తాగునీటి ఎద్దడి నివారణకు 55 కోట్లు
♦ కరువు మండలాలకు ‘విపత్తు’ నిధులు
♦ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కరువు మండలాల్లో తాగునీటి ఎద్దడి నివారణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఆయా మండలాలకు రూ.55 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిర్వహణ నిధి నుంచి జిల్లా కలెక్టర్లకు ఈ నిధులు కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏడు జిల్లాల్లోని 231 మండలాలను ప్రభుత్వం ఇటీవల కరువు మండలాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మండలాల్లో నీటిఎద్దడి ఉన్న ఆవాసాలన్నింటా వెంటనే తాగునీటిని అందించేందుకు చర్యలు చేపట్టాలని ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం కమిషనర్ బి.ఆర్.మీనా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రానున్న వేసవి దృష్ట్యా కరువు మండలాల్లో తాగునీటి సరఫరాకు కంటిజెన్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రూ.310.61 కోట్లు కావాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఎన్‌సీ ప్రభుత్వానికి ఇటీవలప్రతిపాదనలు సమర్పించారు. కొన్నిచోట్ల తాగునీటి సరఫరా, ప్రైవేటు వాహనాల అద్దె, బోర్ల మరమ్మతు, బోర్లు, బావుల లోతును పెంచాల్సిన అవసరముందని నివేదించారు.
తాత్కాలిక అవసరాలకు తక్షణమే రూ.108.71 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం రూ.55 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు అత్యధికంగా రూ.15.70 కోట్లు, అత్యల్పంగా వరంగల్ జిల్లాకు రూ.2.59 కోట్లు కేటాయించింది. మెదక్ జిల్లాకు రూ.10.82, నిజామాబాద్‌కు రూ.8.47, రంగారెడ్డి జిల్లాకు రూ.7.77, నల్లగొండకు రూ.5.18, కరీంనగర్‌కు రూ.4.47 కోట్ల చొప్పున మంజూరు చేసింది. స్టేట్ ఆడిట్ అధారిటీ ధ్రువీకరించిన వినియోగ పత్రాలను ప్రభుత్వానికి అందజేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది.