ట్రంప్‌ యాక్షన్‌.. హార్వర్డ్‌ యూనివర్సిటీ రియాక్షన్‌ | Harvard University Sues Trump Over US Federal Funding Cuts | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ యాక్షన్‌.. హార్వర్డ్‌ యూనివర్సిటీ రియాక్షన్‌

Published Tue, Apr 22 2025 7:22 AM | Last Updated on Tue, Apr 22 2025 7:28 AM

Harvard University Sues Trump Over US Federal Funding Cuts

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చర్యలకు.. హార్వర్డ్‌ యూనివర్సిటీ(Harvard University) తగ్గేదే లే అంటోంది. విశ్వవిద్యాలయానికి అందించే ఫెడరల్‌ నిధులకు ట్రంప్‌ సర్కార్‌ కత్తెర వేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కత్తెరకు సిద్ధపడుతున్న తరుణంలో విశ్వవిద్యాలయం అనూహ్యంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఫెడరల్‌ నిధులను నిలిపివేయడం ద్వారా.. విద్యాపరమైన నిర్ణయాలపై నియంత్రణ సాధించడానికి ట్రంప్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ మసాచుసెట్స్‌ (massachusetts) కోర్టులో దావా వేసింది. అంతేకాదు పలు యూనివర్సిటీలను కూడా ట్రంప్‌ లక్ష్యంగా చేసుకున్నారంటూ దావాలో ప్రస్తావించింది. ట్రంప్‌ చర్యలు ఏకపక్షంగా ఉన్నాయని.. ఫెడరల్‌ చట్టాలను, నిబంధలను ఉల్లంఘించేలా ఉన్నాయని పేర్కొంది. నిధులను స్తంభింపజేయడం, ఫెడరల్‌ సమాఖ్య గ్రాంట్లపై విధించిన షరతులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని, హార్వర్డ్ ఖర్చులను చెల్లించేలా ట్రంప్‌ ప్రభుత్వాన్ని ఆదేశించాలని దావాలో హార్వర్డ్‌ యూనివర్సిటీ కోరింది.

హార్వర్డ్‌ యూనివర్సిటీకి వైట్‌హౌస్‌(White House) పలు నిబంధనలు జారీ చేసిన విషయం తెలిసిందే. విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో యూదు వ్యతిరేక నిరసనల కట్టడికి సంబంధించినవి అవి. అయితే, వాటిని వ్యతిరేకిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్‌ అలాన్‌ గార్బర్‌ పేర్కొన్నారు. ఇక్కడి నుంచి అసలు వ్యవహారం మొదలైంది. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హార్వర్డ్‌ యూనివర్సిటీకి అందించే 2.2 బిలియన్‌ డాలర్ల ఫెడరల్‌ నిధులకు కత్తెర వేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 1 బిలియన్‌ డాలర్ల కోతకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైద్య పరిశోధనల కోసం యూనివర్సిటీకి ఇచ్చే ఫెడరల్‌ గ్రాంట్లు, కాంట్రాక్టుల నుంచి 1 బిలియన్‌ డాలర్లను తగ్గించాలని ట్రంప్‌ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తాజాగా ఓ కథనం ప్రచురించింది.

అయితే.. వైట్‌హౌజ్‌ జారీ చేసిన డిమాండ్లకు ఏ మాత్రం తలొగ్గేది లేదని హార్వర్డ్‌ అధ్యక్షుడు అలాన్‌ గార్బర్‌(Alan Garber) స్పష్టం చేస్తున్నారు. వాటిని బహిరంగంగా తిరస్కరిస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి కొత్త బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. గార్బర్‌ చర్యలపై ట్రంప్‌ యంత్రాంగం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. 

విదేశీ విద్యార్థుల అక్రమ, హింసాత్మక కార్యకలాపాల రికార్డులను సమర్పిస్తేనే కొత్తగా విదేశీయులను చేర్చుకునేందుకు అనుమతిస్తామని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి ట్రంప్‌ ప్రభుత్వం స్పష్టంచేసింది. రికార్డులను సమర్పించకపోతే వర్సిటీకున్న ప్రవేశాల అర్హతను రద్దు చేస్తామని హెచ్చరించింది. విద్యార్థుల రికార్డులను అందించాలని ఆదేశిస్తూ హోంలాండ్‌ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయెమ్‌ వర్సిటీకి ఇప్పటికే ఓ లేఖ రాశారు. ఈ నెల 30వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని అందులో కోరారు. ఒకవేళ వర్సిటీ స్పందించకపోతే.. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్‌ విజిటర్‌ కార్యక్రమం (ఎస్‌ఈవీపీ) ధ్రువీకరణ రద్దవుతుందని పేర్కొన్నారు. 

కానీ, ఈ పరిణామాలను హార్వర్డ్‌ తేలికగా తీసుకుంటోంది. ‘ఆ లేఖ మా దృష్టికీ వచ్చింది. గతంలో మేం చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాం. మా స్వాతంత్య్రం, రాజ్యాంగ హక్కుల విషయంలో మేం రాజీ పడలేం. మేం చట్ట ప్రకారమే నడుచుకుంటాం. ప్రభుత్వ యంత్రాంగం కూడా వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని ఆశిస్తున్నాం’ అని వర్సిటీ ప్రతినిధి స్పష్టంచేశారు.

తమ డిమాండ్లను రహస్యంగా ఉంచాలని ప్రభుత్వం కోరినప్పటికీ.. హార్వర్డ్‌ యూనివర్సిటీ వ్యవహరించిన తీరుతోనే వైట్‌హౌస్‌ ఈ విషయంలో మరింత దూకుడుగా వెళ్లడానికి ఒక కారణమని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తన నివేదికలో పేర్కొంది.

ట్రంప్‌ యంత్రాంగంతో ఘర్షణ వైఖరి కారణంగా హార్వర్డ్‌ యూనివర్సిటీ.. ఫెడరల్‌ నిధుల నుంచి దాదాపుగా 9 బిలియన్‌ డాలర్లను కోల్పేయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టుకు చేరడంతో ఏం జరగబోతోందా? అనే ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement