funding
-
ద.మ. రైల్వే ప్రాజెక్టులకు మరిన్ని నిధులు
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ పద్దులో దక్షిణమధ్య రైల్వేకు కేటాయించిన నిధులను రైల్వేశాఖ రూ. 1,350.26 కోట్ల మేర పెంచింది. మధ్యంతర బడ్జె ట్లో దక్షిణమధ్య రైల్వేకు రూ.14,232.84 కోట్లు కేటాయించగా తాజాగా ఆ మొత్తాన్ని 15,583.10 కోట్లకు పెంచింది. మొత్తంగా నిధులు పెంచడంతోపాటు ప్రాజెక్టులవారీగా మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తాలను కూడా సవరించింది. బైపాస్ లైన్లకు నిదుల పెంపు.. జంక్షన్ స్టేషన్ల సమీపంలో రైల్వే ట్రాఫిక్ పెరిగి ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో బైపాస్ లైన్ల నిర్మాణానికి రైల్వే శాఖ ప్రాధాన్యం ఇస్తోంది. వేగంగా పనులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలకు సవరించిన బడ్జెట్లో నిధులు పెంచింది.దక్షిణమధ్య రైల్వేకు తొలుత రూ. 2,905 కోట్లు కేటాయించగా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 3,629 కోట్లకు పెంచింది. అలాగే సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ పనులకు రూ. 113.64 కోట్ల మేర అదనపు కేటాయింపులు చేసింది. ట్రాక్ సామర్థ్యం పెంపు పనులకు తొలుత రూ. 1,530 కోట్లు కేటాయించగా ఆ మొత్తాన్ని రూ. 1,930 కోట్లకు పెంచింది. కాజీపేట–విజయవాడ మూడో లైన్‌కు పెరిగిన నిధులు దక్షిణాది–ఉత్తరాదిని జోడించే గ్రాండ్ ట్రంక్ రూట్లో భాగంగా ఉన్న కాజీపేట–విజయవాడ మార్గంలో జరుగుతున్న మూడో లైన్ నిర్మాణంపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఈ మార్గంలో రైళ్ల సంఖ్యను పెంచడంతోపాటు రైళ్ల వేగాన్ని కూడా పెంచాలని ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకోసం మూడో మార్గాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఏడాదిలో పనులు ముగించేలా చూస్తోంది. ఈ ప్రాజెక్టుకు మధ్యంతర బడ్జెట్లో రూ.310 కోట్లు కేటాయించగా తాజాగా ఆ మొత్తాన్ని రూ. 190 కోట్ల మేర పెంచి రూ. 500 కోట్ల కేటాయింపులు చేసింది. మరోవైపు నిజామాబాద్ నుంచి మహబూబ్‌నగర్ మీదుగా డోన్ వరకు రెండో లైన్‌ను నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. ఇది మహారాష్ట్రలోని అకోలా నుంచి డోన్ వరకు విస్తరించిన ప్రాజెక్టు. ఇందులో సికింద్రాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ పూర్తవగా ఎగువ ప్రాంతంలో జరుగుతున్నాయి. నిజామాబాద్–సికింద్రాబాద్ మధ్య జరగాల్సి ఉంది. ఈ పనులకు తొలుత రూ. 220 కోట్లు ప్రతిపాదించగా ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 550 కోట్లకు పెంచడం విశేషం. బీబీనగర్–గుంటూరు మార్గంలో సింగిల్ లైన్ ఉండటంతో ఆ మార్గంలో రైళ్ల సంఖ్య, వాటి వేగం పెంపు సాధ్యం కావట్లేదు. దీంతో ఈ మార్గంలో రెండోలైన్ నిర్మించే ప్రాజెక్టు గత బడ్జెట్లో మంజూరైంది. ఆ పనులకు మధ్యంతర బడ్జెట్లో రూ. 200 కోట్లు కేటాయించారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 220 కోట్లకు పెంచారు. ఎంఎంటీఎస్ రెండో దశకు నిధుల్లో కోత.. పురోగతి అంతంతమాత్రంగానే ఉన్న భద్రాచలం–డోర్నకల్ ప్రాజెక్టుకు రైల్వే శాఖ నిధులు కుదించింది. రూ. 100 కోట్ల కేటాయింపులను రూ. 50 కోట్లకు తగ్గించింది. అలాగే హైదరాబాద్‌లో కీలకమైన ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు కేటాయించిన నిధులను రూ. 50 కోట్ల నుంచి రూ. 40 కోట్లకు కుదించింది. -
ర్యాపిడో ఇక ‘యూనికార్న్’..
దేశంలో ప్రముఖ రైడ్-షేరింగ్ సంస్థ ‘రాపిడో’ మరిన్ని పెట్టుబడులు సమీకరిస్తోంది. వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నేతృత్వంలో ఇటీవల జరిగిన సిరీస్-ఈ ఫండింగ్‌లో ఇన్వెస్టర్ల నుంచి 20 కోట్ల డాలర్లు (సుమారు రూ.1,680 కోట్లు) నిధులు సమీకరణకు హామీ అందుకున్నట్లు ర్యాపిడో తెలిపింది.ఈ తాజా పెట్టుబడులతో రాపిడో విలువ 110 కోట్ల డాలర్లకు (సుమారు రూ.9,236 కోట్లు) పెరిగింది. యానికార్న్ క్లబ్లో చేరింది. ఒక బిలియన్ డాలర్ల విలువను సాధించిన కంపెనీలను యూనికార్న్‌గా వ్యవహరిస్తారు. కొత్తగా సేకరించిన నిధులను దేశం అంతటా రాపిడో కార్యకలాపాలను విస్తరించడానికి, సర్వీస్ డెలివరీని మెరుగుపరచడానికి వినియోగిస్తామని కంపెనీ పేర్కొంది.బైక్ ట్యాక్సీ సర్వీస్‌గా 9 సంవత్సరాల క్రితం ర్యాపిడో ప్రారంభమైంది. పవన్ గుంటుపల్లి, అరవింద్ శంఖ, రుషికేష్‌లు 2015లో దీన్ని స్థాపించారు. ఏడాదికేడాది 150% పైగా వృద్ధితో దేశంలో షేర్డ్ మొబిలిటీ రంగంలో అగ్రగామిగా దాని స్థానాన్ని పటిష్టం చేసుకుంది. మొదట్లో బైక్-టాక్సీలపై దృష్టి సారించిన కంపెనీ, ఆ తర్వాత ఆటో, క్యాబ్ సేవలను విస్తరించింది. దేశంలోని 100 కుపైగా నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
ఒలింపిక్ పతకాల వేటలో... ఖర్చు రూ. 470 కోట్లు
2012 లండన్ ఒలింపిక్స్‌లో గ్రేట్ బ్రిటన్ 29 స్వర్ణాలు, 18 రజతాలు, 18 కాంస్యాలతో (మొత్తం 65 పతకాలు) మూడో స్థానంలో నిలిచింది. సొంతగడ్డపై పెద్ద సంఖ్యలో పతకాలు గెలిచే లక్ష్యంతో అక్కడి ప్రభుత్వం చాలా ఏళ్ల క్రితమే ప్రణాళికలు రూపొందించి పెద్ద సంఖ్యలో నిధులు కేటాయించింది. వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే తాము గెలిచిన ఒక్కో పతకం కోసం 45 లక్షల పౌండ్లు (సుమారు రూ.38 కోట్లు) ఖర్చు చేసినట్లు ఒలింపిక్స్ తర్వాత అధికారులు వెల్లడించారు. ఆధునిక సౌకర్యాలు, శిక్షణ, టోర్నీలు వంటి సన్నాహాల్లో దీనిని ఖర్చు చేశారు. ఇది పుష్కరకాలం క్రితం నాటి మాట. ఇదే విషయాన్ని భారత్ కోణంలో చూస్తే ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు. ఆటగాళ్లు వ్యక్తిగత కష్టం, పట్టుదలను నమ్ముకొనే బరిలోకి దిగుతూ వచ్చారు. ఒలింపిక్స్‌కు చేరువైన సమయంలో అక్కడక్కడా కొంత ఆర్థిక సహకారం లభించినా... అందులో ప్రభుత్వ పాత్ర పెద్దగా లేదు. 1956 నుంచి 1992 వరకు భారత్‌కు ఒలింపిక్స్‌లో ఒక్క వ్యక్తిగత పతకం కూడా రాలేదు. ఆ తర్వాతి ఒలింపిక్స్‌లలో పతకం సాధించినవారు కూడా సొంతంగా సన్నద్ధమైనవారే తప్ప ఒక్కరిని కూడా వ్యవస్థ తీర్చిదిద్దినవారుగా చెప్పలేం. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. కేంద్ర ప్రభుత్వం ఒలింపిక్ క్రీడలను, ఒలింపిక్స్‌కు అర్హత సాధించే ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. గెలిచి వచ్చిన తర్వాత అందించే నజరానాల కంటే గెలిచేందుకు కావాల్సిన వాతావరణం సృష్టించడం కీలకమని నమ్మింది. అందుకే మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఓసీ) పేరుతో ప్రత్యేకంగా ఆర్థిక వనరులను చేకూర్చింది. టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్స్) పథకం పేరుతో ఎంపిక చేసిన ఆటగాళ్లకు సహాయం అందించడం ఈ ఎంఓసీలోనే భాగంగా ఉంది. విదేశాల్లో శిక్షణ, పోటీల కోసం ప్రత్యేక క్యాలెండర్ (ఏసీటీసీ)తో ఈ ప్రణాళిక రూపొందించగా... వివిధ వర్గాల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ద్వారా కూడా నిధులు సేకరించింది. – సాక్షి క్రీడా విభాగం టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ గరిష్టంగా 7 పతకాలు సాధించింది. ఇవి ముగిసిన తర్వాత పారిస్ ఒలింపిక్స్ కోసం సన్నాహాలు షురూ అయ్యాయి. ఈ సారి పతకాల సంఖ్యను పెంచడమే ఏకైక లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) తమ వంతు పని చేసింది. 16 క్రీడాంశాల్లో ఆయా జాతీయ క్రీడా సమాఖ్యల సూచనలు, ప్రతిపాదనలతో ప్రణాళిక సిద్ధమైంది.కేవలం నిధులు అందించడం మాత్రమే కాగా టోక్యో–పారిస్ మధ్య కాలంలో ఆటగాళ్ల ప్రదర్శనను కూడా ‘సాయ్’ పర్యవేక్షిస్తూ వచ్చింది. అధికారిక లెక్కల ప్రకారం పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ. 470 కోట్లు ఖర్చు చేసింది. మన దేశం నుంచి ఈసారి 117 మంది ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. పతకావకాశాలు ఉన్న వివిధ క్రీడలు, క్రీడాకారుల కోసం చేసిన ఖర్చు వివరాలను చూస్తే...అథ్లెటిక్స్: ప్రభుత్వం నుంచి ఎక్కువ ఆర్థిక సహాయం అందుకున్న క్రీడాంశం అథ్లెటిక్స్. ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 29 మంది పాల్గొంటున్నారు. అథ్లెటిక్స్‌కు కేంద్రం రూ.96.08 కోట్లు ఖర్చు చేసింది. గత టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించడంతో ఈ సారి అంచనాలు మరింత పెరిగాయి. మొత్తం 36 జాతీయ శిక్షణా శిబిరాలు నిర్వహించారు. విదేశీ కోచ్ క్లాజ్ బార్టొనెట్ వద్ద శిక్షణ తీసుకోవడంతో పాటు విదేశాల్లో టోర్నీలు, శిక్షణ కోసం నీరజ్ చోప్రాకే ప్రభుత్వం రూ.5.72 కోట్లు ఇ చ్చింది. బ్యాడ్మింటన్: ప్రభుత్వం ఈ క్రీడ కోసం మొత్తం రూ. 72.02 కోట్లు ఖర్చు చేసింది. భారత్ నుంచి సింగిల్స్ విభాగంలో ముగ్గురు... పురుషుల, మహిళల డబుల్స్‌లో కలిపి నలుగురు షట్లర్లు బరిలోకి దిగుతున్నారు. విదేశాల్లో శిక్షణ, టోర్నీలకు గరిష్టంగా బ్యాడ్మింటన్ ఆటగాళ్ల 81 ట్రిప్‌లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. డబుల్స్ స్పెషలిస్ట్ కోచ్ మథియాస్ బో వద్ద శిక్షణ, వీడియో అనలిస్ట్, ఇతర సౌకర్యాల కోసం డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిలకు ప్రభుత్వం రూ. 5.62 కోట్లు ఇవ్వగా... పీవీ సింధుకు రూ.3.13 కోట్లు అందించింది. దీంతో పాటు 17 విదేశీ పర్యటనలు, వ్యక్తిగత కోచ్‌లు, సిబ్బంది నియామకం కోసం కూడా ‘టాప్స్’ ద్వారా సింధుకు సహకారం లభించింది. బాక్సింగ్: రూ.60.93 కోట్లు షూటింగ్: రూ.60.42 కోట్లు (ఆటగాళ్ల మొత్తం 45 విదేశీ ట్రిప్‌లకు ప్రభుత్వ సహకారం లభించింది. మొత్తం 41 జాతీయ క్యాంప్‌లు జరిగాయి) హాకీ: రూ.41.29 కోట్లు (టోక్యోలో కాంస్యం సాధించడంతో ఈ సారి మన జట్టునుంచి మరింత మెరుగైన ప్రదర్శనను ఆశిస్తూ 76 జాతీయ శిక్షణా శిబిరాలు నిర్వహించడంతో పాటు 19 విదేశీ పర్యటనలకు అవకాశం కల్పించింది) ఆర్చరీ: రూ.39.18 కోట్లు (41 జాతీయ క్యాంప్‌లు నిర్వహించారు) రెజ్లింగ్: రూ.37.80 కోట్లు వెయిట్‌లిఫ్టింగ్: రూ.26.98 కోట్లు (టోక్యో రజత పతక విజేత మీరాబాయి చానుకు శిక్షణ నిమిత్తం ప్రభుత్వం రూ. 2.74 కోట్లు అందించింది) టేబుల్ టెన్నిస్: రూ. 12.92 కోట్లు జూడో: రూ. 6.30 కోట్లు స్విమ్మింగ్: రూ.3.90 కోట్లు రోయింగ్: రూ.3.89 కోట్లు సెయిలింగ్: రూ.3.78 కోట్లు గోల్ఫ్: రూ.1.74 కోట్లు టెన్నిస్: రూ.1.67 కోట్లు ఈక్వె్రస్టియన్: రూ.95 లక్షలు -
జెప్టోకు నిధుల పంట
న్యూఢిల్లీ: గ్రోసరీ డెలివరీ స్టార్టప్ జెప్టో భారీగా పెట్టుబడులను అందుకుంది. త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానున్న కంపెనీ 66.5 కోట్ల డాలర్ల (రూ. 5,550 కోట్లు) నిధులను సమీకరించింది. దీంతో ఈ క్విక్ కామర్స్ సంస్థ విలువ 3.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 30,000 కోట్లు)కు ఎగసింది. వెరసి ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, బ్లింకిట్ (జొమాటో), స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ (టాటా గ్రూప్)లతో పోటీ పడనుంది.గ్రోసరీ డెలివరీ విభాగంలో తీవ్ర పోటీ కారణంగా అధిక పెట్టుబడులు, తక్కువ మార్జిన్లు నమోదయ్యే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెప్టోలో తాజా పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడింది. 2021 ఏప్రిల్‌లో ప్రారంభమైన స్టార్టప్ జెప్టోలో కొత్త సంస్థలు ఎవెనీర్ గ్రోత్ క్యాపిటల్, లైట్‌స్పీడ్, అవ్రా క్యాపిటల్‌సహా ప్రస్తుత ఇన్వెస్టర్లు గ్లేడ్ బ్రూక్, నెక్సస్, స్టెప్‌స్టోన్ గ్రూప్ తాజా పెట్టుబడులను అందించాయి.కాగా.. జెప్టో నిర్వహణస్థాయిలో లాభాలు ఆర్జించేందుకు సిద్ధంగా ఉన్నదని, సమీప భవిష్యత్‌లో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే అవకాశముందని సంబంధిత వర్గా లు తెలిపాయి. గ్రోసరీస్‌ను 10 నిమిషాల్లో డెలివరీ చేసే సంస్థల్లో కంపెనీ 29% వాటాను ఆక్రమిస్తుండగా..40% వాటాతో బ్లింకిట్ టాప్‌లో ఉంది. -
మస్క్ ఏఐ కంపెనీ Xaiకి పెట్టుబడుల వరద..
ప్రముఖ బిలియనీర్ ఎలోన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ఏఐ (xAI) సిరీస్ బీ ఫండింగ్ రౌండ్లో 6 బిలియన్లను సేకరించారు. ఇందులో వెంచర్ క్యాప్టలిస్ట్ ఆండ్రీసెన్ హోరోవిట్జ్, సీక్వోయా క్యాపిటల్‌తో సహా పలువురు వ్యాపార వేత్తలు పెట్టుబడులు పెట్టినట్లు ఎక్స్ఏఐ అధికారికంగా తెలిపింది. ఈ నిధుల్ని xAIని మార్కెట్‌కి పరిచయం చేయడానికి, అధునాతన మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, భవిష్యత్ టెక్నాలజీలపై పరిశోధన, వాటి అభివృద్ధిని వేగవంతం చేసేందుకు సంస్థ ఉపయోగించనుంది. అయితే మొత్తం ఎంతమొత్తంలో ఇన్వెస్టర్ల నుంచి మస్క్ నిధుల్ని సేకరిస్తున్నారనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ ఇతర మీడియా నివేదికలు నిధుల మొత్తం 18 బిలియన్ నుంచి 24 బిలియన్ల మధ్య ఉంటుందని సమాచారం. మస్క్ చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ ఫౌండర్లలో ఒకరిగా ఉన్నారు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా పనిచేశారు. అయితే ఏఐ చాట్‌జీపీటీ వల్ల తలెత్తే ప్రమాదాలను గుర్తించారు. ఆ సంస్థ నుంచి వైదొలగారు. టెక్నాలజీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌కు సలహా ఇచ్చారు. -
బీమా పాలసీ.. అత్యవసర నిధి!
ఉన్నట్టుండి నిధుల అవసరం ఏర్పడిందా..? వ్యక్తిగత రుణానికి తక్కువ క్రెడిట్ స్కోర్ అడ్డు పడుతోందా? లేదంటే వ్యక్తిగత రుణంపై అధిక వడ్డీ రేటు చూసి వెనుకాడుతున్నారా..? ఇలాంటి సందర్భాల్లో బీమా పాలసీయే మిమ్మల్ని ఆదుకుంటుంది. అదెలా అంటారా? ఎండోమెంట్ బీమా ప్లాన్లపై బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. పైగా పర్సనల్ లోన్‌తో పోలిస్తే వడ్డీ రేటు తక్కువే.డబ్బులు అవసరం పడితే బీమా పాలసీని సరెండ్ చేసే వారూ ఉన్నారు. ఇలా ఇన్సూరెన్స్ పాలసీని సరెండర్ చేయడానికి బదులు, దానిపై రుణం తీసుకుని అవసరం గట్టెక్కడమే మంచి మార్గం అవుతుంది. దీనివల్ల బీమా రక్షణను ఎప్పటి మాదిరే కొనసాగించుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందన్నది తెలియజేసే కథనమే ఇది. రుణ సదుపాయం అన్ని రకాల బీమా పాలసీలపై వస్తుందనుకుంటే పొరపాటు. కేవలం కొన్ని రకాల పాలసీలకే ఇది పరిమితం. ‘‘పొదుపుతో కూడిన సంప్రదాయ బీమా పాలసీ (ఎండోమెంట్, మనీ బ్యాక్ ప్లాన్లు) కలిగి ఉన్నవారు వాటిపై పలు రకాల ఆర్థిక అవసరాల కోసం రుణాన్ని పొందొచ్చు’’అని ఏజెస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విఘ్నేష్ సహానే తెలిపారు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కేవలం మరణ పరిహారాన్నే అందిస్తాయని, ఎలాంటి రాబడి హామీ ఉండదు కనుక వాటిపై రుణం పొందలేరని స్పష్టం చేశారు. యూనిట్ లింక్డ్ ప్లాన్ల (యులిప్)లోనూ రాబడులు మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి కనుక వాటిపైనా రుణ సదుపాయం ఉండదని తెలిపారు. ఎక్కడ తీసుకోవచ్చు? పాలసీ మంజూరు చేసిన జీవిత బీమా కంపెనీ నుంచే రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. నేడు చాలా బీమా సంస్థలు పాలసీలపై రుణాలను కూడా ఇస్తున్నాయి. అలాగే, బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు ఈ తరహా రుణాలను ఆఫర్ చేస్తుంటాయి. అయితే, బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల కంటే పాలసీ మంజూరు చేసిన బీమా సంస్థను సంప్రదించడమే మెరుగైన మార్గమని నిపుణులు అంటున్నారు. ‘‘ఇన్సూరెన్స్ కంపెనీతో పోలిస్తే బ్యాంక్‌లు బీమా ప్లాన్లపై తక్కువ రుణ మొత్తాన్ని ఆఫర్ చేస్తాయి. అదే మాదిరి బీమా సంస్థలతో పోలిస్తే బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు రుణాలపై కొంచెం అధిక రేటును వసూలు చేస్తుంటాయి’’అని సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ‘ప్లాన్ ఆర్’ వ్యవస్థాపకుడు అజయ్ ప్రుతి తెలిపారు. బ్యాంక్‌లు సాధారణంగా బీమా పాలసీపై రుణాన్ని నేరుగా కాకుండా.. కరెంట్ అకౌంట్‌పై ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కింద అందిస్తుంటాయి. ‘‘తరచుగా నిధుల అవసరం ఏర్పడేవారు ఇలా కరెంట్ అకౌంట్‌పై (సెక్యూరిటీ కింద బీమా పాలసీ జమ చేసి) ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం తీసుకోవడాన్ని పరిశీలించొచ్చని పైసా బజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సహిల్ అరోరా సూచించారు. చౌక రుణం ‘‘బీమా పాలసీలపై రుణ రేటు చాలా తక్కువగా ఉండడాన్ని గమనించొచ్చు. సాధారణంగా వీటిపై 9–9.5 శాతం వార్షిక వడ్డీ రేటును వసూలు చేస్తుంటారు. అదే వ్యక్తిగత రుణాలు (పర్సనల్ లోన్) అయితే 12 శాతం అంతకంటే ఎక్కువే ఉంటుంది’’అని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజేష్ కృష్ణన్ తెలిపారు. ఇక బీమా పాలసీలపై రుణం ఎంతొస్తుందంటే.. రుణం తీసుకునే నాటికి ఉన్న స్వా«దీనపు విలువ (సరెండర్ వ్యాల్యూ)లో 90 శాతం వరకు. బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణం మంజూరునకు సాధారణంగా నాలుగు నుంచి ఏడు రోజులు పడుతుంది. అదే బీమా సంస్థల నుంచి రుణం మూడు రోజుల్లోనే పొందొచ్చు. కొన్ని బీమా సంస్థలు ఇంతకంటే వేగంగా ఆన్లైన్లోనే పాలసీలపై రుణాలను మంజూరు చేస్తున్నాయి. ‘‘జీవిత బీమా పాలసీలపై రుణం దరఖాస్తు మదింపు, రుణం మంజూరు చాలా వేగంగా ఉంటుంది. బీమా సంస్థ నుంచే రుణం తీసుకునేట్టు అయితే ఎలాంటి అదనపు తనిఖీలు, పరిశీలనలు అవసరం పడవు’’అని రాజేష్ కృష్ణన్ వివరించారు.బీమా పాలసీపై రుణం తీసుకోవడం ఎంతో సౌకర్యమైనదిగా పాలసీఎక్స్ సీఈవో నావల్ గోయల్ సైతం అంగీకరించారు. ‘‘దరఖాస్తు చేసుకోవడం ఎంతో సులభం. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వారు సైతం పాలసీపై రుణానికి అర్హులే. ఎందుకంటే పాలసీపై రుణం జారీకి క్రెడిట్ స్కోర్ తనిఖీలు అవసరం పడవు’’అని కృష్ణన్ తెలిపారు. ఈ రుణం తిరిగి చెల్లింపు నిబంధనలు కూడా సులభమే. ‘‘రుణం చెల్లించడం వీలు కానప్పుడు కేవలం రుణంపై వడ్డీ వరకే చెల్లించొచ్చు. అసలు రుణాన్ని ఎప్పుడైనా తిరిగి తీర్చివేయవచ్చు’’అని ప్రుతి వివరించారు. ఎంత వీలైతే అంత అసలు రుణంలో చెల్లించుకుంటూ వెళ్లడం కూడా మంచి ఆలోచనే. దీనివల్ల ప్రతి నెలా చెల్లించే వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. అత్యవసర నిధి బీమా పాలసీ అత్యవసర నిధిగానూ అక్కరకొస్తుంది. ప్రతి కుటుంబానికి విధిగా అత్యవసర నిధి ఉండాలి. అనుకోని పరిణామాలతో నెలవారీ వచ్చే ఆదాయం ఆగిపోతే? చేస్తున్న ఉద్యోగం ఊడిపోతే..? అక్కడి నుంచి తిరిగి ఉపాధి లభించేంత వరకు కుటుంబ అవసరాలను తీర్చేందుకు అత్యవసర నిధి ఉపయోగపడుతుంది. కనీసం ఆరు నెలల నుంచి ఏడాది అవసరాలను తీర్చేంత అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. అయితే, ప్రతి ఒక్కరికీ ఇంత మొత్తం అత్యవసర నిధి కింద ఏర్పాటుకు వెసులుబాటు ఉండకపోవచ్చు. ఇలాంటి వారు ఎండోమెంట్ లేదా మనీబ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను అత్యవసర నిధి కింద ఉపయోగించుకోవచ్చు. తిరిగి ఉపాధి ఏర్పడి, ఆదాయం చేతికి అందేంత వరకు పాలసీపై రుణంతో అవసరాలను గట్టెక్కొచ్చు. ఆ తర్వాత క్రమంగా ఆరు నెలల్లోపు పాలసీపై రుణాన్ని తీర్చివేయడం మంచి ఆలోచన అవుతుంది. పాలసీ సరెండర్ అంటే? ఎండోమెంట్ లేదా మనీ బ్యాక్ బీమా ప్లాన్ వద్దనుకునే వారు దాన్ని సరెండర్ చేసుకోవచ్చు. అంటే గడువు ముగియకుండానే పాలసీని వెనక్కిచ్చేయడం. పాలసీ తీసుకున్న తర్వాత ఎంత కాలానికి సరెండర్ చేస్తున్నారనే దాని ఆధారంగా దానిపై ఎంతొస్తుందన్నది ఆధారపడి ఉంటుంది. ఈ సరెండర్ వ్యాల్యూ (స్వా«దీనపు విలువ) విషయంలో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) 2024 ఏప్రిల్ 1 నుంచి నూతన నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ప్రకారం బీమా పాలసీ తీసుకున్న మూడేళ్లలోపు సరెండర్ చేస్తే చేతికి చాలా తక్కువే వస్తుంది. అంటే అప్పటికి కట్టిన ప్రీమియంలో సగం కూడా రాదు. అదే పాలసీ తీసుకున్న తర్వాత నాలుగేళ్ల నుంచి ఏడేళ్లలోపు సరెండర్ చేస్తే అధిక విలువ పాలసీదారుకు దక్కుతుంది. నిజానికి ఎండోమెంట్, మనీబ్యాక్ పాలసీల్లో 20–30 ఏళ్లపాటు కొనసాగినప్పుడే ప్రతిఫలం కనిపిస్తుంది. ఇంతకంటే తక్కువ కాలవ్యవధిపై వచ్చే ప్రయోజనం అంతగా ఉండదు. అందుకని నిధుల అవసరం ఏర్పడితే బీమా ప్లాన్‌ను సరెండర్ చేయడానికి బదులు.. దానిపై రుణం పొందడమే మెరుగైనది అవుతుంది. మళ్లీ నిధుల వెసులుబాటు వచ్చిన వెంటనే తీసుకున్న రుణాన్ని తీర్చివేయాలి. ఆరంభంలో తక్కువే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న కొత్తలో దీనిపై వచ్చే రుణం చాలా స్వల్పం. ఇందులో ఉన్న ప్రతికూలత ఇదే. క్యాష్ వ్యాల్యూ లేదా సరెండర్ వ్యాల్యూ గణనీయంగా పెరిగేందుకు కొన్నేళ్లు పడుతుంది. అప్పుడే చెప్పుకోతగ్గ మేర రుణం దీనిపై వస్తుంది. ఇక ఎండోమెంట్ లేదా మనీ బ్యాంక్ పాలసీలపై దీర్ఘకాలంలో వచ్చే రాబడి 5–6 శాతం మేర ఉంటుంది. దీనిపై రుణం తీసుకుంటే, నికరంగా అందుకునే రాబడి ప్రయోజనం మరింత తగ్గిపోతుందని గుర్తు పెట్టుకోవాలి. తిరిగి చెల్లించలేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై ఉన్న మరో అనుకూలత ఏమిటంటే.. రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనా అది క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయబోదని కృష్ణన్ తెలిపారు. రుణంలో అసలు, వడ్డీ, చార్జీలు అన్నింటినీ పాలసీ సరెండర్ వ్యాల్యూ నుంచి బీమా సంస్థలు సర్దుబాటు చేసుకుంటాయని సహిల్ అరోరా తెలిపారు. రుణం చెల్లించకుండా పాలసీదారు మరణించిన సందర్భాల్లో.. పరిహారం నుంచి రుణం, వడ్డీ, చార్జీలను మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని బీమా సంస్థ నామినీ లేదా పాలసీదారు వారసులకు చెల్లిస్తుంది. రుణం తీర్చకుండానే పాలసీ గడువు ముగిసిపోయిందనుకుంటే.. అప్పుడు నికరంగా చెల్లించే మొత్తం నుంచి రుణాన్ని బీమా సంస్థ వసూలు చేసుకుంటుంది. ఒకవేళ రుణంపై వడ్డీ కూడా బకాయి పడితే.. అసలు, వడ్డీ మొత్తం సరెండర్ వ్యాల్యూని దాటిపోతుంటే అప్పుడు పాలసీని బీమా సంస్థ రద్దు చేస్తుంది. పాలసీపై రుణం తీసుకునే సమయంలోనే దానిపై బీమా సంస్థకు హక్కులు బదలాయిస్తున్నట్టు అంగీకారాన్ని తీసుకుంటాయి. రుణం సమంజసమేనా..? అసలు జీవిత బీమా ఎందుకు? ఆర్జించే వ్యక్తికి దురదృష్టవశాత్తూ ఏదైనా వాటిల్లితే అప్పుడు అతనిపై ఆధారపడిన కుటుంబం ఆర్థికంగా కష్టాలు పడకూడదనే. తాను లేకపోయినా, తన కుటుంబ అవసరాలను తీర్చే లక్ష్యంతోనే లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీని తీసుకుంటుంటారు. మరి అలాంటి సాధనంపై రుణం తీసుకుంటే, అసలు ప్రయోజనానికే భంగం కలగొచ్చని నిపుణుల భావన. అదెలా అంటే పాలసీపై రుణం తీసుకున్న తర్వాత సదరు పాలసీదారు అనుకోకుండా మరణం పాలైతే.. కుటుంబానికి దక్కే బీమా పరిహారం పెద్దగా ఉండకపోవచ్చు. దాంతో బీమా ఉద్దేశ్యం నెరవేరకుండా పోతుంది. అందుకని బంగారం, మ్యూచువల్ ఫండ్స్, ప్రాపర్టీ తదితర ఇతర సాధనాలపై రుణం తీసుకోవడాన్ని పరిశీలించొచ్చని చెబుతుంటారు. కానీ, ఇక్కడ వాస్తవ అంశం ఏమిటంటే.. బంగారంపై రుణం తీసుకున్న తర్వాత సదరు వ్యక్తి మరణించినా కానీ, ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత కుటుంబంపైనే పడుతుంది. అందుకని ఏ సాధనంపై రుణం తీసుకున్నా పరిణామం ఒక్కటిగానే ఉంటుంది. అందుకుని దీనికి పరిష్కారం ఒకటి ఉంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఏదైనా అవసరం కోసం రుణం తీసుకుంటుంటే, వెంటనే అంత విలువకు టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీని పెంచుకోవడం లేదంటే అదనపు కవరేజీతో టర్మ్ ప్లాన్ కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల అనుకోనిది జరిగినా వచ్చే పరిహారంతో రుణాలను గట్టెక్కొచ్చు. ఇక దీర్ఘకాల అవసరాలకు కాకుండా స్వల్పకాల అవసరాలకే బీమాపై రుణానికి పరిమితం కావాలి. మూడు నుంచి ఆరు నెలలు మించకూడదు. ఎందుకంటే ఇంత తక్కువ కాలానికి చెల్లించాల్సిన వడ్డీ భారం కూడా చాలా తక్కువే ఉంటుంది. కనుక ఒకవేళ పాలసీదారు మరణించినా కుటుంబం పెద్దగా నష్టపోయేది ఉండదు. బీమా సంస్థ తనకు రావాల్సినంత మేర మినహాయించుకుని, మిగిలినది చెల్లించేస్తుంది. ఎండోమెంట్ ప్లాన్ ఉన్న వారు విధిగా మెరుగైన కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పకుండా తీసుకోవాలి. అప్పుడు కుటుంబానికి మెరుగైన ఆర్థిక రక్షణ ఉంటుంది. -
ఏమిటీ ఎలక్టోరల్ బాండ్లు..!
ఎన్నికల బాండ్లు. పార్టిలకు విరాళాలిచ్చేందుకు ఉద్దేశించిన ప్రామిసరీ నోట్ల వంటి పత్రాలు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. భారతదేశానికి చెందిన వ్యక్తులు/సంస్థలు ఎవరైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాలూకు ఎంపిక చేసిన శాఖల్లో వీటిని కొనుగోలు చేసి తమకు నచి్చన పార్టికి విరాళంగా ఇవ్వవచ్చు. ఇవి రూ.1,000, రూ.10 వేలు, రూ.లక్ష, రూ.కోటి ముఖవిలువతో ఉంటాయి. జారీ అయిన 15 రోజుల్లోపు వీటిని నగదుగా మార్చుకోవాలి. లేదంటే ఆ మొత్తం ప్రధాని జాతీయ రిలీఫ్ ఫండ్‌కు వెళ్తుంది. బాండ్ల కొనుగోలుపై సంఖ్య పరిమితేమీ లేదు. ఒక్కరు ఎన్ని బాండ్లైనా కొనవచ్చు. పైగా తమ వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచవచ్చు. బాండ్లపై వారి పేరు తదితర వివరాలేవీ ఉండవు. బ్యాంకు వాటిని ఎవరికీ వెల్లడించదు. పార్టీలు రూ.20 వేలకు మించిన నగదు విరాళాల వివరాలను విధిగా బయట పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ బాండ్ల విషయంలో అలాంటి నిబంధనేదీ లేదు. ఎంత పెద్ద మొత్తం విరాళంగా అందినా వివరాలను ఈసీతో పాటు ఎవరికీ వెల్లడించాల్సిన పని లేదు. ఇది పారదర్శకతకు పాతరేయడమేనన్నది ప్రజాస్వామ్యవాదుల ప్రధాన అభ్యంతరం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టిలన్నింటికీ బాండ్లు సేకరించే అవకాశమున్నా ఇది ప్రధానంగా అధికార పార్టిలకే బాగా ఉపయోగపడుతుందన్న వాదనలున్నాయి. ఎన్నికల బాండ్ల పథకం నిబంధనలు పౌరుల సమాచార హక్కు చట్టానికే విరుద్ధమని సుప్రీంకోర్టులో హోరాహోరీగా వాదనలు జరిగాయి. చివరికి ఈ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఇవీ అభ్యంతరాలు ► బాండ్ల కొనుగోలుదారులతో సహా అన్ని వివరాలూ గోప్యంగా ఉంటాయి. ఇది పారదర్శకతకు గొడ్డలిపెట్టు. ► భారీగా విరాళాలిచ్చే కార్పొరేట్ సంస్థలు సదరు పార్టీ అధికారంలోకి వచ్చాక దాని నుంచి భారీగా అనుచిత లబ్ధి పొందే ఆస్కారం చాలావరకు ఉంటుంది. ఇది క్విడ్ ప్రొ కోకు దారి తీస్తుంది. ► పైగా ఈ బాండ్లతో అధికార పార్టిలకే అధిక ప్రయోజనం. దేశవ్యాప్తంగా అత్యధిక బాండ్లు వాటికే అందుతుండటమే ఇందుకు నిదర్శనం. ► మొత్తం ప్రక్రియలో ఎవరి పేరూ బయటికి రాదు గనుక వ్యక్తులకు, సంస్థలకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకు అధికార పార్టిలు ఇలా బాండ్ల ముసుగులో లంచాలు స్వీకరించే ఆస్కారం కూడా పుష్కలంగా ఉంది. ► పైగా ఈ నిధులను ఎన్నికల కోసమే వాడాలన్న నిబంధనేమీ లేదు. దాంతో వాటిని పార్టిలు తమ ఇష్టానికి ఖర్చు చేసుకోవచ్చు. ► దేనిపై వెచి్చంచాయన్న వివరాలు కూడా ఎవరికీ చెప్పాల్సిన అవకాశం లేదు. ► ఈ పథకం నల్లధనాన్ని మార్చుకునే పరికరంగా కూడా మారింది. ► దీనికి తోడు బాండ్ల కొనుగోలుదారుల వివరాలను తెలుసుకునే అవకాశం అధికార పార్టిలకు ఉంటుంది. ► తద్వారా సదరు వ్యక్తులను, కంపెనీలను వేధించే ప్రమాదమూ ఉంది. అత్యధిక వాటా బీజేపీదే ఎన్నికల బాండ్ల పథకం ద్వారా 2018 మార్చి నుంచి 2024 జనవరి దాకా రూ.16,518.11 కోట్ల విలువైన 28,030 బాండ్లు జారీ అయ్యాయి. వీటిలో పార్టిలన్నింటికీ కలిపి రూ.12,000 కోట్లకు పైగా విరాళాలందాయి. ఎన్నికల సంఘం, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) గణాంకాల ప్రకారం ఇందులో ఏకంగా సగానికి పైగా, అంటే 55 శాతం బీజేపీ వాటాయే కావడం విశేషం. బాండ్ల ద్వారా ఆ పార్టికి రూ.6,566 కోట్లు సమకూరాయి. బీజేపీ మొత్తం ఆదాయంలో సగానికి పైగా బాండ్ల రూపేణా సమకూరినదే. బాండ్ల ద్వారా కాంగ్రెస్ పార్టికి రూ.1,123 కోట్లు రాగా ఇతర పార్టిలన్నింటికీ కలిపి రూ.5,289 కోట్లు అందాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
3 రైల్వే లైన్ల నిర్మాణానికి నిధులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు రాబట్టడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఏడాది కూడా విజయవంతమైంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రధాన రైల్వే లైన్లు కోటిపల్లి– నరసాపూర్, విజయవాడ – గూడూరు, కాజీపేట – విజయవాడ మధ్య మూడో లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించింది. ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణానికి ప్రాధాన్యం లభించడంతోపాటు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రైల్వే శాఖ పెద్ద పీట వేసింది. 2024–25కు గాను రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.9,138 కోట్లు కేటాయించింది. రాష్ట్రానికి 2022–23 బడ్జెట్లో రూ.7,032 కోట్లు కేటాయించగా, 2023–24 బడ్జెట్లో రూ.8,406 కోట్లు కేటాయించారు. గత ఏడాదికంటే ఈ ఏడాది రూ.732 కోట్లు అధికంగా కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు, తెచ్చిన ఒత్తిడితోనే రైల్వే బడ్జెట్ కేటాయింపులు ప్రతి ఏటా పెంచుతున్నారని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఈ బడ్జెట్లో రాష్ట్రంలోని ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు.. (రూ.లలో) కోటిపల్లి – నరసాపూర్ కొత్త లైన్ నిర్మాణానికి 300 కోట్లు విజయవాడ–గూడూరు మూడో లైన్ 500 కోట్లు కాజీపేట – విజయవాడ మూడో లైన్ 310 కోట్లు విజయవాడ, రేణిగుంట, కాజీపేట, వాడి రైల్వే స్టేషన్ల వద్ద బైపాస్ లైన్లకు 209.8 కోట్లు అమృత్ భారత్ ప్రాజెక్టు కింద రైల్వే స్టేషన్ల అభివృద్ధికి: 425 కోట్లు ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణానికి: 407 కోట్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, హైలెవల్ ప్లాట్‌ఫారాల నిర్మాణానికి: 197 కోట్లు ట్రాఫిక్ ఫెసిలిటీ పనులకు: 172 కోట్లు రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిపై వంతెన నిర్వహణకు: 30 కోట్లు రాష్ట్రం గుండా ప్రయాణిస్తున్న వందేభారత్ రైళ్ల నిర్వహణకు: 10 కోట్లు -
ఫ్లిప్‌కార్ట్‌కు 600 మిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు అమెరికన్ రిటైల్ దిగ్గజం 600 మిలియన్ డాలర్లు సమకూర్చనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత వేల్యుయేషన్‌కు అదనంగా 5–10% లెక్కగట్టి వాల్‌మార్ట్ ఈ నిధులు అందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, తాజా నిధుల సమీకరణ తర్వాత కంపెనీ వేల్యుయేషన్ ఎంత స్థాయిలో ఉంటుందనేది వెల్లడి కాలేదు. ఇది 40 బిలియన్ డాలర్ల లోపే ఉంటుందని ఇతర వర్గాలు తెలిపాయి. ఫ్లిప్‌కార్ట్ చివరిసారి 37.6 బిలియన్ డాలర్ల విలువతో జీఐసీ, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్, సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ 2 తదితర సంస్థల నుంచి 3.6 బిలియన్ డాలర్లను సమీకరించింది. -
‘వాటిపై ఆసక్తి ఏది?’.. స్మృతి ఇరానీ ఆవేదన
ముంబై: మహిళల ఆధ్వర్యంలో నడిచే వినూత్నమైన స్టార్టప్‌లకు మద్దతుగా నిలవకపోవడం పట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ (వీసీ) తీరును కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ‘నేటికీ పురుషుల ఆధ్వర్యంలోని కంపెనీలతో పోలిస్తే మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్ కంపెనీలపై వెంచర్ క్యాపిటలిస్ట్‌లు ఆసక్తి చూపడంలేదు’ అని మెంటార్ మైబోర్డ్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఇరానీ పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఎంతో మంది మహిళా ఆవిష్కర్తలు ఉన్నట్టు చెప్పారు. వారి ప్రయత్నాలు వాణిజ్య వెంచర్లుగా రూపాంతరం చెందడం లేదన్న ఆవేదనను ఆమె వ్యక్తం చేశారు. వినూత్నంగా ఉంటున్నప్పటికీ కార్పొరేట్ బోర్డుల్లో ఎంత మంది మహిళలకు చోటు లభించిందో పరిశీలించాలని సూచించారు. మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాల్సిన అవసరం లేదన్న మంత్రి స్మృతి ఇరానీ ఇటీవలి వ్యాఖ్యలపై విమర్శలు రావడం తెలిసిందే. అయితే తన వ్యాఖ్యలను ఆమె సమర్థించుకున్నారు. ‘‘మీ కంపెనీ హెచ్ఆర్ హెడ్ ప్రతి నెలా మీ నెలసరిని అడిగి తెలుసుకునే పరిస్థితిని ఊహించగలరా?’’అని ఆమె ప్రశ్నించారు. నెలసరి సెలవు ఇవ్వడం ప్రస్తుత చట్టాలకు సైతం విరుద్ధమన్నారు. ‘‘మహిళలు పెళ్లి చేసుకుంటే, పిల్లల కారణంగా పురోగతి చూపించలేరని గతంలో వారికి అవకాశాలు తిరస్కరించడాన్ని చూశాం. ఇప్పుడు నెలసరి రూపంలో వారికి ఉపాధిని నిరాకరించే పరిస్థితిని సృష్టించడం అవసరం అంటారా?’’అని ఇరానీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే విషయంలో ఒకే విధానం సరికాదన్నారు. సంప్రదింపుల నైపుణ్యాలను విద్యార్థుల్లో, ముఖ్యంగా మహిళా విద్యార్థుల్లో కలి్పంచడంపై దృష్టి సారించాలని బిజినెస్ స్కూళ్లకు ఆమె సూచించారు. -
స్టార్టప్‌లకు రూ. కోటి ఫండింగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యువతను నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) ‘‘లీప్ ఎహెడ్’’ పేరిట ప్రత్యేక పథకాన్ని చేపట్టింది. ఈ పథకం ద్వారా ప్రారంభ దశలో (స్కేలింగ్) ఉన్న స్టార్టప్‌లతో పాటు గ్రోత్ స్టేజ్, ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్, కొత్త ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలో ఉన్న స్టార్టప్‌లకు కోటి రూపాయల వరకు నిధులు సమకూర్చనుంది. ఈ పథకం కింద ఎంపికైన స్టార్టప్‌లకు మూడు నెలల పాటు హైబ్రీడ్ మోడల్లో శిక్షణ ఇచ్చి మెంటారింగ్ చేస్తూ మార్కెటింగ్, ఫండ్ రైజింగ్ వంటి అవకాశాలను కల్పి స్తుంది. ఇందుకోసం డిసెంబర్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలని ఎస్టీపీఐ కోరింది. ఇప్పటివరకు రాష్ట్రం నుంచి 75 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 15 స్టార్టప్‌లను ఎంపిక చేసి ఆర్థిక సాయం అందిస్తారు. ఎన్జీఐఎస్ కింద 95 స్టార్టప్స్ నమోదు స్టార్టప్‌లను ప్రోత్సహించే నెక్టŠస్ జనరేషన్ ఇంక్యుబేషన్ స్కీం (ఎన్జీఐఎస్) కింద రాష్ట్రంలో 95 స్టార్టప్‌లు నమోదు చేసుకున్నట్లు వినయ్‌కుమార్ తెలిపారు. ఇందులో 28 స్టార్టప్స్‌కు రూ.25 లక్షల చొప్పున సీడ్ ఫండింగ్ అందించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్స్‌కు ప్రోత్సాహం అందిస్తుండటంతో పలు కాలేజీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లలో యువత స్టార్టప్స్‌పై ప్రయోగాలు చేస్తున్నారన్నారు. విశాఖలో నాలుగో తరం సాంకేతిక పరిజ్ఞానం పెంచేలా ఏర్పాటు చేసిన కల్పతరువు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ, ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నాస్కామ్ ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీలు స్టార్టప్స్‌కు మంచి వేదికలుగా మారాయని ఆయన వివరించారు. 6న విజయవాడలో ఔట్రీచ్ కార్యక్రమం లీప్ ఎహెడ్ కార్యక్రమంపై విద్యార్థులు, ఔత్సాహిక స్టార్టప్స్‌కు అవగాహన కల్పి ంచడానికి ఈ నెల 6న విజయవాడలో ఔట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్టీపీఐ విజయవాడ జాయింట్ డైరెక్టర్ బి.వినయ్‌కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంక్యుబేషన్, స్టార్టప్ సెంటర్లు ఉన్న పలు ఇంజనీరింగ్ కళాశాలల్లో కూడా సదస్సులు నిర్వహిస్తామన్నారు. -
గృహ యజ్ఞం మెగా డ్రైవ్
తొలిసారిగా ఇళ్లకు అడ్వాన్స్ నిధులు గతంలో ఏ ప్రభుత్వమూ పేదల ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు అడ్వాన్స్ నిధులు ఇచ్చిన దాఖలాల్లేవు. పెద్ద కాంట్రాక్టు సంస్ధలకు మాత్రమే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు చెల్లించేవి. తొలిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల లబ్ధిదారులకు అడ్వాన్స్ నిధులను మంజూరు చేసింది. ఇన్నాళ్లూ పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తైనా నెలలు తరబడి బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేసిన ప్రభుత్వాలనే చూశామని, గృహ నిర్మాణాలకు అడ్వాన్స్ నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఇదేనని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సమాచారం, అభ్యర్ధనల మేరకు నిరుపేద ఇళ్ల లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకునేందుకు అడ్వాన్స్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2,06,020 మంది లబ్ధిదారులకు రూ.376.82 కోట్లను అడ్వాన్స్‌గా విడుదల చేసింది. అడ్వాన్స్ నిధులు పొందిన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు డిసెంబర్ నెలాఖరు నాటికి తదుపరి దశకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహా యజ్ఞంలా కృషి చేస్తోంది. ఇప్పటికే అక్టోబర్‌లో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టగా అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వచ్చే ఫిబ్రవరి నాటికి మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించేలా అధికార యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి మెగా కంప్లీషన్ డ్రైవ్ ద్వారా డిసెంబర్ 1వతేదీ నుంచి జనవరి 31 వరకు క్షేత్రస్థాయిలో సచివాలయాలు కేంద్రంగా కార్యాచరణ సిద్ధమైంది. ఈమేరకు మెగా కంప్లీషన్ డ్రైవ్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. బేస్మెంట్, లెంటల్, రూఫ్ స్థాయిలోని 4.18 లక్షల ఇళ్ల నిర్మాణాలను డ్రైవ్ ద్వారా జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. 10,044 సచివాలయాల వారీగా కలెక్టర్లకు లక్ష్యాలను నిర్దేశించారు. డ్రైవ్‌పై కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించి గృహ నిర్మాణ సిబ్బందితో సమీక్షలు నిర్వహించాలని సూచించారు. మెగా కంప్లీషన్ డ్రైవ్ పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్‌ను సోమవారాని కల్లా సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు ప్రతి 15 రోజులకు ఒకసారి వెళ్లి నాలుగు దఫాలు సందర్శించడం ద్వారా ఇళ్ల పురోగతిని జియో ట్యాగింగ్ చేసి ఫొటోలను యాప్‌లో అప్లోడ్ చేయాలన్నారు. మెటీరియల్, నిర్మాణ సిబ్బందిని సమీకరించుకునేందుకు జిల్లా, మండల స్థాయిలో సమావేశాలను నిర్వహించాలని తేదీలతో సహా కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఆప్షన్–3 లబ్ధిదారుల ఇళ్ల పురోగతిని కూడా కలెక్టర్లు సమీక్షిస్తూ గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వలంటీర్ల కీలక పాత్ర గ్రామ, వార్డు వలంటీర్లు మెగా కంప్లీషన్ డ్రైవ్‌లో కీలక పాత్ర పోషిస్తారని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్‌జైన్ తెలిపారు. వచ్చే నెల 1వతేదీ నుంచి జనవరి నెలాఖరు వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి మొత్తం నాలుగు సార్లు క్షేత్ర స్థాయిలో ఇళ్లను సందర్శిస్తారని వెల్లడించారు. తొలిసారి సందర్శనలో మెటీరియల్, లేబర్ అవసరాన్ని అంచనా వేస్తారన్నారు. రెండోసారి పురోగతిని యాప్‌లో అప్డేట్ చేస్తారని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 28, 29వ తేదీల్లో జిల్లా స్థాయిలో మెబిలైజేషన్ సమావేశాలను నిర్వహించాలని ఆదేశించామన్నారు. డిసెంబర్ 1వ తేదీన మండల, పట్టణ స్థానిక సంస్థల స్థాయిలో సమావేశాలు ఉంటాయన్నారు. డిసెంబర్ 4 నుంచి 6వ తేదీలోగా సచివాలయాల స్థాయిలో సమావేశాలను నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. వలంటీర్ల తొలి విడత సందర్శన డిసెంబర్ 7 నుంచి 14 వరకు ఉంటుంది. రెండో విడత 15వ తేదీ నుంచి 31 వరకు జరుగుతుంది. మూడో విడత జనవరి 1వ తేదీ నుంచి 15 వరకు ఉంటుంది. నాలుగో విడత సందర్శన జనవరి 16 నుంచి 31 వరకు ఉంటుందని జైన్ వివరించారు. ఫిబ్రవరిలో మరో ఐదు లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఈ నేపథ్యంలో సచివాలయాలు కేంద్రంగా మెగా కంప్లీషన్ డ్రైవ్ ద్వారా జనవరి నెలాఖరు నాటికి 4.18 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే లక్ష ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఉన్నాయని వెల్లడించారు. -
భీకర యుద్దం..పాలస్తీనియన్ల కోసం ఈ చిన్నారి చేసిన పని తెలిస్తే!
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతోంది. అక్టోబర్ 7న గాజా స్ట్రిప్ నుంచి చొరబడిన హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడగా.. ఇజ్రాయెల్ ప్రతికార దాడి చేపట్టింది. ఇరు వర్గాల మధ్య పెద్దఎత్తున కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ బాంబుల దాడుల తీవ్రతకు గాజా అల్లాడుతోంది. ఈ భీకర యుద్ధంలో ఇప్పటివరకు 8,525వేల మంది పాలస్తీనియన్లు బలయ్యారు. ఈ నేపథ్యంలో దాడులను ఆపివేయాలని ప్రపంచదేశాలు ఇజ్రాయెల్‌కు పిలుపునిస్తున్నాయి.తాజాగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘర్షణకు తాత్కాలిక విరామం ఇవ్వాలని సూచించారు. అయితే ఓవైపు మరణాల సంఖ్య పెరుగుతున్నా హమాస్‌ను నిర్మూలించేదాకా కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పునరుద్ఘాటించారు. కాల్పులు ఆపడమంటే హమాస్ ఉగ్రవాదులకు, తీవ్రవాదానికి లొంగిపోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. గాజాలో పరిస్థితిలు మరి దారుణంగా మారాయి. ఎటు చూసిన శిథిలాలు.. వాటి కింది చిక్కుకున్న మృతదేహాలే కనిపిస్తున్నాయి. కరెంట్, తాగునీరు, నిత్యవసరాల కొరతతో పాలస్తీనియన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య జరుగుతున్న భీకర యుద్దం నేపథ్యంలో వర్తక, వాణిజ్యాల్లో కుదుపులకు కారణమవుతోంది. ఈ క్రమంలో పాలస్తీనియన్ల కోసం భారీగా నిధులు సమకూరుతున్నాయి. సిరియాలోని ఓ మసీదులో పాలస్తీయన్ల కోసం పలువురు విరాళాలు ఇస్తుండగా, ఓ చిన్నారి సైతం తనకు తోచినంత సహాయం చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. Crowd funding was being done for Palestinians in a Mosque in Syria when this little girl arrived with her small gift❤️#StopGenocideInGaza #Palestine pic.twitter.com/njxeUyLH7R — هارون خان (@iamharunkhan) November 1, 2023 -
రూ.6,929 కోట్లతో గిరిజనాభివృద్ధి
సాక్షి, అమరావతి/దొండపర్తి (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో రూ.6,929 కోట్ల వ్యయంతో గిరిజనాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర తెలిపారు. సీఎం వైఎస్ జగన్ గతేడాది కంటే.. ఈ ఏడాది ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.784 కోట్లు అధికంగా కేటాయించారని వివరించారు. ఈ నిధులను సద్వినియోగం చేస్తూ.. గిరిజనుల అభివృద్ధికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర సబ్‌ప్లాన్ నిధుల వినియోగాన్ని సమీక్షించారు. అన్ని రంగాల్లోనూ గిరిజనులు అభివృద్ధి సాధించాలన్నదే వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందుకే గతేడాది కంటే ఈ ఏడాది అధిక నిధులను కేటాయించారని చెప్పారు. 2022–23లో ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.6,144.90 కోట్లు మంజూరు చేయగా.. ఈ ఏడాది రూ.6,929.09 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. ఈ నిధులను పూర్తిగా గిరిజన సంక్షేమానికే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిధుల సద్వినియోగంలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. గిరిజన గూడేలకు రహదారులు, తాగునీటి సరఫరా, విద్యా సంస్థల్లో సౌకర్యాలను మెరుగుçపరచాలని సూచించారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, డైరెక్టర్ జె.వెంకటమురళి, ట్రైకార్ ఎండీ రవీంద్రబాబు, జీసీసీ ఎండీ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. జీసీసీ సేవల విస్తృతానికి కొత్త వెబ్సైట్ గిరిజనులు, వినియోగదారులు, ఉద్యోగులకు అవసరమైన శీఘ్ర సేవలు, సమగ్ర సమాచారాన్ని అందించడంతో పాటు జీసీసీ సహజ ఉత్పత్తుల మార్కెట్‌ను మరింత విస్తృతం చేసేందుకు గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నూతన వెబ్సైట్ దోహదపడుతుందని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర తెలిపారు. మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జీసీసీ నూతన వెబ్‌సైట్‌ను రాజన్నదొర ప్రారంభించారు. సీఎం జగన్ సారథ్యంలో నాలుగేళ్లలో గిరిజన సాధికారత సాధనలో జీసీసీ అనూహ్యమైన, మంచి ఫలాలను గిరిజనులకు అందించిందని వివరించారు. గిరిజనులకు డీఆర్ డిపోల ద్వారా రేషన్ సరుకుల సరఫరా, పెట్రోల్ బంకుల ఏర్పాటు, వివిధ రాష్ట్రాల్లో రిటైల్ ఔట్లెట్ల ద్వారా ఉత్పత్తుల విక్రయాలు, వన్‌ధన్ వికాస కేంద్రాల ఏర్పాటు, అరకు వ్యాలీ కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో విశేషమైన కృషి చేస్తూ సత్ఫలితాలు సాధిస్తోందని వెల్లడించారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ సిబ్బందిని ఆయన అభినందించారు. గిరిజన సంక్షేమ శాఖ నేతృత్వంలో జీసీసీ చేస్తున్న కార్యక్రమాలను సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు జీసీసీ సహజ ఉత్పత్తుల మార్కెట్‌ను మరింతగా విస్తరించేందుకు ఈ వెబ్సైట్ విశేషంగా దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీసీసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేష్ కుమార్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో జీసీసీ అందిస్తున్న సేవలు, ఖర్చు చేస్తున్న నిధులు, ప్రణాళికలు, ఫలితాలు వంటి వివరాలు అన్నీ గణాంకాలతో సహా నూతన వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. జీసీసీ సహజ ఉత్పత్తుల విక్రయానికి ఆన్లైన్ షాపింగ్‌తో పాటు సోషల్ మీడియా వేదికలను ఈ నూతన వెబ్‌సైట్‌తో అనుసంధానించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జీసీసీ ప్రధాన కార్యాలయం సహా ప్రాంతీయ కార్యాలయాలు, ఉద్యోగుల వివరాలను సమగ్రంగా అందుబాటులో ఉంచడంతో పాటు, పారదర్శకత, జవాబుదారీతనం పెంచే చర్యల్లో భాగంగా జీసీసీ సిబ్బంది బదిలీలు, ఉత్తర్వుల వివరాలతో పాటు టెండర్లు, నోటీసులు, ప్రకటనలు సమగ్రంగా ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వివరించారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దాండే, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ జె.మురళి, జీసీసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.సురేష్ కుమార్, ట్రైకార్ ఎండీ రవీంద్రబాబు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ చీఫ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఓపీఏఎల్‌లో ఓఎన్జీసీ రూ.15,000 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ).. ఓఎన్జీసీ పెట్రో–అడిషన్స్ లిమిటెడ్‌కు (ఓపీఏఎల్) సుమారు రూ.15,000 కోట్ల నిధులు సమకూర్చాలని నిర్ణయించింది. అధిక రుణభారం కారణంగా నష్టపోతున్న ఓపీఏఎల్కు ఆర్థిక పునర్ వ్యవస్థీకరణకు ఓఎన్జీసీ బోర్డు గత వారం ఆమోదం తెలిపింది. గుజరాత్‌లోని దహేజ్ వద్ద భారీ పెట్రోకెమికల్ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న ఓపీఏఎల్‌లో ఓఎన్జీసీకి 49.36 శాతం, గెయిల్ ఇండియాకు 49.21, గుజరాత్ స్టేట్ పెట్రోకెమికల్ కార్ప్‌నకు (జీఎస్పీసీ) 1.43 శాతం వాటా ఉంది. ఓపీఏఎల్కు ఆర్థిక పునర్ వ్యవస్థీకరణలో భాగంగా షేర్ వారెంట్లను ఈక్విటీగా ఓఎన్జీసీ మారుస్తుంది. రూ.7,778 కోట్ల విలువైన కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్లను బైబ్యాక్ చేస్తుంది. అలాగే ఈక్విటీ రూపంలో అదనంగా రూ.7,000 కోట్లు పెట్టుబడిగా పెడుతుంది. తద్వారా ఓపీఏఎల్‌లో దాదాపు 95 శాతం వాటా సమకూరుతుందని స్టాక్ ఎక్సే్ఛంజ్ ఫైలింగ్‌లో ఓఎన్జీసీ వెల్లడించింది. ఇది అమలు చేసిన తర్వాత ఓఎన్జీసీకి ఓపీఏఎల్ అనుబంధ సంస్థగా మారుతుందని పేర్కొంది. ‘ఆర్థిక పునరి్నర్మాణంతో ఓపీఏఎల్‌లో ఓఎన్జీసీ హోల్డింగ్‌ను పెంచుతుంది. ఓపీఏఎల్ మరింత లాభదాయకంగా మారుతుంది. మొత్తం కొనుగోలు వ్యయం రూ.14,864 కోట్లుగా ఉంటుంది’ అని ఓఎన్జీసీ పేర్కొంది. పునర్ వ్యవస్థీకరణ తరువాత ఓపీఏఎల్‌లో గెయిల్, జీఎస్పీసీ వాటా 5 శాతానికి పరిమితం అవుతుంది. 2008లో ఓపీఏఎల్‌లో గెయిల్ వాటాను కైవసం చేసుకుంది. దహేజ్ ప్లాంట్ ప్రణాళిక సమయంలో రూ.12,440 కోట్లతో అంచనా వేశారు. కానీ 2017లో దాదాపు రూ.30,000 కోట్లతో పూర్తయింది. ప్లాంటుకు భారీ వ్యయం, నిర్మాణం ఆలస్యం కావడంతో గెయిల్ తన ఈక్విటీ వాటాను రూ.996.28 కోట్లకు పరిమితం చేయాలని నిర్ణయించుకుంది. ఓపీఏఎల్ నష్టాలు 2023 మార్చి నాటికి రూ.13,000 కోట్లకు చేరుకున్నాయి. -
బిల్ గేట్స్ కు దోమలకు సంబంధం ఏమిటి? అసలు అమెరికాలో ఏం జరుగుతోంది?
బిల్ గేట్స్ స్వయంగా దోమలను తరిమిగొట్టే పనేమీ చేయడం లేదు. అయినప్పటికీ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ దీనికి సంబంధించిన ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని తగ్గించేందుకు జన్యుపరంగా మార్పు చెందిన దోమలను అభివృద్ధి చేయడానికి కృషిచేస్తున్న బయోటెక్ కంపెనీ ఆక్సిటెక్‌కు నిధులు అందజేసినందుకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు అవార్డు ప్రకటించారు. ఏప్రిల్ 2021లో ఫ్లోరిడాలోని ఆరు ప్రదేశాలలో ఆక్సిటెక్ సుమారు 150,000 దోమలను విడుదల చేస్తుందని ఆక్సిటెక్ ప్రకటించింది. అయితే ఈ నిర్దిష్ట ప్రాజెక్ట్‌కు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చలేదని కంపెనీ పేర్కొంది. అంటు వ్యాధులను వ్యాప్తిచేసే దోమల జాతి అయిన ఈడెస్ ఈజిప్టిని జన్యుపరంగా సవరించడానికి బహుళ-సంవత్సరాల పరిశోధన ప్రాజెక్ట్ 2021లో ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక బిల్ గేట్స్ ఉన్నారని ఇంటర్నెట్లో వార్తలు వెలువడ్డాయి. ఈజిప్టి దోమలను జన్యుపరంగా సవరించడం, తరువాత వాటిని అడవిలోకి విడుదల చేయడం అనేది ఇది మొదటిసారేమీ కాదు. పరిశోధకులు ఒక దశాబ్దానికి పైగా దీనిపై పలు ప్రయత్నాలు చేస్తున్నారు. 2010లో కేమాన్ దీవులలో మార్పు చెందిన దోమల విడుదలను విడుదల చేశారు. 2011, 2012, 2015లో ఆక్సిటెక్ బ్రెజిల్‌లోని పలు ప్రాంతాలలో జన్యుపరంగా మార్పు చెందిన దోమలను విడుదల చేసింది. ఆడ అనాఫిలిస్ దోమల ద్వారా మాత్రమే మలేరియా అనేది మనుషులకు వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈజిప్టి దోమ స్వయంగా మలేరియాను వ్యాప్తి చెందించదు. ఆక్సిటెక్ సంస్థ అనాఫిలిస్ దోమలను జన్యుపరంగా మార్చడానికి పలు ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ సంస్థ వ్యాధులను వ్యాప్తిని అరికట్టేందుకు జీవసంబంధ పరిష్కారాలను అన్వేషించే పరిశోధనలు సాగిస్తుంటుంది. గేట్స్ ఫౌండేషన్ గ్రాంట్ డాక్యుమెంట్లలో ప్రపంచవ్యాప్తంగా 43 నెలల్లో మలేరియా సంబంధిత ప్రాజెక్టుల కోసం జూన్ 2018లో ఆక్సిటెక్‌కు $5.8 మిలియన్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అమెరికా, కరేబియన్లలో మలేరియా దోమలను అరికట్టడానికి ఈ నిధులను అందజేస్తున్నట్లు గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. సెప్టెంబరు 2020లో $1.4 మిలియన్ల రెండవ దఫా గ్రాంట్‌ను ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో మలేరియా దోమల నివారణ కోసం ఈ ప్రాజెక్ట్‌కు అందించినట్లు పేర్కొన్నారు. అయితే అమెరికాలో ఈపనులు చేపట్టేందుకు గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చలేదని కంపెనీ ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఆక్సిటెక్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ మొదటి దశలోనే ఉంది. 2020లో యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ జన్యుపరంగా మార్పు చెందిన దోమలను ఫీల్డ్ టెస్ట్ చేయడానికి ఆక్సిటెక్‌కు ఆమోదం తెలిపింది. అయితే దీనికిముందు కంపెనీ స్థానిక అధికారుల నుంచి ఆమోదం తీసుకోవలసి ఉంటుంది. అలాగే దీనిపై రెండు సంవత్సరాలలో మొత్తం 6,600 ఎకరాల్లో అధ్యయనం జరగాల్సి ఉంది. అయితే ఇంతలో ఈ కంపెనీకి 31 వేలకు మించిన పబ్లిక్ కామెంట్లు వచ్చాయి. వీటిలోని చాలా వ్యాఖ్యలలో ఈ అధ్యయనానికి అనుమతించకూడదని లేదా మరింత సమాచారం అందుబాటులోకి వచ్చే వరకు వేచి ఉండాలని సూచించారు. అయితే దీనిపై సంస్థ 150 పేజీల ప్రతిస్పందనను తెలియజేసింది. జూన్ 2020లో ఫ్లోరిడా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కన్స్యూమర్ సర్వీసెస్ ఈ అధ్యయనం కోసం అనుమతిని మంజూరు చేసింది. అలాగే ఫ్లోరిడా కీస్ మస్కిటో కంట్రోల్ డిస్ట్రిక్ట్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్‌తో పాటు ఏడు స్టేట్ ఆఫ్ ఫ్లోరిడా ఏజెన్సీలు దీనికి ఆమోదం తెలిపాయి. కాగా ఈజిప్టి దోమలు ఆఫ్రికాకు చెందినవి. ఈ జాతి పెట్టే గుడ్లు పొడి వాతావరణంలో నెలల తరబడి నిద్రాణంగా ఉంటాయని, వర్షం పడినప్పుడు జీవం పోసుకుని వ్యాప్తి చెందుతాయని సంస్థ తెలిపింది. ఫ్లోరిడా కీస్‌లోని మొత్తం దోమల జనాభాలో ఈజిప్టి దోమ కేవలం 4% మాత్రమే ఉన్నాయి. కానీ దోమల ద్వారా సంక్రమించే వ్యాధులకు ఈజిప్టి దోమలు బాధ్యత వహిస్తాయి. కాగా ఆడ దోమ మాత్రమే చికున్‌గున్యా, జికా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులను వ్యాపిస్తుంది. ఆడ దోమలు మనుషులకు కుట్టి, తమ లాలాజలంలో బ్యాక్టీరియాను మానవ రక్తంలోకి ప్రసారం చేస్తాయి. వీటిని ఎదుర్కొనేందుకు ఆక్సిటెక్ పరిశోధకులు టెట్రాసైక్లిన్ ట్రాన్స్-యాక్టివేటర్ వేరియంట్ అనే ప్రోటీన్‌ను దోమల నియంత్రణకు ఒక సాధనంగా గుర్తించారు. ఇది కూడా చదవండి: రాబోయే ఏళ్లలో 100 కోట్లమంది మృతి? Bill Gates is not a Scientist or Doctor. Why the Hell is Bill Gates releasing mosquitos on Americans? How much more proof do people need in order to acknowledge his Diabolical Schemes? Arrest Bill Gates. pic.twitter.com/sC2iLpvCVP — Liz Churchill (@liz_churchill10) September 3, 2023 -
అంకిత భావానికి రూ. 3.5 కోట్లు ప్రతిఫలం! ఎలానో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
అంకిత భావంతో చేసే పని నలుగురిచే గుర్తించేలా చేస్తుందన్న మాటలు మళ్ళీ ఋజువయ్యాయి. లాస్ వెగాస్‌లోని బర్గర్ కింగ్‌లోని మెక్కారన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యాషియర్ అండ్ కుక్‌గా పనిచేస్తున్న 'కెవిన్ ఫోర్డ్' 27 సంవత్సరాలు ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పని చేస్తే ఆ సంస్థ అతనికి మిఠాయిలు, పెన్నులు, స్టార్‌బక్స్ కప్ వంటి వాటితో కూడిన మంచి బ్యాగ్‌ని అందుకున్నాడు. అన్ని సంవత్సరాలు ఎంతో నిబద్దతతో పనిచేస్తే సరైన గుర్తింపు లభించలేదని, దానికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఆ తర్వాత అతని కుమార్తె సెరీనా GoFundMe పేజీ స్టార్ట్ చేసింది. దీనికి అతి తక్కువ కాలంలోనే అన్యూహ్య స్పందన లభించింది. దీని ద్వారా ఏకంగా నాలుగు లక్షల డాలర్లు.. అంటే సుమారు రూ. 3.48 కోట్లు విరాళాలుగా సమకూరాయి. కెవిన్ ఫోర్డ్ అంకిత భావం, చిత్త శుద్ధి ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాయి. దీనివల్లే ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రాగలిగాయి. కుటుంబం పోషణ కోసం గత కొన్ని సంవత్సరాలుగా పని చేస్తూనే ఉన్నాడు. అయితే ఇటీవల లభించిన విరాళాలు వారికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇదీ చదవండి: సిమ్ కార్డ్ డీలర్లకు కొత్త రూల్స్.. అతిక్రమిస్తే రూ. 10 లక్షలు జరిమానా! పదవి విరమణ వయసు వచ్చినప్పటికీ ఆర్థికపరమైన కారణాల వల్ల పనిచేస్తూనే ఉన్నాడు. భారీగా విరాళాలు పొందిన ఫోర్డ్.. ప్రపంచంలో చాలామంది దాతృత్వం కలిగి ఉన్నారు. ఇప్పుడు వచ్చిన డబ్బు నా పిల్లలు మనవళ్ల భవిష్యత్తు కోసం పొదుపు చేస్తానన్నట్లు సమాచారం. -
స్థిరమైన నిధులతోనే శాస్త్రీయ ప్రగతి
సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సూపర్ పవర్‌గా ఎదగాలన్న లక్ష్యం అందుకోవాలంటే ఏ దేశమైనా తగినన్ని నిధులు, స్థిరంగా అందుబాటులో ఉంచాలి. మౌలిక పరిశోధనలపైనా దృష్టి పెట్టాలి. కోవిడ్-19 టీకా, కో–విన్, యూపీఐ వంటి డిజిటల్ అప్లికేషన్ల అభివృద్ధి... పెరుగుతున్న భారతీయ సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యానికి అద్దం పడుతున్నాయి. ఈ విజయాలు దీర్ఘకాలం పరిశోధనలపై నిధులు ఖర్చుపెట్టిన ఫలితమే. దశాబ్దాలపాటు నాణ్యమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తూండటం, వాటి పోషణకు తగిన నిధులు కేటాయించడం వల్లనే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ పరిశోధన సంస్థల సాంకేతిక సామర్థ్యాన్ని దశాబ్దాలుగా ప్రైవేటు రంగమూ ఉపయోగించుకుంది. హింగోలి మహారాష్ట్ర మరాఠ్వాడా ప్రాంతంలోని జిల్లా కేంద్రం. 1948 వరకూ హైదరాబాద్ నిజాం రాజ్యం పరిధిలో ఉండేది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని మిలిటరీ కేంద్రంగానూ వాడుకునేవారు. తాజాగా ఈ జిల్లాకు సరికొత్త గుర్తింపు లభిస్తోంది. అంతర్జాతీయ సైన్స్ ప్రాజెక్టు ‘లేజర్ ఇంటెర్ ఫెరోమీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ’ క్లుప్తంగా ‘లిగో’కు కేంద్రంగా ఇది అవతరించనుంది. ఈ మహా భౌతిక శాస్త్ర ప్రయోగ శాల కాస్మిక్ గ్రావిటేషనల్ వేవ్స్‌ను గుర్తించేందుకు ఉద్దేశించింది. ఇలాంటివే అమెరికాలోని హాన్ఫర్డ్, లివింగ్‌స్టోన్ ప్రాంతాల్లో ఉన్నాయి. మరోరెండు ఇటలీ, జపాన్లలో ఉన్నాయి. 2030 నాటికి హింగోలి లోనూ ఈ వేధశాల నిర్మాణం పూర్తయితే ప్రపంచవ్యాప్త నెట్వర్క్ సంపూర్ణమవుతుంది. నాలుగు కిలోమీటర్ల పొడవైన భుజాల్లాంటి నిర్మాణాలు... ఎల్ ఆకారంలోని ఇంటర్ఫెరోమీటర్లతో కూడిన ఈ ప్రయోగశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదా¯Œ లో నేషనల్ టెక్నాలజీ డే సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని ఆన్లైన్లో రూ.1,200 కోట్ల విలువైన హింగోలి లిగో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఎంతో ప్రతిష్ఠాత్మ కమైన ఈ ప్రాజెక్టును భారత్ చేపట్టడం హర్షణీయమైన విషయమై నప్పటికీ ఇలాంటి భారీ ప్రాజెక్టులు, మౌలిక శాస్త్ర పరిశోధనల విషయంలో భారత్ వైఖరి ఎలా ఉందన్న విషయాన్ని సమీక్షించేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తోంది. ఎంత ‘వేగం’గా సాగుతున్నాయంటే... లిగో ప్రాజెక్టు ఆలోచనలకు బీజం పడ్డది 2009 లోనే. భారతీయ శాస్త్ర పరిశోధన సంస్థలకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు కలిసికట్టుగా గ్రావిటేషనల్ వేవ్స్‌పై పరిశోధనలు చేస్తూండేవారు. ఆ క్రమంలోనే భారత్‌లో గ్రావిటేషనల్ వేవ్స్ వేధశాల ఏర్పాటు చేయాలన్న ఆలోచన పుట్టింది. రెండేళ్ల తరువాత అమెరికాలోని లిగో పరిశోధనశాల తమ పరిశోధనల్లో భాగం కావాలని భారత శాస్త్రవేత్తలకు ఆహ్వానం పలికింది. ఆ ఏడాదే భారత శాస్త్రవేత్తలు విస్తృత చర్చల తరువాత ఇండియన్ లిగో ఏర్పాటుకు సంబంధించి, భారత అణుశక్తి విభాగానికి ఒక ప్రతిపాదన చేశారు. 2012లో ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు పచ్చజెండా ఊపుతూ ఓ కమిటీ నిధులు కేటాయించాల్సిందిగా అభ్యర్థించింది. నాలుగేళ్లు వివిధ ప్రభుత్వ విభాగాలకు చక్కర్లు కొట్టిన ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి 2016లో ‘సూత్రప్రాయ అంగీకారం’ తెలిపింది. ఆ తరువాత సుమారు ఏడేళ్ల నిరీక్షణ తరువాత ఈ ప్రాజె క్టుకు తుది అనుమతులు లభించాయి. దేశంలో సైన్స్ ప్రాజెక్టులు ఎంత ‘వేగంగా’ అమలవుతాయో తెలిపేందుకు ఈ ఉదాహరణ చాలు. హింగోలి ప్రాజెక్టు అమల్లో జరిగిన జాప్యం ఇంకో విషయాన్నీ గుర్తు చేస్తుంది. దేశంలో పరిశోధనల కోసం కేటాయిస్తున్న నిధుల్లో పెరుగుదల లేకపోవడాన్ని ఎత్తి చూపుతుంది. స్థూల జాతీయోత్పత్తిలో పరిశోధనలకు (ఆర్ అండ్ డీ) కేటాయించిన నిధులు దశాబ్ద కాలంగా కేవలం 0.7 శాతం మాత్రమేనని నీతి ఆయోగ్ గత ఏడాది విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. ఈ మోతాదు బ్రెజిల్ (1.6 శాతం), దక్షిణాఫ్రికా (0.83) కంటే తక్కువ కావడం గమనార్హం. పొరుగు దేశం చైనా తన స్థూల జాతీయోత్పత్తిలో ఏకంగా 2.14 శాతం ‘ఆర్ అండ్ డీ’కి కేటాయిస్తోంది. కేటాయింపులు అత్యల్పంగా ఉంటే పరిశోధనా రంగంలో పురోగతి సాధ్యం కాదని నీతి ఆయోగ్ తన నివేదికలో విస్పష్టంగా తెలిపింది. లక్ష్యాలూ అస్పష్టమే... 2013లో భారత్ తన ‘ద సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్’ పాలసీలో 2020 నాటికల్లా శాస్త్ర పరిశోధనల రంగంలో టాప్–5లోకి చేరాలని సంకల్పం చెప్పుకొంది. తొమ్మిదేళ్ల తరువాత ఇదే పాలసీని ఆధునికీకరించారు. 2030 నాటికి నాణ్యమైన పరిశోధన ఫలితాలు సాధించే టాప్–5 దేశాల్లోకి భారత్ చేరాలన్న అస్పష్ట లక్ష్యం గురించి ఈ విధానంలో పేర్కొన్నారు. పదాలతో గారడీ చేయడం కంటే పరిశోధనలకు స్థిరంగా నిధులు కేటాయించడం మేలన్న విషయం మన విధాన నిర్ణేతలకు అర్థం కావడం లేదు. ఇటీవలి కాలంలో కోవిడ్–19 టీకా తయారీలో సాధించిన విజయం, కో–విన్, యూపీఐ వంటి డిజిటల్ అప్లికేషన్ల అభివృద్ధి... పెరుగుతున్న భారతీయ సాంకే తిక పరిజ్ఞాన సామర్థ్యానికి అద్దం పడుతున్నాయి. ఈ విజయాలు దీర్ఘకాలం పరిశోధనలపై నిధులు ఖర్చుపెట్టిన ఫలితమే అన్నది విస్మరించరాదు. దశాబ్దాలపాటు నాణ్యమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తూండటం, వాటి పోషణకు తగిన నిధులు కేటాయించడం వల్లనే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ పరిశోధన సంస్థల సాంకేతిక సామర్థ్యాన్ని దశా బ్దాలుగా ప్రైవేటు రంగమూ ఉపయోగించుకుంది. కోవిడ్ టీకా, జెనెరిక్ మందుల అభివృద్ధినే తీసుకుందాం. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు చాలాకాలం క్రితమే మందులు, టీకాల తయారీ, క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు అవస రమైన అన్ని ఏర్పాట్లూ చేశాయి. ఈ ఏర్పాట్లు 1970 నుంచి ప్రైవేట్ రంగం ఎదుగుదలకు పునాదిగా నిలిచాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ, టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ వంటివి భారత్ బయోటెక్, శాంతా బయోటెక్ వంటి సంస్థలకు తొలినాళ్ల నుంచి అండదండగా నిలిచాయి. ప్రైవేట్ రంగంలోని టీకా తయారీ కంపెనీలకు వందల కోట్ల నిధులు అందించారు కూడా. సుమారు 30 – 40 ఏళ్లుగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు కోవిడ్ మహమ్మారి దాడి చేసిన వెంటనే అక్కరకు వచ్చాయి. ఐటీ రంగానికీ ఇది వర్తిస్తుంది. కంప్యూటర్ సైన్స్, గణిత, భౌతిక శాస్త్రాల్లో పరిశోధ నల ఫలితంగానే ఐటీ రంగం వృద్ధి చెందింది. అల్గారిథమ్స్, ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్, క్రిప్టోగ్రఫీ నెట్వర్కింగ్ రంగాల్లో జరిగిన మౌలిక పరిశోధనలే కంప్యూటర్లు, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల అభివృద్ధికి కారణ మయ్యాయి. భారతీయ విద్యాసంస్థల్లో కంప్యూటర్ సైన్స్ విద్యా బోధనకు దేశం చాలా ముందుగానే పెట్టుబడులు పెట్టింది. రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీలు (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలని ఇప్పుడు పిలుస్తున్నారు), తరువాతి కాలంలో ట్రిపుల్ ఐటీల ఏర్పాటు కూడా ఈ ప్రయత్నాల్లో భాగమే. ప్రభుత్వ రంగంలో పెట్టిన ఈ పెట్టు బడుల ఫలితాలను ప్రైవేట్ రంగమూ పొందింది. ఆ క్రమంలోనే సరి కొత్త డిజిటల్ అప్లికేషన్ల అభివృద్ధికి దారితీసింది. ప్రస్తుత డిజిటల్ విప్లవం వెనుక ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్లు అభివృద్ధి చేసిన ఈ–గవర్నెన్స్, ఇతర డిజిటల్ అప్లికేషన్ల భూమికను విస్మరించలేము. సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సూపర్ పవర్‌గా ఎదగాలన్న లక్ష్యం అందుకోవాలంటే ఏ దేశమైనా తగినన్ని నిధులు, స్థిరంగా అందుబాటులో ఉంచాలి. అదే సమయంలో మౌలిక పరిశోధనలపైనా దృష్టి పెట్టాలి. దిగుమతి చేసుకున్న హార్ట్‌వేర్, విజ్ఞానంతో టెక్నలాజి కల్ అప్లికేషన్ల అభివృద్ధిపై దృష్టి పెట్టడం వల్ల మనం ఇతరులపై ఆధారపడే స్థితి వస్తుంది. మౌలిక రంగ పరిశోధలు ఎన్నో రకాల ఇతర ప్రయోజనాలు అందిస్తాయి. పారిశ్రామిక, సామాజిక లాభాలూ ఒన గూరుతాయి. సర్వవ్యాప్తమైన డిజిటల్ కెమెరా, మెడికల్ ఇమేజింగ్, ఇంటర్నెట్లన్నీ ఇందుకు ఉదాహరణలు. వాతావరణ మార్పులు, ప్రజారోగ్యం, ఆహార భద్రత వంటి అతి సంక్లిష్టమైన ప్రపంచస్థాయి సమస్యల పరిష్కారానికీ మౌలిక పరిశోధనలే ఆధారం. రేపటి తరం టెక్నాలజీల కోసం ఈ రోజే సైన్స్ పై పెట్టుబడులు పెట్టడం అవశ్యం. దినేశ్.సి శర్మ - వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
లోకల్’కు 120 కోట్ల నిధులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైపర్‌లోకల్ కంటెంట్, కమ్యూనిటీ, క్లాసిఫైడ్ వేదిక అయిన లోకల్ తాజాగా రూ.120 కోట్ల సిరీస్-బి ఫండింగ్ అందుకుంది. గ్లోబల్ బ్రెయిన్, సోనీ ఇన్నోవేషన్ ఫండ్, ఇండియా కోషెంట్ తదితర ఇన్వెస్టర్లు ఈ మొత్తాన్ని సమకూర్చినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. లోకల్ సేవలు అందిస్తున్న మార్కెట్లలో వృద్ధికి, కొత్త విభాగాల పరిచయానికి తాజా నిధులను వినియోగించనున్నట్టు తెలిపింది. (బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా?) తాజా నిధులతో కలిపి ఇప్పటి వరకు రూ.225 కోట్లకుపైగా ఫండింగ్ అందుకున్నట్టు లోకల్ ఫౌండర్, సీఈవో జానీ పాషా తెలిపారు. బెంగళూరు కేంద్రంగా 2018లో ప్రారంభమైన లోకల్ యాప్ 7 రాష్ట్రాల్లో 6 భాషల్లో అందుబాటులో ఉంది. డెయిలీ అప్డేట్స్, కమోడిటీ ధరలు, స్థానిక జాబ్స్, రియల్టీ, మ్యాట్రిమోనియల్, స్థానిక యాడ్లు, క్లాసిఫైడ్స్ సమాచారాన్ని అందిస్తోంది. 4 కోట్లకుపైగా డౌన్లోడ్స్ నమోదయ్యాయి. (బిచ్చగాళ్లను పారిశ్రామికవేత్తలుగా మార్చేసిన ఓ జర్నలిస్టు సాహసం) -
10 వేల మంది మహిళలకు గోల్డ్‌మ్యాన్ చేయూత
ముంబై: గోల్డ్‌మ్యాన్ శాక్స్ భారత్‌లో 10,000 మంది మహిళలకు వ్యాపారం, మేనేజ్మెంట్ విద్యకు కావాల్సిన నిధుల సహకారం అందించినట్టు ప్రకటించింది. వీరి ద్వారా 12,000 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించాయని, గడిచిన 18 నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.2,800 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలిపింది. గోల్డ్‌మ్యాన్ శాక్స్ 2008లో మొదటిసారి భారత్‌లో గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ఆరంభించింది. 18 నెలల క్రితం తిరిగి దీన్ని ప్రారంభించింది. ‘వుమెన్ఇనీషియేటివ్’ కింద 10,000 మంది మహిళలకు వ్యాపారం, యాజమాన్య విద్యకు కావాల్సిన నిధుల సహకారం అందించనున్నట్టు నాడు ప్రకటించింది. గోల్డ్ మ్యాన్ శాక్స్ కార్యక్రమంలో పాల్గొన్న 10వేల మంది మహిళలల్లో 2,400 మందిపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అధ్యయనం నిర్వహించగా, ఆ వివరాలను గోల్డ్‌మ్యాన్ శాక్స్ విడుదల చేసింది. గోల్డ్ మ్యాన్ శాక్స్ నిధుల మద్దతు పొందిన 10వేల మంది మహిళలు గత 18 నెలల్లో తమ సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేసుకున్నాయి. అలాగే, ఆదాయాన్ని నాలుగు రెట్లు పెంచుకున్నాయి. తమ ఉత్పాదకతను సగటున ఐదు రెట్లు వృద్ధి చేసుకున్నాయి. వీరిలో అధిక శాతం మహిళా వ్యాపారవేత్తలు నియామకాలు పెంచుకుంటామని, ఆదాయం పెరుగుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. భారత్‌లో మహిళా వ్యాపారవేత్తల ప్రాతినిధ్యం ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నట్టు గోల్డ్‌మ్యాన్ శాక్స్ ఇండియా చైర్మన్, సీఈవో సంజయ్ ఛటర్జీ పేర్కొన్నారు. నిధుల సాయం పొందేందుకు కూడా వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెబుతూ.. వారి అసలు సామర్థ్యాలు వెలుగులోకి తెచ్చేందుకు ఇంకా ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో కేవలం 20 శాతం వ్యాపారాలే మహిళల నిర్వహణలో ఉన్నాయని, మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో వారి వాటా కేవలం 3 శాతంగానే ఉన్నట్టు చెప్పారు. -
హామీలు అమలు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు కావొస్తున్నా, అనేక అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని, రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వాటన్నింటినీ పరిష్కరించి రాష్ట్రానికి తగిన సహకారం అందించాలని కోరారు. రాష్ట్ర విభజన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర కేంద్ర మంత్రులకు విన్నవించేందుకు గురువారం రాత్రి ఢిల్లీకి వచ్చిన వైఎస్ జగన్.. శుక్రవారం ఉదయం మోదీతో పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధానికి వినతులు అందజేశారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ పలు దఫాలుగా చర్చలు జరిపి కొంత పురోగతి సాధించినా, కీలక అంశాలన్నీ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రుణ పరిమితి పెంచండి 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ.36,625 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్ ప్రధానిని కోరారు. రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ చేస్తామంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రం చెప్పిందని, దీనిపై సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో గత ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు తీసుకుందన్న కారణంతో ఇప్పుడు రాష్ట్ర రుణాల పరిమితులపై ఆంక్షలు విధించారని వివరించారు. ఈ ప్రభుత్వం తప్పు లేకపోయినప్పటికీ నిబంధనల ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారని చెప్పారు. 2021–22లో రూ.42,472 కోట్ల రుణ పరిమితి కల్పించి, తదుపరి కాలంలో దానిని రూ.17,923 కోట్లకు తగ్గించారన్నారు. కోవిడ్ మహమ్మారి సృష్టించిన ఆర్థిక విపత్తు సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, ఈ విషయంలో జోక్యం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పోలవరానికి అడ్‌హక్‌గా రూ.10 వేల కోట్లు పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతోందని, ఏపీ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే దిశగా ప్రాజెక్టు నిర్మాణం సాగిస్తోందని సీఎం.. ప్రధానికి వివరించారు. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తే కొద్ది కాలంలోనే ఇది వాస్తవ రూపంలోకి వచ్చి ప్రజలకు ఫలితాలు అందుతాయన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖజానా నుంచి రూ.2600.74 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. గత రెండేళ్లుగా ఈ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ నిర్ధారించిన పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ.55,548 కోట్లను ఆమోదించాలని విన్నవించారు. తాగునీటి సరఫరా అంశాన్ని కూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలని, ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్ వారీగా నిబంధనలు సడలించాలని సూచించారు. ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని, ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుందని తెలిపారు. డీబీటీ పద్ధతిలో ముంపు బాధితులకు ఈ సహాయం అందిస్తే జాప్యాన్ని నివారించవచ్చన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అడ్‌హక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు. ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ఇతర అంశాలు ఇలా... ♦ తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన బకాయిలు అలానే ఉన్నాయి. 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. వీటిని వెంటనే ఇప్పించాలి. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత పాటించక పోవడంతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. దీనివల్ల పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు రాని 56 లక్షల కుటుంబాలకు రాష్ట్రమే సొంతంగా రేషన్ ఇస్తోంది. తద్వారా దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ విషయంలో ఏపీ చేసిన విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్ కూడా నిర్ణయించిన నేపథ్యంలో చర్యలు తీసుకోవాలి. కేంద్రం వినియోగించని రేషన్ కోటాను రాష్ట్రానికి కేటాయించాలి. ♦ రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయి. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడమే కాకుండా, సేవా రంగం విస్తరిస్తుంది. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. ♦ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. ప్రతి జిల్లాలో 18 లక్షల మంది జనాభా ఉన్నారు. కొత్తగా కేంద్రం మంజూరు చేసిన మూడు మెడికల్ కాలేజీలతో కలిపి మొత్తంగా 14 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలి. ఈ కాలేజీలకు సంబంధించిన పనులు అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయి. వీటికి సంబంధించి కేంద్రం తగిన విధంగా సహాయ పడాలి. ♦ వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. ఈ ప్లాంట్ నిలదొక్కుకోవాలంటే ఖనిజ కొరత లేకుండా ఏపీఎండీసీకి గనులు కేటాయించాలి. విభజన అంశాలపై అమిత్‌షాకు వినతి ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేక హోదా, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ఆమోదం వంటి అంశాలపై మాట్లాడారు. తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు అంశం గురించి ప్రస్తావించినట్లు తెలిసింది. పార్లమెంట్లో ఘన స్వాగతం ప్రధాని మోదీ, అమిత్‌షాతో భేటీకై పార్లమెంట్‌కు వచ్చిన సీఎం వైఎస్ జగన్‌కు వైఎస్సార్సీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. రాజ్యసభ, లోక్‌సభ పక్ష నేతలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలతో పాటు ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, రెడ్డప్ప, తలారి రంగయ్య, పోచ బ్రహ్మానందరెడ్డి, లావు కృష్ణదేవరాయలు, పిల్లి సుభాస్ చంద్రబోస్, ఆర్.కృష్ణయ్య, చింతా అనురాధ, సత్యవతి, గొడ్డేటి మాధవిలు సాదర స్వాగతం పలికారు. జగన్ పార్లమెంట్ భవనంలో లోపలికి వెళుతున్న సమయంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, పీఎంఓ కార్యాలయ శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్‌లు పలకరించారు. మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్‌కౌర్ వైఎస్ జగన్‌తో ఫొటో దిగారు. కాగా, శుక్రవారం సాయంత్రం 4 గంటల తర్వాత సీఎం జగన్ ఢిల్లీ నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. -
అధిక వ్యయాలతో రియల్టీ ప్రాజెక్టులు అసాధ్యం
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అభివృద్ధి ఆచరణ సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయని టాటా రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో సంజయ్ దత్ అన్నారు. భూమి ధరలు పెరిగిపోవడం, నిర్మాణ వ్యయం, నిధుల వ్యయాలు పెరిగిపోవడానికి అదనంగా ఆర్థిక అనిశ్చితులను ప్రస్తావించారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అనుమతులు నుంచి అభివృద్ది వరకు అన్ని సులభతరంగా సాగేందుకు భాగస్వాములను జవాబుదారీ చేయాలన్న అభిప్రాయాన్ని దత్ వినిపించారు. ‘‘రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం. మొదట భూమిని సమీకరించుకోవాలి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), ముంబై, బెంగళూరు తదితర ముఖ్య పట్టణాల్లో ప్రాజెక్టు వ్యయాల్లో భూమి వాటా 50 శాతం నుంచి 80–85 శాతం వరకు ఉంటోంది. ప్రాజెక్టు డిజైన్, అనుమతులు, నిర్మాణ ప్రారంభానికి 2–3 ఏళ్లు పడుతోంది. నిధుల వ్యయాలు ప్రముఖ సంస్థలకు 8.5 శాతంగా ఉంటే, పెద్దగా పేరులేని సంస్థలకు 18 శాతం వరకు ఉంటున్నాయి’’అని సంజయ్ దత్ వివరించారు. దీంతో ప్రాజెక్టు డెవలపర్లు ప్రస్తుత వ్యయాల ఆధారంగా ధరలను ప్రకటించినప్పటికీ.. ప్రాజెక్టు పూర్తయ్యే 5–6 ఏళ్లలో వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నట్టు చెప్పారు. -
షార్క్ టైగర్స్
‘నా దగ్గర ఎన్నో ఐడియాలు ఉన్నాయి. ఫండింగ్ ఉంటే ఎక్కడో ఉండేవాడిని’ అనేది బ్లాక్ అండ్ వైట్ జమాన నాటి మాట. ‘నీ దగ్గర ఐడియా ఉంటే చాలు...దానికి రెక్కలు ఇవ్వడానికి ఎంతోమంది ఉన్నారు’ అనేది నేటి మాట. ‘ఐడియా’ ఉండి ఫండింగ్ అవకాశం లేని స్టార్టప్ కలల యువతరానికి ‘షార్క్ ట్యాంక్ ఇండియా’లాంటి టీవిప్రోగ్రామ్స్ ఆశాదీపాల్లా మారాయి. తాజాగా గుజరాత్‌కు చెందిన 20 సంవత్సరాల దావల్ తన సోదరుడు జయేష్‌తో కలిసి స్టార్టప్ కలను సాకారం చేసుకోబోతున్నాడు... దావల్కు కాలేజీ టీ స్టాల్లో టీ తాగడం అంటే చాలా ఇష్టం. అలాంటి ఇష్టం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీనికి కారణం టీ స్టాల్లో పనిచేసే అబ్బాయి ఒక టబ్‌లో అవే నీళ్లలో గ్లాసులను కడగడం. దారిన పోయే మేక ఒకటి వచ్చి ఆ నీళ్లు తాగినా ఆ నీళ్లు అలాగే ఉండడం! టీ స్టాల్ యజమానికి చెప్పినా అతడు పట్టించుకోకపోవడం!! కాలేజీ టీ స్టాల్లోనే కాదు బయట రోడ్డు సైడ్ టీ స్టాల్స్, దాబాలలో కూడా ఇలాంటి దృశ్యాన్నే చూశాడు దావల్. ‘ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కోవాలి’ అని గట్టిగా అనుకున్నాడు గుజరాత్‌లోని బవస్కంత గ్రామానికి చెందిన దావల్. యూట్యూబ్‌లో మెషిన్ డిజైనింగ్ సబ్జెక్ట్‌పై దృష్టి పెట్టాడు. ఆరు నెలల్లో ఒక అవగాహన వచ్చింది.తండ్రితో కలిసి ఒక హార్డ్‌వేర్ షాప్‌కు వెళ్లి స్క్రాప్ ఉచితంగా ఇవ్వాల్సిందిగా బతిమిలాడుకున్నాడు. స్క్రాప్ చేతికి వచ్చిన తరువాత ప్రయోగాలుప్రారంభించాడు. ఒకటి, రెండు, మూడు, నాలుగు ప్రయత్నాల్లోనూ విఫలం అయ్యాడు. ‘చేసింది చాలు. ఇక ఆపేయ్. స్క్రాప్ ఇచ్చేదే లేదు’ అన్నాడు హార్డ్‌వేర్ షాప్ యజమాని. దీంతో తనకు తెలిసిన ప్రొఫెసర్‌ను కలిసి విషయం చెప్పాడు. ఆయన పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించాడు. ఈసారి మాత్రం తన ప్రయత్నంలో పూర్తిగా సక్సెస్ అయ్యి ఆటోమెటిక్ టీ–గ్లాస్ వాషింగ్ మెషిన్ కలను నెరవేర్చుకున్నాడు. ఈ మెషిన్లోని వాటర్ జెట్‌తో 30 సెకండ్ల వ్యవధిలో 15 టీ గ్లాసులను శుభ్రపరచవచ్చు. దీని సామర్థ్యాన్ని పెంచే కొత్త మెషిన్ కూడా తయారు చేశాడు దావల్. దీని గురించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తే అనూహ్యమైన స్పందన వచ్చింది. కొందరుప్రొఫెసర్లను కలిసి ఈ మెషిన్ గురించి డెమో ఇచ్చాడు. వారికి నచ్చి అభినందించడమే కాదు లక్ష రూపాయలు ఇచ్చారు. వారు ఇచ్చిన లక్షతో అయిదు మెషిన్లను తయారుచేసి కర్నాటక, తమిళనాడు,మహారాష్ట్రలలో అమ్మారు. దావల్ సోదరుడు జయేష్‌కు సొంతంగా వ్యాపారం చేయాలనేది కల. సోదరులిద్దరు ‘మహంతం’ పేరుతో స్టార్టప్ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. తాజాగా షార్క్‌ట్యాంక్ ఇండియా(సోనీ టీవీ) రియాల్టీ షోలో దావల్, జయేష్లు చెప్పిన స్టార్టప్ ఐడియా నచ్చి అయిదుగురు షార్క్స్(బిగ్–షాట్ ఇన్వెస్టర్స్) డీల్ ఆఫర్ చేయడమే కాదు ‘మీ విజయం యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని అభినందించారు. ఆ మాటే విజయమంత్రం ‘అపజయం మాత్రమే అంతిమం కాదు’ అనే మాటను ఎన్నోసార్లు విన్నాను. నా ప్రయత్నంలో విఫలమైనప్పుడల్లా ఈ మాటను గుర్తు తెచ్చుకునేవాడిని. మళ్లీ మళ్లీ ప్రయత్నించేవాడిని. కొందరు నన్ను వింతగా చూసేవారు. కొందరైతే...నీకు నువ్వు సైంటిస్ట్‌లా ఫీలవుతున్నావు అని వెక్కిరించేవాళ్లు. అయితే నేను వాటిని ఎప్పుడూ పట్టించుకోలేదు. సక్సెస్ కావడమే నా లక్ష్యం అన్నట్లుగా కష్టపడ్డాను. చివరికి ఫలితం దక్కింది. –దావల్ -
జోరు మీదున్న ఫోన్‌పే... రూ.828 కోట్లు!
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే తాజాగా 10 కోట్ల డాలర్లు(రూ. 828 కోట్లు) సమీకరించింది. కొత్తగా రిబ్బిట్ క్యాపిటల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయగా.. ఇప్పటికే వాటాలున్న టైగర్ గ్లోబల్ సైతం నిధులు అందించింది. 12 బిలియన్ డాలర్ల విలువలో ఫోన్‌పే తాజా పెట్టుబడులను సమకూర్చుకుంది. జనవరి 19న సైతం కంపెనీ జనరల్ అట్లాంటిక్ నుంచి 35 కోట్ల డాలర్లను పొందింది. కంపెనీ కేంద్ర కార్యాలయాన్ని ఇండియాకు మార్చిన తదుపరి బిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రెండు దశలలో 45 కోట్ల డాలర్లు అందుకోగా.. మిగిలిన పెట్టుబడులను తగిన సమయంలో సుప్రసిద్ధ దేశ, విదేశీ ఇన్వెస్టర్లు అందించే వీలున్నట్లు భావిస్తోంది. ఈ నిధులను పేమెంట్స్, ఇన్సూరెన్స్ బిజినెస్‌ల విస్తరణకు వినియోగించనుంది. అంతేకాకుండా లెండింగ్, స్టాక్‌బ్రోకింగ్ తదితర కొత్త విభాగాలలోనూ ప్రవేశించాలని ప్రణాళికలు వేసింది. -
సోలార్ రంగంలో తగ్గిన కార్పొరేట్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సోలార్ రంగంలో కార్పొరేట్ ఫండింగ్ గతేడాది మొదటి తొమ్మిది నెలల్లో 13 శాతం తగ్గింది. 24.1 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు మెర్కామ్ క్యాపిటల్ తన నివేదికలో పేర్కొంది. 2021లో ఇదే కాలంలో 27.8 బిలియన్ డాలర్లు వచ్చినట్టు తెలిపింది. వెంచర్ క్యాపిటల్, ప్రైవేటు ఈక్విటీ (వీసీ, పీఈ), డెట్ ఫైనాన్స్, పబ్లిక్ మార్కెట్ ఫండింగ్‌ను కార్పొరేట్ ఫండింగ్‌గా చెబుతారు. 2021తో పోలిస్తే గతేడాది వీసీ పెట్టుబడులు 56 శాతం పెరిగి 7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. డెట్ ఫైనాన్స్ 24 శాతం తగ్గి 12 బిలియన్ డాలర్లుగా ఉంది. పబ్లిక్ మార్కెట్ ఫైనాన్స్ 5.1 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021లో వచ్చిన 7.5 బిలియన్ డాలర్లతో పో లిస్తే 32 శాతం తక్కు వ. అంతర్జాతీయంగా సోలార్ రంగంలో 2022లో మొత్తం 128 విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు జరిగాయి. ‘‘ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా సోలార్ రంగంలో డిమాండ్ పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించుకోవాలన్న లక్ష్యం ఈ రంగానికి మద్దతుగా నిలిచింది. సోలార్ ప్రాజెక్టుల కొనుగోళ్ల పరంగా 2022 ఉత్తమ సంవత్సరంగా ఉంటుంది. రికార్డు స్థాయిలో వీసీ, పీఈ పెట్టుబడులు వచ్చాయి’’ అని మెర్కామ్ క్యాపిటల్ గ్రూపు సీఈవో రాజ్ ప్రభు తెలిపారు.