
వాషింగ్టన్‌లో ఇటీవల జరిగిన మైక్రోసాఫ్ట్ 50వ వార్షికోత్సవ వేడుకలకు పాలస్తీనా అనుకూల ఉద్యోగులు అంతరాయం కలిగించారు. ఇజ్రాయెల్ సైనిక చర్యల్లో మైక్రోసాఫ్ట్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ ఇందులో కొందరు రాజీనామా చేశారు. వీరిలో మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగానికి చెందిన ఇండో అమెరికన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వానియా అగర్వాల్ కూడా ఉన్నారు. గాజాలో హింసాకాండకు ఈ సంస్థ సహకరిస్తోందని ఆరోపిస్తూ మైక్రోసాఫ్ట్‌ను ‘డిజిటల్ ఆయుధాల తయారీదారు’గా అభివర్ణించారు. బహిరంగంగానే రాజీనామా సమర్పిస్తున్నట్లు ప్రకటిస్తూ నినాదాలతో సమావేశం నుంచి బయటకు వచ్చారు.
ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖతో మైక్రోసాఫ్ట్ కుదుర్చుకున్న 133 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని అగర్వాల్ ఖండించారు. కంపెనీ ఏఐ, అజూర్ క్లౌడ్ సేవలు పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ సైనిక చర్యలకు మద్దతుగా నిలిస్తున్నాయని పేర్కొన్నారు. ‘మైక్రోసాఫ్ట్ క్లౌడ్, కృత్రిమ మేధ గాజాలో ఇజ్రాయెల్ సైన్యాన్ని మరింత ప్రాణాంతకంగా, విధ్వంసకరంగా మార్చేందుకు వీలు కల్పిస్తున్నాయి’ అని అగర్వాల్ కంపెనీకి సమర్పించిన ఈమెయిల్‌లో రాశారు. మైక్రోసాఫ్ట్ టెక్నాలజీని ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థలు, యుద్ధ మౌలిక సదుపాయాలతో ముడిపెట్టిన నివేదికలను ఆమె ఉదహరించారు.
ఇదీ చదవండి: త్వరలో ధరలు పెంపు.. యాపిల్ స్టోర్ల వద్ద రద్దీ
అమెజాన్‌లో మూడేళ్లకు పైగా పనిచేసిన తర్వాత 2023 సెప్టెంబర్‌లో మైక్రోసాఫ్ట్‌లో చేరిన అగర్వాల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. పాలస్తీనాకు అనుకూలంగా ఉన్న ఉద్యోగుల్లో అసమ్మతి పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఆమె నిరసన తెలపడం తాజాగా చర్చనీయాంశం అయింది. ఫిబ్రవరిలో సీఈఓ సత్య నాదెళ్లతో జరిగిన ఒక సమావేశంలో ఇలాంటి ఆందోళనల కారణంగా అంతరాయం కలగడంతో ఐదుగురు సిబ్బందిని తొలగించారు. ఈ ఆరోపణలపై గానీ, అగర్వాల్ రాజీనామాపై గానీ మైక్రోసాఫ్ట్ ఇంకా బహిరంగంగా స్పందించలేదు.