బెంజమిన్ నెతన్యాహూ
గాజా సిటీ: పదకొండు రోజులుగా గాజా స్ట్రిప్‌పై కొనసాగిస్తున్న వైమానిక దాడులకు ఇజ్రాయెల్ ముగింపు పలుకనుంది. ఏకపక్ష కాల్పుల విరమణకు, వైమానిక దాడుల నిలిపివేతకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ నేతృత్వంలో గురువారం జరిగిన భద్రతా కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపిందని ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. గాజాలో పాలస్తీనియన్లపై దాడుల్లో చిన్నారులు, మహిళలతో సహా సాధారణ పౌరులు మృతి చెందడంతో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ధోరణిపై విమర్శలు వచ్చాయి. సంయమనం పాటించాలని పలుదేశాలు విజ్ఞప్తి చేశాయి.
శాంతిస్థాపన కోసం ఈజిప్టు సహా పలు దేశాలు మధ్యవర్తిత్వం నెరిపాయి. మరోవైపు ఇజ్రాయెల్‌కు గట్టి మద్దతుదారైన అమెరికా ఒత్తిడి పెంచింది. దాడులు ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసి కోరారు. తమ లక్ష్యం నెరవేరేదాకా ఆపబోమని భీష్మించిన ఇజ్రాయెల్ చివరకు అమెరికా నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో కాల్పుల విరమణకు అంగీకరించింది.
కాల్పుల విరమణ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనేది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు. అధికారిక వార్తా ఛానల్ కాన్ మాత్రం ఇది తక్షణం అమలులోకి వస్తుందని తెలిపింది. ఇజ్రాయెల్ నిర్ణయంపై హమాస్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా కనీసం 230 మంది పాలస్తీనియన్లు మరణించారు. హమాస్ రాకెట్ల దాడిలో 12 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment