సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత ప్రధానమైన హైడ్రాలజీ అనుమతి లభించింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం అధికారికంగా సమాచారం అందించింది. ప్రాజెక్టుకు హైడ్రాలజీ అనుమతినిస్తూ..మేడిగడ్డ వద్ద 75 శాతం డిపెండబులిటీ లెక్కన 284.3 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్టు సీడబ్ల్యూసీ నిర్ధారించింది. ఆ మేరకు తాగు, సాగు నీటి అవసరాలకోసం కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు ప్రణాళిక తయారుచేసుకోవచ్చని కేంద్ర జల వనరుల సంఘం రాష్ట్రానికి అనుమతించింది.
లెక్క కుదిరింది...
తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతను పరిశీలించిన కేంద్ర జల సంఘం 2015 మార్చి 4న అక్కడ తగినంత నీటి లభ్యత లేదని స్పష్టం చేస్తూ రాష్ట్రానికి లేఖ రాసింది. 152 మీటర్ల ఎత్తులో 75 శాతం డిపెండబులిటీలో 165 టీఎంసీల లభ్యత ఉందని, ఇందులో ఎగువ రాష్ట్రం 63 టీఎంసీలకు ప్రాజెక్టుల నిర్మాణం చేసుకున్న దృష్ట్యా ఇక మిగిలేది 102 టీఎంసీలే అని చెప్పింది.
ఇందులో హైదరాబాద్, గ్రామాల తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన 56టీఎంసీలు పక్కనబెడితే మిగిలేది 46 టీఎంసీలేనని, ఈ నీటితో ప్రాజెక్టు కింద నిర్ణయించిన 16.40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడం సాధ్యం కాదని తెలిపింది. ఇక 148 మీటర్ల ఎత్తులో చూస్తే లభ్యత కేవలం 40 టీఎంసీలే ఉంటుందని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొనే నీటి లభ్యత పుష్కలంగా ఉన్న మేడిగడ్డ వద్ద రీ ఇంజనీరింగ్ చేసింది.
లక్ష్యం మేరకు తాగు, సాగు నీరు..
రీ ఇంజనీరింగ్ మేరకు మేడిగడ్డ వద్ద గోదావరి, ప్రాణహిత, మానేరులు కలసిన అనంతరం 40ఏళ్ల సగటు లెక్కన 284.3 టీఎంసీల లభ్యత ఉంటుందని నీటి పారుదల వర్గాలు అంచనా వేసి సీడబ్ల్యూసీలోని హైడ్రాలజీ విభాగానికి అనుమతులకోసం దరఖాస్తు చేశాయి. అనంతరం దీనిపై పలు సందేహాలకు ప్రాజెక్టు సీఈ హరిరామ్ వివరణలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కలతో ఏకీభవించిన హైడ్రాలజీ విభాగం డైరెక్టర్ నిత్యానందరాయ్ క్లియరెన్స్‌లు ఇచ్చారు. దీనితో ప్రాజెక్టు కింద ప్రస్తుతం ప్రతిపాదించిన 180 టీఎంసీలను లక్ష్యం మేరకు తాగు, సాగు అవసరాలకు మళ్లించేందుకు వీలు పడుతుంది.
మంత్రి హరీశ్‌రావు హర్షం
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి హైడ్రాలజీ అనుమతులు లభించడంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్న వ్యక్తులు, శక్తులకు ఇది చెంపపెట్టు వంటిదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment