
ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) మరోసారి గాజాను లక్ష్యంగా చేసుకుంది. హమాస్ స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 200 మంది మృతిచెందారు. ఇజ్రాయెల్- హమాస్(Israel-Hamas) మధ్య మొదటి దశ కాల్పుల విరమణ ముగిసిన సమయంలో.. రెండవ దశ చర్చలపై ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకుంటారో అనే దానిపై సందేహాలు నెలకొన్న సమయంలో ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడింది. ఈ దాడులపై అమెరికా గట్టిగా స్పందించింది.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం సెంట్రల్ గాజాలోని దేర్ అల్-బలాలోని మూడు ఇళ్లు, గాజా నగరంలోని ఒక భవనం, ఖాన్ యూనిస్, రఫాలోని పలు ప్రదేశాలపై దాడి జరిగింది. జనవరిలో ప్రారంభమైన మూడు దశల కాల్పుల విరమణ(Three-phase ceasefire)ను ఎలా కొనసాగించాలనే దానిపై ఇజ్రాయెల్- హమాస్ మధ్య విభేదాలు నెలకొన్నాయి ఈ నేపధ్యంలోనే హింస చెలరేగుతోంది. గత రెండు వారాలలో జరిగిన చర్చల్లో అమెరికా మద్దతు కలిగిన అరబ్ మధ్యవర్తులు ఇరు పక్షాల మధ్య విభేదాలను పరిష్కరించలేకపోయారు.
ఇజ్రాయెల్ రెండవ దశ కాల్పుల విరమణకు వెళ్లే బదులు మొదటి దశ కాల్పుల విరమణ పొడిగింపుపై మొండిగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండవ దశ కాల్పుల విరమణలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు గాజా నుండి పూర్తిగా వైదొలగవలసి ఉంటుంది. ఇజ్రాయెల్ దీనిని కోరుకోవడం లేదు. హమాస్.. గాజాను విడిచిపెట్టే వరకు ఇజ్రాయెల్ సైన్యం గాజాను పూర్తిగా విడిచిపెట్టకూడదని అనుకుంటోంది. ఇజ్రాయెల్ రెండవ దశ కాల్పుల విరమణతో ముందుకు సాగడానికి ముందే హమాస్ గాజాను విడిచిపెట్టాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. అందుకే రెండవ దశ కాల్పుల విరమణకు బదులుగా, ఇజ్రాయెల్ మొదటి దశ కాల్పుల విరమణను పొడిగించాలని కోరుకుంటుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని హమాస్ మండిపడింది. తాజా దాడితో తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల ప్రాణాలను ప్రమాదంలోని నెట్టివేసిందని పేర్కొంది.
మరోవైపు ఇజ్రాయెల్ దాడులపై అమెరికా స్పందించింది. గాజాపై దాడికి సంబంధించి నెతన్యాహు ప్రభుత్వం తమకు సమాచారం ఇచ్చిందని తెలిపింది. ఆ తరువాతనే దాడి చేసిందని పేర్కొంది. ఇజ్రాయెల్‌తో సహా అమెరికాను భయపెట్టాలని చూస్తున్న హమాస్‌కు ఇదొక హెచ్చరిక అని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ పేర్కొన్నారు. గాజాను వదిలిపెట్టి వెళ్లాలని హమాస్‌ను ఇప్పుటికే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారని గుర్తుచేశారు. అయితే, ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం చేసిన హమాస్.. ఫలితం అనుభవిస్తోందన్నారు.
ఇది కూడా చదవండి: యెమెన్‌పై మరోమారు అమెరికా దాడి
Comments
Please login to add a commentAdd a comment