![Kota Coaching Crisis Student Suicides Declining Coaching Institutes](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/18/kota-i.jpg.webp?itok=FhAjCDEg)
కోటా: ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన రాజస్థాన్‌లోని కోటాలోగల కోచింగ్ పరిశ్రమ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడిపోతోంది. ఇక్కడకు వచ్చి కోచింగ్ తీసుకునే విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లు, హాస్టల్ యాజమాన్యాలు ఏంచేయాలో తెలియని స్థితిలో చిక్కుకున్నాయి.
కోచింగ్‌పై తొలగిన బ్రమ
కోటాలోని కోచింగ్ సెంటర్లలో ప్రస్తుతం నెలకొన్న దుస్థితికి పలు కారణాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. వాటిలో మొదటిది ఇక్కడి కోచింగ్ సెంటర్లపై ఇంతవరకూ ఉన్న బ్రమలు తొలగిపోవడమైతే, మరొకటి విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు పెరగడమేనని చెబుతున్నారు. అలాగే లెక్కకుమించి కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో వీరు అందించే విద్యానాణ్యత తగ్గిపోతున్నదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
వేల కోట్ల టర్నోవర్‌కు గండి
కోచింగ్ సిటీగా పేరొందిన కోటాలో ప్రస్తుతం 1.10 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇది మునుపటి కంటే 30-35 శాతం తక్కువ. రూ. 6.5 వేల కోట్ల విలువ కలిగిన పరిశ్రమ ఇప్పుడు రూ.3.5 వేల కోట్లకు దిగజారింది. ఇది కోటా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మారింది. కోటాలో కోచింగ్ పరిశ్రమ 2000లో వేగంగా అభివృద్ధి చెందింది. గత 20 ఏళ్ల ప్రగతి ఈ ఏడాదిలో ఊహించనంతగా దిగజారింది.
కనీస హాస్టల్ అద్దె కూడా కరువు
2018 నుంచి 2022 వరకు ఒకరికి నెలకు హాస్టల్ అద్దె రూ.15-16 వేలు వరకూ ఉండేది. ఇప్పుడు ఒకరి నుంచి రూ. 3000 కూడా దక్కడం లేదని హాస్టల్ యజమానులు వాపోతున్నారు. నెలకు రూ.2500 అద్దె తీసుకున్నా 30 శాతం గదులు మాత్రమే నిండుతున్నాయంటున్నారు. స్థానికంగా చాలా మంది అప్పులు చేసి హాస్టళ్లు నిర్మించుకున్నారని, విద్యార్థుల కొరత కారణంగా ఆ రుణ వాయిదాలు చెల్లించడం కష్టంగా మారిందని పలు హాస్టళ్ల యజమానులు అంటున్నారు.
ఆత్మహత్యలే కారణమా?
స్థానికంగా ఉన్న హాస్టళ్లు గతంలో విద్యార్థులను పీడించిమరీ డబ్బులు వసూలు చేశాయని, అందుకే వాటికి ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురయ్యిందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. కోటాలోని కోచింగ్ సెంటర్లపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విరక్తి చెందడానికి ఇక్కడ చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. 2023లో కోటాలో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. చదువు ఒత్తిడే ఈ సంఘటనలకు ప్రధాన కారణమని అందరూ భావిస్తున్నారు. ఫలితంగా కోటాకు పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు.
ప్రముఖ కోచింగ్ సెంటర్లకు మరిన్ని బ్రాంచీలు
మరోవైపు ప్రముఖ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు దేశంలోని వివిధ నగరాల్లో తమ కేంద్రాలను తెరిచాయి. 2020 వరకు 10 కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలు ఇప్పుడు 80 నుండి 100 కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఫలితంగా విద్యార్థులకు కోటా ఒక్కటే కాకుండా పలు ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ పెద్ద బ్రాండ్ కోచింగ్ సెంట్లర్ల కారణంగా స్థానిక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి.
పరిష్కారం కోసం మల్లగుల్లాలు
ప్రస్తుతం కోటా కోచింగ్ పరిశ్రమకు కష్టకాలం నడుస్తోంది. దీనిని సవాలుగా తీసుకున్న హాస్టళ్ల యజమానులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు పరిష్కారం దిశగా యోచిస్తున్నారు. విద్యార్థుల భద్రత, వారి మానసిక ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అలాగే కోచింగ్ నాణ్యతను మెరుగుపరచడానికి, కొత్త కోర్సులను ప్రారంభించేందుకు కూడా కోచింగ్ సెంటర్ల యజమానులు ప్రయత్నిస్తున్నారు. మరి ఇవి ఎంతవరకూ సక్సెస్ అవుతాయో వేచిచూడాల్సిందే.
ఇది కూడా చదవండి: Year Ender 2024: మారిన ప్రభుత్వాలు.. చేజారిన అధికారాలు
Comments
Please login to add a commentAdd a comment