నదులు ఎండిపోతున్నాయ్‌! | Scientists find shocking changes in global river flooding | Sakshi
Sakshi News home page

నదులు ఎండిపోతున్నాయ్‌!

Published Sun, Dec 15 2024 6:19 AM | Last Updated on Sun, Dec 15 2024 6:19 AM

Scientists find shocking changes in global river flooding

ఏడాదికి 10% దాకా తగ్గుతున్న ప్రవాహాలు 

మార్పులకు లోనవుతున్న పెద్దా, చిన్న నదులు 

ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల నదులకు ముప్పు 

నదులు మానవాళి పాలిట జీవనాడులు. నది లేకపోతే జీవమే లేదు. అలాంటి నదులు ప్రస్తుతం తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 లక్షల నదులు విపరీతమైన మార్పులకు లోనవుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ మార్పులు ఇలాగే కొనసాగితే తాగడానికి నీరు దొరకదని, మరోవైపు విపరీతమైన వరదలను ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు.
 

ఇవీ ప్రమాదాలు...
మరికొద్ది కాలంలో ప్రపంచంలోని అనేక నదుల్లో అతి స్వల్ప పరిమాణంలో నీరు అందుబాటులో ఉందని నివేదిక పేర్కొంది. 
→ అవి నెమ్మదిగా దుమ్ము, చిన్న రాళ్ళతో కూడిన అవక్షేపంగా మారిపోతాయని హెచ్చరించింది. 
→ ఫలితంగా దీంతో తాగడానికి, పంటలకు, పశువులను పోషించడానికి మంచి నీటి కొరత ఏర్పడుతుందని అధ్యయన సారథి, హైడ్రాలజీ ప్రొఫెసర్‌ డోంగ్మే ఫెంగ్‌ తెలిపారు. 
→ నదులు భూమికి రక్తనాళాల వంటివని, అవి ప్రవహించే తీరులో మార్పులు మనపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఫెంగ్‌ హెచ్చరించారు.

క్షీణిస్తున్న నదులు 
భూమిపై నదులు లోనవుతున్న మార్పులపై సిన్సినాటీ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. శాటిలైట్‌ డేటా, కంప్యూటర్‌ మోడలింగ్‌ పరిజ్ఞానంతో పలువురు శాస్త్రవేత్తలు 35 ఏళ్లుగా భూమిపై ప్రతి రోజూ ప్రతి నది నీటి ప్రవాహాన్ని మ్యాపింగ్‌ చేశారు. ఇందులో వెల్లడైన విషయాలు వారిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. ప్రపంచంలోని అతి పెద్ద నదుల్లోని సగం నదుల్లో నీటి ప్రవాహం అతి వేగంగా తగ్గుముఖం పడుతోంది! ఈ తగ్గుదల వేగం కొన్నింట్లో ఏటా 5 శాతముంటే మరికొన్నింట్లో ఏకంగా 10 శాతం దాకా ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. ఇది చాలా వేగవంతమైన మార్పని హెచ్చరించింది. ఆఫ్రికాలోని రెండో అతి పెద్ద నది కాంగో, చైనాలో ప్రముఖ నది యాంగ్జీ, దక్షిణ అమెరికాలోని ప్లాటా వంటి నదులైతే ఇప్పటికే గణనీయంగా క్షీణించిపోయాయి. 

ముంచుకొస్తున్న వరద ముప్పు 
ఇక పర్వత ప్రాంతాల్లోని పలు చిన్న నదుల పరిస్థితి భిన్నంగా ఉంది. వాటిలో ప్రవాహం 17 శాతం పెరిగింది. హిమాలయాల వంటి ప్రాంతాల్లో జలవిద్యుత్‌ ప్రణాళికలు ఊహించని ప్రమాదాలు తెచ్చి పెడుతున్నాయి. అవక్షేపం దిగువకు రవాణా అవుతోంది. ఇది వరదలను తీవ్రతరం చేస్తోంది. గత 35 ఏళ్ల కాలంలో ఎగువ ప్రాంతాల్లోని ఇలాంటి చిన్నాచితకా నదుల వల్ల భారీ వరదలు ఏకంగా 42 శాతం పెరిగాయని అధ్యయనంలో తేలింది. 

వాతావరణంలో అధిక మార్పులు, నదీ ప్రవాహాలకు మానవులు అంతరాయం కలిగించడం వంటివే ఇందుకు కారణమని సివిల్‌ అండ్‌ ఎని్వరాన్మెంటల్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌ కోలిన్‌ గ్లీసన్‌ చెప్పారు. ‘‘ఈ వాతావరణ మార్పులు ప్రధానంగా మానవ కార్యకలాపాలు, శిలాజ ఇంధనాల వల్ల ఏర్పడ్డ వాతావరణ సంక్షోభమే. వాటివల్ల వర్షపాత పరిస్థితులు మారుతున్నాయి. మంచు కరిగి రేటు వేగవంతం అవుతోంది. స్తోందని, ఫలితంగా వరదలు ముంచెత్తుతున్నాయి’’ అని ఆయన వివరించారు. ‘‘పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో దుర్భర కరువు, మరికొన్ని ప్రాంతాల్లో కనీవినీ ఎరగని వరదలు పరిపాటిగా మారే రోజు దూరంలో లేదు’’ అన్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement