Hydrology Section
-
నదులు ఎండిపోతున్నాయ్!
నదులు మానవాళి పాలిట జీవనాడులు. నది లేకపోతే జీవమే లేదు. అలాంటి నదులు ప్రస్తుతం తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 లక్షల నదులు విపరీతమైన మార్పులకు లోనవుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ మార్పులు ఇలాగే కొనసాగితే తాగడానికి నీరు దొరకదని, మరోవైపు విపరీతమైన వరదలను ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. ఇవీ ప్రమాదాలు...మరికొద్ది కాలంలో ప్రపంచంలోని అనేక నదుల్లో అతి స్వల్ప పరిమాణంలో నీరు అందుబాటులో ఉందని నివేదిక పేర్కొంది. → అవి నెమ్మదిగా దుమ్ము, చిన్న రాళ్ళతో కూడిన అవక్షేపంగా మారిపోతాయని హెచ్చరించింది. → ఫలితంగా దీంతో తాగడానికి, పంటలకు, పశువులను పోషించడానికి మంచి నీటి కొరత ఏర్పడుతుందని అధ్యయన సారథి, హైడ్రాలజీ ప్రొఫెసర్ డోంగ్మే ఫెంగ్ తెలిపారు. → నదులు భూమికి రక్తనాళాల వంటివని, అవి ప్రవహించే తీరులో మార్పులు మనపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఫెంగ్ హెచ్చరించారు.క్షీణిస్తున్న నదులు భూమిపై నదులు లోనవుతున్న మార్పులపై సిన్సినాటీ విశ్వవిద్యాలయం అధ్యయనం చేసింది. శాటిలైట్ డేటా, కంప్యూటర్ మోడలింగ్ పరిజ్ఞానంతో పలువురు శాస్త్రవేత్తలు 35 ఏళ్లుగా భూమిపై ప్రతి రోజూ ప్రతి నది నీటి ప్రవాహాన్ని మ్యాపింగ్ చేశారు. ఇందులో వెల్లడైన విషయాలు వారిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. ప్రపంచంలోని అతి పెద్ద నదుల్లోని సగం నదుల్లో నీటి ప్రవాహం అతి వేగంగా తగ్గుముఖం పడుతోంది! ఈ తగ్గుదల వేగం కొన్నింట్లో ఏటా 5 శాతముంటే మరికొన్నింట్లో ఏకంగా 10 శాతం దాకా ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. ఇది చాలా వేగవంతమైన మార్పని హెచ్చరించింది. ఆఫ్రికాలోని రెండో అతి పెద్ద నది కాంగో, చైనాలో ప్రముఖ నది యాంగ్జీ, దక్షిణ అమెరికాలోని ప్లాటా వంటి నదులైతే ఇప్పటికే గణనీయంగా క్షీణించిపోయాయి. ముంచుకొస్తున్న వరద ముప్పు ఇక పర్వత ప్రాంతాల్లోని పలు చిన్న నదుల పరిస్థితి భిన్నంగా ఉంది. వాటిలో ప్రవాహం 17 శాతం పెరిగింది. హిమాలయాల వంటి ప్రాంతాల్లో జలవిద్యుత్ ప్రణాళికలు ఊహించని ప్రమాదాలు తెచ్చి పెడుతున్నాయి. అవక్షేపం దిగువకు రవాణా అవుతోంది. ఇది వరదలను తీవ్రతరం చేస్తోంది. గత 35 ఏళ్ల కాలంలో ఎగువ ప్రాంతాల్లోని ఇలాంటి చిన్నాచితకా నదుల వల్ల భారీ వరదలు ఏకంగా 42 శాతం పెరిగాయని అధ్యయనంలో తేలింది. వాతావరణంలో అధిక మార్పులు, నదీ ప్రవాహాలకు మానవులు అంతరాయం కలిగించడం వంటివే ఇందుకు కారణమని సివిల్ అండ్ ఎని్వరాన్మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కోలిన్ గ్లీసన్ చెప్పారు. ‘‘ఈ వాతావరణ మార్పులు ప్రధానంగా మానవ కార్యకలాపాలు, శిలాజ ఇంధనాల వల్ల ఏర్పడ్డ వాతావరణ సంక్షోభమే. వాటివల్ల వర్షపాత పరిస్థితులు మారుతున్నాయి. మంచు కరిగి రేటు వేగవంతం అవుతోంది. స్తోందని, ఫలితంగా వరదలు ముంచెత్తుతున్నాయి’’ అని ఆయన వివరించారు. ‘‘పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో దుర్భర కరువు, మరికొన్ని ప్రాంతాల్లో కనీవినీ ఎరగని వరదలు పరిపాటిగా మారే రోజు దూరంలో లేదు’’ అన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కాళేశ్వరానికి హైడ్రాలజీ అనుమతులు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత ప్రధానమైన హైడ్రాలజీ అనుమతి లభించింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం అధికారికంగా సమాచారం అందించింది. ప్రాజెక్టుకు హైడ్రాలజీ అనుమతినిస్తూ..మేడిగడ్డ వద్ద 75 శాతం డిపెండబులిటీ లెక్కన 284.3 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు సీడబ్ల్యూసీ నిర్ధారించింది. ఆ మేరకు తాగు, సాగు నీటి అవసరాలకోసం కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు ప్రణాళిక తయారుచేసుకోవచ్చని కేంద్ర జల వనరుల సంఘం రాష్ట్రానికి అనుమతించింది. లెక్క కుదిరింది... తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతను పరిశీలించిన కేంద్ర జల సంఘం 2015 మార్చి 4న అక్కడ తగినంత నీటి లభ్యత లేదని స్పష్టం చేస్తూ రాష్ట్రానికి లేఖ రాసింది. 152 మీటర్ల ఎత్తులో 75 శాతం డిపెండబులిటీలో 165 టీఎంసీల లభ్యత ఉందని, ఇందులో ఎగువ రాష్ట్రం 63 టీఎంసీలకు ప్రాజెక్టుల నిర్మాణం చేసుకున్న దృష్ట్యా ఇక మిగిలేది 102 టీఎంసీలే అని చెప్పింది. ఇందులో హైదరాబాద్, గ్రామాల తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన 56టీఎంసీలు పక్కనబెడితే మిగిలేది 46 టీఎంసీలేనని, ఈ నీటితో ప్రాజెక్టు కింద నిర్ణయించిన 16.40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం సాధ్యం కాదని తెలిపింది. ఇక 148 మీటర్ల ఎత్తులో చూస్తే లభ్యత కేవలం 40 టీఎంసీలే ఉంటుందని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొనే నీటి లభ్యత పుష్కలంగా ఉన్న మేడిగడ్డ వద్ద రీ ఇంజనీరింగ్ చేసింది. లక్ష్యం మేరకు తాగు, సాగు నీరు.. రీ ఇంజనీరింగ్ మేరకు మేడిగడ్డ వద్ద గోదావరి, ప్రాణహిత, మానేరులు కలసిన అనంతరం 40ఏళ్ల సగటు లెక్కన 284.3 టీఎంసీల లభ్యత ఉంటుందని నీటి పారుదల వర్గాలు అంచనా వేసి సీడబ్ల్యూసీలోని హైడ్రాలజీ విభాగానికి అనుమతులకోసం దరఖాస్తు చేశాయి. అనంతరం దీనిపై పలు సందేహాలకు ప్రాజెక్టు సీఈ హరిరామ్ వివరణలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కలతో ఏకీభవించిన హైడ్రాలజీ విభాగం డైరెక్టర్ నిత్యానందరాయ్ క్లియరెన్స్‌లు ఇచ్చారు. దీనితో ప్రాజెక్టు కింద ప్రస్తుతం ప్రతిపాదించిన 180 టీఎంసీలను లక్ష్యం మేరకు తాగు, సాగు అవసరాలకు మళ్లించేందుకు వీలు పడుతుంది. మంత్రి హరీశ్‌రావు హర్షం కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి హైడ్రాలజీ అనుమతులు లభించడంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్న వ్యక్తులు, శక్తులకు ఇది చెంపపెట్టు వంటిదని పేర్కొన్నారు. -
భూగర్భజలాలపై జూన్‌లో అధ్యయనం
జిల్లా పరిధిలో భూగర్భ జలమట్టం నానాటికీ గణనీయంగా పడిపోతోంది. పొడి ప్రాంతాల్లో ఏడాదికి మీటరున్నర మేర తగ్గిపోతోంది. ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశమని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. గుర్గావ్: గుర్గావ్ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలోని హైడ్రాలజీ విభాగం జూన్ మొదటివారంలో భూగర్భ జలాలపై అధ్యయనం చేపట్టనుంది. ఇందులోభాగంగా ఇప్పటికే 70 ప్రదేశాలను గుర్తించింది. జిల్లా యంత్రాంగం ప్రతి ఏడాది రెండు పర్యాయాలు భూగర్భ జలాలపై అధ్యయనం చేస్తున్న సంగతి విదితమే. వర్షాకాలానికి ముందు ఒకసారి, వర్షాకాలం తర్వాత ఒక సారి అధ్యయనం చేస్తోంది. వార్షిక భూగర్భ జలస్థితిగతులను అంచనా వేసేందుకు ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారి ఎం.ఎస్. లాంబా మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది నవంబర్‌లో ఓ పర్యాయం భూగర్భ జలాలపై అధ్యయనం చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో మరోసారి అధ్యయనం చేయనున్నామన్నారు. గుర్గావ్ జిల్లా అర్ధ శుష్క ప్రాంత పరిధిలో ఉందన్నారు. గడచిన ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో భూగర్భ జలమట్టం గణనీయంగా తగ్గుముఖం పట్టిందన్నారు. బాగా పొడిగా ఉండే ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం అత్యంత దారుణంగా తగ్గిపోతోందని, మీటరున్నర లోతుమేర తగ్గిపోతోందని అన్నారు. ఇది అత్యంత ఆందోళన కలిగించే అంశమన్నారు. కాగా గుర్గావ్ జిల్లా పరిసరాల్లో భూగర్భజలాలు విపరీతంగా దోపిడీకి గురవుతున్నాయంటూ ఇటీవల కేంద్ర భూగర్భ జలబోర్డు (సీజీడబ్ల్యూజీ) పేర్కొన్న సంగతి విదితమే. అందువల్ల భూగర్భ జలమట్టం పుంజుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన సంగతి విదితమే. మరోవైపు 2012లో స్థానిక న్యాయస్థానం కూడా ఈ విషయంలో తీవ్రంగా స్పందించింది. వాణిజ్య అవసరాల కోసం భూగర్భజలాల వెలికితీత, వినియోగంపై ఆంక్షలు విధించింది. దీంతో పరిస్థితి కొంతమేర మెరుగుపడింది. ఒకసారి భూగర్భగలాలు తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్లీ పుంజుకునేందుకు సంవత్సరాల కొద్దీ సమయం పడుతుంది. ఒక్కోసారి ద శాబ్దాలు కూడా పట్టొచ్చు. అయితే గుర్గావ్లో తగ్గినప్పటికీ మరలా పుంజుకోవడం నగరవాసులకు బాగా ఊరట కలిగించే విషయమని నిపుణులు చెబుతున్నారు. పరిష్కరించేందుకు యత్నించాం ఈ విషయమై ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ భూగర్భజలాల సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అనేక ప్రయత్నాలు చేశామన్నారు. వాననీటి సంరక్షణను ఇక్కడ తప్పనిసరి చేశామన్నారు. దీంతో పరిస్థితిలో గ ణనీయమైన మార్పు కనిపించిందన్నారు. ఇదిలాఉంచితే ఎన్సీఆర్ చానల్ద్వారా కూడా నీటిని నగరానికి రప్పిస్తున్నామన్నారు. దీంతో అవసరాలు కూడా తీరుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో భూగర్భజలాల వాడకం తగ్గుముఖం పట్టిందని ఆయన వివరించారు.