
కేజీబీవీలో నీటి ఎద్దడి
అవస్థలు పడుతున్న విద్యార్థినులు
రామాయంపేట : రామాయంపేట పట్టణ శివారులోని కోమటిపల్లి గ్రామ సమీపంలోఉన్న కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయంలో తీవ్రస్థాయిలో నెలకొన్న నీటి ఎద్దడితో పాఠశాల విద్యార్థినులు ఇబ్బందులపాలవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రామాయంపేట కేజీబీవీలో రెండు వందల మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. గత ఏడాది కాలంగా నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులతో నీటి ఎద్దడి తీవ్రతరమైంది. స్కూలు సమీపంలోని చెరువులో బోరు వేసి మొదట్లో అక్కడినుంచి పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేశారు. అయితే ఆ బోరు కూడా ఎండిపోవడంతో నీటి ఎద్దడి తీవ్రమైంది.
ప్రస్తుతం ఆ బోరునుంచి కొద్దిగా వస్తున్న నీటితో విద్యార్థినులు స్నానాలకు, మరుగుదొడ్లకు వినియోగించుకుంటున్నారు. ఇతర అవసరాల నిమిత్తం రోజూ ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా జరుగుతున్నా అవి ఎంతమాత్రం సరిపోవడంలేదు. ఇటీవల రెండుమూడు రోజలకోమారు ట్యాంకర్ వస్తుండటంతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. దీంతో వారు నీటిని పొదుపుగా వినియోగించుకుంటున్నారు.
ట్యాంకర్‌లో వస్తున్న నీటిని పాఠశాలముందు ఉన్న పెద్ద కుండీలో నిల్వ చేసుకుంటున్నారు. ఏడాది కాలంగా నీటి ఎద్దడితో అలమటిస్తున్నమని, ఈవిషయమై ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని విద్యార్థినులు వాపోయారు. దుస్తులు ఉతుక్కోవడానికిసైతం ఇబ్బందిగా ఉందని వారు వాపోయారు. ఆగస్టు ఒకటినుంచి ట్యాంకర్లు బంద్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో విద్యార్థినులు మరింతగా ఆందోళనకు గురవుతున్నారు. ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తుంటేనే ఇంత ఇబ్బందిగా ఉందని, ట్యాంకర్ రాకుండా తమ పరిస్థితి ఏమిటని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
నీటి సమస్యను పరిష్కరించాలి
అధికారులు, ప్రజా ప్రతినిధులు విద్యార్థినుల అవస్థలు దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రతిపాదికన స్కూలులో నీటివసతి కల్పించాలి. ఏడాది కాలంగా నీటి ఎద్దడితో ఇబ్బందులకు గురవుతున్నాం. బోరులో నీరు అడుగంటడంతో ఈసమస్య నెలకొంది. ట్యాంకర్‌ను యధావిధిగా కొనసాగించాలి.-నీటి సమస్యను పరిష్కరించాలి