సిలికాన్ సిటీలో అవస్థలు
ఆస్పత్రులు, హోటళ్లలో కటకట
బోర్లు, ట్యాంకర్లే శరణ్యం
బనశంకరి: మనుగడకు జలం జీవాధారం కాగా, ఆ జలమే దొరక్క మనశ్శాంతి కరువైంది. బెంగళూరు నగరంలో నీటి కొరత రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తుండడంతో ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాల్లో కలవరం నెలకొంది. ఆసుపత్రుల్లో నీటికి హాహాకారాలు నెలకొన్నాయి. బోర్లలో నీరు తగ్గడం,కొళాయిలు బంద్ కావడంతో ఆస్పత్రుల్లో రోగులు, వైద్యసిబ్బంది ఆందోళనలో పడ్డారు. కేఆర్ మార్కెట్ వద్ద బెంగళూరు మెడికల్ కాలేజీ, విక్టోరియా, వాణివిలాస్, మింటో, ట్రామా కేర్, నెఫ్రో యూరాలజీ ఆసుపత్రులకు వేలాది మంది రోగులు వస్తుంటారు. అడ్మిషన్లు కూడా ఎక్కువే. వారి కుటుంబసభ్యులు ఆసుపత్రి ఆవరణలో విశ్రాంతి తీసుకుంటారు. నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆస్పత్రులు ట్యాంకర్ల నీటిపై ఆధారపడ్డాయి.
ఇలాగే ఉంటే కష్టం: ఆస్పత్రుల సంఘం
బన్నేరుఘట్ట రోడ్డు, హెచ్‌ఎస్‌ఆర్.లేఔట్, వైట్‌ఫీల్డ్, మహదేవపుర, బీటీఎం లేఔట్, కృష్ణరాజపురం పరిధిలో ఆస్పత్రులకు నీటి కష్టాలు తలెత్తాయి. చాలావరకు ప్రైవేటు ఆసుపత్రులు ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నాయి. మంచినీరు సరఫరా కావడం లేదు, ఇంతవరకు ఎలాగో నెట్టుకొచ్చాము, సమస్య ఇలాగే కొనసాగితే కష్టతరంగా మారుతుందని ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గోవిందయ్య యతీశ్ తెలిపారు.
హోటళ్లలో ధరల మోత?
నీళ్లు లేక హోటల్స్‌ను మూసుకోవాల్సి వస్తోందని యజమానులు వాపోయారు. హోటల్స్ లో నీటి వాడకాన్ని 20 శాతం తగ్గించగా యూజ్ అండ్ త్రో ఉత్పత్తులను ఎక్కువగా వాడుతున్నారు. డిమాండ్ పెరగగానే నీటి ధర పెరిగింది. కొన్ని హోటళ్ల యజమానులు ట్యాంకర్లతో నీటిని కొంటున్నారు. ఇది భారంగా ఉందని తెలిపారు. కాబట్టి టిఫిన్, భోజనం ధరలను పెంచే యోచనలో ఉన్నారు. ధరలు పెంచినప్పటికీ జూన్ నుంచి మళ్లీ తగ్గిస్తామని హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు పీసీ.రావ్ తెలిపారు. నీటిని చాలా పొదుపుగా వాడుకోవాల్సి వస్తోందన్నారు.
కోచింగ్ సెంటర్ల ఆన్‌లైన్ బాట
నీటి సమస్య తీవ్రరూపం దాల్చగానే నగరంలోని కొన్ని పాఠశాలలు, కోచింగ్ సెంటర్లు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని తీర్మానించాయి. విజయనగర, బసవనగుడి, రాజాజీనగర, జయనగర, జేపీ.నగర తదితర ప్రాంతాల్లో చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. తాగునీరు, ఇతర అవసరాలకు దండిగా నీరుకావాలి, దీంతో కొన్ని సంస్థలు విద్యార్థులను రావద్దని చెప్పేసి ఆన్‌లైన్ లో తరగతులను ప్రారంభించాయి. చాలా పాఠశాలల్లో నీటికి కటకట ఏర్పడింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు నీటి కోసం అల్లాడుతున్నాయి. ఇంకా కొన్నిరోజులు పాఠశాలలు నిర్వహించాల్సి ఉంది. తాగునీరు, మధ్యాహ్న భోజన నిర్వహణ కష్టంగా మారిందని ప్రైవేటు పాఠశాలల ఒక్కూట సభ్యులు తెలిపారు. ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment