paramilitary
-
సూడాన్‌లో 85 మంది ఊచకోత
ఖార్టూమ్: సూడాన్‌లో పారా మిలటరీ మూకలు గురువారం సిన్నార్ రాష్ట్రంలోని జల్క్ని గ్రామంపై దాడిచేసి బాలికలను కిడ్నాప్ చేసేందుకు యత్నించగా గ్రామస్థులు ప్రతిఘటించారు. దీంతో మూకలు గ్రామాన్ని ఐదు రోజులపాటు ముట్టడించి 85 మందిని చంపేశారని మీడియా తెలిపింది. సిన్నార్ కోసం సైన్యం, మూకల మధ్య సాగుతున్న పోరుతో ఇన్నేళ్లలో 7.25 లక్షల మంది ప్రజలు వలస వెళ్లారు. -
అంతర్గత పోరుతో అట్టుడుకుతున్న సూడాన్.. 200 మంది మృతి
ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో సైన్యం, పారామిలటరీ మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘర్షణలు వరసగా మూడు రోజైన సోమవారం కూడా కొనసాగాయి. పేలుళ్లు, కాల్పులతో సూడాన్ అట్టుడుకిపోయింది. దేశ రాజధాని ఖార్టుమ్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 1800 మంది గాపడ్డారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. మూడు రోజులుగా సాగుతున్న ఈ హోరాహోరీ యుద్ధంలో ఆస్పత్రులు దెబ్బతిన్నాయి. దీంతో వైద్యసామాగ్రి, ఆహారం కొరత ఏర్పడింది. 2021లో తిరుగుబాటుతో అధికారాన్ని చేజిక్కించుకున్న ఇద్దరు జనరల్స్, సూడాన్ ఆర్మీచీఫ్ అబ్దెల్ ఫట్టా అల్ బుర్హాన్, పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య వారాల పాటు అధికార పోరాటం జరిగింది. అది శనివారానికల్లా మరింత హింసాత్మకంగా మారింది. ఈ సంఘర్షణ వైమానిక దాడులు, ఫిరంగిదళాల భారీ కాల్పులను దారితీసింది. దీంతో నివాసితులు నిత్యావసారాలు, పెట్రోల్ కోసం బయటకు రావడం ఒక సాహసంగా మారింది. మరోవైపు విద్యుత్తు అంతరాయంతో నగరవాసులు ఇబ్బందులకు గురయ్యారు. ఐతే దేశ రాజధాని ఖార్టుమ్‌లో చోటు చేసుకున్న ఈ అంతర్గత పోరు సుదీర్ఘంగా ఉండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దౌత్యవేత్తలు సమీకరించి ప్రాంతీయంగా, అంతర్జాతీయ పరంగా కాల్పులు విరమణకు పిలుపునిచ్చారు. మరోవైపు ఐక్యరాజ్యసమితి మిషన్ హెడ్ వోల్కర్ పెర్థెస్ భద్రత మండలిలో సూడాన్ యుద్ధం చాలా పీక్ స్టేజ్‌కి చేరుకుందని, ఇది ఎంతటి విధ్వంసానికి దారితీస్తోందో కూడా చెప్పడం కష్టం అన్నారు. ఈమేరకు సోమవారం యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సూడాన్‌లో మళ్లీ అంతర్గత పోరుకు తెరతీసిన ఇరు పార్టీలను తక్షణమే శత్రుత్వాలను నిలిపివేయాలని పిలుపునిచ్చారు. దీన్ని మరింతగా తీవ్రతరం చేయడం దేశానికి, ఆయా ప్రాంతాలకి మరింత ప్రమాదరకమని హెచ్చరించారు. కాగా, పారా మిలిటరీ ‘ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్’ను సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదనే దేశంలో అగ్నికి ఆజ్యంపోసింది. ఇదే ఆర్మీ, పారామిలటరీ బలగాల మధ్య ఘర్షణకు కారణమైంది. ఘర్షణలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఇప్పటి వరకు దాదాపు 100 మంది పౌరులకు చికిత్స అందిచినట్లు వైద్యుల సంఘం ఒకటి పేర్కొంది. గాయపడినవారిలో చాలమంది ఆస్పత్రులకు చేరుకోలేకపోతున్నట్లు తెలిపింది. అంతేగాదు కొనసాగుతున్న ఈ ఘర్షణలో ఆస్పత్రులు దెబ్బతినడంతో పౌరులను జాయిన్ చేసుకునే పరిస్థితి కూడా లేదని వైద్యుల సంఘం పేర్కొంది. చాలా ఆస్పత్రులు సామాగ్రి కొరతతో వైద్యం అందించలేని స్థితిలో ఉన్నాయని తెలిపింది. మరోవైపు సైన్యం విమానాశ్రయాలు, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌తో సహా కీలక ప్రాంతాలు తమ అధీనంలో ఉన్నాయని ప్రకటించడం గమనార్హం. స్వాతంత్యం వచ్చినప్పటి నుంచి సూడాన్ దశాబ్దాలుగా అనేక తీవ్రమైన అంతర్యుద్ధాలు, తిరుగుబాట్లతో మగ్గిపోయిందని సూడాన్ విశ్లేషకుడు ఖో లూద్ ఖై చెబుతున్నారు. (చదవండి: రెసిడెన్షియల్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం..16 మంది మృతి) -
రష్యాతో పోరాడేందుకు ఉక్రెయిన్ సైన్యంలో చేరిన తమిళ విద్యార్థి
చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన 21 ఏళ్ల సాయినికేష్ రవిచంద్రన్ అనే విద్యార్థి రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రెయిన్‌లోని పారామిలటరీ దళాలలో చేరాడు. దీంతో అధికారులు అతని నివాసానికి వెళ్లి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. నిజానికి సాయినికేష్ ఇండియన్ ఆర్మీలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నాడని కానీ తిరస్కరించబడిందని తెలిపారు. అయితే సాయినికేష్ 2018లో ఖార్కివ్‌లోని నేషనల్ ఏరోస్పేస్ యూనివర్శిటీలో చదువుకోవడానికి ఉక్రెయిన్ వెళ్లారు. కానీ అతను జూలై 2022 నాటికి ఈ కోర్సును పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అతని కుటుంబం సాయినికేష్‌తో కమ్యూనికేషన్ కోల్పోయింది. అతని తల్లిదండ్రులు రాయబార కార్యాలయం సహాయం కోరిన తర్వాత వారు సాయినికేష్‌ను సంప్రదించగలిగారు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉక్రెయిన్ పారామిలిటరీ దళాల్లో చేరినట్లు ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశారు. (చదవండి: 'మిలిటరీ ఆపరేషన్' లక్ష్యం 'యుద్ధాన్ని ఆపడమే!: పుతిన్) -
ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్న కేంద్రం
సాక్షి, న్యూడిల్లీ: ‘మేడ్ ఇన్ ఇండియా’లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పారామిలిటరీ క్యాంటీన్లలో దిగుమతి అయిన 1,000పైగా ఉత్పత్తులను నిషేధించాలన్న ఉత్తర్వులను కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉపసంహరించుకుంది. దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల్లో అనేక వస్తువులు భారత్‌లోనే తయారైనట్లు వెల్లవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పారామిలిటరీ క్యాంటీన్లు దేశీయ పరిశ్రమలకు మద్దతునిచ్చే క్రమంలో జూన్ 1వ తేదీ నుంచి స్వదేశీ లేదా భారతీయ ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తామని ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. (‘కరోనా వ్యాప్తిలో భారత్ అగ్రస్థానానికి వెళ్తుంది’) ఇటీవల క్యాంటీన్లలో దిగుమతి అయిన ఉత్పత్తులను పరిశీలించగా అందులో నిషేధించబడిన ‘నుట్రెల్లా, కిండర్ జాయ్, టిక్ టాక్, హార్లిక్స్, ఓట్స్, యురేకా ఫోర్బ్స్, టామీ హిల్ఫిగర్ షర్ట్స్, అడిడాస్ బాడీ స్ప్రే’లు వంటి బ్రాండ్లు ఉన్నట్లు గమనించారు. మైక్రోవేవ్ ఓవెన్లు వంటి ఇతర గృహోపకరణాల వస్తువులను కూడా తీసివేసింది. అంతేగాక స్కెచర్స్, ఫెర్రెరో, రెడ్‌బుల్, విక్టోరినాక్స్, సఫిలో (పోలరాయిడ్, కారెరా) సహా దిగుమతి చేసుకునే ఏడు సంస్థల ఉత్పత్తులను కూడా నిషేధ జాబితా నుంచి తొలగించింది. ఈ జాబితాలో ఉన్న భారత ఉత్పత్తులైన డాబర్, బజాజ్, ఉషాతో సహా అనేక భారతీయ ఉత్పత్తులను కూడా ఈ జాబితా నుంచి తొలగించినట్లు హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. హోంమంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి స్పందిస్తూ.. ‘‘మా అధికారి మంత్రిత్వ శాఖను సంప్రదించకుండానే దిగుమతి ఉత్పత్తులను తీసుకున్నారు. ఇండియా ఉత్పత్తులను కూడా నిషేధ బ్రాండ్లలో చేర్చిన సదరు సీనియర్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటాం. అంతేగాక పూర్వ జాబితాను పరిశీలించి దానిని సవరించాం. త్వరలో సవరించిన జాబితాను పంపిస్తాం’’ అని చెప్పారు. ఈ క్యాంటీన్ల మాతృసంస్థ కేంద్రీయ పోలీసు కళ్యాణ్ భండార్స్ అన్ని ఉత్పత్తులను మూడు వర్గాలుగా విభజించారు. కేటగిరి1- భారతదేశంలో పూర్తిగా తయారైన ఉత్పత్తులను కలిగి ఉంది. కేటగిరీ 2- దిగుమతి చేసుకున్న ముడి పదార్థాలతో ఉత్పత్తులు ఉన్నాయి, కానీ అవి భారతదేశంలో తయారు చేయబడతాయి లేదా సమావేశమవుతాయి. కేటగిరి 3 - పూర్తిగా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులు మాత్రమే ఉంటాయి. -
ఉద్యోగ అభ్యర్థులకు సువర్ణ అవకాశం
న్యూఢిల్లీ: కేంద్ర పారా మిలటరీ బలగాల్లో 76,578 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు హోంశాఖ తెలిపింది. ఈ మొత్తం ఉద్యోగాల్లో 54,953 కానిస్టేబుల్ పోస్టులు ఉండగా, వీటిలో మహిళల కోసం 7,646 పోస్టులను కేటాయించినట్లు వెల్లడించింది. కానిస్టేబుల్ పోస్టుల్లో సీఆర్పీఎఫ్లో అత్యధికంగా 21,566 ఖాళీలు ఉండగా, బీఎస్ఎఫ్(16,984), ఎస్ఎస్బీ(8,546), ఐటీబీపీ(4,126) అస్సాం రైఫిల్స్(3,076) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. ఇందుకోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) 2019, ఫిబ్రవరి 11 నుంచి మార్చి 11 వరకూ కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది. ఇక సబ్ఇన్స్పెక్టర్ హోదాలో 1,073 పోస్టులు ఉండగా వాటిలో బీఎస్ఎఫ్లో 508, సీఆర్పీఎఫ్లో 274, ఎస్ఎస్బీలో 206, ఐటీబీపీలో 85 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అదనంగా ట్రేడ్స్‌మెన్, హోంశాఖ, వైద్యం, పారా మెడికల్, కమ్యూనికేషన్, ఇంజనీరింగ్ రంగాల్లో మరో 20,086 పోస్టులను పదోన్నతుల ద్వారా హోంశాఖ భర్తీ చేయనుంది. -
‘ఈశాన్య’ అభ్యర్థుల ఎత్తు కుదింపు
న్యూఢిల్లీ: భారత పారామిలటరీ బలగాల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని ఆదివాసీ యువకులు, గూర్ఖాల చేరికను పెంచేందుకు కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పారామిలటరీ బలగాల్లో కానిస్టేబుల్, సబ్ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసే పురుష అభ్యర్థుల కనీస ఎత్తును తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చింది. కేంద్ర బలగాల్లో కానిస్టేబుల్ పోస్టుకు ఆదివాసీ యువకుల కనీస ఎత్తును 162.5 సెంటిమీటర్ల నుంచి 157 సెంటిమీటర్లకు తగ్గించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం(సీఐఎస్ఎఫ్)లో ఏఎస్సై పోస్టుకు ఆదివాసీ, గూర్ఖా యువకుల కనీస ఎత్తు 162.5 సెం.మీ, సబ్ఇన్స్పెక్టర్ పోస్టుకు 157 సెంటిమీటర్లు ఉండాల్సిందిగా నిర్ధారించారు. ఈ నిబంధనలు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సామ్ రైఫిల్స్ వంటి సంస్థలకు వర్తిస్తాయి. -
సీఆర్పీఎఫ్ తాత్కాలిక డీజీగా సుదీప్ లక్డాకియా
న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ అదనపు డీజీగా పనిచేస్తున్న సుదీప్ లక్డాకియాకు డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ హోం శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఆయన బుధవారం(నేడు) బాధ్యతలు చేపట్టనున్నారు. 1984 బ్యాచ్ తెలంగాణ కేడర్‌కు చెందిన లక్డాకియా, ప్రస్తుతం సెంట్రల్ జోన్ లోని పారామిలటరీ బలగాలకు నేతృత్వం వహిస్తున్నారు. గతంలో ప్రధానికి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ)లో లక్డాకియా పనిచేశారు. హోంమంత్రిత్వ శాఖ, ప్రధాని నేతృత్వంలోని నియామకాల మంత్రివర్గ కమిటీ(ఏసీసీ) తదుపరి డీజీని నియమించేవరకు లక్డాకియా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. గతేడాది డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన దుర్గాప్రసాద్ (1981 బ్యాచ్, తెలంగాణ కేడర్) సోమవారం పదవీ విరమణ చేశారు. -
రాజీనామాలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు
భారత పారామిలటరీ దళాల ఉద్యోగుల్లో రాజీనామాలు లేదా స్వచ్ఛంద పదవీ విరమణకు అర్జీలు పెట్టుకునేవారి సంఖ్య భారీగా పెరిగింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)లలో విధులు నిర్వహించే ఉద్యోగులు ఈ చార్టులో ముందున్నట్లు మంగళవారం జరిగిన లోక్‌సభ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగులు స్వచ్చంద పదవీ విరమణ కోరండం లేదా రాజీనామా చేయడానికి గల కారణాలు తెలియరాలేదని హోమ్ అఫైర్స్ మంత్రి కిరణ్ రిజిజు రాత పూర్వకంగా పేర్కొన్నారు. 2015లో పారామిలటరీ దళాల్లో 117మంది గెజిటెడ్ ఆఫీసర్లు రాజీనామా లేదా స్వచ్చంద పదవీ విరమణ కోరారని చెప్పారు. 2016లో ఈ సంఖ్య 151కి పెరిగిందని తెలిపారు. సబార్డినేట్ ఉద్యోగుల్లో ఈ సంఖ్య గెజిటెడ్ ఉద్యోగులకు రెండితలుగా ఉందని వెల్లడించారు. 2015లో 707మంది రాజీనామా లేదా స్వచ్చంద పదవీ విరమణ ద్వారా సర్వీసుల నుంచి తప్పుకోగా.. 2016లో ఈ సంఖ్య 1,400లకు చేరింది. మిగిలిన ర్యాంకులకు చెందిన ఉద్యోగుల్లో ఈ సంఖ్య 3,052 నుంచి 7,415కు చేరింది. గత మూడేళ్లలో దాదాపు 20వేల మందికి పైగా పారామిలటరీ ఉద్యోగులు స్వచ్చంద పదవీ విరమణ లేదా రాజీనామా కోరినట్లు రిజిజు తెలిపారు. -
బ్యాంకుల వద్దకు పారామిలటరీ బలగాలు
పెద్ద నోట్ల రద్దు అనంతరం మూతపడిన బ్యాంకులు నేడు తెరుచుకున్నాయి. పాతనోట్లు వెనక్కి ఇచ్చేసి, కొత్త నోట్ల తీసుకోవడం కోసం జనాలు బ్యాంకుల వద్ద బారులు తీరారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల వద్ద ఎలాంటి సెక్యురిటీ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు భారీగా పారామిలటరీ బలగాలు, డిల్లీ పోలీసు సిబ్బంది, క్విక్ రియాక్షన్ టీమ్స్ దేశరాజధానిలో మోహరించారు. జనాలతో బ్యాంకులు రష్‌గా ఉండటంతో పటిష్టం భద్రత కోసం ప్రభుత్వం వీరిని నియమించింది. 1,200 పారామిలటరీ సిబ్బంది, 2,200 ఢిల్లీ పోలీసుతో పాటు మరో 1,000 మందిని కేంద్ర హోం మంత్రిత్వశాఖ సత్వర చర్యలు కోసం పక్కన పెట్టింది. ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడితే వారిని ప్రభుత్వం అక్కడికి పంపనుందని అధికార వర్గాలు తెలిపాయి. 200 సత్వర చర్యలు తీసుకునే టీమ్స్‌ను ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు పంపినట్టు పేర్కొన్నారు. బ్లాక్‌మనీని నిర్మూలించడానికి 500, 1000 పెద్ద నోట్లను రద్దు చేస్తూ మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ షాకింగ్ నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని నిర్ణయం అనంతరం నిన్న(బుధవారం) బ్యాంకులు పనిచేయలేదు. నేడు ఓపెన్ అయిన బ్యాంకులు కొత్త నోట్లను జారీచేస్తున్నాయి. పాతనోట్ల రద్దుతో ఇబ్బంది పడుతున్న ప్రజలు, కొత్త నోట్ల కోసం బ్యాంకుల వద్దకు పరిగెత్తారు. -
సీఆర్పీఎఫ్లో మహిళలకు 33%
న్యూఢిల్లీ: పారామిలటరీ దళాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్)ల్లో కానిస్టేబుల్ స్థాయి నియామకాల్లో ఇకపై మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించనున్నారు. అలాగే, సరిహద్దుల రక్షణ బాధ్యతలు నిర్వహించే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ)ల్లోని కానిస్టేబుల్ స్థాయి నియామకాల్లో 15% మహిళలకు రిజర్వ్ చేయనున్నారు. తక్షణమే అమల్లోకి వచ్చేలా ఈ ప్రతిపాదనలకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం లభించిందని మంగళవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దళాల్లో ప్రస్తుతం దాదాపు 9 లక్షల మంది సాయుధ సైనికులు ఉండగా, వారిలో 20 వేల మంది మాత్రమే మహిళలు. ప్రపంచంలోనే అతిపెద్ద పారామిలటరీ దళమైన సీఆర్పీఎఫ్లో 6300 మంది మహిళలే ఉన్నారు. శాంతి భద్రతల విధుల్లో, నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లలో సీఆర్పీఎఫ్ను వినియోగిస్తారు. -
పారామిలటరీ దళాల రక్షణలో ఈవీఎంలు
న్యూఢిల్లీ: వచ్చే ఆదివారం ఫలితాలు వెలువడేవరకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు చెందిన ఈవీఎంలు పారామిలటరీ దళాల రక్షణలో ఉన్నాయని గురువారం ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 810 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే మొత్తం 11,993 ఈవీఎంలను 14 ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చినట్లు వారు తెలిపారు.‘ మయూర్ విహార్ సమీపంలోని కామన్వెల్త్ గేమ్స్ విలేజ్, కిచిడీపూర్లోని ఐఐటీ, వివేక్‌విహార్ లోని వివేకానంద మహిళా విద్యాలయ వంటి ప్రాంతాల్లో పారామిలటరీ దళాల రక్షణలో భద్రపర్చినట్లు వారు వివరించారు. 900 పారాట్రూపర్లను ఆయా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మోహరించినట్లు డిప్యూటీ ముఖ్య ఎన్నికల అధికారి ఎ.కె.శ్రీవాస్తవ వివరించారు.‘ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. ఎటువంటి అవకతవకలు జరగకుండా ఓటింగ్ పూర్తయిన వెంటనే బుధవారం రాత్రే ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలకు తరలించాం..’ అని శ్రీవాస్తవ తెలిపారు. సుమారు 70 వేల మంది పోలింగ్ అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పాల్గొన్నారని ఆయన వివరించారు.