ఎస్‌ఐ ఉద్యోగమని రూ. 45 లక్షల వసూలు
దొడ్డబళ్లాపురం: ఎస్‌ఐ పోస్టు ఇప్పిస్తామని నమ్మించి రూ.45 లక్షలు తీసుకుని మోసం చేసిన ఇద్దరు వంచకులను నెలమంగల తాలూకా దాబస్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఆరోగ్యభారతి ఆస్పత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్న చంద్రశేఖర్, యోగేంద్ర అరైస్టెన నిందితులు. అనిల్‌కుమార్ అనే వ్యక్తి బంధువుకు ఎస్‌ఐ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.45 లక్షలు తీసుకున్నారు. ఎన్ని రోజులైనా ఉద్యోగం సంగతి తేలకపోవడంతో అనిల్‌కుమార్ ప్రశ్నించగా బెదిరించడం ప్రారంభించారు. దీంతో దాబస్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
వీలింగ్ పోకిరీల అరెస్టు
దొడ్డబళ్లాపురం: రోడ్లపై ప్రమాదకరంగా వీలింగ్ చేసిన యువకులను పట్టుకుని బైక్‌లను సీజ్ చేశారు. నగరంలో రాజానుకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యలహంక తాలూకా మాదప్పనహళ్లిలో యువకులు బైక్‌లపై వీలింగ్ చేస్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేశారు. విన్యాసాలు చేస్తూ వీడియోలు తీసుకున్నారు. వీడియోల ద్వారా యువకులు బెంగళూరు గంగమ్మ గుడి సర్కిల్ నివాసులుగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.
డీకేశికి మొయిలీ మద్దతు
బనశంకరి: డీకే.శివకుమార్ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి వీరప్పమొయిలీ చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్యలపై సోమవారం సీఎం సిద్దరామయ్య స్పందిస్తూ హైకమాండ్ ఏమి చెబితే అది పాటిస్తానని స్పష్టం చేశారు. వీరప్ప మొయిలీ, ఇంకొకరు చెప్పడం ముఖ్యం కాదని, నాయకత్వమే ప్రధానమని అన్నారు. ఆదివారం కార్కళలో గోమఠేశ్వర ను సందర్శించిన వీరప్పమొయిలీ మాట్లాడుతూ డీకే కి మొదటిసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది నేనే, నేడు విజయవంతమైన నేత ఎదిగారు. ఇప్పుడు ఆయనే సీఎం కావాలని చెప్పారు. డీకే గోమఠేశ్వరుని తరహాలో ఎదగాలని, పార్టీ ఇబ్బందుల్లో ఉండగా బలోపేతం చేశారని పొగడ్తలతో ముంచెత్తారు.
గతుకుల రోడ్లకు బలి
తుమకూరు: జిల్లాలోని శిర– అమరాపురం రహదారిలో రోడ్డులో గతుకుల వల్ల ట్రాక్టర్ పైన నుంచి కిందపడిన వ్యక్తి మృతి చెందాడు. రాగలహళ్ళి గ్రామానికి చెందిన నరసింహయ్య (55) అనే వృక్తి ట్రాక్టర్ ట్రాలీలో కూర్చుని వస్తున్నాడు. డ్రైవర్ గతుకుల రోడ్డులో వేగంగా వెళ్లడంతో నరసింహయ్య ఎగిరి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలై అక్కడే చనిపోయాడు. పట్టనాయకనహళ్ళి పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment