ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో సైన్యం, పారామిలటరీ మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘర్షణలు వరసగా మూడు రోజైన సోమవారం కూడా కొనసాగాయి. పేలుళ్లు, కాల్పులతో సూడాన్ అట్టుడుకిపోయింది. దేశ రాజధాని ఖార్టుమ్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 1800 మంది గాపడ్డారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. మూడు రోజులుగా సాగుతున్న ఈ హోరాహోరీ యుద్ధంలో ఆస్పత్రులు దెబ్బతిన్నాయి. దీంతో వైద్యసామాగ్రి, ఆహారం కొరత ఏర్పడింది.
2021లో తిరుగుబాటుతో అధికారాన్ని చేజిక్కించుకున్న ఇద్దరు జనరల్స్, సూడాన్ ఆర్మీచీఫ్ అబ్దెల్ ఫట్టా అల్ బుర్హాన్, పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య వారాల పాటు అధికార పోరాటం జరిగింది. అది శనివారానికల్లా మరింత హింసాత్మకంగా మారింది. ఈ సంఘర్షణ వైమానిక దాడులు, ఫిరంగిదళాల భారీ కాల్పులను దారితీసింది.
దీంతో నివాసితులు నిత్యావసారాలు, పెట్రోల్ కోసం బయటకు రావడం ఒక సాహసంగా మారింది. మరోవైపు విద్యుత్తు అంతరాయంతో నగరవాసులు ఇబ్బందులకు గురయ్యారు. ఐతే దేశ రాజధాని ఖార్టుమ్‌లో చోటు చేసుకున్న ఈ అంతర్గత పోరు సుదీర్ఘంగా ఉండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దౌత్యవేత్తలు సమీకరించి ప్రాంతీయంగా, అంతర్జాతీయ పరంగా కాల్పులు విరమణకు పిలుపునిచ్చారు.
మరోవైపు ఐక్యరాజ్యసమితి మిషన్ హెడ్ వోల్కర్ పెర్థెస్ భద్రత మండలిలో సూడాన్ యుద్ధం చాలా పీక్ స్టేజ్‌కి చేరుకుందని, ఇది ఎంతటి విధ్వంసానికి దారితీస్తోందో కూడా చెప్పడం కష్టం అన్నారు. ఈమేరకు సోమవారం యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సూడాన్‌లో మళ్లీ అంతర్గత పోరుకు తెరతీసిన ఇరు పార్టీలను తక్షణమే శత్రుత్వాలను నిలిపివేయాలని పిలుపునిచ్చారు.
దీన్ని మరింతగా తీవ్రతరం చేయడం దేశానికి, ఆయా ప్రాంతాలకి మరింత ప్రమాదరకమని హెచ్చరించారు. కాగా, పారా మిలిటరీ ‘ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్’ను సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదనే దేశంలో అగ్నికి ఆజ్యంపోసింది. ఇదే ఆర్మీ, పారామిలటరీ బలగాల మధ్య ఘర్షణకు కారణమైంది.
ఘర్షణలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఇప్పటి వరకు దాదాపు 100 మంది పౌరులకు చికిత్స అందిచినట్లు వైద్యుల సంఘం ఒకటి పేర్కొంది. గాయపడినవారిలో చాలమంది ఆస్పత్రులకు చేరుకోలేకపోతున్నట్లు తెలిపింది. అంతేగాదు కొనసాగుతున్న ఈ ఘర్షణలో ఆస్పత్రులు దెబ్బతినడంతో పౌరులను జాయిన్ చేసుకునే పరిస్థితి కూడా లేదని వైద్యుల సంఘం పేర్కొంది.
చాలా ఆస్పత్రులు సామాగ్రి కొరతతో వైద్యం అందించలేని స్థితిలో ఉన్నాయని తెలిపింది. మరోవైపు సైన్యం విమానాశ్రయాలు, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌తో సహా కీలక ప్రాంతాలు తమ అధీనంలో ఉన్నాయని ప్రకటించడం గమనార్హం. స్వాతంత్యం వచ్చినప్పటి నుంచి సూడాన్ దశాబ్దాలుగా అనేక తీవ్రమైన అంతర్యుద్ధాలు, తిరుగుబాట్లతో మగ్గిపోయిందని సూడాన్ విశ్లేషకుడు ఖో లూద్ ఖై చెబుతున్నారు.
(చదవండి: రెసిడెన్షియల్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం..16 మంది మృతి)
Comments
Please login to add a commentAdd a comment