నిధులున్నాయ్‌... పనులే లేవు! | Funds ready.. no works | Sakshi
Sakshi News home page

నిధులున్నాయ్‌... పనులే లేవు!

Published Wed, Aug 3 2016 10:23 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

నిధులున్నాయ్‌... పనులే లేవు!

నిధులున్నాయ్‌... పనులే లేవు!

పంచాయతీల్లో అభివద్ధి పనులు సాగడం లేదంటే... అయ్యో నిధుల్లేవేమోనని అనుకోవడం పరిపాటి. కానీ నిధులున్నా... అడ్వాన్సులుగా తీసేసుకుంటున్నా... పనులు సాగకపోతే ఏమనాలి? కచ్చితంగా నిర్లక్ష్యమనే కదా. జిల్లాలో పరిస్థితి ఇలానే ఉంది. కేంద్ర ప్రభుత్వం రకరకాలుగా నిధులు విడుదల చేస్తున్నా... వాటిని పంచాయతీలు సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నాయి.

– ఏటా వస్తున్న నిధులు... పంచాయతీల్లో కదలని పనులు
– అడ్వాన్సులపై ఆసక్తి... వినియోగంపై లేదు
– గత ఏడాది విడుదలైన నిధుల్లో మూలుగుతున్నది రూ. 35కోట్లు
– తాజాగా విడుదలైన 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 69.5కోట్లు
 
విజయనగరం కంటోన్మెంట్‌: పంచాయతీల్లో అభివద్ధి పనులు సాగడం లేదంటే... అయ్యో నిధుల్లేవేమోనని అనుకోవడం పరిపాటి. కానీ నిధులున్నా... అడ్వాన్సులుగా తీసేసుకుంటున్నా... పనులు సాగకపోతే ఏమనాలి? కచ్చితంగా నిర్లక్ష్యమనే కదా. జిల్లాలో పరిస్థితి ఇలానే ఉంది. కేంద్ర ప్రభుత్వం రకరకాలుగా నిధులు విడుదల చేస్తున్నా... వాటిని పంచాయతీలు సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నాయి. అడ్వాన్సులు తీసేసుకుంటున్నాయి... కానీ పారిశుద్ధ్యం మెరుగు పడటంలేదు... రహదారులు అభివద్ధి చెందడంలేదు. కాలువలు కట్టించడంలేదు. దీనివల్లే రోగాలు ప్రబలి... జనాలు మత్యువుకోరల్లో చిక్కుకుంటున్నా... మన పంచాయతీ పాలకులు మాత్రం నీరో చక్రవర్తిలా.... పట్టించుకోవడం లేదు.
 
జనం నానా పాట్లు 
ఏ పంచాయతీ చూసినా ఏమున్నది గర్వకారణం. ముందుకు పారని మురుగు... ఎక్కడికక్కడే పేరుకుపోయిన చెత్త... నిర్లక్ష్యంగా వదిలేస్తున్న డెబ్రిస్‌ కుప్పలు. వీటిని మార్చాలని... కోట్లకొద్దీ నిధులు వస్తున్నా మనం వినియోగించుకోలేకపోతున్నాం. పల్లెలను అభివద్ధి బాట పట్టించలేకపోతున్నాం. వస్తున్న నిధులు వినియోగించేస్తామంటూ అంతా అడ్వాన్సులు తీసేసుకుంటున్నారు తప్ప వాటి వినియోగం ఎక్కడా కానరావడంలేదు. దీనివల్ల జనం నానా పాట్లు పడుతున్నారు. అపారిశుద్ధ్యం పుణ్యమాని రోగాల బారినపడుతున్నారు.
 
 
ఏటా వస్తున్న నిధులు
జిల్లాలో 920 పంచాయితీలున్నాయి. వీటికి 14వ ఆర్థిక సంఘం నిధులు రెండేళ్లుగా విడుదలవుతున్నాయి. గతేడాది జిల్లాకు రూ. 49.50 కోట్లు విడుదలయ్యాయి. అందులో కొన్ని గ్రామ పంచాయితీలు అడ్వాన్సులు తీసుకున్నాయి. కానీ పనులు పూర్తి స్థాయిలో ఇంకా చేపట్టలేదు. కొన్ని గ్రామాల్లో ప్రారంభించలేదు కూడా! ఇంతలోనే ఈ ఏడాదికి సంబంధించి మరో రూ. 68.50 కోట్లు కేటాయించారు. గతేడాది విడుదలైన రూ.49.50 కోట్లలో మహా అయితే రూ. 34.50 కోట్ల వరకూ ఖర్చు చేశారు. ఇందులో పారిశుద్ధ్యం పనులు, తాగునీటి అవసరాలకు, కంప్యూటర్‌ ఆపరేటర్ల వేతనాలకు మాత్రమే ఖర్చు చేశారు. అయితే అభివద్ధి కానరానపుడు నిధులు వచ్చినా ప్రయోజనం ఏముందంటూ పల్లె ప్రజలు పెదవివిరుస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీలోని పంచాయతీల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఐటీడీఏ నిధులతో కలిపి మరింత అభివద్ధి చెందాల్సిన గ్రామాలు నేడు తిరోగమనంతో కునారిల్లుతున్నాయి. 
 
 
అడ్వాన్సులతోనే చిక్కులు
జిల్లాలోని గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులకు సంబంధించి అడ్వాన్సులు తీసుకుంటున్న సర్పంచ్‌లకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సంబంధిత కార్యదర్శులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడ్వాన్సులు తీసుకున్నప్పుడు ఉన్నతాధికారులకు చెప్పకపోవడం, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా మెటీరియల్‌ వేయడం లేదన్న విషయాలను చెప్పకపోవడంతో చివరకు ప్రత్యర్థి వర్గీయులు కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదులు చేసేంత వరకూ వస్తున్నది. అప్పుడు చెక్‌ పవర్‌ రద్దు చేయడం. ఆ తరువాత అభివద్ధి పనుల్లో మరింత జాప్యం జరుగుతోంది. ఇలా పంచాయితీల్లో అభివద్ధి నిధుల వినియోగం పక్కదారి పడుతోంది. 
 
 
చెబుతున్నా... పెడచెవిన పెడుతున్నారు:  సత్యనారాయణ రాజు, జిల్లా పంచాయతీ అధికారి, విజయనగరం 
జిల్లాలోని పంచాయతీలకు విడుదలవుతున్న నిధులను ఖర్చు చేసి వెంటనే పనులు పూర్తి చేయాలని చెబుతున్నాం. అయినా వెనుకడుగు వేస్తున్నారు. అందరితో మాట్లాడి పనులను వెంటనే చేపట్టాలని, చేపట్టిన పనులను పూర్తి చేయాలనీ ఆదేశాలు జారీ చేస్తాం. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement