జెరూసలెం: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రారంభమై ఆదివారం(ఏప్రిల్ 7)తో సరిగ్గా ఆరు నెలలు గడిచిన వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్ వద్ద బంధీలుగా ఉన్న తమ పౌరులను విడుదల చేసేదాకా గాజాలో కాల్పుల విరమణకు ఒప్పుకునేలేదని తేల్చిచెప్పారు. ఆదివారం జరిగిన ఇజ్రాయెల్ క్యాబినెట్ సమావేశానికి ముందు బెంజమిన్ నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచ దేశాల ఒత్తిడి తమపై పెరుగుతున్నప్పటికీ హమాస్ గొంతెమ్మ కొరికలకు తాము ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు. కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఈజిప్టులో తాజా రౌండ్ చర్చలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కాగా, గతేడాది అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూపు హమాస్ మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే.
ఈ దాడిలో వందల మంది ఇజ్రాయెల్ పౌరులను చంపడమే కాకుండా కొంత మంది పౌరులను హమాస్ ఉగ్రవాదులు తమ వెంట బంధీలుగా తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనాలోని పలు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజాను పూర్తిగా చిధ్రం చేసింది. ఇజ్రాయెల్ దాడులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి.
ఇదీ చదవండి.. ఆరు నెలల మారణహోమం.. వేల మరణాలు
Comments
Please login to add a commentAdd a comment