టెల్‌అవీవ్:కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఇటు ఇజ్రాయెల్ , అటు హమాస్ ఒప్పందం అమలు దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఒప్పదంలో భాగంగా ఇజ్రాయెల్ తాజాగా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఇప్పటికే హమాస్ తన వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్లో నుంచి ముగ్గురిని విడుదల చేసింది.
అనంతరం ఇజ్రాయెల్ 90 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. ఇజ్రాయెల్,హమాస్ మధ్య తాజాగా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో పదిహేను నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా తెర పడింది. ఇజ్రాయెల్,హమాస్ మధ్య విరమణ ఒప్పందం ఆదివారం ఉదయం అమల్లోకి వచ్చింది.
ఆరు వారాల్లో హమాస్ 33 మంది బందీలను, ఇజ్రాయెల్ దాదాపు 2వేల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనున్నాయి. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని నెతన్యాహూ ప్రభుత్వంలో భాగస్వామి ఓజ్మా యేహూదిత్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం నుంచి ఆ పార్టీ వైదొలగింది. పార్టీకి చెందిన ముగ్గురు నేతలు ఇప్పటికే తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
2023 అక్టోబర్ 7న పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి 1200 మందిని చంపారు.కొంత మందిని తమ వెంట బందీలుగా తీసుకెళ్లారు.దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 47 వేల మంది దాకా మరణించినట్లు సమాచారం. తాజా కాల్పుల విరమణతో గాజాలో శాంతి నెలకొనే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment