రాజీనామాలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు
రాజీనామాలు చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు
Published Wed, Feb 8 2017 5:14 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
భారత పారామిలటరీ దళాల ఉద్యోగుల్లో రాజీనామాలు లేదా స్వచ్ఛంద పదవీ విరమణకు అర్జీలు పెట్టుకునేవారి సంఖ్య భారీగా పెరిగింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్)లలో విధులు నిర్వహించే ఉద్యోగులు ఈ చార్టులో ముందున్నట్లు మంగళవారం జరిగిన లోక్‌సభ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగులు స్వచ్చంద పదవీ విరమణ కోరండం లేదా రాజీనామా చేయడానికి గల కారణాలు తెలియరాలేదని హోమ్ అఫైర్స్ మంత్రి కిరణ్ రిజిజు రాత పూర్వకంగా పేర్కొన్నారు.
2015లో పారామిలటరీ దళాల్లో 117మంది గెజిటెడ్ ఆఫీసర్లు రాజీనామా లేదా స్వచ్చంద పదవీ విరమణ కోరారని చెప్పారు. 2016లో ఈ సంఖ్య 151కి పెరిగిందని తెలిపారు. సబార్డినేట్ ఉద్యోగుల్లో ఈ సంఖ్య గెజిటెడ్ ఉద్యోగులకు రెండితలుగా ఉందని వెల్లడించారు. 2015లో 707మంది రాజీనామా లేదా స్వచ్చంద పదవీ విరమణ ద్వారా సర్వీసుల నుంచి తప్పుకోగా.. 2016లో ఈ సంఖ్య 1,400లకు చేరింది. మిగిలిన ర్యాంకులకు చెందిన ఉద్యోగుల్లో ఈ సంఖ్య 3,052 నుంచి 7,415కు చేరింది. గత మూడేళ్లలో దాదాపు 20వేల మందికి పైగా పారామిలటరీ ఉద్యోగులు స్వచ్చంద పదవీ విరమణ లేదా రాజీనామా కోరినట్లు రిజిజు తెలిపారు.
Advertisement