐదు వేల మందిదాకా మృతి చెందినట్లు పలు నివేదికలు చెబుతున్నారు. ఆ సంక్షోభాన్ని ఆపేందుకు అంతర్జాతీయంగా పలు దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. మూర్ఖంగా ముందుకే పోతున్నాయి రెండు వర్గాలు. ఊహించని ప్రాణ నష్టం చిన్నారులు ఈ స్థాయిలో మరణిస్తారని ఊహించలేదు. ఆకలి కేకల్ని నిర్మూలించగలిగే పరిస్థితులు ఉన్నా.. వాళ్లు చనిపోవడం బాధాకరం అని సేవ్ ది చిల్ట్రన్ అనే ఎన్జీవో ఒక ప్రకటన విడుదల చేసింది. మరణాలు మాత్రమే కాదు.. దాదాపు 40 వేల మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, చికిత్స అందకపోతే వాళ్ల ప్రాణాలకు కూడా ముప్పేనని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. సూడాన్ ప్రపంచంలోనే పిల్లలో పోహకాహారలోపం రేటు అత్యధికంగా ఉన్న దేశమని యూనిసెఫ్ గతంలోనే చెప్పింది. అంతర్యుద్ధంతో.. యాభై వేలకు పైగా చిన్నారుల జీవితం ప్రమాదంలో పడిందని తెలిపింది. మరోవైపు సూడాన్ నుంచి 44 లక్షల మంది సురక్షిత ప్రాంతాలు.. పొరుగు దేశాలకు తరలి వెళ్లి ఉంటారని యూఎన్వో శరణార్థి విభాగం అంచనా వేస్తోంది. సూడాన్‌లో కరువు కోరల్లో 60 లక్షల మంది ఉన్నారనే హెచ్చరికలూ జారీ అవుతున్నాయి. పరస్పర దాడుల వల్ల.. చాలామంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు. చాలా ప్రాంతాలు అంధకారంలో కూరుకుపోయాయి. ఆహారం, మంచి నీరు, మందులు లేక వాళ్లు అల్లలాడుతున్నారు. మరోవైపు చికిత్స అందించాల్సిన ఆస్పత్రులే నాశనం అయిపోవడం దిగ్భ్రాంతి కలిగించే అంశం. అంతర్జాతీయంగా పలు ఛారిటీలు, సంస్థలు సాయం అందించేందుకు ముందుకు వెళ్తున్నా.. ఆర్మీ-పారామిలిటరీ బలగాల దాడులతో వాటికి విఘాతం ఏర్పడుతోంది. -
సూడాన్‌లో వైమానిక దాడి..
కైరో: సూడాన్ రాజధాని ఖార్టూమ్‌పై శనివారం జరిగిన వైమానిక దాడిలో అయిదుగురు చిన్నారులు సహా 17 మంది చనిపోయారు. ఆర్మీకి, శక్తివంతమైన పారా మిలటరీ విభాగం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్(ఆర్ఎస్ఎఫ్)కు మధ్య ఏప్రిల్ నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మిలటరీ విమానాలు ఆర్ఎస్ఎఫ్పై దాడులు జరుపుతుండగా, ఆర్ఎస్ఎఫ్ బలగాలు డ్రోన్లతో సైన్యంపై దాడులకు దిగుతోంది. ఖార్టూమ్‌లోని యోర్మౌక్ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య భీకరపోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజా దాడికి ఎవరు కారణమనే విషయం స్పష్టం కాలేదు. ఈ దాడిలో మరో 11 మంది వరకు గాయపడినట్లు మానవతా సాయం అందిస్తున్న ఒక సంస్థ అంటోంది. మిలటరీయే అక్కడ దాడి చేసిందని, తాము ఒక మిగ్ యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ఆర్ఎస్ఎఫ్ అంటోంది. ఆర్మీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అరబ్ మిలీషియాకు చెందిన జన్జవీద్ సంస్థ ఆర్‌ఎస్‌ఎఫ్‌తో కలిసి పోరాడుతోందని సమాచారం. జన్జవీద్ను విమర్శించినందుకే ఇటీవల పశ్చిమ దర్ఫుర్ గవర్నర్ ఖమిస్ అబ్దల్లా అబ్కర్ను చంపేశారని విమర్శలు వస్తున్నాయి. -
Sudan: ప్చ్.. అంత చేసినా సీన్ మారలేదా?
వారంపాటు కాల్పుల విరమణకు అంగీకరించిన సూడాన్ ఆర్మీ, పారామిలిటరీ బలగం(RSF).. మళ్లీ కయ్యానికి దిగాయి. కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన కొద్దినిమిషాల వ్యవధిలోనే పరిస్థితి మళ్లీ తలపడడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. అమెరికా, సౌదీ అరేబియా దౌత్యంతో ఎట్టకేలకు వారంపాటు కాల్పుల విరమణకు సూడాన్‌లో అంతర్యుద్ధానికి దిగిన ఇరు వర్గాలు అంగీకరించాయి. అయితే.. సోమవారం అర్ధరాత్రి నుంచి ఈ విరమణ అమలులోకి రాగా.. కాసేపటికే ఇరు వర్గాలు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. చాలా ప్రాంతాల్లో మళ్లీ కాల్పులకు, వైమానిక దాడులకు తెగబడ్డాయి. ముఖ్యంగా రాజధాని ఖార్తోమ్‌లో ఈ దాడులు హోరాహోరీగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇరువర్గాలతో పలుదఫాలుగా చర్చించి ఒప్పంద పత్రాలపై సంతకాల ద్వారా కాల్పుల విమరణకు ఒప్పించాయి అమెరికా, సౌదీ అరేబియాలు. తద్వారా తీవ్ర మారణ హోమం నుంచి వీలైనంత మేర ప్రజల్ని తప్పించాలని భావించాయి. అంతేకాదు.. గతంలో కాల్పుల విమరణ ఉల్లంఘనలా తరహా కాకుండా ఈసారి ఇరువర్గాలు కచ్చితంగా పాటిస్తాయని ఈ సందర్భంగా ఆ దేశాలు భావించాయి. అందుకు తగ్గట్లే ఆర్ఎస్ఎఫ్ నేత మొహమ్మద్ హమ్దాన్ డగాలో.. సౌదీ అరేబియా, అమెరికాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్విటర్ ద్వారా ఓ ఆడియో సందేశం విడుదల చేశారు. కానీ, పరిస్థితిలో మార్పు మాత్రం రాలేదు. పక్కా ఒప్పందాన్ని సైతం ఉల్లంఘించి ఇరువర్గాలు మళ్లీ తలపడుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆర్మీ, పారామిలిటరీ బలగం ఆర్ఎస్ఎఫ్ మధ్య ఆధిపత్య పోరులో సూడాన్ సాధారణ పౌరులు నలిగిపోతున్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి కాల్పులు, వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఐదువారాలుగా సాగుతున్న ఈ ఘర్షణల్లో వందల మంది మరణించగా.. లక్షల మంది చెల్లాచెదురు అయ్యారు. -
యుద్దానికి విరమణ ప్రకటించిన సూడాన్
సూడాన్‌లో గత కొన్ని రోజులు జరుగుతున్న అంతర్యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు వర్గాల సైన్యం మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఇది చర్చల ద్వారా ఏర్పడిన మొదటి సంధి. అయితే సుడాన్ సైన్యం సోమవారం రాజధాని ఖార్టూమ్‌లో వైమానిక దాడులు నిర్వహించింది. సహాయక చర్యలను అనుమతించే క్రమంలో వారం రోజుల కాల్పుల విరమణ అమలులోకి రావడానికి కొన్ని గంటల ముందు పారామిలిటరీ ప్రత్యర్థులపైచేయి సాధించేందుకు సూడాన్ సైన్యం ఈ చర్యకు పాల్పడింది. ఇరు సైనిక వర్గాల మధ్య వివాదం చెలరేగినప్పటి నుంచి రాజధానిలోని నివాస ప్రాంతాలలో పనిచేస్తున్న పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మొబైల్ యూనిట్ల వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఆదివారం సాయంత్రం వరకు వైమానిక దాడులు నిర్వహించినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అయితే సోమవారం సాయంత్రం 7: 45 గంటల నుంచి కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలు తెలిపాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్, సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్ నుంచి ప్రతినిధులు ఉన్నారు. జెడ్డాలో చర్చల తర్వాత ఒప్పందానికి ఈ బృందం మధ్యవర్తిత్వం వహించింది. ఈ ఒప్పందం పొరుగు దేశాలకు పారిపోయిన 2,50,000 మందితో సహా దాదాపు 1.1 మిలియన్ల మందికి ఊరట కల్పించింది.సెంట్రల్ ఖార్టూమ్‌లోని వ్యూహాత్మక స్థానాల నుంచి పౌర భవనాలను ఆక్రమించిన పొరుగు ప్రాంతాల నుంచి RSFని తొలగించడానికి అక్కడి సైన్యం చాలా కష్టపడింది. -
ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో?
హాట్‌గా ఉన్న సమ్మర్లో ఏదైనా తాగాలి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పెప్సీ, కోకో కోలా లాంటి సాఫ్ట్ డింక్సే. ఇప్పుడు ఈ శీతల పానియాల్ని తయారు చేస్తున్న కంపెనీలను ప్రపంచంలోని అతి పేద దేశాల్లో ఒకటైన సూడాన్ అంతర్యుద్ధం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు కారణం పెప్సీ, కోకోకోలా, ఫీజీ కూల్ డ్రింక్స్‌తో పాటు క్యాండీ (స్వీట్స్)లలో ఉపయోగించే ఓ పదార్ధం సుడాన్లో మాత్రమే లభ్యమవుతుంది. ఇప్పుడు ఆ పదార్ధం కొరత తయారీ కంపెనీలను తీవ్రంగా వేధిస్తోంది. సూడాన్‌లో కొనసాగుతున్న ఆధిపత్య పోరు ప్రపంచ దేశాలే కాదు.. అంతర్జాతీయ కంపెనీలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రొడక్ట్‌ల తయారీకి అంతరాయం కలగకుండా ఉండేలా సుడాన్లో దొరికే పదార్ధాన్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. పెప్సీ, కోకో కోలాలో ఉపయోగించే పదార్ధం పెప్సీ, కోకో కోలాలో సాధారణంగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థం 'గమ్ అరబిక్'. పెప్సీ, కోకో కోలా కంపెనీలు తయారు చేసే సాఫ్ట్ డ్రింక్స్‌లో ఈ గమ్ అరబిక్‌ను కలుపుతారు. దీన్ని కలపడం వల్ల కూల్ డ్రింక్‌ను తయారీ కోసం వినియోగించే ఇంగ్రీడియంట్స్ విడిపోకుండా ఉంటాయి. లేదంటే ఇంగ్రీడియంట్స్ విడిపోయి రుచి, పచి ఉండవు. కాబట్టే తయారీ సంస్థలు ఈ గమ్ అరబిక్‌ను ఉపయోగిస్తాయి. ఇక ఆ పదార్ధం సుడాన్‌లోని అకాసియా చెట్టు నుంచి పూసే జిగురు తరహాలో ఉంటుంది. ఈ జిగురు ప్రపంచ దేశాలకు సూడాన్ నుండే రవాణా అవుతుంది. ప్రపంచంలో 70 శాతం గమ్ అరబిక్ సరఫరా ఆఫ్రికాలోని సూడాన్ గుండా ప్రవహించే సాహెల్ ప్రాంతం నుండి ఎగుమతి అవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వచ్చే 5-6 నెలల్లో గమ్ అరబిక్‌తో తయారు చేసిన ఉత్పత్తులు అయిపోవచ్చని ప్రధాన ఆహార, పానీయాల కంపెనీలకు గమ్ అరబిక్ సరఫరా చేసే కెర్రీ గ్రూప్ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ రిచర్డ్ ఫిన్నెగన్ను ఉటంకిస్తూ రాయిటర్స్‌లోని ఓ నివేదిక పేర్కొంది. డచ్ సప్లయర్ ఫోగా గమ్ భాగస్వామి మార్టిజెన్ బెర్గ్కాంప్ ఇదే తరహా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 బ్యాంక్ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. వారానికి 5 రోజులే పని దినాలు! 'గమ్ అరబిక్' ఉత్పత్తి ఏటా ప్రపంచవ్యాప్తంగా 120.000 బిలియన్ డాలర్ల విలువైన 1,1,500 టన్నుల గమ్ అరబిక్ ఉత్పత్తి అవుతుందని కెర్రీ గ్రూప్ అంచనా వేసింది. తూర్పు నుండి పశ్చిమ ఆఫ్రికా వరకు 500 మైళ్ళలో విస్తరించి ఉన్న ప్రాంతం నుండి ఈ గమ్‌ను సేకరిస్తారు. గమ్ అరబిక్ లేకపోతే పెప్సీ, కోకాకోలా వంటి దిగ్గజాలు తమ ఉత్పత్తులలో గమ్ అరబిక్ లేకుండా తమ ఉనికిని కాపాడుకోవడం సాధ్యం కాదని అగ్రిగమ్ మార్కెటింగ్ డైరెక్టర్ డాని హద్దాద్ చెప్పారు. ఫిజీ డ్రింక్స్ వంటి ఉత్పత్తుల్లో గమ్ అరబిక్కు ప్రత్యామ్నాయం లేదని నిపుణులు చెబుతుండగా.. సూడాన్ అంతర్యుర్ధం ముగింపుపై ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలు సైతం ఐక్యారాజ్య సమితి వేదికగా తమ గొంతుకను వినిపిస్తున్నాయి. 500 మందికి పైగా మృతి సాయుధ బలగాల నడుమ జరుగుతున్న ఆ ఆధిపత్య పోరులో నార్త్ ఆఫ్రీకా దేశమైన సూడాన్ అతలాకుతలమవుతోంది. పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్స్‌ను ఆర్మీలో విలీనం చేయాలనే ప్రతిపాదన.. ఈ రెండు వర్గాల నడుమ ఘర్షణలకు దారి తీసింది. సూడాన్ రాజధాని ఖార్తోమ్తో పాటు దేశంలో పలు చోట్ల ఈ ఘర్షణలు కొనసాగుతుండగా.. సాధారణ పౌరులు ఇబ్బంది పడుతున్నారు. ఘర్షణలు మొదలైన ఏప్రిల్ 15 నుంచి ఇప్పటివరకు (మే1) లక్ష మందికిపైగా పౌరులు సూడాన్‌ను వీడినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. మరో 3.30 లక్షల మంది నిరాశ్రయులయ్యారని తెలిపింది. మరోవైపు, ఈ హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటివరకు 500 మందికిపైగా మృతిచెందగా.. నాలుగు వేల మందికి పైగా గాయపడ్డారు. చదవండి👉 ‘ఆఫీస్‌కి వస్తారా.. లేదంటే!’, వర్క్ ప్రమ్ హోం ఉద్యోగులకు దిగ్గజ టెక్ కంపెనీల వార్నింగ్ -
భారతీయ వాయుసేన డేరింగ్ ఆపరేషన్
-
సూడాన్ నుంచి ఏపీకి 48 మంది క్షేమంగా..
సాక్షి, అమరావతి: సూడాన్‌లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను రాష్ట్ర ప్రభుత్వం క్షేమంగా రాష్ట్రానికి తీసుకొస్తోంది. ఇప్పటి వరకు 48 మంది సూడాన్ నుంచి ఇక్కడకు చేరుకున్నట్లు ఏపీఎన్ఆర్టీఎస్ సీఈవో వెంకట్ మేడపాటి తెలిపారు. సూడాన్‌లో అంతర్గత యుద్ధం కారణంగా రాష్ట్రానికి చెందిన 58 మందిని స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం 37 మందిని రాష్ట్రానికి క్షేమంగా తీసుకొచ్చింది. శుక్రవారం బెంగళూరుకు 33 మంది, మరో నలుగురు ముంబై, ఢిల్లీలకు చేరుకున్నారు. వీరిలో 34 మంది స్వస్థలాలకు చేరుకోగా, మిగిలిన ముగ్గురు ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ కార్డు లేని కారణంగా క్వారెంటైన్లో ఉన్నారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వంతో సంబంధం లేకుండా వారు పనిచేస్తున్న ప్రయివేటు కంపెనీల సహకారంతో, సొంతంగా ఇప్పటి వరకు మరో 11 మంది రాష్ట్రానికి చేరుకున్నారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఢిల్లీకి మరో ఆరుగురు, ఆదివారానికి మరికొందరు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మిగిలిన వారిని కూడా క్షేమంగా తీసుకొచ్చేలా రాయబార కార్యాలయంతో ఏపీఎఆన్‌ఆర్టీఎస్ అధికారులు నిరంతరం చర్చలు జరుపుతున్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ప్రవాసాంధ్రులను రాష్ట్రానికి క్షేమంగా తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 58 మంది ప్రవాసాంధ్రులతో వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 0863 234 0678, వాట్సాప్ నంబర్ 85000 27678లను అందుబాటులో ఉంచారు. ఇది కూడా చదవండి: AP: కుల ధ్రువీకరణ పత్రాలు రెడీ.. -
Operation Kaveri: సూడాన్ నుంచి వచ్చిన వారిలో ఎల్లో ఫివర్
బనశంకరి: సూడాన్ నుంచి వెనక్కి వస్తున్న భారతీయులకు ప్రమాదకరమైన ఎల్లో ఫివర్ భయం పట్టుకుంది. సూడాన్ నుంచి ఇటీవల బెంగళూరుకు చేరుకున్న 362 మందిలో 45 మంది ఎల్లో ఫివర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. అధికారులు వీరిని బెంగళూరులోని రాజీవ్‌గాంధీ ఆసుపత్రిలో క్వారంటైన్‌కు తరలించారు. చర్మం, కళ్లు పచ్చగా మారడం, జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, వాంతులు ఈ జ్వరం లక్షణాలు. పరిస్థితి విషమిస్తే 15 రోజుల్లో అంతర్గత రక్తస్రావం సంభవించి, అవయవాలు పనిచేయడం మానేస్తాయి. ఒక్కోసారి మరణానికి కూడా దారితీయవచ్చు. మరోవైపు, ‘ఆపరేషన్ కావేరి’లో భాగంగా సూడాన్ నుంచి మరో 365 మంది భారతీయులను శనివారం తీసుకువచ్చినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్ ట్వీట్ చేశారు. దీంతో, ఇప్పటి వరకు 1,725 మంది స్వదేశానికి తరలించినట్లయిందని పేర్కొన్నారు. -
సూడాన్ టూ భారత్.. ఆనందంలో బాధితులు..
న్యూఢిల్లీ: సూడాన్ నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పించే ‘ఆపరేషన్ కావేరి’ వేగవంతంగా సాగుతోంది. ఈ క్రమంలో భారతీయులు స్వదేశం చేరుకున్నారు. కేంద్రం భారత వాయుసేన, నావికా దళాల ద్వారా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేరుస్తున్నది. కాగా, ఆపరేషన్ కావేరిలో భాగంగా సూడాన్ నుంచి దాదాపు ఆరువేల మంది భారతీయులు స్వదేశం చేరుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా భారతీయులను సూడాన్‌లోని సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి భారత్‌కు చేరుస్తున్నది. ఇప్పటికే పలువురు స్వదేశానికి వచ్చేయగా తాజాగా మరో 231 మంది వాయు మార్గంలో ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో భారత్ చేరుకున్న వారి సంఖ్య 6వేలకు చేరుకుంది. ఇదిలా ఉండగా.. గురువారం రాత్రి వందకు పైగా మందిని తరలించే క్రమంలో తెగువ ప్రదర్శించారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్లు. జెడ్డాకు చేరుకునే క్రమంలో పోర్ట్ ఆఫ్ సూడాన్‌కు 121 మందితో కూడిన భారతీయ పౌరుల బృందం చేరుకోవాల్సి ఉంది. అయితే.. చేరుకునే మార్గం లేక వాడి సయ్యద్నా చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందుకున్న ఏఐఎఫ్ రంగంలోకి దిగింది. వాళ్లను తరలించేందుకు C-130J హెర్క్యులస్‌తో బయల్దేరింది. అయితే.. వాడి సయ్యద్నాలో ఉన్న చిన్న ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండింగ్‌కు అనుకూలంగా లేని పరిస్థితి. దీంతో.. పైలట్లు సమయస్ఫూర్తి ప్రదర్శించారు. నైట్ విజన్ గాగుల్స్ సాయంతో ఏమాత్రం తప్పిదం లేకుండా ఎయిర్‌ఫోర్స్ పైలెట్లు ఎయిర్‌క్రాఫ్ట్‌ను చాకచక్యంగా ల్యాండ్ చేశారు. #WATCH | Another flight carrying 231 Indian passengers reaches New Delhi. They have been evacuated from conflict-torn Sudan.#OperationKaveri pic.twitter.com/oESNze3YPd — ANI (@ANI) April 29, 2023 ఇది కూడా చదవండి: సరిహద్దులో సాధారణ స్థిరత్వం: చైనా విదేశాంగ మంత్రి -
హ్యాట్సాఫ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. చిమ్మచీకట్లో సాహాసోపేతంగా 121 మందిని..
ఢిల్లీ: అదొక చిన్న రన్‌వే ఉన్న ఎయిర్‌స్ట్రిప్. కమ్యూనికేషన్లో భాగంగా.. నావిగేషనల్ అప్రోచ్ సహకారం లేదు. అక్కడ ఫ్యూయల్ సౌకర్యమూ లేదు. రాత్రి పూట ల్యాండ్ చేయడానికి ఏమాత్రం అనుకూలంగా లేని చోటు అది. ల్యాండింగ్ లైట్లు కూడా లేని చోటు నుంచి జనాల్ని తరలించే ఆపరేషన్ సక్సెస్‌గా పూర్తి చేసింది భారత వైమానిక దళం. తద్వారా ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేపట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేసే దమ్ము ఉందని మరోసారి నిరూపించుకుంది. సూడాన్ నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పించే ‘ఆపరేషన్ కావేరి’ వేగవంతంగా సాగుతోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి వందకు పైగా మందిని తరలించే క్రమంలో తెగువ ప్రదర్శించారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్లు. జెడ్డాకు చేరుకునే క్రమంలో పోర్ట్ ఆఫ్ సూడాన్‌కు 121 మందితో కూడిన భారతీయ పౌరుల బృందం చేరుకోవాల్సి ఉంది. అయితే.. చేరుకునే మార్గం లేక వాడి సయ్యద్నా చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందుకున్న ఏఐఎఫ్ రంగంలోకి దిగింది. వాళ్లను తరలించేందుకు C-130J హెర్క్యులస్‌తో బయల్దేరింది. అయితే.. వాడి సయ్యద్నాలో ఉన్న చిన్న ఎయిర్‌స్ట్రిప్‌లో ల్యాండింగ్‌కు అనుకూలంగా లేని పరిస్థితి. దీంతో.. పైలట్లు సమయస్ఫూర్తి ప్రదర్శించారు. నైట్ విజన్ గాగుల్స్ (Night Vision Goggles) సాయంతో ఏమాత్రం తప్పిదం లేకుండా ఎయిర్‌ఫోర్స్ పైలెట్లు ఎయిర్‌క్రాఫ్ట్‌ను చాకచక్యంగా ల్యాండ్ చేశారు. ఎలక్ట్రో-ఆప్టికల్/ఇన్ఫ్రా-రెడ్ సెన్సార్లను ఉపయోగించి ఎలాంటి ఆటంకాలు లేవని ధృవీకరించుకున్న తర్వాతే.. అంత చిన్న రన్‌వేలో ఎయిర్‌క్రాఫ్ట్ దించగలిగారు. ల్యాండింగ్ అయ్యాక కూడా ఇంజిన్లను ఆన్‌లోనే ఉంచి.. అక్కడున్నవాళ్లను, వాళ్ల లగేజీలను విమానంలోకి ఎక్కించారు. ఆ సమయంలో ఎయిర్‌ఫోర్స్ స్పెషల్ యూనిట్ గరుడకు చెందిన ఎనిమిది మంది కమాండోలు ప్యాసింజర్ల భద్రతను పర్యవేక్షిస్తూనే.. సురక్షితంగా ఎక్కించారు. విమానం ఎలాగైతే దిగిందో.. అదే తరహాలో ఎన్వీజీ ఉపయోగించి టేకాఫ్ చేశారు. అలా రెండున్నర గంటలపాటు ఈ రిస్కీ ఆపరేషన్ కొనసాగింది. కల్లోల రాజధాని ఖార్తోమ్కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఇదంతా చోటుచేసుకోవడం గమనార్హం. అంతా జెడ్డాకు సురక్షితంగా చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆపరేషన్ కావేరి ద్వారా ఇప్పటిదాకా 1,360 మందిని సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చింది కేంద్రం. ఇదీ చదవండి: ఎన్నాళ్లకెన్నాళ్లకు! 110 ఏళ్ల తర్వాత.. -
Operation Kaveri: సూడాన్ నుంచి మరో 754 మంది రాక
న్యూఢిల్లీ/కైరో: సూడాన్‌లో చిక్కుకుపోయిన మరో 754 మంది భారతీయులు ‘ఆపరేషన్ కావేరి’లో భాగంగా శుక్రవారం స్వదేశం చేరారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ట్వీట్ చేశారు. ఇప్పటిదాకా 1,360 మందిని తీసుకొచ్చినట్టు చెప్పారు. వీరిలో 17 మంది తెలంగాణ వాసులు కూడా ఉన్నట్లు ఢిల్లీలోని తెలంగాణ భవన్ తెలిపింది. మరోవైపు సూడాన్‌లో హింస ఆగడం లేదు. 72 గంటల కాల్పుల విరమణకు రెండు పక్షాలు అంగీకరించి గంటలైనా కాకుండానే రాజధాని ఖార్టూమ్, ఒండుర్మన్, కఫౌరీల్లో పోరు తీవ్రమైంది. -
సూడాన్‌లో బతికి ఉండే పరిస్థితుల్లేవ్: చీరాలవాసి
సాక్షి, ఢిల్లీ: ఈశాన్య ఆఫ్రికా దేశం సూడాన్‌లో.. ఆర్మీ-పారామిలిటరీ బలగాల నడుమ జరుగుతున్న ఆధిపత్య పోరులో సాధారణ పౌరులు నలిగిపోతున్నారు. కాల్పుల విరమణతో విరామం ప్రకటించడంతో.. అక్కడి నుంచి విదేశీయుల తరలింపు వేగవంతం అయ్యింది. ఈ క్రమంలో ఆపరేషన్ కావేరి ద్వారా సూడాన్ వయా జెడ్డా(సౌదీ అరేబియా) నుంచి భారతీయుల్ని స్వదేశానికి రప్పిస్తున్నారు. తొలి బ్యాచ్‌గా.. ఢిల్లీకి చేరుకున్నారు 360 మంది భారతీయులు. ఈ బృందంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విష్ణు వర్ధన్ కూడా ఉన్నారు. సూడాన్‌లోని పరిస్థితుల గురించి సాక్షితో ఆయన ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుతూ.. ‘‘మాది గుంటూరు చీరాల. నేను డిప్లోమా చేశాను. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో ఆరేళ్ల కిందట సూడాన్ వెళ్లాను. ఓ సెరామిక్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాను. ఇంతలో అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నేను తిరిగి రావాల్సి వచ్చింది. సూడాన్‌లో బతికి ఉండే పరిస్థితులు లేవు. అక్కడి నుంచి బయటపడితే చాలని బయలుదేరాం. ఆధిపత్యం కోసం రెండు వర్గాలు భీకరంగా పోరాటం చేస్తున్నాయి. ప్రజల వద్ద ఉన్న వాటన్నింటిని దోచుకుంటున్నారు. సూడాన్‌లో కమ్యూనికేషన్ వ్యవస్థ లేదని తెలిపారాయన. ‘‘ఢిల్లీ విమానాశ్రయంలో ఏపీ భవన్ అధికారులు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఏపీ భవన్లో ఉచితంగా భోజనం, వసతి ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి చెన్నైకి ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. ఇంటికి చేరేవరకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా కోసం చొరవ చూపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు’’ అని విష్ణువర్థన్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సూడాన్‌లో చిక్కుకున్న ప్రవాసాంధ్రులను క్షేమంగా స్వగ్రామాలకు తీసుకురావాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. ఏపీఎన్ఆర్టీఎస్ రంగంలోకి దిగింది. సూడాన్‌లో రాష్ట్రానికి చెందిన 58 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాళ్లలో ఇప్పటికే సగానికి పైగా జెడ్డాకు చేరుకున్నారు. అటు నుంచి ఢిల్లీకిగానీ, ముంబైకిగానీ చేరుకునే వాళ్లను స్వగ్రామాలకు తీసుకొచ్చే బాధ్యతలను, అందుకు అయ్యే ఖర్చులను ఏపీ ప్రభుత్వమే భరించనుంది. హెల్ప్‌లైన్ నెంబర్లు.. 0863 2340678 వాట్సాప్ నెంబర్ 85000 27678 ఇదీ చదవండి: మదగజాలు పోట్లాడుకుంటే, మామూలు గడ్డి నలిగిపోయినట్లు.. -
అక్కడే చనిపోతామనుకున్నాం.. భారత్ చేరిన సూడాన్ బాధితులు
ఢిల్లీ: సుడాన్(sudan)లో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. సూడాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కావేరి’ వేగంగా కొనసాగుతోంది. భారత వాయుసేన, నావికా దళాల ద్వారా దశల వారీగా భారతీయుల్ని సురక్షితంగా స్వదేశానికి చేర్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సూడాన్ నుంచి బయలుదేరిన మొదటి బ్యాచ్.. స్వదేశం చేరుకున్నారు. ఈ సందర్బంగా అక్కడ నెలకొన్న పరిస్థితులను వివరించారు. కాగా, మొదటి బ్యాచ్‌లో సూడాన్ నుంచి 360 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చారు. మొత్తంగా జెడ్డాకు చేరుకున్న 534 మందిలో 360 మంది వాణిజ్య విమానంలో బుధవారం రాత్రి ఢిల్లీకి వచ్చేశారు. ఆపరేషన్ కావేరీ సాయంతో సూడాన్ నుంచి మొదటి బ్యాచ్ న్యూఢిల్లీకి చేరుకుంది అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్వీట్ చేశారు. జైశంకర్ తన సౌదీ అరేబియా కౌంటర్‌తో మాట్లాడిన కొన్ని రోజుల తర్వాత తరలింపు ప్రక్రియ ప్రారంభించారు. మరోవైపు.. బుధవారం ఉదయం సుడాన్ నుంచి మూడో బ్యాచ్ కూడా బయల్దేరింది. ఈ విషయాన్ని విదేశీవ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సుడాన్ నుంచి మూడో బ్యాచ్‌లో 135 మంది భారతీయులతో రెండో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ C-130J విమానం సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నట్లు తెలిపారు. కాగా, సూడాన్ నుంచి ఢిల్లీకి వచ్చిన భారతీయులను స్వరాష్ట్రాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయుల్లో చాలా మంది గాయపడ్డారు. అనంతరం, ఢిల్లీలో వారు సూడాన్‌లో ప్రస్తుత పరిస్థితిని వివరించారు. సూడాన్‌లో నివాసాలపై బాంబు వేయడంతో భయానక పరిస్థితులను చూశాడు. స్వదేశానికి తిరిగి వస్తామని అనుకోలేదు. అక్కడే చనిపోతామనే భయంతో క్షణక్షణం కాలం గడిపాము. కట్టుబట్టలతో సూడాన్ నుంచి బయలుదేరాము. బాంబు దాడుల కారణంగా ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశాము. కొందరు వ్యక్తులు మమ్మల్ని గన్‌తో బెదిరించి మావద్ద ఉన్న డబ్బులు లాక్కున్నారు. First flight carrying Indian nationals who were evacuated from Sudan landed in Delhi yesterday. #OperationKaveri brought 360 Indian Nationals to the homeland as first flight reaches New Delhi.@MEAIndia @EoI_Khartoum pic.twitter.com/xXp4ZJW40K — DD India (@DDIndialive) April 27, 2023 ఇది కూడా చదవండి: సూడాన్‌లో చిక్కుకున్న తెలుగువారు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు -
సూడాన్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసుల తరలింపుపై సమీక్ష!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం 'ఆపరేషన్ కావేరి' పేరుతో సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించే కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్న భారతీయులను దశల వారిగా ఢిల్లీ, ముంబైలకు తరలించింది. ఇప్పటి వరకు సూమారు 160 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నట్లు సమాచారం. ఈ మేరకు విదేశాంగ శాఖ సూడాన్ నుంచి వస్తున్న భారతీయుల విషయమై అన్ని రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లను అప్రమత్తం చేసింది.ఈ నేపథ్యంలో ఢిల్లీ తెలంగాణ భవన్లో తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఈ అంశంపై అధికారులతో సమీక్ష జరిపారు. దీని కోసం ఢిల్లీ తెలంగాణ భవన్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ రోజు మొత్తం నలుగురు తెలంగాణ వాసులు వస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ వచ్చే వారికి ఇక్కడే వసతి, భోజనం ఏర్పాటు చేసి హైదరాబాద్‌కు పంపే ఏర్పాటు చేస్తున్నట్ల రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. అంతేగాదు ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారిని ఏవిధంగా అయితే తెలంగాణకు పంపామో అదే తరహాలో పంపించేలా.. ఢిల్లీలో ఏర్పాట్లు చేస్తున్నట్లు గౌరవ్ ఉప్పల్ వెల్లడించారు. (చదవండి: ముమ్మరంగా 'ఆపరేషన్ కావేరి'.. సూడాన్ నుంచి మరో 135 మంది తరలింపు) -
ముమ్మరంగా 'ఆపరేషన్ కావేరి'.. సూడాన్ నుంచి మరో 135 మంది తరలింపు
సూడాన్ అంతర్గత యుద్ధంలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ పేరుతో చర్యలు చేపట్టింది. భారత వాయుసేన, నావికా దళాల ద్వారా దశల వారీగా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా పూడాన్ నుంచి మూడో బ్యాచ్ కూడా బయల్దేరింది. సూడాన్ నుంచి మరో 135 మంది భారతీయులతో రెండో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ C-130J విమానం సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నట్లు విదేశీవ్యవహారాల సహాయమంత్రి వి మురళీధరన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అంతకుముందు మొదటి బ్యాచ్‌లో భాగంగా భారత నావికాదళానికి చెందిన ‘ఐఎన్ఎస్ సుమేధ’ ద్వారా 278 మంది ప్రయాణికులు సూడాన్ పోర్టు నుంచి సౌదీకి చేరుకున్నారని విదేశీ వ్యవహారాలశాఖ పేర్కొంది. రెండో భాచ్‌లో 148 మంది భారతీయులను తొలి విమానంలో స్వదేశానికి తరలించినట్లు తెలిపింది. అయితే వీరిలో 160 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. కాగా సూడాన్‌లో 3 వేల మందికిపైగా భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. Third batch comprising 135 Indians from Port Sudan arrived in Jeddah by IAF C-130J aircraft. Onward journey to India for all who arrived in Jeddah will commence shortly. #OperationKaveri pic.twitter.com/OHhC5G2Pg8 — V. Muraleedharan (@MOS_MEA) April 26, 2023 -
Operation Kaveri: సూడాన్‌ను వీడిన 278 మంది భారతీయులు
న్యూఢిల్లీ: హింస, అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సూడాన్ నుంచి భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కావేరి’ మొదలైంది. భారత నౌకాదళానికి చెందిన ‘ఐఎన్ఎస్ సుమేధ’ నౌక తొలి విడతగా 278 భారతీయులతో మంగళవారం సూడాన్ పోర్టు నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు బయలుదేరింది. విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ మేరకు ట్వీట్ చేశారు. వారిని భారత్ చేర్చేందుకు జెడ్డాలో రెండు విమానాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ఆక్రమణలో సూడాన్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ మరోవైపు.. సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని నేషనల్ హెల్త్ ల్యాబ్ ఆక్రమణకు గురైందని ఐక్యరాజ్యసమితి మంగళవారం వెల్లడించింది. వైరి పక్షాలైన ఆర్మీ, ఆర్ఎస్ఎఫ్(ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్)లో ఒకరు ఈ ల్యాబ్‌ను ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపింది. 12 రోజులుగా ఆగని ఆధిపత్య పోరుతో సామాన్యులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న వేళ ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూడాన్ ప్రతినిధి డాక్టర్ నీమా సయీద్ అబిడ్ అన్నారు. ల్యాబ్‌లో కలరా, మీజిల్స్, పోలియో తదితర వ్యాధికారక వైరస్లు, బ్యాక్టీరియాలున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ల్యాబ్‌కు అతి సమీపంలోనే ఆర్మీ, ఆర్ఎస్ఎఫ్ భీకర పోరు సాగిస్తున్నాయి. సూడాన్‌లోని మూడో వంతు అంటే 1.6 కోట్ల మందికి తక్షణం సాయం అవసరమని ఐరాస అంచనా వేసింది. -
సూడాన్‌లో చిక్కుకున్న తెలుగువారు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: అంతర్యుద్ధం కారణంగా సూడాన్‌లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. స్వదేశానికి రాగానే వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం సమయంలో వ్యవహరించిన మాదిరిగానే.. వీరికి విమాన టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎయిర్‌పోర్టులో వారిని రిసీవ్ చేసుకుని అక్కడ నుంచి స్వస్థలాలకు చేరుకునే వరుకు కూడా వారికి అండగా నిలవాలని సీఎం ఆదేశించారు. సుడాన్లో ఇప్పటివరకూ సుమారు 56 మంది తెలుగువారు ఉన్నట్టు తెలుస్తోందని అధికారులకు సీఎంకు వివరించారు. చదవండి: సునీత అక్క స్టేట్మెంట్లో పలు అనుమానాలున్నాయి: అవినాష్‌రెడ్డి -
Sudan Crisis: 72 గంటలపాటు కాల్పుల విరమణ!
ఖార్తోమ్: సూడాన్‌లో సాయుధ బలగాల నడుమ కొనసాగుతున్న అంతర్యుద్ధంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరు వర్గాల జనరల్స్.. మూడు రోజుల పాటు కాల్పుల విమరణపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. గత పదిరోజులుగా సూడాన్ ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌కు నడుమ అక్కడ పోరు జరుగుతోంది. నడుమ 400 మందికి పైగా సాధారణ పౌరులు మరణించగా.. దాదాపు నాలుగు వేల మంది గాయపడ్డారు. భారీ ఎత్తున్న విదేశీయులు తమ తమ స్వస్థలాలకు వెళ్తున్నారు. అయితే.. 48 గంటల పాటు జరిగిన తీవ్ర చర్చల తర్వాత.. సుడానీస్ సాయుధ దళాలు (SAF) - ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) కాల్పుల విరమణకు ముందుకు వచ్చాయని బ్లింకెన్ వెల్లడించారు. ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుండి దేశవ్యాప్తంగా 72 గంటల పాటు కాల్పుల విరమణను అమలు చేయడానికి అంగీకరించాయని తెలుస్తోంది. సంధి అమలు కావడానికి రెండు గంటల ముందే బ్లింకెన్ ప్రకటన వెలువడడం విశేషం. ఈ మూడు రోజుల్లో పౌరుల తరలింపు ప్రక్రియ వేగవంతం కానుంది. శనివారం నుంచి విదేశీయుల తరలింపు ప్రారంభం కాగా, ఇప్పటిదాకా సుమారు నాలుగు వేల మందికి పైగా స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే లక్షల మంది సూడాన్ పౌరులు మాత్రం అక్కడి దీనపరిస్థితుల్లో మగ్గిపోతున్నారు. ప్రస్తుతం అక్కడ తాగునీరు, ఆహారం, మందులు, ఇంధన వనరుల కొరత, విద్యుత్ కోత కొనసాగుతోంది. అలాగే ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించారు. ఈ తరుణంలో ఎటు పోవాలో పాలుపోని అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అగాధంలోకి సూడాన్.. సాయుధ బలగాల నడుమ జరుగుతున్న ఆ ఆధిపత్య పోరును.. ఐక్యరాజ్య సమితి తీవ్రంగా తప్పుబట్టింది. అత్యంత పేద దేశమైన సూడాన్ ఈ పోరుతో అగాధంలోకి కూరుకుపోతోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు. అంతేకాదు కాల్పుల విరమణకు ఆయన పిలుపు ఇచ్చారు. ఐరాస తరపున పలు విభాగాలు సూడాన్ పౌరులను సరిహద్దులకు దేశాలకు సురక్షితంగా తరలించే యత్నంలో ఉన్నాయి. మరోవైపు సూడాన్ అంశంపై ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి బ్రిటన్ విజ్ఞప్తి చేస్తోంది. మంగళవారం ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్స్‌ను ఆర్మీలో విలీనం చేయాలనే ప్రతిపాదన.. ఈ రెండు వర్గాల నడుమ ఘర్షణలకు దారి తీసింది. సూడాన్ రాజధాని ఖార్తోమ్తో పాటు దేశంలో పలు చోట్ల ఈ ఘర్షణలు కొనసాగుతుండగా.. సాధారణ పౌరులు ఇబ్బంది పడుతున్నారు. ఇదీ చదవండి: ఆపరేషన్ కావేరీ.. మనోళ్ల కోసమే! -
సూడాన్ నుంచి మనోళ్ల తరలింపుకు ఆపరేషన్ కావేరి
న్యూఢిల్లీ: ఘర్షణలతో అట్టుడుకుతున్న సూడాన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం ‘ఆపరేషన్ కావేరి’ని ప్రారంభించింది. ‘ఇందులో భాగంగా సుమారు 500 మంది భారతీయులు సూడాన్ పోర్టుకు చేరుకున్నారు. మరికొందరు వస్తున్నారు. వీరి కోసం అక్కడ ఓడలు, విమానాలను సిద్ధంగా ఉంచాం. సూడాన్‌లోని ప్రతి భారతీయుడికీ సాయంగా నిలుస్తాం’అని విదేశాంగ మంత్రి జై శంకర్ ట్వీట్ చేశారు. వైమానిక దళానికి చెందిన రెండు విమానాలను సౌదీ అరేబియాలోని జెడ్డాలో, నేవీకి చెందిన ఒక షిప్‌ను సూడాన్‌లోని ఒక పోర్టులో కేంద్రం ఇప్పటికే సిద్ధంగా ఉంచింది. మరోవైపు, సూడాన్‌లో ఉండిపోయిన తమ పౌరులు, దౌత్య సిబ్బంది తరలింపును పలు యూరప్, మధ్య ప్రాచ్య దేశాలు ముమ్మరం చేశాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం సూడాన్ నుంచి వెనక్కి తీసుకువచ్చిన 28 దేశాలకు చెందిన 388 మందిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నట్లు ఢిల్లీలోని ఆ దేశ రాయబార కార్యాలయం సోమవారం వెల్లడించింది. సూడాన్ నౌకాశ్రయంలో భారతీయులు -
Sudan Conflict: 400 మందికి పైగా మృతి.. వేల మందికి గాయాలు
న్యూయార్క్: సూడాన్ అంతర్యుద్ధంలో 413 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(RSF)కు నడుమ అక్కడ భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంతర్యుద్ధంలో చిన్నారులే ఎక్కువగా బాధితులవుతున్నట్లు ఐరాస మరో విభాగం యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి మార్గరేట్ హ్యారిస్ మీడియాతో మాట్లాడుతూ.. సూడాన్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ అంతర్యుద్ధంలో 413 మంది సాధారణ పౌరులు మృతి చెందారని, అలాగే 3,551 మంది గాయపడ్డారని వెల్లడించారు. అలాగే.. అక్కడి ఆరోగ్య కేంద్రాలపైనా దాడులు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. ఇదే సమావేశంలో యూనిసెఫ్ ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ మాట్లాడుతూ.. ఈ పోరులో పిల్లలే ఎక్కువగా బాధితులైనట్లు వెల్లడించారు. తొమ్మిది మంది చిన్నారులు మరణించారు, 50 మందికిపైగా గాయపడ్డారని వెల్లడించారాయన. అలాగే.. చాలామంది ఇళ్లలోనే చిక్కుకుపోయారని, చాలా ప్రాంతాలు అంధకారంలో కూరుకపోయాయని తెలిపారు. ఆహారం, మంచి నీరు, మందులు లేక వాళ్లు అల్లలాడుతున్నారని, మరోవైపు చికిత్స అందించాల్సిన ఆస్పత్రులే నాశనం అవుతున్నాయంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సూడాన్ ప్రపంచంలోనే పిల్లలో పోహకాహారలోపం రేటు అత్యధికంగా ఉన్న దేశమని యూనిసెఫ్ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ప్రస్తుత పరిస్థితులతో యాభై వేలకు పైగా చిన్నారుల జీవితం ప్రమాదంలో పడిందని తెలిపింది. సూడాన్‌లో 2021 అక్టోబర్ నుంచి ప్రభుత్వం లేకుండానే ఎమర్జెన్సీలో నడుస్తోంది. మిలిటరీ అప్పటి ప్రధాని అబ్దల్లా హందోక్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. గత శనివారం నుంచి సూడాన్ రాజధాని ఖార్తోమ్, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌కు నడుమ పోరాటం నడుస్తోంది. అధికార దాహం నుంచి పుట్టిందే ఈ అంతర్యుద్ధం -
సూడాన్‌లో చిక్కుకున్న వారిని ఆ మార్గంలో తరలించేందుకు సన్నాహాలు!
కల్లోలిత సూడాన్ నుంచి పౌరులను తరలించేందుకు భారత్ ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషిస్తోంది. ఏప్రిల్ 15న సూడాన్ రాజధాని ఖర్టూమ్‌లో సైన్యం, పారామిలటరీ మధ్య జరుగుతున్న హోరాహోరి పోరు హింత్మకంగా మారింది. దీంతో సూడాన్ దారుణంగా దెబ్బతింది. ఈ అత్యర్యుద్ధంలో ఇప్పటికే 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, పలువురు గాయపడ్డారు. దీంతో అక్కడ చిక్కుకున్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది. ఈపాటికే భారత్ కూడా వారిని అప్రమత్తం చేసి, సూచనలందించింది. అలాగే అక్కడి భారత రాయబార కార్యాలయం కూడా అన్ని రకాలుగా సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే ఈ యుద్ధంలో విమానాశ్రయలే దారుణంగా దెబ్బతినడంతో తరలింపు కష్టతరంగా మారింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించిన భారత్ వారిని సురక్షితమైన భూమార్గం గుండా తరలించాలని యత్నిస్తున్నట్లు సమాచారం. ఐతే రాయబార కార్యాలయ సిబ్బంది తరలింపు ఆపరేషన్‌లో సహయం చేయడం కోసం ప్రస్తుతానికి అక్కడే ఉంటారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, యూఎస్ ఖార్టూమ్‌లోని రాయబార కార్యాలయాన్ని తన డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్‌ని ఉపయోగించి తాత్కాలికంగా నిలిపేసి, సిబ్బంది ఖాళీ చేయించింది. ఈమేరకు మేజేమెంట్ అండ్ సెక్రటరీ అంబాసీడర్ మాట్లాడుతూ..రాపీడ్ సెక్యూరిటీ ఫోర్సెస్ మాతో సమన్వయమై యూఎస్ ఆపరేషన్‌కు మద్దతిచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ వారు సహకరించిన మేరకు సహకరించారు. ఆపరేషన్ సమయంలో మా సభ్యులపై కూడా కాల్పులు జరిపారు. ఐతే వారి స్వప్రయోజనాల కోసం చేశారని భావిస్తున్నాం అని అన్నారు. కాగా, వివిధ దేశాల నుంచి 150 మందికి పైగా ప్రజలు ఒక రోజు ముందుగానే సౌదీ అరేబియా చేరుకున్నారు. ఐతే సౌదీలు కాకుండా భారతదేశంతో సహా 12 ఇతర దేశాలకు చెందిన పౌరులు ఇందులో ఉన్నట్లు సమాచారం. అదీగాక తమ పౌరులను తరలించేందుకు సిద్ధంగా ఉన్నమని విదేశీ దేశాలు తెలిపాయి. అందులో భాగంగా దక్షిణ కొరియ, జపాన్ తమ సమీపంలో ఉన్న దేశాల నుంచి బలగాలను మోహరించి పౌరులను తరలించే యత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఇక యూరోపియన్ యూనియన్ కూడా ఇదే తరహాలో తరలించే యత్నం చేస్తోంది. ఐతే ఇప్పటి వరకు సూడాన్‌లో జరిగిన పోరాటంలో దాదాపు 420 మందికి పైగా మరణించారని, మూడు వేలమందికి పైగా గాయపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక ఈ మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండొచ్చని పేర్కొంది కూడా. (చదవండి: విమానంలో పెద్దాయన పాడుపని..ఫ్లైట్ అటెండెంట్‌కి బలవంతంగా..) -
యుద్ధం అంతుచూసేదాకా వదలను
ఖార్తూమ్: యుద్ధం అంతుచూసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సంక్షుభిత సూడాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ అబ్దెల్ ఫతాహ్ బుర్హాన్ శనివారం ప్రకటించారు. దాంతో అక్కడి తమవారి భద్రతపై అమెరికా, బ్రిటన్, చైనా, తదితర దేశాలు ఆందోళనలో పడ్డాయి. కాల్పుల విరమణ యత్నాలు రెండుసార్లు విఫలమైన దరిమిలా బాంబుల మోతతో దద్దరిల్లుతున్న దేశం నుంచి బయటపడే మార్గంలేక విదేశీయులు బిక్కుబిక్కుమంటున్నారు. బాంబు దాడులు, కాల్పుల ఘటనల్లో ఇప్పటిదాక 400 మందికిపైగా మరణించారు. సూడాన్‌లో చిక్కుకున్న 16 వేల మంది తమ పౌరులను ఎలాగైనా రక్షిస్తామని అమెరికా శుక్రవారం ప్రకటించడం తెల్సిందే. -
'మోదీజీ నా భర్తను వెనక్కి తీసుకురండి'! ఓ మహిళ విజ్ఞప్తి
సూడాన్‌లో సైన్యం, పారామిలటరీల మధ్య ఘర్షణలు తారా స్థాయికి చేరకుని హింసాత్మకంగా మారిని సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో సుమారు 300 మంది దాక చనిపోయారు. దీంతో అక్కడ చిక్కుకున్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూడాన్‌లోని భారతీయులను అప్రమత్తం చేయడమే గాక వారిని తీసుకొచ్చే ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా అధికారులతో అక్కడ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు కూడా. ఈ క్రమంలోనే మీనాక్షి అగర్వాల్ అనే మహిళ మోదీజీ నా భర్త కూడా సూడాన్‌లో చిక్కుపోయారు, వెనక్కి తీసుకురండి. అంటూ ట్వీట్ చేసింది. ఈ మేరకు మీనాక్షి నాభర్తను ఎలాగైన తీసుకురావలని కేంద్ర విదేశాంగ మంత్రి, ప్రధాని మోదీని ట్విట్టర్లో కోరారు. సూడాన్‌లో భయానక పరిస్థితులు ఎదుర్కొంటున్న నాభర్త తోసహ ఇతర భారతీయులను కూడా తిరిగి తీసుకువచ్చి.. తన ఆందోళనకు ఉపశమనం ఇవ్వగలరని ఆశిస్తున్నా అని ఆమె ట్వీట్ చేశారు. అంతేగాదు మీరు వారిని తీసుకొచ్చేందుకు చేస్తున్న మీ ప్రయత్నాలకు, చర్యలకు ధన్యావాదాలు అని కూడా చెప్పారు మీనాక్షి. @narendramodi @DrSJaishankar I am hopeful that you will be able to set my worries to rest and bring back my husband and other trapped Indians from #sudan #khartoum from the horrific situation there. Thank you for your efforts and initiative https://t.co/b9cugBmioC — Meenakshi agrawal (@Meenakshiagra17) April 21, 2023 (చదవండి: రాజస్తాన్‌లోని కాంగ్రెస్‌కు షాక్ మీద షాక్..కలకలం రేపిన వ్యక్తి..) -
సూడాన్‌లోని భారతీయుల పరిస్థితిపై మోదీ అత్యవసర సమీక్ష!
సూడాన్‌లో సైన్యం, పారామిలటరీల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు రోజు రోజుకి హింసాత్మకంగా మారుతున్న సంగతి తెలసిందే. ఇప్పటి వరకు ఈ పోరులో 300 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాలు కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చినా పట్టించుకోకుండా ఇరు పక్షాలు ఘర్షణ కొనసాగిస్తూనే ఉన్నాయి. దీంతో అక్కడ ఉన్న మూడు వేల మందికి పైగా ఉన్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే అక్కడ ఉన్న వారిని భారత ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సూడాన్‌లోని భారతీయుల భద్రత పరిస్థితిపై అధికారులతో వర్చువల్‌గా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ , జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సూడాన్‌లోని భారత రాయబారి రవీంద్ర ప్రసాద్ జైస్వాల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సూడాన్‌లోని చిక్కుకుపోయిన భారతీయుల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారిచడమే గాక క్షేత్ర స్థాయిలో అక్కడ పరిస్థితులకు సంబంధించిన నివేదికను మోదీ సమీక్షించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అలాగే అధికారులను అప్రమత్తంగా ఉండాలని, పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ..పౌరుల తరలింపుకి సంబంధించిన అన్ని రకాల సహాయాలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాంతంలోని పొరుగు దేశాల తోపాటు సూడాన్‌లో ఉన్న పౌరులతో సంభాషణలు చేయడం వంటి ప్రాముఖ్యతల గురించి నొక్కి చెప్పారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌తో జైశంకర్ చర్చలు ఈ రోజు తెల్లవారుజామున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సూడాన్‌లోని అధ్వాన్నమైన పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో చర్చించారు. కాల్పుల విరమణ కోసం దౌత్యం జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సూడాన్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, అక్కడ చిక్కుకున్న భారతీయల భద్రత, తరలింపుపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. అదీగాక అక్కడ ఉన్న భారతీయ పౌరులు ఉన్నచోటునే ఉండాలని ఖార్టుమ్‌లోని భారత రాయబార కార్యాలయానికి వెళ్లొద్దని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. ఇదిలా ఉండగా, అక్కడ చిక్కుకుపోయిన తమ పౌరులను తరలించేందుకు అనేక దేశాలు ముందుకొస్తున్న విమానాశ్రయలే రంణరంగాలుగా మారిపోవడంతో అధి సాధ్యం కాకవపోవచ్చని తెలుస్తోంది. కాగా, ఖార్టూమ్‌లోని రాయబార కార్యాలయం ప్రకారం.. సుమారు 2,800 మంది భారతీయులు సూడాన్‌లో చిక్కుకుపోయారని, అందులో 1200 మంది సూడాన్‌లోనే 150 ఏళ్లుగా నివశిస్తున్నట్లు సమాచారం. (చదవండి: ప్రకాష్ సింగ్ బాదల్‌కు అస్వస్థత.. ఆరోగ్య పరిస్థితిపై అమిత్ షా ఆరా) -
Sudan crisis: ఇద్దరి అధికారహం, అంతర్యుద్ధం.. సామాన్యుల ఆకలి కేకలు
ఇద్దరు మిలటరీ నాయకుల మధ్య ఆధిపత్య పోరాటం సూడాన్‌లో సామాన్యుల ఆకలి కేకలకు దారితీస్తోంది. అధికారం కోసం వారు చేస్తున్న పోరాటంతో సామాన్యులు సమిధలుగా మారుతున్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు దొరక్క, కటిక నేలపై నిద్రిస్తూ ఎప్పుడే తూటా తమ ప్రాణాల్ని హరిస్తుందో తెలీని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. సూడాన్‌లో ఎందుకీ ఘర్షణలు ? దశాబ్దాల తరబడి నియంత పాలనలో మగ్గిపోయిన సూడాన్‌లో 2019లో ఆర్మీ తిరుగుబాటు జరిగి ఆనాటి అధ్యక్షుడు, నియంత ఒమర్ అల్– బషీర్‌ని సైన్యం గద్దె దింపడంతో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారో లేదో రెండేళ్లకే 2021లో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కొదమసింహాల్లాంటి ఇద్దరు జనరల్స్ చేతులు కలిపారు. అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణలు చెలరేగి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ రెండేళ్లకే అధికార బదలాయింపులో సమస్యలు మిత్రులైన ఆ మిలటరీ జనరల్స్‌ను శత్రువులుగా మార్చింది. వారే సూడాన్ ప్రస్తుత పాలకుడు, ఆర్మీ చీఫ్ జనరల్ అబ్దుల్ ఫత్తా అల్ బుర్హాన్, ఉపాధ్యక్షుడు, ఆర్ఎస్ఎఫ్ చీఫ్ జనరల్ మొహమద్ హమ్దాన్ దగలో (హెమెడ్తీ) . వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరాటం తారస్థాయికి చేరుకుంది. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం గత ఏడాది చివర్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో దేశంలో ఎన్నికలు జరగాలి. కానీ బుర్హాన్ అనుకున్నట్టుగా ఆ పని చేయలేదు. ఈలోగా అధికారాన్ని తన గుప్పిట్లో తీసుకోవడానికి హెమెడ్తీ పౌర పార్టీల కూటమైన ఫోర్సెస్ ఫర్ ఫ్రీడమ్ అండ్ ఛేంజ్ (ఎఫ్ఎఫ్సీ)తో సత్సంబంధాలు పెట్టుకున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ తనని తాను ఒక రాజనీతిజ్ఞుడిగా చూపించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. బంగారం గనులు, ఇతర వెంచర్ల ద్వారా హెమెడ్తీ, ఎఫ్ఎఫ్సీలు బాగా సంపద పోగేసుకున్నారు. మాజీ అధ్యక్షుడు బషీర్ అనుచరులు, ఇతర సీనియర్లు, ఆర్మీలో చాలా రోజులుగా పాతుకుపోయి ఉన్న వారిని పక్కకు తప్పించాలని ప్రణాళికలు రచించారు. ఆర్ఎస్ఎఫ్ను దేశవ్యాప్తంగా చాప కింద నీరులా విస్తరించడం ప్రారంభించారు. ఈలోగా లక్ష మంది బలగం ఉన్న ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్ఎస్ఎఫ్)ను సైన్యంలో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. తర్వాత సైన్యాధ్యక్షుడుగా ఎవరు ఉంటారన్నది సవాల్‌గా మారాయి. ఈ పరిణామాలన్నీ తన పదవికి ఎసరు పెడతాయని అధ్యక్షుడు బుర్హానా భావించారు. ఫలితంగా ఈ నెల 15న ఇరు వర్గాల మధ్య పోరు మొదలైంది. అయిదు రోజులుగా నరకం సూడాన్‌లో వారం రోజులుగా సాగుతున్న హింసాకాండలో ఇప్పటివరకు 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. పోరాటమంతా రాజధారి ఖర్టూమ్ పరిసరాల్లో జనావాస ప్రాంతాల్లో జరుగుతోంది. సూడాన్ జనాభా 4.6 కోట్లు అయితే రాజధాని పరిసర ప్రాంతాల్లోనే 1.2 కోట్ల మంది నివసిస్తారు. ఈ ప్రాంతాలన్నీ కాల్పుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. వీధుల్లోనే శవాలు పడి ఉన్నా పట్టించుకునే వారే లేరు. విద్యుత్ సదుపాయం నిలిచిపోయింది. బేకరీలో బ్రెడ్ కొనుక్కొని తెచ్చుకోవడానికి 3 గంటలు క్యూ లైన్లో నిల్చోవాల్సి వస్తోంది. కిలోమీటర్ దూరంలో ఉండే ఆఫీసుకి వెళ్లడం కూడా అందరికీ కష్టమవుతోంది. ఇల్లు కదిలి కాలు బయట పెడితే ప్రాణాలతో బతికి ఉంటారన్న నమ్మకం లేదు. అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాలన్నా వీధుల్లో వినిపిస్తున్న కాల్పుల మోతలతో బయటకి అడుగుపెట్టే ధైర్యం చేయడం లేదని 65 ఏళ్ల వయసున్న అబ్బాస్ చెప్పారు. సూడాన్ పాలకులకు ప్రజల ప్రాణాలపై కనీస గౌరవం కూడా లేదని ఆయన మండిపడ్డారు. ‘‘వేలాది మంది ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో సరుకులు అయిపోతున్నా, మంచినీరు, కరెంట్, మందులు వంటివి లేకపోయినా బయటకు వచ్చే పరిస్థితి లేదు’’అని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల హై కమిషనర్ వోల్కర్ టిర్క్ చెప్పారు. కొన్ని దశాబ్దాల పాటు బషీర్ పాలనలో అంతర్యుద్ధంలోనే ప్రజలు గడిపారు. పేదరికం, అణచివేతను ఎదుర్కొంటూ దుర్భర పరిస్థితుల్ని చూశారు. ఇప్పుడైనా ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతుందన్న వారి ఆశలు అడియాసలుగా మారాయి. ఎవరిది పై చేయి? బుర్హాన్, హెమెడ్తీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇద్దరికి ఇద్దరూ తగ్గేదేలే అంటున్నారు. ఆర్ఎస్ఎఫ్ను ఒక తిరుగుబాటు సంస్థగా ముద్రవేసిన బుర్హాన్ వెంటనే దానిని రద్దు చేయాలని పట్టు బడుతున్నారు. మరోవైపు హెమెడ్తీ బుర్హాన్‌ను క్రిమినల్‌గా అభివర్ణిస్తున్నారు. బషారీ పాలన నుంచి విముక్తి పొందినా దేశంలో శాంతి స్థాపన జరగకపోవడానికి ఆయనే కారణమని నిందిస్తున్నారు. సూడాన్ ఆర్మీలో 3 లక్షల మంది సైనికులతో వైమానిక బలగం కూడా దాని సొంతం. ఆర్ఎస్ఎఫ్లో లక్ష మంది సైనికులే ఉన్నారు. అయితే ఆర్ఎస్ఎఫ్కు సూడాన్ పశ్చిమ ప్రాంతంలో గిరిజన తెగల అండదండలు ఉన్నాయి. అంతర్జాతీయ సమాజం కూడా ఇద్దరు బలవంతులు కొట్టుకుంటూ ఉంటే ఎలా స్పందించాలో తెలీక మౌనం వహిస్తోంది. మానవీయ సంక్షోభం రాకుండా చర్యలు తీసుకోవాలని వారికి సలహా ఇవ్వడం మినహా మరేమీ చేయలేకపోతోంది. సూడాన్ జనాభా: 4.6 కోట్లు కాల్పులు జరుగుతున్న ప్రాంతంలో నివసిస్తున్నవారు: 1.2 కోట్లు మానవీయ సాయం కావాల్సిన వారు: 1.6 కోట్ల ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వారు: 1.17 కోట్లు – సాక్షి, నేషనల్ డెస్క్ -
Sudan: సూడాన్‌లో కల్లోల పరిస్థితులు.. చిక్కుకుపోయిన మనోళ్లు
ఖార్తూమ్: సూడాన్ సైన్యం, పారామిలటరీ విభాగమైన తక్షణ మద్దతు దళం(ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్)కు మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులతో నెలకొన్న కల్లోల పరిస్థితులు అక్కడి భారతీయులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ఇరు వర్గాల కాల్పులు, బాంబుల మోతతో ఉన్నచోటు నుంచి కనీసం బయటకురాలేక బిక్కుబిక్కుమంటూ సాయం కోసం అర్థిస్తున్నారు. దీంతో దౌత్యమార్గంలో వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కాల్పుల విరమణకు అమెరికా వంటి దేశాలు పిలుపునిచ్చినా కొద్ది గంటలకే అది విఫలమై గడిచిన 24 గంటల్లోనే మరో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పరిస్థితి చేయి దాటేలోపే భారతీయులను వెనక్కితీసుకురావాలనే భారత్ కృతనిశ్చయంతో ఉందని భారత విదేశాంగ శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. కర్ణాటక సంప్రదాయ మూలిక వైద్యం చేసే 31 మంది ‘హక్కీ పిక్కీ’ గిరిజనులుసహా 60 మంది భారతీయులు సూడాన్‌లో చిక్కుకున్నారని వారి గురించి పట్టించుకోండని ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య కోరడం, ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని ఇప్పటికే విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించడం తెల్సిందే. సూడాన్ ఘర్షణల్లో ఇప్పటిదాకా దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ఖార్తూమ్‌లో జరిగిన కాల్పుల్లో ఒక మాజీ భారతీయ సైనికుడు ఆల్బర్ట్ అగస్టీన్ చనిపోయారు. 1,800 మందికిపైగా గాయాలపాలయ్యారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అమెరికా, బ్రిటన్, సౌదీ, యూఏఈతో మంతనాలు సూడాన్‌తో సంబంధాలు నెరుపుతున్న అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలతో భారత విదేశాంగ శాఖ మంతనాలు కొనసాగిస్తోంది. క్షేత్రస్థాయిలో భారతీయుల రక్షణకు సాయపడతామని జైశంకర్‌కు సౌదీ, యూఏఈ విదేశాంగ మంత్రులు హామీ ఇచ్చారు. సూడాన్‌లో భారతీయ ఎంబసీ అక్కడి భారతీయులతో వాట్సాప్ గ్రూప్లుసహా పలు మార్గాల్లో టచ్‌లోనే ఉంది. ‘ మా నాన్న వ్యాపార నిమిత్తం అక్కడికెళ్లి శనివారమే ముంబైకి రావాల్సింది. సూడాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా చివరి నిమిషంలో విమానం రద్దయిందని చెప్పి అక్కడి అధికారులు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లగొట్టారు. హోటల్‌కు కాలినడకనే వెళ్లారు. ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి ఏంటో తెలీడం లేదు’ అని 63 ఏళ్ల వ్యక్తి కూతురు మానసి సేథ్ వాపోయారు. ‘అక్కడంతా ఆటవిక రాజ్యమే. ప్రాణాలకు విలువే లేదు. స్వయంగా సైనికులే లూటీ చేస్తూ అపహరణలకు పాల్పడుతున్నారు. ఖర్తూమ్ హోటల్లో నా భర్త చిక్కుకుపోయారు. బాంబుల దాడి భయంతో హోటల్లోని అతిథులంతా బేస్మెంట్లో దాక్కున్నారు’ అని మరో మహిళ పీటీఐకి చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీధుల్లో రాకపోకలు కూడా కష్టమేనని భారత విదేశాంగ శాఖ చెబుతోందంటే అక్కడి పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. 150 ఏళ్ల క్రితమే సూడాన్‌కు వలసలు ప్రస్తుతం సూడాన్‌లో దాదాపు 4,000 మంది భారతీయులున్నారు. వీరిలో 1,200 మంది శాశ్వత స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. వీరి కుటుంబాలు 150 ఏళ్ల క్రితమే అక్కడికి వలసవెళ్లాయి. ఇక మిగతావారు సూడాన్ ఆర్థిక రంగం వంటి పలు వృత్తుల్లో ఉద్యోగాల కోసం వెళ్లారు. కొందరు ఐక్యరాజ్యసమితి కార్యక్రమాలు, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్నారు. ఎవరీ హక్కీ పిక్కీలు ? గుజరాత్ నుంచి శతాబ్దాల క్రితం కర్ణాటకకు హక్కి పిక్కి అనే గిరిజన తెగ ప్రజలు వలసవచ్చారు. అడవుల్లో ఉంటూ మూలికా వైద్యం చేస్తారు. వీరికి సొంత భాష ‘వగ్రీబూలి’తోపాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం వచ్చు. పేద ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఖరీదైన ఇంగ్లిష్ మందులు, వైద్యం పొందగల స్తోమత ఉన్న జనాభా చాలా తక్కువ. అందుకే స్థానికులు చవక వైద్యం వైపు మొగ్గుచూపుతారు. అందుకే వారికి తమ సంప్రదాయ వైద్యం చేసేందుకు సుదూరంలోని సూడాన్‌కు ఈ కర్ణాటక గిరిజనులు చేరుకున్నారు. ఎందుకీ గొడవ ? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని అబ్దల్లా హమ్దోక్ను గత ఏడాది సైన్యం, ఆర్ఎస్ఎఫ్ గద్దెదించి పాలనను తమ చేతుల్లోకి తీసుకున్నాయి. తాజాగా ఆర్ఎస్ఎఫ్ను సైన్యంలో విలీనం చేయాలని సైన్యాధ్యక్షుడు జనరల్ అబ్దుల్ ఫతాహ్ అల్–బుర్హాన్ ప్రతిపాదించగా ఆర్ఎస్ఎఫ్ చీఫ్ జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇరు సాయుధ విభాగాల మధ్య అగ్గి రాజుకుంది. -
సంక్షుభిత దేశంలో సంఘర్షణ
‘మదగజాలు పోట్లాడుకుంటే, మామూలు గడ్డి వాటి కాళ్ళ కింద పడి నలిగిపోతుంద’ని ఆఫ్రికన్ సామెత. ఉత్తర ఆఫ్రికా దేశం సూడాన్‌లో పరిస్థితి ఇప్పుడదే. పైచేయి కోసం సైన్యానికీ, పారా మిలటరీ దళాలకూ మధ్య... ఆ రెంటికీ సారథ్యం వహిస్తున్న ఇద్దరు సైనిక జనరల్స్ మధ్య... నాలుగు రోజులుగా చెలరేగుతున్న హింసాకాండలో కనీసం 200 మంది ప్రాణాలు కోల్పోయారు. 2 వేల మంది గాయపడ్డారు. వీధుల్లో పడివున్నవారి వద్దకు వైద్యులు వెళ్ళే పరిస్థితి లేనందువల్ల అసలు లెక్క ఇంకెన్ని రెట్లు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఇళ్ళు, ఆస్పత్రులు, విద్యుత్కేంద్రాలు, విమానాశ్ర యాలు – ఏవీ యుద్ధట్యాంకుల కాల్పులకు మినహాయింపు కాదు. లక్షల మంది ఇంటి గడప దాటి బయటకు రాలేని పరిస్థితి. ఒకవైపు కరెంట్ లేక కష్టపడుతుంటే, మరోవైపు ఇళ్ళపై పడి దోచేస్తున్న దుఃస్థితి. అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా, సౌదీ అరేబియా సహా పలు దేశాలు రంగంలోకి దిగి, ‘బేషరతుగా శత్రుత్వాన్ని విడనాడాల’ని కోరాల్సి వచ్చింది. ఐరాస ప్రధాన కార్యదర్శి సైతం హింసకు స్వస్తి పలకండంటూ ఇరువర్గాల సైనికనేతలతో మాట్లాడారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సహజ వనరుల సంపన్న దేశమైతేనేం, 1956లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి సూడాన్‌లో నిత్యం ఏదో ఒక కుంపటి. ప్రజాపాలన ఏర్పడేందుకు ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి. అనేకానేక ఆకస్మిక తిరుగుబాట్లు, పౌర కలహాల చరిత్ర. 1989 నాటి విద్రోహంతో దేశాధ్య క్షుడైన నియంత బషీర్ దీర్ఘకాలిక ప్రభుత్వం 2019 ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనతో పడిపోయింది. ఆ మూడు దశాబ్దాల హింసాత్మక, నిరంకుశ, అవినీతి పాలన స్థానంలో స్వేచ్ఛా యుత, ప్రజాప్రభుత్వం వస్తుందన్న ఆశ ఫలించలేదు. రెండేళ్ళకే, మధ్యంతర పౌరప్రభుత్వం నడు స్తుండగానే ఎన్నికలు జరగాల్సినవేళ 2021లో జనరల్ బుర్హాన్ నేతృత్వంలో తిరుగుబాటు జరిగింది. ఆనాటి నుంచి సదరు సైనిక జనరలే అసలుసిసలు పాలకుడిగా, సైన్యమే సూడాన్‌ను నడిపిస్తోంది. అలా సైన్యాధికారమే సాగేందుకు మహమ్మద్ హమ్దన్ దగలో అలియాస్ హెమెడ్తీ నేతృత్వంలోని పారా మిలటరీ బలగమైన ‘సత్వర మద్దతు దళాల’ (ఆర్ఎస్ఎఫ్) కూడా సూడాన్ ఆర్మీతో కలసి పనిచేస్తూ వచ్చింది. అయితే... కొంతకాలంగా సూడాన్ సైన్యానికీ, ‘ఆర్ఎస్ఎఫ్’కూ మధ్య పొసగడం లేదు. రెండేళ్ళ క్రితం చేతిలో చేయి వేసుకు నిలబడి, మధ్యంతర పౌరప్రభుత్వాన్ని పడదోసి, పాలనా పగ్గాలు చేపట్టిన సైనిక జనరల్స్ బుర్హాన్కూ, ఆయన డిప్యూటీ దగలోకూ మధ్య ఇప్పుడు అపనమ్మకం పెరిగింది. వారి ఆధిపత్య పోరు ఫలితమే సూడాన్‌లో తాజా సంక్షోభం. నియంత బషీర్ పదవీచ్యుతి అనంతర రాజకీయ అధికార బదలీలో భాగంగా అసలైతే ఈ 2023 చివరికి ఎన్నికలు జరపాలి. పౌర పాలనకు బాటలు వేస్తామంటూ సైనిక నేత జనరల్ బుర్హాన్ సైతం బాస చేశారు. అయితే, అధికారమంటే ఎవరికి తీపి కాదు! అందుకే, ఇటు సేనా నాయకుడు, అటు ‘ఆర్ఎస్ఎఫ్’ సారథి... ఎవరూ అధికారాన్ని వదులుకోదలుచుకోలేదు. పైచేయికై పరస్పరం ఢీ కొన్నారు. ఆర్ఎస్ఎఫ్ పారామిలటరీలను కూడా సూడాన్ ఆర్మీలోకి చేర్చుకొని, రెండేళ్ళలో పౌర సర్కార్ ఏర్పాటుచేయడంపై ఏకాభిప్రాయం కుదరకపోవడం హింసకు కారణం. ఆర్మీలో ఆర్ఎస్ ఎఫ్‌ను చేర్చుకుంటే తన పట్టు పోతుందని దగాలో భయం. పౌర ప్రభుత్వాన్ని మరో పదేళ్ళు జాగు చేయాలని ఆయన భావన. ఇది కడుపులో పెట్టుకొని, సైన్యం అనుమతి లేకనే వివిధ ప్రాంతాల్లో ఆర్ఎస్ఎఫ్ తన వాళ్ళను మోహరించడం మొదలెట్టింది. ఇది ఏప్రిల్ 15 నుంచి హింసాత్మకమైంది. నిజానికి, ఇవన్నీ ఉన్నట్టుండి జరిగినవి కానే కావు. సూడాన్ దేశ ఆర్థిక సంపదపై, అందులోనూ ప్రత్యేకించి బంగారు గనులపై నియంత్రణ కోసం ఆర్ఎస్ఎఫ్ కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. అలా ఇరువర్గాల మధ్య పెరిగిన కుతకుతలు ఇక్కడికి దారి తీశాయి. దీర్ఘకాలం దేశాధ్యక్షుడైన నియంత బషీరే కాదు... 2000ల నాటికి జంజవీద్ అనే తీవ్రవాద సంస్థ సారథిగా మొదలై ఇప్పుడు ఆర్ఎస్ఎఫ్ అధినేత అయిన దగాలో, ప్రస్తుత సైనిక నేత బుర్హాన్... అంతా ఒకే తాను గుడ్డలు. అందరూ మానవ హక్కులను కాలరాసినవారే. ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపినవారే. ఎవరు గద్దెపై ఉన్నా సూడాన్‌లో ఎన్నికల ప్రజాస్వామ్యం వైపు అడుగులేయడం కల్ల. వేలకొద్దీ సైన్యం చేతుల్లో ఉన్న ఇద్దరు అహంభావుల వ్యక్తిగత అధికార దాహానికి ఇన్ని లక్షల మంది ఇక్కట్ల పాలవడమే దురదృష్టం. అంతర్యుద్ధాన్ని నివారించడానికే మధ్యంతర సర్కారును కాదని సైన్యం పగ్గాలు పట్టిందని 2021లో అన్న బుర్హాన్ ఇప్పుడచ్చంగా దేశాన్ని అటువైపే నెట్టేస్తున్నారు. సూడాన్‌లో సుస్థిరత, సురక్షణ, ప్రజాస్వామ్యం భారత్‌కూ కీలకమే. సంక్షుభిత సూడాన్‌లో దాదాపు 4 వేల మంది భారతీయులున్నారు. వారిలో 1200 మంది దశాబ్దాల క్రితమే అక్కడ స్థిరపడ్డారు. తాజా ఘర్షణల్లో కేరళకు చెందిన ఒకరు మరణించగా, కర్ణాటకలోని హక్కీ–పిక్కీ తెగకు చెందినవారు పదుల సంఖ్యలో చిక్కుకుపోయారన్న మాట ఆందోళన రేపుతోంది. ఘర్షణలు మరింత పెరిగితే సూడాన్ సహా ఆ పరిసర ప్రాంతాలన్నీ అస్థిరతలోకి జారిపోతాయి. ఆకలి కేకలు, ఆర్థిక సంక్షోభం, ఆకాశమార్గం పట్టిన ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న దేశానికి ఇరుగు పొరుగుతోనూ సంబంధాలు దెబ్బతింటాయి. దేశం ప్రజాస్వామ్య పాలన దిశగా అడుగులు వేయ డానికీ ఉపకరించదు. వెరసి, సూడాన్ చరిత్రలో ప్రతి రాజకీయ çపరివర్తనకూ సైన్యమే కేంద్ర మవుతూ వచ్చింది గనక ఈసారి ఏ మార్పు జరుగుతుందో వేచిచూడాలి. -
అంతర్గత పోరుతో అట్టుడుకుతున్న సూడాన్.. 200 మంది మృతి
ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో సైన్యం, పారామిలటరీ మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘర్షణలు వరసగా మూడు రోజైన సోమవారం కూడా కొనసాగాయి. పేలుళ్లు, కాల్పులతో సూడాన్ అట్టుడుకిపోయింది. దేశ రాజధాని ఖార్టుమ్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 1800 మంది గాపడ్డారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. మూడు రోజులుగా సాగుతున్న ఈ హోరాహోరీ యుద్ధంలో ఆస్పత్రులు దెబ్బతిన్నాయి. దీంతో వైద్యసామాగ్రి, ఆహారం కొరత ఏర్పడింది. 2021లో తిరుగుబాటుతో అధికారాన్ని చేజిక్కించుకున్న ఇద్దరు జనరల్స్, సూడాన్ ఆర్మీచీఫ్ అబ్దెల్ ఫట్టా అల్ బుర్హాన్, పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య వారాల పాటు అధికార పోరాటం జరిగింది. అది శనివారానికల్లా మరింత హింసాత్మకంగా మారింది. ఈ సంఘర్షణ వైమానిక దాడులు, ఫిరంగిదళాల భారీ కాల్పులను దారితీసింది. దీంతో నివాసితులు నిత్యావసారాలు, పెట్రోల్ కోసం బయటకు రావడం ఒక సాహసంగా మారింది. మరోవైపు విద్యుత్తు అంతరాయంతో నగరవాసులు ఇబ్బందులకు గురయ్యారు. ఐతే దేశ రాజధాని ఖార్టుమ్‌లో చోటు చేసుకున్న ఈ అంతర్గత పోరు సుదీర్ఘంగా ఉండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దౌత్యవేత్తలు సమీకరించి ప్రాంతీయంగా, అంతర్జాతీయ పరంగా కాల్పులు విరమణకు పిలుపునిచ్చారు. మరోవైపు ఐక్యరాజ్యసమితి మిషన్ హెడ్ వోల్కర్ పెర్థెస్ భద్రత మండలిలో సూడాన్ యుద్ధం చాలా పీక్ స్టేజ్‌కి చేరుకుందని, ఇది ఎంతటి విధ్వంసానికి దారితీస్తోందో కూడా చెప్పడం కష్టం అన్నారు. ఈమేరకు సోమవారం యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సూడాన్‌లో మళ్లీ అంతర్గత పోరుకు తెరతీసిన ఇరు పార్టీలను తక్షణమే శత్రుత్వాలను నిలిపివేయాలని పిలుపునిచ్చారు. దీన్ని మరింతగా తీవ్రతరం చేయడం దేశానికి, ఆయా ప్రాంతాలకి మరింత ప్రమాదరకమని హెచ్చరించారు. కాగా, పారా మిలిటరీ ‘ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్’ను సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదనే దేశంలో అగ్నికి ఆజ్యంపోసింది. ఇదే ఆర్మీ, పారామిలటరీ బలగాల మధ్య ఘర్షణకు కారణమైంది. ఘర్షణలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఇప్పటి వరకు దాదాపు 100 మంది పౌరులకు చికిత్స అందిచినట్లు వైద్యుల సంఘం ఒకటి పేర్కొంది. గాయపడినవారిలో చాలమంది ఆస్పత్రులకు చేరుకోలేకపోతున్నట్లు తెలిపింది. అంతేగాదు కొనసాగుతున్న ఈ ఘర్షణలో ఆస్పత్రులు దెబ్బతినడంతో పౌరులను జాయిన్ చేసుకునే పరిస్థితి కూడా లేదని వైద్యుల సంఘం పేర్కొంది. చాలా ఆస్పత్రులు సామాగ్రి కొరతతో వైద్యం అందించలేని స్థితిలో ఉన్నాయని తెలిపింది. మరోవైపు సైన్యం విమానాశ్రయాలు, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌తో సహా కీలక ప్రాంతాలు తమ అధీనంలో ఉన్నాయని ప్రకటించడం గమనార్హం. స్వాతంత్యం వచ్చినప్పటి నుంచి సూడాన్ దశాబ్దాలుగా అనేక తీవ్రమైన అంతర్యుద్ధాలు, తిరుగుబాట్లతో మగ్గిపోయిందని సూడాన్ విశ్లేషకుడు ఖో లూద్ ఖై చెబుతున్నారు. (చదవండి: రెసిడెన్షియల్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం..16 మంది మృతి) -
సూడాన్ ఘర్షణల్లో భారతీయుడు మృతి
సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య తలెత్తిన ఘర్షణల్లో 61 మందికి పైగా చనిపోయారు. మృతుల్లో ఆల్బర్ట్ ఆగస్టీన్ అనే భారతీయుడు ఉన్నారు. సూడాన్‌లో 2021 అక్టోబర్‌లో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అప్పటి నుంచి అత్యున్నత మండలి అధికారం చెలాయిస్తోంది. అయితే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే ప్రభుత్వానికి అధికారం అప్పగించే విషయంలో ఆర్మీ, పారామిలటరీ బలగాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఖార్టూమ్‌లోని అధ్యక్ష భవనాన్ని, విమానాశ్రయాన్ని, ఇతర కీలక ప్రాంతాలు తమ ఆధీనంలోనే ఉన్నట్లు సైన్యం, పారా మిలటరీ బలగాలు ప్రకటించుకున్నాయి. శనివారం నుంచి రాజధానితోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తలెత్తిన హింసాత్మక ఘటనల్లో 61 మంది పౌరులు చనిపోయారు. ఇరుపక్షాలకు చెందిన డజన్లకొద్దీ మరణించి ఉంటారని వైద్యుల సంఘం ఒకటి అంటోంది. మరో 670 మంది గాయపడినట్లు చెబుతోంది. దాల్ గ్రూప్ కంపెనీ ఉద్యోగి, భారతీయుడు ఆల్బర్ట్ ఆగస్టీన్ తుపాకీ కాల్పుల్లో చనిపోయినట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది. చదవండి: ఆశాకిరణం ఆఫ్రికా..! -
‘అజ్ఞాత’ శత్రువు.. దడపుట్టిస్తున్న ‘అనానిమస్ సూడాన్’
ఎలాంటి డిమాండ్లు చేయట్లేదు... ఏ ప్రతిఫలం ఆశించట్లేదు... కేవలం ఉనికి చాటుకోవడానికే దాడులు చేస్తున్నారు! ఏ రోజు, ఎక్కడ, ఎవరిపై దాడి చేసేది ట్విట్టర్ ద్వారా ముందే ప్రకటించి మరీ దెబ్బతీస్తున్నారు!! ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థలతోపాటు కార్పొరేట్ ఆస్పత్రులే లక్ష్యంగా సైబర్ యుద్ధం చేస్తున్నారు!! గతవారం రోజులుగా దేశవ్యాప్తంగా హడలెత్తిస్తున్న ‘అనానిమస్ సూడాన్’వ్యవహారమిది. ఈ దాడులకు గురైన వాటిలో హైదరాబాద్‌కు చెందిన అనేక సంస్థలు సైతం ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్: అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక సైబర్ సెక్యూరిటీ సంస్థ రెడ్‌వేర్ సేకరించిన ఆధారాల ప్రకారం సూడాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు ‘అనానిమస్ సూడాన్’గ్రూప్ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ముస్లింలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా తాము ఈ–ఎటాక్స్ చేస్తున్నామని ఈ గ్యాంగ్ ప్రచారం చేసుకుంటోంది. కేవలం తమ ఉనికిని చాటుకోవడానికి, యావత్ ప్రపంచానికి సైబర్ సవాల్ విసరడానికే తమ ‘ఆపరేషన్స్’అని చెప్పుకుంటోంది. గత నెల నుంచే ఎటాక్స్ మొదలుపెట్టిన ఈ హ్యాకర్లు... తొలుత ఫ్రాన్స్‌ను టార్గెట్ చేశారు. అక్కడి ఆస్పత్రు లు, యూనివర్సిటీలు, విమానాశ్రయాల వెబ్సైట్లపై విరుచుకుపడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా సైబర్ రంగంలో వారి పేరు మారుమోగిపోయింది. ట్విట్టర్ ద్వారా ప్రకటించి మరీ... అనానిమస్ సూడాన్ గ్యాంగ్ తాము ఏ దేశాన్ని టార్గెట్ చేస్తున్నామో ముందే ప్రకటిస్తుండటం గమనార్హం. ఈ నెల 6న తమ ట్విట్టర్ ఖాతా హ్యష్‌ట్యాగ్ అనానిమస్ సూడాన్‌లో ‘ఆఫ్టర్ ఫ్రైడే.. ఇండియా విల్ బీ ది నెక్ట్స్ టార్గెట్’(శుక్రవారం తర్వాత భారతదేశమే మా లక్ష్యం) అంటూ ప్రకటించారు. ఆ తర్వాతి రోజే కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం వెబ్‌సైట్‌పై సైబర్ దాడి జరిగింది. అప్పటి నుంచి వరుసబెట్టి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)పాటు ఢిల్లీ, ముంబై, గోవా, హైదరాబాద్‌లలోని విమానాశ్రయాలు, ఆస్పత్రుల వెబ్సైట్లపై ఈ–ఎటాక్స్ జరిగాయి. అయితే ఈ–దాడులు పోలీసు, సైబర్‌క్రైమ్ అధికారుల రికార్డుల్లోకి వెళ్లకపోయినా ఈ బాధిత సంస్థల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నో డిమాండ్స్... కేవలం సవాళ్లే సాధారణంగా సైబర్ ఎటాక్స్ చేసే హ్యాకర్లు అనేక డిమాండ్లు చేస్తారు. వీలైనంత మేర బిట్కాయిన్ల రూపంలో సొమ్ము చేజిక్కించుకోవాలని, డేటా తస్కరించాలని చూస్తుంటారు. సంస్థలు, వ్యవస్థల్ని హడలెత్తిస్తున్న ర్యాన్సమ్వేర్ ఎటాక్స్ తీరుతెన్నులే దీనికి ఉదాహరణ. అయితే అనానిమస్ సూడాన్ ఎటాకర్స్ మాత్రం ఎలాంటి డిమాండ్లు చేయట్లేదు. చివరకు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను ఎటాక్ చేయడానికి సిద్ధమైన ఈ హ్యాకర్లు... కేవలం తమ ఉనికి చాటుకోవడం, సైబర్ ప్రపంచాన్ని సవాల్ చేయడం కోసమే వరుసపెట్టి దాడులు చేస్తున్నారు. కొవిడ్ తర్వాత కాలంలో హాస్పిటల్స్, వాటి రికార్డులు కీలకంగా మారిన నేపథ్యంలో ప్రధానంగా వాటిపైనే అనానిమస్ సూడాన్ హ్యాకర్లు విరుచుకుపడుతున్నారు. డాక్స్ ఎటాక్స్‌తో సర్వర్లు క్రాష్ ఇతర మాల్వేర్స్, హాకర్ల ఎటాక్స్‌కు భిన్నంగా అనానిమస్ సూడాన్ ఎటాక్స్ ఉంటున్నాయి. డీ డాక్స్‌గా పిలిచే డి్రస్టిబ్యూటెడ్ డినైయెల్ ఆఫ్ సర్వీసెస్ విధానంలో వారు దాడి చేస్తుంటారు. ప్రతి సంస్థకు చెందిన వెబ్‌సైట్‌కు దాని సర్వర్‌ను బట్టి సామర్థ్యం ఉంటుంది. ఆ స్థాయి ట్రాఫిక్‌ను మాత్రమే అది తట్టుకోగలుగుతుంది. అంతకు మించిన హిట్స్ వస్తే కుప్పకూలిపోతుంది. పరీక్షల రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆయా బోర్డులకు చెందిన వెబ్సైట్లు మొరాయించడానికి ఇదే కారణం. అనానిమస్ సూడాన్ ఎటాకర్స్ దీన్నే ఆధారంగా చేసుకున్నారు. టార్గెట్ చేసిన వెబ్సైట్లకు ప్రత్యేక ప్రొగ్రామింగ్ ద్వారా ఒకేసారి కొన్ని లక్షల హిట్స్, క్వెర్రీస్ వచ్చేలా చేస్తున్నారు. దీంతో ఆ ట్రాఫిక్‌ను తట్టుకోలేని సర్వర్ ఒక్కసారిగా కుప్పకూలిపోతోంది. ఈ కారణంగా నిజమైన వినియోగదారులు ఆ వెబ్‌సైట్‌ను సాంకేతిక నిపుణులు మళ్లీ సరిచేసే వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ‘హ్యాక్టివిస్ట్ ఇండోనేసియా’తోనూ ముప్పు ప్రపంచవ్యాప్తంగా ‘అనానిమస్ సూడాన్’ఎటాక్స్ ఓవైపు కలకలం సృష్టిస్తుంటే మరోవైపు ‘హ్యాక్టివిస్ట్ ఇండోనేసియా అనే హాకర్ల గ్రూప్ సైతం దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల వెబ్సైట్లను టార్గెట్ చేసినట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) తాజాగా ప్రకటించింది. ఐ4సీ పరిధిలోని సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్ వింగ్ హాకర్ల కుట్రను బయటపెట్టింది. డినైయెల్ ఆఫ్ సర్వీస్ (డీఓఎస్), డిస్ట్రిబ్యూటెడ్ డినైయెల్ ఆఫ్ సర్వీసెస్ (డీ–డాక్స్) విధానాల్లో ఈ హ్యాకర్లు ఆయా వెబ్‌సైట్స్ సర్వర్లు కుప్పకూలేలా చేయనున్నారని అప్రమత్తం చేసింది. దాదాపు 12 వేల వెబ్సైట్లు వారి టార్గెట్ లిస్టులో ఉన్నట్లు అంచనా వేసింది. గతేడాది ఢిల్లీ ఎయిమ్స్ జరిగిన సైబర్ దాడి ఈ తరహాకు చెందినదే అని, దేశంలోనే అతిపెద్ద సైబర్ ఎటాక్‌గా ఈ గ్రూప్ మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు సైబర్ దాడులు, హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల వెబ్సైట్లను సైబర్ దాడుల నుంచి ఎలా కాపాడుకోవాలో కీలక సూచనలు చేసింది. ఉమ్మడిగా పని చేస్తే కట్టడి అనానిమస్ సూడాన్ ఎటాక్స్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి వల్ల నష్టం తగ్గించడానికి పోలీసులతోపాటు సైబర్ నిపుణులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలసి పనిచేయాల్సి ఉంటుంది. హ్యాకర్ల టార్గెట్‌లో ఉన్న సంస్థలను అప్రమత్తం చేయడం, అవసరమైన స్థాయిలో ఫైర్ వాల్స్ అభివృద్ధి చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యవస్థకూ పూర్తిస్థాయిలో సైబర్ భద్రత ఉండదు. అయితే కొత్త సవాళ్లకు తగ్గట్లు ఎప్పటికప్పుడు మార్పుచేర్పులు చేసుకోవాలి. – రాజేంద్రకుమార్, సైబర్ నిపుణుడు -
శాంతి కోసం స్త్రీ శక్తి
ఎప్పుడు, ఏ అడుగులో మందుపాతర పేలుతుందో తెలియని కల్లోల ప్రాంతం అది. అక్కడ శాంతిపరిరక్షణ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం అనేది కత్తి మీద సాముకు మించిన కఠినవ్యవహారం. సుడాన్, దక్షిణ సుడాన్ సరిహద్దులలోని రణక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు మనదేశ మహిళా శాంతిపరిరక్షకులు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ ఉద్యమంలో భాగం అవుతూ, లార్జెస్ట్ సింగిల్ యూనిట్‌గా కొత్త చరిత్ర సృష్టించారు ఇండియన్ ఉమెన్ పీస్‌కీపర్స్... సుడాన్, దక్షిణ సుడాన్‌ల సరిహద్దు నగరం అభేయ్. చక్కని వ్యవసాయానికి, సంపన్న చమురు క్షేత్రాలకు ప్రసిద్ధిగాంచిన ‘అభేయ్’పై ఆధిపత్యం కోసం, స్వాధీనం చేసుకోవడం కోసం సుడాన్, దక్షిణ సుడాన్‌లు పోటీ పడుతుంటాయి. ఇరుదేశాల మధ్య సాయుధ ఘర్షణల వల్ల ఈ ప్రాంతానికి శాంతి కరువైంది. రక్తపాతమే మిగిలింది. సరిహద్దు ప్రాంతాలలో జాతి, సాంస్కృతిక, భాష వివాదాలు కూడా హింసకు ఆజ్యం పోస్తున్నాయి. సుడాన్, దక్షిణ సుడాన్‌ల సాయుధ ఘర్షణలలో అభి నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అక్కడ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితులలో అభిలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. యూఎన్ చేపడుతున్న పీస్‌కీపింగ్ మిషన్లలో మన దేశం ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తోంది. వాటిలో మహిళల ప్రాతినిధ్యానికి మొదటి నుంచి తగిన ప్రాధాన్యత ఇస్తోంది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన లైబీరియాలో యూఎన్ పీస్‌కీపింగ్ మిషన్ కోసం మన దేశం 2007లో ‘ఆల్–ఉమెన్ టీమ్’ను ఏర్పాటు చేసి, అలా ఏర్పాటు చేసిన తొలి దేశంగా గుర్తింపు పొందింది భారత్. మన మహిళా బృందాలు లైబీరియాలో శాంతిపరిరక్షణ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాలేదు. వివిధ విషయాలలో స్థానికులను చైతన్యం చేశారు. ప్రజలకు రోల్‌మోడల్‌గా నిలిచారు. అక్షరాస్యతకు ప్రాధాన్యత పెరిగేలా చేశారు. గత కొంత కాలంగా ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ ఉద్యమాలలో మహిళల ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రచారం చేస్తోంది. 2007లోనే ‘ఆల్ ఉమెన్’ టీమ్ ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచింది భారత్. ‘ఛాంపియన్ ఆఫ్ జెండర్ మెయిన్‌స్ట్రీమింగ్’గా గుర్తింపు పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి చేపడుతున్న శాంతిపరిరక్షణ ఉద్యమాలలో మన దేశ మహిళలకు మంచి పేరు ఉంది. ధైర్యంగా విధులు నిర్వహించడమే కాదు, స్థానికులత కలిసిపోతున్నారు. వారి కుటుంబాల్లో ఒకరిగా మారుతున్నారు. మహిళల సమస్యలను అర్థం చేసుకొని వారిని చైతన్యం వైపు నడిపిస్తున్నారు. తాజాగా ‘అభేయ్’ ప్రాంతంలో విధులు నిర్వహించే ‘లార్జెస్ట్ సింగిల్ యూనిట్’గా ఇండియన్ ఉమెన్ పీస్‌కీపర్స్ చరిత్ర సృష్టించారు. ఈ యూనిట్లో వివిధ హోదాలలో ఉన్న 27 మంది మహిళలు పనిచేస్తున్నారు. కాస్త వెనక్కి వెళితే... కిరణ్ బేడీ, మేజర్ సుమన్ గవాని, శక్తిదేవి... మొదలైన అధికారులు ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ ఉద్యమాలలో తమదైన ముద్ర వేసి ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చారు. -
తొలిసారిగా 25 శాతం మంది మహిళా పోలీసు అధికారులు..
కొంత కాలం క్రితం... దక్షిణ సూడాన్‌లోని జుబా నగరంలో జరుగుతున్న యూఎన్ (ఐక్యరాజ్యసమితి) మెడల్ పరేడ్ అది. పతకం స్వీకరించడానికి ఆ ఐదుగురు మహిళా పోలిసు అధికారులు నడిచొస్తుంటే నలుదిక్కుల నుంచి చప్పట్లు మారుమోగాయి. వారి నడకలో సాహస ధ్వని వినిపించింది. దక్షిణ సుడాన్లో ఏ ప్రమాదం ఏ మూల నుంచి మృత్యువును మోసుకొస్తుందో తెలియని కల్లోల ప్రాంతాల్లో పనిచేశారు వారు. పోలిస్ ఇన్స్పెక్టర్ రీనా యాదవ్... చండీగఢ్ డీఎస్పీ భారతి స్వామినాథన్... మహారాష్ట్ర ఇన్స్పెక్టర్ రజనీకుమారి... మహారాష్ట్ర డీఎస్పీ గోపిక జహగిర్దార్.... మహారాష్ట్ర ఏ ఎస్పీ కమలా షెకావత్... రాజస్థాన్ దక్షిణ సుడాన్లో అంతర్యుద్ధ పరిస్థితులను నివారించడంలో తమవంతు పాత్ర పోషించి ‘శభాష్’ అనిపించుకున్నారు. ఐక్యరాజ్యసమితికి మన మహిళా పోలిస్ అధికారుల సాహస ప్రవృత్తి, త్యాగం... సుపరిచితం. (చదవండి: 6 లక్షల పెట్టుబడి.. 4 కుట్టు మిషన్లతో ఆరంభం.. లక్షల్లో ఆదాయం!) తాజాగా... ఆంధ్ర, తెలంగాణ, దిల్లీ, హరియాణ, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, సిక్కిం, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్... మొదలైన రాష్ట్రాలు, రకరకాల సెంట్రల్ పోలిస్ ఆర్గనైజేషన్స్ నుంచి 69 మంది పోలిసు అధికారులు ‘యునైటెడ్ నేషన్స్ మిషన్ సర్వీసెస్: 2022–2024’లో భాగం అయ్యారు. వెహికిల్, వెపన్ హ్యాండ్లింగ్, కంప్యూటర్ స్కిల్స్... మొదలైన వాటికి సంబంధించిన పరీక్షలలో వీరు విజయం సాధించారు. ఈసారి విశేషం ఏమిటంటే ప్యానల్లో తొలిసారిగా 25 శాతం మంది మహిళా పోలిసు అధికారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూఎన్‌లో పనిచేయడానికి వృత్తినిబద్ధత, భిన్నసంస్కృతుల పట్ల గౌరవభావం... ప్రధాన లక్షణాలు అంటారు. అవి మన మహిళాపోలిసు అధికారులలో పుష్కలంగా ఉన్నాయని గత చరిత్ర సగర్వంగా చెప్పకనే చెబుతుంది. (చదవండి: ‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’.. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ కూడా..) -
ఆ దేశంలో యూనిట్ కరెంటు 14 పైసలే.. ఎక్కడో తెలుసా?
రాత్రీపగలు తేడా లేదు.. ఎప్పుడైనా ఐదు నిమిషాలు కరెంటు పోయిందంటే ఇబ్బందే. లైట్లు, ఫ్యాన్ల వంటి అత్యవసరాల నుంచి టీవీలు, ఇతర సాంకేతిక ఉత్పత్తుల దాకా ఏది నడ వాలన్నా విద్యుత్ కావాల్సిందే. ఈ కరెంటు చార్జీలు ఒకచోట భగ్గుమంటుంటే.. మరోచోట చాలా తక్కువగా ఉంటుంటాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో సగటున కరెంటు చార్జీలు ఎంత ఉన్నాయనే దానిపై ‘గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ డాట్ కామ్’ ఓ పరిశోధన చేసి జాబితా లను రూపొందించింది. చిత్రమైన విషయం ఏమిటంటే.. కొన్ని పేద దేశాల్లో కరెంటు చార్జీ లు అతితక్కువగా ఉండగా.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువున్నట్టు గుర్తించింది. మన రాష్ట్రం లో కరెంటు చార్జీల పెంపుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ వివరాలేమిటో చూద్దామా.. నివేదికలో గృహ విద్యుత్ చార్జీల లెక్క ఇదీ.. ►ప్రపంచవ్యాప్తంగా 146 దేశాల్లో 2021 చివరినాటికి ఉన్న విద్యుత్ చార్జీలను పరిగణనలోకి తీసుకుని జాబితాను రూపొందించారు. ►మొత్తం ప్రపంచవ్యాప్తంగా సగటున గృహ విద్యుత్ చార్జీలు రూ.10.22 పైసలుగా.. వాణిజ్య విద్యుత్ చార్జీలు రూ.9.30గా ఉన్నాయి. ►క్కువ గృహ విద్యుత్ చార్జీల్లో భారతదేశం సగటున యూనిట్‌కు రూ.5.73 ధరతో 41వ స్థానంలో ఉంది. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌లలో విద్యుత్ చార్జీలు మన కంటే తక్కువ. ఇక మనదేశంలో వాణిజ్య విద్యుత్ (దుకాణాలు, పరిశ్రమల వంటి వాటికి ఇచ్చే) ధర సగటున రూ.8.30గా ఉంది. ► అమెరికా రూ.11.39 ధరతో 88వ స్థానంలో నిలిచింది. ►మన దేశంలో సగటున యూనిట్‌కు ధర (రూ.లలో)- 5.73 ► తక్కువ గృహ విద్యుత్ చార్జీలు ఉన్న దేశాల్లో మన స్థానం -41 -
ఘోరం: సూడాన్‌లో బంగారు గని కూలి 38 మంది మృతి
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ కోర్డోఫాన్ ప్రావిన్స్‌లో బంగారు గని కూలిపోవడంతో 38 మంది మరణించారు. ప్రమాదంలో మరో 8 మంది వరకు గాయపడ్డారని, వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సూడాన్ ప్రభుత్వ మినరల్ రిసోర్సెస్ కంపెనీ తెలిపింది. సూడాన్ రాజధాని ఖార్టూమ్‌కు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుజా గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ గనిని గత కొంతకాలం క్రితమే ప్రభుత్వం మూసివేసింది. సూడాన్ ప్రభుత్వం గనుల్లో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడమే వరుస ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, సూడాన్ దేశం 2020లో సుమారు 36.6 టన్నుల బంగారాన్ని వెలికితీసింది. -
మలద్వారంలో బంగారం స్మగ్లింగ్!
శంషాబాద్: మల ద్వారంలో బంగారం పెట్టుకుని దొంగ రవాణా (స్మగ్లింగ్) చేస్తున్న నలుగురు సూడాన్ దేశస్తులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి ఏకంగా 7.3 కిలోల బరువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి దుబాయ్ నుంచి శంషాబాద్‌కు వచ్చిన విమానంలోని ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల నడక తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో అప్రమత్తమయ్యారు. వారిని వైద్యాధికారుల దగ్గరికి తీసుకెళ్లి పరీక్ష చేయించారు. వారు మలద్వారంలో బంగారం పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించి, బయటికి తీయించారు. ఈ నలుగురు సూడాన్ దేశస్తులని, వారు స్మగ్లింగ్ చేస్తున్న బంగారం విలువ రూ.3.6 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారాన్ని ఎవరు ఎక్కడి నుంచి, ఎక్కడికి అక్రమ రవాణా చేస్తున్నరన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
సూడాన్ ప్రధానమంత్రిగా మళ్లీ అబ్దల్లా హమ్దోక్
కైరో: సూడాన్ ప్రధానమంత్రిగా అబ్దల్లా హమ్దోక్ మళ్లీ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సూడాన్ సైన్యం, రాజకీయ పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. అక్టోబర్ 25 నుంచి అరెస్టు చేసిన ప్రభుత్వ అధికారులను, రాజకీయ నాయకులను విడుదల చేసేందుకు సైన్యం అంగీకరించినట్లు పేర్కొన్నాయి. ఈ ఒప్పందం కుదరడం వెనుక ఐక్యరాజ్యసమితి, అమెరికా కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. గత నెలలో జరిగిన సైనిక తిరుగుబాటు కారణంగా హమ్దోక్ పదవి నుంచి దిగిపోయారు. అయితే, సైన్యంతో కుదిరిన ఒప్పందంపై తాము సంతకం చేయలేదని సూడాన్‌లో అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన ‘ఉమ్మా పార్టీ’ ప్రకటించింది. -
సూడాన్‌లో సైనిక తిరుగుబాటు
కైరో: ఆఫ్రికా దేశం సూడాన్‌లో సైన్యం అధికారం హస్తగతం చేసుకుంది. ఆపద్ధర్మ ప్రధానమంత్రిని అదుపులోకి తీసుకున్న సైన్యం..దేశంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించేందుకు గడువు సమీపిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం దేశ పరిపాల నాబాధ్యతలను నిర్వహిస్తున్న సార్వభౌమత్వ (సావరిన్) కౌన్సిల్‌ను రద్దు చేయడంతోపాటు ప్రధానమంత్రి అబ్దుల్లా హర్దోక్‌ను పదవీచ్యుతుడిని చేస్తున్నట్లు జనరల్ అబ్దుల్ ఫతా బుర్హాన్ చేసిన ప్రకటన టీవీ చానెళ్లలో ప్రసారమైంది. రాజకీయ పక్షాల మధ్య కొనసాగుతున్న విభేదాల వల్లే తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అధికారాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా తెలిపారు. సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు నిపుణులతో కూడిన ప్రభుత్వాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తామన్నారు. సైనిక తిరుగుబాటు వార్తలతో ఆగ్రహించిన ప్రజలు పెద్ద సంఖ్యలో రాజధాని ఖార్తూమ్ వీధుల్లోకి చేరుకున్నారు.టైర్లకు నిప్పుపెట్టి రోడ్లను దిగ్బంధించారు. భద్రతా బలగాలు వారిని చెదరగొట్టేందుకు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా 80 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం నియంత ఒమర్ అల్ బషీర్‌ను పదవి నుంచి తొలగించాక ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టేందుకు మిలటరీ అధికారులు, పౌర నేతలతో ఉన్నత స్థాయి కౌన్సిల్ ఏర్పాటుతోపాటు ఆపద్ధర్మ ప్రధానమంత్రిని నియమించారు. ప్రజా ప్రభుత్వా నికి నవంబర్‌లో అధికారం అప్పగించాల్సి ఉంది. -
మూడు రూపాయలకే వన్ జీబీ డేటా.. ఎక్కడో తెలుసా?
Cheapest Mobile Data Countries:దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ యూసేజ్ బాగా పెరిగిపోయింది. అందరి చేతుల్లో స్మార్ట్ఫోన్లు ప్రత్యక్షమవుతున్నాయి. గంటల తరబడి వాటికే అతుక్కుపోతున్నారు. అయితే ఒక గిగాబైట్ (జీబీ) డేటా ఉపయోగించినందుకు ఇండియన్లు చేస్తున్న ఖర్చు ఎంత ? అతి తక్కువ ధరకే డేటాను అందిస్తున్న దేశాలు ఏవీ ? అనే అంశాలపై 221 రీజియన్లలో 6,148 మొబైల్ డేటా ప్లాన్లు పరిశీలించి తేల్చిన వివరాలు ఇలా ఉన్నాయి. డేటా విప్లవం మార్కెట్లోకి జియో నెట్వర్క్ రాకముందు దేశంలో నెట్ వినియోగం ఖరీదైన వ్యవహరంగానే ఉండేంది. దాదాపు సర్వీస్ ప్రొవైడర్లు అందరూ 1 జీబీ డేటాకు రూ. 200లకు పైగానే ఛార్జ్ చేశారు. అయితే 2016లో జియో వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అతి తక్కువ ధరకే అపరిమితమైన డేటా అందుబాటులోకి వచ్చింది. దీంతో దేశంలో ఒక్కసారిగా సోషల్ మీడియా విస్త్రృతమైంది. వీడియో కంటెంట్ వాడకం పెరిగి పోయింది. జియో ఎఫెక్ట్‌తో దాదాపు అన్ని నెట్‌వర్క్‌లు డేటా ప్లాన్స్‌ని తగ్గించాయి. మరోవైపు జియో క్రమంగా తన ప్లాన్ల రేట్లు పెంచుతూ పోయింది. ఇండియాలో రూ.50 ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిద నెట్‌వర్క్‌లు అందిస్తున్న ప్లాన్లను పరిగణలోకి తీసుకుంటే సగటున ఒక జీబీ డేటాను వినియోగించేందుకు రూ. 50 ఖర్చు పెడుతున్నారు భారతీయులు, ఇదే సమయంలో పొరుగున్న ఉన్న శ్రీలంక రూ. 28, బంగ్లాదేశ్ రూ.25వరకు ఖర్చు వస్తోంది. ఇండియాలో పోల్చితే శ్రీలంక, బంగ్లాదేశలలోనే డేటా ప్లాన్లు తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఇజ్రాయిల్ నెంబర్ వన్ మరో ఆసియా దేశమైన ఇజ్రాయిల్‌లో ఇంటర్నెట్ డేటా రేట్లు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి,. ఇజ్రాయిల్ ప్రజలు వన్ జీబీ డేటా కోసం రీఛార్జ్‌పై చేస్తున్న ఖర్చు కేవలం రూ.3 మాత్రమే.ప్రపంచంలో అతి తక్కువ ధరకే డేటా సర్వీసులు అందిస్తున్న దేశంతా ఇజ్రాయిల్ రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత కిర్కిజిస్తాన్ రూ. 13, ఫిజీ రూ. 18, ఇటలీ రూ, 20. సుడాన్ రూ, 20, రష్యా రూ. 21, మోల్డోవా దీవీ రూ. 23, చీలీలో రూ. 29 వంతున ఒక జీబీ డేటాపై ఛార్జ్ చేస్తున్నారు. తక్కువ ఛార్జీలు వసులూ చేస్తున్న ఇంటర్నెట్ డేటా అందిస్తోన్న టాప్ టెన్ దేశాల్లో అత్యధిక జనాభా ఉన్న చైనా, భారత్‌లతో పాటు టెక్నాలజీలో ఎప్పుడూ ముందుండే అమెరికాలకు స్థానం దక్కలేదు. అత్యంత పేద దేశమైన సుడాన్ అగ్ర రాజ్యాలకంటే తక్కువ ధరకే నెట్ అందిస్తోంది. సుడాన్లో టెలికాం కంపెనీలు 1 జీబీ డేటాకు సగటున రూ.20 వసూలు చేస్తున్నాయి. -
పాతబస్తీలో యువతి విక్రయం
సాక్షి, చాంద్రాయణగుట్ట: దుబాయిలో నర్సు ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించిన ఓ దళారి చాంద్రాయణగుట్టకు చెందిన యువతిని సుడాన్ షేక్‌కు విక్రయించింది. దుబాయిలో నరకం అనుభవిస్తున్న ఆ యువతి ఎంతో కష్టపడి తన కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసింది. దీంతో ఆ యువతిని భారత్‌కు రప్పించాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు, ఎంబీటీ అధికార ప్రతినిధి అంజదుల్లాఖాన్ విదేశీ వ్యవహారాల శాఖకు ఈమెయిల్లో విన్నవించుకున్నారు. బండ్లగూడ గౌస్‌నగర్ హుందాహిల్స్‌కు చెందిన నర్సుగా పనిచేసేది. ఈ సమయంలో వట్టెపల్లికి చెందిన ఫాతిమా అనే మహిళకు ఆమె పరిచయమయ్యింది. షార్జాలోని ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తే నెలకు రూ.40 వేలు వస్తాయని, అక్కడ తనకు తెలిసిన వారున్నారని నమ్మించి నూర్జహాన్ను గత డిసెంబర్ 15న షార్జాకు పంపించింది. అక్కడ ఆమెను అమ్మర్ అహ్మద్ ఉమర్ అనే వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లాడు. అమ్మర్ ఇంట్లో గతంలో ఫాతిమాతో కలిసి ఉండే నజ్మీన్ అనే బాలికను నూర్జహాన్ చూసింది. మూడు నెలల కాంట్రాక్ట్ మ్యారేజ్ కింద నజ్మీన్‌ను పంపించినట్లు సదరు యువతికి తెలిసింది. అమ్మర్ తాను ఫాతిమాకు రూ.2 లక్షలు చెల్లించినట్టు ఆ యువతికి చెప్పాడు. ఫాతిమాకు అమ్మర్ ద్వారా ఫోన్ కాల్ రావడంతో ఆమె తల్లి వద్దకు వెళ్లి ఆమె ముందు రూ.2 లక్షలు పెట్టి వీడియో తీసి షేక్‌కు పంపించారు. అనంతరం డబ్బు తిరిగి వెనక్కి తీసుకున్నారు. ఈ వీడియా చూసిన అనంతరం ఆ యువతి నాలుగు రోజులపాటు షేక్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై తాను పడుతున్న నరకాన్ని వాట్సాప్ వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు వెల్లడించింది. కాగా బాధిత కుటుంబం నుంచి ఇంకా ఫిర్యాదు అందలేదని చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ రుద్ర భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. -
అక్కడ నిషేధించారు.. మన దేశంలో ఎప్పుడు?
న్యూఢిల్లీ : లైంగిక కోరికలు కలుగకుండా ఉండేందుకు బాలికలకు ‘ఫిమేల్ జెనిటల్ మ్యుటేషన్ (ఎఫ్‌జీఎం) టైప్–3’ నిర్వహించే రాక్షస దురాచారాన్ని నిషేధిస్తూ సూడాన్ దేశం మే 1వ తేదీన చట్టం తీసుకొచ్చింది. ఈ ఆచారాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ బాధ్యులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చారు. కరోనా వార్తల కారణంగా ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూడాన్‌లో 87 శాతం బాలికలకు టైపు–3 జెనిటల్ మ్యుటేషన్ నిర్వహిస్తారు. మహిళల అంగాల్లో లైంగిక వాంఛను ప్రేరేపించే అంగాన్ని తొలగించడాన్ని జెనిటల్ మ్యుటేషన్ అని వ్యవహరిస్తారు. ఈ దురాచారం భారత్‌లోని ‘బొహ్రా’ జాతి ప్రజల్లో కూడా ఉంది. ఆ జాతిలో ఆరేడేళ్ల వయస్సు వచ్చిన బాలికల్లో 75 నుంచి 80 శాతం ఎఫ్‌జీఎల్‌ను నాటు పద్ధతిలో నిర్వహిస్తారు. దీన్ని ‘కఫ్జ్ లేదా కాట్నా’ అని కూడా వ్యవహరిస్తారు. భారత్‌లో దాదాపు 20 లక్షల మంది బొహ్రా జాతి జనులు ఉన్నారు. వారిలో ఇప్పటికీ కొనపాగుతున్న ఈ దురాచారాన్ని నిషేధించాల్సిందిగా ఎన్నో దశాబ్దాలుగా సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తోన్న భారత్ ప్రభుత్వాలు ఇంతవరకు స్పందించలేదు. ఆ ఆచారం వారిలో లేదని కొట్టేస్తూ వచ్చాయి. లేనప్పుడు నివారణ చట్టం తీసుకొస్తే వచ్చే నష్టం ఏముందన్న మహిళా సంఘాల ప్రశ్నకు, ఇండియన్ పీనల్ కోడ్, ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్యువల్ అఫెన్సెస్ చట్టాలు సరిపోతాయంటూ వాదిస్తూ వచ్చాయి. ఈ దురాచారంపై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలయిన ఓ పిటిషన్ ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. (షాకింగ్ : కరోనాకు ముందు - ఆ తర్వాత!) -
సుడాన్ ప్రధానిపై ఉగ్రదాడి
కైరో: సుడాన్ ప్రధాని అబ్దల్లా హమ్దోక్‌కు త్రుటిలో ప్రాణా పాయం తప్పింది. సోమవారం రాజధాని ఖార్టూమ్‌లో ఓ సమావేశంలో పాల్గొనేందుకు హమ్దోక్ వెళుతుండగా ఆయన వాహనశ్రేణిపై ఉగ్రవాదులు బాంబుదాడికి పాల్పడ్డారు. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా, నియంత పాలన సాగిస్తున్న అధ్యక్షుడు అల్ బషర్ గతేడాది ప్రజాస్వామ్య తిరుగుబాటు కారణంగా పదవీచ్యుతుడవగా, ప్రధాని పీఠాన్ని హమ్దోక్ అధిరోహించాడు. అయితే, ఇప్పటికీ పాలనను వెనకనుండి నడిపిస్తున్న మిలటరీ నాయకులు.. హమ్దోక్‌కు పూర్తి అధికారాలు అప్పగించేందుకు సుముఖంగా లేరు. అలాగే ఏడాది నుంచి దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ద్రవ్యోల్బణం 60 శాతానికి చేరగా, నిరుద్యోగిత 22.1శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో హమ్దోక్పై దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
అయ్యో పాపం.. ఎంత దీనస్థితి!
సుడాన్: అడవికి రారాజు సింహం అంటారు. అలాంటి సింహం పేరు వినగానే దట్టమైన జూలు, దిట్టమైన శరీరాకృతితో ఊహాల్లోకి రాగానే వెన్నులో వణుకు పుడుతుంది. మృగరాజు గంభీరమైన గాండ్రింపు వినపడితే చాలు గుండెల్లో పిడుగు పడినంత పనవుతుంది. ఇక ఆఫ్రికా జాతి సింహాల గురించి అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వాటిని సినిమాల్లో చూసే అమ్మో అనుకుంటాం. ఆఫ్రికా దేశమైన సుడాన్‌లోని అల్ ఖురేషీ పార్క్‌లో సింహాలు దీనికి భిన్నంగా కన్పిస్తున్నాయి. వాటిని చూస్తే భయపడాల్సింది పోయి అసలు అవి సింహాలా లేక ఏవైనా పెద్ద జాతి పిల్లులా అనేలా తయారయ్యాయి. ఇక ఆ పార్కుకు వచ్చిన సందర్శకులకు వినోదం సంగతి అటుంచితే వాటిని చూసి అయ్యో పాపం అనుకుంటున్నారు. బక్క చిక్కిపోయి ఎముకల గూడులా తయారైన ఆ సింహాల దీనస్థితిని చూసి తట్టుకోలేక ఓ సందర్శకుడు వాటి ఫొటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సింహాలను చూసి నెటిజన్లంతా షాకవుతూ వాటి పరిస్థతిని చూసి జాలి పడుతున్నారు. ఆర్థిక సంక్షోభంలో సూడాన్.. ప్రస్తుతం సూడాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో అక్కడ ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి తోడు కరెన్సీ కొరత అక్కడి ప్రజలను బాధిస్తోంది. సూడాన్‌లోని అంతర్యుద్ధం లక్షలాది మంది పాలిట శాపంగా మారింది. కడుపు నింపుకోవడానికి నాలుగు మెతుకులు కూడా దొరకని దుస్థితితో మనుషులు అల్లాడిపోతుంటే, మూగజీవాలు కూడా ఆకలికి అలమటించి పోతున్నాయి. సూడాన్ రాజధాని కార్టోమ్లోని అల్ ఖురేషి పార్క్‌లోని సింహాలకు అయితే కొన్ని వారాలుగా తినేందుకు తిండి కూడా లేదు. అంతేకాదు అనారోగ్యానికి గురైన సింహాలకు సరైన చికిత్స, మందులు అందుబాటులో లేవు. ఎముకలు శరీరంలో నుంచి బయటకు చొచ్చుకొచ్చి సింహాలు దీనంగా కన్పిస్తున్నాయి. ఆ పార్క్‌కు వచ్చిన సందర్శకులు వాటి రూపాలను చూసి అయ్యో పాపం అంటున్నారు. సింహాలకు కొన్ని వారాలుగా ఆహారం లేక ఆకలితో అలమటిస్తూ లేవలేని పరిస్థితికి వచ్చాయి. ఒక సింహాన్ని అయితే తాడుతో కట్టేసి దానికి డ్రిప్ ద్వారా ద్రవాలను అందిస్తున్నారు. అక్కడి మృగరాజుల దుస్థితి చూసి జంతు ప్రేమికులు చలించిపోతున్నారు. -
సుడాన్లో కూలిన విమానం;18 మంది మృతి
ఖార్తూమ్ : ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే విమానం కుప్పకూలి 18 మంది మృతి చెందిన ఘటన సుడాన్లో చోటుచేసుకుంది. కాగా కుప్పకూలిన విమానం రష్యాకు చెందిన ఆంటోనోవ్ ఎన్-12 గా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఏడుగురు సిబ్బంది, 11 మంది పౌరుల్లో నలుగురు చిన్నారులు, ముగ్గురు న్యాయమూర్తులున్నట్లు అధికారులు ధృవీకరించారు. సుడాన్ రాజధాని వెస్ట్ డార్ఫర్‌లోని ఈఐ జెనీనియా ఎయిర్పోర్ట్ నుంచి గురువారం రాత్రి ఆంటోనోవ్ ఎన్-12 మిలటరి విమానం బయలుదేరింది. అయితే టేకాఫ్ తీసుకున్న ఐదు నిమిషాలకే ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
సూడాన్‌లో భారీ అగ్నిప్రమాదం
ఖార్టూమ్: ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో పరిశ్రమ నిండా మంటలు కమ్ముకొని 18 మంది భారతీయులను బతికుండగానే కాల్చేశాయి. సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని సీలా సిరామిక్ పరిశ్రమలో మంగళవారం ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 23 మంది మృతి చెందగా, వారిలో 18 మంది భారతీయులు ఉన్నారు. 130 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సూడాన్‌లోని భారత ఎంబసీ అధికారులు అక్కడికి చేరుకొని వివరాలను సేకరించారు. ఆ పరిశ్రమలో మొత్తం 68 మంది భారతీయులు పనిచేస్తున్నట్లు ఢిల్లీలోని అధికారులకు బుధవారం సమాచారం అందించారు. ఈ విషయం తెలిసిన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదం బారిన పడిన భారతీయుల వివరాలను వెల్లడించారు. అందులో 7 మంది కాలిన గాయాలతో ఆస్పత్రిపాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. మొత్తం 34 మంది భారతీయులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారని వెల్లడించింది. ఆ దేశంలోని భారత ఎంబసీ 24 గంటల హెల్ప్‌లైన్ +249–921917471ను ఏర్పాటు చేసింది. సిరామిక్ పరిశ్రమలోని ఎల్పీజీ ట్యాంకర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి తోడు ప్రమాదం జరిగిన చోట భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు ఉండడంతో ప్రమాద స్థాయి పెరిగింది. దీంతో పరిశ్రమ మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. -
సూడాన్ పేలుడు : పలువురు భారతీయులు సజీవదహనం
సూడాన్ దేశంలోని బహ్రీ పట్టణంలో సంభవించిన భారీ పేలుడు 18 మంది భారతీయులను పొట్టన బెట్టుకుంది. కోబర్ నైబర్‌హుడ్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని సలోమీ సిరామిక్ ఫ్యాక్టరీలోమంగళవారం ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ పేలడంతో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో మొత్తం 23 మంది సజీవ దహనమయ్యారు. మరో 330 మందికిపైగా తీవ్రంగా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది. ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదనీ కానీ 18 మంది చనిపోయినట్టుగా తెలుస్తోందని భారత రాయబార కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. మృతదేహాలు కాలిపోవడం వలన గుర్తింపు సాధ్యం కావడం లేదని వెల్లడించింది. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయుల జాబితాను విడుదల చేసింది. ఈ ప్రమాదంనుంచి బయటపడిన దాదాపు 34 మంది భారతీయులను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలిపింది. సెరామిక్స్ ఫ్యాక్టరీలో అవసరమైన భద్రతా పరికరాలు లేవని, నిల్వ చేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫ్యలం కారణంగానే మంటలు వ్యాపించాయని ప్రభుత్వం తెలిపింది, దర్యాప్తు మొదలైందని వెల్లడించింది. మరోవైపు ఈ సంఘటనలో 23 మంది మృతి చెందారని, 130 మందికి పైగా గాయపడ్డారని సుడాన్ ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ నివేదిక పేర్కొంది. కాగా ప్రమాదం తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. -
సూడాన్‌లో 101 మంది మృతి
ఖర్టౌమ్: సూడాన్ రాజధాని ఖర్టౌమ్‌లో మిలిటరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినవారిపై జరిపిన కాల్పుల్లో 101 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికిపైగా గాయాలపాలయ్యారు. గాయపడిన వారికి వైద్యం చేసేందుకు ఖర్టౌమ్లోని ఆసుపత్రుల్లో తగినంత మంది వైద్య సిబ్బందిగానీ, సదుపాయాలు గానీ అందుబాటులో లేవు. సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్–బషీర్ నియంతృత్వ పాలనపై నెలల తరబడి ఆందోళనలు జరుగుతుండగా, ఆ దేశ మిలిటరీ ఈ ఏడాది ఏప్రిల్‌లో బషీర్‌ను పదవి నుంచి దింపేసింది. మరో మూడేళ్లలో పౌర పాలన మళ్లీ మొదలయ్యేలా ఓ ఒప్పందం కుదిరింది. అప్పటివరకు దేశ పాలనకు మిలిటరీ కౌన్సిల్ ఏర్పాటైంది. ఈ కౌన్సిల్ పాలనను వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా అనేక మంది ఆర్మీ ప్రధాన కార్యాలయం బయట నిరసనలు తెలుపుతుండగా, సోమ, మంగళ వారాల్లో ఆ నిరసనకారులను అణచివేసేందుకు ఆర్మీ కాల్పులకు దిగింది. ఆసుపత్రుల్లోనూ వైద్యులు, ఇతర సిబ్బందిపై సూడాన్ భద్రతా దళాలు దాడులు చేస్తున్నాయని వైద్యుల సంఘం ఆరోపించింది. కాల్పుల ఘటనలను ఖండించి, ఆందోళనకారులకు, మిలిటరీకి మధ్య సయోధ్య కుదర్చాలంటూ ఐక్యరాజ్యసమితికి వచ్చిన ఓ తీర్మానాన్ని చైనా, రష్యాలు అడ్డుకున్నాయి. 8 యూరప్ దేశాలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేస్తూ కాల్పులను ఖండించాయి. కాల్పుల ఘటనల్లో 101 మంది చనిపోవడంతో మిలిటరీతో చర్చలు జరిపేందుకు నిరసనకారులు నిరాకరించారు. 101లో 40 మంది మృతదేహాలు నైలునదిలో లభించాయి. -
సూడాన్‌లో సైనిక తిరుగుబాటు
ఖార్టూమ్: ఆఫ్రికా దేశం సూడాన్‌లో సైనిక తిరుగుబాటు జరిగింది. దేశాన్ని దాదాపు మూడు దశాబ్దాలపాటు పాలించిన అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్(75)ను పదవీచ్యుతుడిని చేసి, గృహ నిర్బంధంలో ఉంచినట్లు గురువారం సైన్యం ప్రకటించింది. ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ రాజధాని ఖార్టూమ్ వీధుల్లో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. సైన్యంలో బ్రిగేడియర్‌గా ఉన్న బషీర్ 1989లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని గద్దె దింపి, అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆఫ్రికాలో ఎక్కువ కాలం అధికారం చెలాయించిన పాలకుల్లో ఒకరైన బషీర్.. ఇస్లామిక్ తీవ్రవాదుల అండతో నియంతృత్వ విధానాలను అవలంభించారు. అల్‌ఖాయిదా చీఫ్ బిన్‌లాడెన్ వంటి వారు 1996 వరకు సూడాన్‌లోనే ఆశ్రయం పొందారు. బషీర్ విధానాల కారణంగా దేశంలో అంతర్యుద్ధం చెలరేగింది. దాదాపు 3 లక్షల మంది ప్రజలు ఊచకోతకు గురికాగా, 2.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అనంతరం దేశం నుంచి ఉత్తర సూడాన్ విడిపోయింది. -
మూడు నెలల కోసం కాంట్రాక్ట్ పెళ్లి..
మైలార్‌దేవ్‌పల్లి: మూడు నెలల కోసం కాంట్రాక్ట్ పెళ్లి కుదుర్చుకున్న సూడాన్ దేశస్తుడిని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే..సూడాన్‌కు చెందిన మహ్మద్ బండ్లగూడలోని పెళ్లిళ్ల బ్రోకర్‌ను సంప్రదించి ఓ యువతిని కాంట్రాక్టు పెళ్లి చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. పెద్ద మొత్తంలో డబ్బులు ఏరవేసిన అతను మహ్మద్ అబీబ్‌ఖాన్, షమీమ్ సుల్తానా, షబానాబేగం సహకారంతో బాధితురాలి తల్లిదండ్రులను ఒప్పించారు. ఇందుకుగాను బాధితురాలి కుటుంబ సభ్యులకు 1.10 లక్షల నగదు, 300 సూడాన్ డాలర్లు ఇచ్చాడు. దీనిపై సమాచారం అందడంతో దాడులు నిర్వహించి ఎస్ఓటీ పోలీసులు నిందితుడు మహ్మద్‌తో పాటు పెళ్లికి సహకరించిన నలుగురు బ్రోకర్లను అరెస్ట్ చేసి మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. -
విద్యార్థుల పడవ మునక.. 22 మంది మృతి..!
ఖర్టోమ్, సుడాన్ : నైలు నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులను స్కూలుకు తీసుకెళ్తున్న పడవ బుధవారం నీట మునిగింది. ఈ ఘటనలో 22 మంది విద్యార్థులు నీట మునిగి చనిపోయి ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. సుడాన్ రాజధాని ఖర్టోమ్‌కు 750 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందనీ, ప్రమాద సమయంలో పడవలో 40 మంది విద్యార్థులున్నారని సునా వార్తా సంస్థ తెలిపింది. నదిలో తీవ్ర అలజడి రేగడంతో ఇంజన్ వైఫల్యం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా, విద్యార్థుల మృతదేహాల కోసం గాలింపు చేపట్టారు. ప్రమాదం విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు మర బోట్లలో వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న మిగతావారిని సహాయక బృందాలు రక్షించాయి. మృతుల్లో ఒక మహిళ కూడా ఉంది. పిల్లలంతా ప్రైమరీ విద్యనభ్యసిస్తున్నవారే. -
నా ప్రియ నేస్తానికి ఈ సెంచరీ అంకితం : రోహిత్
బ్రిస్టన్: టీ20 సిరీస్ గెలుపుతో టీమిండియా సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో మంచి శుభారంభం చేసింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో శతకంతో విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా ఓపెనర్ రోహిత శర్మ ఆ సెంచరీని తనకు ఇష్టమైన సూడాన్‌కు అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన తెల్లని ఖడ్గ మృగం సూడాన్ గత మార్చిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కెన్యాలోని ద్వార్ క్రలోవే జూలోని 45 ఏళ్ల ఖడ్గ మృగం మరణంపై ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. అందులో రోహిత్ శర్మ కూడా ఒకడు. సోమవారం ట్విటర్లో ‘ నిన్నటి నా సెంచరీని చనిపోయిన నా ప్రియ నేస్తం సూడాన్‌కు అంకితమిస్తున్నాను. మనమంతా మంచి జీవనానికి ఓ మార్గం కనుగోవాలనేమో’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో ఇది తెగ వైరల్ అయింది. ఈ అరుదైన రైనో మరణంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సైతం అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మనమంతా సూడాన్ రక్షించడంలో విఫలమయ్యాం. జంతు ప్రేమికులారా ఇప్పటికైనా మేల్కొనండి, రైనోస్ అన్నిటిని రక్షిద్దాం.’ అని పిలుపునిచ్చాడు. శతకంతో ఆకట్టుకున్న రోహిత్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌తో పాటు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లభించిన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్ జూలై 12న ప్రారంభం కానుంది. Yesterday’s innings is dedicated to my fallen friend Sudan 🦏 May we find a way to make this world a better place for all of us. pic.twitter.com/wayEjDlUyA — Rohit Sharma (@ImRo45) July 9, 2018 -
మసీదులో ప్రార్థన చేస్తుండగా దారుణం
కసాల(సూడాన్) : మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తున్న వారిపై ఓ గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అగంతకుడి కత్తి దాడిలో ముగ్గురు మృత్యువాత పడగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన సూడాన్‌లోని కసాల నగరంలో మంగళవారం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక కసాల నగరంలోని ఓ మసీదులో సాయంకాల ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో మసీదులోకి ప్రవేశించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి వారితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయితే ఎవ్వరూ తనకు బదులు చెప్పకపోవడంతో ఆగ్రహించిన దుండగుడు వెంట తెచ్చుకున్న కత్తితో ప్రార్థన చేస్తున్న వారిపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో ముగ్గురు మరణించగా, మరికొందరికి గాయాలయ్యాయి. కొంత సమయం తర్వాత తేరుకున్న అక్కడి వారు ఆ దుండగుడిపై దాడిచేసి చంపేశారు. గాయాలైన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కసాల రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయని, వందల మంది సూడాన్ సైనికులు నగరాన్ని మోహరించినా ఇలాంటివి జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. -
అల్విదా మేరా దోస్త్..
మరణానికి మరికొన్ని క్షణాలు.. ఓ జాతి అంతరించడానికి మరికొన్ని క్షణాలు.. సూడాన్ శాశ్వత నిద్రకు మరికొన్ని క్షణాలు.. రిజర్వు పార్కు రేంజర్ ముథాయ్ పరుగుపరుగున వచ్చాడు.. మరికొన్ని క్షణాల్లో ఈ లోకాన్ని విడిచివెళ్తున్న తన మిత్రుడికి తుది వీడ్కోలు పలకడానికి.. సూడాన్‌ను చూడగానే ఎప్పుడూ తన మోముపై వికసించే నవ్వు నేడు నేలరాలింది.. రెప్పచాటు ఉప్పెన కట్టలు తెంచుకుంది..అక్కడే అలా కూలబడ్డాడు..సూడాన్‌ను ప్రేమగా నిమిరాడు..చివరిసారిగా... అల్విదా మేరా దోస్త్.. సూడాన్.. ప్రపంచంలోనే ఏకైక మగ నార్తర్న్ వైట్ రైనో(45).. ఒకప్పుడు ఉగాండా, సూడాన్, కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో ఎక్కువగా ఉండేవి. కొమ్ముల కోసం వేటగాళ్లు ఈ ఖడ్గమృగాలను విచ్చలవిడిగా వధించడంతో అంతరించే దశకు చేరాయి. చివరికి మగ నార్తర్న్ వైట్ రైనోల్లో సూడాన్ ఒక్కటే మిగిలింది. ఆ జాతి అంతరించిపోయే పరిస్థితి ఏర్పడటంతో చెక్ రిపబ్లిక్‌లోని జూలో ఉన్న దీన్ని 2009లో కెన్యా ఫారెస్టు రిజర్వ్ పార్కుకు తెచ్చారు. సూడాన్‌తోపాటు రెండు ఆడ నార్తర్న్ వైట్ రైనోలనూ కూడా తెచ్చి.. సంతానోత్పత్తి చేయించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వేటగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు సూడాన్‌కు సాయుధ రక్షణను కూడా ఏర్పాటు చేశారు. వాచ్ టవర్స్, డ్రోన్లు, వేట కుక్కలు వంటివాటిని పెట్టారు. దీంతో సూడాన్ ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీ అయింది. లక్షల మంది దీన్ని చూడ్డానికి వచ్చేవారు. అయితే, వీటి సంతతిని పెంచడానికి శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తర్వాత తర్వాత సూడాన్ ఆరోగ్యం క్షీణించింది. కనీసం లేవలేని పరిస్థితి వచ్చింది. దీని బాధను చూడలేక సూడాన్‌కు కారుణ్య మరణం ప్రసాదించినట్లు మంగళవారం రిజర్వు పార్కు ప్రకటించింది. ఓ వైద్యుడు ఇంజెక్షన్ ద్వారా సూడాన్‌కు విముక్తినిచ్చినట్లు తెలిపింది. అది జరడానికి కొన్ని క్షణాల ముందు.. సూడాన్ మృత్యువు ముంగిట ఉన్న సమయంలో తీసిన చిత్రమే ఇది. ప్రకృతి పట్ల, సాటి జీవుల పట్ల మానవుడు చూపుతున్న క్రూర స్వభావానికి నిదర్శనంగా సూడాన్ చరిత్రలో నిలిచిపోతుందని రిజర్వు పార్కు సీఈవో రిచర్డ్ అన్నారు. ‘కేవలం తన జాతికే కాదు.. మానవుడి అక్రమ కార్యకలాపాల వల్ల అంతరించిపోయే దశలో ఉన్న అనేక వేల జంతు, పక్షి జాతులకు ప్రతినిధిగా వ్యవహరించాడు’అని చెప్పారు. మిగిలినవి రెండూ ఆడ ఖడ్గమృగాలు కావడంతో ఇక ఈ జాతి అంతరించినట్లే అని చెబుతున్నారు. అయితే, శాస్త్రవేత్తలు చనిపోయే ముందు సూడాన్ జెనెటిక్ మెటీరియల్‌ను సేకరించారని.. ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఈ జాతిని రక్షించేందుకు తమ ప్రయత్నాలు సాగుతాయని రిచర్డ్ చెప్పారు. -
ప్చ్... ‘సూడాన్’ అస్తమయం
జుబూ : ప్రపంచంలో చిట్టచివరగా మిగిలిన మగ తెల్ల ఖడ్గ మృగం ‘సూడాన్’ కన్నుమూసింది. 45 ఏళ్ల వయసున్న ఈ అరుదైన జీవి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. మంగళవారం ఉదయం సూడాన్ మృతి చెందినట్లు ఓఎల్ పెజెటా పార్క్ నిర్వాహకులు ప్రకటించారు. వేటగాళ్ల బారి నుంచి కంటికి రెప్పలా కాపాడుకోవడానికి మూడేళ్ల నుంచి సూడాన్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. దీని పరిరక్షణ కోసం కెన్యా ప్రభుత్వం ఇప్పటిదాకా కోట్లలో ఖర్చు చేసి మరీ భద్రతను ఏర్పాటు చేయించింది. వీవీఐపీ వైట్రైనోగా ఇది బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా గతేడాది డేటింగ్ యాప్‌లో విరాళాల సేకరణ చేపట్టిన సూడాన్ పేరు.. ప్రపంచ వ్యాప్తంగా మారు మోగిపోయింది. ప్రపంచంలో అంతరించి పోతున్న జంతువులలో తెల్ల ఖడ్గ మృగాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటిదాకా మిగిలినవి 3 మాత్రమే. అందులో సూడాన్ ఒకటి కాగా.. మిగిలిన రెండూ ఆడవి. వీటి సంతానోత్పత్తి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకుండానే సూడాన్ కన్నుమూయటం విశేషం. -
మరణశయ్యపై ‘సూడాన్’.. అద్భుతం జరగాల్సిందే!
జుబూ : అది ఓ ఖడ్గ మృగం... దాన్ని చుట్టూ జడ్ ప్లస్ కేటగిరి స్థాయిలో భద్రత. 24 గంటలూ కమాండోలు దానికి కాపలా కాస్తుంటారు. ఇది సాధారణ రైనో కాదు. కానీ, ఈ భూమ్మీద మిగిలిన ఒక్కగానోక్క మగ తెల్ల ఖడ్గ మృగం అది. దాని పేరే సూడాన్. ప్రస్తుతం అది చివరి క్షణాలకు చేరుకోగా.. అధికారుల్లో కంగారు నెలకొంది. వేటగాళ్ల నుంచి కంటికి రెప్పలా కాపాడుకోవడానికి మూడేళ్ల నుంచి సూడాన్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. ప్రపంచంలో అంతరించి పోతున్న జంతువులలో తెల్ల ఖడ్గ మృగాలు కూడా ఉన్నాయి. ఇప్పటిదాకా మిగిలినవి 3 మాత్రమే. అందులో సూడాన్ ఒకటి కాగా.. మిగిలిన రెండూ ఆడవి. సంతానోత్పత్తి కోసం ఈ మూడింటిని ఒకే చోట చేర్చారు. అయితే సూడాన్ అనారోగ్యంతో అధికారుల్లో కంగారు మొదలైంది. దానికి ఏమైనా అయ్యిందో ఇక తెల్ల ఖడ్గమృగాల వంశం అంతరించినట్లేనని భయపడుతున్నారు. గతేడాది డేటింగ్ యాప్‌లో విరాళాల సేకరణ ద్వారా దీని పేరు మారు మోగిపోయింది. సాధారణంగా వీటి జీవిత కాలం 50 సంవత్సరాలు. ఇప్పుడు దీని వయస్సు 46 ఏళ్లు. గతేడాది దాని కాలుకి ఇన్ఫెక్షన్ సోకింది. అది నయమవుతున్న సమయంలో మరో కాలికి సోకింది. చికిత్స అందిస్తున్న ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోందని, ఏదైనా అద్భుతం జరిగి అది త్వరగా కోలుకోవాలని సంరక్షకులు ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు అది చనిపోక ముందే సంతానోత్పత్తి చేసే సాధ్యాసాధ్యాలపై శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. -
మరణశయ్యపై ‘సూడాన్’.. అద్భుతం జరగాల్సిందే!
-
ఒక్క ఫోటో ఆమె జీవితాన్ని మార్చేసింది
సాక్షి : అతి కష్టం మీద వెలుగులోకి వచ్చే కొన్ని నిజాలు భరించటానికి కూడా కష్టంగానే ఉంటాయి. సుడాన్‌కు చెందిన ఓ మోడల్ జీవితం ఒక్క ఫోటోతో ఎలా మారిపోయిందంటే.. రాత్రికి రాత్రే ఆమెను ఈ భూమ్మీద అత్యంత అందగత్తెగా మార్చి పడేసింది. Big thank you to @thesunk for capturing this moment. Amazing photographer. Couldn't be happier A post shared by Anok (@anokyai) on Oct 22, 2017 at 5:47am PDT అనోక్ యాయి.. వాషింగ్టన్లో హోవార్డ్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో ఓ ఫోటోగ్రాఫర్‌ని ఆమె సౌందర్య బాగా ఆకర్షించింది. దీంతో అతను ఓ ఫోటో తీసి దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఆ క్రమంలో ఓ చిత్రం ఆమె జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు బోలెడంత మంది అభిమానులను సంపాదించిపెట్టింది. మోడలింగ్ రంగంలోకి ప్రవేశించటమే కాదు.. తక్కువ కాలంలోనే ఆమెను సూడాన్ లేడీ సూపర్‌గా చేసేసింది. The leaves match my skin 🍂 A post shared by Anok (@anokyai) on Oct 27, 2017 at 3:39pm PDT ఈ క్రమంలో ఎక్కడా ఆమెపై జాతి వివక్ష కామెంట్లు రాకపోవటం విశేషం. ప్రస్తుతం ఆమె సంపాదన గంటకు 15,000 వేల డాలర్లపైగానే ఉందంట. అంతర్జాతీయ మాగ్జైన్లు సైతం టాప్ సెక్సీ మోడళ్లను పక్కన పడేసి ఇప్పుడు ఆమె ముఖచిత్రం కోసం ఎగబడిపోతున్నాయి. Excited to announce that I am now signed with @nextmodels Thank you to everyone that's supported me along the way; hope you follow me on this journey #TheNextNext A post shared by Anok (@anokyai) on Oct 31, 2017 at 1:50pm PDT -
సంచలనం: ఆదేశానికి రాజుగా భారతీయుడు
భారతీయులు ఎక్కడ ఉన్నా సంచలనాలకు మారుపేరుగా నిలుస్తుంటారు. తాజాగా మరో 24ఏళ్ల భారతీయ యువ వ్యాపారవేత్త మరో సంచలన ప్రకటన చేశాడు. రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న భూభాగానికి రాజుగా ప్రకటించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఈజిప్టు, సుడాన్ దేశాల సరిహద్దులో వివాదాస్పంగా ఉన్న బిర్‌తావిల్ ప్రాంతానికి స్వయం ప్రకటిత రాజుగా ప్రకటించుకున్నాడు ఓ భారతీయుడు. ఈజిప్టు, సుడాన్‌ల మధ్య 2060 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న కొంత భూభాగం ఉంది. ఆప్రాంతం తమది కాదంటే తమది కాదంటూ రెండు దేశాలు పరస్పరం వాదించుకుంటున్నాయి. అది ఉగ్రవాదులు సంచరించే ప్రాంతం కావడంతో రెండు దేశాలు ఆప్రదేశంపై వెనక్కి తగ్గాయి. ఇండోర్‌కు చెందిన యువ పారిశ్రామిక వేత్త సుయాష్ దీక్షిత్ కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి బిర్‌తావిల్‌కు రాజుగా ప్రకటించుకున్నాడు. ఆప్రాంతానికి 'కింగ్డమ్ ఆఫ్ దీక్షిత్' అని పేరుకూడా పెట్టకున్నాడు. అంతేకాదు దేశంగా ప్రకటించుకున్న సందర్భంగా అక్కడ ఓ విత్తనం నాటి నీరు కూడా పోశాడు. ఇక నుంచి ఈ ప్రాంతానికి రాజును నేనేనంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అంతేకాకుండా తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా ఆదేశానికి అధ్యక్షుడిగా తన తండ్రి పేరు ప్రకటించాడు. హ్యాపీ బర్త్‌డే పప్పా అంటూ తన వాల్‌పై రాసుకున్నాడు. అనంతరం కింగ్డమ్ ఆఫ్ దీక్షిత్‌ను దేశంగా పరిగణించాలంటూ ఐక్యరాజ్యసమితికి ఆన్లైన్లో ఓదరఖాస్తు కూడా పెట్టుకున్నాడు. ఇప్పటి వరకూ తనకు 800 మంది మద్దతు పలికారని పేర్కొన్నాడు. కింగ్డమ్ ఆఫ్ దీక్షిత్ వివరాలు దేశం పేరు: కింగ్డమ్ ఆఫ్ దీక్షిత్ జెండా: పైన చిత్రంలో ఉంది ప్రస్తుత జనాభా: 1 రాజధాని: సుయాష్‌పూర్ పాలకుడు: సుయాష్ రాజు ఏర్పాటు తేది: నవంబర్ 5, 2017 జాతీయ జంతువు: బల్లి -
హీరో ట్వీట్‌కు స్పందించిన కేంద్ర మంత్రి
ముంబై: దక్షిణ సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు చర్యలను వేగవంతం చేయాలంటూ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరాడు. భద్రత బలగాలకు, ప్రభ్యుత్వ వ్యతిరేక వర్గాలకు మధ్య జరుగుతున్న పోరులో జూబా నగరం అల్లకల్లోలంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడున్న భారతీయులను సురక్షితంగా తరలించాలని అక్షయ్ కుమార్ చేసిన ట్వీట్‌కు సుష్మా స్వరాజ్ స్పందించారు. 'అక్షయ్ కుమార్ గారు ఆందోళన చెందకండి. జూబా నుంచి భారతీయులను సురక్షితంగా తరలిస్తున్నాం' అని సుష్మా ట్విట్టర్లో సమాధానమిచ్చారు. సుడాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశం తరలించేందుకు విదేశాంగ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
సూడాన్
ఖండం: ఆఫ్రికా వైశాల్యం: 18,86,068 చదరపు కిలోమీటర్లు జనాభా: 3,72,89,406 (తాజా అంచనాల ప్రకారం) రాజధాని: ఖార్టూమ్ ప్రభుత్వం: డామినంట్ పార్టీ ఫెడరల్ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ కరెన్సీ: సూడాన్ పౌండ్ భాషలు: అరబిక్, ఇంగ్లిష్, నూబియన్, స్థానిక భాషలు మతం: 73 శాతం ఇస్లాం, 18 శాతం ఆటవిక తెగలు, 9 శాతం క్రైస్తవులు వాతావరణం: జనవరి 15 నుండి 32 డిగ్రీలు, జూన్ 26 నుండి 41 డిగ్రీలు. పంటలు: పత్తి, ఖర్జూరం, వేరుశనగ, నువ్వులు, గోధుమ, బీన్స్, జొన్నలు. పరిశ్రమలు: చమురుశుద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంటు స్వాతంత్య్రం: 1956, జనవరి 1 సరిహద్దులు: ఈజిప్టు, లిబియా, చాద్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, జైరీ, ఉగాండా, కెన్యా, ఇథియోపియా, ఎర్రసముద్రం. చరిత్ర ఆఫ్రికా ఖండంలో సూడాన్ అతిపెద్ద స్వతంత్ర దేశం. వైశాల్యంలో పెద్దగా ఉన్నా, నైలు నది ప్రవహిస్తున్నా దేశంలో ఎప్పుడూ ఆహారకొరత, కరువు, ఆర్థికమాంద్యం, రాజకీయ అస్థిరత మొదలైనవి దేశాన్ని పట్టి కుదిపేస్తూ ఉన్నాయి. ఉత్తర సూడాన్‌లో ముస్లింలు, దక్షిణ సూడాన్‌లో నలుపు ఆఫ్రికన్లు మధ్య భాగంలో స్థానిక తెగల ప్రజలు... ఇలా అనేక రకాల సాంప్రదాయాల ప్రజలు ఈ దేశంలో నివసిస్తూ తమ స్వంత అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఒక్కొక్కసారి యుద్ధాలు చేస్తున్నారు. ఒకప్పుడు సూడాన్‌లో రెండు ప్రత్యేకమైన నాగరికతలు వెల్లివిరిసాయి. ఒకటి నూబియా, రెండవది కుశ్. ఆరవ శతాబ్దంలో సూడాన్ ప్రాంతాన్ని పరిపాలించిన మూడు గొప్ప సామ్రాజ్యాలు క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నాయి. వారు దేశంలోకి ఇస్లాం మతం ప్రవేశించకుండా నిరోధించారు. అయితే 18వ శతాబ్దంలో ఈజిప్టు రాజు ముహమ్మద్ అలీ సూడాన్ ఉత్తర భాగాన్ని ఆక్రమించుకొని సూడాన్‌లో ఇస్లాం మతాన్ని వ్యాప్తిచేశాడు. ఇస్మాయిల్ పాషా అనే రాజు సూడాన్‌లో అన్ని భాగాలనూ ఆక్రమించి ఆ ప్రాంతానికి బ్రిటిష్ జాతీయుడిని గవర్నర్ జనరల్‌గా నియమించాడు.క్రీ.శ.1881లో దైవదూత అనబడే ముహమ్మద్ అహమది సూడాన్‌లో ఇస్లాం మతాన్ని పటిష్టం చేసి దేశంలో ఉన్న విదేశీయులను బయటికి తరిమేశాడు. అయితే 1898లో బ్రిటిషర్లు ఇక్కడి రాజులను ఓడించి దేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. చివరికి 1956లో దేశానికి స్వతంత్రం సిద్ధించింది. పరిపాలనా పద్ధతి దేశపాలన రాష్ట్రపతి చేతుల్లో ఉంటుంది. దేశంలో 18 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు. ఈ రాష్ట్రాలను తిరిగి 133 జిల్లాలుగా విభజించారు. ఆ 18 రాష్ట్రాలు... అల్ జజీరా, అల్ ఖదారిఫ్, బ్లూనైల్, రివర్నైత్, వైట్‌నైల్, సెంట్రల్ డర్ఫర్, ఈస్ట్ డర్ఫర్, నార్త్ డర్ఫర్, సౌత్ డర్ఫర్, వెస్ట్ డర్ఫర్, కస్సాలా, కార్టూమ్, నార్తర్న్ రెడ్సీ, నార్త్ ఖుర్దుఫాన్, సౌత్ ఖుర్దూప్రాన్, వెస్ట్ ఖుర్దూఫ్రాన్, సెన్నార్లు. ప్రజలు-సంస్కృతి సూడాన్ దేశంలో దాదాపు 597 తెగల ప్రజలు ఉన్నారు. వీరు 400కు పైగా భాషలను మాట్లాడతారు. అధికశాతం ఇస్లాం మత ప్రజలే కాబట్టి వీరంతా అరబ్బీ భాషను మాట్లాడతారు. పురుషులు సాధారణంగా పాదాల వరకు ఉండే పొడవాటి స్కర్ట్లాంటి దుస్తులు ధరిస్తారు. దీనిని జులాబియా అంటారు. మహిళలు కూడా ఇలాంటి స్కర్టునే ధరిస్తారు. అలాగే తలను కప్పుతూ మరో గుడ్డ చుట్టుకుంటారు. ముఖాన్ని పూర్తిగా కప్పుకోరు. వీరు రంగురంగుల దుస్తులు ధరిస్తారు. పురుషులు తలకు ప్రత్యేకమైన తలపాగా ధరిస్తారు. యువతీ యువకులు మాత్రం షర్టు, ప్యాంటు ధరిస్తారు. పంటలు-పరిశ్రమలు దేశ దక్షిణ భాగంలో పత్తి పంట అధికంగా పండుతుంది. వేరుశనగ, నువ్వులు, గోధుమ, జొన్న, బీన్స్ పంటలు కూడా ఈ దక్షిణ భాగంలోనే అధికంగా పండుతాయి. ఉత్తరభాగంలో నూబియన్, సహరా ఎడారులు ఉన్నాయి. ఇక్కడే నైలు నది ఈజిప్టు దేశంలోకి ప్రవేశిస్తుంది. సూడాన్ దేశంలో గమ్ అరబిక్ ప్రపంచంలోనే అధిక స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. దీనిని మందులు, ఇంకు తయారీలో ఉపయోగిస్తారు. వేరుశనగ కూడా బాగా పండుతుంది.బెంటియు ప్రాంతంలో చమురు, సహజ వాయువులను కనుగొన్నారు. దేశంలో సిగరెట్లు, భవన నిర్మాణ పరికరాలు, పెట్రోలియం ఉత్పత్తులు, చక్కెర, దుస్తుల పరిశ్రమలు ఉన్నాయి. ఆహారం సూడాన్ దేశస్థులు సాధారణంగా గోధుమ, జొన్న పిండితో చేసిన దళసరిగా వుండే రొట్టెలను తింటారు. బ్రెడ్డు, గొర్రె, మేక మాంసం అధికంగా తింటారు. ఫుల్ మెడమిస్ అనే ఆహారం దేశ వ్యాప్తంగా వాడుకలో ఉంది. ఇక దేశంలో బీరు, బ్రాందీ లాంటి మత్తుపానీయాలు పూర్తిగా నిషిద్ధం. అయితే ఖర్జూరపండ్లతో తయారుచేసే పానీయం చాలా మంది తాగుతారు. కిస్రా, అసీదా, గురస్సా, అనే పేర్లతో బ్రెడ్డు తయారుచేస్తారు. ఖార్టూమ్ నగరం దేశ రాజధాని ఖార్టూమ్ నగరం వైట్‌నైల్, బ్లూనైల్ నదుల మధ్య ప్రదేశంలో ఉంది. ఈ రెండు నదులు విక్టోరియా సరస్సు నుండి ప్రారంభమవుతాయి. అయితే బ్లూనైల్ జన్మస్థలం ఇథియోపియా. ఈ రెండు నదులు అల్ మోగ్రాన్ అనే ప్రదేశంలో కలుస్తాయి. ఒకప్పటి ఈజిప్టు రాజు ఈ ఖార్టూమ్ నగరాన్ని అభివృద్ధిపరిచాడు. జులై, ఆగస్ట్ నెలలలో ఇక్కడ బాగా వేడిగా ఉంటుంది. నగరంలో పారే నైలునది మీద అనేక బ్రిడ్జిలు నిర్మించారు. నగరం చుట్టూ ఉన్న మరో నాలుగు నగరాలు నెలకొని ఉన్నాయి. వీటిని నైలునది బ్రిడ్జిలు కలుపుతూ ఉంటాయి. నగరంలో ఉన్న నేషనల్ మ్యూజియంలో సూడాన్ దేశ గత చరిత్రను తెలియజేసే వస్తువులు, పరికరాలు ఆనవాళ్ళతో నిండి ఉంది. ప్యాలెస్ మ్యూజియం, రాష్ట్రపతి భవనం చూడదగిన నిర్మాణాలు. గ్రేట్ మాస్క్‌తో పాటు ఓమ్ డుర్మన్లో జరిగే ఒంటెల మార్కెట్ చూడదగినవి. చూడదగిన ప్రదేశాలు మేరో పిరమిడ్స్ పిరమిడ్లు అనగానే ఈజిప్టు గుర్తొస్తుంది. అయితే దేశంలో ఉన్న మేరో నగరంలో కూడా అద్భుతమైన పిరమిడ్లు ఉన్నాయి. ఈ నగరం నైలు నది తీరంలో ఉంది. ఈ నగరం ఒకప్పుడు కుష్ రాజులకు రాజధానిగా వెలుగొందింది. ఇక్కడ 200కు పైగా పిరమిడ్లు ఉన్నాయి. వీటిని మూడు గ్రూప్‌లుగా విబజించారు. ఈ పిరమిడ్లను నూబియన్ పిరమిడ్లు అనికూడా అంటారు. నూబియా ప్రాంతంలో కట్టారు కాబట్టి అలా పిలుస్తారు. ఈ ప్రాంతం ఒకప్పుడు ఈజిప్టు దేశంలో భాగంగా ఉండేది. పిరమిడ్లు కట్టడం అనే సాంప్రదాయం ఈజిప్టు రాజుల వంశంలో ఉండింది. అందుకే ఈ ప్రాంతంలో కూడా పిరమిడ్ల నిర్మాణం ఆ కాలంలో జరిగింది. ప్రస్తుతం చాలా పిరమిడ్లు శిథిల దశలో ఉన్నాయి. ఈ పిరమిడ్లు ఆరు నుండి ముప్పై ఫీట్ల ఎత్తులో నిర్మించబడ్డాయి. ఈ పిరమిడ్లలో ఆ కాలం నాడు మరణించిన వారి శవంతోపాటు ఎంతో బంగారం, ధనం ఉంచేవారు. వాటికోసం ఈ పిరమిడ్లను కొల్లగొట్టి ఆ ధనాన్ని దొచుకుపోయారు. గెబెల్ బర్కల్ పిరమిడ్లు గెబెల్ బర్కల్ ఒక చిన్న కొండ. ఇది దేశ ఉత్తర భాగంలో ఉంది. ఇది నైలు నది తీరంలో ఉంది. ఇక్కడ 200కు పైగా పిరమిడ్లు ఉన్నాయి. వీటిని కుష్ పిరమిడ్లు అని కూడా అంటారు. ఈజిప్టులో ఉన్న పిరమిడ్ల కన్నా ఇవి పొట్టిగా ఉంటాయి. ఈ ప్రాంతంలో ఈ పిరమిడ్లతోపాటు 13 దేవాలయాలు, మూడు రాజభవనాలు ఉన్నాయి. వీటిని 18వ శతాబ్దంలో కనుగొన్నారు. ఇవన్నీ పూర్వం ఈజిప్టు రాజులు నిర్మించినవే. ఈజిప్టు రాజు టుట్ మోస్-ఐఐఐ వీటిని నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతాన్ని తప్పక సందర్శిస్తారు. పోర్ట్ సూడాన్ ఈ ఓడరేవు సూడాన్ ఎర్ర సముద్ర తీరంలో ఉంది. 1909లో ఈ ఓడరేవును నిర్మించారు. అందమైన బీచ్‌లు ఇక్కడ ఉన్నాయి. స్వచ్ఛమైన నీళ్ళు, రకరకాల జలచరాలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడి నుండి అనేక రకాల ఆహార ధాన్యాలు ఇక్కడి నుండి ఎగుమతి అవుతాయి. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం హజ్‌యాత్రకు వెళ్ళే వారికి ఈ పోర్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడే పెట్రోలియం శుద్ధి కేంద్రం ఉంది. ఇక్కడి నుండి పెట్రోలియం ఉత్పత్తులు నేరుగా రాజధాని ఖార్టూమ్ చేరడానికి పైపులైను నిర్మించబడింది. ఇక్కడ వాతావరణం అంతా దాదాపు ఎడారి వాతావరణాన్ని పోలి ఉంటుంది. అయితే సముద్రంలో ఈత కొట్టడానికి, స్కూబా డ్రెవింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఎర్ర సముద్రాన్ని చూడడానికి ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. మృతనగరం-మెరోవే మెరోవే నగరం ఇసుక కొండలకు ప్రసిద్ధి. పూర్వకాలంలో ఈ ప్రాంతంలోనే విశాలమైన శ్మశానం ఉండేది. దానితో ఇప్పుడు ఈ నగరానికి మృత నగరంగా పేరు వచ్చింది. ఈ నగరం రాజధాని ఖార్టూమ్ నుండి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే అమున్ దేవాలయం ఉంది. అలాగే పిరమిడ్ల ఎన్‌క్లోజర్ ఉంది. నైలునది మీద నిర్మించిన గొప్ప బ్రిడ్జి ఒక పెద్ద ఆకర్షణ. వేలసంఖ్యలో పర్యాటకులు ఈ బ్రిడ్జిని చూడడానికి వస్తుంటారు. ఇక్కడ ఇసుక కొండలతోబాటు పిరమిడ్లు కూడా ఉన్నాయి. పిరమిడ్లను చూడాలంటే ఈ మెరోవె ప్రాంతానికి తప్పక రావాల్సిందే. -
54 మంది సుడాన్ సైనికులు మృతి
ఖర్దూమ్: సుడాన్ దేశంలో 54 మంది సైనికులను తిరుగుబాటుదారులు చంపేశారు. అనంతరం అక్కడే ఉన్న దక్షిణ కోర్దాఫన్లోని హబిలా అనే వ్యూహాత్మక నగరాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తిరుగుబాటుదారులే తెలియజేశారు. ఉత్తర సెక్టార్‌లోని సుడాన్ పీపుల్స్ లిబరేషన్ మూమెంట్ (ఎస్పీఎల్ ఎం) సంస్థ అల్ దలాంజ్ నగరానికి 30 కిలో మీటర్ల దూరంలోని హబీలా నగరానికి స్వేచ్ఛ కావాలనే పేరుతో ఒక్కసారిగా దాడులకు పాల్పడింది. ఆ నగరాన్ని పూర్తిగా తమ హస్తగతం చేసుకునేందుకు చొచ్చుకొచ్చి అడ్డొచ్చిన సైనికులను దారుణంగా చంపేసింది. చివరికి హబీలా నగరాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఎస్పీఎల్ ఎం తిరుగుబాటు సంస్థ అధికారిక ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు హబీలాకు స్వేచ్ఛ వచ్చిందని తెలిపాడు. అయితే, సైన్యం ఈ విషయాలను కొట్టిపారేసింది. హబీలా ఎవరి చేతుల్లోకి వెళ్లలేదని, తిరుగుబాటు దారులు మాత్రం దాడులకు పాల్పడ్డారని, ప్రస్తుతం వారితో పోరు సాగుతుందని సుడాన్ సైన్యం ప్రకటించింది. బాంబులతో వారు దాడి చేయడం వల్ల తమ సైనికులను కోల్పోయామని, వారిని వీలయినంత త్వరగా తుదముట్టిస్తామని స్పష్టం చేసింది. -
‘కిడ్నాప్’తో తల్లడిల్లుతున్న రెండు కుటుంబాలు
విజయవాడ సిటీ/రామవరప్పాడు : జిల్లాలోని నూజివీడు మండలం గొల్లపల్లికి చెందిన గోగి నేని లాల్‌బహదూర్ శాస్త్రి, వసుమతి దంపతులు మూడు దశాబ్దాలుగా విజయవాడలో ఉంటూ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు ప్రతీష్‌చంద్ర సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని తొలుత కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు చెందిన ప్రొగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్లో ఇంజనీర్‌గా పని చేశా రు. సంస్థ ఆదేశాల మేరకు సౌత్ ఆఫ్రికా, సూడాన్ దేశాల్లో జరిగిన నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతలను మూడేళ్లపాటు నిర్వహించారు. అక్కడ జాతుల మధ్య వైరం కారణంగా తరుచూ దాడులు జరిగేవి. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ప్రతీష్చంద్రను ఇక్కడికి పిలిపించారు. కొంతకాలం పాటు ఇంటి వద్దనే ఉన్న ప్రతీష్.. మూడు నెలల కిం దట హైదరాబాద్ కేంద్రంగా నిర్మాణ పనులు చేసేట్టే పృథ్వీ కన్స్ట్రక్షన్స్లో ఇంజినీర్‌గా చేరా రు. నూజివీడు ప్రాంతానికే చెందిన తాం డవకృష్ణ, రాఘవేంద్రరావు(రఘు) అప్పటికే ఇదే సంస్థలో పనిచేస్తున్నారు. విధుల నిర్వహణ లో భాగంగా నాగాలాండ్ రాజధాని కోహిమా లో ఉంటూ వీరు సంస్థ తరఫున జాతీయ రహదారి నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీష్‌చంద్ర, రఘు స్వస్థలానికి వచ్చేందుకు ఈ నెల 27వ తేదీ రాత్రి దిమ్మాపూర్ చేరుకున్నారు. అక్కడ వీరిని నాగా తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే శాస్త్రి భార్య కుప్పకూలిపోయారు. అప్పటి నుంచి పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టకుండా రోదిస్తోంది. విషయం మీడియా ద్వా రా తెలిసి బంధువులు, స్నేహితులు, స్థానికు లు వచ్చి ఓదార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదీ జరిగింది ప్రతీష్ సోదరుడు జగదీష్‌బాబు ఇటీవల బీటెక్ పూర్తి చేసుకొని ఉన్నత చదువుల కోసం ఆగస్టు ఏడో తేదీన అమెరికా వెళుతున్నారు. ఇతనికి వీడ్కోలు పలికేందుకు విజయవాడ వచ్చేందుకు నిర్ణయించుకున్న ప్రతీష్ 28వ తేదీ ఉదయం రైలు ఎక్కాల్సి ఉంది. దీంతో తమ గ్రామానికి చెందిన మిగిలిన ఇద్దరితో కలిసి 27వ తేదీ రాత్రి దిమ్మాపూర్ చేరుకున్నా డు. ఇది తెలిసిన నాగా రెవల్యూషనరీ ఫ్రంట్(ఎన్ఆర్ ఎఫ్) తీవ్రవాదులు అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి తాండవకృష్ణ అ క్కడి నుంచి పరారవ్వగా, మిగిలిన ఇద్దరిని తీవ్రవాదులు అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతానికి తరలించారు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా ప్రతీష్ కుటుంబ సభ్యులకు తెలియపరిచారు. ఇందుకోసం.. నాగాలాండ్ రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లు స్థానికంగా ప్రాబల్యం పొందిన తీవ్రవాద గ్రూపులకు కొంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. చెక్బమా నుంచి కిలోమి వరకు రోడ్డు నిర్మాణ బాధ్యతలను తొలుత రత్న కన్స్ట్రక్షన్స్ తీసుకుంది. ఆ సమయంలో స్థానిక నా గా రివల్యూషనరీ ఫ్రంట్(ఎన్ఆర్ఎఫ్) తీవ్రవాదులతో నగదు ఇచ్చే ఒప్పందం చేసుకుం ది. ఆ మొత్తం సుమారు రూ.20 కోట్లు అని తెలుస్తోంది. తదుపరి ఇక్కడి నిర్మాణ బాధ్యతలను పృథ్వీ కన్స్ట్రక్షన్స్కు సబ్ కాంట్రాక్టు ఇ చ్చిన రత్న కన్స్ట్రక్షన్స్.. తీవ్రవాదులకు ఇస్తానన్న మొత్తం ఇవ్వలేదు. అప్పటి నుంచి పలుమార్లు హెచ్చరించినా రత్న సంస్థ నిర్వాహకు లు ఖాతరు చేయలేదు. దీంతో తీవ్రవాదులు పృథ్వీ సంస్థ ఇంజినీర్లను కిడ్నాప్ చేశారు. రత్న కన్స్ట్రక్షన్స్ సంస్థ జనరల్ మేనేజర్ కె.సి.పంతోని తమకు అప్పగిస్తే వీరిని వదిలేస్తామ ని ఫోన్‌ద్వారా తెలియజేసినట్టు కుటుంబ సభ్యులు చెపుతున్నారు. దీనిపై గత రెండు రోజులుగాసాగుతున్న చర్చలు సానుకూల ధోరణిలో ఉన్నాయని వారు మంగళవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడిని వదిలిపెట్టండి నూజివీడు/ నూజివీడు రూరల్ : నూజివీడుకు చెందిన చింతక్రింద రాఘవేంద్రరావు(25) అలియాస్ రఘు నాగాలాండ్ లో కిడ్నాప్‌నకు గురవడంతో అతడి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రఘు కిడ్నాప్ గురించి టీవీల్లో చూసిన తరువాతే వారికి తెలిసింది. ముగ్గురు ఆడపిల్లల తరువాత రఘు పుట్టాడు. రఘుకు నాలుగేళ్ల వయస్సు ఉన్నపుడే అతడి తండ్రి బాబూరావు మృతిచెందారు. దీంతో ఒక్కగానొక్క కుమారుడైన అతడిని తల్లి అల్లారుముద్దుగా చూసుకునేవారు. రఘు బీకాం కంప్యూటర్స్ వరకు చదివాడు. 2013 నుంచి ప్రధ్వీ కన్స్ట్రక్షన్ కంపెనీలో సైట్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. రఘు కిడ్నాప్‌కు గురైన సంగతి అతని తల్లి ప్రభావతికి కుమార్తెలు తెలియనివ్వలేదు. ఇద్దరు కుమార్తెలు నూజివీడులోనూ, చిన్నకుమార్తె నల్లగొండలో ఉంటున్నారు. మూడు రోజుల క్రితమే రఘు తల్లి చిన్నకుమార్తె దగ్గరకు వెళ్ళింది. రఘు 2013లో సెప్టెంబరు నెలలో ఇంటికి వచ్చి అక్టోబర్ నాలుగో తేదీన తిరిగి నాగాలాండ్ వెళ్ళాడు. కోహిమాలో ఉంటూ కంపెనీ పనులు చేస్తున్న ప్రాంతానికి వెళ్లివస్తుంటాడు. కోహిమాకు సమీపంలోని దిమాపూర్‌లో ఉండగా ఈనెల 27వ తేదీ రాత్రి కిడ్నాప్‌కు గురైనట్లు టీవీల ద్వారా తెలుసుకున్నారు. ఉన్నది ఒక్కడివే.. అంత దూరంలో ఏం ఉద్యోగం, ఇక్కడికి వచ్చేయమంటూ కుటుంబ సభ్యులు ఎప్పటి నుంచో ఒత్తిడి చేస్తున్నారు. 8 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని, డబ్బు అందగానే వచ్చేస్తానని తల్లికి, అక్కలకు చెప్తున్నాడు. ఇంతలోనే కిడ్నాప్‌కు గురికావడంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. వారం రో జుల క్రితం ఒకసారి మాట్లాడాడని రెండో అక్క అనిత పేర్కొంది. 27న బయలుదేరుతున్నామని చెప్పాడు ఈనెల 27న రఘుతోపాటు మరో ఇద్దరు కలసి బయలుదేరి వస్తున్నామని ఈనెల 23న ఫోన్లో చెప్పాడని రఘు స్నేహితు డు ఉదయ్ పేర్కొన్నాడు. మిగిలిన ఇద్దరికి ట్రైన్ టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయని, తను మాత్రం తత్కాల్లో బుక్‌చేశానని, వెయిటింగ్ లిస్టులో ఉందని, అయినప్పటికీ ట్రైన్ ఎక్కి టీసీని మెయింటెన్ చేసుకుంటానని చెప్పాడని, ఇంతలోనే ఈ విధంగా జరిగిందని వాపోయాడు. ప్రభుత్వం పట్టించుకోవాలి ఒక్కగానొక్క కుమారుడు బ్రతుకుదెరువు కోసం వందల కిలోమీటర్ల దూరం వెళ్ళి ఉంటున్నాడని, అతనిని తీవ్రవాదులు కి డ్నాప్ చేసిన నేపథ్యంలో వారి చెర నుంచి ప్రభుత్వం బాధ్యత తీసుకుని విడిపించాలని కుటుంబ సభ్యులుకోరుతున్నారు. ఇదిలా ఉండగా, గోగినేని ప్రతీష్‌చంద్ర నాగాలాండ్‌లో కిడ్నాప్ అవడంతో మండంలోని అతడి స్వస్థలమైన గొల్లపల్లిలోని బంధువులు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నా రు. లైటు కూడా లేదట అక్కడ వీరిని నిర్భంధించిన గదిలో ఫ్యాన్ కాదు కదా లైటు కూడా లేదంట. కిడ్నాపర్లను నిర్బంధించేందుకు ప్రత్యేకంగా జైలు ఏర్పాటు చేసినట్టు మా అబ్బాయి చెప్పాడు. జైల్లో మాదిరి సెంట్రీ అక్కడ కాపలా ఉన్నాడంట. వీరితో పాటున్న తాండవకృష్ణ పారిపోవడంతో కోపం వచ్చి కొట్టినట్టు మా అబ్బాయి చెప్పాడు. ‘సెంట్రీ మంచోడు అనుకుంటా.. గంట గంటకూ తమతో ఫోన్లో మాట్లాడిస్తున్నాడు. వీలైనంత తొందరగా తీసుకెళ్లండి’ అని మా అబ్బాయి ప్రాథేయపడుతున్నాడు. - గోగినేని లాల్‌బహదూర్ శాస్త్రి, ప్రతీష్‌చంద్ర తండ్రి కప్పం కట్టాల్సిందే నాగాలాండ్‌లో నిర్మాణ పనులు సహా ఏ వ్యాపారాలు చేయాలన్నా తీవ్రవాద సంస్థలకు కొంత నగదు కమీషన్ ఇవ్వాలి. ఎన్ఆర్ఎఫ్ సహా ఐదు తీవ్రవాద గ్రూపులు అక్కడ ఉన్నాయి. ప్రాంతాల వారీగా ప్రాబ ల్యం ఉన్న వీరికి ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిందే. ఇవ్వకుంటే ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయి. - నళినీమోహన్, వైష్ణవీ కన్స్ట్రక్షన్స్ -
బస్సును ఢీ కొన్న ట్రక్: 27 మంది మృతి
ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్క్ ఢీ కొన్న ఘటనలో 27 మంది మృతి చెందారు. ఆ ఘటన సూడాన్‌లోని కర్తోమ్ పట్టణంలో చోటు చేసుకుంది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఏడుగురు మహిళలతోపాటు ఓ చిన్నారి ఉందని పోలీసులు వెల్లడించారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
మతం కానివాడ్ని పెళ్లి చేసుకుందని.. మరణ శిక్ష!
-
కసాయి పాలకుడు
దక్షిణాఫ్రికా ఖండపు తూర్పుభాగంలోని సూడాన్, కాంగో, టాంజానియా, కెన్యా, ఇథియోపియాల నడుమ ఉన్న చిన్న దేశం ఉగాండా. ఆ దేశానికి 1962లో బ్రిటిష్‌వారి నుంచి స్వాతంత్య్రం వచ్చింది. అంతలోనే 1971లో ఆ స్వాతంత్య్రం చేజారిపోయింది! అయితే దాన్ని చేజిక్కించుకున్నవాడు ఎవరో పరాయిదేశ పాలకుడు కాదు. వాళ్ల మనిషే. పేరు ఇడీ అమీన్! అప్పటికి ఆ దేశ ప్రధాని, అధ్యక్షుడు మిల్టన్ ఒబోటే. అతడి ప్రభుత్వంలో అమీన్ ఒక సైనికాధికారి. ఒబోటే, అమీన్ ఇద్దరూ మంచి స్నేహితులు. ఎంత మంచి స్నేహితులంటే ఇద్దరూ కలిసి బంగారం స్మగ్లింగ్ చేసేవారు. కాంగో నుంచి ఏనుగు దంతాలను, కాఫీ గింజలను పెద్ద ఎత్తున అక్రమంగా తెప్పించుకుని వ్యాపారం చేసేవారు. వసూళ్లను పంచుకునేవారు. ఆ క్రమంలో 1971 జనవరి 25న ఒబొటే సింగపూర్‌లో ఒక సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లాడు. అదే అదనుగా అమీన్ సైనిక తిరుగుబాటు లేవనెత్తాడు. ఒబొటే ప్రభుత్వాన్ని కూల్చివేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఉగాండా అధ్యక్షుడిగా, సైనికదళాల ముఖ్య అధికారిగా ఉగాండా పగ్గాలు చేపట్టాడు. అప్పటి నుంచి 1979 ఏప్రిల్ 13న టాంజానియా సేనల తిరుగుదాడికి జడిసి దేశాన్ని వదిలి పారిపోయేవరకు ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరమైన పాలనను ఉంగాండా ప్రజలకు తొమ్మిదేళ్లపాటు నరకం చూపించాడు ఇడీ అమీన్. అమీన్ అధికారంలో వచ్చీ రావడంతోనే, అంతకుముందు ఒబొటే ఖైదు చేయించిన రాజకీయ నాయకులందరినీ విడుదల చేయించి వారిని తన వైపునకు తిప్పుకున్నాడు. ఒబొటే మద్దతుదారులందరినీ వెంటాడి, వేటాడి చంపేందుకు ‘కిల్లర్ స్క్వాడ్స్’ని ఏర్పాటు చేశాడు. పాత్రికేయులు, న్యాయవాదులు, విద్యార్థులు, సీనియర్ అధికారులు... వారూ వీరు అని లేకుండా తన ను విమర్శించిన వారందరినీ హత్య చేయించాడు. 1972లో ‘ఆర్థిక యుద్ధం’ పేరుతో ఉగాండాలోని ఆసియా సంతతి వాళ్లందరినీ దేశం నుంచి వెళ్లగొట్టాడు. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతింటుందని తెలిసినా అతడు లెక్క చేయలేదు. చివరికి ‘ఉగాండా కసాయి’గా పేరుమోశాడు. అమీన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కనీసం 3 లక్షల మంది పౌరులు అతడి వివక్షకు, వైషమ్యాలకు బలయ్యారు. 1976లో ఎంటెబ్బేకు బయల్దేరిన ఫ్రెంచి విమానాన్ని హైజాక్ చేయించాడు. 1978 అక్టోబరులో టాంజానియా ఆక్రమణకు తన సొంత సేనల్ని ఉసిగొల్పాడు. అదే అతడి అంతానికి కారణమయింది. అమీన్‌కు వ్యతిరేకంగా ఉగాండా జాతీయవాదులు టాంజానియా సేనలకు సహకరించడంతో వారు ఉగాండా సేనలపై పైచేయి సాధించారు. వాళ్లకు చిక్కకుండా అమీన్ మొదట లిబియా పారిపోయాడు. అక్కడి నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా చేరుకున్నాడు. అలా రెండు దశాబ్దాలకుపైగా అజ్ఞాతంలో గడిపి, ఆరోగ్యం క్షీణించి, కోమాలోకి జారుకుని 2003 ఆగస్టు 16న మరణించాడు. ఉగాండా ప్రభుత్వం అతడి మృతదేహాన్ని అడిగేలోపే సౌదీ అరేబియా ఖననం చేయించింది. విచిత్రం ఏమిటంటే అమీన్ దురాగతాలపై ఈనాటికీ ఏ దేశమూ విచారణ జరిపించకపోవడం! ఇడీ అమీన్‌ను సమర్థించేవారు కఠోరమైన అతడి బాల్యమే అతడిని అంతటి క్రూర పాలకునిగా మార్చిందని అంటారు. అమీన్ జన్మదినం ఎక్కడా నమోదు కాలేదు. సంవత్సరం మాత్రం 1925 అంటారు. ఉగాండాలోని ఉత్తర నైలు ప్రావిన్సులో అతడు జన్మించాడు. 1940 నుంచి 1970 వరకు సైన్యంలో పనిచేశాడు. ప్రభుత్వాన్ని పడగొట్టి, అధ్యక్షుడు అయ్యాడు. అమీన్ తల్లి మూలికా వైద్యురాలు. దైవభక్తి పరాయణురాలు. తండ్రి తన తల్లిని వదిలిపెట్టి వెళ్లడంతో ఆ కోపం, అసహనం, దుఃఖం అమీన్‌ని చెడ్డ పిల్లవాడిగా మార్చాయని అతడిని సమర్థించేవారు చెబుతారు. అమీన్ పెద్దగా చదువుకోలేదు. చిన్న వయసులోనే బ్రిటిష్ సైన్యంలోని ‘బ్లాక్ ఆఫ్రికన్’ విభాగంలో చేరాడు. ఆ తర్వాత కొంతకాలం అక్కడే వంటవాడిగా పనిచేశాడు. అమీన్ పొడగరి. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉండేవాడు. బాక్సింగ్, స్విమ్మింగ్ ఛాంపియన్ కూడా. సైన్యంలో త్వరత్వరగా ఎదగడానికి సైనిక విచారణల్లో అమానుషంగా ప్రవర్తించేవాడు. అలా తన ‘శక్తి సామర్థ్యాలను’ చాటుకొని అక్రమ విధానాల్లో పైకి వచ్చినవాడు ఇడీ అమీన్. చరిత్ర క్షమించని నరహంతకులలో ఇడీ అమీన్ ఒకరు. -
సూడాన్‌లో తెగల మధ్య ఘర్షణ, 100 మంది మృతి
సూడాన్‌లో రెండు తెగల మధ్య జరిగిన ఘర్షణలో కనీసం వంద మంది మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. డార్పర్ రాష్ట్రంలోని ఉమ్ దొఖోన్ ప్రాంతంలో శనివారం మెస్సీరియా, సలామత్ జాతీయుల మధ్య తీవ్ర స్థాయిలో పోరాటం జరిగినట్టు ఆ దేశ అధికారిక రేడియో వెల్లడించింది. దాదాపు నాలుగు వేల మంది ప్రాణ భయంతో ఇళ్లు విడిచి పారిపోయారు. అధికారులు, భద్రత దళాలు రంగంలోకి అల్లర్లను అదుపు చేశారు. ఈ సంఘటనలో కొందరు చడియన్ సైనికులు కూడా మరణించినట్టు ఓ వార్తా పత్రిక పేర్కొంది. కాగా దీనిపై సూడాన్ ఆర్మీ అధికారులు స్పందించలేదు. సూడాన్‌లోని డార్ఫర్ రాష్ట్రంలో ఈ రెండు తెగల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుంటాయి. గతేడాది భారీ ప్రాణం నష్టం జరిగింది. -
సూడాన్‌కు తక్షణం ఆర్థికసాయం అందించండి
సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ తన ఉధారతను మరోసారి చాటుకున్నారు. వరద తాకిడికి అతలాకుతమైన సూడాన్‌కు తక్షణమే రూ.10 మిలియన్ల అమెరికన్ డాలర్ల ఆర్థికసాయం అందజేయాలని అబ్దుల్ల బిన్ సౌదీ ఉన్నతాధికారులను ఆదేశించారని స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది. ఇటీవల సూడాన్ దేశంలో వరదలు పోటెత్తాయి. దీంతో ఆ దేశంలోని వివిధ రాష్ట్రాలు వరదల్లో చిక్కుకున్నాయి. దాంతో సూడాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలకు సహాయ పునరావాస చర్యలు కల్పించేందుకు సౌదీ ఆ నగదు మొత్తాన్ని సూడాన్‌కు అందజేయనుంది. అలాగే నిత్య ఘర్షణలతో ఈజిప్టు అతలాకుతలమవుతుంది. ఆ ఘర్షణలలో గాయపడిన వేలాది మంది ఈజిప్టులోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారికి వైద్య సాయం అందించేందుకు స్థానిక వైద్యులను త్వరలో ఈజిప్టు పంపేందుకు చర్యలు తీసుకోవాలని సౌదీ రాజు ఆదేశాలు జారీ చేశారని స్థానిక మీడియా తెలిపింది. అందుకోసం స్థానిక వైద్య బృందాలతోపాటు మందులు, ఔషధాలను ఈజిప్టు పంపేందుకు సౌదీ ఉన్నతాధికారులు ముమ్మర చర్యలు చేపట్టారని స్థానిక మీడియా వివరించింది.