రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్ధి ప్రాణాలు విడిచాడు. బిహార్‌కు చెందిన జేఈఈ విద్యార్ధి సందీప్ కుమార్ తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్‌లో నివసిస్తున్న ఇతర విద్యార్ధులు కిటికీలోంచి మృతదేహాన్ని చూసి వెంటనే యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
మరణించిన విద్యార్థి బిహార్‌లోని నలందకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సందీప్ కుమార్ గత రెండేళ్లుగా కోటాలో ఉంటూ జేఈఈకి ప్రిపేర్ అవుతున్నాడని పోలీసు అధికారులు తెలిపారు. సందీప్ తల్లిదండ్రులు నాలుగేళ్ల క్రితమే చనిపోవడంతో మేనమామ చదువుల ఖర్చులు భరిస్తున్నాడని చెప్పారు.
అతన్ని (సందీప్) కోటా ఇన్‌స్టిట్యూట్‌లో మేనమామే చేర్పించాడని తెలిపారు. విద్యార్ధి చనిపోయే ఒక రోజు ముందు మామ అతని ఖాతాలో డబ్బు జమ చేసినట్లు తెలిసిందని చెప్పారు. తదుపరి విచారణ కొనసాగుతోందని,అతడి మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
దేశంలోనే ‘కోచింగ్ హబ్’గా ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చదువు ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది ఇప్పటి వరకూ ఇది పన్నెండవ ఘటన కావడం గమనార్హం. ఇక గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్ధులు ప్రాణాలు విడిచారు.
Comments
Please login to add a commentAdd a comment