water scarcity
-
నదులు ఎండిపోతున్నాయ్!
నదులు మానవాళి పాలిట జీవనాడులు. నది లేకపోతే జీవమే లేదు. అలాంటి నదులు ప్రస్తుతం తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 లక్షల నదులు విపరీతమైన మార్పులకు లోనవుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ మార్పులు ఇలాగే కొనసాగితే తాగడానికి నీరు దొరకదని, మరోవైపు విపరీతమైన వరదలను ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. ఇవీ ప్రమాదాలు...మరికొద్ది కాలంలో ప్రపంచంలోని అనేక నదుల్లో అతి స్వల్ప పరిమాణంలో నీరు అందుబాటులో ఉందని నివేదిక పేర్కొంది. → అవి నెమ్మదిగా దుమ్ము, చిన్న రాళ్ళతో కూడిన అవక్షేపంగా మారిపోతాయని హెచ్చరించింది. → ఫలితంగా దీంతో తాగడానికి, పంటలకు, పశువులను పోషించడానికి మంచి నీటి కొరత ఏర్పడుతుందని అధ్యయన సారథి, హైడ్రాలజీ ప్రొఫెసర్ డోంగ్మే ఫెంగ్ తెలిపారు. → నదులు భూమికి రక్తనాళాల వంటివని, అవి ప్రవహించే తీరులో మార్పులు మనపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఫెంగ్ హెచ్చరించారు.క్షీణిస్తున్న నదులు భూమిపై నదులు లోనవుతున్న మార్పులపై సిన్సినాటీ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. శాటిలైట్ డేటా, కంప్యూటర్ మోడలింగ్ పరిజ్ఞానంతో పలువురు శాస్త్రవేత్తలు 35 ఏళ్లుగా భూమిపై ప్రతి రోజూ ప్రతి నది నీటి ప్రవాహాన్ని మ్యాపింగ్ చేశారు. ఇందులో వెల్లడైన విషయాలు వారిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. ప్రపంచంలోని అతి పెద్ద నదుల్లోని సగం నదుల్లో నీటి ప్రవాహం అతి వేగంగా తగ్గుముఖం పడుతోంది! ఈ తగ్గుదల వేగం కొన్నింట్లో ఏటా 5 శాతముంటే మరికొన్నింట్లో ఏకంగా 10 శాతం దాకా ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. ఇది చాలా వేగవంతమైన మార్పని హెచ్చరించింది. ఆఫ్రికాలోని రెండో అతి పెద్ద నది కాంగో, చైనాలో ప్రముఖ నది యాంగ్జీ, దక్షిణ అమెరికాలోని ప్లాటా వంటి నదులైతే ఇప్పటికే గణనీయంగా క్షీణించిపోయాయి. ముంచుకొస్తున్న వరద ముప్పు ఇక పర్వత ప్రాంతాల్లోని పలు చిన్న నదుల పరిస్థితి భిన్నంగా ఉంది. వాటిలో ప్రవాహం 17 శాతం పెరిగింది. హిమాలయాల వంటి ప్రాంతాల్లో జలవిద్యుత్ ప్రణాళికలు ఊహించని ప్రమాదాలు తెచ్చి పెడుతున్నాయి. అవక్షేపం దిగువకు రవాణా అవుతోంది. ఇది వరదలను తీవ్రతరం చేస్తోంది. గత 35 ఏళ్ల కాలంలో ఎగువ ప్రాంతాల్లోని ఇలాంటి చిన్నాచితకా నదుల వల్ల భారీ వరదలు ఏకంగా 42 శాతం పెరిగాయని అధ్యయనంలో తేలింది. వాతావరణంలో అధిక మార్పులు, నదీ ప్రవాహాలకు మానవులు అంతరాయం కలిగించడం వంటివే ఇందుకు కారణమని సివిల్ అండ్ ఎని్వరాన్మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కోలిన్ గ్లీసన్ చెప్పారు. ‘‘ఈ వాతావరణ మార్పులు ప్రధానంగా మానవ కార్యకలాపాలు, శిలాజ ఇంధనాల వల్ల ఏర్పడ్డ వాతావరణ సంక్షోభమే. వాటివల్ల వర్షపాత పరిస్థితులు మారుతున్నాయి. మంచు కరిగి రేటు వేగవంతం అవుతోంది. స్తోందని, ఫలితంగా వరదలు ముంచెత్తుతున్నాయి’’ అని ఆయన వివరించారు. ‘‘పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో దుర్భర కరువు, మరికొన్ని ప్రాంతాల్లో కనీవినీ ఎరగని వరదలు పరిపాటిగా మారే రోజు దూరంలో లేదు’’ అన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎండుతున్న జలకళ
అనుకున్నంతా అయింది. విశ్లేషకులు భయపడుతున్నట్టే జరిగింది. మొన్న మార్చిలోనే దేశంలోని ప్రధాన జలాశయాలన్నీ అయిదేళ్ళలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి అడుగంటినట్టు వార్తలు వచ్చి నప్పుడు వేసవిలో ఇంకెంత గడ్డుగా ఉంటుందో అని భయపడ్డారు. సరిగ్గా అప్పుడనుకున్నట్టే ఇప్పుడు దేశం నీటికొరత సంక్షోభంలోకి జారిపోతోంది. ఏప్రిల్ 25 నాటికి దేశవ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటిమట్టం ఆందోళనకర స్థాయికి పడిపోయినట్టు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తాజా లెక్కలు వెల్లడించాయి. ముఖ్యంగా, దక్షిణాదిలో పదేళ్ళలో ఎప్పుడూ లేనంత కనిష్ఠస్థాయికి జలాశ యాల్లో నీటి నిల్వలు పడిపోయాయి. సాగునీటికీ, తాగునీటికీ, జలవిద్యుత్ ఉత్పత్తికీ తిప్పలు తప్పేలా లేవు. ఆ సవాళ్ళకు సంసిద్ధం కావాల్సిన అవసరాన్ని గణాంకాలు గుర్తు చేస్తున్నాయి.దేశం మొత్తం మీద రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యంలో కేవలం 30 శాతం వరకే ప్రస్తుతం నీళ్ళున్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఇది గత ఏడాది కన్నా తక్కువ. అందుకే ఇప్పుడింతగా ఆందోళన. వర్షాకాలంలో 2018 తర్వాత అతి తక్కువ వర్షాలు పడింది గత ఏడాదే. దానికి తోడు ఎల్‌నినో వాతావరణ పరిస్థితి వల్ల గత వందేళ్ళ పైచిలుకులో ఎన్నడూ లేనంతగా నిరుడు ఆగస్టు గడిచి పోయింది. వర్షాలు కురిసినా, కొన్నిచోట్ల అతివృష్టి, మరికొన్నిచోట్ల అనావృష్టి. ఇవన్నీ కలిసి దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. దీర్ఘకాలంగా వర్షాలు కొరవడడంతో నీటి నిల్వలు తగ్గి, అనేక ప్రాంతాలు గొంతు తడుపుకొనేందుకు నోళ్ళు తెరుస్తున్నాయి. హెచ్చిన ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాడ్పులు సైతం నీటిమట్టాలు వేగంగా పడిపోవడానికి కారణమయ్యాయి. దేశంలో తూర్పు ప్రాంతంలోని అస్సామ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో నీటి నిల్వలు కొంత మెరుగ్గా ఉన్నాయి కానీ, మిగతా ప్రాంతాల్లో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ప్రధానంగా తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో ఈ ప్రభావం అమితంగా కనిపిస్తోంది. కర్ణాటక, తమిళనాడు, కేరళతో పాటు తెలుగు రాష్ట్రాలకూ తిప్పలు తప్పడం లేదు. దక్షిణాదిలో దాదాపు 42 జలాశయాలను సీడబ్ల్యూసీ పర్యవేక్షిస్తుంటుంది. గత ఏడాది ఇదే సమయానికి వాటిలో 29 శాతం దాకా నీళ్ళున్నాయి. దశాబ్ద కాలపు సగటు గమనిస్తే, ఈ సమయానికి కనీసం 23 శాతమన్నా నీళ్ళుండేవి. కానీ, ఈ ఏడాది కేవలం 17 శాతానికి తగ్గిపోయాయి. దాన్నిబట్టి ప్రస్తుత గడ్డు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గుజరాత్, మహారాష్ట్రలున్న పశ్చిమ భారతావనిలోనూ అదే పరిస్థితి. అక్కడ సీడబ్ల్యూసీ పర్యవేక్షించే 49 రిజర్వాయర్లలో పదేళ్ళ సగటు 32.1 శాతం కాగా, నిరుడు నీటినిల్వలు 38 శాతం ఉండేవి. కానీ, ఈసారి అది 31.7 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది మధ్య, ఉత్తర భారతావనుల్లోనూ జలాశయాల్లో నీళ్ళు అంతంత మాత్రమే. అక్కడ చారిత్రక సగటు నిల్వలతో పోలిస్తే, ఈసారి బాగా తక్కువగా ఉన్నాయట. మొత్తం మీద దేశంలోని ప్రధాన నదీపరివాహక ప్రాంతాల రీత్యా చూస్తే... నర్మద, బ్రహ్మపుత్ర, తాపీ నదీపరివాహక ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం సాధారణ నిల్వస్థాయుల కన్నా మెరుగ్గా ఉంది. అయితే, కావేరీ నదీ పరివాహక ప్రాంతం, అలాగే మహానది, పెన్నా నదులకు మధ్యన తూర్పు దిశగా ప్రవహించే పలు నదీ క్షేత్రాలు తీవ్రమైన లోటును ఎదుర్కొంటున్నాయి. ఎండలు ముదిరి, వేసవి తీవ్రత హెచ్చనున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత గడ్డుగా మారే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే ఇవన్నీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. బెంగళూరు కొద్ది వారాలుగా తీవ్ర నీటి ఎద్దడి సమస్యలో కూరుకుపోయింది. విషయం జాతీయ వార్తగా పరిణమించింది. ఇక, తమిళనాట పలు ప్రాంతాల్లో నెర్రెలు విచ్చిన భూములు, ఎండిన జలాశయాలు, తాగునీటి కొరతతో బిందెడు నీళ్ళ కోసం ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతున్న దృశ్యాలు ప్రత్యక్షమవుతున్నాయి. సహజంగానే నిత్యజీవితంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలనూ ఈ నీటి నిల్వల కొరత బాధిస్తోంది. తగిన నీటి వసతి లేక వివిధ రకాల పంటలు, తోటలు దెబ్బతింటున్నాయి. ఇవాళ్టికీ భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం కీలకం. జలాశయాల్లో తగ్గిన నీటితో అది పెను సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఇప్పటికీ మన దేశంలోని సేద్యపు భూముల్లో దాదాపు సగం వర్షపు నీటిపైనే ఆధారపడ్డాయి. రానున్న వర్షాకాలంలో సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదవుతుందని అంచనా వెలువడింది. ఫలితంగా, ఋతుపవనాలు ఇప్పుడున్న చిక్కులను తొలగిస్తాయన్నది ఆశ. నిజానికి, దేశంలో జలవిద్యుదుత్పత్తి సైతం తగ్గుతూ వస్తోంది. విద్యుచ్ఛక్తి గిరాకీ విపరీతంగా ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో హైడ్రోపవర్ జనరేషన్ 17 శాతం పడిపోయింది. ఆ మాటకొస్తే, తగ్గుతున్న జలాశయాల నిల్వలు, పెరుగుతున్న ప్రజల నీటి అవసరాల రీత్యా గత కొన్ని దశాబ్దాలుగా ఆసియాలో, ప్రధానంగా చైనా, భారత్‌లలో జలవిద్యుదుత్పత్తి తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో జలసంరక్షణ కీలకం. ప్రభుత్వాలు, పాలకులు తక్షణం స్పందించి, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే కష్టం. గృహవినియోగం మొదలు వ్యవసాయ పద్ధతులు, పారిశ్రామిక కార్యకలాపాల దాకా అన్ని స్థాయుల్లోనూ నీటి వృథాను తగ్గించి, ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టుకోవడం ముఖ్యం. నీటి నిల్వ, పంపిణీలు సమర్థంగా సాగేలా చూడాలి. సుస్థిర వ్యవసాయ విధానాలు, పంటల వైవి ధ్యంతో నీటి వినియోగాన్ని తగ్గించాలి. ఎప్పుడైనా వర్షాలు లేక, దుర్భిక్షం నెలకొన్నా తట్టుకొనే సామర్థ్యం పెంపొందించుకోవాలి. నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఆవశ్యకత నుంచి వర్షపునీటి నిల్వల దాకా అన్నిటిపై ప్రజా చైతన్యం కలిగించాలి. గడ్డుకాలం కొనసాగితే, భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సత్వరమే మేలుకోవాలి. -
మరో బెంగళూరు కానివ్వొద్దు.. తాగునీటి ఎద్దడిపై హైకోర్టు హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: వర్షపు నీటి నిల్వ విధానం (ఇంకుడు గుంతలు, ఆర్డబ్ల్యూఎస్హెచ్)పై సరైన చర్యలు చేపట్టకుంటే హైదరాబాద్ మరో బెంగళూరులా తాగునీటికి కూడా ఇబ్బందిపడే పరిస్థితి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకుడు గుంతలు లేని నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు కూడా నీటి వినియోగంపై అవగాహన కలిగించేలా పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పింది. తాగునీటికి ఇబ్బంది ఉంటే గార్డెనింగ్ లాంటి వాటికి వినియోగాన్ని నియంత్రించాలంటూ సర్కారుకు పలు సూచనలు చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా నీటికొరత ఉందని, ప్రధానంగా జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌లో తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తోందని.. అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ జర్నలిస్ట్ సుభాష్ చంద్రన్ 19 ఏళ్ల క్రితం హైకోర్టుకు లేఖ రాశారు. ఇందులోభాగంగా నీటి వినియోగాన్ని నియంత్రించడం, తాగునీటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీన్ని న్యాయస్థానం పిటిషన్‌గా మార్చి సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి కీలక సూచనలతో కూడిన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌కు కాలం చెల్లిపోయిందని చట్టప్రకారం నిర్మాణాలకు అనుమతులిచ్చే విషయంలో నిబంధనలు పాటిస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సిద్ధివర్ధన పేర్కొన్నారు. తాగునీటి సంరక్షణ, నియంత్రణకు సంబంధించిన ఈ పిటిషన్ ద్వారా కోరిన ఉపశమనం.. తీసుకోవాల్సిన చర్యలు వేరని... ఈ నేపథ్యంలో కాలం చెల్లిందన్న వాదన సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ధర్మాసనం చేసిన సూచనలివీ... ► తాగునీటి పరిరక్షణ, పునర్వినియోగం, పంపిణీ లాంటి అంశాలను 3 నుంచి 5వ తరగతి పాఠ్యాంశాల్లో చేర్చే అంశాన్ని పరిశీలించాలి. 6వ తరగతి విద్యార్థులకు ఇదే అంశాలపై కొంత సిలబస్ స్థాయి పెంచి పాఠ్యాంశంగా చేర్చాలి. ► రాష్ట్రంలోని భూగర్భ జలాలను పరిశీలించి.. అవసరమైతే తాగునీటిని గార్డెనింగ్ వంటి పనులకు వినియోగించడంపై ఆంక్షలు విధించాలి. ► ఇంకుడు గుంతల్లేని నిర్మాణాలను గుర్తించడానికి, తగిన చర్యలు తీసుకోవడానికి పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి కసరత్తు చేయాలి. ► పట్టణ, స్థానిక సంస్థల్లో ఆర్డబ్ల్యూహెచ్ఎస్ నిబంధనలు అమల్లో ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి చర్యలు చేపట్టాలి. ► గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డబ్ల్యూహెచ్ఎస్ వ్యవస్థ అవశ్యకతను తెలియజేయడానికి సర్కారు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ► గతేడాది మార్చి 31న జారీచేసిన జీవో 49 అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీనికి అదనంగా చిన్న నిర్మాణాల్లో సైతం వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అంశాన్ని అధ్యయనం చేసి చర్యలు చేపట్టాలి. ► వాల్టా చట్టంలోని నిబంధనల అమలుకు సెక్షన్ 11 ప్రకారం సంబంధిత విభాగం నోటిఫికేషన్ జారీచేయాలి. ► రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బోర్‌వెల్స్ నిబంధనల ప్రకారమే కొనసాగుతున్నాయా? లేదా? అనే అంశంపై భూగర్భ జలవనరులశాఖ పరిశీలన చేపట్టి చర్యలు తీసుకోవాలి. ► పంచాయతీరాజ్ చట్టం- 2018లోని సెక్షన్ 43 (6) (2) నిబంబధనలు అమలయ్యేలా పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి చర్యలు తీసుకోవాలి. -
జలం లేక సంక్లిష్టం
బనశంకరి: మనుగడకు జలం జీవాధారం కాగా, ఆ జలమే దొరక్క మనశ్శాంతి కరువైంది. బెంగళూరు నగరంలో నీటి కొరత రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తుండడంతో ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాల్లో కలవరం నెలకొంది. ఆసుపత్రుల్లో నీటికి హాహాకారాలు నెలకొన్నాయి. బోర్లలో నీరు తగ్గడం,కొళాయిలు బంద్ కావడంతో ఆస్పత్రుల్లో రోగులు, వైద్యసిబ్బంది ఆందోళనలో పడ్డారు. కేఆర్ మార్కెట్ వద్ద బెంగళూరు మెడికల్ కాలేజీ, విక్టోరియా, వాణివిలాస్, మింటో, ట్రామా కేర్, నెఫ్రో యూరాలజీ ఆసుపత్రులకు వేలాది మంది రోగులు వస్తుంటారు. అడ్మిషన్లు కూడా ఎక్కువే. వారి కుటుంబసభ్యులు ఆసుపత్రి ఆవరణలో విశ్రాంతి తీసుకుంటారు. నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆస్పత్రులు ట్యాంకర్ల నీటిపై ఆధారపడ్డాయి. ఇలాగే ఉంటే కష్టం: ఆస్పత్రుల సంఘం బన్నేరుఘట్ట రోడ్డు, హెచ్ఎస్ఆర్.లేఔట్, వైట్‌ఫీల్డ్, మహదేవపుర, బీటీఎం లేఔట్, కృష్ణరాజపురం పరిధిలో ఆస్పత్రులకు నీటి కష్టాలు తలెత్తాయి. చాలావరకు ప్రైవేటు ఆసుపత్రులు ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నాయి. మంచినీరు సరఫరా కావడం లేదు, ఇంతవరకు ఎలాగో నెట్టుకొచ్చాము, సమస్య ఇలాగే కొనసాగితే కష్టతరంగా మారుతుందని ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గోవిందయ్య యతీశ్ తెలిపారు. హోటళ్లలో ధరల మోత? నీళ్లు లేక హోటల్స్‌ను మూసుకోవాల్సి వస్తోందని యజమానులు వాపోయారు. హోటల్స్ లో నీటి వాడకాన్ని 20 శాతం తగ్గించగా యూజ్ అండ్ త్రో ఉత్పత్తులను ఎక్కువగా వాడుతున్నారు. డిమాండ్ పెరగగానే నీటి ధర పెరిగింది. కొన్ని హోటళ్ల యజమానులు ట్యాంకర్లతో నీటిని కొంటున్నారు. ఇది భారంగా ఉందని తెలిపారు. కాబట్టి టిఫిన్, భోజనం ధరలను పెంచే యోచనలో ఉన్నారు. ధరలు పెంచినప్పటికీ జూన్ నుంచి మళ్లీ తగ్గిస్తామని హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు పీసీ.రావ్ తెలిపారు. నీటిని చాలా పొదుపుగా వాడుకోవాల్సి వస్తోందన్నారు. కోచింగ్ సెంటర్ల ఆన్లైన్ బాట నీటి సమస్య తీవ్రరూపం దాల్చగానే నగరంలోని కొన్ని పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని తీర్మానించాయి. విజయనగర, బసవనగుడి, రాజాజీనగర, జయనగర, జేపీ.నగర తదితర ప్రాంతాల్లో చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. తాగునీరు, ఇతర అవసరాలకు దండిగా నీరుకావాలి, దీంతో కొన్ని సంస్థలు విద్యార్థులను రావద్దని చెప్పేసి ఆన్లైన్ లో తరగతులను ప్రారంభించాయి. చాలా పాఠశాలల్లో నీటికి కటకట ఏర్పడింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు నీటి కోసం అల్లాడుతున్నాయి. ఇంకా కొన్నిరోజులు పాఠశాలలు నిర్వహించాల్సి ఉంది. తాగునీరు, మధ్యాహ్న భోజన నిర్వహణ కష్టంగా మారిందని ప్రైవేటు పాఠశాలల ఒక్కూట సభ్యులు తెలిపారు. ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కోరారు. -
బెంగళూరు గొంతెండుతోంది
‘‘అవడానికి మాదో లగ్జరీ అపార్ట్మెంట్. కానీ ఏం లాభం? నెల రోజులుగా చుక్క నీటికీ దిక్కు లేక అల్లాడుతున్నాం! 24 గంటలూ రావాల్సిన నల్లా నీళ్లు ఏ రాత్రి వేళో వస్తున్నాయి. అవీ మురికిమయం! స్నానపానాలకే కాదు, చివరికి టాయ్‌లెట్ అవసరాలకు కూడా నీరు లేదు. సరిగా నీళ్లు కూడా పోయక ఏ ఫ్లాట్‌లో చూసినా టాయ్లెట్లు భరించలేనంతగా కంపు కొడుతున్నాయి. దాంతో రెసిడెంట్లు మూకుమ్మడిగా ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. అలా వెళ్లలేనివాళ్లం విధిలేక పక్కనే ఉన్న ఫోరం సౌత్ మాల్‌లోకి వెళ్లి టాయ్‌లెట్ అవసరాలు తీర్చుకుంటున్నాం!’’ – రెడిట్‌లో ఓ బెంగళూరు వాసి పెట్టిన పోస్టిది! అలాంటిదేమీ లేదంటూ సదరు అపార్ట్మెంట్ అసోసియేషన్ ఖండించినా ఈ పోస్టు ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనికి బెంగళూరు టెకీల నుంచి విపరీతమైన స్పందన వెల్లువెత్తుతోంది. తమ నీటి కష్టాలకు అంతు లేదంటూ వర్ణిస్తూ వారు పెడుతున్న పోస్టులతో ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది... దేశ ఐటీ రాజధాని బెంగళూరు గొంతెండిపోతోంది. తీవ్ర నీటి కొరతతో అల్లాడుతోంది. గుక్కెడు తాగునీటి కోసం జనం అలో లక్ష్మణా అంటూ అలమటిస్తున్నారు. నగరవ్యాప్తంగా బోర్లన్నీ చుక్క నీరైనా లేకుండా ఎండిపోయాయి. నగరంలో ఏటా వేసవిలో నీటి కొరత మామూలే అయినా ఈసారి మాత్రం సమస్య చాలా దారుణంగా ఉంది. ఇంకా వేసవి మొదలైనా కాకముందే నీటి కొరత తారస్థాయికి చేరింది. కోట్లు పెట్టి లగ్జరీ అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్లు కూడా కనీసం స్నానానికైనా నీళ్లు లేక లబోదిబోమంటున్నారు. సమర్థమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయలేక ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రస్తుతానికి చేష్టలుడిగింది. రాష్ట్రవ్యాప్తంగా నీటి ఎద్దడి నెలకొని ఉందంటూ ప్రకటించింది! నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే తాలూకా స్థాయిలో కంట్రోల్ రూములు, హెల్ప్లైన్లు ఏర్పాటు చేసింది. బెంగళూరులో నీటి సమస్య నివారణకు ఎంతదూరమైనా వెళ్తామంటూ ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ చేసిన ప్రకటనలు ఇప్పటికైతే కార్యరూపం దాల్చలేదు. పరిస్థితి పూర్తిగా చేయి దాటకుండా చూసేందుకు నగరంలో నీటి వాడకంపై రాష్ట్ర జల బోర్డు కఠిన ఆంక్షలు విధించింది. కార్లు కడిగేందుకు, మొక్కలకు, మెయింటెన్స్, నిర్మాణ పనులకు తాగునీటి వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా తప్పదని హెచ్చరించింది. బెంగళూరులోనే గాక కర్ణాటకవ్యాప్తంగా నీటి ఎద్దడి ఆందోళనకర స్థాయిలోనే ఉంది. గత సీజన్లో వర్షాభావమే ఈ దుస్థితికి కారణమన్న ప్రభుత్వ ప్రకటనపై జనం మండిపడుతున్నారు. ఇంతటి సమస్య తప్పదని ముందే తెలిసి కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయలేదంటూ దుయ్యబడుతున్నారు. ‘‘నిజానికి మూడు నెలలుగా నీటి సమస్య వెంటాడుతోంది. నెల నుంచి పరిస్థితి మరీ విషమించింది’’ అంటూ వాపోతున్నారు. ట్యాంకర్ల రేట్లు చుక్కల్లోకి... ► బెంగళూరులో ఏకంగా 60 శాతం జనం నీటి కోసం వాటర్ ట్యాంక్‌ల మీదే ఆధారపడ్డారు! అదను చూసి ప్రైవేట్ ట్యాంకర్లు రేట్లు ఎడాపెడా పెంచేశాయి. ► మామూలు రోజుల్లోనే 6,000 లీటర్ల ట్యాంకర్‌కు రూ.600, 8,000 లీటర్లకు రూ.800, 12 వేల లీటర్ల ట్యాంకరైతే రూ.1,000 చార్జి చేస్తారు. ► ఈ రేట్లకు జీఎస్టీ అదనం. పైగా దూరం 5 కి.మీ. దాటితే మరో రూ.200 దాకా పెరుగుతుంది. ► ఇప్పుడు ప్రైవేట్ ట్యాంకర్లు రెట్టింపు, అంతకుమించి వసూలు చేస్తున్నాయంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. ► దాంతో ట్యాంకర్ల రేట్లకు పరిమితి విధిస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఎక్కడా పెద్దగా అమలు కావడం లేదు. ► ఇవేం ధరలంటూ గట్టిగా నిలదీస్తే ట్యాంకర్వాలాలు ఆ కాలనీల ముఖం కూడా చూడటం లేదు. ► మున్సిపాలిటీ నల్లాల వద్ద క్యూ లైన్లు కిలోమీటర్లు దాటేస్తున్నాయి. అక్కడా ఒక్క బిందెకు మించి ఇవ్వడం లేదు! ► ఆర్వో ప్లాంట్ల ముందు కూడా ఒక్కరికి ఒక్క క్యానే అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి! ► చాలా ప్లాంట్లు ‘నో వాటర్’ అంటూ బోర్డులు పెట్టి బ్లాకులో అడ్డగోలు రేట్లకు అమ్ముకుంటున్నాయి. ► నీటి ఎద్దడి దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు ఆన్లైన్ బాట పడుతున్నాయి. ఆన్లైన్ క్లాసులతో పని కానిస్తున్నాయి. ఎందుకింత సమస్య... ► 2023లో కర్ణాటకవ్యాప్తంగా నెలకొన్న వర్షా భావ పరిస్థితులు ప్రస్తుత నీటి సమస్యకు ప్రధాన కారణాల్లో ఒకటి. ► రాష్టంలో ఎక్కడ చూసినా భూగర్భ జలాలు అడుగంటాయి. కావేరీ బేసిన్‌లోని రిజర్వాయర్లన్నీ దాదాపుగా వట్టిపోయాయి. ► కర్ణాటకలోని 16 పెద్ద రిజర్వాయర్లలో 2023లో ఇదే సమయానికి సగం వరకున్న నీటిమట్టం ఈసారి 29 శాతానికి పడిపోయింది. ► బెంగళూరులో ఎక్కడ చూసినా బోర్లే దర్శనమిస్తుంటాయి. భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయడం నగరంలో నీటి ఎద్దడికి ప్రధాన కారణం. ► రియల్టీ బూమ్ నేపథ్యంలో రెండు దశాబ్దాలుగా నగరంలోని చెరువులు, నీటి ఆవాసాలన్నీ కాలనీలు, అపార్ట్మెంట్లుగా మారిపోయాయి. ఆ దెబ్బకు స్థానిక నీటి వనరులు పూర్తిగా కనుమరుగయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గంగమ్మకూ నీటి కష్టాలు!
సాక్షి, అమరావతి: తన తాత ముత్తాతలకు సద్గతుల ప్రాప్తి కోసం భగీరథుడు దివి నుంచి భువికి రప్పించిన గంగమ్మకూ నీటి కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుతం జీవ నదులైన గంగ, బ్రహ్మపుత్ర, సింధు, తీస్టా సహా 12 నదుల్లో ప్రవాహం 2100 నాటికి వర్షాలపైనే ఆధారపడే పరిస్థితి రావచ్చు. మన దేశంతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా ఆసియా ఖండంలోని 16 దేశాల్లో 167.40 కోట్ల మంది ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు తప్పవని చెబుతోంది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్ (ఐసీఐఎంవోడీ) సంస్థ ఈ నెల 20న విడుదల చేసిన అధ్యయన నివేదిక. ఇందుకు ప్రధాన కారణం.. ఆ జీవ నదులకు జన్మ స్థానమైన హిమాలయ పర్వతాల్లోని హిందూకుష్ శ్రేణుల్లో హిమనీ నదాలు శరవేగంగా కరిగిపోతుండటమేనని తేల్చింది. వాతావరణ మార్పులు, భూఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్లే హిమనీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం హిందూకుష్ పర్వత శ్రేణుల్లోని హిమనీ నదాల పరిమాణం 2010 నాటికి 80 శాతానికి తగ్గిపోవడం ఖాయమని అంచనా వేసింది. ఆసియా ఖండపు నీటి శిఖరం ధ్రువ ప్రాంతాల తర్వాత భూగోళంపై అతి పెద్ద హిమనీ నదాలకు నిలయం హిందూకుష్ పర్వత శ్రేణులే కావడం గమనార్హం. హిమాలయ పర్వత శ్రేణుల్లోని హిందూకుష్ పర్వత శ్రేణుల్లోనే గంగా, బ్రహ్మపుత్రా, సింధు, తీస్టా సహా 12 నదులు పురుడు పోసుకుని మనదేశంతోపాటు పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ తదితర 16 దేశాల్లో ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఈ నదులకు ప్రధాన ఆధారం హిందూకుష్ పర్వత శ్రేణుల్లోని హిమనీ నదాలే. హిమపాతంలో గణనీయంగా తగ్గుదల కాలుష్యంతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల హిందూకుష్ పర్వత శ్రేణుల్లో హిమపాతం గణనీయంగా తగ్గుముఖం పడుతోందని ఐసీఐఎంవోడీ అధ్యయనంలో వెల్లడైంది. 1971 నుంచి 2000 సంవత్సరాల మధ్య హిందూకుష్ పర్వత శ్రేణుల్లో అంచనా వేసిన దానికంటే హిమపాతంలో సగటున 15 శాతం తగ్గుదల కనిపించిందని తెలిపింది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే.. 2070 నుంచి 2100 సంవత్సరాల మధ్యలో అంచనా వేసిన దాని కంటే సింధూ బేసిన్లో 30 నుంచి 50, గంగా బేసిన్లో 50 నుంచి 60, బ్రహ్మపుత్రా బేసిన్లో 50 నుంచి 70 శాతం హిమపాతం తగ్గుతుందని అంచనా వేసింది. శరవేగంగా కరుగుతున్న మంచు 2000 సంవత్సరం నుంచి 2009 మధ్య ఏటా సగటున 0.18 మీటర్ల మేర హిమనీ నదాల పరిమాణం తగ్గితే.. 2010 నుంచి 2019 మధ్య అది 0.28 మీటర్లకు పెరిగిందని ఐసీఐఎంవోడీ తెలిపింది. అంటే.. 2000–2009తో పోల్చి తే 2010–2019 మధ్య హిమనీ నదాల మంచు కరుగుదల 65 శాతం పెరిగినట్టు స్పష్టమవుతోంది. మంచు శరవేగంగా కరుగుతుండటం వల్ల 2100 సంవత్సరం నాటికి హిందూకుష్ పర్వత శ్రేణుల్లోని హిమనీ నదాల పరిమాణం 80 శాతం తగ్గుతుందని లెక్కగట్టింది. దీనివల్ల గంగా, సింధు, బ్రహ్మపుత్ర సహా 12 నదుల్లో వర్షాకాలం తప్ప మిగతా సమయాల్లో నీటి ప్రవాహం ఉండే అవకాశాలు తక్కువని అంచనా వేసింది. ఇది ఆ నదీ పరీవాహక ప్రాంతాల్లోని 167.40 కోట్ల మంది ప్రజల జీవనోపాధులను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. హిమపాతం తగ్గడం వల్ల 1979 నుంచి 2019 మధ్య గంగా, బ్రహ్మపుత్ర, సింధు బేసిన్లలో నీటిలభ్యత తగ్గడం వల్ల 1.29 కోట్ల మంది రైతుల జీవనోపాధులు దెబ్బతిన్నాయని తమ అధ్యయనంలో తేలిందని ఐసీఐఎంవోడీ వెల్లడించింది. -
జీవనదులు విలవిల
అమెరికాతో సహా యూరప్, ఆసియా ఖండాల్లోని పలు దేశాలు తీవ్ర దుర్భిక్షం బారిన పడుతున్నాయి. పెచ్చుమీరిన వేసవి తాపం, అత్తెసరు వర్షపాతం, నానాటికీ పెరిగిపోతున్న భూతాపం దెబ్బకు మహా మహా నదులన్నీ అక్షరాలా మటుమాయమే అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరార్ధ గోళం కనీవినీ ఎరుగని సంక్షోభంలో చిక్కి కొట్టుమిట్టాడుతోంది. పారిశ్రామిక, ఆహార ధాన్యాల ఉత్పత్తులు, సరుకు రవాణా, జల విద్యుదుత్పత్తి రంగాలన్నీ కుదేలవుతున్నాయి. ఈ దుర్భిక్షం గత 500 ఏళ్లలో ఎన్నడూ చూడని విపరిణామాలకు కారణమవుతోంది. 230 కోట్ల మందికి నీటి కొరత జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, చైనా, అమెరికా, ఇరాక్ వంటి దేశాల్లో నిత్యం నిండుగా ప్రవహించే జీవనదులన్నీ నిలువునా ఎండిపోతున్నాయి. దాంతో వాటికి అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు కూడా గుడ్లు తేలేస్తున్నాయి. ఫలితంగా కోట్లాదిమంది తాగు, సాగు నీటికి అల్లాడుతున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వల్ల చాలా దేశాలను వేధిస్తున్న ఆహార ధాన్యాల కొరత కాస్తా ఈ కరువు దెబ్బకు రెట్టింపైంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 230 కోట్ల మంది నీటి కొరత బారిన పడ్డట్టు ఐరాస నివేదికచెబుతోంది. లానినో పరిస్థితుల దెబ్బకు యూరప్‌లో 47 శాతంపై దుర్భిక్షం ఛాయలు కమ్ముకున్నాయని గ్లోబల్ డ్రాట్ అబ్జర్వేటరీ తాజా నివేదిక చెబుతోంది. బయట పడుతున్న చారిత్రక అవశేషాలు మహా నదులన్నీ ఎండిపోతుండటంతో ఎన్నడూ చూడని చారిత్రక అవశేషాలు వాటి గర్భం నుంచి బయటపడుతున్నాయి. అమెరికాలో కొలరాడో నది గర్భంలో లక్షలాది ఏళ్లనాటి డైనోసార్ అడుగుజాడలు బయటపడ్డాయి. స్పెయిన్‌లో బార్సెలోనా సమీపంలోని రిజర్వాయర్‌లో నీరు ఆవిరవడంతో 9వ శతాబ్దానికి చెందిన చర్చి బయట పడింది. మాడ్రిడ్‌లో వందల ఏళ్ల కింద నీట మునిగిన ఓ గ్రామ శిథిలాలు వెలుగు చూశాయి. స్పెయిన్‌లోనే కాసెరస్ ప్రావిన్స్‌లో క్రీస్తుపూర్వం 5 వేల ఏళ్లనాటి రాతి పలకలు చైనాలో యాంగ్జీ నదిలో బుద్ధ విగ్రహాలు బయటపడ్డాయి. ఇరాక్‌లో టైగ్రిస్ నది ఎండిన చోట మెసపటోమియా నగరికత కాలం నాటి రాజమహల్, నాటి నగరం బయట పడ్డాయి. నదులన్నింటా కన్నీళ్లే... ► జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ దేశాల ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా చెప్పే రెయిన్ నది పరిస్థితి ఎంతో దైన్యంగా ఉంది. ► 2,900 కిలోమీటర్లు ప్రవహించి నల్లసముద్రంలోకలిసే ఈ నది ఎన్నోచోట్ల ఎండిపోయింది. ► రెయిన్, దాని ఉపనదులు, కాల్వల ద్వారా ఏటా ఏకంగా 8,000 కోట్ల డాలర్ల (రూ.6.4 లక్షల కోట్ల) విలువైన సరుకు రవాణా జరుగుతుంటుంది. అలాంటిది రవాణా నౌకలు కొంతకాలంగా చూద్దామన్నా కన్పించడం లేదు. ► ఆల్ఫ్స్ పర్వతాల్లో కరిగే మంచుతో నిత్యం నీటితో కళకళలాడే పో నది కూడా ఎండల దెబ్బకు జీవచ్ఛవంగా మారిపోయింది. ► ఇటలీలో 30 శాతం వ్యవసాయం ఈ నది మీదే ఆధారపడింది. ఇప్పుడు అదీ కుదేలైంది. గత కొన్ని దశాబ్దాల్లో ఇంతటి దుర్భిక్షాన్ని ఎన్నడూ చూడలేదంటూ ఇటలీ వాతావరణ నిపుణులు వాపోతున్నారు. ► ఇక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ వైన్ తయారీకి ఆధారమైన లోయెర్ నదిలో కూడా నీరు అతి వేగంగా అడుగంటుతోంది. ఫ్రాన్స్‌లో 600 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నదిలో జలమట్టాన్ని కాపాడుకునేందుకు అనేక రిజర్వాయర్ల నుంచి నీటిని వదులుతున్నారు. ► యూరప్‌లో 10 దేశాల గుండా పారే అతి పొడవైన నది డాన్యూబ్ కూడా చిక్కిపోతోంది. ► అమెరికాలో డెన్వర్ నుంచి లాస్ఏంజెలెస్ దాకా 4 కోట్ల మంది నీటి అవసరాలు తీర్చే కొలరాడో నదిదీ ఇదే దుస్థితి! ► 45 లక్షల ఎకరాలకు నీరందించి ఏటా 1.4 లక్షల కోట్ల డాలర్ల వ్యవసాయ, తదితర ఆదాయాన్ని సమకూర్చే ఈ నది ఎండల ధాటికి చేతులెత్తేస్తోంది. ► నిత్యం ఉధృతంగా ప్రవహించే చైనాలోని యాంగ్జీ నది మరింత దుస్థితిలో ఉంది. సి చువాన్ ప్రావిన్స్‌కు జీవనాధారమైన ఈ నదిలో ఎక్కడ చూసినా నీరు అడుగంటి నదీగర్భం పైకి కన్పిస్తోంది. దాంతో ప్రభుత్వం కరువు హెచ్చరికలు జారీ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాలికల నెత్తిన బరువు
‘నో వాటర్ ల్యాండ్’ ఇది త్వరలో రాబోతున్న డాక్యుమెంటరీ. మహారాష్ట్రలో నీళ్లు లేని ప్రాంతాలలో బాలికల జీవితం నీళ్లు మోయడంలోనే ఎలా గడిచిపోతున్నదో ఈ డాక్యుమెంటరీ తెలియచేయనుంది. యు.కెలోని స్వచ్ఛంద సంస్థ ‘వెల్స్ ఆన్ వీల్స్’ స్థాపకుడు షాజ్ మెమొన్ దీనిని నిర్మిస్తుండగా అవార్డ్ విన్నింగ్ దర్శకుడు సౌమిత్రా సింగ్ దర్శకత్వం వహించాడు. నీళ్లు బాలికల బాల్యాన్ని మన దేశంలోని చాలా చోట్లఎలా ధ్వంసం చేస్తున్నాయో ఈ డాక్యుమెంటరీ కళ్లకు కట్టనుంది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో దందిచి బరి అనే చిన్న గ్రామం ఉంది. దానికి ‘భార్యలు పారిపోయే ఊరు’ అనే పేరు ఉంది. ఆ ఊరికి కోడళ్లుగా వచ్చిన వారు రెండో రోజున, మూడో రోజున పుట్టింటికి పారిపోతారు. దానికి కారణం ఆ ఊళ్లో నీళ్లు ఉండవు. దూరం వెళ్లి తేవాలి. మిట్టలు పల్లాలు ఎక్కి దిగాలి. గంటల తరబడి నీరు ఊరే వరకు ఆగాలి. ఆ తర్వాత మోయాలి. ఇవన్నీ చేయడం కంటే భర్త లేకుండా బతకడం మేలు అని ఆ ఊరి భార్యలు పారిపోతుంటారు. ఇప్పుడైతే ఆ ఊరికి పిల్లనిచ్చేవారు లేరు. నాసిక్ జిల్లాలో నీటి సమస్య అంత తీవ్రం దీని పొరుగునే ఉన్న మరో జిల్లా థానేలో దింగన్‌మల్ అనే గ్రామం ఉంది. దీనికి ‘బహు భార్యల ఊరు’ అనే పేరు ఉంది. ఎందుకంటే అక్కడ ఒక్క మగాడు ఇద్దరు లేక ముగ్గురిని వివాహం చేసుకుంటాడు. ఒకరు వంట చేసేందుకు, ఒకరు నీళ్లు మోసేందుకు. ఎందుకంటే ఆ ఊరి నుంచి నీరు తెచ్చుకోవడానికి రోజులో ఆరు గంటలు వెచ్చించాలి. అంతసేపు నీళ్లకే పోతే వంటా గింటా జరిగే చాన్సు లేదు. అందుకని ‘నీటి భార్యలు’ ఇక్కడ ప్రతి ఇంటా ఉంటారు. పెద్ద భార్యే వెతికి ‘నీటి భార్య’ను తెస్తుంది. భర్త తనకు పోషించే శక్తి లేకపోయినా ఇద్దరిని కట్టుకోవాల్సిందే. లేకుంటే బతకడం కష్టం. పెద్దలకే ఇన్ని కష్టాలు ఉంటే మరి ఆడపిల్లల పరిస్థితి ఏమిటి? మహారాష్ట్రలో నీటి కరువు ఉన్న అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య బాధిస్తున్నది బాలికలనే. భర్త సంపాదించడానికి వెళ్లాలి కాబట్టి కొడుకులు బాగా చదువుకోవాలి కాబట్టి నీటి బాధ్యత వారికి ఉండవు. తల్లి కాని కుమార్తెగాని నీరు మోయాలి. ‘బడికి వెళ్లి చదువుకోవాలనే మా కలలు కల్లలే అవుతున్నాయి’ అని అక్కడి ఆడపిల్లలు అంటారు. స్కూళ్లలో పేర్లు నమోదు చేసుకున్నా వీరు రోజూ స్కూలుకి వెళ్లడం సాధ్యం కాదు. అరగంట దూరంలో ఉండే బావి నుంచి ఒక బిందెను మోసుకు వస్తారు. అలా నాలుగు బిందెలు తేవాలంటే రెండు గంటల సమయం గడిచిపోతుంది. ఆరు బిందెలకు మూడు గంటలు. నిత్య నరకం 7 సంవత్సరాల బాలికల నుంచి 18 సంవత్సరాల యువతుల వరకు ఈ నీటి మోతకు బానిసలుగా మార్చబడతారు. తల్లిదండ్రులకు వేరే మార్గం కూడా ఉండదు. ముఖ్యంగా వేసవిలో బాలికల కష్టాలు చెప్పనలవి కావు. ‘తల మీద మోయడం వల్ల తల దిమ్ముగా ఉంటుంది. భుజాలు నొప్పి పెడతాయి. ఛాతీలో బరువు. కాళ్లు లాగుతాయి’ అని ఇక్కడి ఆడపిల్లలు చెబుతారు. వేసవిలో ఈ ప్రాంతంలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. ‘ఆ ఎండలో వెళ్లి నీళ్లు తేవాలంటే చాలాసార్లు ఆడపిల్లలు స్పృహ తప్పి పడిపోతుంటారు. హాస్పిటల్లో చేరిస్తే అదో ఖర్చు’ అని తల్లిదండ్రులు వాపోతుంటారు. ఏ సంవత్సరం తీసుకున్నా కనీసం 2000 మంది ఆడపిల్లలు మహారాష్ట్రలో నీళ్లు లేని జిల్లాల్లో స్కూళ్లకు నాగా పెడుతుంటారు. వీరి చదువు ఇలా ఒడిదుడుకుల్లో పడటం వీరి భవిష్యత్తుగా పెద్ద విఘాతంగా మారుతోంది. డాక్యుమెంటరీ అయితే తను ఒక్కడే ఈ పని చేస్తే నీటి సమస్య తీరదు. దేశంలో ఎక్కడెక్కడ నీళ్ల వల్ల ఆడపిల్లలు చదువుకు దూరం అవుతున్నారో ఆ ప్రాంతాలన్నిటినీ గుర్తించి తరుణోపాయాలు ఆలోచించాలని పిలుపునిస్తాడు షాజ్. అందుకే ‘నో వాటర్ ల్యాండ్’ అనే డాక్యుమెంటరీ నిర్మించాడు. దీనికి గతంలో నసీరుద్దీన్ షాతో షార్ట్ ఫిల్మ్ తీసి అవార్డు పొందిన సౌమిత్రా సింగ్ దర్శకత్వం వహించాడు. త్వరలో ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకుల ముందుకు రానుంది. l వెల్స్ ఆన్ వీల్స్ యు.కెలో డెంటల్ రంగంలో పని చేస్తున్న వ్యాపారవేత్త షాజ్ మెమెన్ మహారాష్ట్రలో బాలికల నీటి కష్టాలను తగ్గించి వారిని చదువుకు దగ్గర చేర్చాలని నిశ్చయించుకున్నాను. ‘నాకు కూతురు పుట్టాక హటాత్తుగా నాకు ఈ విషయం గుర్తుకు వచ్చింది. నా కూతురు ఉదయాన్నే లేచి నీళ్లకోసం కష్టపడాల్సిన పని లేదు. నేరుగా స్కూల్‌కి వెళ్లిపోయేంత నీటి సౌకర్యం ఇక్కడ ఉంది. కాని భారత్‌లో అలా కాదు. ఆడపిల్లలు నీటి బరువు కింద నలిగిపోతున్నాడు. వారి కోసం ‘వెల్స్ ఆన్ వీల్స్’ అనే సంస్థను స్థాపించాను’ అంటాడు షాజ్ మెమెన్. ఇతను నేల మీద దొర్లించుకుంటూ (లాక్కుంటూ) వచ్చే నీళ్ల డ్రమ్ముల సరఫరా మహారాష్ట్రలో మొదలెట్టాడు. ఒక్కో డ్రమ్ములో 45 లీటర్ల నీళ్లు పడతాయి. హై క్వాలిటీ ప్లాస్టిక్ డ్రమ్ములు కనుక (అవి 7000 కిలోమీటర్ల దూరం లాగినా పాడు కావు) వీటిని సులువుగా లాక్కుంటూ రావచ్చు. మూడు బిందెల నీళ్లు ఈ ఒక్క డ్రమ్ములో పడతాయి కనుక మూడు ట్రిప్పుల కాలం మిగిలి ఆడపిల్లలు ఇప్పుడు స్కూళ్లకు వెళుతున్నారు. నాసిక్‌లోని ఐదు ఊళ్లలో వెల్స్ ఆన్ వీల్స్ పేరుతో నీళ్ల డ్రమ్ముల సరఫరా జరిగింది. -
వాటర్ ట్యాంకర్‌పై వధూవరుల ఊరేగింపు... అసలు సంగతి ఇది..
ఈరోజుల్లో వైరల్ అయిపోవడం చిటికేసినంత ఈజీ అయిపోయింది. చేసే పని ఎలాంటిదైనా కెమెరాకి చిక్కితే చాలూ అన్నట్లు ఉంది పరిస్థితి. కావాలని కొందరు.. అనుకోకుండా కొందరు మీమ్ స్టఫ్ అయిపోతున్నారు. అదే సమయంలో చర్చలకు సైతం దారి తీస్తున్నారు మరికొందరు. అలాంటి జంట గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. వాటర్ ట్యాంకర్‌పై వధువు వరుడిని ఊరేగించిన ఘటన తాలుకా ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. వీళ్లేదో దేశాన్ని ఉద్దరిస్తున్నారా? అనుకోకండి.. సమస్య మీద పోరాటంలో భాగమే ఈ ఊరేగింపు. మహారాష్ట్ర కోల్హాపూర్‌కు చెందిన విశాల్ కోలేకర్(32) వివాహం అపర్ణ అనే యువతితో గురువారం జరిగింది. వివాహం తర్వాత ఆ ఇద్దరినీ ఓ వాటర్ ట్యాంకర్‌పై ఎక్కించి మరీ ఊరేగించారు బంధువులు. రోడ్లు, వీధుల వెంట వెళ్తున్న ఆ ఊరేగింపును చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే వాళ్లు అలా చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. కరువు.. చాలాచోట్ల సీజన్‌తో సంబంధంలేని సమస్యగా మారిపోయింది. అధికారులు కూడా నీటి కొరత తీర్చడంలో అసమర్థత ప్రదర్శిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలో తమ ప్రాంతానికి నీటి సరఫరా ఉండట్లేదన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ జంట ఇలా చేసింది. ‘‘నగరంలో మంచి నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. మా ఏరియా(మంగళ్వార్ పేట్)లో నెలకొన్న సమస్యను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం. కానీ, ఫలితం లేకుండా పోతోంది. ప్రిన్స్ క్లబ్ అనే సోషల్ గ్రూప్ తరపున చాలా కాలంగా పోరాడుతూనే ఉన్నాం.. అయినా నీరు సకాలంలో రావట్లేదు. అందుకే చాలా కుటుంబాలు వాటర్ ట్యాంకర్లనే నమ్ముకున్నాయి’’ అని వరుడు విశాల్ కోలేకర్ వాపోయాడు. Maharashtra | A Kolhapur couple rode a water-tanker on their wedding day, to call attention to the ongoing water crisis in the city. The newly-weds have vowed "not to go on a honey-moon until this crisis ends," according to the message on the tanker. (Source: self-made) pic.twitter.com/1kWM97ogTB — ANI (@ANI) July 9, 2022 ఈ నిరసన ఇక్కడితోనే ఆగిపోలేదు. వివాహ ఊరేగింపులో వాటర్ ట్యాంకర్‌కు ఓ బ్యానర్ కట్టింది ఈ జంట. అందులో నీటి సమస్య తీరేంత వరకు హనీమూన్ కూడా వెళ్లమంటూ పేర్కొన్నారు. విశాల్‌తో పాటు అతని ఆశయానికి అండగా నిలిచిన అపర్ణను చాలామంది అభినందిస్తున్నారు. -
గ్రామాల్లో మంచినీటి ఎద్దడి నివారణకు రూ.277 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఏడాది మంచినీటి ఇబ్బందుల నివారణకు ఇప్పటికే రూ.277.68 కోట్లు విడుదల చేసినట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తీవ్ర నీటి ఎద్దడి ఉండే గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు రెండు విడతల్లో రూ.177 కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు మరో రూ.100 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. రక్షిత మంచినీటి పథకాల నిర్వహణతో పాటు అవసరమైన చోట చిన్న మరమ్మతులు చేసుకోవడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసిన కారణంగా ఈ ఏడాది వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాల్సిన గ్రామాల సంఖ్య తగ్గిందని మంత్రి వివరించారు. గత ఏడాది వేసవిలో 5,175 నివాసిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సి వస్తే, ఈ ఏడాది వేసవిలో 3,314 నివాసిత ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. తీవ్ర నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లో పశువుల అవసరాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు చేపట్టినట్టు వివరించారు. -
ఇక దృష్టంతా దక్షిణంపైనే
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడం.. అక్కడి ఉత్తర తెలంగాణ జిల్లాలకు నీటి కొరత తీరనుండటంతో ఇప్పుడు ప్రభుత్వం దక్షిణ తెలంగాణ జిల్లాలపై దృష్టిపెట్టింది. ముఖ్యంగా వలసలతో వెనుకబడ్డ పూర్వ పాలమూరు జిల్లా రూపురేఖలను మార్చేలా సాగునీటి వ్యవస్థను మెరుగులు దిద్దే పనిలో పడింది. ఈ జిల్లాలోనే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పరుగులు పెట్టించడంతో పాటు గట్టు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేశారు. ఈపనుల ద్వారా మొత్తంగా జిల్లాలో 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు వచ్చే ఖరీఫ్ నాటికి నీళ్లందించాలని ప్రభుత్వం లక్ష్యాలు పెట్టుకుంది. వంద శాతం పూర్తి పూర్వ పాలమూరు జిల్లాలో జలయజ్ఞం ప్రాజెక్టుల కింద కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను చేపట్టారు. వీటికింద 8.78 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించాలని నిర్ణయించగా.. ఇప్పటివరకు 6.03లక్షల ఎకరాల మేర ఆయకట్టు అందుబాటు లోకి వచ్చింది. కల్వకుర్తి కింద గరిష్టంగా 2.59లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించ గలిగారు. ఈ ఏడాది అనుకున్న స్థాయిలో నీరోస్తే ఈ ఒక్క ప్రాజెక్టు కిందే 3.25లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు నెట్టెంపాడు కింద 1.42లక్షలు, భీమా కింద 1.70లక్షల ఎకరాలకు నీరందించే అవకాశం ఉంది. చెల్లింపులు లేక నిలిచిన పనులు గత తొమ్మిది నెలలుగా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పరిధిలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు వెనుకబడ్డాయి. చాలాచోట్ల భూసేకరణ నిలిచిపోయింది. కల్వకుర్తి పరిధిలో రూ.60కోట్లు, నెట్టెంపాడులో రూ.15కోట్లు, భీమాలో రూ.10 కోట్ల మేర పెండింగ్ బిల్లులతో పనులు కదల్లేదు. భూసేకరణకు సైతం ఈ ప్రాజెక్టులకు రూ.20కోట్ల మేర తక్షణం చెల్లించాల్సి ఉన్నా అది జరగకపోవడంతో ఈ ఏడాది పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరిచ్చే అవకాశాలు లేవు. దీనిపై ఇటీవల 15 రోజుల వ్యవధిలోనే రెండుమార్లు సమీక్షించిన కేసీఆర్ ఈ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తే వచ్చే ఖరీఫ్ నాటికి 8.78 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి రావడం కష్టమేం కాదు. కేవలం రూ.150 కోట్లను తక్షణం విడుదల చేసినా ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంది. జూరాల కింద ఇప్పటికే లక్ష ఎకరాలు సాగవుతోంది. దీంతో పాటే ఆర్డీఎస్ కింద 87,500 ఎకరాలు, తుమ్మిళ్ల కింద 31,500 ఎకరాలు, గట్టు ఎత్తిపోతల ద్వారా 33 వేల ఎకరాలు కలిపి మొత్తంగా 11 లక్షల ఎకరాలను వచ్చే ఏడాది సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఇంజనీర్లకు మార్గదర్శనం చేశారు. బడ్జెట్ సమావేశాల తర్వాతే ‘గట్టు’పనులు బడ్జెట్ సమావేశాల అనంతరం గట్టు ఎత్తిపోతల పనులు మొదలు పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 12.30లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి తేవాల్సి ఉండగా, ఇందులో పూర్వ పాలమూరు జిల్లాలోని 7లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా పనులను వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికే పూర్తి చేసేలా శుక్రవారం రాత్రి జరిగిన సమీక్ష సందర్భంగా సీఎం ఆదేశాలిచ్చారు. దీనికోసం నిధుల ఖర్చు ఎలా ఉండాలి, రూ.10వేల కోట్ల రుణాలను ఎలా వినియోగించాలన్న దానిపై ఇంజనీర్లకు సూచించారు. -
మా నీళ్లను దొంగలించారు సారూ!
సాక్షి ముంబై: మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి, కరువు కారణంగా నీటి దొంగలు కూడా తయారయ్యారు. నాసిక్‌జిల్లా మన్మాడ్‌లో 300 లీటర్ల నీటిని దుండగులు దొంగిలించారు. మన్మాడ్‌లోని శ్రావస్తినగర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మరికొందరి ఇళ్లలో కూడా ఇలాగే జరిగిందని తెలుస్తోంది. మన్మాడ్కు నీటి సరఫరా చేసే జలాశయాల్లో అడుగంటిపోయాయి. దీంతో మన్మాడ్‌లో తీవ్ర నీటి ఎద్దడి సమస్య ఉండటంతో నీటి సరఫరా సుమారు 20 రోజులకు ఒకసారి అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో అనేక మంది డ్రమ్ములతోపాటు ట్యాంకులు కొనుగోలు చేసి నీటిని నిల్వ చేసుకుంటున్నారు. శ్రావస్థినగర్లో నివసించే విలాస్ ఆహిరే కూడా అందరి మాదిరిగానే ఓ 500 లీటర్ల ట్యాంకు బంగ్లాపై ఉంచి నీటిని నిల్వచేసుకుని వినియోగించుకోసాగారు. అయితే మన్మాడ్ మున్సిపాలిటీ కుళాయిలో నీటి సరఫరా చేయడంతో ఆ ట్యాంకును పూర్తిగా నింపుకుని నీటిని నిల్వచేసుకున్నాడు. కానీ, ఊహించని విధంగా మరుసటి రోజు ఉదయం పరిశీలిస్తే ట్యాంకులోని నీరు దొంగతతనానికి గురైందని తెలిసింది. ఈ ట్యాంకులో నుంచి సుమారు 300 లీటర్లకుపైగా నీటిని ఎవరో దొంగిలించుకుపోయారు. ఈ విషయంపై మన్మాడ్ పట్టణ పోలీసు స్టేషన్లో ఆయన లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. సదరు నీటి దొంగలను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని విలాస్ ఆహిర్ కోరారు. తీవ్ర కరువు సమీపిస్తోంది! రాష్ట్రంలో రోజురోజుకి నీటి సమస్య జఠిలమవుతోంది. మరాఠ్వాడా, విదర్బ, పశ్చిమ మహారాష్ట్రతోపాటు అనేక ప్రాంతాల్లో గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. దీంతో అనేక ప్రాంతాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో కరువు తాండవిస్తోంది. మరోవైపు జలాశయాలు, బావులు అడుగంటిపోతున్నాయి. ఊష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో జలాశయాల్లోని నీరు త్వరగా తగ్గుతోంది. పరిణామంగా అనేక ప్రాంతాల్లో సాగునీటితోపాటు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనేక గ్రామాల్లో వివాహాలతోపాటు ఇతర ఏదైనా కార్యాలు చేయాలంటే ప్రజలు భయపడుతున్నారు. నీటి సమస్య తీవ్రంగా ఉండటంతో అనేక మంది పెళ్లిళ్లు కూడా వాయిదా వేసుకుంటున్నట్టు తెలిసింది. దీన్నిబట్టి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందనేది మనకు స్పష్టం అవుతుంది. లాతూరులో సర్పంచిని చితకబాదిన గ్రామస్థులు.. లాతూరు జిల్లాలోని ఓ గ్రామంలో నీటి సమస్య పరిష్కారంపై నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామ సర్పంచిని స్థానిక ప్రజలు చితక బాదారు. ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. లాతూరు జిల్లా హాలసీ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మరాఠ్వాడాలోని లాతూర్ జిల్లాల్లో నీటి ఎద్దడి సమస్య తీవ్రంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఉన్న నీటి వనరులను కాపాడునేందుకు గ్రామస్థులు, ప్రభుత్వం, అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీంట్లో భాగంగానే హాలసీ గ్రామంలో బావుల కోసం ప్రజలందరు కలిసి డబ్బులు జమచేశారు. అయితే ఎన్నికల నియమావలి ఉందంటూ జాప్యం చేస్తూ వచ్చిన హాలసీ గ్రామ సర్పంచిని గ్రామస్థులు వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. అయితే ఏవో సాకులు చెబుతుండటంతో కోపోద్రిక్తులైన గ్రామస్థులు సర్పంచిని చితక బాదారు. ఈ సంఘటన తీవ్ర కలకలంతోపాటు భయాందోళనలను రేకేత్తించింది. నీటి కోసం ఇలా గోడవలు జరగడం ఆందోళన కలిగించే విషయమని పలువురు పేర్కొంటున్నారు. -
ఎడారా..కొల్లేరా!
కైకలూరు: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సు ఎడారిని తలపిస్తోంది. నీటి కొరతతో మత్స్య సంపద మాయమవుతోంది. విదేశీ అతిథి పక్షులు పస్తులుంటున్నాయి. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో 77 వేల 138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. రెండు జిల్లాల్లో కలిపి 122 కొల్లేటి గ్రామాల్లో సుమారు 3.20 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు. ప్రస్తుతం కొల్లేరులో నీటి జాడ లేక మైదానంలా కనిపిస్తోంది. కొల్లేరులో ఇంతటి దుర్భర పరిస్థితులు ఎన్నడూ చూడలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దారి మళ్లిన నీటి వనరులు! కొల్లేరు సరస్సులోకి 67 డ్రెయిన్ల ద్వారా లక్షా 11 వేల క్యూసెక్కుల నీరు చేరుతుంది. కృష్ణా, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో తూర్పు కనుమలు, కొండ ప్రాంతాల నుంచి వచ్చే రామిలేరు, బుడమేరు, తమ్మిలేరు వాగులు కొల్లేరుకు ప్రధాన నీటి వనరులు. కృష్ణా జిల్లాలో డ్రైయిన్ల ద్వారా 35వేల 590 క్యూసెక్కుల నీరు కొల్లేరుకు చేరుతోంది. అయితే వెలగలేరు వద్ద రామిలేరు, తమ్మిలేరులను పోలవరం కుడి కాల్వకు, మరికొన్ని చిన్న కాల్వలు, డ్రైయిన్లను పట్టిసీమ ప్రాజెక్టు కాల్వలోకి మళ్ళించడంతో కొల్లేరులోకి ఏటా వచ్చే నీరు తగ్గింది. పక్షులకు ప్రాణసంకటం... పక్షి జాతులకు ఆవాసయోగ్యమైన చిత్తడి నేలలు కొల్లేరులో ఉండడంతో స్వదేశీ, విదేశాలకు చెందిన 189 రకాల పక్షి జాతులు ఇక్కడ స్థిర, తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. వీటిలో కొన్ని జాతులు సైబీరియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, నైజిరియా, శ్రీలంక వంటి దేశాల నుంచి వలసలు వస్తాయి. ఆహారం, ఆవాసం కోసం లక్షలాది మైళ్ల దూరం నుంచి వలస వస్తున్న ఈ పక్షులకు ఇక్కడ నీటి కష్టాలు తప్పడం లేదు. కొల్లేరులో నీటి కొరత పక్షుల జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెగ్యులేటర్ నిర్మాణం అవసరం.. కొల్లేరులోకి చేరే నీటిని సముద్రంలోకి చేర్చే ఏకైక మార్గం ఉప్పుటేరు. ఉప్పుటేరు ద్వారా 12 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళుతుంది. ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మించాలని 1964లో మిత్రా కమిటీ సిఫార్సు చేసింది. మొత్తం మూడు ప్రాంతాల్లో మూడు రెగ్యులేటర్లు నిర్మించాలని నిపుణులు భావించారు. ఇంతవరకు ఆ ప్రతిపాదనలు అమలు కాలేదు. రెగ్యులేటర్ నిర్మాణం జరగకపోవడంతో సముద్రపు నీరు ఉప్పుటేరు ద్వారా కొల్లేరులోకి ఎగదన్నుతుంది. ఈ కారణంతో భూములు చౌడుబారడంతో పాటు కొల్లేరులో జీవించే సహజసిద్ధ నల్లజాతి చేపలు మృత్యువాత పడుతున్నాయి. కొల్లేరులో నీటి కొరత కారణంగా ఉపాధి కరువై వేలాది మంది బతుకుదెరువు కోసం వలసబాట పడుతున్నారు. కొల్లేరు సమస్యల పరిష్కారం జగన్‌తోనే సాధ్యం.. కొల్లేరు ప్రజలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యం. ప్రజాసంకల్ప యాత్రలో కొల్లేరు ప్రాంతానికి వచ్చిన ఆయన రెగ్యులేటర్ నిర్మాణానికి కమిటీ సిఫార్సులతో కార్యాచరణ చేపడతామని చెప్పారు. కొల్లేరు ప్రజల్లో ఒకరికి ఎమ్మెల్సీ కేటాయిస్తానని హామీ ఇచ్చారు. కొల్లేరులోకి వచ్చే నీటి వనరులను టీడీపీ దారి మళ్లించింది. – ముంగర నరసింహారావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు, వడ్లకూటితిప్ప. రెగ్యులేటర్లు నిర్మించాలి.. కొల్లేరు సరస్సులో రెగ్యులేటర్లు నిర్మించాలి. కొల్లేరులో రెగ్యులేటర్ నిర్మిస్తే సముద్రపు ఉప్పునీరు పైకిరాదు.డ్రైయిన్ల ద్వారా కొల్లేరులోకి వస్తున్న కొద్దిపాటి నీటిని ఎగువ ప్రాంతాల రైతులు తరలించేస్తున్నారు. ప్రభుత్వం కొల్లేరులోకి నీటిని ఇతర మార్గాల ద్వారా పంపించాలి. వలసలను నివారించాలి. – ఘంటసాల వెంకటేశ్వరరావు, బీఎంఎస్ రాష్ట్ర మత్స్యకారుల సంఘ ఉపాధ్యక్షుడు, కొవ్వాడలంక -
నీరందక.. పంట దక్కక!
సాక్షి, బొంరాస్‌పేట: వ్యవసాయ బోర్లలో రోజురోజుకు నీరింకిపోవడంతో సాగులో ఉన్న వరిపంట నిలువునా ఎండిపోతోంది. రైతులు లబోదిబోమంటున్నారు. పొట్టదశలో నీరులేక వరిపంట ఎండిపోతుండటంతో తిండిగింజలు, పశుగ్రాసం కరువయ్యే పరిస్థితి వస్తుందని రైతులు వాపోతున్నారు. మండలంలో 14 వేల హెక్టార్ల సాగు భూమి ఉంది. ఇందులో ప్రతిఏటా రబీలో వరిపంట 12 వందల హెక్టార్లలో పంట సాగవుతుంది. గత వర్షాకాలంలో జూన్ నుంచి అక్టోబర్ వరకు సాధారణ వర్షపాతం 525 మిల్లీ మీటర్లకుగానూ 291.8 మి.మీ వర్షపాతం నమోదైంది. 24 గంటల కరెంటుకు ఆశపడిన రైతులుఎక్కువ మొత్తంలో సాగు చేయడంతో ప్రస్తుతం భూగర్భజలం తగ్గిపోయి మధ్యంతరంగా వరిపంట నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. అలాగే మండల పరిధిలోని వడిచర్ల, బురాన్‌పూర్, చౌదర్పల్లి గ్రామాల్లో పెద్దమొత్తంలో బోర్లు నీరులేక ఇంతకింతకు అడుగంటి పంటలు నష్టమవుతున్నాయి. మరో వారంరోజుల్లో మరింత ఎక్కువగా పంటనష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టానికి కారణాలు.. సాధారణ వర్షపాతానికి 50 శాతం మాత్రమే వర్షపాతం నమోదు కావడం. 24 గంటల కరెంటుపై ఆశలు పెంచుకొని రెండంతలు సాగుచేయడం. అవసరానికి మించి సాగునీరు వాడటం. (300 –500 మి.మీ. వరకు ఆరుతడి పంటలకు సరిపోతుంది. కాగా ఇక్కడి రైతులకు వరి తప్ప మిగతా పంటలు పండించని అలవాటు ఉంది. వరిలో కరిగెటకు, పంటలో మొక్కకు 1200 మి.మీ. వరికి అవసరమున్నా 1400 మి.మీ. వరకు సాగునీరు అవసరమవుతుంది.) రైతులకు వ్యవసాయశాఖ వారు అవగాహన కల్పించకపోవడం. ఎక్కువ సాగునీరు వరి బదులు రబీలో ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు చైతన్యం, ప్రచారం చేపట్టకపోవడం. -
నీరులేక పాతాళానికి.. గంగమ్మ!
సాక్షి,మరికల్: ‘‘జానెడు పొట్టను నింపుకొనే కష్టజీవి రెక్కలకు తీరని కష్టాలు వచ్చాయి. గతేడాది ఆశించిన వర్షపాతం నమోదుకాక వాగులు, వంకలు, చెరువుల్లో నీరులేక బోర్లలో భూగర్భజలం అడుగంటిపోతుంది. అప్పటికే సాగుచేసిన వరి, ఇతర పంటలను కాపాడుకునేందుకు రైతులు చేయరాని ప్రయత్నాలు చేస్తూ జలం కోసం పొల్లాలో బోర్లను డ్రిల్లింగ్ చేస్తూ భగీరథయత్నం చేస్తున్నారు.’’ గుక్కెడ నీరు దొరకని దుస్థితి ఇప్పటికే అన్ని మండలాల్లో 90శాతం వ్యవసాయ బోర్లలో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. అడవుల్లో గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. వేసవి మరో రెండు నెలలు ఉండగానే కరువు మేఘాలు కమ్మేయడంతో అన్నదాత బావురమంటున్నాడు. చేతికొచ్చిన వరిపంటను రక్షించుకునేందుకు పక్కపొల్లం రైతుల బోర్ల నుంచి సాగునీరు పెట్టుకునేందుకు ప్రాధేయపడుతున్నారు. దాయదాల్చి నీళ్లు ఇస్తే పంటలు.. లేదంటే పెట్టుబడి సైతం మీదపడే ప్రమాదం కన్పిస్తోంది.కొంతమంది రైతులు చేతికొచ్చిన పంటలను రక్షించుకునేందుకు ఒక్కొక్కరు తమ పొల్లాలో రెండు నుంచి ఐదు వరకు బోర్లను డ్రిలింగ్ చేస్తున్నారు. మరికొందరు నీళ్లు వచ్చే వరకు ఆపార భగీరథయత్నం చేస్తున్నారు. ఎండుతున్న పంటలు ఫిబ్రవరి నెలలోనే వ్యవసాయ బోర్లలో భూగర్భజలాలు అడుగంటి పోవడంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు చేతికొచ్చే దశలోనే నీళ్లులేక పంటలు ఎండుముఖం పట్టాయి. ఎకరాకు రూ.25వేల చొప్పున పెట్టుబడులు పెట్టిన రైతులకు అప్పులు తప్పెటట్లులేదు.మరో పక్షం రోజుల వరకు మూడు తడుల నీళ్లు పెట్టిన పంటలు బతికే అవకాశం ఉంది. పంటల పరిస్థితి పక్కన పెడితే పశువులకు గుక్కెడు నీళ్లులేక దాహంతో అల్లాడుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులు రావడంతో రైతులు కోలుకోలేకపోతున్నారు. కోయిల్‌సాగర్ కింద ఇదే పరిస్థితి కోయిల్‌సాగర్ ప్రాజెక్టును నమ్ముకొని వరి పంటలు సాగుచేసిన రైతులకు ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా మారింది. సరైన సమయానికి ప్రాజెక్టు నుంచి అధికారులు నీళ్లను వదలకపోవడంతో రైతులు కేఎస్పీ ఆయకట్టు నీటి కోసం ఆందోళన బాట పడితే ఎట్టకేలకు కంటితుడుపుగా ఐదు రోజులు నీటిని విడుదల చేసి చేతులు ఎత్తేశారు. మరో ఐదురోజులపాటు నీరు విడుదల చేస్తే పంటలు బతికే అవకాశం ఉందని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
సిమ్లాలో తారాస్ధాయికి చేరిన నీటి సంక్షోభం
-
‘తన్నీర్’ కోసం తన్నుకు చావాల్సిందేనా?
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్ నగరంలో వరుసగా మూడేళ్లపాటు వర్షాలు కురియక పోవడంతో జలాయశాలు ఎండిపోయాయని, భూగర్భ జలాలు ఇంకి పోయాయని, ప్రభుత్వ కుళాయిల నుంచి చుక్క నీరు కూడా చూడని రోజు వస్తుందనే వార్త ఇటీవల ప్రపంచమంతట సంచలనం సృష్టించింది. అలాంటి రోజును ‘డే జీరో’గా కూడా పేర్కొంది. రోజువారి సరాసరి సగటు వినియోగాన్ని 87 లీటర్లకు కుదించింది. ఆ తర్వాత ఇటీవల దాన్ని 50 లీటర్లకు తగ్గించింది. ‘డే జీరో’ రోజు నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రదేశాల నుంచి మాత్రమే నీటిని తీసుకెళ్లాల్సి ఉంటుందని ఆ ప్రభుత్వం అక్కడి ప్రజలను హెచ్చరించింది. ఆ పరిస్థితి భారత్‌కు కూడా త్వరలో వచ్చే ప్రమాదం ఉంది. దేశంలోని పలు నగరాలు మంచినీటి కటకటను ఎదుర్కోనున్నాయని 14, రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 28 నగరాల్లో ఇటీవల జరిపిన ఓ సర్వే వెల్లడించింది. నీటి కటకటలో బెంగుళూరు నగరం ప్రథమ స్థానంలో ఉన్నట్లు ఇటీవల బీబీసీ కూడా వెల్లడించింది. తీవ్ర నీటి ఎద్దటిని ఎదుర్కొంటున్న కేప్ టౌన్లో నీటి వినియోగం పట్ల షరతులు విధించినా ఇప్పటికీ పట్టణ పాలక సంఘం 24 గంటలపాటు ప్రభుత్వ కుళాయిల నుంచి నీటిని సరఫరా చేస్తోంది. భారత్‌లోని ఈ 28 నగరాల్లో ప్రభుత్వం సగటున కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నది 3.3 గంటలు మాత్రమే. రెండంటే రెండు నగరాల్లో మాత్రమే 12గంటలపాటు నీటిని సరఫరా చేస్తున్నారు. 62 శాతం పట్టణాల్లో కేవలం సరాసరి సగటున రెండు గంటలపాటు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. భారత్‌లో నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం సరాసరి సగటున 135 లీటర్లు సరఫరా చేయాలి. అయితే 124.6 లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ సరఫరా కూడా క్రమబద్ధంగా లేదు. కొన్ని ప్రాంతాల్లో సగటున 298 లీటర్లు సరఫరా చేస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో అతి తక్కువగా 37 లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్’ దేశంలోని 1400 నగరాల్లో నిర్వహించిన సర్వే ప్రకారం సరాసరి సగటున 69 లీటర్ల నీటిని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో కేప్ టౌన్ పట్టణంలో సరాసరి నీటి వినియోగాన్ని రోజుకు 50 లీటర్లకు తగ్గించగా, ఇప్పటికే భారత్‌లోని కొన్ని నగరాల్లో ఇంత కన్నా తక్కువ నీటిని సరఫరా చేస్తున్నారు. ‘డే జీరో’ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ కుళాయిల్లో నీరు రావని, ప్రభుత్వం నిర్దేశించిన నీటి కేంద్రాల నుంచే నీటిని సేకరించుకోవాలని కేప్ టౌన్ ప్రభుత్వం అక్కడి ప్రజలను హెచ్చరించింది. కానీ భారతీయ నగరాల్లో కామన్ పాయింట్ల నుంచి నీటిని తెచ్చుకోవడం కామనే. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం 71 శాతం పట్టణ ప్రజలు ఇళ్లవద్దనే నీటిని పట్టుకుంటారు. 21 శాతం మంది ఇంటికి సమీపంలోని కుళాయిల నుంచి పట్టుకుంటున్నారు. ఎనిమిది శాతం మంది సుదూర ప్రాంతానికి వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. పట్టణాల్లో 77 శాతం మహిళలు నడిచి రావడానికయ్యే సమయం సహా నీటి కుళాయి వద్ద నీటి కోసం సగటున 30 నిమిషాలు నిరీక్షిస్తోందని ‘నేషనల్ శాంపిల్ సర్వే అఫీస్’ అధ్యయనం వెల్లడిస్తోంది. ఈ లెక్కన కేప్ టౌన్లో భవిష్యత్‌లో రానున్న ‘డే జీరో’ పరిస్థితి భారత్‌లో ఎప్పుడో వచ్చిందన్న మాట. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37 కోట్ల మంది ప్రజలు ఉండగా, ఆ సంఖ్య 2030 నాటికి 60 కోట్ల మందికి చేరుతుందన్నది ఒక అంచనా. నాటికి నీటి డిమాండ్‌కు సరఫరాకు 50 శాతం వ్యత్యాసం ఉంటుందని ‘అసోసియేటడ్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, ఆడిటర్ పీడబ్యూసీ’ ఓ నివేదికలో హెచ్చరించాయి. అప్పటి వరకు మన ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోతే నీటి సరఫరా కేంద్రాల వద్ద మనం ‘తన్నీర్ తన్నీర్’ అంటూ తన్నుకు చావాల్సి వస్తుంది. -
భారత్, చైనాల్లో నీటి కొరత ఎక్కువే
-
భారత్, చైనాల్లో నీటి కొరత ఎక్కువే
జల దినోత్సవం సందర్భంగా ఐరాస నివేదిక పారిస్/ఐరాస: ప్రపంచంలోని జనాభాలో మూడింట రెండు వంతుల మంది, ఏడాదికి కనీసం ఒక నెల పాటైనా నీటి కొరత ఉండే ప్రాంతాల్లో నివసిస్తున్నారనీ, ఆ జనాభాలో సగం మంది భారత్, చైనాల్లోనే ఉన్నారని ఐక్యరాజ్య సమితి (ఐరాస) నివేదిక ఒకటి పేర్కొంది. వ్యర్థ జలాలను శుద్ధి చేయడం వల్ల నీటి కొరతను అధిగమించడంతోపాటు పర్యావరణాన్ని కూడా రక్షించుకోవచ్చని నివేదిక సూచించింది. బుధవారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఐరాస ఈ నివేదికను విడుదల చేసింది. ‘అధునాతన వ్యర్థ జల నిర్వహణ పద్ధతులు ఇచ్చే అవకాశాలను నిర్లక్ష్యం చేయడం అర్థం లేని చర్య’అని ఐక్యరాజ్య సమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) డైరెక్టర్ జనరల్ ఇరినా బొకోవా అన్నారు. యునెస్కో సహా పలు ఐరాస విభాగాలు కలసి ఈ నివేదికను రూపొందించాయి. కొన్ని దశాబ్దాలుగా ప్రజలు నీటిని అధికంగా ఖర్చు చేస్తున్నారనీ, ప్రజలు జలాలను వాడుతున్నంత వేగంగా ప్రకృతి తిరిగి ఉత్పత్తి చేయలేకపోతోందనీ, దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో ఆకలి, వ్యాధులు, ఘర్షణలు, వలసలు పెరిగిపోతున్నాయని నివేదిక పేర్కొంది. రాబోయే దశాబ్దంలో ఎదుర్కోబోయే అతి పెద్ద ప్రమాదం నీటి కష్టాలేననే అభిప్రాయం గతేడాది ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సర్వేలోనూ వెల్లడైంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల అనేక ప్రాంతాలు ఇప్పటికే కరువు బారిన పడుతున్నాయని నివేదిక తెలిపింది. కలుషిత నీరు తాగడం, చేతులు సరిగ్గా కడుక్కోలేక పోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి ఎనిమిది లక్షల మంది మరణిస్తున్నారని నివేదిక వెల్ల డించింది. నీటి సంబంధిత కారణాలతో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో కలిసి ఏడాదికి 35 లక్షల మంది మరణిస్తున్నారనీ, ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్, కారు ప్రమాదాల్లో కలిపి మరణించే వారి కన్నా ఈ సంఖ్య అధికమని పేర్కొంది. 2040కి ప్రతి నలుగురు బాలల్లో ఒకరికి.. 2040 సంవత్సరం కల్లా ప్రపంచంలోని ప్రతి నలుగురు బాలల్లో ఒకరు తీవ్రమైన నీటి కష్టాలు ఉన్న ప్రాంతాల్లో నివసిస్తుంటారని ఐరాస అంతర్జాతీయ చిన్నారుల అత్యవసర నిధి (యూనిసెఫ్) సంస్థ మరో నివేదికలో చెప్పింది. వాతావరణంలో మార్పులు, కరువు, పెరుగుతున్న జనాభా నీటి కొరతకు ప్రధాన కారణాలంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 36 దేశాలు తీవ్రమైన నీటి కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయని వెల్లడించింది. -
తాగునీటికీ అధికార రంగు
⇒ ప్రొద్దుటూరులో తీవ్ర నీటి ఎద్దడి ⇒ ప్రజల తరఫున ఎమ్మెల్యే పోరుబాట ⇒ సమస్య పరిష్కారానికి అధికారుల చర్యలు ⇒ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునే పన్నాగంలో టీడీపీ నేతలు తాగునీటి సమస్యను పరిష్కరించడంలో కూడా టీడీపీ నేతలు రాజకీయ రంగు పులిమారు... ప్రొద్దుటూరులో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది... ఈ సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రజల తరఫున పోరుబాట పట్టారు... ఇక్కడి పరిస్థితిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు... ఇందుకు స్పందించిన కలెక్టర్ శుక్రవారం ప్రొద్దుటూరు వచ్చి పరిశీస్తానని చెప్పారు... సమస్య పరిష్కారమైతే ఎమ్మెల్యేకు పేరు వస్తుందని టీడీపీ నేతలు భావించారు... ఇందులో భాగంగానే కలెక్టర్ ప్రొద్దుటూరు రాకుండా వారు కుయుక్తులు పన్నారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు... అంతేకాకుండా సమస్య పరిష్కారమైతే పేరు, ప్రతిష్టను అధికార పార్టీ ఖాతాలో వేసే దిశగా అడుగులు వేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి వందేళ్ల చరిత్ర ఉంది. అయితేనేం ఇప్పుడు ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 40 వార్డులు ఉండగా సుమారు 2 లక్షలకు పైగా జనాభా నివాసం ఉంటున్నారు. వేసవి వచ్చిందంటే పట్టణ వాసులకు నీటి తిప్పలు తప్పడం లేదు. ఏటా పరిస్థితి ఇలాగే ఉండగా.. ఈ ఏడాది చలికాలంలోనే నీటి సమస్య తలెత్తింది. ఏటా వేసవిలో కలెక్టర్ అనుమతితో మైలవరం జలాశయం నుంచి నీరు కొద్దో గొప్పో తెచ్చుకొని సమస్య నుంచి తాత్కాలికంగా ఉపశమనం కల్పిస్తున్నారు. శాశ్వతంగా నీరు విడుదల చేసేందుకు జీఓ లేకపోవడంతో కలెక్టర్ దయాదాక్షిణ్యాలపై ఆధార పడాల్సి వస్తోంది. ఈ ఏడాది సమస్య తీవ్రత పెరిగిన నేపథ్యంలో మైలవరం నుంచి నీరు విడుదల చేసినా ఫలితం లేకుండా పోయింది. కారణం అధికారులు కొత్త మార్గం నుంచి నీరు తీసుకురావడమే. ఎక్కువ దూరం పెన్నానదిలో తీసుకురావడంతో మధ్యలోనే అధిక భాగం నీరు ఇంకిపోయాయి. మున్సిపాలిటీలో అవసరమైన నిధులు ఉన్నా సమస్య పరిష్కారంలో పాలక వర్గంతోపాటు అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యపై దృష్టి సారించిన ఎమ్మెల్యే పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రం కావడంతో నేతలపై ఒత్తిడి పెరిగింది. వార్డు కౌన్సిలర్ల నుంచి ఎమ్మెల్యే వరకూ అందరికీ సమస్యను ప్రజలు విన్నవిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ముందుగా అధికారులు, పాలక వర్గం దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈనెల 13న మున్సిపల్ కార్యాలయం వద్ద 24 గంటలపాటు జల దీక్ష చేపట్టారు. ఈ దీక్షను అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతలు అధికార యంత్రాంగం ద్వారా ఒత్తిడి తెచ్చారు. కేసులకు బెదరకుండా ఎమ్మెల్యేతోపాటు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు తమ నిరసన తెలిపారు. చివరికి పోలీసుల ద్వారా కేసులు నమోదు చేయించారు. ఈ కేసులకు తాము భయపడబోమని, సమస్యను పరిష్కరించని పక్షంలో ప్రొద్దుటూరు నుంచి కలెక్టరేట్‌కు పాదయాత్ర చేసి ముట్టడిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. పాదయాత్ర ఈ నెల 27న ప్రారంభిస్తానని ప్రకటించారు. నీటి సమస్యను పాలకపక్షంతోపాటు అధికారుల కళ్లకు కట్టినట్లు చెప్పాలనే ఆలోచనతో.. గత సోమవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. నీటి ఎద్దడి తీవ్రతను వారికి వివరించా,రు. వాస్తవానికి ఎమ్మెల్యే చాలా కాలం తర్వాత కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. తర్వాత జిల్లాలోని వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, నలుగురు ఎమ్మెల్యేలను తీసుకొని ఆయన గురువారం కలెక్టర్ కె.వి.సత్యనారాయణను కలిసి సమస్య తీవ్రతను వివరించారు. సమస్యను పరిశీలించి, పరిష్కరించేందుకు ప్రొద్దుటూరు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన కలెక్టర్ శుక్రవారం ప్రొద్దుటూరు వస్తున్నట్లు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. కలెక్టర్ పర్యటన వాయిదా వెనుక కారణాలేంటో... కలెక్టర్ శుక్రవారం ప్రొద్దుటూరు వస్తారని, ఆయన రాకతోనైనా నీటి సమస్య పరిష్కారమవుతుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రాదరెడ్డితోపాటు పట్టణ ప్రజలు ఎంతగానో ఆశించారు. అయితే 24 గంటలు కాకముందే కలెక్టర్ పర్యటన వాయిదా పడింది. అదే సమయంలో మున్సిపల్ చైర్మన్ గురివిరెడ్డితోపాటు పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి తదితరులు శుక్రవారం కడపలో కలెక్టర్‌ను కలిసి నీటి సమస్యపై విన్నవించారు. అలాగే టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి త్వరలో ప్రొద్దుటూరుకు నీరు వస్తుందని తెలిపారు. అధికార పార్టీ నేతల ప్రభావంతోనే కలెక్టర్ పర్యటన వాయిదా పడిందని వైఎస్సార్సీపీ నేతలు చర్చించుకుంటున్నారు. కలెక్టర్ శుక్రవారం ప్రొద్దుటూరు వస్తే ఎమ్మెల్యే రాచమల్లుకు పేరు వస్తుందని టీడీపీ నేతలు భావించి, ఇలా చేశారని వారు ఆరోపిస్తున్నారు. వీరి వైఖరి వల్ల సమస్య పరిష్కారంలో మరింత జాప్యం జరుగుతోందని విమర్శిస్తున్నారు. ఇంత కాలం నీటి సమస్య గురించి పట్టించుకోకుండా.. తీరా కలెక్టర్ వస్తున్న నేపథ్యంలో ఇలా చేయడం ఏమిటిని ప్రశ్నిస్తున్నారు. -
నీటి ఎద్దడి నివారణకు చర్యలు
హిందూపురంలో వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయండి ఈఎన్సీ పాండురంగారావు అనంతపురం న్యూసిటీ : వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముం దస్తు చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య విభాగం చీఫ్ ఇంజినీర్ (ఈఎన్సీ) పాండురంగరావు మునిసిపల్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని ఓ హోటల్లో అనంతపురం నగరపాలక సంస్థ, హిందూపురం మునిసిపాలిటీ, కర్నూలు నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో ఈఎన్సీ సమావేశమయ్యారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా గార్లదిన్నె ప్రాజెక్ట్, పందిపాడు రిజర్వాయర్, ముచ్చుమర్రి రిజర్వాయర్ నుంచి కెనాల్‌కు నీరు తీసుకొచ్చి, అక్కడి నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు నీరు నింపాలన్నారు. మార్చి, ఏప్రిల్, మే వరకు నీటి సమస్య ఉండదన్నారు. హిందూపురంలో చాలా ప్రాంతాల్లో నీటి సమస్య ఉందని ఈఎస్సీ దృష్టికి మునిసిపల్ అధికారులు తీసుకెళ్లారు. నిధులు ఏమేరకు ఉన్నాయని ఎస్ఈ శ్రీనాథ్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ట్యాంకర్లకు వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను తప్పక అమర్చాలన్నారు. ఎన్ని కిలో మీటర్లు తిరిగినది, నీరు సరఫరా చేసిన విధా నం తప్పక నమోదు చేయాలన్నారు. ఇష్టారాజ్యంగా బిల్లులు పెడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించా రు. అలాగే గొ ల్లపల్లి రిజర్వాయర్ పైప్‌లైన్ పనులు ఎం త వరకు వచ్చాయని, వాటి డీపీఆర్‌ను పరిశీలించారు. నీటి సమస్య లేదు : అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో నీటి సమస్య లేదని, పీఏబీఆర్ డ్యాంలో 2.5 టీఎంసీ నీరు నిల్వ ఉందని ఎస్ఈ సురేంద్రబాబు ఈఎన్‌సీకు వివరించారు. వేసవికాలంలో 0.6 నుంచి 0.7 టీఎంసీ ఉండే సరిపోతుందన్నారు. సమా వేశంలో కర్నూలు ఎస్ఈ శివరామిరెడ్డి, ఈఈ రాజశేఖర్, డీఈ రమణమూర్తి, హిం దూపురం కమిషనర్ విశ్వనాథ్, ఈఈ రమేష్, ఏపీఎండీసీ ఈఈ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. డిసెంబర్‌లోపు పనులు పూర్తికావాలి ప్రణాళికతో పైపులైన్ పనులు వేగవంతంగా చేసి, డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఐహెచ్పీ కంపెనీ నిర్వాహకులు, ఏపీఎండీపీ అధికారులను ప్రజారోగ్య విభాగం ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ ( ఈఎన్సీ) పాండురంగారావు ఆదేశించారు. పైపుల నిల్వ ఎంత ఉంది..ఎన్ని కిలో మీటర్ల పైపులైన్ వేశారని ఆరాతీశారు. అలాగే ఇనుము నాణ్యతను పరిశీలించారు. అందుకు ఏపీఎండీపీ ఈఈ రామ్మోహన్ రెడ్డి 130 కిలో మీటర్లకు సరిపడా పైపులు, ఇతర సామగ్రి అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఈఈ సురేంద్రబాబు, ఏఈ సుభాష్, ఐహెచ్పీ కంపెనీ ప్రతినిధులు క్రాంతి కుమార్, శర్మ తదితరులున్నారు. -
తాగునీటి సమస్యను పరిష్కరించాలి
► డీపీవోకు చింతల్‌పేట్ గ్రామస్తుల వినతి నిర్మల్‌రూరల్ : ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ ఖానాపూర్ మండలం బా దన్ కుర్తి పంచాయతీ పరిధిలోని చింతలపేట్ గ్రామస్తులు విన్నవించారు. ఈమేరకు వారు బుధవారం డీపీవో నారాయణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో మూడేళ్లుగా తీవ్ర నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. వాటర్ ట్యాంక్‌లకు నీటి సరఫరా నిలిపివేయడంతో ప్రజలు కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీవోకు వినతిపత్రం అందజేసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. వెంటనే తమ తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు డీపీవోను కోరారు. ఇందులో టీడీపీ మండలాధ్యక్షుడు గుడాల రాజన్న, వార్డ్‌మెంబర్ బండి వెంకటి గ్రామ స్వచ్ఛంద సంస్థ సభ్యులు బైర మధు, ఎర్ర గంగన్న, మాదస్తు నవీన్ పాల్గొన్నారు. -
యంత్రాంగం కదిలింది
సాగు నీరందక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎట్టకేలకు ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. జిల్లాలో వరి సాగు దుస్థితిపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురిస్తున్న విషయం విదితమే. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అట్టహాసంగా ప్రారంభించిన ఏరువాక కార్యక్రమం సైతం అభాసు పాలైన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : నరసాపురం మండలం చిట్టవరంలో స్వయంగా చంద్రబాబు నాట్లు వేసిన పొలంలోనూ నాట్లు ఎండిపోయి తుంగ గడ్డి మొలి చింది. ఈ దుస్థితిపై ‘నారుపోసి.. నీళ్లు మరిచి’ శీర్షికన 23వ తేదీ సంచిక మెయిన్ 11వ పేజీలో పరిశీలనాత్మక కథనం ప్రచురితమైంది. దీంతో జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఇరిగేషన్ అధికారులు మంగళవారం డెల్టా మండలాల్లోని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లారు. నీరందకపోవడానికి కారణాలేమిటనే విషయాన్ని పరిశీలించారు. శివారు ప్రాంతాలకు నీరు రాకుండా వేసిన అనధికార తూములను తొలగించాలని నిర్ణయించారు. అవసరమైతే మోటార్లు ఏర్పాటు చేసి నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆచంట, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో కలెక్టర్, నీటి పారుదల శాఖ అధికారులు పర్యటించారు. కాలువలు, ్రyð యిన్లలో ఏర్పాటు చేసిన అనధికారిక తూములను రాజకీయ వత్తిళ్లకు తలొగ్గకుండా తక్షణమే తొలగించాలని ఆదేశించారు. వాతావరణ మార్పుల కారణంగా నీరంతా అవిరైపోతోందని, కాలువలో నీరున్నా శివారు ప్రాంతాలకు అందడం లేదని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. జిల్లాకు 6వేల క్యూసెక్కుల నీరు అవసరం కాగా, 7,300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నా సరిపోవడం లేదన్నారు. జూన్, జూలై నెలల్లో పూర్తి కావాల్సిన నాట్లు ఇప్పటివరకూ కాలేదని, ప్రస్తుతం సుమారు 6 వేల ఎకరాలకు నీరు అందడం లేదని గుర్తించామన్నారు. రెండు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అవసరమైతే అడ్డుకట్టలు వేసి సాగునీరు అందిస్తామన్నారు. బ్యాంక్ కెనాల్, రాపాక చానల్, చించినాడ చానెల్ పరిధిలో లో 16, 17 గ్రామాలకు తీవ్ర నీటిఎద్దడి ఉందన్నారు. ప్రధానంగా వర్షాలు కురవకపోవడం వల్ల శివారు భూములకు కాలువల ద్వారా సాగునీరు సక్రమంగా అందక ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు, నీటిసంఘాల అధ్యక్షులు సమన్వయంతో పనిచేసి అవసరమైన చోట మోటార్లు ఏర్పాటు చేసుకుని నీటిని తోడుకోవాలన్నారు. అవసరమైన చోట్ల ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసి శివారు భూములు ఎండిపోకుండా సాగునీరు అందిస్తామన్నారు. జిన్నూరు కాలువ పొడవునా అనధికార తూములు ఏర్పాటు చేసుకోవడంతో శివారు ప్రాంతాలకు నీరందడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా, వెంటనే తొలగించాలని ఇరిగేషన్ ఈఈని ఆదేశించారు. వడలి సుబ్బారాయుడుపుంత వద్ద రైతులు కలెక్టర్ రాక కోసం ఎదురుచూశారు. ఆయన పెనుగొండ మండలంలో ఎక్కడా ఆగకుండా నేరుగా ఆచంట మండలానికి వెళ్లిపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. -
యంత్రాంగం కదిలింది
సాగు నీరందక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎట్టకేలకు ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. జిల్లాలో వరి సాగు దుస్థితిపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురిస్తున్న విషయం విదితమే. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అట్టహాసంగా ప్రారంభించిన ఏరువాక కార్యక్రమం సైతం అభాసు పాలైన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : నరసాపురం మండలం చిట్టవరంలో స్వయంగా చంద్రబాబు నాట్లు వేసిన పొలంలోనూ నాట్లు ఎండిపోయి తుంగ గడ్డి మొలి చింది. ఈ దుస్థితిపై ‘నారుపోసి.. నీళ్లు మరిచి’ శీర్షికన 23వ తేదీ సంచిక మెయిన్ 11వ పేజీలో పరిశీలనాత్మక కథనం ప్రచురితమైంది. దీంతో జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఇరిగేషన్ అధికారులు మంగళవారం డెల్టా మండలాల్లోని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లారు. నీరందకపోవడానికి కారణాలేమిటనే విషయాన్ని పరిశీలించారు. శివారు ప్రాంతాలకు నీరు రాకుండా వేసిన అనధికార తూములను తొలగించాలని నిర్ణయించారు. అవసరమైతే మోటార్లు ఏర్పాటు చేసి నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆచంట, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో కలెక్టర్, నీటి పారుదల శాఖ అధికారులు పర్యటించారు. కాలువలు, ్రyð యిన్లలో ఏర్పాటు చేసిన అనధికారిక తూములను రాజకీయ వత్తిళ్లకు తలొగ్గకుండా తక్షణమే తొలగించాలని ఆదేశించారు. వాతావరణ మార్పుల కారణంగా నీరంతా అవిరైపోతోందని, కాలువలో నీరున్నా శివారు ప్రాంతాలకు అందడం లేదని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. జిల్లాకు 6వేల క్యూసెక్కుల నీరు అవసరం కాగా, 7,300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నా సరిపోవడం లేదన్నారు. జూన్, జూలై నెలల్లో పూర్తి కావాల్సిన నాట్లు ఇప్పటివరకూ కాలేదని, ప్రస్తుతం సుమారు 6 వేల ఎకరాలకు నీరు అందడం లేదని గుర్తించామన్నారు. రెండు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అవసరమైతే అడ్డుకట్టలు వేసి సాగునీరు అందిస్తామన్నారు. బ్యాంక్ కెనాల్, రాపాక చానల్, చించినాడ చానెల్ పరిధిలో లో 16, 17 గ్రామాలకు తీవ్ర నీటిఎద్దడి ఉందన్నారు. ప్రధానంగా వర్షాలు కురవకపోవడం వల్ల శివారు భూములకు కాలువల ద్వారా సాగునీరు సక్రమంగా అందక ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు, నీటిసంఘాల అధ్యక్షులు సమన్వయంతో పనిచేసి అవసరమైన చోట మోటార్లు ఏర్పాటు చేసుకుని నీటిని తోడుకోవాలన్నారు. అవసరమైన చోట్ల ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసి శివారు భూములు ఎండిపోకుండా సాగునీరు అందిస్తామన్నారు. జిన్నూరు కాలువ పొడవునా అనధికార తూములు ఏర్పాటు చేసుకోవడంతో శివారు ప్రాంతాలకు నీరందడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా, వెంటనే తొలగించాలని ఇరిగేషన్ ఈఈని ఆదేశించారు. వడలి సుబ్బారాయుడుపుంత వద్ద రైతులు కలెక్టర్ రాక కోసం ఎదురుచూశారు. ఆయన పెనుగొండ మండలంలో ఎక్కడా ఆగకుండా నేరుగా ఆచంట మండలానికి వెళ్లిపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. -
ఉస్మానియాలో పేషంట్ల 'నీటి' ఇబ్బందులు
హైదరాబాద్: పేదల కల్పతరువుగా పేరున్న ఉస్మానియా ప్రభుత్వాసుపత్రిలో నీరు కరువైంది. గత మూడు రోజులుగా నీటి కొరత తీవ్రంగా ఉండటంతో ఆసుపత్రిలో కొన్ని ఆపరేషన్లు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎమర్జన్సీ ఆపరేషన్లకు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించేందుకు శనివారం ఏర్పాట్లు చేసిటన్లు ఆసుపత్రి ఉన్నతాధికారులు వెల్లడించారు. మరో వైపు కనీస అవసరాలకు కూడా నీరు దొరక్క రోగులు, వారి బంధువులు ఆసుపత్రిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్యకు వాటర్ వర్క్స్ పైప్లైన్లకు చేపట్టాల్సిన మరమ్మతుల ఆలస్యమే కారణమని తెలుస్తోంది. నీటి కొరత కారణంగా ఆస్పత్రిలో అపరిశుభ్ర వాతావరణం మరింత తీవ్రమైంది. -
కేజీబీవీలో నీటి ఎద్దడి
అవస్థలు పడుతున్న విద్యార్థినులు రామాయంపేట : రామాయంపేట పట్టణ శివారులోని కోమటిపల్లి గ్రామ సమీపంలోఉన్న కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయంలో తీవ్రస్థాయిలో నెలకొన్న నీటి ఎద్దడితో పాఠశాల విద్యార్థినులు ఇబ్బందులపాలవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రామాయంపేట కేజీబీవీలో రెండు వందల మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. గత ఏడాది కాలంగా నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులతో నీటి ఎద్దడి తీవ్రతరమైంది. స్కూలు సమీపంలోని చెరువులో బోరు వేసి మొదట్లో అక్కడినుంచి పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేశారు. అయితే ఆ బోరు కూడా ఎండిపోవడంతో నీటి ఎద్దడి తీవ్రమైంది. ప్రస్తుతం ఆ బోరునుంచి కొద్దిగా వస్తున్న నీటితో విద్యార్థినులు స్నానాలకు, మరుగుదొడ్లకు వినియోగించుకుంటున్నారు. ఇతర అవసరాల నిమిత్తం రోజూ ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా జరుగుతున్నా అవి ఎంతమాత్రం సరిపోవడంలేదు. ఇటీవల రెండుమూడు రోజలకోమారు ట్యాంకర్ వస్తుండటంతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. దీంతో వారు నీటిని పొదుపుగా వినియోగించుకుంటున్నారు. ట్యాంకర్లో వస్తున్న నీటిని పాఠశాలముందు ఉన్న పెద్ద కుండీలో నిల్వ చేసుకుంటున్నారు. ఏడాది కాలంగా నీటి ఎద్దడితో అలమటిస్తున్నమని, ఈవిషయమై ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని విద్యార్థినులు వాపోయారు. దుస్తులు ఉతుక్కోవడానికిసైతం ఇబ్బందిగా ఉందని వారు వాపోయారు. ఆగస్టు ఒకటినుంచి ట్యాంకర్లు బంద్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో విద్యార్థినులు మరింతగా ఆందోళనకు గురవుతున్నారు. ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తుంటేనే ఇంత ఇబ్బందిగా ఉందని, ట్యాంకర్ రాకుండా తమ పరిస్థితి ఏమిటని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నీటి సమస్యను పరిష్కరించాలి అధికారులు, ప్రజా ప్రతినిధులు విద్యార్థినుల అవస్థలు దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రతిపాదికన స్కూలులో నీటివసతి కల్పించాలి. ఏడాది కాలంగా నీటి ఎద్దడితో ఇబ్బందులకు గురవుతున్నాం. బోరులో నీరు అడుగంటడంతో ఈసమస్య నెలకొంది. ట్యాంకర్‌ను యధావిధిగా కొనసాగించాలి.-నీటి సమస్యను పరిష్కరించాలి -
కస్తూరిబా గిరిజన బాలికల పాఠశాలలో తాగునీటి ఎద్దడి
నల్లమాడ: స్థానిక కస్తూర్భా గిరిజన బాలికల పాఠశాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రమయింది. పాఠశాల్లో 6వ తరగతి నుంచి 10 వరకు 200 మంది విద్యార్థినులు ఉన్నారు. సంవత్సరం నుంచి తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు విద్యార్థినిలు, వంట మనుషులు వాపోయారు. పాలకులకు, అధికారులను పలుమార్లు తెలియజేసినా ప్రయోజనం లేదన్నారు. పిల్లల స్నానం, దుస్తులు శుభ్రం చేసుకోవడానికి, బాత్రూంకు వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందన్నారు. ర క్షిత నీటి పథకంలో భూగర్భజలాలు అడుగంటి పోవడంతో చుక్క నీరు రావడం లేదన్నారు. బయట నుంచి బిందెలతో నీరు తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నట్లు చెప్పారు. పాలకులు, అధికారులు స్పందించి తాగు నీటి సమస్యను పరిష్కరించాలన్నారు. పాఠశాల ఎస్ఓ వెంకటరమణమ్మను తాగునీటి సమస్యపై వివరణ కోరగా పాఠశాల ఆవరణలోని బోరులో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో చుక్క నీరు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. -
దూపకేడ్చి.. ఊపిరొదిలిన లేగదూడ
ఖమ్మం: విపరీతమైన ఎండలు.. తాగునీటి ఎద్దడి.. అంతటా అలుముకున్న కరువుతో మనుషులే కాదు.. మూగజీవాలు తల్లడిల్లుతున్నాయనడానికి ఈ దృశ్యం సాక్ష్యం. ఖమ్మం జిల్లా మణుగూరు మండలం సమితిసింగారం గ్రామ పంచాయతీ పీవీ కాలనీ రోడ్డు రైల్వేగేట్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ లేగదూడ ఎండతీవ్రత, దాహంతో ప్రాణాలొదిలింది. సింగరేణి బొగ్గు గనుల కారణంగా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో మేతకొచ్చిన దూడ దప్పికకు తాళలేక సమీపంలోని ఇళ్ల వద్దకు వెళ్లినా నీటి జాడ కనిపించలేదు. డ్రెయినేజీలో నీళ్లు తాగేందుకు ప్రయత్నించింది. కానీ మురుగునీటిని మింగలేక చివరికి ఊపిరొదిలింది. కొద్దిసేపటికే అక్కడికొచ్చిన తల్లిఆవు.. దూడ శరీరాన్ని నాలుకతో నాకుతూ తలతో ఆటూఇటూ నెట్టుతూ లేపేందుకు ప్రయత్నిస్తూ ‘తల్లి’డిల్లింది. స్థానికులు గ్రహించి బకెట్లో నీళ్లు పెట్టగా ఆవు ఆతృతగా తాగడం, అప్పటికే దూడ ఊపిరి వదలడం స్థానికులను కలచివేసింది. - మణుగూరు రూరల్ -
కరువు కౌగిట కరీంనగర్
మానేరులో నీరు లేదు.. చేలల్లో చెమ్మ లేదు... ఎక్కడివక్కడ ఎండిపోయిన చెరువులు, పంటలు గుక్కెడు నీటికి అల్లాడుతున్న పల్లెలు, పట్టణాలు గడ్డి లేక పశువులను అమ్ముకుంటున్న రైతన్నలు ఈ చిత్రం చూశారా...? యాభై ఏళ్ల క్రితం మానేరు డ్యాం నిర్మాణానికి ముందు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారి ఇది. ఇప్పుడు డ్యాంలో నీరు పూర్తిగా ఎండిపోవడంతో ఇలా బయటపడింది.. తెలంగాణలోనే కాదు... తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ధాన్యాన్ని పండించే జిల్లా కరీంనగర్! ఉభయ గోదావరి జిల్లాలను తలదన్నేలా తీరొక్క పంటలతో అలరారుతూ అన్నపూర్ణగా విరాజిల్లిన జిల్లా. కానీ నేడు సాగు సంగతి దేవుడెరుగు... గుక్కెడు నీటి కోసం అలమటిస్తోంది. ఎటు చూసినా ఎండిన పంటలు... ఎడారిని తలపిస్తున్న మానేరు... తాగునీటి కోసం జనం కష్టాలే దర్శనమిస్తున్నాయి. నలుగురికి అన్నం పెడుతూ రాజుగా బతికిన రైతన్నకు నేడు బతుకుదెరువే భారమైంది. జిల్లాలో రోజూ ఏదో ఒక మూల అన్నదాత మరణ మృదంగం విన్పిస్తోంది. ఆవులు, గేదెలకు గ్రాసం లేక అంగట్లో అమ్ముకుంటున్నారు. కరువు దెబ్బకు కన్నీరు పెడుతున్న పల్లెల్లో ఉండలేక లక్షలాది మంది యువత ఉపాధి కోసం వలస బాట పడుతున్నారు. కరీంనగర్లో కరువుపై సాక్షి ప్రత్యేక కథనం. -పసునూరు మధు, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ రైతు సంతతి అంతరించిపోతున్నది వ్యవసాయ సంస్కృతిలోంచి మొలకెత్తే మనిషి తొలిగిపోతున్నడు వ్యాపారం పులి నాగలిపై స్వారీ చేస్తున్నది రెండెడ్లను స్వాహాచేసి త్రేనుస్తున్నది నాగలి కర్రను ముక్కలు చేసి మంటేసి చలి కాచుకుంటున్నది దళారి ఒకడు రంగప్రవేశం చేశాడు రైతు మరణ హనన ఆజ్యం పోసి రాజ్యానికి కానుక ప్రకటిస్తున్నడు ఇప్పుడు పది జిల్లాల్లో ఒకటే పాట ఒక్కటే రాగం.. ఒక్కటే పల్లవి అంతట ఒక్కటే దరువు చావు డప్పుల మధ్య మరణ నృత్యం సామూహిక గానమై పరవశిస్తున్నది - ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు అంతటా దాహం దాహం గత ఐదు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ జిల్లాలో తాగునీటికి కటకట ఏర్పడింది. పల్లె, పట్నం తేడా లేకుండా నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఏ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీకి వెళ్లినా నీళ్ల కష్టాలే కనిపించాయి. మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో చుట్టుపక్కల చెరువులన్నీ ఎండిపోవడంతో నాలుగు నెలలుగా నల్లా నీళ్లు బంద్ చేశారు. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నా.. ప్రజల అవసరాలు 30 శాతానికి మించి తీరడం లేదు. దీంతో జనం మూడ్రోజులకో ట్యాంకర్ చొప్పున నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల పట్టణంలో రోజువిడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నా... పలు కాలనీలు, వాడల్లో తాగునీటి కటకట ఏర్పడింది. స్థానిక ఇందిరమ్మ కాలనీని ‘సాక్షి’ బృందం సందర్శించగా ఒక్కో ఇంటి వద్ద 4, 5 డ్రమ్ములు దర్శనమిచ్చాయి. ఈ కాలనీలో మొత్తం 1,100 కుటుంబాలు నివాసముంటుండగా... 5,200 డ్రమ్ములు ఉండటం విశేషం! వారానికోసారి ట్యాంకర్ల ద్వారా నీళ్లు వచ్చినప్పుడు డ్రమ్ముల్లో నింపుకుంటూ వాడుకుంటున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. శ్రీరాజరాజేశ్వరస్వామి నిలయమైన వేములవాడ పట్టణంలోనూ గత నాలుగు నెలలుగా నల్లా నీటి సరఫరా ఆగిపోయింది. పట్టణంలో తాగునీటికి తీవ్ర ఎద్దడి నెలకొంది. ప్రైవేటు ట్యాంకర్లే దిక్కయ్యాయి. కోరుట్ల మున్సిపాలిటీలో గత 6 నెలల కాలంలో నల్లాల ద్వారా నీరు సరఫరా అయ్యింది కేవలం 45 రోజులే. గత నెల రోజులుగా నల్లాలు పూర్తిగా బంద్ అయ్యాయి. మిగిలిన పట్టణాల్లోనూ వారానికి, రెండు మూడు రోజులకోసారి నీరు సరఫరా అవుతోంది. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలోని అపార్ట్మెంట్లలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ప్రతిరోజూ రూ.3 వేలు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటూ అపార్ట్మెంట్ వాసులలు నీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. చతికిలపడిన సాగు కరీంనగర్ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5.3 లక్షల హెక్టార్లు(13 లక్షల ఎకరాలు). సరిగ్గా మూడేళ్ల కిందట (2013-14) ఖరీఫ్ సీజన్లో సాధారణ సాగుకు మించి 14.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేసి రికార్డు సృష్టించింది. కానీ ఈసారి కరువు దెబ్బకు సీన్ రివర్స్ అయ్యింది. జిల్లాలో ఈ ఏడాది సాగు పూర్తిగా చతికిలపడింది. రబీ సీజన్లో కేవలం 2,79,670 ఎకరాల్లోనే సాగు చేయగా... నీటి వసతి లేక అందులో 60 శాతానికిపైగా పంటలు ఎండిపోయాయి. ఉన్న కొద్ది పంటను సాగు చేసుకునేందుకు రైతులు పడుతున్న కష్టాలు అన్నీ కావు. నీళ్లు లేక ఎండిన బోర్ల స్థానంలో రూ.లక్షల అప్పు తెచ్చి కొత్త బోర్లు వేసుకుంటున్నారు. జిల్లాలో కొత్తగా వేసిన బోర్లలో 100కు 70 శాతం ఫెయిలవుతున్నాయి. వెయ్యి అడుగుల మేరకు బోరు వేసినా చుక్క నీరు రాని ప్రాంతాలెన్నో ఉన్నాయి. మానేరు తీర ప్రాంతాల్లోని రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ఏకంగా మానేరు నదిలో బోర్లు వేసి అక్కడి నుంచి కిలోమీటర్ల కొద్దీ పైపుల ద్వారా నీటిని పంటలకు తీసుకెళ్తున్నారు. గోదారిలో బోర్లు వేసి పైపుల ద్వారా నీటిని మళ్లిస్తూ జిల్లాలో సుమారు 30 వేల ఎకరాలను కాపాడుకుంటున్నారు. ఈ సీజన్లో అన్నదాతకు కలిసొచ్చే ఏకైక పంట మామిడి. నీళ్లు లేక ఆ తోటలు కూడా ఎండిపోతున్నాయి. హుస్నాబాద్, హుజూరాబాద్, జగిత్యాల ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో ఎండిన మామిడి తోటలు దర్శనమిస్తున్నాయి. అక్కడక్కడా కాతకు వచ్చిన తోటలు సైతం తరచూ గాలివానతో కాయలు రాలిపోతున్నాయి. కేసీఆర్ ఇంటెక్‌వెల్‌కు కష్టకాలమొచ్చే! ఈ చిత్రం చూశారా... సరిగ్గా పదిహేనేళ్ల క్రితం నాటి సిద్దిపేట ఎమ్మెల్యే, ప్రస్తుత సీఎం కేసీఆర్ సిద్దిపేటకు తాగునీటి కోసం కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం హన్మాజీపల్లె వద్ద మానేరు నది మధ్యలో ఇంటెక్వెల్ను ఏర్పాటు చేశారు. మానేరు డెడ్‌స్టోరేజీకి వచ్చినా సిద్దిపేటకు తాగునీటికి ఇబ్బంది లేకుండా నీరు వచ్చేలా ఇంజనీర్లు నది మధ్యలో దీన్ని నిర్మించారు. మానేరు డ్యాం నుంచి ఇంటెక్వెల్ వరకు కాలువలు కూడా తవ్వించారు. ఒకవేళ డెడ్‌స్టోరేజీకి చేరితే డ్యాంలోని కొద్దిపాటి నీళ్లను సైతం పంపింగ్ ద్వారా కాలువలోకి మళ్లించి అక్కడ్నుంచి ఇంటెక్వెల్ ద్వారా సిద్దిపేటకు తాగునీరు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. గత పదేళ్లలో ఏనాడూ మానేరు డెడ్‌స్టోరేజీకి రాలేదు. ఈ ఏడాది కరువు దెబ్బకు గోదారి ఎండిపోవడంతో లోయర్ మానేరు డ్యాం డేడ్స్టోరేజీకి చేరింది. ఇంటెక్‌వెల్‌లోని పైపులన్నీ పైకి తేలాయి. దీంతోపాటు నాడు ఇంటెక్వెల్ నుంచి ఎల్ఎండీ వరకు తవ్వించిన కాలువ బయటకు కన్పిస్తోంది. కరువు పరిస్థితి ఇట్లాగే కొనసాగితే మరోనెల రోజుల మించి సిద్దిపేటకు నీళ్లు సరఫరా అయ్యే పరిస్థితి లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మేత లేక పశువులు కబేళాకు.. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో వారానికోసారి జరిగే అంగడికి రైతులు తీసుకొచ్చిన పశువులు ఇవి. రెండు నెలలుగా ఈ అంగడిలో ప్రతీ వారం సగటున వెయ్యి పశువులు కబేళాకు తరలిస్తున్నట్లు అంచనా. గత నెల రోజులుగా ప్రతీ వారం వందకుపైగా లారీల్లో ఆవులు, గేదెలు కబేళాకు తర లించారు. గత శుక్రవారం ఈ అంగడిని ‘సాక్షి’ సందర్శించగా... ఒక్క గంటలోనే 30కి పైగా లారీల్లో పశువులను తరలించారు. నీళ్లు, మేత లేక బక్కచిక్కిన పశువులతోపాటు లీటర్ల కొద్దీ పాలిచ్చే వందలాది గేదెలు, ఆవులు సైతం అంగడిలో కన్పించాయి. నీళ్లు, మేత లేకపోవడంతో వాటి పోషణ భారమైందని, అందుకే అమ్ముకుంటున్నామని పశువుల యజమానులు చెప్పారు. జిల్లాలో 15 కేంద్రాల్లో పశువుల వార సంతలు జరుగుతున్నాయి. ప్రతీ వారం సగటున ఒక్కో సంతలో 200 చొప్పున అన్ని కేంద్రాల్లో 3 వేల పశువులు కబేళాకు వెళుతున్నాయి. ఈ లెక్కన జిల్లాలోని అన్ని సంతల్లో కలిపి నెలకు సుమారు లక్ష పశువులు కబేళాకు తరలిస్తున్నట్లు అంచనా. ఇటు కరువు కాటు.. అటు గల్ఫ్ గాయం కరువు దెబ్బతో పొట్టచేతబట్టుకొని గల్ఫ్ దేశాలకు వెళ్తున్న యువత అక్కడ కూడా మోసానికి గురవుతున్నారు. సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో సగటున 20 కుటుంబాలకు ఒక్కరు చొప్పున గల్ఫ్ దేశాలకు వెళ్లినవారే ఉన్నారు. ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి గ్రామాన్ని సందర్శించగా 50 మంది యువకులు దుబాయ్ వెళ్లినట్టు తెలిసింది. వీరిలో 15 మంది మోసపోయి మళ్లీ సొంత గ్రామానికి తిరిగొచ్చారు. మల్లారపు రవి అనే యువకుడిని సాక్షి కదిలిస్తే ‘సార్ ఇంట్ల ఎల్లకపోవడంతో రూ.2 లక్షలు అప్పు చేసిన. దుబాయ్ పోతే అప్పు తీర్చడంతోపాటు డబ్బులు సంపాదించుకోవచ్చని ఓ ఏజెంట్ చెబితే మరో లక్ష అప్పు చేసి గత జూన్‌లో దుబాయ్ పోయిన. అక్కడి నెలకు 1200 దిర్హమ్స్ ఇస్తామని ఆశపెట్టారు. తీరా ఆడికి పోతే నెలకు రూ.600 చొప్పున ఇచ్చిండ్రు. రోజూ 12 గంటలు పనిచేయించుకున్నరు. పని ఒత్తిడికి ఆరోగ్యం దెబ్బతిన్నది. డబ్బులు తిండికి, నా ఆరోగ్యానికే సరిపోయినయ్. ఇక్కడికి వచ్చి ఉపాధి కూలీకి పోతున్న’ అని వాపోయాడు. నీళ్లులేక మామిడి చెట్ల నరికివేత మామిడి, బత్తాయి రైతును కరువు నిండా ముంచుతోంది. కోహెడ మండలంలోని తీగలకుంటపల్లికి చెందిన రైతు భట్టు చంద్రారెడ్డి తనకున్న 9 ఎకరాల పొలంలో మామిడి సాగు చేశాడు. పంటకు నీరందక దాదాపు సగం చెట్లు ఎండిపోయాయి. లాభం లేదనుకుని మామిడి చెట్లన్నీ నరికివేశాడు. అదే ఊళ్లో గన్నెబోయిన వెంకటేశ్వరావు వేసిన బత్తాయి తోటదీ ఆదే పరిస్థితి. నీళ్లలేక బత్తాయి ఎదగడం లేదని, ఇప్పటికే పంటపై రూ.3 లక్షల అప్పు చే శానని ఆయన గోడు వెళ్లబోసుకున్నాడు. చెరువులన్నీ ఎండిపాయె.. జిల్లాలో మానేరు నది ఎడారిని తలపిస్తోంది. కాలువలన్నీ ఒట్టిపోయాయి. దాదాపు జిల్లాలోని చెరువులన్నీ ఎండిపోయాయి. దీంతో తెనుగ, ముదిరాజ్, మత్స్యకారులకు పని లేకుండా పోయింది. వారంతా పొట్టకూటి కోసం అడ్డా కూలీలుగా మారుతున్నారు. సిరిసిల్ల మండలంలోని సారంపల్లి పెద్ద చెరువును సందర్శించగా.. చేపల అమ్మకమే జీవనాధారంగా బతుకుతున్న ముదిరాజ్ కులస్తులు ఆ ఎండిన చెరువు గట్టుపై కూర్చొని బతుకు దెరువు కోసం ఏం చేయాలా? అని చర్చించుకుంటున్నారు. సంఘం పెద్ద దాసరి రాజయ్యను కదిలించగా...‘కరువుతో పొలం సాగుచేయలేదు. చేపలు పడదామంటే చెరువులో నీళ్లే లేకపాయే. ఎట్లా బతకాలో అర్థం కాక ఈడ కూసున్నం. మావోళ్లంతా రోజూ కూలీ కోసం సిరిసిల్ల అడ్డా కాడికి పోయొస్తున్నరు. ఒకరోజు పని దొరికితే...మూడు రోజులు పస్తులుండాల్సి వస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కరువైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఉపాధి కష్టమాయే! చీర్లవంచ గ్రామంలో నెత్తిన బేసిన్ తట్ట పెట్టుకుని కూలీ కోసం వెళ్తున్న మహిళలు వీరంతా. ఉపాధి హామీ పనులకు వెళుతున్నారా? అని వారిని అడగ్గా.. ‘ఈ ఎండలకు చెరువులన్నీ ఎండిపోయినయ్. భూమి గట్టి పడింది. మా ఏరియాలో కందకాలు తవ్వాలంటే గడ్డపార భూమిలోకి దిగుతలేదు. మగోళ్లకు రోజుకు రూ.వంద ఇస్తున్నారు. మాకు ఆ పని చేతగాక మామిడి కాయలు తెంపేందుకు వెళుతున్నాం’ అని పేర్కొన్నారు. రోజంతా కష్టపడితే రూ.150 కూలి ఇస్తారన్నారు. ప్రైవేటు బావులు, బోర్లను అద్దెకు తీసుకుని నీరందిస్తున్నాం జిల్లాలో తాగునీటి ఎద్దడి నెలకొన్న గ్రామాల్లో ప్రైవేటు బోర్లు, బావులను అద్దెకు తీసుకుని తాగునీరు సరఫరా చేస్తున్నాం. జియాలజిస్టుల సిఫారసు మేరకు కొత్త బోర్లు, బావుల తవ్వకానికి సిఫారసు చేస్తున్నాం. తాగునీటి కోసం నిధుల సమస్య లేనే లేదు. ఎన్ని నిధులైనా కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడ నీటి సమస్య ఉందో అక్కడ యుద్ధ ప్రాతిపదికన నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - కలెక్టర్ నీతూప్రసాద్ -
వాయిదా
కోరం లేకపోవడంతోనే.. జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ ప్రకటన ► జెడ్పీ సమావేశానికి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యుల గైర్హాజరు ► జెడ్పీ చైర్మన్ ప్రకటనపై మండిపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ ► ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి మధ్య మాటల యుద్ధం సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లాలో నెలకొన్న తీవ్ర దుర్భిక్షం, తాగునీటి ఎద్దడి, కరువు సాయంపై చర్చించేందుకు ఏర్పాటుచేసిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం కోరం లేకపోవడంతో వాయిదా పడింది. మూడు నెలలకోసారి జరగాల్సిన ఈ సమావేశం వాయిదా పడడంతో పలు కీలక అంశాలు, ప్రజా సమస్యలు చర్చకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం మధ్యాహ్నం 1 గంట వరకు అనేక నాటకీయ పరిణామాల నేపథ్యంలో ప్రారంభమే కాలేదు. సమావేశానికి మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి తదితరులు సకాలంలోనే హాజరయ్యారు. అయితే సమావేశం నిర్వహించడానికి అవసరమైన జెడ్పీటీసీ సభ్యుల కోరం పూర్తికాకపోవడంతో మధ్యాహ్నం 1 గంట వరకు వేచి చూశారు. జిల్లా పరిషత్ చైర్మన్‌తో కలిపి కేవలం 20 మంది మాత్రమే హాజరుపట్టికలో సంతకాలు చేశారు. జెడ్పీటీసీ సభ్యులకు నిధులు-విధులు కేటాయించకుండా ప్రభుత్వం తమ పదవులను అలంకారప్రాయం చేస్తుందని, మండలాల్లో ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే ఉండాల్సిన పరిస్థితి నెలకొందంటూ పలువురు జెడ్పీటీసీలు జెడ్పీ సమావేశానికి హాజరుకావద్దని ముందుగానే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు ఎవరు సమావేశానికి హాజరుకాలేదు. టీఆర్ఎస్నుంచి జెడ్పీటీసీలు పలువురు తొలుత సమావేశ మందిరానికి వచ్చారు. హాజరుపట్టికలో సంతకాలు చేసిన వారు కేవలం 20 మందే కావడంతో సమావేశం నిర్వహించడానికి అవసరమైన 1/3వ వంతు సభ్యుల హాజరు లేకపోవడంతో వాయిదా వేస్తున్నామని, జెడ్పీటీసీ సభ్యులకు వివాహ కార్యక్రమాలు, ఇతర అత్యవసర పనులుండడంతో హాజరుకాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అధ్యక్షత వహించిన జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ ప్రకటించారు. అభ్యంతరం తెలిపిన ఎమ్మెల్యే సంపత్ జెడ్పీచైర్మన్ సమావేశం వాయిదా ప్రకటన చేయకముందే సభా వేదికపై మంత్రి జూపల్లి కృష్ణారావు, జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ తదితరులు కూర్చున్నారు. సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగానే అలంపూర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు సంపత్‌కుమార్ లేచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కరువు కోరల్లో చిక్కుకున్న ప్రజలు గుక్కెడు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, పశుగ్రాసం కొరతతో జిల్లా అల్లాడుతుందని, ఇటువంటి పరిస్థితుల్లో కీలకమైన అంశాలను చర్చించి ప్రజలకు ఉపశమనం ఇచ్చేలా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమావేశం నిర్వహణ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదని, పెళ్లిళ్ల సాకుతో వాయిదా ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. దీంతో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు జోక్యం చేసుకొని తమ పార్టీకి చెందిన 20 మంది సభ్యులు సమావేశానికి వచ్చారని, మీ పార్టీకి చెందిన సభ్యులు ఒక్కరు కూడా హాజరుకాకుండా ఈ తరహా బేకార్ మాటలు మాట్లాడడం తగదని వ్యాఖ్యానించారు. ఒక ప్రజాప్రతినిధి పట్ల ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఏంటంటూ సంపత్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ సభ్యులు కొందరు మినహా మిగతా సభ్యులెవరూ అటువైపే రాకపోవడంతో సమావేశం వాయిదా వేయక తప్పలేదు. మంత్రి నచ్చజెప్పి చూసినా... నిధులు-విధులు, ఇతర సమస్యలకు సంబంధించి అన్ని పార్టీలకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు సమావేశానికి ముందుగానే మంత్రి జూపల్లి కృష్ణారావును ఆర్అండ్బీ అతిథి గృహంలో కలిసి విన్నవించారు. అయితే సమావేశానికి హాజరై మీ అభిప్రాయాలను తీర్మానం రూపంలో ప్రభుత్వానికి పంపించవచ్చని, లేదా సమావేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేసే అవకాశం ఉంటుందని ఆయన వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా అనేక మంది జెడ్పీటీసీలు జెడ్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో జెడ్పీ సమావేశం నిర్వహించి తమ పంతం నెగ్గించుకోవాలని ప్రయత్నించిన అధికార పార్టీకి సొంత పార్టీ సభ్యుల నుంచే కొంత సహకారం కొరవడడం చర్చనీయాంశంగా మారింది. మంత్రుల ఇలాఖానుంచే గైర్హాజరు.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన నలుగురు జెడ్పీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. అదే విధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు మాత్రమే హాజరుకావడం సమావేశ ప్రాంగణంలో చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్కు చెందిన ఏ ఇద్దరు సభ్యులు హాజరైనా కోరం పూర్తయి సమావేశం సజావుగా సాగేదని, ప్రజా సమస్యలు చర్చకు వచ్చే అవకాశం ఉండేదని ఆ పార్టీ వర్గాలే అభిప్రాయపడడం గమనార్హం. -
కృష్ణా బేసిన్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది
విజయవాడ : కృష్ణా బేసిన్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ గురువారం విజయవాడలో వెల్లడించారు. ప్రస్తుతం 66 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందన్నారు. రెండు రాష్ట్రాలు ఆ నీటినే వినియోగించుకోవాల్సిందన్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి తక్షణసాయంగా 4 టీఎంసీలు కావాలని కృష్ణాబోర్డును ఇప్పటికే కోరామన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుపై తమ వాదనను సుప్రీంలో వినిపిస్తామని దేవినేని ఉమ చెప్పారు. -
పురపాలికల్లో నీటి ఎద్దడికి అడ్డుకట్ట
♦ రూ.63 కోట్లతో వేసవి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ♦ మున్సిపల్ కమిషనర్లకుపురపాలక శాఖ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: నగర, పట్టణ ప్రాంతాల్లో నీటి ఎద్దడి నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని నగర, పురపాలక సంస్థలు, నగర పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ కార్యాచరణ కిం ద ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకుని, అవసరమైతే కొత్త బోరుబావులను తవ్వి నీటి సరఫరాను కొనసాగించాలని సూచించింది. రాష్ట్రంలోని నగర, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల కమిషనర్లతో పురపాలక శాఖ సంచాలకులు దాన కిశోర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవి ప్రత్యామ్నాయ ప్రణాళిక కింద ఇప్పటికే పట్టణ ప్రాంతాలకు రూ.36 కోట్లు విడుదల చేశామని, మరో రూ.64 కోట్ల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, రెండు మూడు రోజుల్లో నిధులు విడుదల కావచ్చన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎండిపోవడంతో కరీంనగర్ జిల్లా మెట్పల్లి, జగి త్యాల, కోరుట్ల పట్టణాలకు నీరు సరఫరా చేసే సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు సైతం మరో 15 రోజుల్లో ఖాళీ కానున్నాయన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కింద కొత్త బోర్లను తక్షణమే వేయాలన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి నీటి కొరత తీర్చాలన్నారు. సింగూరు, మంజీర జలాశయాలు అడుగంటడంతో జహీరాబాద్, సదాశివపేట మున్సిపాలిటీలకు ప్రత్యామ్నాయంగా భూగర్భ జలాలను సరఫరా చేస్తున్నారన్నారు. హల్దీ వాగు ఎండిపోవడంతో మెదక్ పట్టణంలో నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి రామన్‌పాడు రిజర్వాయర్‌కు త్వరలో నీళ్లు విడుదల కానున్నాయని, దీంతో మహబూబ్‌నగర్‌తో పాటు వనపర్తి, నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట పట్టణాలకు నీటి సరఫరా మెరుగవుతుంద న్నారు. నాగార్జునసాగర్ నుంచి పానగల్ ఉదయ సముద్రంలోకి ఒక విడతగా నీటిని విడుదల చేయనున్నారని, దీంతో నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మంకు సరిపడా నీళ్లు ఉంటాయన్నారు. -
తాగునీటి కోసం ధర్నా
అంతర్రాష్ట్ర రహదారిపై కార్గిల్ కాలనీవాసుల ఆందోళన ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట బైఠాయింపు కొడంగల్ : తాగునీటి ఎద్దడిని నివారించాలని పట్టణంలోని కార్గిల్ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. నాలుగు రోజుల నుంచి నీటి సరఫరా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం కొడంగల్-తాండూరు అంతర్రాష్ట్ర రహదారిపై ధర్నా చేశారు. ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. 39 గ్రామాలకు సమగ్ర రక్షిత మంచినీటిని అందించే కాగ్నా పథకం నిర్లక్ష్యం నీడలో కొట్టుమిట్టాడుతోంది. కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తూ ప్రజలకు తాగునీటిని అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మహిళలు వాపోయారు. అధికారులు వచ్చి సమస్య పరిష్కరించే వారకు ధర్నా విరమించేది లేదని డిమాండ్ చేశారు. దీంతో తాండూరు-కొడంగల్ రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని సమాచారం అందడంతో ఎస్ఐ సత్యనారాయణరెడ్డి అక్కడికి వచ్చి కాలనీవాసులతో మాట్లాడారు. అధికారులతో మాట్లాడి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేలా కృషి చేస్తానని ఎస్ఐ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. గురువారం కాలనీకి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కాలనీవాసులు హెచ్చరించారు. -
నీటి ఎద్దడి లేకుండా చర్యలు : మంత్రి తలసాని
ఈ వేసవిలో నగరంలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఆదివారం ఆయన రాంగోపాల్‌పేట్ డివిజన్ నల్లగుట్టలోని జే లైన్లో రూ.3లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన పవర్‌బోర్, సింటెక్స్ ట్యాంకును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అవసరమున్న చోట వెంటనే బోర్లు వేయించడంతోపాటు గతంలో వినియోగించకుండా ఉన్న బోర్‌వెల్స్‌కు మరమ్మతులు చేయించడం జరుగుతుందన్నారు. బస్తీల్లో, కాలనీల్లో నీటి ఎద్దడి తలెత్తితే వెంటనే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. అధికారులు కూడా ఈ వేసవి ముగిసే వరకు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు చెప్పారు. -
వట్టిపోయిన రాజోళిబండ
3 రాష్ట్రాలకు తాగునీటి కష్టాలు జలాశయంలో 10 అడుగుల మేర చేరుకున్న పూడిక వట్టిపోయిన రాజోళిబండ జలాశయం మళ్లింపు పథకం రాయచూరు రూరల్ : ఆశించినంతగా ఈ ఏడాది వర్షాలు కురవక పోవడంతో జలాశయాలు వెలవెలబోతున్నాయి. దీనికి తోడు వేసవి ఎండలు అధికం కావడంతో నీటి కొరత అధికమైంది. దీంతో ప్రజలు, పశువులకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాయచూరు జిల్లాలోని మాన్వి తాలూకా రాజోళిబండ గ్రామం వద్ద తుంగభద్ర నదికి అడ్డంగానిర్మించిన రాజోళిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) జలాశయం నీరు లేక వట్టిపోయింది. రాజోళిబండ జలాశయంలో 10 అడుగుల మేర పూడిక పేరుకు పోయింది. రాజోళి బండ జలాశయం నీరు లేక వట్టిపోవడంతో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు ఎదురు కానున్నాయి. తుంగభద్ర నది తీర ప్రాంతంలోని రాయచూరు మాన్వి తాలూకా రాజోళిబండ, తిమ్మాపుర , రాజోళి, కాతరకి, దద్దల, రాయచూరు తాలూకా కుటక నూరు, ఆయనూరు, అరనళ్లి, ఎలెబిచ్చాలి, గట్టుబిచ్చాలి, హనుమాపుర, గోరకల్, జుకూర, కంబాలనత్తి, తెలంగాణలోని గద్వాల, శాంతినగర్, ఐజ, ఆంధ్రప్రదేశ్‌లోని మాధవరం, మంత్రాలయం ప్రాంతాలోని వేలాది గ్రామాల ప్రజలు తాగునీటి కోసం నానాయాతన పడుతున్నారు. -
తాగునీటి ఎద్దడి నివారణకు 55 కోట్లు
♦ కరువు మండలాలకు ‘విపత్తు’ నిధులు ♦ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కరువు మండలాల్లో తాగునీటి ఎద్దడి నివారణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ఆయా మండలాలకు రూ.55 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిర్వహణ నిధి నుంచి జిల్లా కలెక్టర్లకు ఈ నిధులు కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు జిల్లాల్లోని 231 మండలాలను ప్రభుత్వం ఇటీవల కరువు మండలాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మండలాల్లో నీటిఎద్దడి ఉన్న ఆవాసాలన్నింటా వెంటనే తాగునీటిని అందించేందుకు చర్యలు చేపట్టాలని ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం కమిషనర్ బి.ఆర్.మీనా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రానున్న వేసవి దృష్ట్యా కరువు మండలాల్లో తాగునీటి సరఫరాకు కంటిజెన్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రూ.310.61 కోట్లు కావాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఎన్సీ ప్రభుత్వానికి ఇటీవలప్రతిపాదనలు సమర్పించారు. కొన్నిచోట్ల తాగునీటి సరఫరా, ప్రైవేటు వాహనాల అద్దె, బోర్ల మరమ్మతు, బోర్లు, బావుల లోతును పెంచాల్సిన అవసరముందని నివేదించారు. తాత్కాలిక అవసరాలకు తక్షణమే రూ.108.71 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం రూ.55 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాకు అత్యధికంగా రూ.15.70 కోట్లు, అత్యల్పంగా వరంగల్ జిల్లాకు రూ.2.59 కోట్లు కేటాయించింది. మెదక్ జిల్లాకు రూ.10.82, నిజామాబాద్‌కు రూ.8.47, రంగారెడ్డి జిల్లాకు రూ.7.77, నల్లగొండకు రూ.5.18, కరీంనగర్‌కు రూ.4.47 కోట్ల చొప్పున మంజూరు చేసింది. స్టేట్ ఆడిట్ అధారిటీ ధ్రువీకరించిన వినియోగ పత్రాలను ప్రభుత్వానికి అందజేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. -
మోదీ నియోజకవర్గంలో కోకాకోలా చిచ్చు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రజలు మంచినీళ్ల కోసం ఆందోళనకు దిగారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కోకా కోలా బాట్లింగ్ కంపెనీ మూలంగానే తమకు తాగునీటి కొరత ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లని వారణాసి నియోజకవర్గం మెహ్దీతంజ్ మండలంలోని సుమారు 18 గ్రామ పంచాయితీలు ఈ ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. 1991లో ఇక్కడ నెలకొల్పిన కోకా కోలా కంపెనీ ప్లాంట్ మూలంగానే తమకు మంచినీళ్ల కరువు వచ్చిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సదరు కంపెనీ భూగర్భజలాలు విపరీతంగా తోడేస్తూ ఉండడం వల్లే తమకీ దుస్థితి వచ్చిందని మండిపడుతున్నారు. క్రమక్రమంగా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, అందుకే ఇక్కడినుంచి ఆ కోకా కోలా బాట్లింగ్ ప్లాంట్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తులు ఆందోళనకు అధికారులు సహా, కాలిఫోర్నియా కు చెందిన భారతీయ స్వచ్ఛంద సంస్థ మద్దుతుగా నిలిచింది. ఇక్కడి నీటివనరులను కోకా కోలా కంపెనీ కొల్లగొడుతోందని, దీని మూలంగా తమ గ్రామాల్లోని మహిళలు, పిల్లలు, రైతులు ఇబ్బందులనెదుర్కోవాల్సి వస్తోందని సంస్థ ప్రతినిది అమిత్ శ్రీ వాస్తవ వాదిస్తున్నారు. దీనిపై కోకా కోలా కంపెనీకి అనుమతి ఇచ్చిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి కూడా ఫిర్యాదు చేశామన్నారు. అయితే వీరి ఆరోపణలను కోకా కోలా కంపెనీ ఖండిస్తోంది. నీటి సమస్యకు తమ సంస్థ కారణం కానే కాదని వాదిస్తోంది. ఇక్కడి గ్రామాల్లోని నీటివనరుల పరిమితి క్రమేపీ క్షీణిస్తున్న మాట వాస్తవమేనని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ సమర్పించిన ఇటీవలి నివేదిక చెబుతోంది. అయినప్పటికీ స్థానికంగా ఉన్న బోర్లు, బావులలో గృహ వినియోగానికి, గోధుమ, ఆవ తదితర పంటల అవసరాలకు సరిపడేంతగా ఉన్నాయని కూడా పేర్కొంది. -
యథేచ్ఛగా నీటి దందా
- జేబులు నింపుకుంటున్న వ్యాపారులు - రోజురోజుకు పెరిగిపోతున్న నీటి వ్యాపారం - ఏటా తగ్గిపోతున్న భూగర్భజలాలు - కాలనీల్లో నీటి కొరత - ఇబ్బంది పడుతున్న జనం - పట్టించుకోని అధికారులు పటాన్చెరు: పట్టణంలో ట్యాంకర్లతో నీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షాలు లేక భూగర్భజలాలు ఇంకిపోతున్నాయి. బోర్లలో నీటి మట్టం తగ్గిపోవడంతో సమస్యలు వస్తున్నాయి. ఎప్పుడూ లేని విధంగా పటాన్చెరు శాంతినగర్‌లో బోర్లలో నీరు తగ్గుతోంది. శాంతినగర్ పక్కన దాదాపు వందెకరాల శిఖంతో ఉన్న సాకి చెరువులో నీరు తగ్గింది. వర్షాలు లేక పోవడంతో చెరువులో ఉండాల్సిన నీరు లేదు. అలాగే పటాన్చెరు పట్టణంలో భూగర్భ జలాల లభ్యత ఉన్న కారణంగా ఈ ప్రాంతం నుంచి రాత్రింబవళ్లు బోరు నీటిని తోడి అమ్ముకునే వ్యాపార సంస్థలు ఎక్కువయ్యాయి. పటాన్చెరు పట్టణంలోని పెట్రోలు బంక్‌లో బోరు వేసి నీటిని రాత్రింబవళ్లు తోడేస్తున్నారు. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే శాంతినగర్‌లో ప్రైవేటు వ్యక్తులు ఆర్వో వాటర్ ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఈ వాటర్ ప్లాంట్ల కారణంగా సమస్యలు వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. అక్రమ పద్ధతుల్లో నీటిని తోడుతున్నారనే ఆరోపణలు ఎక్కువయ్యాయి. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్‌ను వివరణ కోరగా ఆయన నీటి వ్యాపార కేంద్రాలను వెంటనే గుర్తించి వాటిని తొలగిస్తామన్నారు. తమ దృష్టికి అలాంటి సమస్యలు ఎప్పుడు రాలేదన్నారు. స్థానికులు తాజాగా ఫిర్యాదు చేశారని దానిపై చర్యలు తీసుకుంటామన్నారు. వాల్టా చట్టం అమలు చేయరా? పటాన్చెరు పట్టణంలో వాల్టా చట్టం ఎక్కడా అమలు కావడం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా బోర్లు వేస్తున్నారు. అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. రోజురోజుకూ నీటి వ్యాపారం పెరుగుతోంది. 24 గంటలూ బోర్లు నడుపుతుండడంతో భూగర్భజలాలు తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. - జగన్‌రెడ్డి, శాంతినగర్ పటాన్చెరు అధికారులు పట్టించుకోవడం లేదు అధికారులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు చేసినా స్పందించడంలేదు. నీటి వ్యాపార కేంద్రాల నిర్వహణపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. నీటి వ్యాపార నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరితే లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఇవ్వాలంటూ రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. - చిదంబరం, శాంతినగర్ -
సాగర్‌పై అధారపడ్డ రైతులు
-
ఎండ 47 డిగ్రీలకు.. నీరు పాతాళానికి..
- రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగానే ఉన్న ఉష్ణోగ్రత - చాలా చోట్ల తీవ్రమైన నీటి ఎద్దడి.. ట్యాంకరలతో సరఫరా - మరఠ్వాడాలో కరవు పరిస్థితితో అడుగంటిన జలాలు - మధ్యాహ్న సమయంలో కర్ఫ్యూ తలపిస్తున్న రహదారులు - వర్షాలు ఆలస్యమైతే పరిస్థితి మరింత తీవ్రం సాక్షి, ముంబై: ఒక వైపు భానుడి ఉగ్రరూపం, మరోవైపు నీటి ఎద్దడి రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. ఉష్టోగ్రతలు 47 డిగ్రీలను దాటి అర్ధ సెంచరీ సాధించేందుకు సిద్ధంగా ఉండగా.. నీటి వనరులు పాతాల అంచుకు చేరిపోయి నోటి తడి ఆర్పేస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా మరాఠ్వాడా తీవ్ర తాగు నీటి సమస్యను ఎదుర్కొంటుంది. అధిక సంఖ్యలో నీటి ట్యాంకర్ల ద్వారా తాగు నీరు మరాఠ్వాడాకు సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం స్థానిక డ్యాములు సామార్థ్యం కంటే 8 శాతం తక్కువ నీటి నిలువలు పడిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. ఈ రీజియన్ పరిధిలో ఎనిమిది జిల్లాల్లోని దాదాపు 1,065 గ్రామాలకు, 377 కుగ్రామాలకు 1,500 ట్యాంకర్ల ద్వారా రోజూ నీటి సరఫరా జరుగుతోంది. గతేడాది 150 ట్యాంకర్ల ద్వారా మాత్రమే జరిగిన నీటి సరఫరా ఈ సారి అందుకు పది రెట్లు ఎక్కువగా జరుగుతోంది. ఈ పరిస్థితి నీటి సంక్షోభం ఎంత తీవ్రంగా చెప్పక నే చెబుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,215 ట్యాంకర్ల ద్వారా 1,625 గ్రామాలు, 2,096 కుగ్రామాలకు నీటి సరఫరా జరుగుతోంది. గత ఏడాది ఇదే సమయంలో కేవలం 300 తాగునీటి ట్యాంకర్లను వినియోగించారు. నీటి ఎద్దడి అధికంగా ఉంది: మంత్రి గిరీశ్ నీటి వనరుల విభాగ మంత్రి గిరీశ్ మహాజన్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా నీటి ఎద్దడి అధికంగా ఉందని అన్నారు. ప్రధానంగా మరాఠ్వాడా తీవ్ర పరిస్థితిని ఎదుర్కొంటుందని చెప్పారు. వచ్చే ఏడాది నాటిక ఈ విషయంపై జాగ్రత్త వహించి మంచి ఫలితాలు వచ్చేలా చేస్తామని ఆయన వివరించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాత తాగు నీటి కొరత కొంత మేర తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాగ్‌పూర్‌లో అంతంత మాత్రమే నాగ్‌పూర్ రిజీయన్పై నీటి సంక్షోభం ప్రభావం అంతగా చూపలేదని నీటి వనరుల శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి అన్నారు. కాని ఉష్ణోగ్రతలు మాత్రం 47 డిగ్రీలకు పైగానే ఉన్నాయని అన్నారు. కేవలం ఐదు ట్యాంకర్ల ద్వారానే నాగ్‌పూర్‌కు తాగు నీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. వర్దా, గోండియా, చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో ఇప్పటి వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయలేదని వివరించారు. కాగా, ఔరంగాబాద్, జాల్నా, బీడ్, పర్భణి, హింగోళి, నాందేడ్, ఉస్మానాబాద్, లాతూర్లకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఔరంగాబాద్‌లో అధికం గా 431 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. బీడ్‌కు 361, జాల్నాకు 219 ట్యాంకర్లను ఉపయోగిస్తున్నారు. కొంకణ్ రీజియన్‌కు 90 ట్యాంకర్ల ద్వారా తాగు నీటిని సరఫరా చేస్తున్నారు. నాసిక్‌కు 400 ట్యాంకర్లు, పుణే రీజియన్‌కు 70, అమరావతి రీజియన్‌కు వంద మంచి నీటి ట్యాంకర్లను వినియోగిస్తున్నారు. మొదట ప్రైవేట్ నీటి ట్యాంకర్లను అద్దెకు తీసుకునే వాళ్లమని, అదనంగా అవసరం ఏర్పడటంతో ప్రభుత్వ ట్యాంకర్లను ఉపయోగించా ల్సి వస్తోందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. తాగు నీటి ట్యాంకర్లను పెంచాలన్న డిమాండు రోజురోజుకు పెరుగుతోందన్నారు. ఒకవేళ ఈ ఏడాది వర్షాలు ఆలస్యమైనా.. వర్షపాతం తగ్గినా రాష్ట్రం తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. రాష్ర్టంలోని చాలా ప్రాంతాలు రెండు దశాబ్దాలుగా తాగు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నా సమస్యను పరిష్కరించేందుకు ఎవ్వరూ కృషి చేయడం లేదని విచారం వ్యక్తం చేశారు. మండుతున్న ఎండలు.. దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న మరాఠ్వాడా పరి స్థితి తీవ్రంగా మారింది. విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలోనూ ఎండలు ఠారెత్తుస్తున్నాయి. ఓ వైపు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో జనజీవనం అతలాకుతలం అవుతుంటే.. మరోవైపు మండుతున్న ఎండలు తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నాయి. కరవుతో అల్లాడుతున్న అనేక ప్రాంతాల్లో ఇదే దుస్థితి దర్శనమిస్తోంది. మరాఠ్వాడా ప్రాంతంలో ఇప్పటికే తీవ్ర కరవు పరిస్థితి నెలకొని దుర్భిక్ష పరిస్థితులను సృష్టిస్తోంది. రాష్ట్రంలోని కోంకణ్, ఉత్తర మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. విదర్భలోని అకోలాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకున్నాయి. వర్ధా, చంద్రాపూర్, అమరావతితోపాటు జల్గావ్, మాలేగావ్‌లలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. ఇక విదర్భ, మరాఠ్వాడాల్లో 42 నుంచి 44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. దీంతో మధ్యాహ్నం పూట ప్రజలు బయటికి రావాడానికే జంకుతున్నారు. అత్యవసరంగా బయటికి వెళ్లాల్సిన పరిస్థితిలోనే వెళ్తున్నారు. విదర్భలలోని అనేక పట్టణాల్లో మధ్యాహ్నం సమయంలో వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తూ కర్ఫ్యూ తలపిస్తున్నాయి. -
సమావేషాలా?
♦ ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్సార్ సీపీ ♦ సమావేశం నుంచి బాయ్‌కాట్ ♦ అధికారుల గైర్హాజర్‌పై మంత్రి కూడా మండిపాటు సాక్షి ప్రతినిధి, ఒంగోలు, ఒంగోలు టౌన్ : ఒక పక్కన కరువు విలయతాండవం చేస్తోంది. డిసెంబర్ నెల నుంచే పలు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. రైతు చక్రబంధంలో చిక్కుకున్నాడు. వేసిన పంటలు చేతికి రాక, మరోవైపు గిట్టుబాటు ధర లేక అయోమయ స్థితిలో ఉన్నారు. ఇంతటి కీలక సమయంలో జరిగిన జెడ్పీ సమావేశానికి జిల్లా కలెక్టర్ విజయకుమార్, జెడ్పీ సీఈవో ప్రసాద్ హాజరు కాలేదు. ఆర్డబ్ల్యూఎస్ విభాగం తరఫున కూడా ఇన్‌ఛార్జి అధికారులే సమావేశానికి హాజరయ్యారు.దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, పాలపర్తి డేవిడ్ రాజు, జంకె వెంకటరెడ్డి, పోతుల రామారావు, ముత్తుముల అశోక్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు సమావేశాన్ని బహిష్కరించారు. బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, కొండపి శాసనసభ్యుడు డోలా వీరాంజనేయస్వామి కూడా అధికారులు హాజరుకాకపోవడంపై ప్రశ్నించారు. అనంతరం సమావేశానికి వచ్చిన మంత్రి శిద్దా రాఘవరావు కూడా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలో 56 మండలాలలకుగాను 54 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరువుపై, తాగునీరు, రైతులకు గిట్టుబాటు ధరలు, కరువు బృందం పర్యటన మొక్కుబడిగా సాగడం వంటి అంశాలపై శుక్రవారం ఎంపీ సుబ్బారెడ్డి ఇంట్లో సమావేశమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ వాణి వినిపించాలని నిర్ణయించారు. ఇప్పటికే గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది, పశుగ్రాసం దొరకడం లేదు. వీటిపై నిలదీయాలని నిర్ణయించారు. కరువు నివేదికలు కూడా సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల జిల్లాకు వచ్చిన కరువు బృందం ఒక్కరోజులోనే తన పర్యటన ముగించుకుని వెళ్లిపోయింది. జిల్లాలో కరువు ప్రభుత్వ నివేదికలకంటే చాలా తీవ్రంగా ఉందని కరువు బృందం సభ్యులు వ్యాఖ్యానించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పట్టింది. ఈ అంశాలపై సమావేశంలో నిలదీయాలని సభ్యులు నిర్ణయించారు. సుబాబుల్, జామాయిల్ పంటలకు గిట్టుబాటు ధర విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. జెడ్పీ సమావేశానికి ఒక రోజు ముందు హడావిడిగా మీటింగ్ పెట్టి ప్రభుత్వం కొత్త ధరలు నిర్ణయించినా ఒక్క టన్ను కూడా పేపర్ మిల్లులు కొనుగోలు చేయలేదు. కరువు కారణంగా పంటలు పండలేదు. పండిన వాటికి గిట్టుబాటు ధరలేదు. పొగాకు రైతులు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయారు. ఇప్పటి వరకూ కేవలం లక్షా 10 వేల కిలోలు మాత్రమే పొగాకు అమ్ముడుపోయింది. ఏ డెల్టా కింద ఏ పంట నష్టపోయిందన్న అంచనాలు కూడా అధికారుల వద్ద లేకపోవడంతో కరువు బృందం పర్యటన కూడా పూర్తిగా జరగలేదు. ఈ అంశాలపై సమావేశంలో చర్చించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. అయితే కోర్టు వివాదం నేపథ్యంలో జిల్లాలోనే ఉన్న కలెక్టర్, జెడ్పీ సీఈవో సమావేశానికి రాకుండా ఉండిపోయారు. కీలకమైన అధికారులు లేనప్పుడు సమస్యలు ఎవరికి చెప్పినా ఉపయోగం లేకపోవడంతో తాము సమావేశాన్ని బాయ్‌కాట్ చేసినట్లు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 90 రోజులకోసారి జెడ్పీ సమావేశం జరపాలన్న సాంకేతిక అంశంతోనే ఈ సమావేశాన్ని పూర్తి చేయడం వివాదాస్పదం అయ్యింది. జిల్లా కలెక్టర్ ఎందుకు రాలేదు జిల్లాలో కరువుపై చర్చించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు అవకాశం ఉంది. ఇంతటి కీలకమైన సమావేశానికి జిల్లా కలెక్టర్ ఎందుకు రాలేదని యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు సమావేశంలో అధికారులను నిలదీశారు. సమావేశానికి సంబంధించిన ఆహ్వానం ఎవరి పేరున పంపారు, అధికారికంగా ఆహ్వానం పంపిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎక్కడ, జెడ్పీ సీఈఓ ఎక్కడ అని ప్రశ్నించారు. కీలకమైన ఆ ఇద్దరు అధికారులు లేకుండా సమావేశం నిర్వహించడం వల్ల ఉపయోగం ఏమిటి? చివరకు డిప్యూటీ సీఈఓ కూడా ఇన్‌ఛార్జి అనే విషయాన్ని గుర్తు చేశారు. - పాలపర్తి డేవిడ్‌రాజు కలెక్టర్ కోసం పదినిమిషాలు ఎలా ఆపారు గతంలో జరిగిన జిల్లాపరిషత్ సమావేశానికి జిల్లా కలెక్టర్ రాలేదని పది నిమిషాలు ఎలా ఆపారని అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. కలెక్టర్ లేకుండా హడావుడిగా సమావేశాలు పెట్టడం ఎందుకు అని నిలదీశారు. సమస్యలు పరిష్కారం కానప్పుడు ఇలాంటి సమావేశాలు ఎన్ని నిర్వహించినా ఉపయోగం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. - గొట్టిపాటి రవికుమార్ వారు రాకపోవడం లోపమే జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశానికి బాధ్యతాయుతమైన కలెక్టర్, జెడ్పీ సీఈఓలు రాకపోవడం లోపమేనని కొండపి శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి వ్యాఖ్యానించారు. సర్వసభ్య సమావేశంలో చేసే తీర్మానాలను అధికారులు పాటించాల్సి ఉంటుందన్నారు. - బాలవీరాంజనేయస్వామి తొందరపాటు నిర్ణయం కాదు జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం 90 రోజుల్లోపు జరగాల్సి ఉండటంతో ఏర్పాటు చేసినట్లు జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ చెప్పారు. ఇది తొందరపాటు నిర్ణయం కాదన్నారు. ప్రస్తుత సమావేశానికి కలెక్టర్ హాజరుకాకపోయినా మరో 15-30 రోజుల్లో ఇంకో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించుకోవచ్చని వివరణ ఇచ్చారు. - నూకసాని బాలాజీ జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటనకు తీర్మానం అత్యంత వెనుకబడిన జిల్లాల్లో అనంతపురం తరువాత స్థానంలో ఉన్న ప్రకాశం జిల్లాను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది. యుద్ధప్రాతిపదికన జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని మరో తీర్మానం చేసింది. మార్చుకోకుంటే చర్యలు తప్పవు ‘జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశానికి సంబంధించి అధికారులందరికీ ముందుగానే సమాచారం అందించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చారు. కొంతమంది అధికారులు రాలేదు. సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెబుతారు. మీ ఇష్టప్రకారం ప్రవర్తిస్తే పద్ధతిగా ఉండదు. అధికారులు తీరుమార్చుకోకుంటే చర్యలు తప్పవు. - మంత్రి శిద్దా -
'వేసవిలో దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తా'
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో తాగునీరు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ, వైఎస్ఆర్ సీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. అందులోభాగంగా వేసవిలో దాహార్తిని తీర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం అవసరమైతే ప్రభుత్వం, ఉన్నతాధికారులపైనా ఒత్తిడి తీసుకువస్తానని తెలిపారు. శుక్రవారం జిల్లాలోని పొన్నలూరు మండలం సుంకిరెడ్డిపాలెంలో ఆర్వో వాటర్ ప్లాంట్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. -
భూగర్భ ‘శోకం’
అథఃపాతాళంలో గంగ 10 మీటర్ల లోతులో నీటిమట్టం గతంతో పోలిస్తే నాలుగు మీటర్లు ఎక్కువ వేసవిలో తాగునీటికి తిప్పలే.. డిసెంబర్ 19న జెడ్పీ సమావేశంలో పది రోజుల వ్యవధిలో వేసవిలో నీటి ఎద్దడి పై ప్రణాళిక, కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. కానీ, ఇంతవరకు సిద్ధం కాలేదు. భూ ఉపరితలం నుంచి ఎనిమిది మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోతే కరువు ఛాయలు అలుముకున్నట్లుగా అధికారులు పరిగణిస్తారు. జిల్లాలో 50 మండలాలు ఉండగా వీటిలో 32 మండలాల్లో నీటిమట్టం ఎనిమిది మీటర్లు కంటే కిందికి చేరుకుంది. కాగా, రఘునాథ్‌పల్లి, ములుగు మండలాల్లో అత్యంత లోతులో 25.28 మీటర్ల లోతులో భూగర్భనీరు ఉంది. భూగర్భ జలవనరుల విభాగం తాజా నివేదిక ప్రకారం 2014 డిసెంబరు నాటికే జిల్లా సగటు భూగర్భనీటి మట్టం 9.66 మీటర్లకు పడిపోయింది. హన్మకొండ : జిల్లాలో భూగర్భ జలమట్టాలు రోజురోజుకి పడిపోతున్నారుు. వేసవికి ముందే 32 మండలాల్లో నీటిమట్టం ప్రమాదకర స్థారుుకి చేరుకుంది. జిల్లా యంత్రాంగం దృష్టిసారించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే వేసవిలో జిల్లావాసులు మంచినీటికి కటకటలాడాల్సిదే. జిల్లా సగటు వర్షపాతంతో పోల్చితే 32 శాతం తక్కువగా నమోదైంది. దీంతో చెరువులు, కుంటల్లో జలవనరుల నిల్వ తగ్గింది. దీనికితోడు వర్షాభావంతో వ్యవసాయదారులు ఖరీఫ్, రబీ సీజన్లలో బోరుబావులపై అధికంగా ఆధారపడ్డారు. ఫలితంగా భూగర్భజలాలు తగ్గుముఖం పట్టాయి. శీతాకాలం ముగియకముందే భూగర్భ నీటిమట్టం దాదాపు పదిమీటర్ల కిందికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అంతటా ఇదేతీరు.. కరువు, అటవీ ప్రాంతం అని తేడా లేకుండా జిల్లా అంతట భూగర్భ జలాలు అడుగంటారుు. జిల్లాలో కరువు ప్రాంతంగా పేర్కొనే జనగామ సబ్‌డివిజన్ పరిస్థితి దారుణంగా ఉంది. ఈ డివిజన్లో పది మండలాలు ఉండగా ఇక్కడ నీటిమట్టం లోతు జిల్లా సగటు కంటే ఎక్కువగా నమోదైంది. జనగామ సబ్‌డివిజన్ పరిధిలో ప్రస్తుతం భూగర్భ నీటిమట్టం 14.65 మీటర్ల లోతులో ఉంది. ఇదే డివిజన్లోని రఘునాథ్‌పల్లి మండలంలో అత్యంత లోతులో 25.28 మీటర్ల లోతులో భూగర్భనీరు ఉంది. ములుగులో కూడా నీటిమట్టం పడిపోవడం ఈ ఏటి కరువు పరిస్థితికి అద్దం పడుతోంది. ఏడాది వ్యవధిలో ములుగు డివిజన్ పరిధిలో సగటునీటి మట్టం పది మీటర్లు లోతుకు పోయింది. 2013 డిసెంబరులో ములుగు సబ్‌డివిజన్‌లో సగటు నీటిమట్టం 6.42 మీటర్లలోతులో ఉండగా 2014 నాటికి ఈ దూరం 9.62 మీటర్లకు పోయింది. ఈ డివిజన్లో ములుగు మండలంలో అత్యధికంగా 15.74 మీటర్ల లోతులో నీరు అందుబాటులో ఉంది. అప్పుడే వేసవి ఛాయలు సాధారణంగా డిసెంబరులో ఉన్న నీటిమట్టం మే నెల వచ్చే సరికి తగ్గుతుంది. 2013 డిసెంబరులో జిల్లా సగటు భూగర్భ జలమట్టం 5.66 మీటర్ల లోతు ఉండగా 2014 మే నాటికి 8.68 మీటర్ల లోతుకు పడిపోయింది. కానీ ఈసారి వేసవి రాకముందే 2014 డిసెంబరు నాటికే జిల్లా సగటు భూగర్భ జలమట్టం 9.60 మీటర్లు చేరుకుంది. అంటే గత వేసవిలో నీటిమట్టం కంటే ఈ శీతాకాలంలోనే నీటిమట్టం ప్రమాదకరస్థాయిని దాటి ఒక మీటరు లోతుకు వెళ్లింది. వేసవిలో ఉండాల్సిన పరిస్థితి శీతాకాలంలో ఉండటాన్ని బట్టి.. ఇదేతీరుగా నీటిమట్టాలు పడిపోతూ ఉంటే వేసవిలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. వేగంగా పడిపోతున్న నీటిమట్టాలు వేసవి కాలం సమీపిస్తున్నకొద్దీ నీటిమట్టాల్లో తరుగుదల వేగంగా జరుగుతోంది. 2014 నవంబరు నుంచి డిసెంబరు వరకు నెలరోజుల వ్యవధిలోనే జిల్లా సగటు భూగర్భ జలమట్టం 0.70 మీటర్ల లోతుకు వెళ్లింది. రఘునాథ్‌పల్లి మండలంలో అత్యధికంగా 4.45 మీటర్ల లోతుకు నీటిమట్టం పడింది. ఇక్కడ 2014 నవంబరులో నీటిమట్టం 20.83 మీటర్లు ఉండగా డిసెంబరు నాటికి ఇది 25.28 మీటర్లకు చేరుకుంది. నెల రోజుల వ్యవధిలో ఒక మీటరు కంటే ఎక్కువగా నీటిమట్టం పడిన మండలాల్లో నర్మెట(1.23), స్టేషన్‌ఘన్‌పూర్(1.78), ధర్మసాగర్(1.71), హసన్‌పర్తి(1.29), దుగ్గొండి(1.67), ములుగు(2.62) ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఒక చేర్యాల మండలంలోనే నీటిమట్టం స్థాయి పెరిగింది. తపాస్‌పల్లి రిజార్వాయర్ వల్ల ఇక్కడ నీటిమట్టాల్లో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది. డిసెంబరు 2013లో 18.52 మీటర్లలోతు నుంచి 2014 నాటికి 14.05 మీటర్లకు పెరిగింది. అతీగతీలేని జెడ్పీ తీర్మానాలు 2014 డిసెంబరు 19వ తేదీన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో 10 రోజుల వ్యవధిలో వేసవిలో నీటి ఎద్దడి పై ప్రణాళిక, కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. కానీ, ఇంతవరకు కార్యాచరణ సిద్ధం కాలేదు. ప్రస్తుతం జిల్లాలో చేతిపంపులు 18,295, రక్షిత మంచినీటి సరఫరా పథకాలు 2,155 పని చేస్తున్నాయి. వీటికి అదనంగా ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి 353 పనులు మంజూరు కాగా ఇప్పటి వరకు 82 పనులు మొదలు పెట్టలేదు. మొదలైన పనుల్లో 129 పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. అధికార యంత్రాంగం అంతా వాటర్ గ్రిడ్ జపం చేస్తూ రానున్న వేసవి తాగునీటి సమస్యలను ఎదుర్కొవడంపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా అధికారులు ఇలాగే వ్యవహరిస్తే వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కొవడం కష్టంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. 260 ఫీట్ల లోతు వేసినా చుక్కనీరు లేదు.. గ్రామంలోని రెండు ఎస్సీ కాలనీల్లో తాటునీటి కోసం ఇబ్బందులున్నాయి. ఉన్న బోర్లలో భూగర్భజలం అడుగంటిపోయాయి. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు మూడు బోర్లు 260 ఫీట్ల లోతు వేయించాం. ఒక్కదాంట్లో చుక్కనీరు పడలేదు. కొత్తగా బోరు వేయాలంటేనే భయమేస్తోంది. వేసవి ముంచుకు వస్తుండడంతో ఎస్సీకాలనీలో నెలకొన్న నీటి ఎద్దడిని ఎలా నివారించాలో తెలియని పరిస్థితి. - కంసాని మమత మహేందర్‌రెడ్డి, సర్పంచ్, పోచ్చన్నపేట, బచ్చన్నపేట ఆందోళనకరం.. ఈసారి తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల జిల్లాలో భూగర్భ జలమట్టం తగ్గింది. ఎనిమిది మీటర్లు లోతుకంటే నీటిమట్టం పడిపోతే తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. డిసెంబరు నాటికే జిల్లా సగటు నీటిమట్టం 9.66 మీటర్లుకు చేరుకోవడం ఆందోళనకరం. - ఆనంద్, డీడీ, భూగర్భ జలవనరుల శాఖ -
సీమలో దాహం..దాహం..!
* ప్రమాద ఘంటికలు * వేసవిని తలపిస్తున్న తాగునీటి ఎద్దడి * కనిష్ట స్థాయికి పడిపోయిన భూగర్భ జలమట్టం * బోర్లు ఎండిపోయి నిరుపయోగంగానీటి పథకాలు..! * 1,811 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్న దుస్థితి ఈ ఫోటో చూశారా..కుప్పం నియోజకవర్గంలో కుంజేగానూరుకు చెందిన మహిళలు బిందెడు నీళ్ల కోసం పడుతున్న కష్టాలు. రోజూ నాలుగు కి లోమీటర్ల దూరంలోకి వ్యవసాయ బోరు బావినుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఒక్క కుప్పం నియోజకవర్గంలో 250కి పైగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. సీమ వ్యాప్తంగా అధిక శాతం గ్రామాల్లో ఇదే దుస్థితి. మగవాళ్లు వ్యవసాయ పనులకు వెళితే, మహిళలు, పిల్లలు తాగునీటి కోసం మైళ్ల దూరం వెళుతున్నారు. దినమంతా వారు దీని కోసమే అష్టకష్టాలు పడుతున్నారు. నీటి ఎద్దడి ముంచుకొస్తున్నా అధికారులు మాత్రం ముందుస్తు ప్రణాళికలపై ఇంకా దృష్టిపెట్టడంలేదు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: దుర్భిక్ష సీమలో తాగునీటి ఎద్దడి అప్పుడే వేసవిని తలపిస్తోంది. వర్షాలులేక భూగర్భ జలమట్టం కనిష్ట స్థాయికి పడిపోయింది. బోర్లు ఎండిపోవడంతో రక్షిత నీటి పథకాలు దిష్టిబొమ్మల్లా మారాయి. ఇప్పటికే 1,811 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చిత్తూరు జిల్లాలో ఏకంగా 1,453 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఇందులో సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే 198 గ్రామాలు ఉన్నాయి. వర్షాభావ ప్రాంతమైన రాయలసీమపై వరుణుడు మరో సారి పగబట్టాడు. సాధారణం కన్నా 43.5 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో సీమలో వరుసగా ఐదో ఏటా దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. చిత్తూరు జిల్లాలో 18.35 మీటర్లు, అనంతపురంలో 19.12 మీటర్లు, వైఎస్సార్ జిల్లాలో 18.32 మీటర్లు, కర్నూలు జిల్లాలో 16.85 మీటర్లకు భూగర్భ జలమట్టం పడిపోయింది. ప్రస్తుతం ప్రతి నెలా భూగర్భ జలమట్టం పడిపోతూ వస్తోంది. దీంతో వ్యవసాయ బోరు బావులతో పాటు రక్షిత మంచినీటి పథకాల బోర్లు కూడా ఎండిపోతున్నాయి. దాంతో బిందెడు నీళ్ల కోసం మైళ్ల దూరంలోని వ్యవసాయ బోరు బావులను ఆశ్రయిస్తున్నారు. * చిత్తూరు జిల్లాలో 1,380 పంచాయతీల పరిధిలో 11,580 గ్రామాలు ఉన్నాయి. 40 వేలకుపైగా బోరు బావులు ఎండిపోయాయి. జిల్లాలో 1,453 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మరో 212 గ్రామాలకు వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకుని నీటిని సరఫరా చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఇలానే కొనసాగితే వేసవిలో మరో 1,700 గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. * అనంతపురం జిల్లాలో 1,006 పంచాయతీల పరిధిలో 3,385 గ్రామాలు ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలమట్టం కనిష్ట స్థాయికి చేరడంతో 60 వేలకుపైగా బోరు బావులు ఎండిపోయాయి. ఇప్పటికే 288 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారానూ.. వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకుని తాగునీటిని సరఫరా చేస్తున్నారు. * వైఎస్సార్ జిల్లాలో 818 పంచాయతీల పరిధిలో 4,241 గ్రామాలు ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతోండటంతో ఇప్పటికే 35 వేలకుపైగా బోరు బావులు ఎండిపోయాయి. 180 గ్రామాలకు తాగునీటిని ట్యాంకర్ల ద్వారానూ.. మరో 92 గ్రామాలకు వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకుని సరఫరా చేస్తున్నారు. * కర్నూలు జిల్లాలో 898 పంచాయతీల పరిధిలో 1,526 గ్రామాలు ఉన్నాయి. దుర్భిక్షం వల్ల భూగర్భ జలమట్టం పడిపోవడంతో 20 వేలకుపైగా బోరు బావులు ఎండిపోయాయి. ప్రస్తుతం 125 గ్రామాలకు తాగునీటిని ట్యాంకర్ల ద్వారానూ.. వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకుని సరఫరా చేస్తుండటం గమనార్హం. -
యథేచ్ఛగా వాటర్ ప్లాంట్ల నిర్వహణ
పటాన్చెరు పారిశ్రామికవాడలో నీటి కొరత తీవ్రంగా ఉంది. దీంతో భూగర్భ జలాలకు డిమాండ్ పెరిగి వందల సంఖ్యలో ఆర్వో నీటి శుద్ధి కేంద్రాలు వెలిశాయి. వీటిలో ఏ ఒక్క దానికీ అనుమతి లేదు. రెవెన్యూ అధికారులకు ఠంచనుగా మామూళ్లు అందిస్తున్న నిర్వాహకులు యథేచ్ఛగా నీళ్ల దందా నిర్వహిస్తున్నారు. సీఎం సొంత జిల్లా.. రాష్ట్ర రాజధానికి పక్కనే ఉన్న పటాన్చెరులో ‘రెవెన్యూ’ పనితీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. బోరు నీటినే.. శుద్ధి చేసిన జలమని చెబుతూ విక్రయిస్తున్నారు. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు విషతుల్యమయ్యాయని శాస్త్రవేత్తలు మూడేళ్ల క్రితమే తేల్చారు. కానీ వీటినే ఆర్వో ప్లాంట్లలో ఫిల్టర్ చేశామని చెబుతున్న వ్యాపారులు 12వేల లీటర్ల ట్యాంకర్ల పరిణామాల్లో విక్రయిస్తున్నారు. ఈ నీటిని స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో రసాయనాల తయారీకి, తాగునీటి కోసం వాడుతున్నారు. పాశమైలారం పారిశ్రామికవాడలో చాలా రసాయన పరిశ్రమల్లో భూగర్భ జలాలు లేవు. దీంతో దూర ప్రాంతాల నుంచి వాడుక, తాగు నీటి అవసరాల కోసం నీటి వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న అక్రమార్కులు పనిలో పనిగా వాటర్ బబూల్స్ (20 లీటర్ల బాటిళ్లు) ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఇస్నాపూర్, ముత్తంగి, పాటిలో తయారు చేస్తున్న నీరు శేరిలింగంపల్లి వరకు అమ్ముతున్నారు. చిన్న సైజు బాటిళ్లు, ప్యాకెట్ల రూపంలో కూడా విక్రయిస్తున్నారు. వంద గజాల నిడివిలో నాలుగు బోర్లు వేసి ఆ నీటిని ట్యాంకుల్లోకి ఎక్కించి సరఫరా చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండ... గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఒకరి సూచన మేరకు ముత్తంగి చర్చి ముందు వైపు ఉన్న వాటర్ ప్లాంట్ కోసం ఓ మైనార్టీ నేత కోరిక మేరకు ఏకంగా ట్రాన్స్ఫార్మర్ను బిగించారు. అక్కడ వ్యవసాయం లేదు. కనీసం ఆవాసాలు కూడా లేవు. కేవలం వాటర్ ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. వీటికి అవసరమైన విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ప్లాంట్లకు స్థానిక రెవెన్యూ అధికారుల పూర్తి సహకారం అందిస్తున్నారు. ముత్తంగిలో ప్రధాన రహదారిపై, రైస్‌మిల్లు, కట్టెల మిల్లు దగ్గర నిత్యం వందలాది ట్యాంకర్లు నిలబడి ఉన్నా అధికారులు మాత్రం కనీసం వాటిని పట్టించుకోవడంలేదు. పాశమైలారంలో నీటి వ్యాపారం కోసం చేసిన నిర్మాణాలు చూస్తే ఎవరికైనా కళ్లు తిరగాల్సిందే. ఇంద్రకరణ్(సంగారెడ్డి) మండలం వైపు వేసిన బోర్ల నుంచి పైప్లైన్లు వేసి పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ సంపులను నింపుతున్నారు. 24 గంటలు మోటర్లు పెట్టి నీటిని ఉపరితల ట్యాంకులకు ఎక్కిస్తుంటారు. పైవైపున్న ట్యాంకుల కింద ట్యాంకర్లను నిలబెట్టి క్షణాల్లో నింపే ఏర్పాట్లు చేశారు. వందలాది లారీల్లో రాత్రింబవళ్లు సరఫరా కొనసాగుతూనే ఉంటుంది. ముత్తంగిలో కూడా ఇదే పరిస్థితి. ముత్తంగి చర్చి ముందు దాదాపు డజనుకుపైగా నీటి వ్యాపార క్షేత్రాలు కొనసాగుతున్నాయి. అమీన్‌పూర్‌లోని పెద్ద చెరువులో శిఖంలోనే వాటర్ ట్యాంకర్ క్షేత్రాలు నిర్వహిస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. వీటితో తమ బోర్లు ఎండిపోతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీల అధికారులు కూడా అది తమ పరిధిలోనిది కాదని చేతులెత్తేస్తుండటంతో వ్యాపారులకు అడ్డు లేకుండా పోయింది. దాడులు చేస్తాం... దీనిపై తహశీల్దార్ మహిపాల్‌రెడ్డి అడగగా గతంలో కూడా ఇవే ఆరోపణలు వచ్చాయన్నారు. అప్పట్లో వాటర్ ప్లాంట్లపై దాడులు చేశామని తెలిపారు. రెండుమూడు రోజుల్లో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి దాడులు చేస్తామని చెప్పారు. అక్రమంగా కొనసాగుతున్న నీటి క్షేత్రాలను పూర్తిగా తొలగిస్తామని పేర్కొన్నారు. -
కేంద్ర సానుకూలంగా స్పందించింది: కోల్లు రవీంద్ర
హైదరాబాద్: చేనేత కార్మికుల సమస్యల్ని పరిష్కారించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన విజ్క్షప్తికి కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని మంత్రి రవీంద్ర అన్నారు. ఏపీలో మూడు టెక్స్ టైల్ పార్కులు, మెగా క్లస్టర్ల ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో వందకు పైగా బీసీ హాస్టల్స్ ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదనలు కోరిందని మీడియాకు తెలిపారు. కృష్ణా జిల్లాలో మంచినీటి సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. మంచినీటి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించిందని మంత్రి రవీంద్ర అన్నారు. -
'టాయిలెట్లను మందిరాలుగా మారుస్తున్నారు'
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లోని నివాసాల్లో టాయిలెట్లను ప్రార్ధనామందిరాలుగా, గోడౌన్లుగా మార్చారని కేంద్ర గ్రామీణశాఖ నితిన్ గడ్కరీ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరత కారణంగా టాయిలెట్లను వినియోగించలేకపోతున్నారని గడ్కరీ తెలిపారు. తాగునీరు, సానిటేషన్ అంశాలపై నిర్వహించిన సమావేశంలో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహాత్మగాంధీ 150 జన్మదినోత్సవం నాటికి అంటే 2019 క్లీన్ ఇండియా అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం కేవలం టాయిలెట్లను నిర్మిస్తే సరిపోదని ఆయన అన్నారు. దేశంలో మూడు లక్షల టాయిలెట్లను నిర్మిస్తే అందులో కేవలం 10 వేల సంఖ్యలో మాత్రమే ప్రజలు వినియోగిస్తున్నారన్నారు. కొన్ని ప్రాంతాల్లో నిర్మించిన టాయిలెట్లను మందిరాలుగా మలచడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. అందుకే నీటి వసతులు లేకుండా టాయిలెట్లను ఉపయోగిస్తే నిరుపయోగమని, ప్రభుత్వం అనుకునే లక్ష్యం నెరవేరదని నితిన్ గడ్కరీ అన్నారు. -
జిల్లాలో నీటికటకట
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లాలో నీటి కొరత ఏర్పడింది. ఒక వైపు మండుతున్న ఎండలు, మరోవైపు ఎండుతున్న గొంతులతో ప్రజలు విలవిలలాడుతున్నారు. తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. రక్షిత మంచి నీటి పథకాలు పడకేశాయి. జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలు, తండాలు, జిల్లా కేంద్రానికి అనుకొని ఉన్న గ్రామాలలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఇందుకు కరెంటు కోత లు ఓ కారణం కాగా, నీటి వనరులు అడుగంటిపోవడం మరో కారణం. వేసవి వచ్చిందంటే ప్రజలు దాహంతో అల్లాడుతున్నారు. రోజువా రీ అవసరాల సంగతి అలా ఉంచితే, తాగేం దుకు కూడా నీరు దొరకని పరిస్థితి ఏర్పడింది. పగలు, రాత్రి నీటి కోసం పోట్లాటలు తప్పడం లేదు. ఈ వేసవిలో నీటి ఎద్దడిని నివారించడానికి అధికారులు రూ. 1.50 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశారు. అమలులో మాత్రం విఫలమయ్యారు. జిల్లాలో 347 బోర్లకు ప్లషింగ్, డిఫెనింగ్ చేశామని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అధికారులు చెబుతున్న వివిధ మంచి నీటి పథకాలతో ప్రజలకు సరిపోయే నీరు అందడం లేదు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 11 తాగునీ టి పథకాలు చేపట్టారు. వీటికి సుమారు రూ. 200 కోట్లను వెచ్చించారు. వీటి పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తొమ్మిదేళ్ల క్రితం న్యాల్కల్లో చేపట్టిన మంచినీటి పథకం నేటికీ ప్రారంభం కాలేదు. అధికారులు ముందే స్పందించి ముందస్తు చర్యలు తీసుకుంటే ఈ ఇబ్బందులు తలెత్తేవి కావు. రక్షిత నీరు అందని ప్రాంతాలకు సీపీడబ్ల్యూ పథకం ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా ప్రయోజనం కలగడం లేదు.